Tuesday, December 29, 2009

వా ( ( ( ( ( * * * - - -

VS

" ఖతం కహానీ :) :) :) ఐపోయిందా ? ? ? ఓవర్ ! ! !

జ్యోతీ ( ఇది ఆర్తనాదం , లింక్ కాదు ) తగునా ఇదిమీకు ? బ్లాగ్ మితృలు నా వారు కాదా ? ఎంత మాట అనేసారు జ్యోతీ ఎంత మాట అనేసారు !!!! సృజనా నా లిటిల్ ఫ్రెండ్ వి అని ముద్దు ముద్దు గా చూసుకుంటుంటే నన్ను బాడ్ గర్ల్ అనేస్తావా ? హుం !!! ఏమిటీ జయమ్మ తల్లి , నా మీద ఏకం గా కవితే రాసేసావా !!! ఆపరాదు ఆపరాదు నీపయనం , మణి దీపమై వెలగాలి , వహవా ఎంత బాగా చెప్పావు .( మనలో మన మాట కవిత బాగుంది , కాస్త గర్వ పడ్డా ననుకో ) శ్రీలలితా , మీరు కూడా నన్ను అపార్ధము చేసుకున్నారాండి ?మిమ్మలిని నేనెలా నిరాశ పరుస్తానండి ? బాడ్ గర్ల్ ని , రౌడీ పిల్లని అంటూ రోజూ కలలో , ఇలలో భయపెడుతునే వుంటావు , నువ్వు సరిపోవా ప్రియా , ఇంకా నెల్లూర్ పెద్దా రెడ్డి తో స్పీకుతావా ? ఎవడాడు ? పరిమళం గారూ , మీరు . . . మీరు . . కూడా అపార్ధమేనా ? ఇక నేనెవరి తో చెప్పుకోనండి ? అయ్యో భావనా ? ఇదేమిటి ? ( మీరింత చప్పగా మేమొప్పుకోం , అంటే బాలేదు సుమీ ! ఏమిటి ? కాస్త నెమ్మదిగా వుందామని ప్రయత్నం చేస్తున్నారా ? ) అహా సంజూ , మీ పిన్ని తెలుగు లో కొడితే నువ్వు ఇంగిలిపీసు లో కొట్టా వన్నమాట !!! బాగుంది . ( నేను ఇహపై రూట్ మార్చి రాస్తే నాకు తగిలే మొట్టికాయలకు పంచకర్మ మసాజ్ కూడా సరి పోదు , ఇహ హిమాలాయాలే గతి )

మా గురూజీ ,మొట్టికాయలకు , నా వంటింటి చిట్కా సరి పోవటము లేదు , తలంతా బొడిపలే , కాస్త కేరళ వెళ్ళి పంచకర్మ మసాజ్ చేయించుకొని వద్దామను కున్నాను . ఏదో మా పిల్లలకు కథ చెప్పటము ఐపోగానే , ఖతం కహానీ , బాత్ ఖతం బర్కాస్ బిర్యాని అనటము అలవాటు , అలా , ప్రాసకలిసింది కదా అని అనేసాను . ఇంత మాత్రాని కే నన్ను బలవంతాన , నిరాహార దీక్ష లో ఇరికించేసారు బాబోయ్ . అయినా నిన్న వైకుంఠ ఏకాదశి రోజు వెంకటేశుని , తలుచుకున్నానా ? అన్నమయ్య కీర్తనలు ఆలకించానా ? అమ్మ పుట్టిన రోజని అమ్మ అశీర్వాదము తీసుకున్నానా ? ( ఇవి లింక్ లు , ఆర్తనాదాలు కావు ) ఇంకా బోలెడు టపాలు వున్నాయి . వాటిని టపా కట్టించకండి బాబో ))))

బాబ్బాబు మీకు పుణ్యముంటుంది , సెలైన్ ఎక్కించేయండి . ఓ గ్లాసెడు నిమ్మ రసము ఇచ్చేయండి .( అదే చేత్తో ఓ స్వీట్ బాక్స్ కూడా తెండి , అది కూడా ఎమరాల్డ్ స్వీట్ షాప్ నుండి తెచ్చేయండి . హలో హలో అదెక్కడుందో మాకు తెలీదు అని తప్పించుకోకండి . ఇందిరా పార్క్ దగ్గర వుంది . గులాబ్ జాం అయితే బెస్ట్ ) కావాలంటే ఓ నినాదం కూడా చేసేస్తా .

సరిలేరు తెలుగు బ్లాగర్ ల కెవ్వరూ
ఇలలో సాటి లేదు తెలుగు బ్లాగ్ కు
బ్లాగ్ అంటే తెలుగు బ్లాగేనయా
జై తెలుగు బ్లాగు , జై జై తెలుగు బ్లాగు .

Sunday, December 27, 2009

" ఖతం కహానీ :) :) :) ఐపోయిందా ? ? ? ఓవర్ ! ! !

మా అమ్మాయి చిన్నప్పుడు కథ చెప్పటము ఐపోగానే , " కతం కహానీ " అనేది . మా అబ్బాయి " బాత్ ఖతం బర్ కాస్ బిరియానీ " అనేవాడు . ఇప్పుడూ అంటాడనుకోండి .
100 + 1 = 101
2+ 7 = 27

ఏమిటి ఈ లెక్కలు ? అనుకుంటున్నారా ?

9 చాలా మంచి సంఖ్య అంటారు , నవరత్నాలు , నవగ్రహాలు , అష్టాదశ పురాణాలు , అష్టాదశ శక్తి పీఠాలు , ఇలా . . . ఇలా అన్నమాట . ఐతే ఏంటట ? అవన్నీ మాకూ తెలుసు అంటున్నారా ? అదే నేనూ చెప్పేది . ఏమిటంటే నాకూ నవరత్న మాల వుందిగా ! మావారు , మా అమ్మాయి , మా అబ్బాయి , మా అల్లుడు , మా కోడలు , ఇద్దరు మనవరాళ్ళు , ఇద్దరు మనవళ్ళు , నా మాల లోని నవరత్నాలు .

సరే సరే కాని , ఇలా ఒకదానికొకటి పొంతన లేకుండా తిక్క తిక్క గా మాట్ల్లాడుతే మాకెలా అర్ధం అవుతుంది ? అంటున్నారా ? మరి, అంబరాన , ఇంద్ర ధనస్సు ను అందుకున్నంత ఆనందము కలుగుతే , కాస్త ఆ మాత్రం తిక్క రాదేమిటి ? ఓకె ,ఓకె చెప్పేస్తున్నాను , ఈ రోజు అనగా 27 , డిసెంబర్ నా " సాహితి " పుట్టిన రోజు . అదీ తొమ్మిది కలిసి వచ్చేట్టుగా , డిసెంబర్ నాకిచ్చిన ఇంకో కానుక . ఇప్పుడు చెప్పండి , డిసెంబర్ ఇంకా 9 సంఖ్య మంచివా ? కాదా ?

ఇక పుట్టిన రోజు పాపాయికి బహుమానం ఇవ్వాలిగా ! ముందు 100 ఇద్దామనుకున్నాను . కాని 0 చివర వచ్చేట్టుగా ఇవ్వకూడదు కదా ! పిల్లలకైనా , దేవుడి హుండీ లోనైన 11 , 101 , 1001 ఇలా ఇస్తాముకదా అనుకొని 101 టపాలను బహుకరిస్తున్నానన్నమాట ! అదీ సంగతి .

ఈ 101 టపాలు వ్రాసేందుకు సహకరించిన , ప్రోత్సహించిన , చదివిన, మా కుటుంబ సభ్యులకు ,గురువులకు , బ్లాగ్ మితృలకు అందరికీ ధన్యవాదాలు . నా గురించి అంతా ఈ నూటొక్క టపాల లో చెప్పేసాను . ఇక చెప్పేందుకు ఏమీ లేదు .

" " ఖతం కహానీ " * * * " బాత్ ఖతం బర్ కాస్ బిరియానీ " :-)) :-)) :-))

Thursday, December 24, 2009

బ్లాగ్ మిత్రులు

కౌంట్ డౌన్ -5


మొదటిసారి నా " లయ " అనే పోస్ట్ కు దుర్వాసుల పద్మనాభం గారి కామెంట్ వచ్చినప్పుడు ( అప్పటికింకా కూడలి లో చేరలేదు ) , ఎవరీయన అని ఎంత ఆలోచినా తెలీలేదు . అప్పుడే తెలిసింది , ఇంట్లోవాళ్ళే కాదు బయటివారు కూడా నా పోస్ట్ లు చదివి కామెంట్ చేయవచ్చు అని . ఆ తరువాత కూడలి లో చేరాక వచ్చిన నా మొదటి పోస్ట్ " మల్లెలు మల్లెలు " కు , భాస్కర రామిరెడ్డి గారు , రమ్య గారు , హర్సోల్లాసం గారు , పరిమళం గారు ,ఎవరో పేరు లేని వారు , కొత్తపాళి గారు కామెంట్స్ ఇచ్చారు . కొత్తపాళి గారు , మీది బర్కత్ పురానా ? మాదీ బర్కత్ పురా నే అని పలకరించారు . ఓహో అనుకొని , ఆయన వ్రాసిన ఒక పోస్ట్ కు కామెంట్ వ్రాసాను . అంతే , మాలా అని ఘర్జించారు . కామెంట్స్ తెలుగు లోనే వ్రాయండి అని బెత్తం చూపించారు . వెంటనే దడుచుకొని , మా అబ్బాయికి చెప్పాను , ఈయన హెడ్మాస్టర్ లా అరుస్తున్నారురా ? కామెంట్స్ తెలుగులో ఎలావ్రాయాలి ? అని అడిగాను . అందుకు మా అబ్బాయి , ఆయననే అడుగు అన్నాడు . ఎలారా . భయం వేస్తోంది , అంటే , భయం ఎందుకు మాతే , ఆయనెక్కడుంటారో నీకు తెలీదు , నువ్వెక్కడుంటావో ఆయనకు తెలీదు చెప్తే చెప్తారు , లేకపోతే లేదు . అంతేకాని వచ్చి దెబ్బలు కొట్టరుగా అని ధైర్యం ఇచ్చాడు ! అప్పుడు చిన్నగా ఆయననే అడిగాను , నాకూ తెలుగు లోనే వ్రాయాని వుందండి , కాని ఎలా వ్రాయాలో తెలీదు అని మరీ నాకేమీ తెలీదు అనుకుంటారేమో నని బ్లాగ్ లోనే వ్రాసి , కాపీ , పేస్ట్ చేయాలా అని అడిగాను . వెంటనే ఆయన లేఖిని లింక్ ఇచ్చి , ఎలా వ్రాయాలో చెప్పారు . అంతకు ముందు లేఖిని ని చూసినా ఎలా ఉపయోగించాలో తెలీలేదు . అంతే బ్లాగ్ లో సరిగ్గా తెలుగు వ్రాయలేక , ఇక రాయటము మానేద్దాము అనుకున్న దానిని చాలా సంతోషించి , వ్రాయటము కంటిన్యూ చేసాను . హెడ్మాస్టర్ గారూ , ధన్యవాదాలండి .

బ్లాగర్స్ మీటింగ్ లో చక్రవర్తి , సి .బి .రావు గారు , అరుణ పప్పు గారు మొదలైన వారు అభిమానము గా మాట్లాడారు . వీవెన్ గారిని చూసి కూడలి ,లేఖిని రూపకర్తగా తెలుసుకొని , అభినందించాను . నాలాటి కొత్తగా వ్రాసేవారికి లేఖిని ఎంతైనా ఉపయోగపడుతోంది .

జ్యొతి గారి ప్రోద్బలముతో ప్రమదావనము లో చేరాను . అక్కడ అందరి తో సరదాగా మాట్లాడుతూ వుంటే కాలమే తెలీదు ! థాంక్ యు జ్యోతి . సహాయ కార్యక్రమములో జ్యోతి గారిని ,వరూధిని గారిని , పరిమళం గారిని , ఇందిర గారిని , లక్ష్మి గారిని కలిసాను . సృజన రామానుజం మొదటిసారిగా , చాట్ లో పలకరించగానే చాలా థ్రిల్ ఐపోయాను . ఇప్పుడైతే బెస్ట్ ఫ్రెండై పోయింది . సృజన తో మాట్లాడటానికే చాలాసార్లు సాయంకాలము నెట్ తీస్తాను . ఒకేసారి సృజన ,ప్రియ , సుభద్ర , అందరి తో చాట్ చేయటము ఎంత బాగుంటుందో ! ప్రియ అల్లరి కబురులు , సుభద్ర ముచ్చట్లు చాలా ఎంజాయ్ చేస్తాను .నేను , సుభద్ర గురుజీ తో మొట్టికాయలు తినకుండా ఒకరికొకరము సాయం చేసుకుంటూ వుంటాము . ప్రమదావనములో శ్రీ అల్లరి ముద్దు ముద్దుగా వుంటుంది . ఈ మధ్య పాపంబిజీ అట , కొన్ని రోజులుండండి వస్తాను అంది . అబ్బో భావన అల్లరైతే చెప్పక్కరలేదు . అందరినీ ఆటపట్టిస్తూ వుంటుంది . మరువము ఉష ,పరిచయము ఐన కొత్తలో , మా చెల్లెలు ఉషకు వివాహవార్షికోత్సవానికి ఇచ్చిన మేయిల్ , పొరపాటున , ఈ ఉష కు సెండ్ కొట్టాను . ఇహ చూసుకోండి , ఇదేమిటండి బాబు , మా రాజా చూసాడంటే నన్ను చంపేస్తాడు అని గగ్గోలు . హి హి హి , సారీ చెప్పాననుకోండి . శ్రీలలిత , పియస్ యం లక్ష్మి ఐతే చాలా ఏళ్ళ నుండి తెలిసిన బాల్య మితృలనిపిస్తారు . మనసులో మాట సుజాత గారు అభిమానముగా వారింటికి ఆహ్వానించి , బ్రహ్మకమలం మొక్క కూడా ఇచ్చారు .వారి ఇంటిలో , కస్తూరి మురళీ కృష్ణ , మాలతి , రమణి , గీతాచార్య , చదువరి , వరూధిని , రాధిక , కత్తిమహేష్ గారు ల తో మాట్లాడాను . నీహారిక , మధురవాణి , జాహ్నవి , లలిత , స్వాతి కమల్ , సృజన ,పద్మకళ ,సృజన , జ్ఞానప్రసూనగారు అబ్బ ఎంతమంది స్నేహితులో ! నేస్తం గారు మెచ్చుకున్నప్పుడు కొండ ఎక్కినంత ఆనందం కలిగింది . కూడలి చాట్ రూం లో నేస్తం గారిని చూసి మాట్లాడుదామనుకునే సరికి వెళ్ళిపోయారు . మళ్ళీ ఎప్పుడు చాన్స్ దొరుకుతుందో ! బంగారుపాపాయి , రావు బాలసరస్వతి పాడిన పాట లింక్ ఇచ్చారు , తృష్ణ .ఎప్పుడైనా పాటల గురించి కావాలంటే అడగమన్నారు .థాంక్ యు తృష్ణ .

కత్తిమహేష్ గారు నాకు ఒకేఒక కామెంట్ ఇచ్చారు , " హాస్యాస్పదము " పోస్ట్ లో . కాని ఆ పోస్ట్ కాస్తా మావారి కత్తెరకి నిర్ధాక్షిణ్యముగా కామెంట్స్ తో సహా బలైపోయింది . ఈ మధ్య మురళి గారు చాలా తన కామెంట్స్ తో , ప్రోత్సహిస్తున్నారు . ఎప్పుడైనా ఆయన కామెంట్ రాకపోతే రాలేదే అనుకుంటాను . సురేష్ లయ టి . వి సీరియల్ యద్దనపూడి నవల అని చెప్పారు . వేణూ శ్రీకాంత్ గారు , రుత్ గారు , కామెంట్స్ ఇవ్వలేక పోతున్నాము , ఫుల్ పేజ్ కి మార్చమని సలహా ఇచ్చారు . " అడుగడుగున గుడివుంది " పాటలో తప్పుదిద్దటానికి వచ్చిన ప్రభాకర్ గారు జర్నలిస్ట్ అని , " డిసెంబర్ " పోస్ట్ లో నవంబర్ 31 అనిరాస్తే సున్నితముగా మందలించిన మాగంటి గారు , సీనియర్ బ్లాగర్ అని , ఈ మధ్య ఎవరికీ కామెంట్స్ వ్రాయటము లేదని , ఇప్పుడు నాకే కామెంట్ ఇచ్చారని తెలిసినప్పుడు మరక కూడా మంచిదే అన్నట్లు , కొన్నిసారు లు తప్పులు వ్రాయటమూ మంచిదే అని పించింది .

అప్పుడప్పుడు పలకరించే కల్పనరెంటాల ,సత్య , అమ్మఒడి , చిలమకూరు విజయ మోహన్ , మారుతి , పద్మార్పిత , శేఖర్ పెదగోపు , రాణి , ధరణీ రాయ్ చౌదరి , రవి , సునీత , భమిడపాటి సూర్య లక్ష్మి , యడవల్లి శర్మ , మైత్రేయి , శిశిర , వీరు బొట్ల గణేష్ , విజయ భారతి , చైతన్య కల్యాణి , రవి చంద్ర , హరెఫల , నరేంద్ర చెన్నుపాటి ,మలక్ పేట్ రౌడి , గీతాచార్య , శివ చెరువు , యోగి , నాగ ప్రసాద్ , హరే కృష్ణ , వినయ చక్రవర్తి గోగినేని , స్వాతి మాధవ్ , ధనరాజ్ , మంజు , సౌమ్య , అక్షర , శ్రీనిక , రాం , ఉమాశంకర్ ,కార్తీక్, రాజశేఖరుని శర్మ , విహారి , శైలు ,సెలయేరు ,పరచూరి వంశీకృష్ణ , చిన్ని , కథాసాగర్ , భోనగిరి , హరీష్ , కెక్యువర్మ , దుర్గేశ్వర , సత్యనారయణ శర్మ గార్లు ఇలా ప్రత్యక్షముగా , పరోక్షముగా బోలెడు మంది స్నేహితులు అయ్యారు . ఇంతమంది స్నేహితులు ఉండటము ఎంత అదృష్టమో కదా ! ఐ యాం సో హాపీ .


ఇప్పటి వరకు నా రాతలు , కోతలు ఎన్నెన్నో చదివారు , అంబరమంటిన నా ఆనందాన్ని కూడా 27/ 12 న చదవి , మీరూ ఆనందిస్తారని భావిస్తాను .

Wednesday, December 23, 2009

అమ్మాయికి జన్మదిన శుభాకాంక్షలు


నా బెస్ట్ ఫ్రెండ్ , మా అమ్మాయి ,
సంజ్యోత్ కు జన్మదిన శుభాకాంక్షలు .


హలో హలో ,విష్ చేసి వెళ్ళి పోకండి . 24 / 12 న అంటే రేపు కౌంట్ డౌన్ 5 లో నా బ్లాగ్ మితృలను పలకరించండి . .

Tuesday, December 22, 2009

గురూజీ కి జన్మదిన శుభాకాంక్షలు .

కౌంట్ డౌన్ - 3ఒకానొక రోజు నేను మహా దీక్ష గా నెట్ లోని కార్డ్స్ ఆడుతున్న సమయాన టింగ్ మని చప్పుడొచ్చింది . ఏమా అది అని చూడగా జ్యోతి గారి దగ్గరనుండి మెయిల్ . బాపురే ఇదేమిటి ? కలయా వైష్ణవ మాయా ? అనుకొని కళ్ళునులుపుకొని మరీ చూసాను . నిజమే జ్యోతి గారిదగ్గరనుండే , మీ టెంప్లెట్ చాలా సింపుల్ గా వుంది మార్చి పెట్టనా అని . అంతకు ముందే ఆంద్రజ్యోతి లో జ్యోతిగారి పరిచయము చదివి , అమితాబచ్చన్ తరువాత ఈ జ్యోతిగారే పెద్ద బ్లాగర్ అని అప్పటికే డిసైడ్ ఐపోయాను . . అందువలన కాసేపు బుర్ర గిర్రున తిరిగి జ్యోతీ అని గావు కేక పెట్టాను . ఆ తరువాత నా టెంప్లెట్ మార్చి ఇచ్చారు . మదిలోని మధురానుభూతులు అలా . . . అలా . . . అన్న టాగ్ లైన్ పెట్టింది కూడా జ్యోతి గారే .


ఆ తరువాత ప్రమదావనములో చేరుతారా అని అడిగారు . సరే నన్నాను . ప్రమదావనము నుండి సహాయ కార్యక్రమాని కి వెళ్ళినప్పుడు , జ్యోతిగారి చూసే దాక నేను , ఆవిడకి ఆరు చేతులు అన్న భ్రమలోనే వున్నాను సుమా !!! ఓరినీ ఇంత సింపుల్ గా వున్న ఈవిడేనా జ్యోతిగారు అనుకొని హాచర్య పోయాను సుమీ !!!నన్ను వెనకనుండి ఎవరైనా తోస్తే తప్ప ఏ కొత్త పనీ మొదలు పెట్టను . స్టార్టింగ్ ట్రబుల్ అన్నమాట . ఆ తోసే పని మావారో , మా అమ్మ నో చేస్తారు . అలాగే మా రవి తోయటము తో , బ్లాగ్ లోకము లోకి వచ్చిపడ్డ నన్ను , కిందపడకుండా చేయూత నిచ్చారు , మా గురూజీ. బద్దకము గా ఏం రాస్తాను లే అనుకొని కొంచము తో ఆపగానే ఏమిటీ ఆ వాక్యాలు , కామాలు పుల్ స్టాప్ లు లేకుండా గాలిలోకి వదిలేస్తారు ? ఆయ్ అని కోపడతారు . అరే ఎంతసేపని కూర్చొని వుంటారు , కొంచం అలా గాలిలోకి ఎగురుతే అందరికీ వ్యాయామము అవుతుంది కదా గురూజీ అంటే అర్ధం చేసుకోరూ ! పైగా బోలెడు లింకు లు పంపి , ముందు అవి చదవండి . ఎలా వ్రాయాలో ఒక ఐడియా వస్తుంది అని తెగ పోరు . ఇదో మీరిలా అంటే , చిన్నప్పుడు మా అబ్బాయి వాళ్ళ ట్యూషన్ టీచర్ కి జిడ్డు మహాసభల ప్రెసిడెంట్ అని పేరు పెట్టాడు . నేను మీకదే పేరు పెట్టేస్తా నన్నా బెదరలేదు . ఏమిటీ నాకు జిడ్డు మహాసభల ప్రెసిడెంట్ అని పేరు పెడతారా ? ఆ విషయము తరువాత ఆలోచిద్దాము , ముందు నస ఆపి పని సంగతి చూడండి అని హుకుం జారీ చేస్తారు .


మొట్టికాయలకు వంటింటి చిట్కా అని సరదాగా గురూజీ మీద పోస్ట్ వ్రాసినా , జిడ్డు మహాసభల ప్రెసిడెంట్ అని ముద్దుగా పేరు పెట్టినా , గురూజీ అని గౌరవముగా పిలిచినా , అన్నిటినీ స్పొర్టివ్ గా తీసుకొని ఓ చిరునవ్వు నవ్వేస్తారు . నేను బ్లాగను అన్నప్పుడల్లా మొట్టికాయ లేస్తూ వ్రాయిస్తున్నారు . నాకు వ్రాయటానికి ఏమీ లేదు గురూజీ అంటే కాస్త మెదడుకు పని పెట్టండి అదే వచ్చేస్తుంది , అంటారు .పోనీ మీ పాత పోస్ట్ లలోనుండి కొన్ని సంఘటనలు తీసి ఈసారి వేరే విధముగా వ్రాసేయండి అని ఐవిడియా ఇచ్చేసారు . బ్లాగ్ గురు లో ఇప్పుడు చెబుతున్న పాఠాలన్నీ ,చాలావరకు నాకు చాట్ లో కొన్ని , ప్రత్యక్షముగా కొన్ని చెప్పారు . పాపం నాకు పోస్ట్ కు , టైటిల్ తోచటము లేదంటే ఆలోచించి ,టైటిల్ సజెస్ట్ చేస్తారు . అంతేనా కొన్నిసార్లు బొమ్మలు కూడా వెతికి ఇస్త్తారు . అంతేనా ,నాకు కావలసిన పాటలు కూడా ఎక్కడెక్కడినుండో వెతికి పట్టుకొచ్చి ఇస్తారు . అంతేనా అంటే నాకు కొంచము బ్లాగ్ కష్టం కలుగుతే చాలు గురూజీ అనగానే భుజం ఇచ్చేస్తారు . నాకేమిటట అంటూనే , ఏమీ కోరకుండా కోరినంత సహాయము చేసే మా గురూజీ ఎవరో బ్లాగర్స్ అందరికీ అర్ధమై పోయే వుంటుంది .


నామీద ఇంత విదేశీ కుట్ర చేసుతున్న మా గురూజీ , అదేనండి బ్లాగర్ల ప్రియ మిత్రురాలు జ్యోతి ( గారె లాగున్నావు బిడ్డా అంటే గారె చేసి పెట్టమని అన్నదట ఒకావిడ . అలా మళ్ళీ గారు అంటే ,నాకు గారెలు వద్దు బూరెలు తెండి అంటారు . ఇప్పుడు నాకు బూరెలు వండే ఓపిక లేదు అందుకే గారు తీసేస్తాను లెండి ) కి జన్మదిన శుభాకాంక్షలు .


ఆయు ఆరోగ్యాల తో , కలకాలము సుఖము గా వుండాలని కోరుకుంటున్నాను .

Jyoti , happy birth day to you .


అదే చేతో రేపూ ఓసారిటు రండి , కౌంట్ డౌన్ -4 చదువుదురుగాని .

Sunday, December 20, 2009

ప్రియమైన కుట్ర

కౌంట్ డౌన్ - 4

" నీకేమీ తెలీదు బామ్మా , నువ్వు నేర్చుకో బామ్మా అని గౌరవ్ , చిన్నవాడు చెపుతున్నందుకైనా నేర్చుకోవచ్చుకదా ? వూరికే కూర్చోకపోతే అని మీ మామయ్య , మా నస మాస్టర్ లిద్దరూ నస పెట్టబట్టి కంప్యూటర్ నేర్చుకున్నాను కాని , కంప్యూటర్ తో ఏమి చేస్తాము రా ? " కంప్యూటర్ నేర్చుకున్నావు కదా అత్తయ్యా , ఏమిచేస్తున్నావు ? అన్న మా మేనల్లుడు రవి కి నా సమాధానము ఇది . " ఎందుకు చేయకూడదు ? బ్లాగ్ వ్రాయి " అన్నాడు . బ్లాగా ? అది అమితాబచన్ నే కదురా వ్రాస్తాడు అంటే పడీ పడీ నవ్వి , కాదత్తయ్యా ఎవరైనా వ్రాయొచ్చు అన్నాడు . అప్పటికీ నేను వినలే . ఇంగ్లీష్ లో అంత బాగా వ్రాయలేను లేరా అనేసాను .ఊహూ వింటేనా ? ఎందుకు తెలుగు లో కూడా రాయొచ్చు పదా ఎలా రాయాలో నేను చూపిస్తాను అన్నాడు . ఇప్పుడు వద్దులేరా , పార్టీలొనుంచి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చుంటే అందరూ నేను గొప్ప చూపించుకుంటున్నాననుకొని నవ్వుతారు తరువాత చూదాము లే అని అప్పటికి తప్పించుకున్నాను . ఐనా పట్టు వదలకుండా నాకు బ్లాగ్ స్పాట్ లింక్ మెయిల్ చేసాడు .


" అమ్మా , నిన్న రవి బావ చెప్పింది ఏం చేసావు ? " మా అమ్మాయి ఫోన్ చేసి షంటటము మొదలుపెట్టింది . ఇహ తప్పక , మా అబ్బాయి పని చేసుకుంటున్నప్పుడు , వరేయ్ బేటా రవిబావ ఏదో బ్లాగ్ లింక్ పంపాడురా , సంజక్క కూడ రోజూ షంటు తోంది అసలు అదేమిటిరా అని అడిగాను . నా బేటా తలెత్తి కూడా చూడలేదు . సరే పనిలో వున్నట్లున్నాడులే అనుకొని , ఆంధ్రభూమి సీరియల్ లోకి తలదూర్చేసాను . నీ బ్లాగ్ కి ఏం పేరు పెడతావు ? అని సడన్ గా వినిపించేసరికి ఉలిక్కి పడి ఏట్రా అన్నా . అదే నీ బ్లాగ్ కి ఏం పేరు పెడతావు ? అని మళ్ళీ అడిగాడు . ఏమిటీ పేరు పెట్టాలా ? అన్నా . మరి లేక పోతే ఎట్లా ? చెప్పు అన్నాడు . ఓహో బ్లాగ్ కు పేరుకూడా పెట్టాలన్నమాట అను కొని అప్పుడు నేను చదువున్న సీరియల్ లోని హీరోయిన్ పేరు సాహితి నచ్చి , అదే " సాహితి " అన్నాను . బాగుంది అన్నాడు . ఇదిగో నీ బ్లాగ్ ఇక రాసుకో అని చూపించాడు . టెంప్లెట్ ఏది పెట్టను అని అడిగాడు . అప్పటికే ఉక్కిరి బిక్కిరి అయిన నేను ఏం వద్దులే సింపుల్ గా వుండనీయి , కానీ బాబా ,అసలు బ్లాగంటే ఏమిటిరా ? అందులో ఏమి రాయాలి ? అన్నాను . బ్లాగ్ అంటే ఓపెన్ డైరీ అనుకో . నీ ఇష్టం , నీకేది కావలంటే అది రాసుకో వచ్చు . చూడు , ఇక్కడ ఇలా టైప్ చేస్తే దానంతట అదే తెలుగు లోకి మారి పోతుంది అని చూపించాడు . ఇహ అప్పటి నుండి రోజూ రాత్రి వాడు పనిచేసుకునేటప్పుడు , పక్కన చేరి నా అనుమానాలను తీర్చుకుంటూ బ్లాగటము మొదలెట్టాను .

ఇదిగిదిగో బ్లాగ్ మొదలు పెట్టేసానహో అంటూ మా అమ్మాయి కి , రవి కి ఫోన్ చేసి చెప్పేసాను . వెంటనే సంజు కామెంట్ పెట్టేసింది . రోజూ కాల్ చేయగానే , ఈ రోజు ఏం రాసావు ? అని అడిగి మరీ చెప్పించుకొని , మా ఫ్రెండ్స్ కి కూడా చెప్పాను , నువ్వు బ్లాగ్ రాస్తున్నావు అని తెగ మెచ్చేసు కోవటము . సలహా లివ్వటమూనూ ! ఆ తరువాత రవి కూడా కామెంట్ పెట్టేసాడు . అప్పటినుండి ఇద్దరూ , నా కామెంటేటర్స్ , ప్రమోటర్స్ కూడాను . డప్పు పట్టుకొని మరీ చాటించేసారు . నా బ్లాగ్ గురించి వాళ్ళకే మహా ఉత్సాహంగా వుంది . ప్రతి పోస్ట్ తప్పకుండా చదువుతారు .

బ్లాగ్ మొదలు పెట్టగానే , సంజు , రవి తో పాటుకు జయకు కూడా చెప్పేసాను . బ్లాగ్ గురించి నా నాలెడ్జ్ అంతా జయకు చూపించేసాను . అంతే తను కూడా నా కామెంటేటర్ గా మారి పోయింది . ఆంధ్ర జ్యోతి లో బ్లాగ్ ల మీద వచ్చిన ఆర్టికల్ తనే చూపించింది . కాక పోతే మా జయ , ఆ ఇద్దరి పిల్లల లాగా మెచ్చేసుకోవటము కాకుండా , ఇదేమిటి ? మద్యలో అపేసావు ? పూర్తిగా వ్రాయొచ్చుకదా ? ఇక్కడ తప్పు వుంది , అచ్చు తప్పులున్నాయి అని విమర్శకురాలు కూడా అయ్యింది . మధ్యలో ఆపానంటావు చేయి నొప్పి పుట్టింది , లేదా ఇక రాయటానికి ఓపికైపోయింది అంటే వింటేనా ? తనకు తోడు మా కజిన్ సత్య , అక్కా చాలా తప్పులు రాస్తున్నావు , చదవలేక పోతున్నాను అని గొడవ . ప్లీజ్ అక్కా కొంచం తప్పులు తగ్గించవా అని ఓ తెగ బతిమిలాడేది . సలాలా నుండి కాల్ చేసి మరీ బతిమిలాడేది మా చిన్న చెల్లెలు ఉష , చదవాలని పిస్తోంది కాని చదవలేక పోతున్నాను అని . లేఖిని లో రాయటము మొదలు పెట్టాక కాస్త వీళ్ళ గోల తగ్గింది ! వీళ్ళ గొడవ మూలంగా తప్పులు లేకుండా చూసుకోక తప్పటము లేదు .

మేనకోడళ్ళు , శ్రీ దేవి , దీప్తి , హరిణి , ఇంకా అప్పుడప్పుడు బాగా రాస్తున్నావు అనే , గౌతం , బాల , సబిత , ఆడపడుచులు విజయ , ఉష ,శేషు నీ బ్లాగ్ చదువుతున్నాము చాలా బాగుంటోంది అని , బాగా రాస్తున్నావు అని మావదినగారు , ఉష ఆడపడుచులు సంధ్య ,ఆదిలక్ష్మి , దమయంతి మెచ్చుకుంటుంటూ వుంటే చాలా సంతోషం గా వుంటుంది . ఇంకో కజిన్ ఫణి కొన్ని టాపిక్స్ చెపుతూవుంటుంది .

మరి ఇంత మంది నా రాతను మెచ్చుకుంటున్నారంటే , దీని వెనుక మా వారి హస్తం వుందండోయ్ ! నా రాతకు మొదటి పాఠకులు ఆయనే . ఎడిటర్ కూడానూ . నిర్ధాక్షిణ్యంగా కత్తిరించేస్తారు . కొద్దో గొప్పో మిగులుతే అప్పుడప్పుడూ మా అమ్మ కత్తిరిస్తుంది . కాకపోతే అంతా కత్తిరించబడి రెండు ముక్కలే నా చేతికి వచ్చే పరిస్తితి రాకుండా చూసుకోవటమే నేను పడాల్సిన జాగ్రత్త !

మరి నేను వ్రాసే రాతలు అందముగా కనిపించాలంటే గీత ఇంకెంత అందం గా వుండాలి ? ఏటెంప్లెట్ నచ్చక మధన పడుతున్న నాకు చేయూత నిచ్చింది మా కోడలు అను . బాపు వేసిన చిత్రము ఎందుకు మనమే తయారు చేసుకుందాము అని నాకు కావలసిన విధముగా , అందులోనూ నా ఫేవరేట్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్ లో ఈ టెంప్లెట్ ను తయారు చేసి ఇచ్చింది . దీని కోసము చాలా కష్ట పడింది .ఎన్ని రకాలుగా మారుస్తేనో ఇంత సొగసుగా తయారు కాలేదు . హెడర్ లో వున్న బొమ్మ ఒక ఎత్తైతే , పక్కనున్న పూల తీగెల స్తంభం చూసారా అది ఇంకో ఎత్తు . బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో హీరోయిన్ లు , బాల్కనీ లో ఇలాంటి స్తంభం దగ్గర , ఆకాశము లో చంద్రుని చూస్తూ పాటలు పాడుతూ వుండే సీన్ అంటే నాకు చాలా ఇష్టం . అది చెప్పగానే ఈ స్తంభం తయారు చేసింది . ఈ టెంప్లెట్ తన సృస్ఠినే .


నేను హాయిగా శూన్యము లోకి చూసుకుంటూ చుక్కలు లెక్క పెడుతూ , బేకార్ గా వుంటే , అలా వుండనీయకుండా చూడండి నా మీద ఎంత అహ్లాదకర మైన కుట్ర చేసారో నా ప్రియమైన కుట్రదారులు .


మీకు జిడ్డు మహాసభల ప్రెసిడెంట్ అంటే తెలుసా ? అసలు ఆ పేరు ఎప్పుడైనా విన్నా రా ? అయ్యో తెలీదా ? ఐతే 22/12 కొరకు వేచి చూడండి - - - తెలుసు కోండి కౌంట్ డౌన్ 3 లో .

Friday, December 18, 2009

మది లోని మధురానుభూతులు అలా . . . అలా . . .

కౌంట్ డౌన్ – 5

బ్లాగు అంటే అమితాబచన్ నే రాస్తాడు , ఇంకెవరూ రాయరు అనుకునేదానిని . కాదు అందరూ వ్రాయవచ్చు , అందులోనూ తెలుగు లొ వ్రాయవచ్చు , అని తెలిసి బ్లాగ్ మొదలుపెట్టాను . కాని ," పండిత పుత్ర పరమశుంఠ " అన్నట్లుగా అసలు అదేమి తెలుగు , అసలు తెలుగేనా ? నేను వ్రాసేది నాకే చదవ బుద్ది కావటము లేదు , అర్ధమే కావటము లేదు ." వున్న మతి పోయెనే చంద్రమతి " ," బతికివుంటే బలుసాకు తినొచ్చు " ఇలా నాకు తెలిసిన సామెతలు గుర్తుతెచ్చుకొని వ్రాయటము మానేద్దాము , అనుకుంటున్నప్పుడు లేఖిని గురించి తెలిసింది .ప్రాణం లేచివచ్చింది .అమ్మయ్య అనుకొని ఊపిరి గట్టిగా పీల్చుకొని వీర లెవల్లో మది లోని మధురానుభూతులు అలా . . . అలా . . . వ్రాసేయటము మొదలు పెట్టేసాను .


ఆంద్రజ్యోతి లో బ్లాగుల గురించి వచ్చింది చదివి , ఆ లింక్ లను ప్రయత్నము చేస్తూ , కూడలి లో , తెలుగు బ్లాగ్ గ్రూప్ లో ఎలా చేరానో నాకే తెలీదు . నిజం . మీరు తెలుగు గుంపులో సభ్యులు కనుక మీకీ సందేశం వచ్చింది అన్న మెయిల్ చూసి గాభరా పడ్డాను . అలాగే , కూడలి లో మీ బ్లాగ్ చేర్చబడింది . మీకు వీలైతే కూడలిని మీ బ్లాగుకు లింకేయండి అన్న మెయిల్ చూసికూడా ఏమీ అర్ధము కాలేదు . ఆ తరువాత , అసలు ఎలా చేరాలో తెలీయటము కోసము , మా జయ తో , మా కజిన్ పార్వతి తో బ్లాగ్ తెరిపించి , కూడలి లో కలిపాను . వాళ్ళు ఆ విషయం చాలా లైట్ గా తీసుకున్నారు . అసలు నా కష్టం పట్టించుకోలేదు కూడా హూం ! ఇదో ఈ మద్య జయ బ్లాగటము మొదలు పెట్టింది . ఇహ పార్వతిని పోరాలి .


అందరి బ్లాగ్ లు చదువుతుంటే నాకూ అలా ఫొటోలు , పాటలు పెట్టాలని , ఇంకా వ్రాయటము కూడా మెరుగుపరుచు కోవాలని అనిపించింది .అంతే మా వారి ప్రోత్సాహము తో మా మనవరాలి తో పాటు అనిత దగ్గర ట్యూషన్ లో చేరాను . తను కూడా చాలా ఉత్సాహముగా హెచ్ .టి .యం .యల్ కోడ్స్ వగైరా నేర్పించింది . అవి నేర్చుకోవటానికి మొదలు పెట్టిన ఒక్కొక్క టెస్ట్ బ్లాగ్ నచ్చి , సాహితి కి తోడుగా , ప్రయాణాల అనుభవాలు వ్రాయటానికి , " చల్తే చల్తే " , నచ్చిన పాటలు వ్రాసుకోవటానికి " కమ్మటికలలు " , టెంప్లెట్ చేయటము నేర్చు కోవటానికి మొదలు పెట్టినది తెగ నచ్చేసి " ప్రభాతకమలం " ఇలా నాలుగు బ్లాగులు పోగేసుకున్నాను. ఒక్క వాక్యము వ్రాయటానికే బద్దకించే నేను ఇన్ని వ్రాస్తున్నాను అంటే నామీద నాకే ఆశ్చర్యం వేస్తోంది ! ! !


మరి ఇన్నివ్రాస్తున్నప్పుడు , ఎందులో ఏది వ్రాస్తున్నానో తికమక కాకుండా ఓ నోట్ బుక్ పెట్టి , దాని లో వ్రాద్దామనుకున్న టాపిక్ గురించి వ్రాసుకొని , దానికి సంబందించిన చిత్రాలు , పాటలు , వెతుక్కొని వ్రాసి , దానిని వర్డ్ డాక్యుమెంట్ లో పేస్ట్ చేసుకొని , అబ్బ ఎన్ని తిప్పలు పడుతున్నానో ! అప్పుడు కాని ఈ మాత్రము రావటము లేదు . ఎంత చూసుకున్నా తప్పులు వస్తునే వున్నాయి . ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చు కోవాల్సింది వుంటునే వుంది .


నా పోస్ట్ లలో నాకు చాలా నచ్చింది , చల్తే చల్తే లో హైదరాబాద్ గురించి వ్రాసిన మూడు పోస్ట్ లు . అలాగే కమ్మటికలలు లో జీవనతరంగాలు అనే పేరు తో సీరియల్ గా వ్రాసిన పోస్ట్ లు .దాని కోసము చాలా కష్ట పడ్డాను . ఎక్కువగా వ్రాయకూడదు , పాటలు ఆ సంధర్భానికి సరిపోయేవి కావాలి , అందులోనూ పాత సినిమాలవి కావాలి . చాలావరకు అనుకున్నట్లు గానే వ్రాసాను . ఇక సాహితి లో అయితే నచ్చినవి చాలానే వున్నాయి . కాని అసలు ఏమాత్రము నచ్చనిది మాత్రము " తొలకరి " . దాని గురించి చాలా ఊహించుకున్నాను . కాని ఎందుకో నా ఉహకు సరిపోను రాలేదనిపిస్తుంది . సృజన కావలిసిన ఫొటో కూడా వెతికి ఇచ్చింది . టైటిల్ , ఫొటో వున్నంత అందముగా పోస్ట్ రాలేదని పిస్తుంది . అప్పుడప్పుడూ తీసి చూస్తూ వుంటాను ఇంకా ఎంత బాగా వ్రాయగలనా ? ఏమి మార్పులు చేయాలి అని . ఏది ఏమైనా , ఏమి వ్రాసినా , ఏదీ వివాదాస్పదమైనది వ్రాయకూడదు , ఎవరినీ నొప్పించేట్లుగా వ్రాయకూడదు అని మటుకు నిర్ణయించుకున్నాను.


బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ బ్లాగ్ లో మూడు ఆర్టికల్స్ రావటము , పుస్తకము లో ఒక ఆర్టికల్ రావటము చిన్నపాటి విజయాలు . మా అమ్మా నాన్నగారు ల గురించి , నేను జయ కలిసి వ్రాయటము ," ఈ రోజు ఏమీ కొనకూడదుట " పోస్ట్ పూర్తి సంభాషణగా వ్రాయటము ఓ బుజ్జి ప్రయోగాలు .మొదట్లో నేను వ్రాసిన పోస్ట్ లు కొన్ని మార్చాను కాని అన్నీ మార్చలేదు . అప్పుడు ఎలా వ్రాసానో తెలియటానికి , అప్పుడప్పుడు చదువుకొని నవ్వుకోవటానికి అలానే వుంచుదామనుకుంటున్నాను . ఎవరైనా చదివి తలనొప్పి తెచ్చుకుంటే నా భాద్యత కాదు !


ఇక నామీద జరిగిన కుట్ర గురించి తెలుసుకోవాలంటే 20/12 న వచ్చే పోస్ట్ కౌంట్ డౌన్ 4 లో చదివి తెలుసు కోండి .

Monday, December 14, 2009

డిసెంబర్ ! ! !
పచ్చని చెట్టునిండా ఎర్ర ఎర్రని పూలు . ఎంత అందముగా వుందో కదా ! అంతే అందం గా డిసెంబర్ నా జీవితము లోకి వచ్చింది . . . ఆ విరబూసిన పూలలా ఎన్నో మధుర స్మృతులను తెచ్చింది . ముఖ్యమైన మలుపులు చాలా వరకు డిసెంబర్ లోనే జరగటము నమ్మలేని నిజము ! ప్రతి మలుపు ఒక్కోపూవైయ్యింది . ఆ పూల ఊసులిదిగో ! ! !


నవంబర్ ముప్పై , ఆ రోజున నా పెళ్ళిచూపులు . చూడటమేమిటో , నచ్చట మేమిటో , వెనువెంటనే ముహూర్తాలు పెట్టుకుంటానికి సిద్దమైపోవటమేమిటో అంతా కలలా జరిగి పోయింది .డిసెంబర్ మొదటి తారీకున , ముఖ్యాతి , ముఖ్యమైన మలుపుకు అంకురార్పణ జరిగి , అదే , నా కళ్యాణానికి ముహూర్త నిర్ణయం జరిగింది .


జీవితాన మరువలేని రోజు , అదే పెళ్ళిరోజు . ఆ రోజు డిసెంబర్ పదకొండు . హైదరాబాద్ లో , కింగ్ కోటీ లోని , ఇడెన్ బాగ్ లో , పెద్దల ఆశీస్సులతో , ఆత్మీయుల అభినందనల తో శ్రీమతిగా ప్రమోషన్ వచ్చిన రోజు . పూల రధములా అలంకరించిన పడవంత కారులో , మేళ తాళాలతో అత్తవారింట గృహప్రవేశం చేసినది డిసెంబర్ పన్నెండున .


అమ్మాయినుండి ఆవిడగా మారటము , ఆ పైన అమ్మగా మారటము అది కూడా డిసెంబర్ లోనే ! అమ్మ లోని మధురిమను తొలిసారిగా రుచి చూసింది డిసెంబర్ ఇరవై మూడున . అదేనండి మా అమ్మాయి పుట్టినరోజు .

మా అమ్మయి పుట్టిన రోజు ఇరవై మూడైతే , మా అమ్మ పుట్టిన రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది .

సుప్రభాత సమయాన , దివ్యమంగళ స్వరూపుడైన , కోరిన వరములనిచ్చే , మా ఇలవేలుపు , తిరుమలరాయుని , కొంగులు ముడివేసుకొని , పసుపు వస్త్రాలతో తొలిసారిగా దర్షించుకున్నది డిసెంబర్ పద్దెనిమిదిన .

కలలోనైనా అనుకోనిది , ఊహించనిది నేను బ్యూటీ పార్లర్ తెరవటము . కానీ అదీ జరిగింది , ఎప్పుడు ? ఇంకెప్పుడు డిసెంబర్ పదిహేడున !

ఒక చిన్న తికమక కూడా జరిగింది . పూనా లో బి. ఏ మొదటి సంవత్సరము చదివి , హైదరాబాద్ లో రెండో సంవత్సరము లో డిసెంబర్ లో చేరవలసివచ్చింది .అప్పుడు జరిగిన తెలంగాణా ఉద్యమము వలన ఎకడమిక్ ఇయర్ డిసెంబర్ లో మొదలయ్యిందన్నమాట . డిసెంబర్ లో జరిగిన ఫైనల్ పరీక్షలో , ఇంగ్లీష్ పేపర్ ఔటాఫ్ సిలబస్ ఇవ్వటము వలన , అప్పుడు పోస్ట్ పోన్ అయ్యి , ఫిబ్రవరి లో ఆ ఒక్క పేపర్ ,పరీక్ష జరిగింది . అదీను మా అబ్బాయి పుట్టిన మూడో రోజున . సరే రాసి పాస్ అయ్యాను కాని , నా డిగ్రీ ని డిసెంబర్ ఖాతా లో వేయాలా ? ఫిబ్రవరి లో వేయాలా ? అనేదే మకతిక !


ఏయ్ కాలచక్రమా ! ఎందుకంత నవ్వుతున్నావు ? డిసెంబర్ లో ఇంకేమీ జరగవా ? అనా ? ఎలా చెప్పగలను ???
ఏమో ? ఇంకా ఈ డిసెంబర్ నాకేమేమి ఇస్తుందో ??? అది నువ్వే చెప్పాలి - - -

Friday, December 11, 2009

పిలవని వాళ్ళు పాపాత్ములు ! ! !

 మా పరోపకారి పాపన్న ( నేను మావారికి పెట్టుకున్న పేర్లలో అదొకటి లెండి ) యు.యస్ వచ్చేటప్పుడు , ఓ పెళ్ళి కి వెళ్ళివచ్చి , హడావిడిగా వచ్చి ఫ్లైట్ ఎక్కి , యు.యస్ వచ్చాక చూసుకుంటే ఆయనగారు , లాస్ట్ మినిట్లో మా ఆడపడుచు ఎందుకైనా మంచిది అని పెట్టిన రెండు , పాంట్లు , రెండు షర్ట్ లు తప్ప ఇంకేమి బట్టలు తెచ్చుకోలేదంటే నమ్ముతారా ? మరి ఈ సూట్కేస్ లు ఇంతబరువున్నాయి ఏమిటా అని మా పిల్లలు తెరిచి చూస్తే వాటినిండా ఆయన పిల్లలకోసము కొన్న గిఫ్ట్లు , అందరూ మా పిల్లల కియ్యండీ అని ఇచ్చిన స్వీట్ బాక్స్ లూనూ ! సరే ఆ స్వీట్ బాక్స్ లు అన్నీ పాక్ చేయటము , పోస్ట్ చేయటము వేరే కథ . వాళ్ళ ఫ్రెండ్ కూతురు పెళ్ళికి వెళ్ళి వచ్చాక , అందరూ వాళ్ళ పిల్లలకియ్యమని ఇచ్చినవి సద్దుకున్నాక ఈయన బట్టలు సద్దుకుందామని ,బట్టలు తీసి మంచము మీద పెట్టారట . చివరి నిమిషము లో రావటము వలన బట్టలు సద్దుకోవటము మరచిపోయారట ! మేము ఇండియా కి తిరిగి వచ్చేవరకూ అలాగే మంచము మీద వున్న బట్టలను చూసి నేను నిట్టూర్చటము తప్ప ఏమి చేయలేక పోయాను !


మీరు రైళ్ళూ , బస్ ల వెంటే పరుగెత్తుతారనుకున్నాను , విమానాల వెంట కూడా అలాగే పరుగెత్తుతారా ? అని మా పిన్ని అడుగుతే , అవును పిన్నీ . కా . . . నీ . . .ఏదైనా పెళ్ళికి మటుకు పెళ్ళికొడుకు ఆలస్యముగా రావచ్చేమో కాని మేము మాత్రము ముహూర్తము సమయానికి ఒక్క నిమిషము కూడా ఆలస్యము గా వెళ్ళము తెలుసా అని గర్వం గా చెప్పాను . అసలు ఆ రోజు ఆయన ఆలస్యానికి కారణము , ఫ్రెండ్ కూతురు పెళ్ళికెళ్ళి రావటమే కదా ? ఇంటికొచ్చి పిలిచాడు , ఫోన్ చేసాడు వెళ్ళక పోతే బాగుంటుందా ? ముహూర్తము కాకుండా వచ్చేస్తే బాగుంటుందా ? ఏమిటో అర్ధం చేసుకోరూ !


ఎవరు పెళ్ళికి పిలిచినా మేము వెళ్ళకుండా వుండము . అదీ ముహూర్తము టైముకల్లా . పది పదిహేను సంవత్సరాల క్రితమైతే పెళ్ళిళ్ళ లో ఏదో వొక గొడవ జరిగేది . అందుకని , పెళ్ళైనాకా , పెళ్ళివారికి భోజన సదుపాయాలు చూసి , ఏవైనా గొడవలైతే సర్దుబాటు చేసి , అప్పగింతలైయ్యేటప్పుడు , వెనకాల కూర్చొని , మా అమ్మాయి పెళ్ళి కాకముందైతే , మా అమ్మాయిని అప్పగించే సీను తలుచుకుంటూ , మా అమ్మాయి పెళ్ళైనాక , మా అమ్మాయిని అప్పగించిన సీను తలుచుకుంటూ ,కాసిని కళ్ళ నీళ్ళు పెట్టుకొని , ఆ తరువాత పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి , ఆయన , పెళ్ళికొడుకు చేయి పట్టుకొని , అమ్మాయిని జాగ్రత్త గా చూసుకో బాబు అని చెపుతున్నప్పుడు , నేను చేతులు కట్టుకొని , ఆయన పక్కన నిలబడి , ఆయన చెప్పటమైనాక , నేనూ , ఆ పెళ్ళికూతురి చేయి చిన్నగా తట్టి వచ్చేయటము మా కలవాటై పోయింది . విచిత్ర మేమిటంటే మేము అమ్మాయి తరుపున వెళ్ళినా , అబ్బాయి తరుపున వెళ్ళినా అక్కడ ఇదే సీనుండేదన్నమాట . ప్రస్తుతమైతే మరీ దగ్గరవాళ్ళైతే తప్ప అంతవరకూ వుండటము లేదు . కాకపోతే ఈమధ్య పెళ్ళిలలో గొడవలు కూడా కావటము లేదుకదా ! కాని భోజనాల దగ్గర ఏర్పాట్లు చూడటము మానుకోలేదు .


కాకి తో కబురు పెట్టినా వస్తామని మాకు పేరు . అది ఎంతదాకా పోయిందంటే , ఈ మధ్య మాకు బాగా కావసిన వారింట్లో పెళ్ళి జరిగింది . అది మాకు వేరే వారి ద్వారా తెలిసింది . ఐతే , ఓ పది రోజుల తరువాత ఆయన ఫోన్ చేసి మీరు పెళ్ళికి రాలేదేమని నిష్టూరమాడాడు . ఆయనను చెప్పనిచ్చి , అసలు నువ్వు నన్ను పిలిచావా అంటే బిత్తర పోయి , పిలవలేదా అని లక్షా తొంభైసార్లు సారీలు చెప్పాడు . ఇంటికొచ్చి కూడా ఇంకో లక్షా తొంభై సార్లు సారీలు చెప్పి వెళ్ళాడు !


ఈ మధ్య మా పనమ్మాయి శారద పెళ్ళైంది . ఆ పెళ్ళికి మేమిద్దరమూ వెళ్ళాము . మమ్మలిని చూడగానే శారద అమ్మా , మీరూ పెద్దసారూ వచ్చారు అని తెగ సంతోష పడిపోయింది . సరే యధావిధిగా పెళ్ళికొడుకుకు , మా శారద చాలా మంచమ్మాయి , జాగ్రత్తగా చూసుకో అని మావారు చెప్పటము జరిగింది . ఆ అబ్బాయి బిత్తర పోయి తరువాత శారద ని అడిగాడుట , మీ సారు వాళ్ళకు నువ్వంటే చాలా అభిమానమా అని . ఇంటికొచ్చి శారద చెప్పుకొని మురిసి పోయింది . అమ్మా మీరొస్తారను కోలేదు .పెద్దసారు అంత బిజీగా వుండి కూడా రావటము నాకు చాలా సంతోషము కలిగిందమ్మా అంది . పిచ్చిపిల్లా ఎందుకు రామనుకున్నావు ? ఎవరు పిలిచినా ఎలాగో వీలుచేసుకొని తప్పక వెళుతాము . అని శారదకు చెప్పి , స్వగతం ; అవునుమరి , మమ్మలిని పిలవనివాళ్ళు పాపాత్ములు ! ! !

Wednesday, December 9, 2009

అష్టవర్షా భవేత్ బాలకా

" బాబా , గౌరవ్ కి బబుల్ గం కావాలటరా ."
" ఇప్పుడే వద్దు మాతే , వాడి కి ఎయిట్ ఇయర్స్ రానీ "
ఇది నాకూ , మా అబ్బాయికి తరుచు జరిగే సంభాషణ . ఇదొక్కటేనా ? విక్కీ , జేయూ పి. యస్ బి తెగ ఆడేస్తూ వుంటారు . గౌరవ్ మటుకు వాళ్ళ పక్కన చేరి చూడాల్సిందే కాని ఆడేందుకు లేదు . పాపం వాడికి కూడా కొనీయరా బేటా అంటే వాడికి ఏట్ ఇయర్స్ రానీయమ్మా అంటాడు నా బేటా . వాళ్ళేమో చక్కగా బోలెడు గేంస్ కొనుక్కున్నారు . ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటారు . మాకేమో ఇంకా ఎయిట్ ఇయర్స్ రాకపోయే హూం !


మేఘా కి ఎంచక్కా ముందు రెండు పళ్ళూ వూడిపోయాయి . ఆ పళ్ళని దిండు కింద పెడితే పొద్దునకల్లా టూత్ పెయిరీ అవి తీసేసుకొని ఫైవ్ రూపీస్ పెట్టి పోయింది . ఆ రూపీస్ ని మాకు చూపిస్తూ , మేఘ తెగ ఫోజ్ కొట్టేస్తూ వుంటుంది . అనూ , పాపం గౌరవ్ కి కూడా ఓ ఫైవ్ రూపీస్ ఇవ్వచ్చుకదమ్మా , అని నేను సిఫారస్ చేస్తే , అవి నేనివ్వ లేదాంటీ , టూత్ పెయిరీ ఇచ్చింది . , వాడి కి పళ్ళూడినప్పుడు వాడికిస్తుంది , అంటుంది . అదేప్పుడమ్మా అంటే , వాడి కి ఎయిట్ ఇయర్స్ . . . సరె సరే , పళ్ళు రాలటానికి కూడా ఎయిట్ ఇయర్స్ హూం !


" జేయూ , చక్కగా బంధిపోటు వేషం వేసుకొని , ఫొటో తీసుకొని , ఎంచక్కా ఫేస్ బుక్ లో పెట్టుకున్నాడు , బామ్మా చూసావా ? "
" మరి నువ్వూ , నీ ఫేవరేట్ బెన్ టెన్ వేషం వేసుకొని ఫొటో పెట్టుకో ".
" నాకు ఫేస్ బుక్ ఎకౌంట్ లేదుగా బామ్మా ."
" ఎందుకులేదురా ? డాడీని అడుగుతావుండు . బిపూ "
" ఏంటమ్మా ? "
" గౌరవ్ కి ఫేస్ బుక్ ఎకౌంట్ లేదట , చేయొచ్చు కదరా ? వాడూ బెన్ టెన్ ఫొటోలు పెట్టుకుంటాడు. "
" బామ్మా , పెట్ సొసైటీ , ఫాం వెల్ కూడా ఆడుకోవచ్చు. "
"అవునురా మరి చేయొచ్చుకదరా ? "
" ఫేస్ బుక్ ఎకౌంట్ కావాలంటే , జి మెయిల్ ఎకౌంట్ వుండాలి . జి మెయిల్ కావాలంటే ఎయిట్ ఇయర్స్ "
"సరె సరే , ఇక్కడా ఎయిట్ ఇయర్స్ . . . హూం . . . . ."
" నీ ఫేస్ బుక్ ఎకౌంట్ లో ఆడుకోవచ్చా అడుగు బామ్మా "
" ఆడుకోరా "

వాడికి ఎయిట్ ఇయర్స్ వచ్చి , వాడి ఏకౌంట్ వచ్చేదాకా నాకు తిప్పలు తప్పవు. ఆ పెట్స్ పారిపోకుండా చూడాలి . ఫాం ఎండి పోకుండా చూడాలి . బాబ్బాబు , కాస్త అందరూ తలో చేయి వేయరూ ! ఏం లేదు , పెట్ సొసైటీ కి , అప్పుడప్పుడూ వెళ్ళి మా పెట్స్ పారిపోతే వెతికి తెచ్చిపెట్టండి .కాస్త వాటికి తిండి పెట్టండి ప్లీస్ . పెట్ సొసైటీ స్పెల్లింగ్ తెలీదా ? ఐతే " పి " క్లిక్ చేసి , కళ్ళు మూసుకొని " హామ్మ్ హీం " అని కళ్ళు తెరవండి , పి కింద పెట్సొసైటీ స్పెల్లింగ్ వచ్చేస్తుంది . దానిమీద క్లిక్ చేసేయండి .టట్ట టాయ్ పెట్ సొసైటీ ఓపెన్ అవుతుంది అంతే . అదే చేత్తో , మా ఫాం లో ట్రీస్ కి కాస్త ఫెర్టిలైజ్ చేసేయండి . వూరికెనే కాదులే మీకూ పాయింట్స్ వస్తాయి . ఫ్రెండ్స్ అన్నాక కాస్త చేదోడు , వాదోడుగా వుండాలికదా !

ఇంతేనా అంటే ఇంకా చాలా చాలా కష్టాలున్నాయి . ఈ లోపల ఇంకా కొత్తవి రానూ రావొచ్చు . ఎనిమిదేళ్ళు ఎప్పటికి వస్తాయో , కష్టాలు ఎప్పటికి తీరుతాయో !

Monday, December 7, 2009

రధచోదకుడు


రధచోదకుడు
మాలాకుమార్

మా వారికి , రాజమండ్రి లో వర్క్ వచ్చింది . ఎన్నాళ్ళో వేచిన ఉదయం అనుకుంటూ కోనసీమ అందాలు చూడబోతున్నానుకదా , అని మహదానందంగా , మావారి తో పాటు , నేను , చుటికి బయిలుదేరాము . మన వీలు ప్రకారము ప్రయాణము చేయవచ్చని , మావారు , కార్ లో వెళుతే మనకు కావలసిన చోట ఆపుకోవచ్చని నేను , చాలావరకు కార్లోనే వెళుతుంటాము. వర్క్ మొదలుపెట్టే హడావిడి లో మావారు , కొత్త డ్రైవర్ నరసింహ డ్రైవింగును , మద్య మధ్య లో స్లొరా నరసింహ , అంటున్నారే కాని ఎక్కువగా పట్టించుకోలేదు . రాజమండ్రి చేరగానే , సీతారామయ్యగారి మనవరాలు లోని ఇంటి లాంటి ఇల్లును ఊహించుకున్న నాకు , మా ఇల్లు చూసి నిరాశకలిగింది , కాని పోనీలే గోదావరి అందాలకు దగ్గరగా వున్నాను కదా అని సంతోషించాను .
మావారు పొద్దున్నే వర్క్ దగ్గరికి వెళ్ళిపోయారు . మద్యాహ్నము నరసింహ వచ్చి సార్ అక్కడికే కారియర్ తెమ్మన్నాడమ్మా అన్నాడు. మరి నువ్వు తిన్నావా అంటే లేదమ్మా అన్నాడు . సరే నువ్వు తినేసి సార్ కు తీసుకుపో అని వాడికి వడ్డించాను . తింటూ తింటూ బొట బొటా కన్నీళ్ళు కార్చటము మొదలెట్టాడు . నాకు గాభరా వేసి , ఏమైంది నరసింహ అంటే , “నువ్విట్లా అన్నం పెడుతుంటే మా అమ్మ యాదికొస్తోందమ్మా అని ఏడవటము మొదలు పెట్టాడు .
ఓరినీ దుంపతెగ , మీ అమ్మ యాదికొస్తే అన్నం ముందు ఆ ఏడుపేమిటిరా నాయనా , ముందా ఏడుపు ఆపు అన్నాను .
ఇప్పుడేనమ్మా నేను మా అమ్మని వదిలిరావుడు . హైదరాబాద్ లో అని కొలువులో చేరిన , సారేమో ఇంతదూరం తెచ్చిండు . అని కాసేపు భాధ పడి వెళ్ళాడు .

మా డ్రైవర్ నరసింహ 22 / 23 సంవత్సరాలవాడు . వాళ్ళ అమ్మా వాళ్ళూ కొత్తపేట లో వుంటారు . కొత్తగా పనిలో చేరాడు . చిన్నవాడు కాబట్టి నాతో చనువుగా మాట్లాడుతుండేవాడు . పైగా నన్ను చూస్తే వాడికి అమ్మ యాదికొస్తోంది . అంతవరకు బాగానే వుంది , కాని ప్రతిపూటా అన్నం ముందు ఏడుపే ! వాడి ఏడుపు చూసి నాకు గుండె దడ ! తిరిగెళ్ళేటప్పుడు , కొత్తపేటలో వాడి కి తెలిసిన సేటు దగ్గర కొంచం ధర తగ్గించి చీర ఇప్పిస్తానన్నాడు . దారిలో ఆలంపూర్ లో మహిమగల తల్లి వుంది చూపిస్తా నన్నాడు . వాళ్ళ వూరి కబురులన్నీ చెప్పేవాడు . ఇదేమిటో , ఎంతో ఊహించుకొని రాజమండ్రి వచ్చి , మావారేమో పనిలో, నేనేమో కొత్తపేట ముచ్చట్లలో బిజీ అయ్యాము , అనితెగ గింజుకున్నాను !
అలా అలా పదిహేను రోజులు గడిచాయి . ఈ లోపల ధవళేశ్వరం , కడియం , పట్టిసీమ వెళ్ళొచ్చాము . రోజూ సాయంకాలం గోదావరి వొడ్డున షికారుకెళ్ళే వాళ్ళము.అక్క్డ మల్లెపూల, కంకాంబరం దండలు పెద్దపెద్దవి చాలా చౌకగా దొరికేవి.కొనుక్కొచ్చి దేవుడికి, నాకు కాగా గుమ్మాలకు కూడా కట్టేదానిని. ఒక సాయంకాలము , రాజమండ్రి కి వెళ్ళివస్తుండగా , ఏమండి నాకు కొంచం హైదరాబాద్ వెళ్ళే పని వుంది , ఒకరోజు పనే , నువ్విక్కడ వుంటావా ? హైదరాబాద్ వస్తావా ? హైదరాబాద్ నుండి రాగానే చుట్టుపక్కల చూసొద్దాం అన్నారు . నేనిక్కడే వుంటే , ఆయన తిరిగి వస్తారు , నేనూ వెళితే మళ్ళీ వచ్చే అవకాశము తక్కువే అని నాలో నేను స్వగతం అనుకొని , “నేనిక్కడే వుంటాను లెండి , ఒక్కరోజే గా పరవాలేదు నరసింహ తోడుంటాడు లెండి . మీరింకెవరన్నా డ్రైవర్ ని తీసుకొని వెళ్ళండి అన్నాను . నామాట పూర్తికూడా కాకముందే , నరసింహ ," ఏందమ్మా ? ఈడకొచ్చినప్పటి సంది చూస్తున్నా , ఏదేదో చూడాలంటావు , వంటిమీద సోయిలేదు . ఇంటి ద్యాస లేదు , చిన్నోడు (మా మనవడు) గుబులు పడతాడని లేదు , ఇంకెన్నాళ్ళుంటవు ? " అని దులిపేసాడు . అంతే నేనుకాని , ఏమండీ కాని కిక్కురుమంటే ఒట్టు !
పెళ్ళికెళుతూ పిల్లిని చంకన పెట్టుకొని వచ్చినట్లు వీడిని తీసుకొచ్చినందుకు తిట్టుకుంటూ , నరసింహ గొడవ భరించలేక నేను కూడా హైదరాబాద్ ప్రయాణమైనాను ." నరసింహ స్లోరా " , " నరసింహ స్లోరా " ఏమండీ అంటున్నా బేఫికర్గా మమ్మలిని గాలిలో తేలియాడించాడు. పైగా ఏంది సారూ గా ఎడ్లబండిలా తోలమంటావా ? అని దబాయింపు ! అట్లాగే ఆలంపూర్ లొ మహిమగల తల్లి ని చూపించాడు .కొత్తపేట లో సేట్ దుకాణానికి తీసుకెళ్ళాడు . అయినా అదేమిటో  ఏమండీ వాడి స్పీడ్ భరించలేక,వాడిని దిగమని , వెనుక కూర్చోమని , ఆయన డ్రైవింగ్ తీసుకున్నారు . వెనుక సీట్లో ఒక్కడే కాలుమీద కాలేసుకొని , వెనుకవైపు రెండు చేతులూ బార్లాజాపుకొని దర్జాగా కూర్చొని ఏంది సారూ నువ్వేమన్నా చిన్నగా తోలుతున్నావా వెనుక కూర్చుంటే గట్లనే అనిపిస్తాది . అని నస మొదలు పెట్టాడు .
వరేయ్ ఇట్లా మాట్లాడవంటే నిన్ను దింపేస్తా , ఏ లారీ లోనో రా అని ఏమండీ,
ఏందీ నేను లారీలో రావాలా ? “
అని వాడూ , ఇదెక్కడి గొడవరా దేవుడా అని భయపడుతూ నేను , ముడుచుకొని కూర్చొని మా చుటికీ  ఎలాగో హైదరాబాద్ చేరాము !
ఆ తరువాత ఏమండీ నరసింహను పనిలోనుంచి తీసేసారు . ఒకరోజు నేను బడీచావిడి లో కూరలు కొంటుండగా అమ్మా , అమ్మా అని వినిపించింది . ఎవరా అని చూస్తే నరసింహ రోడ్ కడ్డంగా హడావిడిగా పరిగెత్తుకొస్తూ కనిపించాడు . ఒకరికొకరం కుశలం అడుగుకున్నాక , " అమ్మా , నేనేమి చేసినా ? సారు నన్ను ఎందుకు పనిలోనుండి తీసేసిండు ? నువ్వు సానా మంచిదానివి , సారుకు కోపం సానా ఎక్కువ . నువ్వు ఇన్నేళ్ళ సంది , సారుతో కాపురం ఎట్ల చేస్తున్నవో ? " అని జాలిగా నన్ను చూస్తూ వెళ్ళిపోయాడు ! ! ! ! !
అదేమిటో నాకు దొరికే పనివాళ్ళు (పనివాళ్ళు అనకూడదుట, హెల్పర్స్ అనాలిట మా మనవరాలు చెప్పింది) అందరూ ఇదో ఇలాంటివాళ్ళే దొరుకుతారు.
Saturday, December 5, 2009

చుటికి

కాంప్ లో ఏకుక్కకు పిల్లలు పుట్టినా , మా జయ అందులో ఒక దానిని ఇంటికి తెచ్చేసేది . ఆ కుక్క పిల్లేమో , జయ స్కూల్ కి వెళ్ళినప్పుడు , మా అమ్మ ఇంట్లో పని లో వున్నఫ్ఫు పారిపోయేది . జయ ఇంటికి రాగానే , దాని కోసం వెతుక్కొని , కనిపించక , అమ్మనే దాన్ని వెళ్ళగొట్టిందేమో నని , ఏడిచి , ఉపవాసాలుండి , మళ్ళీ ఇంకో కుక్కపిల్ల దొరికేదాక , గొడవలే ! నాకేమో ఆ కుక్కపిల్లలంటే చాలా భయం . నా యస్. యస్. సి ఎక్షాంస్ అయిపోయాక , ఒక రోజు , మేము బయటపడుకున్నప్పుడు , నా ఖర్మకాలి , మా జయ , కుక్కపిల్లొకటి నా కాలు గీరింది .( అది నా కుక్కపిల్ల కాదు , ఇంకేదో , నా పప్పీ అలా చేయదు అని జయ తిరగబడిందను కోండి , అది వేరే విషయము ) . ఇహ అప్పటినుండి నా కష్టాలు మొదలయ్యాయి . రోజూ డాం కి వెళ్ళటము , బొడ్డుచుట్టూ ఇంజెక్షన్ తీయించుకోవటమూ . ఎండాకాలం సెలవలు కావటము తో చాలా మంది పిల్లలు కుక్కలతో కరిపించుకోవటము తో , ఆ ఇంజెక్షన్లు అయిపోయేవి . అవి వచ్చాయా అని తిరగటము , రాగానే , ఓనాలుగు తీయగానే మళ్ళీ అయిపోయేవి . అదేమిటో , మద్యలో ఆపుతే మళ్ళీ ముందునుండి తీసుకోవాలట . అలా డాం లోని , కమలానెహ్రూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూవుండగానే మా రిజల్ట్స్ రావటము , మా క్లాస్మేట్స్ అందరూ , పి.యు . సి లో చేరటము కూడా ఐపోయింది . నా రిజల్ట్సేమో , నాకు ఏజ్ తక్కువగావుందని విత్ హెల్డ్ లో పెట్టేసారు . దాని తో మా నాన్నగారు , నా రిజల్ట్స్ కోసం నల్లగొండ , హైదరాబాద్ చుట్టూ తిరగటము మొదలు పెట్టారు . ఆయన అటు , నేను ఇటు ప్రధక్షణలు చేసి , ఆయన , నారిజల్ట్స్ తేవటమూ , నా ఇంజెక్షన్స్ పూర్తికావటమూ జరిగింది . ఈలోపల తెలిసినవాళ్ళు నువ్వు ఫేల్ అయ్యావా అని అడగటము , ఎందుకు లెండి అవన్నీ ! సరే , ఈ లోపల అన్ని కాలేజీలలో సీట్లై పోయి ,మాథ్స్ తో పి. యు . సి చేద్దామనుకున్నదానిని , చివరకు దొరికిన హిస్టరీ , డ్రాయింగ్ లో చేరటము జరిగింది ! ఇదో ఈ నేపద్యము లో నాకు కుక్కలంటే ఇంకా ఎక్కువ భయం ఏర్పడింది . ఇక జన్మ లో కుక్క మొహం కూడా చూడకూడని భీకర ప్రతిజ్ణ చేసుకున్నాను .

కానీ , విధి బలీయమైనది . తానొకటి తలుస్తే దైవమొకటి తలుస్తాడు - ఇంకా ఇలాంటివి ఏమైనా వుంటే అనేసుకోండి . మా అబ్బాయికి , వాళ్ళ జయపిన్ని పోలికొచ్చి , కుక్క పిల్లలంటే తెగ ఇష్టం ఏర్పడింది . ఇక వాడు మొదలుపెట్టాడు , పప్పీని పెంచుకుందామని . ఏదో చిన్నోడు కాబట్టి ఎలాగో మరిపించేదానిని . కాని పిల్లి పిల్లలని తెచ్చి తెగ చాకిరీ చేసేవాడు . నా అదృష్టము కొద్దీ అవి పారిపోతూవుండేవి . ఆ అదృష్టము ఓ రోజు మొహం చాటేసింది . ఆ సంగతి తెలీని నేను హాయిగా , మంచము మీద పడుకొని , నవల చదువుకుంటుండగా , అమ్మా ఆ ఆ అంటూ గావుకేక పెట్టుకుంటూ వచ్చాడు . ఏం ప్రమాదమొచ్చిందో నని నేను హడలిపోతూ లేచి కూర్చున్నాను . నిజంగా ప్రమాదమే ! మా భరత్ ఇంట్లో కుక్కకు , పిల్లలు పుట్టాయి , ఇదిగో ఒకటి తెచ్చాను అంటూ . షర్ట్ జేబులోనుండి ఒక చిన్న ఎగ్ తీసి కిందపెట్టాడు . పోరా ఇది కుక్కపిల్లేమిటి ? అనగానే దానిని చేతిలోకి తీసుకొని , నా దగ్గరగా తెచ్చి చూపించాడు . నిజమేనంటూ , దాని మిరియాలలాంటి కళ్ళని చిన్నగా కదిలించింది అది . కాస్త తమాయించుకొని , పాపం అది వాళ్ళమ్మ దగ్గర పాలు తాగుతుందేమోరా , ఇంత చిన్న దానిని తీసుకొచ్చావు అని , మదర్ సెంట్ కొట్టాను . . కదా , కొంచము పెద్దవగానే తెస్తానులే అని , ఓ పదిహేను రోజుల తరువాత తీసుకొచ్చాడు . ఈసారి ఏమీ అనలేక పోయాను . సరే కాని , దానికి చాకిరి మటుకు నేను చేయనన్నాను . నువ్వు ఒప్పుకున్నావు , చాలు , నేనే చూసుకుంటాను లే అన్నాడు . అలా 15-1-1993 న వచ్చింది , మా చుటికి మా ఇంటికి .చిన్నగా ముద్దుగా వుందని దానికి చుటికి అనే పేరు మా అమ్మాయే పెట్టింది . కాకపోతే , మా అమ్మాయికి నా పోలిక , తనకూ కుక్కలంటే భయమే !


అలా ముద్దుముద్దుగా , వచ్చిన చుటికి మా కుటుంబము లో ఒకతై పోయింది . అదేమిటో నేనెంత దూరముగా వుంచినా , అమాయకముగా చూసుకుంటూ నాదగ్గరకే వచ్చేది . నా వెనుకెనుకే తిరుగుతూవుండేది . మా అబ్బాయి యు .యస్ వెళ్ళినఫ్ఫుడు ,దానిని చైల్డ్ సెంట్ కొట్టి నాకొప్పచెప్పి వెళ్ళాడు . నేనెక్కడ కూర్చుంటే అక్కడికే వచ్చేసేది . మా మామగారు దానిని నా ఎస్కార్ట్ అనేవారు . తరువాత తరువాత నాకెంత ప్రాణమైపోయిందంటే చెప్పలేను . మావారి తో పాటు నేను కూడా వూరెళ్ళాలంటే చుటికి కోసం ,నైట్ బస్ లో వెళ్ళేవాళ్ళము . దానికెంత గ్రహింపు అంటే , బస్ లోకి ఎవరైనా ఇన్స్పెక్షన్ కి వస్తే నా కుచ్చిళ్ళకింద , కాళ్ళదగ్గర దాక్కునేది . అసలు దాని తెలివితేటలు చూస్తే చాలా ఆశ్చర్యం గా వుండేది . చెప్పాలంటే చాలావున్నాయి దాని ముద్దు , ముచ్చట్లు . 14 సంవత్సరాలు వుండి వెళ్ళిపోయింది . అది వెళ్ళిపోయి నాలుగేళ్ళు అవుతున్నా దానిని మరిచిపోలేకుండా వున్నాను . ఎక్కడైనా తెల్ల బొచ్చుకుక్కపిల్ల కనిపిస్తే నా కాళ్ళు ఆగిపోతాయి .


మళ్ళీ ఇంకోటి తెచ్చుకుందామని , మా అబ్బాయి , పిల్లలతో అడిగిస్తున్నాడు . నేను ససేమిరా అంటున్నాను . కాని విధి చేతిలో కీలుబొమ్మను ., విధి విలాసం. . . . . . . . . . .
తానొకటి తలుస్తే దైవమొకటి . . . . . . . . . . . . . .
వగైరా , వగైరా . . . ఎందుకంటే మొన్న మాఇంటిని దొంగోడు విజిట్ చేసి వెళ్ళినప్పటి నుండి వాచ్ డాగ్ ను తెద్దామా అని ఆలోచిస్తున్నారు . హూం .

Thursday, December 3, 2009

కుంకుమ తిలకం

హిందూ సాంప్రదాయము లో పసుపు , కుంకుమకు ముఖ్యపాత్రనే వుంది . ఏ శుభకార్యము తలపెట్టినా , ముందుగా పసుపు ,కుంకుమ లనే కొంటారు . ఆ తరువాతనే ఏమి కొన్ననూ . అమ్మవారికి , కుంకుమపూజ చేస్తే చాలామంచిది అని , పర్వదినాలలో తప్పక చేస్తారు . కుంకుమను , సుమంగళీ చిహ్నముగా భావిస్తారు .

మా అమ్మ కుంకుమను ఇంట్లోనే తయారు చేసేది . ప్రతిరోజూ అమ్మవారికి , ఆ కుంకుమ తోనే పూజ చేసి , ఆ పూజా కుంకుమను , ముతైదువులకు పంచేది . మా బంధువులు , మితృలు అందరూ కావాలని అడిగి తీసుకునేవారు . ఈ పోస్ట్ ఆ కుంకుమ తయారి గురించి .

కావలిసిన సామానులు :
10 కిలోలు , పసుపుకొమ్మలు ,
1 కిలో పటిక ,
1 కిలో ఎలిగారం ,
400 నిమ్మకాయలు ,
1/2 కిలో నువ్వుల నూనె .
ముందుగా నిమ్మకాయలను రసము తీసుకొని , ప్లాస్టిక్ బకెట్ లో పోసుకోవాలి . పటిక , ఎలిగారం ను కచ్చా పచ్చాగా దంచి , ఆ రసములో ,కరిగి పోయేటట్లుగా కలపాలి . తరువాత పసుపు కొమ్ములు వేసి బాగాకలిపి ఒక రోజు వుంచాలి . మరునాడు వాటిని , ఇంకో ప్లాస్టిక్ బకెట్లోకి పూర్తిగా వంచేయాలి . ఆ విధముగా , నిమ్మరసము , పసుపు కొమ్ములకు పూర్తిగా పట్టేవరకు ,ప్రతిరోజూ ఒక బకెట్ లో నుండి , ఇంకో బకెట్ లో కి గుమ్మరించాలి .. ఇలా మార్చటము వలన పసుపు కొమ్ములకు నిమ్మరసము చక్కగా అంటుతుందన్నమాట. పసుపుకొమ్ములకు నిమ్మరసము పూర్తిగా పట్టిన తరువాత , అంటే ,ఈ సారి బకెట్ వంచుతే ,ఒక్క చుక్క కూడ నిమ్మరసము , పడకూడదన్నమాట , ఎవరూ తిరగని చోట , దుమ్మూ ధూళీ పడని చోట , నీడలో నేల శుభ్రముగా తుడిచి , చాప వేసి , దానిమీద , శుబ్రమైన బట్టను పరిచి , ఈ పసుపు కొమ్ములను ఎండపెట్టాలి . నీడలోనే సుమా ! అవి పూర్తిగా ఎండిన తరువాత , రోటిలో వేసి దంచాలి . ఆ పొడిని , తెల్లటి , పలచటి బట్టలో వేసి , జల్లించాలి . తరువాత ఆ పొడిలో కొద్ది కొద్దిగా నూనె వేస్తూ కలపాలి . నూనె తో కలపటము వలన , కుంకుమ నుదుటి మీద నిలుస్తుంది . లేకపోతే పెట్టుకోగానే రాలిపోతుంది . సరిపడా నూనె కలిపాక , సువాసన కొరకు ,కొద్దిగా రోజ్ వాటర్ కాని , ఉడుకులోన్ కాని కలపాలి . ఈ కుంకుమ మంచి ఎరుపురంగు లో వుంటుంది . ( సింధూరం రంగు కాదు , ఎరుపు ) .

ఈ కొలతలు మా అమ్మ చేసుకున్నవి . ఎవరైనా ప్రయత్నము చేయాలంటే 100 గ్రాముల పసుపు కొమ్ములతో , మిగితావి ఆ కొలతకు సరిపడా తీసుకొని చేసుకోవచ్చు. పటిక , ఎలిగారము , కిరాణాదుకాణాలలో దొరుకుతాయి . చక్కని సువాసన తో ఈ కుంకుమ చాలా బాగుంటుంది .

పసుపు కొమ్ములలో , కుంకుమ రాళ్ళు వేసి , దంచి , తెల్లనిబట్టతో జల్లించి , నూనె కలుపుకొని , తోపురంగు కుంకుమ ( మెరూన్ కలర్ ) తయారు చేసుకోవచ్చు . కుంకుమరాళ్ళు , పటికలాగా వుంటాయి . తొందరగానే నలుగుతాయి .కుంకుమ రాళ్ళు కూడా కిరాణా దుకాణాలలో దొరుకుతాయి . బజారులో దొరికే కుంకుమ ఇదే .

నేను కైలాసగౌరి నోము చేసుకున్నప్పుడు , మా వియ్యపురాలు ,( మా కోడలు అమ్మగారు ), కృష్ణవేణి గారు , విజయనగరకాలనీలో ఒక ముసలావిడ దగ్గర , కుంకుమ కొట్టించారు . అయితే అప్పుడు , మేము పసుపు కొమ్ములను , నిమ్మరసములో నాన వేయలేదు . పటిక , ఎలిగారము వేసాము . ఆ ముసలావిడ పసుపు కొమ్ములను కొట్టేటప్పుడే , కొద్ది కొద్దిగా ,దాదాపు పది నిమ్మకాయల రసమును పిండింది . పొడిని , తెల్లబట్ట తో జల్లించి , నువ్వుల నూనెను కలిపింది . తరువాత ఇంటికి తెచ్చాక , నేను కొద్దిగా రోజ్ వాటర్ ను కలుపుకున్నాను . ఈ కుంకుమ , ఎరుపు రంగులో కాకుండా , బజారులో దోరికే రంగులో కాకుండా మధ్యస్తము గా బాగుంది . బజారు కుంకుమ కొంచము ముదురు మెరూన్ కలర్ లో వుండి , కొంచము నలుపు రంగులో కనిపిస్తుంది .

ఓపిక , టైము వుంటే కుంకుమను తయారుచేసుకొని చూడండి . ఎంతైనా మనము సొంతముగా తయారు చేసుకున్న ఆనందమే వేరుకదా !

Tuesday, December 1, 2009

ఆవాహన

" అవాహన " సంపాదించగానే ముందుగా చేసిన పని ఆ రాత్రే చదివేయటము . పుస్తకము ఇచ్చేటప్పుడే , ప్రొఫెసర్ . ముదిగొండ శివప్రసాద్ గారు చెప్పారు , మీ అభిప్రాయం చెప్పండి , తారువాతి ముద్రణలో , పాఠకుల అభిప్రాయం కూడా వేస్తాను అని . ఇంత మంచి నవల నేనొక్కదానినే చదవటమెందుకు ? అందరికీ పరిచయము చేస్తే బాగుంటుంది కదా అనుకున్నాను . అప్పుడు నాకు గుర్తొచ్చింది పుస్తకం సైట్ . " బ్లాగుల్లో పెట్టే టపాలనే ఇక్కడ పెడితే , ఎక్కువ రోజులు చాలామంది కి చేరే అవకాశము వుంటుంది " అన్న పుస్తకం వారి ఆలోచన , వెంటనే ఈ ఆవాహన పరిచయం పుస్తకం వారికి పంపాను . ఇక అప్పటి నుండి ఒకటే టెన్షన్ ! వారు వేసుకుంటారా లేదా ? నా బ్లాగ్ లోనే రాయాల్సిందే అని . మీ అర్టికల్ ప్రచురిస్తున్నాము అని మేల్ రాగానే వావ్ అనుకున్నాను .

ప్రచురించిన పుస్తకం సైట్ వారికి , నన్ను వ్రాయమని ప్రోత్సహించిన జ్యోతిగారికి ధన్యవాదాలు .

ఆవాహన ప్రతి కాని , ముదిగొండ శివప్రసాద్ గారు రచించిన ఇతర పుస్తకాలు కాని కావాలంటే , రచయత నే నేరుగా సంప్రదించ వచ్చు .
వారి అడ్రస్ ;
ప్రొఫెసర్. ముదిగొండ శివప్రసాద్ ,
2- 2 - 647 / 132 - బి , సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ ,
హైదరాబాద్ - 500013 .
ఫోన్ ; 27425668 .

Monday, November 30, 2009

వేంటాడే దొంగ గారు వచ్చారహో !

నేను దీర్ఘంగా ఆలోచిస్తుండగా ( ఇంటి పై కప్పు దేని తో వేయాలా అని కాదు , వెలగకాయ , స్లైడ్ షొ ఎలాచేయాలా అని ) , టింగ్ మంది . ఎవరా ? అని చూస్తే , జ్యోతి , మీకు ఆంద్రజ్యొతి చానల్ వస్తుందా అని అడుగుతున్నారు . చూస్తానుండండి , అని చూసి , ఆ వస్తోంది ఏమిటి విశేషం అని అడిగాను . . రేపు మద్యాహనము 1 .30 కి నా ప్రోగ్రాం వస్తుంది , వీడియో తీసిపెడతారా ? అన్నారు , అయ్యో మద్యాహ్నం నేను ఉండనే , ఇంకేటైం లోనూ రాదా అని అడిగా . వస్తుంది , రాత్రి 12.30 కి అన్నారు . సరే అయితే తీసేస్తాను ఎలా తీయాలో చెప్పండి అన్నా . సెల్ తో ఎలా తీయాలో చెప్పారు . మా అబ్బాయి రాగానే , మావారి సెల్ తో ఎలా తీయాలో నేర్చుకొని , కొంచం ప్రాక్టీస్ కూడా చేసేసాను .

స్వగతం ;

నా సెల్ ఎంత బాగుంది . చక్కగా ప్లాటినం రంగులో మెరిసి పోతూ , చేతిలో ఇమిడిపోయీ బుజ్జి కన్న ఎంత ముద్దొస్తుందో . మీ సెల్ చూడండి , ఎర్రగా నల్లగా రౌడీస్ లా వుంది . మీలాగే మీ సెల్ కూడా డిగ్నిఫైడ్ గా వుండాలా వద్దా ? ఆ రౌడీస్ ని నాకిచ్చేయండి . అని ఎంత అడిగినా , నేను రౌడీస్ , నా సెల్ రౌడీస్ నేనివ్వను పో అనేస్తారు మా శ్రీవారు . నా సెల్ తో ఫొటొస్ తీయలేనండి , ప్లీస్ ఇవ్వరూ అని ఎంత బతిమిలాడినా ససేమిరా అనేసారు . ఏం చేస్తాను ? ఆయన ఇంట్లో వున్నప్పుడే ఫొటోస్ తీసుకుంటూ తంటాలు పడుతున్నాను . దేవుడా , దేవుడా ఈ రెండు రోజులూ ఆయనను ఏ కాంప్ కి వెళ్ళకుండా చూడు . అవునూ నేను గురూజీ ప్రోగ్రాం వీడియో నా బ్లాగ్లో "గురుధక్షిణ " అని టైటిల్ పెట్టి , పోస్ట్ చేస్తే ! వావ్ , వాటే గ్రేట్ ఐడియా !

స్వగతం ఐపోయింది :

ఇహ నిద్ర పడితే ఒట్టు ! ఎలా రాయాలి ? , గురూజీకి కోపం రాకుండా , మొట్టికాయలు వేయకుండా , మెచ్చుకునేట్లుగా రాయాలి . అదిరిపోవాలి . రకరకాల భావాలు . మళ్ళీ మర్చి పోకుండా రాసేసుకుంటే ! లేచి టైం చూస్తే , 1.30 అయ్యింది . ఇప్పుడు లాప్ టాప్ తీసానంటే , మొన్ననే ఆయనగారు కోపం చేసారు , అర్ధరాత్రి , అపరాత్రి లేకుండా ఎప్పుడూ ఆ బ్లాగ్ ల లోకమే . ఇలా అర్దరాత్రి లాప్ టాప్ తీసావంటే దాన్ని అవతల పారేస్తా అని వార్నింగ్ ఇచ్చారు , ఇప్పుడు తీసానంటే అన్నంత పని చేస్తారు . మొదటికే మోసం వస్తుంది అని పరి పరి విధాల ఆలోచిస్తూ , ఎప్పుడు నిద్ర పోయానో తెలీదు .

సెల్ రింగవుతుంటే ఏమండీ లేచి చూస్తుంటే,అప్పుడే తెల్లారి పోయిందా ? సావిత్రి వచ్చేసిందా అనుకుకొని సావిత్రి వచ్చిందేమో తలుపు తీయండి అన్నాను.కాదు శ్రీధర్ ఫోన్ చేసి సార్ మా రూం తలుపు బయట నుంచి వేసి ఉంది అన్నాడు.గబగబా కింది కి వెళ్ళి చూసాము.వాళ్ళ రూం తలుపు వేసి ఉంది.ఆఫీస్ రూం తలుపు తీసి ఉంది.కింద ఏమండీ గారి జర్కిన్, బ్రీఫ్ కేస్ పడి ఉన్నాయి. ముందు అర్ధం కాలేదు కాని తరువాత తెలిసింది ఎన్నేళ్ళుగానో , తరతరాలు గా ఎదురుచూస్తున్న దొంగగారొచ్చారు.కాని పాపం పిచ్చి సన్నాసి ఏమీ దొరకక, ఆఫీస్ లో ఉన్న 10000 రూపాయాలు, ఏమండీగారి సెల్ ఎత్తుకుపోయాడు.ఆ. . . . . సెల్. . . . .

ఆక్రోశం ;

ఓరోరి దొంగ వెధవా ! నేను 1.30 దాకా మెలుకువ తోనే వున్నాను గదరా ? ఎప్పుడొచ్చావురా ? వచ్చేవాడివి ముందు చెప్పిరావద్దూ ? ఎన్నేళ్ళనుండి నీ కోసం ఎదురుచూస్తున్నాము . మూడు తరాలవాళ్ళు నిన్ను పిలుస్తున్నారే , ఆమాత్రం మర్యాద వుండక్కరలేదా ? ముందుగా తెలుస్తే నీకు మంగళహారతి తో స్వాగతం చెప్పేదానినే ! పోనీ వచ్చావే పో మా ఆయన సెల్ ఎత్తుకుపోవటమేమిటిరా ? పింజారీవెధవ . బాల్కనీ దూకి వెళ్ళేటప్పుడైనా , ఆయన జాకెట్ , బ్రీఫ్ కేస్ తో పాటు సెల్ కూడా జారవిడుస్తే బాగుండేది కదరా వెధవన్నర వెధవ . అసలు నన్నడుగుతే , బాబ్బాబు ఆ సెల్ వద్దురా , నా సెల్ తీసుకు పోరా అని ఇచ్చేదానిని కదరా కంత్రీ వెధవ . నీ ఫోటో కూడా బ్రహ్మానందం ఫోజు లో తీసి , ఈ నెట్ ఫోటో బదులు నీ ఫొటో నే పెట్టేదానిని కదరా తింగరి వెధవా . నా కలలన్ని కల్లలు చేసావు కదరా కంగిరి వెధవా . నీకేంపోయే కాలమొచ్చిందిరా ? నీ చేతులిరగ , నీ కాళ్ళిరగ . . . . . . . . . .వెధవన్నర వెధవ . . . . . . . .

మా ఆయన ఆయన సెల్లూ నాకియ్యక పాయే . ఈ దొంగోడేమో ,ఆఫీస్ అల్మారాలోని 10000 ల రూపాయలు చాలవనట్లు సెల్లు ఎత్తుకుపోయే ! నేనేమి చేతును ?


దేవుడా దేవుడా , పొలీసాయన చెప్పాడు , సెల్ దొరికే చాన్స్ వుందని . దొరికేట్లు చేయి దేవుడా . నా సెల్ తో మా ఆయన సెట్టిల్ అయి పోకుండా , కనీసం కొత్త సెల్ కొనేట్లైనా చేయి , దేవుడా దేవుడా !

Sunday, November 29, 2009

అబ్బబ్బ పులుపు


ఈ చెట్టేమిటో , దానికి వున్న బంతులాంటి కాయలేమిటో , గిర్రున తిరుగుతూ వూరిస్తున్నాయే , అని ఎవరూ సోచాయింపులో పడివుండరు . ఎందుకంటే చిన్నప్పుడు , ఇంటర్వెల్ బెల్ కొట్టగానే , స్కూల్ గేట్ దగ్గరికి పరుగులు పెట్టి , బండి మీది , వీటిని కొని , తింటూ , స్స్ , హా ఏం పులుపు అని , ఇలా గింగిరాలు కొట్టని వాళ్ళు మాకాలములోనైతే అరుదు . ఆ పులుపును తట్టుకోవటానికి , బండి తాత , కాస్త పంచాదార నో , ఉప్పో చల్లేవాడు కదూ ! గుర్తొచ్చాయా ? అవేనండి బాబు , వెలగకాయలు . చిన్నప్పుడు గుజ్జు అలా అలా తినేసేదానినే కాని , పెద్దయ్యాక , తినలేక , ఆబ్బబ్బ ఏం పులుపు అనుకుంటూ , ఎంచక్కా పచ్చడి చేసుకొని తినేస్తున్నా ! వేడి అన్నములో , నెయ్యేసుకొని కలుపుకొని తింటే అహా ఏమి రుచి అనుకొకుండా వుండ లేరు .

ఈ రోజు పోస్ట్ , ఆ పచ్చడి గురించే . వచ్చిన వాళ్ళకు చెప్పే పని లేదు . రాని వాళ్ళు నేర్చుకోండి . ఇదే కాకుండా , వెలగపండు తో ఇంకేమైనా చేయటము వచ్చినవాళ్ళు , రసిపీలు ఇటు ఇవ్వండి . నాకు చాలా అవసరము . ఎందుకంటే , మా అమ్మాయి వాళ్ళింట్లో బోలెడు కాస్తున్నాయి . ఎప్పుడూ ఒకటే పచ్చడి బోర్ కదా ! మీ పేరు చెప్పుకొని చేసుకొంటాను .

వెలగపండు గుజ్జు ,

పచ్చిమిరపకాయలు ( మీ ఇష్టమైనన్ని ) ,

కొతిమీర , ఒక కట్ట ,

పోపుకు ;

ఎండుమిరాకాయ ముక్కలు ఓ నాలుగు ,

సెనగపప్పు ఒక చెంచాడు .

మినప పప్పు ఒక చెంచాడు ,

ఆవాలు ,

జీలకర్ర ,

ఇంగువ ,

కాసిని మెంతులు ,

పల్లీ నూనె ,

నాలుగైదు చెంచాల పంచదార , కాయ పులుపును బట్టి , లేదా సరిపడా బెల్లమైన పరవాలేదు .

కాచి చల్లార్చిన నీళ్ళు .

ముందుగా వెలగపండుకు గుజ్జుకు సరిపడ నూనె , ( మూడు , నాలుగు చెంచాలు ) వేడి చేసుకోవాలి . అందులో కొన్ని మెంతులు వేసి , ఎరుపు రంగు వచ్చేదాక వేయించాలి . తరువాత ,ఎండు మిరపకాయలు వేయాలి . అవి కొంచం వేగాక , మిగితా పోపుసామునులు వేసి , వేగాక దింపేముందు ఇంగువ వేయాలి . ఆ పోపుకు పచ్చిమిరపకాయలు , కొతిమీర కలిపి , నూరుకోవాలి . ఆ పై వెలగపండు గుజ్జును వేసి , గట్టిగా వుంటే , కాచి చల్లార్చుకున్న నీటిని కొద్దిగా కలిపి నూరుకోవాలి . చివరగా పంచదార కాని , బెల్లము కాని వేసుకొని కలిపేయాలి . అంతే , పచ్చడి సిద్దం !

Saturday, November 28, 2009

ఈ రోజు ఏమీ కొనకూడదుట !

సావిత్రి గారూ ,

పిలిచారాండీ .

అవునండి , పిల్లలు పకోడీ లు చేయమంటున్నారు . కాసిని చేయండి .

పకోడిలాండీ ?

అవునండి .

ఉల్లిపాయ ఒకటే వుందండి . సూపర్ మార్కెట్ నుండి తేనాండీ ?

వద్దులెండి . ఆలుగడ్డ బజ్జీలు చేయండి .

బజ్జీలాండీ ?

అవునండి .

ఆలుగడ్డలై పోయాయికదండి .

అదేమిటి ? మొన్ననే రెండు కిలోలు తెచ్చాము కదండి .

మరి వేయించేసాను కదండీ . సూపర్ మార్కెట్ నుండి తేనాండీ ?

పోనీ బ్రెడ్ లేదా ?

రెండురోజులైంది కదండీ . . పాడైపోయింది . సూపర్ మార్కెట్ నుండి తేనాండీ ?

అమ్మా . . .

ఏమిటిరా ?

అవేమి వద్దుకాని , కొంచం చింతకాయ పచ్చడి పోపేయమను , అన్నం తినేస్తాను .

విన్నారుగదండి .

చింతకాయ పచ్చడి పోపాండీ ?

అవునండి .

అయితే పల్లీ నూనే తెచ్చుకోవాలండి . సూపర్ మార్కెట్ నుండి తెచ్చేదాండీ ?

అబ్బా సావిత్రి గారూ ,ఎంత తెచ్చినా , ప్రతిరోజూ , సూపర్ మార్కెట్ లో వో కాలు వంటింట్లో ఓకాలు పెడుతారు . ఈ రోజు ఏమీ కొనకూడని రోజుట . పొద్దున పేపర్ లో చదివాను . ప్రపంచమంతా పాటిస్తారుట . కనీసం ఈ వొక్క రోజైనా సూపర్ మార్కెట్ కి వెళ్ళకుండా వుండండి .

అలాగాండీ ? మరైతే ఇప్పుడేం చేయమంటారు ?

మీరు బజారు కెళ్ళకుండా వుండండి , అంతే చాలు . కాసిని ఉసిరికాయలు కోసుకురండి . ఏదైనా చేద్దాము .

ఉసిరికాయలాండీ ?

అవునండి , వాటికేమొచ్చింది ?

ఆ గుంట వెధవలు కోసుకెళ్ళారుగండీ ?

ఏ గుంటవెధవలండీ బాబు ?

ఏమో నండీ , నేనక్కడ కూచొని బాబాగారి పుస్తకం చదువుకుంటున్నానండీ , ఇద్దరు గుంట వెధవలు గోడ దూకి వచ్చి ఉసిరికాయలు కోసుకున్నారండీ .

మీరు చూస్తూవూరుకున్నారా ?

ఎందుకూరుకుంటానండీ ? అరిచి వెళ్ళగొట్టానుగదండీ ?

మరైతే ఉసిరికాయలు ఏమైనాయండి ?

ఆఫీస్ గుంటలు కోసుకున్నారు కదండీ ?

మరి పొద్దున కొన్ని గుత్తులు చూసిన గుర్తే ?

అవాండీ ? అవి పని గుంటలు కోసుకున్నారండీ . మరిప్పుడే చేయమంటారండీ ?

మనకు కొనే రోజులు , కొనగూడని రోజులు , ఇంట్లోవి , ఏవీ కుదరవుకానీండి , ఇదో పైసలు , ఏదో కొనుక్కొచ్చి , మీ ఇష్టమైంది చేయండి ఒక్క రోజైనా మీరెళ్ళక పోతే ఆ సూపర్ మార్కెట్ వాడు దివాలా తీస్తాడు . వెళ్ళండి ఇక నాబుర్ర తినకండి ! ! ! !
సరేనండి !

Thursday, November 26, 2009

రామయ్య ( ఎవ్వరి మాట వినడు - ఎవ్వరికీ భయపడడు )

ఎదురింటి గోపాలరావు గారింట్లో పని చేసేవాడు , అయన వద్దని పంపించేసారు , మనింట్లో వుండమని పిలిచాను అంటూ మా వారు రామయ్యను , మా మామగారికి పరిచయము చేయగానే , ఆయన , ఈ ముసలోడేం పని చేస్తాడురా ? నెలకు 50 రూపాయలు దండగ , ఏం వద్దు పంపించేయ్ అన్నారు . కాని మా వారు వినలే , నేనిస్తానులే , కాస్త అన్నం పెట్టి , 50 రుపాయలిస్తె , ఇంటికి కాపలాగా మెట్లకింద వుంటాడు అని వాదించారు . పెద్దోడు చెపుతున్నాడు వుండనీయ రాదయ్యా అంటూ మా అత్తగారి సపోర్ట్ తో మా ఇంట్లో చేరాడు రామయ్య . ఇక అప్పటి నుండి ఇంటికే కాదు , ఇంటి మనుషులకు కూడా కాపలాదారైనాడు .

మా మామిడిచెట్టు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు సంవత్సరానికి ఒకటో , రెండో కాయలు కాసేది కాని , ఆకులు మాత్రము చెట్టునిండా ,గుబురుగా నవనవ లాడుతూ వుండేవి . మా వీధి లో పండగలకి , పబ్బాలకి మామిడాకులు , కొబ్బరాకులూ మా ఇంటినుండి తీసుకెళ్ళేవారు . మా రామయ్య వచ్చాక అదంతా బంద్ ! అరిచిఘీ పెట్టినా ఒక్కటంటే ఒక్క ఆకు కూడా ఇచ్చేవాడు కాదు .మా మామగారరిచినా , నీమ్మకు నీరెత్తినట్లు , దున్నపోతుమీద వానజల్లు పడ్డట్టు వుండేవాడు !

బయటి వాళ్ళకు సరే , ఇంట్లో వాళ్ళకు కూడా , ఏ ఆకు , పూవు ఏది ముట్టుకోవటానికి వీలులేదు . రామయ్య ఇస్తేనే , కొబ్బరికాయైనా , నిమ్మకాయైనా , పూవైనా చివరికి కరివేపాకైనా ! ఇంతకు ముందు ఇంటికెవరైనా వస్తే , వారికి బొట్టుపెట్టి , కొబ్బరికాయ ఇచ్చేవారు , మా అత్తగారు . రామయ్య హయాం వచ్చాక , రామయ్యకు , వచ్చినవారి ముఖారవిందం నచ్చి ఇస్తేనే ఇవ్వటము అలవాటు చేసుకున్నారు ఆవిడ . మా ఆడపడుచులు వచ్చినప్పుడు , రామయ్యా , ఆడపిల్లగాళ్ళు వచ్చారు , కొబ్బరికాయలు తే అని , మా అత్తగారు ఎంత పిలిచినా వినిపించుకునేవాడు కాదు . అన్ని స్టోర్ రూం లో ఎక్కడో దాచేసేవాడు . తనకు ,సబ్బు పైసలు అవసరమైనప్పుడు మాత్రము ,ఓ రెండు కొబ్బరికాయలు , ఓ రెండు నిమ్మకాయలు , కాస్త కరివేపాకు , సంచీ లో వేసుకెళ్ళి , వాళ్ళకిచ్చి , రెండు రూపాయలు తెచ్చుకునేవాడు ! మాకవసరమై ఎంత అడిగినా నిమ్మకు . . . . . దున్నపోతు . . . . . . . . రామయ్య దయ , మా ప్రాప్తం ! బయట అమ్ముకునేవాడా అంటే అదేం లేదు . తన ఇష్టప్రకారము మా కిచ్చేవాడన్నమాట .


పొద్దున లేచినప్పటినుండి , మా మామగారికి , రామయ్యకు ఏదోవక దాని మీద గొడవలే ! ఇద్దరూ మీద పడి కొట్టుకుంటారా అన్నట్లుండేవి . అలా ఇద్దరూ కాసేపు అరుచుకొని , బజారుకు బయిలుదేరేవారు . రామయ్య ఒక సంచీ పట్టుకొని , రామ భక్త హనుమాన్ లా ఆయన వెనుక వెళ్ళే వాడు . ఎంతైనా ఆయనకు నమ్మిన బంటు . మా అత్తగారికి , మామగారికి చాలానే సేవ చేసేవాడు .

మా ఇంటి ముందుకు కు , అసలు మా గేట్ దరిదాపులకు ఎవరూ వచ్చేందుకు వీలు లేదు . పిల్లల తో ఆడుకోవటానికి ఎవరైనా వస్తే , పక్కింటికి వెళ్ళమని పంపించేసేవాడు . ఒకసారి మా అబ్బాయి ఫ్రెండ్ , చదువుకోవటానికి వస్తాడని ఎదురుచూస్తూ వున్నాడు . ఆ అబ్బాయి రాలేదు . ఏమైందా అనుకున్నాడు మా వాడు . మరునాడు స్కూల్ కి వెళ్ళాక తెలిసింది , అతను వచ్చాడట. కాని మా ఇంటికి రావొద్దు , పక్కింటికెళ్ళు అని వెళ్ళ గొట్టాడట . మా వాడు ఒకటే ఏడుపు , వాడు ఒల్డ్ సిటీ నుండి వచ్చాడమ్మా . ఎవరొచ్చినా పక్కింటికి వెళ్ళమని పంపిచేస్తాడు అని . మావారు , రామయ్య ను పిలిచి కోపం చేసారు . అబ్బే నిమ్మకు . . . . . .దున్నపోతు . . . . .


ఇంతేనా ? ఒకసారి మావారికే తగిలింది ఆ దెబ్బ , ఆయన ఫ్రెండ్ , వాళ్ళ అమ్మాయిపెళ్ళికి పిలవటానికి రాత్రి 11 గంటలకి వచ్చారు .నాలుగు రోజులలో కుదిరిందిట . సమయము ఎక్కువ లేదు అందుకని వాళ్ళ దురదృష్టము ఆ టైం లో వచ్చారు . యధావిధి , మా రామయ్య గేట్ తీయనని , వాళ్ళను పక్కింటికెళ్ళమని పంపించేసాడు . ఆ తరువాత కథ ఎందుకులెండి .


మా గేట్ ఎట్టి పరిస్తితులలోనైనా , రాత్రి 10 గంటల కల్లా మూయాల్సిందే . తాళం పడాల్సిందే ! మా ఇంటికి ఎవరైనా వచ్చి 10 తరువాత వుంటే వచ్చి వాళ్ళనే , మీకేం పనిలేదా ? ఇంకెంతసేపుంటారు వెళ్ళండి అనేసేవాడు . అంత మాట అనిపించుకున్నాక ఎవరైనా ఎందుకుంటారు ? పక్కనుంచి మావారు అరుస్తున్నా సరే నిమ్మకు . . . . . . దున్నపోతు . . . . . . .


మా అమ్మాయి కి ఎదురింట్లోనే ఇద్దరమ్మాయి లు ఫ్రెండ్స్ వుండేవారు . ముగ్గురూ , రాత్రి చదువుకోవటము అయ్యాక మా ఇంటిముందు కూర్చొని కబుర్లాడుకునేవారు . మామూలుగానే , మా ఇంటిదగ్గరెందుకు పక్కింటికెళ్ళండి అని పంపేసాడు . వాళ్ళూ సరేనని ఎదురింటి గేట్ ముందు కూర్చున్నారు . 10 కాగానే సంజమ్మా వస్తున్నావా అని అరిచి , పిలిచాడు . పాపం తను రావటము 5 నిమిషాలు ఆలస్యం చేసింది . అంతే గేట్ తాళం పడిపోయింది . ఏంచేస్తుంది ? గేట్ తీయడు , అందుకని గోడ దూకి వచ్చింది . ఇహ చూస్కోండి నువ్వు ఆడపిల్లవి కాదా ? అట్లా గోడ దూకుతావా అని క్లాస్ పీకాడు . మా అబ్బాయి రామయ్య కళ్ళ పడకుండా గోడదూకి , రామాఫలం చెట్టెక్కి , బాల్కనీ లోకి దూకేవాడు . రామయ్య పుణ్యమా అని మా పిల్లలకు గోడలు దూకటము , చెట్లెక్కటమూ బాగా వచ్చింది !

మా అమ్మాయి పెళ్ళై తను వెళ్ళిపోయాక , మావారు కూడ ఎక్కువ టూర్స్ లలో వుండేవారు , ఇల్లంతా ఖాళీనే కదా అని మా అబ్బాయి ఫ్రెండ్స్ రాత్రుళ్ళు మా ఇంటికే వచ్చి , చదువుకునేవారు . మా ఇంట్లోకి నాలుగు మోటర్ సైకిళ్ళు రావటానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు మా రామయ్య . అదీనూ రాత్రి 10 లోపలే రావాలి . పాపం పిల్లలు నలుగురైదుగురు ఒక్కొక్కదానిమీద వచ్చేవారు . ఎప్పుడైనా ఎవరికైనా ఆలస్యమై , గోడ దూకి వచ్చారో , వాళ్ళ నడ్డి విరిగిందే ! వాళ్ళ అమ్మలు మాత్రము మీఇంటికి వస్తే మాకు బెంగ లేదండి , మీ రామయ్య ఎటూ కదలనివ్వడుగా అని సంతోష పడిపోయేవారు .


నేను పార్లర్ కి వెళ్ళిన కొద్దిసేపటికే , పార్లర్ కొచ్చేసేవాడు . ఏమిటి అంటే , ఇంటికి చుట్టాలొచ్చారు , చాయ్ పెడుదువు పదా అని , నేను బయిలుదేరేదాకా అక్కడే బెల్ కొడుతూ కూర్చునేవాడు . ఇక నా క్లైంట్సేమో నేను చేసుత్తున్న ఐబ్రో నో , ఫేషియలో మద్యలో వదిలేసి పోతానేమో నని తెగ భయపడి పోయేవారు . ఆ తరువాత పార్లర్ చుట్టుపక్కల రామయ్య కనిపిస్తే రావటమే మానేసారు .ఇలా కనీసము రోజుకు ఐదారు సార్లన్నా ఇంటికి తీసుకెళ్ళేవాడు . సాయంకాలము గేట్ దగ్గరికి రాగానే ఒక రుపాయివ్వు , సబ్బు తెచ్చుకోవాలే అనేవాడు . నాకు వళ్ళు మండి ,నా దగ్గరలేవు అంటే , పొద్దటిసంది గిరాకి రాలే అని దబాయించేవాడు . నువ్వు నన్నెక్కడ పని చేసుకోనిచ్చావు ? ఇన్ని సార్లు తీసుకొచ్చావు అని నేను ఉక్రోశ పడితే , నీతాన పనిచేసే పిల్లలేం చేస్తున్నారు ? అని తిరిగి దబాయింపు ! ఇంటికి ఇంత దగ్గరగా పార్లర్ వద్దు , కొంచము దూరము వుండాలి అని మావారు చెపితే వినకుండా , ఇంటికి దగ్గరైతే ఇంటినీ , పిల్లలనూ చూసోకొవచ్చని , ఇంటిదగ్గరగా పార్లర్ పెట్టుకున్నందుకు నన్ను నేను తిట్టుకుంటూ రూపాయి సబ్బు కోసం సమర్పించుకునేదాన్ని . నాకు తెలుసు , మా పిల్లల లాగే మీకూ రోజూ సబ్బెందుకు అని అనుమానం వస్తోంది కదా ? సబ్బు అంటే , మా రామయ్య భాష లో సారాయి .

ఇంతేనా అంటే ఇంకా చాలా వున్నాయి చెప్పల్సినవి . కాని ఇంకా ఎందుకులెండి . ఇప్పటికే చాలా ఎక్కువైంది . మా మామగారు చనిపోయిన నెలకే రామయ్య కూడా చనిపోయాడు . అక్కడ కూడా వాళ్ళకు ( మా అత్తగారికి , మామగారికి ) సేవ చేయటానికే వెళ్ళాడు అని అందరూ అనుకోవటమే .

Tuesday, November 24, 2009

ఊర్వశి

లేడీస్ మీటింగ్ లో మిసెస్ . రైనా ఫేషియల్ గురించి చెప్పినప్పుడు తెగ నిద్దరొచ్చేసింది . మహా బోర్ కొట్టినా ఏదో మొహాన కాసిని చిరునవ్వులతికించుకొని , చాలా బాగా చెప్పావు అని మొహమాటం గా విష్ చేసి వచ్చేసానే కాని , ఆ చిరునవ్వులని 20 సంవత్సరాల పాటు అతికించుకోవలసి వస్తుందని , ఆ రోజున ఏమాత్రము ఊహించలేకపోయాను . ఆ తరువాత ఓ నాలుగు సంవత్సరాల కి , ఓ సూర్యోదయాన , మావారు , బేకార్ గా మాజాంగ్ , కార్డ్స్ ఆడుకుంటూ వుండక పోతే , మిసెస్ . బట్నాగర్ బ్యూటీ క్లాసెస్స్ తీసుకుంటోంది కదా చేరొచ్చుగా అని క్లాస్ పీకారు . అదేమిటో మా అమ్మ , మా ఆయన నేను ఎంజాయ్ చేయటము సహించలేరు ! మా అమ్మ , నాకు సెలవలు రాగానే అది నేర్చుకో , ఇది నేర్చుకో అని నెడుతూవుండేది . పెళ్ళైనాక ఆ డ్యూటీ మావారు తీసుకున్నారు . వాళ్ళను ఎదిరంచే సాహసము చేయలేక గొణుకుంటూ , సణుకుంటూ చేరేదానిని . వాళ్ళు దేనిలోనో ఓ దానిలో చేర్చేవరకే , ఆ తరువాత దాని అంతు చూసేదాక నాకు తోచదు . అప్పుడేమో నీకే పిచ్చి పడితే అదే అని తిడుతారు . నేనేం చేయను ? ప్రస్తుతము ,మావారు యానిమేషన్ కోర్స్ పేపర్లు పట్టుకొని కూర్చున్నారు . నేను చిక్కటము లేదు . విషయము పక్కదారి పట్టినట్లుంది ! ఇక అసలు దారికి వస్తే , ఏంచేయగలను ? మా వారి పోరు భరించలేక చేరి , ఆ కోర్స్ లో చివరివరకూ నిలిచినదానిని నేనొక్కదానినే ! అంతేనా ఆతరువాత ప్రతి రెండు సంవత్సరాలకి బాంబే వెళ్ళి కోర్స్ లు చేసాను . . బరోడా లో మా ఫ్రెండ్ ఉష , తన పార్లర్ లో చేరమంది . అప్పుడే యూనివర్సిటీ లో చైల్డ్ డెవలప్మెంట్ లో , పి . జి డిప్లమాలో సీట్ వచ్చింది . నేను , పార్లరా ? చదువా ? అని అటూ ఇటూ ఊగుతుంటే , మా ఇంకో ఫ్రెండ్ కల్పనా దీది , పార్లర్ లో ఎప్పుడైనా చేరవచ్చు . అంతేకాదు బ్యూటీషియన్స్ కి అవకాశాలు వున్నాలేకపోయినా , టీచర్లకి , గైనకాలజిస్ట్ లకి ఎప్పుడూ అవకాశాలు వుంటాయి , ముందు చదువుకో అని నెట్టింది . ముక్కున పెట్టుకొని చదువు పూర్తిచేసి , ఉష వాళ్ళ ఊర్వశి బ్యూటీపార్లర్ లోకి జంప్ చేసేసాను.అలాగ జంప్ చేసినదానిని దాని మీద మక్కువతో , హైదరాబాద్ వచ్చాక ,అదే పేరు తో ఊర్వశి బ్యూటీ పార్లర్ తెరిచేసాను . మా ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న పోర్షన్ రెంట్ కి తీసుకొని , దానికి కావలసిన హంగులన్నీ సమకూర్చుకొని , ఆ ఇంటి ఓనర్ గారిని , ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి రమ్మని పిలవటానికి , మా వారితో కలిసి వెళ్ళాను . నన్ను మావారు పరిచయము చేయగానే , ఆ ఇంటావిడ సుకన్య నన్ను పైనుంచి , కిందిదాకా ఎగా దిగా చూసి , ఇంత మైల్డ్ గా వుంది , ఈమేమి పార్లర్ నడుపుతుంది అని పెదవి విరిచేసింది ! ఎంత ఉక్రోషం వచ్చేసిందో . ఇంటికి రాగానే , అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకొని , నేను పార్లర్ నడపలేనా ? ఇంత మాట అంటుందా ? అని ఆవేశ పడిపోయాను .ఇంత ఖర్చు పెట్టి , వెనుకకి పోలేను , అంతా దండగ కావలిసిందేనా ? అని తెగ మధన పడ్డాను . కానీయ్ చూద్దాం అనుకొని ముందడుగు వేసాను .ఆవిడనే , 15 సంవత్సరాల తరువాత పార్లర్ అమ్మేసి , కీస్ ఇద్దామని వెళితే , ఎందుకు మాలా పార్లర్ మూసేస్తున్నారు ? మీరు చాలా హోంలీ గా వుంటారని , బాగా చేస్తారని , మంచి పేరు వచ్చింది . రష్ కూడా బాగా వుంది కదా మూసేయకండి కంటిన్యూ చేయండి అంది !ముందుకు వేసిన అడుగు అలాగే ఎన్నెన్నో జ్ఞాపకాలను పోగుచేసుకుంటూ ముందు ముందుకు వెళ్ళింది . ఎంతో మంది అభిమానాన్ని సంపాదించి పెట్టింది . ఎందరికో ఉపాధిని కలిపించింది . మావారి పార్ట్నర్ చనిపోతే ఆయన భార్యకోసం , బంజారా హిల్ల్స్ లో ఊర్వశి బ్రాంచ్ ని తెరవటము మరిచిపోలేనిది . పలు కార్యక్రమాలకి ముఖ్య అథిది గా , కొన్నిటికి జడ్జ్ గా వెళ్ళటము మధురమైనవి .పార్లర్ కి వచ్చే పిల్లలతో చేరి నేనూ ఒక టీనేజ్ అమ్మాయినే అయిపోయాను . అంతేనా మౌనం గా వుండేదానిని వాగుడుకాయనయ్యాను ! నాకంటూ ఒక గుర్తింపును ఇచ్చింది నా " ఊర్వశి ".ఇంతకీ ఈ సోదంతా ఎందుకంటే నిన్న విజయవాడ , కనకదుర్గ గుడి లోంచి బయటకు వస్తుంటే " ఊర్వశీ ఆంటీ " అని పిలుపు వినిపించింది . నన్ననుకోలేదు . పార్లర్ మూసేసిన 12 సంవత్సరాల తరువాత నన్ను ఆపేరు తో పిలుస్తారని ఎలా అనుకుంటాను ? కాని నన్నే ! ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని ఆప్యాయం గా పలకరిస్తే ఎంత సంతోషం వేసిందో చెప్పలేను !జ్ఞాపకాలే మైమరుపు , జ్ఞాపకాలే మేలుకొలుపు .


జ్ఞాపకాలే నిట్టూర్పు , జ్ఞాపకాలే ఓదార్పు .Thursday, November 19, 2009

పుల్ల పుల్ల గా , తియ్య తియ్యగా , ఖారం ఖారంగాకార్తీకమాసము , నోములు , పూజలే కే కాదు ఉసిరి కాయలకు కూడా ప్రసిద్దే ! ఎక్కడ చూస్తే అక్కడ బళ్ళ ల మీద పచ్చ పచ్చని రాశులుగా నోరూరిస్తూ కనిపిస్తున్నాయి . ఇవి విటమిన్ సి పుష్కలంగా లభించే ఫలాలు . రోజూ ఉసిరికాయ తినేవారిలో ఎటువంటి అనారోగ్యానైనా తట్టుకోగల శక్తి వుంటుందంటారు . . చాలా వరకు చర్మ వ్యాదులని రూపుమాపుతుంది . జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది . చెప్పాలంటే ఇంకా చాలా చాలా గుణాలున్నాయి . అంతెందుకు , క్రమం తప్పక రోజూ ఉసిరికాయను ఏదో రూపములో తినేవారు 100 సంవత్సరాలైనా , ఆరొగ్యం గా జీవించవచ్చుట !

చిన్నప్పుడు ఉసిరికాయ తిని వెంటనే మంచి నీళ్ళు తాగే వాళ్ళము . మంచినీళ్ళు తాగగానే నోరు తియ్య తియ్య గా వుండేది . అదో సరదాగా వుండేది . ఇప్పుడేమో వాటి తో రకరకాలుగా చేసుకొని తినటము అలవాటైంది !

ఉసిరికాయలు రావటము మొదలు కాగానే గింజలు లేకుండా , పొడుగు ముక్కలుగా తరుక్కొని కొంచం నూనె లో మగ్గనిచ్చి ( అంటే ముక్కలలో కొద్దిగా నూనెవేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలన్నమాట ) స్టవ్ మీదనుండి , దింపి , చల్లారక , కొద్దిగా మెంతిపిండి , ఉప్పు , ఖారం వేసుకొని , వేడి అన్నం లో నెయ్యితో కలుపుకొని తింటే స్ . స్. స్. ఉంటుందికదా , అలా అలా లొట్టలేయటమెందుకు ? వెంటనే చేసుకొని తినొచ్చుగా !

పెద్ద సైజు ఉసిరికాయలను నీడలో ఎండపెట్టి , పైపైన కొడితే , విచ్చుకుంటాయి . అప్పుడు , లోపలి గింజలను తీసేసి , పై తొక్కను మిక్సీ లో వేసి పొడి చేసుకొని , రోజూ ఉదయము పరగడుపున ఒక చెంచాడు తింటే చాలా మంచిది .

అలా పొడిని తినలేనివారు , పెద్ద ఉసిరికాయలను తురిమి , ఆ తురుములో సరిపడ ఉప్పును , పసుపును కలిపి వుంచుకొని రోజూ , బ్రేక్ ఫాస్ట్ తినేటప్పుడు , ఒక చిన్న చెంచాడు తింటేసరి .

అలా కూడా తినలేనప్పుడు , ఉసిరికాయ తురుములో ఉప్పు , పసుపు కలిపి మూడు రోజులుంచి , మూడో రోజు , కొద్దిగా మెంతిపిండి , పండుమిరపకాయల ముద్ద కలిపి వుంచుకోవాలి . ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇంగువ పోపువేసుకొని తింటే బాగుంటుంది .

ఇవన్నీ ఆరోగ్యపరం గా చేసుకునేవి . ఇక అసలు , సిసలు ఉసిరి ఆవకాయ అంటే ,

ఉసిరికాయలు 1 కిలో ,

నువ్వులనూనె కాని పల్లీనూనెకాని ఉసిరికాయలు మునిగేంత ,

ఉప్పు 250 గ్రాములు ,

ఖారం 250 గ్రాములు ,

పసుపు చెంచాడు ,

మెంతిపిండి 100 గ్రాములు .

ఆవపిండి 100 గ్రాములు ,

ఇంగువ ,

,పోపులోకి .ఎండుమిరపకాయలు ,

2 నిమ్మకాయలు .

ఉసిరికాయలను శుభ్రంగా కడిగి , తడిలేకుండా తుడిచి , కాసేపు నీడలో ఆరబెట్టాలి . తరువాత వాటిని ప్రెషర్ పాన్ లో వేసి , అవి మునిగేంతగా నూనె పోసి ,స్టవ్ మీద పెట్టాలి . ఒక్క విజిల్ రాగానే దింపేయాలి . లేదా ఒక గిన్నె లో వేసి , ఉడికేవరకు మగ్గ పెట్టవచ్చు . వాటిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీయాలి . నూనెను , మూకుడు లోకి వంచుకోని , స్టవ్ మీద పెట్టి , ఇంగువ , కొన్ని మెంతులు , కొన్ని ఎండుమిరపకాయలు వేసి వేయించాలి . అవి వేగాక ఉసిరికాయలలోకి పోసేయాలి . ఆ నూనె వేడి తగ్గాక , ఉప్పు , పసుపు , మెంతిపొడి , ఆవపిండి , రెండునిమ్మకాయల రసము వేసి కలిపేయాలి . దానిని అలాగే, మూత పెట్టివుంచి , మరునాడు రుచి చూసుకొని , ఏవైనా తక్కువ అవుతే కలుపుకొని , జాడి లోకి తీసుకోవాలి . ఈ పచ్చడి ఒక నెలవరకు , రంగు , రుచి మారకుండా వుంటుంది . ఇందులో ఇచ్చిన కొలతలు సుమారుగా ఇచ్చినవి . ఎవరికి కావలసిన మార్పులు వారు చేసుకో వచ్చు . ఉప్పు తక్కువ కాకుండా వుంటే సరి . ఉప్పున్న ఊరగాయకి , అత్త చేతికింద కోడలికి తిరుగుండదు అని సామెత .

ఉసిరికాయ జాం ;

ఉసిరికాయ తురుము ; ఒక గ్లాసు ,

పంచదార ; రెండు గ్లాస్లు ,

నెయ్యి పావు గ్లాస్ ;

జీడి పప్పు , బాదాం , ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టమైనవి , మీకిష్టమైనన్ని .

మూకుడు లో నెయ్యి వేసి ,ఉసిరి తురుమును పచ్చివాసన పోయేదాకా వేయించాలి . వేగాక , అందులో పంచదార వేసి , సిం లో వుంచి , అడుగంటకుండా తిప్పుతూ వుండాలి . ముందుగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి పొడి చేసుకొని వుంచుకోవాలి . మూకుడులోని జాం దగ్గర పడుతుండగా ఈ డ్రై ఫ్రూట్స్ పొడిని వేయాలి . పంచదార తీగపాకం వచ్చేదాకా వుంచి , దింపేయాలి . చల్లారాక సీసాలోకి తీసి పెట్టుకోవాలి . తడి తగలకుండా వుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా వుంటుంది .

ఇది బ్రెడ్ లోకి , చపాతిలలోకి బాగుంతుంది . రోజూ పిల్లలకి పెడితే చాలా ఆరోగ్యకరం . మా పిల్లల చిన్నప్పుడు ఇది తప్పక చేసేదానిని .

పైన ఫొటోలో వున్నవి రాచ ( చిన్న ) ఉసిరి కాయలు . ఇవి సామాన్యముగా బజారులో దొరకవు . ఎక్కువగా ఇళ్ళలోనే కనిపిస్తాయి . రుచి కి చాలా పుల్లగా వుంటాయి . బాల్కనిలోనుండి తెంపుకొని వుట్టివే తినేస్తూ వుంటాము . కచ్చాపచ్చాగా దంచి పప్పులో వేస్తుంటాను . పుల్ల పుల్ల గా మామిడికాయ పప్పులాగా బాగుంటుంది .

పచ్చి మిరపకాయలు , కొత్తిమీర , పోపు వేసి పచ్చడి కూడా చేస్తాను .

ఇక మీ ఇష్టం , వీటిల్లో ఏదైనా చేసుకొని , లేదా అన్ని చేసుకొని పుల్ల పుల్లగా , తియ్య తియ్య గా , ఖారం ఖారం గా లాగించేయొచ్చు !


ఈ చిన్న ఉసిరికాయలను ఆవిరి పైన ఉడికించి ,కొబ్బరి పచ్చడిలా చేసుకుంటే అన్నం తోనే కాకుండా ఇడ్లీలు , దోసెల తో కూడా బాగుంటుంది అని , సత్య గారు , నా మొట్టికాయలకు వంటింటి చిట్కా పొస్ట్ లో కామెంట్స్ లో చెప్పారు . ఇక్కడ వుంటే బాగుంటుంది అని , ఇక్కడ కలిపాను . థాంక్ యు సత్యగారు .