Sunday, May 30, 2010

అమ్మ చెప్పిన కథ

నేను ఆవకాయ పని లో వుంటే అందరూ కథలు చెప్పేసుకుంటున్నారే ! ఐతే నా ఆవకాయల పోస్ట్ ల కు కామా పెట్టాల్సిందే ,

రాత్రి ఆరుబయట పడుకున్నపుడు అమ్మ చెప్పే కథలంటే చాలా చాలా ఇష్టం గా వుండేది . ఎన్ని కథలు చెప్పినా కర్ణుడి కథ తప్పకుండా చెప్పాల్సిందే . అడిగి మరీ చెప్పించుకునే దానిని . చెప్పేంతసేపూ ఏడుస్తూ వుండే దానిని . నువ్వేడుస్తున్నావు చెప్పనంటే ఏడవనమ్మా అని బతిమిలాడి మరీ చెప్పించుకునేదానిని . కర్ణుడి కథ తరువాత స్థానం కృష్ణదేవరాయుడి ది . నేను పుట్టినప్పుడు మా నాన్నగారు తుంగభద్ర ప్రాజెక్ట్ దగ్గర పనిచేసేవారట . అందుకని ఎక్కువగా హంపీ వెళ్ళే వారట . దాని తో అమ్మ , ఆ హంపీ వీధులను వర్ణిస్తూ కథ చెపుతుంటే , నాకు హంపీ లో వున్నట్లుగా నే వుండేది .ఆ రెండు కథలు తప్ప ఇంకేవీ చెప్పనిచ్చేదానిని కాదు . అలా చిన్నప్పటి నుండి కర్ణుడన్నా , శ్రీకృష్ణదేవరాయుడన్నా ఆరాధన ఏర్పడింది . ఆ తరువాత బుడుగు కథ . బుడుగు కథ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను .


నా మనవళ్ళూ , మనవరాళ్ళకు కూడా నేను చెప్పే కథలు చాలా ఇష్టం . ప్రతి రోజూ బుడుగు కథ చెప్పుకోకుండా పడుకోము . నా పేరు బుడుగు , మా బామ్మ నన్ను హారి పిడుగా అంటుంది దగ్గర నుండి , చివరలో వున్న గ్రూప్ ఫొటో వరకూ అందరికీ కంఠతా వచ్చు ! ఐదారేళ్ళ పిల్లలకెవరికైనా గిఫ్ట్ ఇవ్వలంటే నేను బుడుగు పుస్తకం ఇస్తాను .

- - - - - - - - - -- - - - - - -- - - - - - -- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -


ముసలమ్మ సూది కథ


మా అమ్మనే కాదు మా అమ్ముమ్మను కూడా కథలు చెప్పమని వేధించేదానిని . సెలవల్లో మా చింతలపాడు వెళ్ళినప్పుడు , సాయంకాలము ఆరు బయట వరండా నీళ్ళ తో కడిగి , పక్కలు వేసేవారు . ఇహ అమ్ముమ్మ పక్కన చేరి ఎన్ని కథ లో . మా ఆమ్ముమ్మ పేరు మా కెవరికీ తెలీదు , ఎందుకంటే ఎవరూ పేరు పెట్టి పిలిచేవారు కాదు కదా . అందుకన్న మాట . అందుకే అమ్మమ్మ పేరు తెలుసుకోవాలని మహా కోరిక గా వుండేది . నీ పేరు చెప్పు అమ్మమ్మా అంటే పేరు మర్చి పోయిన ఈగ కథ చెప్పేది . ఆ కథ నేను కొత్తగా చెప్పేదేముంది అందరికీ తెలిసిందే కదా . ఎంతకీ నిద్ర పోక కథలని వేధించే మాకు ఓ పొడుపు కథ చెపుతాను అది విప్పండి , ఆ తరువాత ఇంకోటి అని , మా అమ్ముమ్మ చెప్పిన కథ :

అనగనగా ఒక వూళ్ళో వొక పేద ముసలమ్మ వుంది . పాపం ఆమెకు ఎవరూ లేరు . కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు . ఐనా అలాగే కాలం వెళ్ళ దీసుకుంటూ వుంటుంది . ఇంతలో చలి కాలం వస్తుంది . కప్పుకోవటానికి ఏమీ లేవు . అందుకని తన దగ్గర వున్న పాతబట్టలతో బొంత కుట్టుకుందామనుకుంటుంది . సరే , పెరట్లో వున్న బావి గట్టు మీద కూర్చొని కుట్టుకుంటూ . . . కుట్టుకుంటూ . . . వుండగా సూది బావి లో పడి పోతుంది . పాపం పేద ముసలమ్మ కదా , ఇంకో సూది కూడా లేదు . ఇప్పుడు ఆ సూది ఎలా బయటకు వస్తుంది ?
" అవునమ్ముమ్మా ఎలా వస్తుంది ? "

" అవునమ్ముమ్మా ఎలా వస్తుంది అంటే వస్తుందా "

" అట్లా అనగానే ఎట్లా వస్తుందమ్ముమ్మా , ఎట్లా వస్తుందో చెప్పు "

" ఎట్లా వస్తుందో చెప్పు అంటే వస్తుందా "

" అబ్బా , అమ్ముమ్మా చెప్పు "

" అబ్బా అమ్ముమ్మా చెప్పు అంటే వస్తుందా "

" హుం"

" హుం అంటే వస్తుందా "

" ఎట్లా వస్తుంది చెప్మా "

" ఎట్లా వస్తుంది చెప్మా అంటే వస్తుందా "

? ? ? ? ? ? ?

( ఈ పోస్ట్ ను ఏదో కాస్త ఎడిట్ చేద్దామని ఓపెన్ చేస్తే పాపం ఎటో వెళ్ళి పోయింది . గురూజీ సాయం తో వెతికి తెచ్చాను , కాని దీనికి వచ్చిన ఒకేఒక కామెంట్ ను తిరిగి తేలేక పోయాను . కిరణ్ గారు , మీ కామెంట్ను నేను మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోకండి )

Friday, May 28, 2010

ఎంతవారలైనా ఆవకాయ దాసులే !!!!ఈ ఎండాకాలం ఏమో కాని , ఆవకాయ , గుమ్మడికాయ వడియాలు , చల్లమిరపకాయలు ఇవన్ని పెట్టటముతోటే సరిపోతుంది . అందులో ఆవకాయ ఇంటి ఇలవేలుపు . అది లేందే ఏరోజూ ఎవ్వరికీ ముద్ద దిగదు . పది సంవత్సరాల క్రితము వరకూ , ఖారం , పసుపు , ఆవపిండి , ఉప్పూ ఇంట్లోనే కొట్టించేవాళ్ళము . ఇప్పుడు ఆవపిండి ఒక్కటి మాత్రం ఇంట్లో చేస్తున్నాము . అదీ ఖమ్మం నుండి ఆవాలు తేవాలి . త్రీమాంగోస్ ఖారం , బుల్ల్ బ్రాండ్ ఉప్పు , ఇదయం నువ్వుల నూనె ఇందులో ఏ ఒక్కటి మారినా ఇలా విలపించాల్సిందే !


మా అత్తగారు పచ్చడులు పెట్టటము లో ఎక్స్పర్ట్ . ఈ ఆవకాయ సీజన్ లో , మా అత్తగారు , మామగారు హడావిడి పడిపోయేవారు . ఆవకాయ కలిపిన రోజు మా ఇంట్లో పండుగ వాతావరణమే వుండేది . ముక్కలు తుడిచేంత సేపు ఆ ఏడాది ముచ్చట్లు దొర్లి పోయేవి . అన్ని సిద్దం చేసుకున్నాక ,పిల్లా పీచూ అందరికీ గోల్డ్ పాస్ లు , టిఫినీలు పెట్టి బయటకు తోలేసేవాళ్ళము . ( ఇప్పుడూ అంతే అనుకోండి ) ఆ తరువాత , వంటగది లో , మా అత్తగారు పీటమీద కూర్చొని , ఒకొక్కరిని పిలిచేవారు . అంటే , నేను , మా తోటి కోడలు , మా ఆడపడుచులు అందరము ఎవరిది వారే కలుపుకునే వారమన్నమాట . ఆ కలుపుకునే వారు , అత్తగారు మాత్రమే ఆ గదిలోకి వెళ్ళేవారన్నమాట . అత్తగారి ఆద్వర్యం లో వాళ్ళు కలుపుకునేవారు . మిగితా వాళ్ళు బయట మా టర్న్ కోసం ఎదురుచూస్తూ వుండేవాళ్ళము . మా మామగారేమో బయటి వరండాలో కూర్చొని ఇంట్లోకి ఎవరూ రాకుండా కాపలా కాస్తూ వుండేవారు . మా మామగారు లోపలికి వచ్చినప్పుడు పొరపాటున ఎవరైనా వచ్చారో , ఆ పైన మీరు ఆవకాయ పెడుతున్నారా అని మరీ వంటగది లోకి వెళ్ళారో అంతే , మామయ్యగారి పని , వచ్చినవాళ్ళ పని గోవిందో గోవింద !! మన తిండి మనం తిన్నా , మన బట్ట మనం కట్టినా కనుమరుగు వుండాలి అనేది మా అత్తగారి సిద్దాంతం . అలా మాఇంట్లో అందరమూ , ఈ జనరేషన్ కూతుళ్ళూ , కోడళ్ళూ కూడా ఆవకాయ పెట్టటము నేర్చుకున్నాము .


మా అత్తగారి దగ్గర నేను నేర్చుకున్న ఆవకాయ పద్దతి ; -


ముందుగా కావలసిన మసాలా సిద్దం చేసుకున్నాకనే మామిడి కాయలు తెచ్చుకోవాలి.

ఆవకాయకు ముఖ్యమైనవి మంచి ఆవాలు . మేము ఇన్ని సంవత్సరాలనుండీ ఖమ్మం లో , భారతమ్మ కొట్టునుండే ఆవాలు తెచ్చుకుంటున్నాము . రాగి రంగులో సన్నగా , చిన్నగా వుంటాయి . ఒక పెద్ద గిన్నెలో పోసి , జాగ్రత్తగా గాలించి , కడగాలి . ఆ పైన జల్లెడ లోకి నీరంతా పోయేట్టుగా వంపాలి . ఆ తరువాత మంచి ఎండ లో ఓ బట్ట మీద వేసి ఆరబెట్టాలి . మద్య మద్య లో వాటిని నెరుపుతూ (కదుపుతు) వుండాలి . లేక పోతే వుండలు చుట్టుకు పోతాయి . అలా రెండు , మూడు రోజులు బాగా ఎండపెట్టాలి . ఎండ వేడి చల్లారిన ఆవాలను మిక్సీ లో కొద్ది కొద్దిగా వేస్తూ పొడి చేసుకొని , మైదా జల్లెడ తో పట్టాలి. అప్పటి కప్పుడే ఆవకాయ కలుపుతే సరి లేక పోతే ఆ పొడిలో కొద్దిగా ఉప్పు కలిపి వుంచుకోవాలి.లేకపోతే ఆవపిండి కనరెక్కుతుంది .


ఉప్పును కూడా ఒక పూట ఎండబోయాలి . అది కూడా మద్య మద్య లో నెరుపుతూ వుండాలి . లేక పోతే వుండలు కడుతుంది . ఎండాక మైదా జల్లెడ తో జల్లెడ పట్టుకోవాలి . పచ్చడికి , అయోడిన్ ఉప్పు కాకుండా మామూలు ఉప్పైతేనే బాగుంటుంది . మేము బుల్ బ్రాండ్ ఉపు వాడుతాము .


ఖారం ఎవరి కి ఇష్టమైనది వారు వాడవచ్చు . మేము త్రీమాంగోస్ బ్రాండ్ ఖారం వాడతాము . అది కూడా ఎండబెట్టక్కర లేదు కాని మైదా జల్లెడ తో జల్లించుకోవాలి .


మెంతులు కడిగి ఆరబోసుకోవాలి .


ఇలా అన్ని సిద్దం చేసుకున్నాక , నాటు , లేదా , చిన్న రసాలు లేదా, తెల్ల గులాబీలు , వీటి లో ఏదో ఒక వెరైటీ వి మీడియం సైజు మామిడి కాయలు తెచ్చుకోవాలి . మామిడి కాయలను కొద్ది సేపు నీళ్ళ లో నానేసి , తడిలేకుండా శుభ్రం గా తుడుచుకొని , ముచ్చికలు తీసేసి ముక్కలు కొట్టించుకోవాలి . ఒక కాయకు పన్నెండు ముక్కలు , అంటే టెంక అన్ని ముక్కలకు సమానం గా వచ్చేట్లుగా నన్నమాట , జాగ్రత్తగా కొట్టించాలి . టెంక లేక పోతే ముక్క త్వరగా మెత్త బడి పోతుంది .దీని తరువాతనే మహా బోర్ , పెద్ద పని ముక్కలు పొర , జీడి లేకుండా తుడవటము . తప్పదు మరి .


ఆవకాయ పాళ్ళు ; -

మామిడికాయలు - 25

ఆవపిండి - 8 పావులు ( పిండి ఎక్కువ కావాలంటే 9 వేసుకోవచ్చు )

ఉప్పు - 6 పావులు

ఖారం - 4 పావులు

మెంతులు - కొద్దిగా

పసుపు

నువ్వుల నూనె - 2 కిలోలు

వేడి చేసి చల్లార్చిన నీళ్ళు గిన్నెడు


కలిపేవిధానము : -


ఒక పెద్ద పళ్ళెం లో కాని బేసన్ లో కాని ఎనిమిది పావులు ఆవపిండి పోసుకొని , కొద్ది కొద్ది గా నీళ్ళు పోస్తూ , ఇడ్లీ పిండి కన్నా తక్కువ , చపాతి పిండికన్నా ఎక్కువగా వుండేటట్లు మృదువుగా తడుపుకోవాలి . ఇంకొక గిన్నెలో ఖారం , ఉప్పు , పసుపు , మెంతులు పైన చెప్పిన పాళ్ళ ప్రకారం కలుపుకొని , ఆపొడిని నీళ్ళ తో తడిపి వుంచుకున్న ఆవపిండిలో వేసి , కొద్ది కొద్ది గా నూనె వేస్తూ చపాతీ పిండిలా తడుపుకోవాలి . ఆ తరువాత ఇంకొక గిన్నెలో ఒక పావు నూనె , కొద్దిగా ఆవపిండి , కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపి , ఆ నూనెలో కొద్ది గా మామిడికాయ ముక్కలను ముంచి తీసి , కలిపి వుంచుకున్నా ఆవ ముద్దలో వేసి , కొద్దిగా ఆవ ముద్ద , ఆ ముక్కలు బాగా కలుపుకొని జాడిలో వేయాలి . అలా కొన్ని కొన్ని ముక్కలు నూనె లో తడిపి , కొద్ది ఆవముద్ద తో కలిపి జాడిలో వేస్తూ , మొత్తం ముక్కలకు పిండి సరిపోయేట్లుగా వేసుకోవాలి . ఒక వేళ ఆవముద్ద మిగిలి పోతే జాడీలో పైన సద్దేయవచ్చు . ఆ తరువాత జాడీ మూత గట్టిగా పెట్టేసి , పైన ఓ బట్ట వాసెన కట్టాలి . మూడో రోజు తిరగ కలుపుకోవాలి . అంతే ఘుమ ఘుమ లాడే ఆవకాయ సిద్దం .


" అందరూ ఇంత కష్టపడరట వదినా , ఇలా పాకెట్స్ కట్ చేసి వేసి అలా కలిపేసుకుంటారుట ."


" ఏమో విజయా , ఈ సారికి ఆవకాయ పెట్టేసాము . వచ్చేసారి ఆవకాయ పెట్టే ఓపిక వుంటుందో వుండదో . "


ఇవి ప్రతిసారి ఆవకాయ పని ఐపోయాక నేనూ , మా ఆడపడుచూ అనుకునే డైలాగులు !


ఏమైనా కాస్త ఓపిక తెచ్చుకొని నాలుగు రోజులు కష్టపడి తే ఏడాదికి సరిపోను ఆవకాయ వచ్చేస్తుంది .


" అత్త చేతికి కింది కోడలుకు , ఉప్పు ఉన్న ఊరగాయకు తిరుగు లేదు ."

Wednesday, May 26, 2010

మా వారూ - ఆవాకాయ * * * అను మాలా విలాపం . . .
ఎందుకోగాని ఈ సారి ఆవకాయ పెట్టే ఓపిక గాని , మూడ్ గాని అస్సలు లేదు . కొత్త ఇంట్లో పనిమనిషి సరిగ్గా లేదు , సావిత్రి డుమ్మా లో వుంది , ఖమ్మం నుండి ఆవాలు తెప్పించలేదు ఇలా , ఆవకాయ పెట్టకుండా తప్పించుకునే కారణాలు వెతుక్కుంటూ వున్నాను . ఐనా తప్పదుకదా ! అందరూ బాగుంటున్నాయి అంటున్నారని బాంబే స్టోర్ నుండి నూనే వగైరా సామానులు తెచ్చాను . కాని , ఉప్పును ఎండబెట్టకుండా , ఖారం జల్లెడ పట్టకుండా కాలం వెళ్ళదీస్తున్నా . నాలుగైదు సంవత్సరాల నుండి మావారి కజిన్ , వాళ్ళ ఇంటికి దగ్గర లో మామిడి తోట వుందనీ , అక్కడ మనము ఎంచుకున్న చెట్టునుండి కాయలు తెంపిస్తున్నారని , చాలా బాగుంటున్నాయని చెపుతూ వచ్చారు . కాని నేనెప్పుడూ వెళ్ళి తెచ్చుకోలేదు . సరే ఈసారి ఆవాలు సరైనవి లేవుకదా , కనీసం మామిడి కాయలైనా మంచివి తెద్దాం అనుకొని వస్తానని చెప్పాను . నేను వెళ్ళి కాయలు తెచ్చుకుందామనుకున్న శుభముహూర్తాన , గాలి వచ్చి కాయలన్ని రాలిపోయాయని , కావాలంటే ఓ పాతిక కాయలు మాత్రం దొరుకుతాయని , పాపం మా బావగారు ఎంతో ఫీలైపోతూ ఫోన్ చేసి చెప్పారు . పోనీలెండి అని ఆయనను ఓదార్చి , అమ్మయ్య ఈ వారం ఆవకాయ పెట్టే పని తప్పింది అనుకున్నా ! ఇంతలో మాఅడపడుచు విజయ ఫోన్ చేసి , నేను పనమ్మాయిని మాట్లాడాను , ఈ సారి మా ఇంటికొచ్చేయ్ వదినా అంది . ఇహ తప్పదుకదా . ముక్కుతూ మూలుగుతూ విజయా వాళ్ళ ఇంటికెళ్ళి ఎలాగో ఐందనిపించుకొని , అమ్మయ్య అని నిట్టూర్చాను . ఆడపడుచుల సాయం తో ఆవకాయ పెట్టేసావు కదా , ఈ మాలా విలాపం ఎందుకంటారా ? అసలు కథ ఇప్పుడే మొదలైంది మరి . నన్ను తీసుకెళ్ళటానికి మావారు వచ్చి ఐందా అమ్మాయ్ ఆవకాయ పని అని మా అమ్మాయిని అడిగారు . మాతో ముక్కలు తుడిపించి మమ్మీ , విజ్జత్తనే కలిపారు డాడీ అని మా మీదో కంప్లైంట్ చేసి , ఈ సారి అస్సలు ఆవఘాటు లేదు అన్నది మా అమ్మాయి . అంతే పితృహృదయం ద్రవించి పోయింది !!!

మావారు పని మీద కొత్తగూడెం వెళ్ళాల్సి వచ్చింది . అక్కడనుండి కాల్ చేసి , వస్తూ ఖమ్మం నుండి ఆవాలు తేనా అని అడిగారు . ప్రస్తుతం పితృహృదయం పొంగి పొరలి పోతోందనే మాట మరచి ఎందుకు ఆవకాయ పెట్టేసాను కదండీ అన్నాను . కాదులే ఇక్కడనుండి ఆవాలు తెస్తాను కొద్దిగా పిల్లలమటుకు పెట్టేయకూడదూ అన్నారు . ఇహ తప్పదుకదా , ఒక్క కిలో మటుకు తెండి ఎక్కువ తెస్తే చేసే ఓపిక లేదు అని గొణుకున్నాను . ' ఖారం తేనా ? '
' వద్దండి . మొన్నటి ఖారం వుంది . "
" అదా ? ఎర్రగా , గొడ్డు ఖారం లా వుంది వద్దు . ఇక్కడి నుండి మంచిది తెస్తాను "
మంచి వరంగల్ ఖారమని , చక్కగా ఎర్రగా పండులా మెరిసి పోతోందని తెచ్చాను . అది గొడ్డుఖారం లా వుంది హుం . ఇంకా నా నిట్టూర్పు పూర్తికానేలేదు ," మెంతులున్నాయా ? "
" వున్నాయండి ."
" శెనగలు ? ఈ మధ్య నువ్వు శెనగలేయడం లేదు . మా అమ్మ వేసేది ."
" మహా ప్రభూ నేను ఆవకాయ పెట్టటము అత్తయ్యగారి దగ్గరే నేర్చుకున్నాను . శెనగలేస్తే నూనె ఎక్కువ పీలుస్తున్నాయని శెనగలు వేయటము మానేసాము . అదీ అత్తయ్యగారు చెపితేనే . అన్ని వున్నాయి మీరేమీ తేనక్కరలేదు , ఒక్క కిలో అవాలు మాత్రం తెండి బాబూ చాలు "
" ఇక్కడ మామిడికాయలు బాగుంటాయి తెచ్చేదా "
" వద్దండి బాబూ వద్దు . ఇప్పుడే మామిడికాయలు తెస్తే ఎట్లా ? ఆవాలు కడగాలి , ఎండబోయాలి , పొడి కొట్టలి అప్పుడు కదా మామిడి కాయల అవసరం "

ఇంత చెప్పినా ఆవాలు రెండు కిలోలు , ఖారం రెండు కిలోలూ తెచ్చారు . మా ఆపత్భాంధవి సావిత్రి కూడా వచ్చింది . అమ్మయ్య ఆవాల పని ఆమె చేసింది . మామిడికాయలకు ఒక్కదానిని వెళ్ళే ఓపిక లేక, కారు లో తీసుకెళుతారు కదా అని , మావారిని వెంట బెట్టుకుని వెళ్ళాను చూసారూ అదే నేను చేసిన పెద్ద పొరపాటు . కాయల వాళ్ళు పిలిచి పిలిచి మరీ రుచి చూపిస్తుంటే ఈయన గారు మహదానందం గా పెద్ద ముక్కలు రుచి చూసేస్తున్నారు . నేను వూరుకోలేక అంత పెద్ద ముక్కలు అన్ని తినకండి అని చిలక్కు చెప్పినట్లు చెప్పాను . వింటేనా ? పైగా నావైపొక సీరియస్ లుక్ ! కాయలు బేరమాడబోతే ఇవి బాగున్నాయి ఇచ్చేయ్ అన్నారు . మేము ప్రతిసారి వాళ్ళ తో గీసి గీసి బేరమాడతాము . అదేం లేదు .ఇవి బాగున్నాయా , బాగున్నాయి , ఎన్ని కావాలి ముప్పై నా ఇచ్చేయ్ అంతే ! ముక్కలు కొట్టే అతని దగ్గరా అంతే ఎంతకు బాబూ రెండు రుపాయలకొకటి కొడతావా సరే కానీయ్ . అదికాదండి పోయిన సారి రూపాయకే కొట్టాడు అంటే కాదమ్మగారు ఇప్పుడు రేట్ పెరిగింది అని అతను. మా వారేమో ఒక్కో కాయా కడిగి తుడిచి మహా శ్రద్దగా ఇస్త్తుంటే ఎలా కొడుతున్నాడా అని నేను చూస్తుండగానే ఈయన గారు , చిన్న ముక్కలు కొట్టు బాబు అన్నారు . చిన్నవా , టెంక సరిగ్గా రాదు అని చెప్ప బోయాను . నీకు తెలీదు వూరుకో , ఎపుడూ నువ్వూ , విజయ పెద్ద ముక్కలు కొట్టించి వేస్ట్ చేస్తారు . చిన్న ముక్కలైతే , ఎక్కువ వస్తాయి , పిల్లలు పారేయకుండా తింటారు అనేసారు . ఐనా వూరుకోలేక ఈ కాయల మీద కొంచం నల్లగా రసి వుందండి వాసన వస్తాయేమో అన్నాను . హుం నా గోలే కాని వినే నాధుడేడి ? కాదట బ్రహ్మాండం గా వున్నాయని కొట్టే అతను , మా వారు కితాబులిచ్చేసారు . ఇహ చేసేదేమీ లేక దిక్కులు చూస్తూ నిలబడ్డాను . కాయలు కొనడానికి వచ్చేవాళ్ళు , నన్ను ఏకాయ బాగుంటుంది అని సలహాలడగుతుంటే , అహా నన్నే కదా అడుగుతున్నారు అని చెప్పేస్తున్నాను . అది చుసి మావారికి కుళ్ళుపుట్టి ఆమె నడుగుతున్నారా ఆమె కేమి తెలీదండీ అనేసారు వాళ్ళతో . ఇన్ని సంవత్సరాల నుండి ఆవకాయ పెడుతున్నాను నాకు తెలీదా ????

పాపం మధ్యాహ్నం అన్నం తినలేక ఎమైందా అనుకున్నారు . నాకు చాన్స్ దొరికింది కదా , అని చెప్పానా ,అంత ముక్కలు తినొద్దు నోరు పొక్కి పోతుంది అని విన్నారా ? సార్ సార్ అని పిలిచి పిలిచి మరీ ఇచ్చారని తినేసారు బాగయిందిలే లల్ల లా అని పాడేసుకున్నా కాని పాపం మూడు రోజులు ఏమి తినలేక ఇబ్బంది పడుతుంటే చెప్పొద్దూ మహా జాలేసింది . సరే మొత్తానికి కొత్త ఆవాకాయ తిరగ కలిపి వేసే సమయానికి తినగలిగే స్టేజ్ కొచ్చారు . కంచం లో వేసిన ఆవకాయ చూసి , ఇందులో ముక్కలేవి మాలా ? అంతా పేస్ట్ లా వుందే అని తెగ హాచర్య పోయారు ! మరి చిన్నారి పిల్లల కోసం బుజ్జి బుజ్జి ముక్కలు కొట్టిచ్చారుగా , టెంక వూడి పోయి , ముక్క ఖారం లో కలిసి పోయి , నమిలే పనిలేకుండా హాయిగా మింగేసేలా తయారయ్యిందన్న మాట . ఊం కానీయండి , మింగేయండి అనగానే , కంచం లోకి , నా మొహం లోకి , శూన్యం లోకి , నిశ్సబ్దం గా , దీర్ఘం గా చూసి , పోనీ మళ్ళీ ఆవకాయ పెట్టరాదూ , పాపం పిల్లలు ఇదెలా తింటారు అని స్టేట్మెంట్ ఇచ్చారు . మళ్ళీనా అదెలా కుదురుతుంది ? అవాలు లేవుకదా కాస్త నసిగాను . ఎందుకు లేవూ ఒక కిలో దాచమని సావిత్రి కి చెప్పావుగా ! అన్నారు . ఏమిటీ నేను రహస్యం గా చెప్పాననుకున్నానే నేను చెప్పే రహస్యం ఇలా వుందా ? లేక ఈయనవి పాము చెవులా అని నేను సంధిగ్దావస్త లో కాసేపు వుండి , కుదరదు గాక కుదరదు .నాకు ఇంకా ఆవకాయ పెట్టే ఓపిక లేదు గాక లేదు . ఐనా ఈ ఆవకాయంతా ఏం చేయను ? బోయినపల్లి మార్కెట్ దగ్గర , ఈ జాడీ లన్నీ పెట్టుకొని అమ్ముకోనా అని ఏడుపు గొంతు తో అరిచాననుకున్నాను ! మాలా , నీకంత కష్టం కలిగిస్తానా ? ఇవన్ని మా సైట్ కు తీసుకెళ్ళి గాంగ్ వాళ్ళ కిచ్చేస్తాలే అని నన్ను ఓదార్చారు .

శ్రీరామచంద్రా నారాయణా ఎన్ని కష్టాలు తెచ్చావురా నాయనా ( మా అబ్బాయో , మా మనవడో పక్కన వుంటే నేను శ్రీరామచంద్రా , అనగానే మిగితాది వాళ్ళు అనే వాళ్ళు . పక్కన వాళ్ళు లేక పోబట్టి అది కూడా నేనే అనుకోవాల్సి వచ్చింది ) . ఇప్పుడు నేనెవరిని చూసి జాలి పడను ?

ముచ్చటగా మూడోసారి ఆవకాయ పెట్టక తప్పదా ?????

హారి భగవంతుడా ఏదీ దారి * * * * *

Wednesday, May 19, 2010

శారద ( నా ఋషి : కురుతే కావ్యం )
డెబ్బైలలో సాంఘిక తెలుగు నవలలు , అవీ రచయిత్రులవి పాఠకులను ఒక ఉర్రూతలూగించాయి . అప్పుడే నేను నవలలు చదవటము మొదలు పెట్టాను . అందుకేనేమో అవి నాకు చాలా నచ్చేవి . ఆ తరువాత తరువాత అన్నీ , ఎక్కువగా ఏవేవో సమాచారాలను పాఠకులకు ఇచ్చే , సోధించే నవలలు ఎక్కువైనాయి . ఏమో నేను చాలా లైట్ . అంతటి విజ్ఞానాన్ని హరాయించుకునే శక్తి లేక చదవటము మానేసాను . ఇదో మళ్ళీ ఇంత కాలానికి బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ బ్లాగ్మాగ్జిన్ లో పుస్తక పరిచయం చేసేందుకు , పాత పుస్తకాలను వెతుక్కొని చదవటం మొదలు పెట్టాను .

మంచి పుస్తకం/ లేదా కావ్యం రాయాలి అంటే , ఓ ఋషి లా సాధన , తపస్సు కావాలి . ఋషి కానివాడు కావ్యం రాయలేడు . ఇది ఎందుకు చెపుతున్నాను అంటే ఇక్కడ " నా ఋషి: కురుతే కావ్యం " చదవండి తెలుస్తుంది .

నా ఈ ఆర్టికల్ ప్రచురించిన ,గీతాచార్య గారికి , సృజనా రామానుజం కు , చైతన్య కళ్యాణి కి ధన్యవాదాలు . నా నృషి: కురుతే కావ్యం అంటే సరైన అర్ధం విడమరచి చెప్పిన సుభద్ర వేదుల గారికి ధన్యవాదములు .

Thursday, May 13, 2010

బ్లాగ్ అంతర్జాలం లో అతివలు - కొసమెరుపు

బహుషా మూడు నెలల కిందట అనుకుంటా , ప్రమదావనం లో కొత్తగా చేరిన కృష్ణ వేణి నాకిక్కడ ఎవ్వరూ తెలీదు అంటే సరదాగా , సరే సద్దుకొని కూర్చొని , వినండి పరిచయం చేస్తాను అని కొంత మంది ప్రమదావనం బ్లాగర్ ల ను పరిచయము చేసాను . ఇలాగే అందరినీ మీ బ్లాగ్ లో పరిచయం చేయొచ్చుగా అన్నారు లలిత . అయ్య బాబోయ్ నా వల్ల కాదు , నాకంత ఓపిక లేదు , సుభద్రకు ఆ పని ఒప్పచెబుదాము , తనకి చాలా ఓపిక , బాగా రాస్తుంది కూడా అన్నాను .అలాకాదు , మీరు మొదలు పెట్టారు కదా మీరే రాయండి , మీకు కావలసినంత టైం తీసుకోండి అన్నారు జ్యోతి . అవునవును మీరే రాయండి , కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అంది సుభద్ర . జయ తో అంటే చాలా భయ పెట్టింది , వద్దక్కా , ఎవరినైనా మరిచి పోతే , ఏవరిగురించైనా రాసింది వాళ్ళకు నచ్చక పోతే బాగుండదు అని . మళ్ళీ రెండో రోజు రాయిలే , కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అంది .అదో అలా మొదలైంది ఈ యజ్ఞం

అప్పుడే ఎందుకో మదర్స్ డే రోజుకు వచ్చేట్లుగా రాస్తే బాగుంటుందేమో అనే ఆలోచన రూపు దిద్ద్దుకుంది . ఇహ కసరత్తు మొదలు పెట్టాను . ముందుగా నాకు కామెంట్ పెట్టిన వారి లింక్స్ తీసుకున్నాను . ఆపైన , ప్రతిరోజూ కూడలిని చూడటము , అందులోని మహిళా బ్లాగర్ ల లింక్ తీసుకోవటము అలా చాలానే కలెక్ట్ చేసాను . మద్య మద్య లో జయ తో , సుభద్రను తో చర్చించేదానిని . అదేమిటో ఇద్దరిమీద శిశిర ఏమాయ చేసిందో , నేను అడిగిన ప్రతిసారీ , శిశిర లింక్ తీసుకున్నావా అని మొదటి ప్రశ్న అడిగే వారు . ఓసారి చెప్పేసాను , ఎన్ని సార్లు చెపుతారు ? ఇంకోసారి శిశిర అన్నారో మీ గురించి కూడా రాయను అని . అలా పాపం ఇద్దరూ చాలానే సాయం చేసారు .( స్వగతం ; ఈ సోదంతా ఎందుకు )


. కొన్ని సార్లు విమానం కోసం ఎదురుచూస్తూ , లాంజ్ లో కూర్చొని లింక్స్ వెతికేదానిని .( స్వగతం ; ఈ మద్యకాలం లో విమానం లో ఎప్పుడు ప్రయాణించావు ? ) ఏ . సీ ట్రేన్ కోసం ఎదురు చూస్తూ ప్లాట్ ఫాం మీద కూర్చొని లింక్స్ వెతికాను .( స్వగతం ; ఏ. సీ ట్రేన్ నా ? కొయ్ . . . కొయ్ ) కార్ లో వెళుతూ కూడా లింక్స్ వెతికేదానిని ( స్వగతం ; ఏమిటీ కార్ లో కూడా లాప్ టాప్ తీసుకెళ్ళావా ?మరీ అంత ఒద్దమ్మా !! ) ఏయ్ స్వగతం కొంచం నోరు మూస్తావా ? ఎంత బిజీ గా వుండి , ఎంత కష్టపడి రాసానో బిల్డ్ అప్ ఇవ్వాలా వద్దా ? అయినా నీకేం తెలుసు పెద్ద పెద్ద రైటర్స్ అలాగే చెప్పాలి . అలా అలా ముచ్చట గా మూడు నెలలు లింక్స్ తీసుకొని మొదలు పెట్టానా . . . మూడుభాగాలూ అయ్యాయనుకున్నానా . . . అమ్మయ్యా అనుకున్నానా . . .

టక్. . . టక్ . . . మాలాగారూ ,

ఇదిగోండి ఇంకొన్ని లింక్స్ .

ఓ థాంక్ యు మధురవాణి .

అరే ఈ లింక్స్ ఇంతకు ముందు నేను చూసానే ! ఎందుకు రాయలేదు చెప్మా ?? ఓ మధ్య లో నా ఇతిహాస్ ( టెస్ట్ బ్లాగ్ . స్పెల్లింగ్ ఇంగ్లిష్ లో రాసుకొని తిప్పి చదవండి ) ట్రబుల్ ఇచ్చినప్పుడు వర్డ్ లో వున్నాయి కదా అని ఆ బ్లాగ్ ను డిలీట్ చేసినప్పుడు ఎగిరి పోయినట్లున్నాయి . ఓకే కలిపేస్తే పోలా .

టక్ . . . టక్ . . .

ఎవరదీ , ఓ వరూధిని గారా రండి రండి ఏమిటి సంగతి ?

ఇదోండి ఇంకొన్ని లింక్స్ . వీళ్ళ లో కొంత మంది రాయటము మానేసారనుకోండి . ఎలాగూ మీరు బుక్ చేస్తున్నారు కదా కలిపేయండి .

మంచిదండి , మీరు శ్రమ తీసుకొని ఇచ్చారు . థాంక్ యు .

మాలా గారూ అన్ని ఆడ్ చేసాక చెప్పండి ఒకేసారి పిడియఫ్ చేస్తాను .


జ్యోతి గారూ సరేనండి . మళ్ళి మళ్ళీ చేయాలంటే ఇబ్బంది కదా .

కలిపేసా . . . టక్. . . టక్ . . మాలా గారూ ఇదిగోండి ఇంకో రెండు లింక్స్ దొరికాయండి . కలిపేయండి . లేక పోతే వాళ్ళు నొచ్చుకుంటారు .

మంచిదండి .

జ్యోతి గారూ ఐపో. . .

టక్. . . టక్ . . . మాలా గారు ఇదిగోండి ఇంకో రెండు దొరికాయ్ !

బాబోయ్ వరూధిని గారూ ఇహ నన్ను వడిలేయండి . నేను హైదరాబాద్ నుండి పారి పోతున్నాను .

మీరెక్కడి కెళ్ళినా మిమ్మలిని వదలను గా .

వా ( ( ( . . . . .

టిక్ . . . టిక్ . . . టిక్ . . .

అయ్య బాబోయ్ ఏదీ దారి ?

హుర్రే . . . యాహూ . . ఊ


అమ్మమ్మా . . . యాహూ పాత పాట అమ్ముమ్మా ధూం మచావో ధూం , యా బామ్మా ధూం మచావో . అంతే మా హాలిడే హోం ( మా ఇంటికి నా మనవరాళ్ళు , మనవళ్ళు పెట్టుకున్న పేరు ) మా ఐదుగురి డాన్స్ తో , కేకలతో హోరెత్తి పోయింది .

బామ్మా నా దో డౌట్ అడగనా ?

నీకు ఇంకా డౌట్ లు రాలేదేమా అనుకుంటున్నాను . అడగరా గౌరవ్ .

మనమిప్పుడు డాన్స్ ఎందుకు చేసాము ?

ఏముంది . అమ్మమ్మ బ్లాగ్ బాగుందని అందరూ కామెంట్స్ పెట్టివుంటారు అని విక్రం జవాబు .

థ్రీ డేస్ నుండి వస్తున్నాయి కదా బామ్మా , ఇప్పుడు ఏదో స్పెషల్ ఐవుంటుంది . కదా బామ్మా మేఘ ప్రశ్న .

అవునురా బంగారూ , మా ఫ్రెండ్ ఈ ఆర్టికల్ భూమిక మాగ్జిన్ లో పెడుతారుట , నా కిస్తావా అని పర్మిషన్ అడుగుతున్నారు .
ఎలా రాస్తారుట ? అడిగావా ? అమ్మమ్మా ? అదితి ప్రశ్న .

ఎలా రాసినా నేను రాసింది అడిగారు కదా అదే గొప్ప . మీరందరూ , నాకు లాప్ టాప్ త్యాగం చేసేసి , నేను రాసుకునేటప్పుడు గొడవ చేయకుండా వుండి చాలా కోపరేట్ చేసారు . చెప్పండి , మీకేం కావాలి ?

ఐస్ క్రీం కోరస్ గా చెప్పేసారు .

ఓకే సాంక్షన్ !

సో అలా సహకరించిన అందరికీ వేల వేల ధన్యవాదాలు . వరూధిని గారు నిజం గా ఇందులో సగం క్రెడిట్ మీదే . మీకు చాలా చాలా థాంక్స్ . మధురవాణి గారు ఇచ్చినవీ , వరూధిని గారు ఇచ్చినవీ , మంచుపల్లకి గారు ఇచ్చినది , ఇంకా కొన్ని లింక్స్ జ్యోతి గారు చివర లో ఇచ్చినవి , ఈ మధ్య యాదృచ్చికంగా నా కెమెరా కంటికి చిక్కినవీ , అవీ , ఇవీ అన్నీ మొదటి , రెండవ భాగాల లో కలిపి జ్యోతి గారికి హాండోవర్ చేసాను . జ్యోతిగారేమో పిడియఫ్ చేసి సత్యవతిగారికి ఇస్తారన్నమాట . సత్యవతి గారేమో అందరితో జూన్ భూమిక లో ధూం ధాం చేయిస్తారుట ! మహిళా బ్లాగరిణులూ మీ ఫొటో కూడా వేస్తారుట . నేనైతే ఓపది ఫొటో లిచ్చాను . మరి మీ ఇష్టం .


చదివి స్పందించిన పాఠకులూ పేరు పేరు నా మీకందరికీ ఇవే నా ధన్య వాదములు . ఆగండాగండి మీ పిల్లల కేమో ఐస్ క్రీం లూ మాకేమో దండాలా అని అలా గుర్రుగా చూడకండి . ఇదిగో మీకూ ఐస్ క్రీంలూ .


నా కష్టాన్ని చూసి మనసు కరిగి నీరై (ఎండలు అలా ఉన్నాయి మరి) , అడక్కుండానే మార్పులతో మళ్లీ e పుస్తకం చేసిచ్చారు... థాంక్ యు జ్యొతి గారు .

Monday, May 10, 2010

వాలుకొబ్బరి చెట్టుకు జన్మదిన శుభాకాంక్షలు' వాలు కొబ్బరిచెట్టు ' పేరు చూడగానే , ఇదెవరో కోనసీమ వాళ్ళే రాసివుంటారు అనుకుంటూ చూసాను . వాహ్వా నా గెస్ కరెక్టే . అలా మొదటిచూపులోనే దోస్త్ ఐపోయింది , వాలుకొబ్బరిచెట్టు . అందులో వచ్చే కోనసీమ తోటల కబుర్లకు మహా కుళ్ళుకొని , అంతలా వూరించక పోతే మమ్మలిని పిలవొచ్చుగా మీ తోటకు అని పోట్లాటేసుకున్నాను . అలా సుభద్ర తో కూడా దోస్తీ కుదిరి పోయింది . వాలుకొబ్బరి చెట్టూకింద కూర్చొని , కొబ్బరి నీళ్ళు తాగుతూ ఎన్ని కబుర్లు చెప్పుకుంటామో లెక్కే లేదు .

చిన్ని కశుగాడిని నవ్వరా బాబూ ఎంత బతిమిలాడుకున్నా అబ్బో ఎంత ఏడిపించాడో , విజయభాస్కరవర్మ గారి పేరు , సుభద్ర పేరు తో ఎంత హిస్టరీకల్గా మాచ్ అయ్యిందో . పెళ్ళికాని ప్రసాదుల కోసం కేరళ కుట్టీల ( బంగారం ) అందాలూ , రాజాధిరాజంట అంటూ అంట అట అని విన్న న్యూస్లూ , మరుజన్మలో జేజి గా పుట్టాలి అని , జేజిని తలుచుకునే కబుర్లూ , ఇలా ఒకటేమిటి బోలెడు కబురులు చెప్పుకుంటూ చెప్పుకుంటూ వుండ గా వుండగా ఏడాది గడిచి పోయింది . ఎంత తొందరగా గడిచి పోయిందో కదా !

ఇంకా బోలెడు సంవత్సరాలు ఇలాగే ఇంకా ఇంకా బోలెడు కబుర్లు , చెప్పాలని కోరుకుంటూ ,

వాలుకొబ్బరిచెట్టుకు జన్మదిన శుభాకాంక్షలు .

Sunday, May 9, 2010

బ్లాగ్ అంతర్జాలం లో అతివలు - నాలుగవ భాగం ( మాతృదినోత్షవ శుభాకాంక్షలు)

చిన్నగా పకోడీల ప్లేట్ తడిమాను . అబ్బే లేవే ! ఇన్ని బ్లాగులు చదివే లోపల అన్నీ వూదేసినట్లున్నాను . హుం . సరే కాఫీ తాగేస్తే ఓపనై పోతుంది కదా . నా తో పాటు చదువరులందరినీ తిప్పాను కదా . పాపం అలసి పోయి వుంటారు . మీరూ ఓ కాఫీ కప్ తెచ్చుకోండి .( చూడండి నాదెంత ఉదార స్వభావమో , నేనొక్క దానినే తాగకుండా మిమ్మలినీ తెచ్చు కోమన్నాను కదా ! )

ఆ ((( . . . ఎన్ని బ్లాగులు చదివాము ? డెబ్భై పైనే అనుకుంటా . నేను లెక్కపెట్టలేదు . ఎన్ని రకాల బ్లాగులు ! ఎన్నెన్ని ఊసులూ !! ఒక్కో బ్లాగ్ ఒక్కో రకం . ఒకదానికొకటి పోలికే లేదు . కమ్మటి కబుర్లు కొంత మంది చెపితే , కథలు కొంతమంది రాసారు . కవితలైతే అబ్బో ఎంత భావుకత తో వున్నాయో ! నేనూ ఎప్పటికైనా అలా ఓ మంచి కవిత చెప్పగలుగుతే నా !! చిన్ననాటి మరుపురాని మధుర సృతులు , ఉషారైన పోస్ట్ లు కొన్ని . ఆలోచనలను రేకెత్తించేవి కొన్ని . సమాజము లోని దుస్తితిని ఎత్తి చుపుతూ హం భీ కుచ్ కం నహీ అనేవి కొన్ని . పాటలవి కొన్ని , రకరకాల వంటలవి కొన్ని , అందమైన ఫొటోలతో కొన్ని , రకాల కళలను నేర్పేవి కొన్ని , పుస్తకాల గురించి వివరించేవి కొన్ని ,వకటి ఎక్కువ , ఇంకొకటి తక్కువ అనేలా లేవు . దేనికదే గొప్పగా వున్నాయి .

అందరూ రచయిత్రులు కారు . సాధారణ గృహిణి నుంచి , రచయిత్రులు , సంఘ సేవికులు , వివిధ వృతులలో వున్న వారూ కళాకారులు అందరూ తమదైన శైలి లో తమ తమ భావాలను అందరి తో పంచుకుంటున్నారు . ఒక టపా లో శిశిర అన్నారు , అందరూ ఫీల్ గుడ్ అన్నట్లు అన్ని పాజిటివ్ విషయాలే రాస్తారు అని . అవును కదా మన సంతోషాన్ని పది మంది కీ పంచాలి . ఇబ్బందిని మనలోనే దాచుకోవాలి అని పెద్దలు చెప్పారుకదా . అదే పెద్దలు , మన కష్టం ని ఇతరులకు చెప్పుకొని మనసు తేలిక పరుచుకోమని కూడా అన్నారు . కాని ఆ సమయము లో చెప్పుకున్నా , ఆ తరువాత మనం వారి దగ్గర చులకనై పోతా మేమో ననే భయం తో కూడా అందరికీ చెప్పలేము కదా ! ఏమైతేనేమి , మంచి , సరదా విషయాలను చెప్పుకొని , బాధలను మరచిపోయే పసందైన వేదిక బ్లాగ్ !

ఇంట్లో పని , ఆఫీస్ లో ఉద్యోగం చేసుకుంటూ తీరిక సమయములోనే రాస్తున్నారు . అమ్మాయిలు చేసే అష్టావధానం లో ఈ బ్లాగింగ్ కూడా చేరింది ! అలసిన మనసులను , అమ్మ కాని అమ్మ గూగులమ్మ వొడి లో సేద తీర్చుకుంటున్నారు . భావాలను పంచుకోవటమే కాదు , కొత్తగా కంప్యూటర్ నేర్చుకున్న నాలాంటి వారు టెక్నికల్ విషయాలు కూడా తెలుసు కోగలుగుతున్నారు . అంతేనా , ఈ అతివలందరూ ఎవరికైనా ఇబ్బంది వస్తే మేమున్నాము అంటూ ముందుకు వచ్చి వొకరికొకరు సహాయము చేసుకుంటున్నారు . వారిలో వారికే కాదు సహాయము అవసరమైన వారికి , వృద్ధులు , అనాధలు , వరదబాధితులు మొదలైన వారికి మీకు మేమున్నాము అండగా అంటూ ఆపన్న హస్తం అందిస్తున్నారు . మేము అచ్చమ్మ , బుచ్చమ్మ కబుర్లు చెప్పుకోమండి , సరదాగా వుంటూనే మాకు చాతనైన సహాయం చేస్తాం అంటున్నారు ఈ అతివలు . అమ్మాయైనా , అమ్మైనా , అలసట ఎరుగని అతివ మనసు ఎప్పుడూ అమ్మతనముతో నిండి వుంటుంది . అందుకే సృష్ఠి లో అమ్మకు లేదు మారు రూపం . అమ్మ అమ్మే .


నాకెవ్వరూ తెలీదు అన్నారు కృష్ణ వేణి . సరేనండి అని కొంత మందిని పరిచయము చేసాను . మీకు మీరే కాకుండా బ్లాగ్ ముఖం గా మా కందరికీ పరిచయం చేయొచ్చుగా అన్నారు లలిత డి . కానీయండి అని ప్రొత్సహించారు జ్యొతి . ఊ ఊ కానీయ్ , నీకు నిండా మా సహాయ సహకారులుంటాయ్ అన్నారు ( అందించారు ) సుభద్ర , జయ . ఇక చేసేదేముంది ? కళ్ళు మూసుకొని రాసేసాను . నన్ను ఈ బరి లోకి దింపిన వీరికి బోలెడు థాంకూలు . ' నా బ్లగ్ అంతర్ జాలం లో అతివలు ' , మొదటి , రెండవ , మూడవ భాగాలు చదివి పెట్టిన , స్పందిచిన మీకూ బోలెడు బోలెడు థాంకూలు . ఇల్లాలి ముచ్చట్లు , మనమీదేన్ రోయ్ పేరు , శైలి అమ్మాయి బ్లాగ్ లా అనిపించింది . కాని ఎవరు రాశారో తెలీలేదు . శారద , నన్ను మర్చి పోయారో అని అలిగారు కాని ప్రొఫైల్ ఏది ? ఊం హూ నాకు దొరకలేదే ! వాకే వాకే నీలాంబరి గారు దొరికి పోయారు బ్లాగ్ సోదరి ఈ రోజు బ్లాగ్ మగ మహారాజుల గురించి రాసి తెలిసిపోయారు గా . ఇదిగిదిగో ఇంకో కథల బ్లాగ్ జాజిమల్లి కుడా ఇప్పుడే దొరికింది . అలాగే అమ్మాయిలూ , మీ ఎవరిదైనా బ్లాగ్ పరిచయం ఇందులో లేకపోతే నాకు కామెంట్ బాక్స్ లోనైనా , మేయిల్ ద్వారా నైనా తెలపండి . చేర్చేస్తాను . అలాగే నేను మీ బ్లాగ్ గురించి చేసిన పరిచయము ఎవరికైనా నచ్చక పోతే చెప్పండి తొలిగించేస్తాను . అంతేగాని నన్ను అపార్ధం చేసుకొని మూతి ముడుచు కోకండి .బంగారు తల్లులు కదూ !.

నేను ముందుగా అరవై మాత్ర మే వున్నాయనుకొని , ఇరవై చొప్పున మూడు భాగాలు చేసాను . కాని తవ్వినా కొద్ది బంగారం బయటకు వస్తోంది . ఇప్పుడే మధురవాణి ఈ బ్లాగుల లింక్ లు పంపారు . మరి వాటినీ ఓసారి ఇక్కడ చూద్దామా !!! మధురవాణి ,శ్రమ అనుకోకుండా ఈ లింక్స్ ఈచ్చి సహాయ పడి నందుకు నీకూ థాంకూలు .

అందరికీ మాతృదినోత్షవ శుభాకాంక్షలు .

మహిళా బ్లాగర్ల గురించి వ్యాసాలు ఇలా ముక్కలుగా ఉంటే అస్సలు బాలేదు. అన్నీ ఒక్కదగ్గర పెట్టి పిడిఎప్ చేసిపెట్టమని గురూజి సూచించారు . అసలే ఎండలు మండిపోతున్నాయి. అవకాయ పనులున్నాయి. ఈ లింకులన్నీ వెతికేసరికే బుర్ర వాచిపోయింది. నావల్ల కాదంటే సరే అని ఇలా ముచ్చటైన పుస్తకంలా చేసిచ్చారు.
జై గురూజి.. మీరు క్లిక్కేసి చదువుకోండి..


Friday, May 7, 2010

బ్లాగ్ అంతర్ జాలం లో అతివలు - మూడవ భాగం


మానసవీణ ను మీటే అద్భుతమైన కవితలు , చిన్న కథలు ఇక్కడ .

తూర్పు - పడమర , రెండు తీరాల నడుమ నా శతసహస్ర ఆలోచనల ప్రతిద్వనులు , అంటున్నారు , కల్పనా రెంటాల .

స్వేచ్చగా , సరదాగా , సూటిగా మనసులో మాట చెపుతున్నారు సుజాత .

మాయా శశిరేఖ , బాలా కుమారినంట , చాలా సుకుమారినంట అంటున్నారు సౌమ్య .

నీలి నీలి మబ్బుల్లో తేలిస్తారు సత్యప్రియ లో రాధిక .

కబుర్లు , కబుర్లు ! , వట్టి కబుర్లే కాదు , తాజ్ మహల్ అందాలను వివిధ కోణాలలో చూసి ఆనందించండి , సుజాత గారి గడ్డిపూలు లో .

మధుర భావాలతో చక్కటి సుమ మాలలు అల్లుతారు రమణి .

తెలుగు సాహిత్యానికి వేదిక మాలతి గారి తెలుగు తూలిక .

ఆనందించే మనసుంటే , ఆలరించే ప్రయత్నం నేనౌతా అంటున్నారు , ప్రేరణ .

నా భావాలు, అనుభవాలు, ఆలోచనలు, స్పందనలు, జ్ఞాపకాల సవ్వడి అంటున్నారు ఎదసడి లో శిశిర .


రకరకాల కబుర్ల తో శరవేగం గా బ్లాగ్ లోకం లోకి దూసుకు పోతున్నారు , నిఖిత చంద్రసేన .


ప్రకృతి వడి లో , సముద్రపు అలలను కప్పుకొని , హాయిగా నిదురిస్తూ , కలలప్రపంచం లోకి మనలను కూడా తీసుకెళుతారు స్వప్న .


పల్లెల్లో, గూడేలలో, అడవిలో, సముద్రపు ఇసుకల్లో.. ప్రజల జీవితాలని దగ్గరగా చూసిన అనుభవాలు,అరుదైన దారుల్లో ఎదురైన అనుభూతులు, నా మనసును హత్తుకొన్నవి, నాకు స్పూర్తినిచ్చినవి ఇవి ...దిరిసెన పుష్పాలలా అరుదైనవి,సున్నితమైనవి.వీటిని మీ అందరితో పంచుకోవలని ....అంటున్నారు శిరీష దిరిసెన పుష్పాలు లో .


అందమైన కవితలమయం పద్మార్పితం ,


చిట్కాలూ , వంటలు ఒకటేమీటి బోలెడు విషయాలు చెపుతారు భవాని మల్లాది .


కవితల తో కొత్తగా బ్లాగ్ మొదలుపెట్టారు , జ్యోత్స్న . ఏమవుతుందో దాని భవిత అని బెంగపడుతున్నట్లున్నారు . ఏమీ కాదని , వేల కవితల తో వర్ధిల్లుతుందని బెస్ట్ ఆఫ్ లక్ చెబుదామా !!


సరదా పరదాలు , నచ్చిన పుస్తకాలూ , సినిమాలు ఇలా అన్నిటినీ తట్టుతారు , స్నిగ్ధకౌమిది లో ప్రణీత స్వాతి . ఈ మద్య ఆక్సిడెంట్ అయ్యి లేవలేక ఎక్కువగా రాయలేక పోతున్నాను అన్నారు ఒక పోస్ట్ లో . త్వరగా కోలుకొని మరిన్ని రచనలను అందించాలని కోరుకుంటున్నాను .


మరు జన్మ లో కూడా ఆడపిల్ల గానే పుట్టాలనుకుంటున్నారట , శ్రావ్య వరాళి .


నా చిన్ని ప్రపంచానికి నేనే మహారాణి ని అంటున్నారు రాజి .


పిట్ట కొంచం కూత ఘనం , ఈ చిన్ని పాప బ్లాగ్ లహరి .


మరో చక్కటి కవితల బ్లాగ్ మానస చామర్తి గారి మధుమాసం .


అనుకోకుండా తెలుగు బ్లాగ్ లను చూసి , పాటే నా ప్రాణం అని తనూ బ్లాగ్ మొదలుపెట్టారట అపర్ణ . బెస్ట్ ఆఫ్ లక్ అపర్ణ .


పచ్చడి మెతుకుల దగ్గర నుండి ,( లాప్ ) టా భూషణం వరకూ సరదాగా చదవొచ్చు కృష్ణప్రియ డైరీ లో .


ఎనెన్నో మంచి రచనలను సేకరించి బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ బ్లాగ్ ద్వారా అందిస్తోంది , చైతన్య కళ్యాణి .


నేను సాదా సీదా తెలుగు అమ్మాయిని అంటున్నారు శ్రావ్య వట్టికుటి రవీయం లో .


నేనేమైనా చిన్న దాన్నా ? చికదాన్నా ? బోల్డు కుంచం పెద్ద దానిని ఆహా ఓహో అంటోంది గీతా ప్రియదర్షిని .


ఆలోచింప చేసే టపాలు నాలో ' నేను ' .


రెండు కథలు రాసానోచ్ , నేను కాదు రాసింది , సౌమ్య .


నాకు అమెరికా వద్దు , అమ్మ కావాలి అంటున్నారు , ఇదీ సంగతి లో జాహ్నవి .


ప్రియదర్షనీయం కళ్ళాత్మకం.


నిద్ర కోసం , నిద్రే నా ప్రాణం , నిద్రలేక నేను లేను . నేను కాదండి బాబూ . ఆ కబుర్లు చెప్పేది శివరంజని .


అందమైన కవితలు , ఆలోచనలు రేకెత్తించే తెలుగు వ్యాసాలు , ఇంగ్లిష్ , వ్యాసాలూ , కవితలూ వున్నాయి స్వాతి గారి కల్హార లో


ఒక పుస్తకం మీ జీవితాన్నే మార్చేస్తుంది అంటున్నారు రుత్ , ముద్దమందారం లో .


అమూల్య గారి బ్లాగ్ రామాయణం చదవండి అమూల్య లో .


వెన్నల్లో ఆడపిల్ల కవితనుండి , రకరకాల విషయాలను కిరణ్ గారి , వెన్నెల లో చదవచ్చు .


పెళ్ళి మంత్రాలకి వివరంగా అర్ధం ,+ వాఖ్య +చిటికెడు హాస్యం తో కలిసి , పెళ్ళిముచ్చట్లు చదవండి శ్రీవైష్ణవి గారి బ్లాగ్ లో .


అబ్బ ఫొటోస్ ఎంత బాగున్నాయో !


ఆదివారం వెరైటీ లంచ్ కోసం ఏంచేయాలా అని తల బద్దలు కొట్టు కోవటం ఎందుకు ? సూర్య లక్ష్మి గారిని అడిగేస్తే ఓ పనై పోతుంది కదా !


నీలాకాశం లో ఓ చిన్న మబ్బు తునకనుండి జాలువారిన చిరు జల్లులా హృదయ నివేదిత ఈ వనితా వేదిక అంటున్నారు వేద .


ఇప్పుడే నా కంట బడ్డ బ్లాగ్ నారాతలు .


బ్లాగ్ కాకపోయినా , కాంతి పాతూరి గారి కౌముది మాస పత్రిక ఎంత బాగుంటుందో !!

అందులోని సుభద్ర వేదుల అగ్రహారం కథలు తప్పక చదవవలసినవి .

నాకు తెలుగు రాదు అంటూ , తెలుగు మీద అభిమానం తో , ఇంట్లోనే తెలుగు నేర్చుకొని , ఫామిలీ రేడియో కు ఈ అనువాద రచన చేసిన కృష్ణవేణి పట్టుదల మెచ్చుకో దగినది .

ఏమిటీ నేనేమైనా పరమానందయ్య శిష్యురాలి ననుకుంటున్నారా ? ఇంతమంది లెక్క పెట్టి నన్ను లెక్క పెట్టు కోకపోవటాని కి . ఇది నా సాహితి . చదువుతూ వుండండి . . . చదువుతూనే వుండండి సాహితిని . అంతే కాదండోయ్ మీ అమూల్య మైన అభిప్రాయాలనూ తెలపండి . మీ అభిప్రాయాలే మాకు మహాద్భాగ్యం .

ఇంకా వుంది * * * * *

Wednesday, May 5, 2010

బ్లాగ్ అంతర్ జాలం లో అతివలు - రెండవ భాగం

నా కోరికలూ , నా ప్రయణ సాధనాలు అని ఊసులు చెప్పే స్వాతి బ్లాగ్ ఇదే .

మీకు కవితల మీద ఇంటరెస్ట్ ఉంటే తెలుగుకళ , పద్మకళ గారి కవితలు చదవండి .

వెబ్సైట్ డిజైన్ లో ఎక్స్ పర్ట్ జాహ్నవి .

కబుర్లు చెప్పుకుందాం రండి అనీ, ఆప్యాయంగా పిలిచి , ఎప్పుడూ మంచి విషయాలే మాట్లాడండి , అని కబుర్లు చెపుతారు , సురుచి జ్ఞాన ప్రసూనగారు .

పియస్ లక్ష్మి గారి బ్లాగ్ చదివారా ? యాత్రలు చేసి వచ్చి , మనందరికీ ఎలా వెళ్ళాలో సులువుగా చెప్పే గైడ్ యాత్ర .

బ్రహ్మ కమలం గురించి , మినర్వా పక్కనున్న నాగమల్లి గురించి , రామాంతపూర్ లోని సంపెంగి తోట గురించీ , జూ లోని వెదురుపూల గురించీ చెప్పి నన్ను రోడ్ ఎక్కిస్తుంటారు మా గోదావరి , సత్యవతి గారు .నాకైతే సత్యవతి గారి బ్లాగ్ లో పూలపరిమళాలు కనిపిస్తాయి .కాని ఆ బ్లాగ్ లో ఎక్కువగా మహిళల అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే సత్యవతి గారు మహిళల కోసం,స్త్రీల అంశాల కోసం తపన పడే కార్య కర్త .

మనసు పలికే ఆలోచనల రూపమే ప్రసీద బ్లాగ్ .

మామిడి పండు తినగానే , టెంకలో మొలక కనిపించే విచిత్రము తెలుసుకోవాలంటే స్వర్ణమల్లిక చదవాల్సిందే .

పాటలు బాగా వింటుందిట స్రవంతి . మరి పాడి కూడా వినిపించొచ్చు కదమ్మాయ్ ! స్రవంతి బ్లాగ్ చూడాలంటే రిజిస్టర్ చేసుకోవాలట మరి .హాయ్ స్రవంతి , మీ బ్లాగ్ లింక్ పట్టేసుకున్నాగా .

విజయభారతిలను హాయ్ సెనొరిటా అని పలకరించి , కోనసీమ అందాలను చూసి రండి .

ఎంచక్కా బజ్జొని , బుజ్జి కవితలల్లే సుజ్జి ని కూడా పలకరించటము మరచిపోకండే !

బి.టి వంకాయల గురించి పోరాడటమే కాదు బోలెడు కబుర్లు చెపుతారు చంద్రలత గారు , మడత పేజీ లో .

కథకాని కథ , వీడ్కోలు లాంటి , కబుర్లూ కాకరకాయలు చెపుతారు మంజు .

ఉల్లసంగా , ఉత్సాహంగా ఓ అమ్మాయి ని చూడొచ్చు , మంజూష , నా అందమైన ప్రపంచములో .

memoravఅంటే ఇంగ్లిష్ బ్లాగ్ కాదండీ బాబూ , పార్వతి రాసే అచ్చమైన తెలుగు కవితల బ్లాగ్ .

రెండు నిమిషాలలో నూడుల్స్ లా , రెండే నిమిషాల లో , ఏ విషయము మీదైనా కవితల ల్లే మరువం ను నేను పరిచయం చేయటము సాహసమే !

ఏ విషయము మీదనైనా రోజుకొక టపా అలవోకగా రాసేస్తారు తృష్ణ . ఎప్పటి నుండో వెతుకుతున్న పాత పాటల లీంక్ ను నాకిచ్చి ఎంతో సహాయం చేసారు .

చిన్ని గారి బంగారానికి ఇంకా పేరు పెట్టలేదుట ! ఎవరా బంగారం ఎమా కథ అని నన్నడుగుతే ఏం లాభం ? ఇక్కడ చూడండి .

మనస్వి జయ , నేను ఎలుకలు తినే దానిలా కనిపించానా , హత్మోషి , అని వాపోతోంది . ఎక్కడ ? ఎందుకు ?

" మహేష్ బయట ఏమిటి గొడవ ?" "
ఎవరో నేస్తం జాజిపూలు అభిమాన సంఘం పిల్లకాయలట మేడం . లొల్లి పెడుతుండ్రు , సావిత్రమ్మ , చేసిన వేడి వేడి , ఖారం ఖారం పకోడిలు పెట్టనా మేడం ? "
" వద్దులే , పాపం చిన్న పిల్లలు వదిలేయ్ .'

సాఫ్ట్ వేర్ మొగుడ్స్ అని రాసి , ఆతరువత పాపం ఎక్కువగా అగుపడలేదు . నా మొదటి పోస్ట్ కు కామెంట్ ఇచ్చిన గుడ్ గర్ల్ . కదా హర్షోల్లాసం !

బోలెడన్ని మంచి మంచి కొసరు కథలు రమ్య గారి మనసు కలలు - కొసరు కథలు . నివేదన కూడా రమ్య దే .

సౌమ్య , పూర్ణిమ లు చాలా శ్రమ తో ఎంతమంచి పుస్తకాలను పరిచయము చేస్తున్నారో కదా .

తెలుగు ప్రపంచం ను చూపించే మంచి ప్రయత్న చేస్తున్నారు , కుసుమకుమారి .

మైత్రేయి గారు చాలా ఓపికగా ఎన్ని బ్లాగ్స్ రాస్తున్నారో చూడండి .

ఆంద్ర జ్యోతి లో అరుణ పప్పు గారి , బ్లాగ్స్ గురించిన ఆర్టికల్ చూసాకనే , నాకు , తెలుగు బ్లాగులు చాలా వున్నాయని , కూడలి గురించి తెలిసింది . అప్పుడే కూడలి లో నా బ్లాగ్ కలిపాను , మీకందరికీ నేను ,నాకు మీరు పరిచయం అయ్యాము . థాంక్ యు అరుణ .

నేనేమో మరి బుజబుజ రేకుల పిల్లని,బుజ్జా రేకుల పిల్లని బ్లాగేబ్లాగే పిల్లని,ఒప్పులకుప్పని,వయ్యారి భామని,తలుకులగుట్టని,మెరుపుల తట్టని...ఇంకా చాలా ఉంది నా గురించి చెప్పాలంటే,సరే మరి చెప్తాను మీరు వింటారా..? ఏదండీ ? మీనాక్షి గారు , మీరు చెప్తేగా మేము వినేది .

అబ్బో నా గురించి చెప్పాలంటే చాలా వుంది అంటున్నారు క్రాంతి అప్పుడేమి జరిగిందంటే లో . మరి చెప్పండి చదువుతాము .

బ్లాగువనమది అందరిది.... ఈ పోస్టులు అందరి కోసములే... కదా మరి .

కలలో . . . కన్నిటి అలలో . . . మాటే మంత్రమా ? ఎక్కడ ? ? ?

కమ్మటి సువాసనల తలపులు మీ మనసులో నింపే విరజాజిని. కొంత సాహిత్యభిలాషా, కాస్త తెలుగు భాషపై మమకారమూ, మరి కొంత తెలుగు సంస్కృతి పై గౌరవమూ, కొద్దో గొప్పో తెలుగు జాతి పైన అభిమానమూ కలిగిన అచ్చ తెనుగు ఆడపడుచుని. . .

ఆకాశం లో సగం అని , మంచి కవితలు చెప్పారు నిర్మల కొండెపూడి .

నిత్య వసంతాలు , వర్షపుజల్లులు , ఆపాతమధురాలూ , అవి ఇవీ అన్ని మొహనరాగాలాలపిస్తున్నారు , పద్మ .

నీకై నా నిరీక్షణ . . . నీదే నా ఆలోచన అంటున్నారు అభిసారిక మన:స్పందన లో

పెద్దలు నేర్పిన రుచికరమైన , ఉల్లి లేని వంటలు నేర్చుకోవచ్చు ( ఉల్లి తినని నాలాటి వారికివి ఎంత ఉపయోగమో ) శైలజ గారి బ్లాగ్ లో .

పు . . పు . . పులి మీసాలు ,ఎక్కడ బాబోయ్ . నేను -అనామిక లో నండీ బాబూ !

స్వాతి శ్రీపాద గారు మనలను మబ్బుల్లో తేలించే చక్కటి కవితలు నాఊహలు .

పుస్తకం నెట్ బాగస్వామిని పూర్ణిమదే ఇంకో బ్లాగ్ ఊహలన్నీ ఊసులై .

కొంచం తపన, కాస్త ఆసక్తి, కొన్ని కలలు, కాసిన్ని ఊహలు కలిపేస్తే నేను అంటున్నారు ఓ అమ్మాయి ..


ఈ "గృహమే కదా స్వర్గసీమ" ద్వారా వంటలే కాదు ఇంటిని ఎలా అందంగా ఆకర్షణీయంగా ఉంచగలమో తెలుసుకొగలరు.. నేను శాఖాహారిని, కావున కేవలము శాఖాహరము మాత్రమే వండగలను అంటున్నారు లక్ష్మి స్రవంతి ఉడాలి .


అనుభూతుల నిధి , శృతి గారి మన స్నేహం .


వీణ వేణువైన సరిగమ విన్నారా ? వినలేదా ! ఐతే వినండి లక్ష్మి గారి నా బ్లాగ్ లో .


ప్రశాంతి , తన ఎక్స్ పిరి ఎన్సెస్ చెపుతున్నారు , బ్లాగ్ లో చూడండి మరి .


నా కొసమెరుపు పోస్ట్ కోసం చిత్రాలు వెతుకుతుంటే అనుకోకుండా నా కంట పడింది , ఈ బ్లాగ్ స్వీయరచనలు .


రండి రండి పిల్లలూ ! అమ్మా నాన్నాను పిలవండి ! తేట తెలుగు వీనండి ! మళ్ళీ మళ్ళీ వస్తుండండేం ! అంటున్నారు ,జి లలిత తెలుగు పిల్లల కోసం రాస్తున్న బ్లాగ్ లో .


వావ్ ఈ పాటల పల్లకి ఎక్కారా ? దేర్ కిస్ బాత్ కీ !! శిరీష పాటల పల్లకి ను ఎక్కేయండి .నేను గోదావరి తీరంలో పుట్టిపెరిగినందువల్ల, ఆ నదీమతల్లిపై వున్న మమతానురాగాలతో నా ఆలోచనా తరంగాలకి 'గోదావరి తరంగాలు ' అని పెట్టుకున్నాను , అంటున్నారు జయశ్రీ తటవర్తి .


ప్రవల్లిక , తెలుగు , హిందీ , ఇంగ్లీష్ భాష ల లో చక్కటి కవితలను అందిస్తున్నారు పోయెట్రీ లో .


ఈ టీవి లో బ్లాగ్ పాఠాలు నేర్పిన లక్ష్మి బ్లాగ్ కోసం వెతికాను , దొరకలే . ఇందులో నా తప్పేమి లేదని మనవి చేసుకుంటున్నాను .


తెలుగింటి వీరనారీమణి , ఊరించే మెంతిబద్దలు . స్ స్ స్ నోట్లో నీరూరు తోందా !


ఓసారి సమీర లోకాన్ని చుట్టి వద్దామా ?


ఈ మధ్య దొరికిన ఇంకో బ్లాగ్ స్వాతి మాధవ్ గారిది .


తన పేరు తో ఎన్ని తంటాలు పడ్డారో అనురాధ గారు , ఊహలు - ఊసులు లో చెపుతున్నారు . వినండి మరి .


ఇంకా వున్నారు . . . వస్తున్నారు . . . . .

Monday, May 3, 2010

బ్లాగ్ అంతర్జాలం లో అతివలు - మొదటి భాగం
మిట్ట మద్యాహ్నం , ఎండ మండి పోతోంది .చెమటలు ధారాపాతం గా కారి పోతున్నాయి . ఫాన్ గాలి ఏమూలకూ సరి పోవటములేదు . ఏ .సీ పని చేయటము లేదు . ఉష్ , అష్ అనుకుంటూ ఆపసోపాలు పడుతుండగా , మా సావిత్రి ( మా వంటావిడ ) వచ్చి , వేడి , వేడిగా పకోడీలు చేసేనాండీ అని అడిగింది . ఒక్క నిమిషం బిత్తర పోయి చూసి , ఇప్పుడు పకోడీలా ? వద్దు అనబోయి , వద్దు అంటే ఆ తరువాతి పరిణామాలను తట్టుకునే శక్తి లేక సరే చేయండి అనేసాను . ఆమెకు తినాలి అనిపించి , చేస్తాను అన్నప్పుడు , నేనూ తినాల్సిందే తప్పదు మరి ! వాన పడుతున్నప్పుడో , చలికాలం చిరు ఎండలో నో కూర్చొని , పకోడీలు తింటూ , ఏ యద్దనపూడి నవలో చదువుతూ పకోడీలు తినటము ఎవరైనా చెస్తారు . మండే ఎండలో , చెమటలు కక్కుతూ , వేడి వేడి పకోడీలు తినటము మా ప్రత్యేకత ! ఎంతైనా మా స్టైలే వేరు . యద్దనపూడి వ్రాయటము మానేసినంత మాత్రాన ఏమైంది ? హాయిగా కూడలిలో విహరిస్తూ , కూల్ కూల్ గా , చల్ల చల్లగా అమ్మాయిల బ్లాగులు చదువుదాము అని డిసైడై పోయి , కూడలి తీసాను .

మీరు ఉత్తరాలు రాయగలరా ? నాకైతే రాసే ఓపిక లేక , చివాట్లు చాలా తినేదానిని . రాసేఓపిక లేదు కాని ,చిట్టీ ఆయేగీ అనుకుంటూ ఎదురుచూసి చదివి ఆనందించే ఓపిక చాలా వుంది . అందుకే భావన అందుకే కృష్ణ గీతం ను తరుచూ చూస్తూ వుంటాను .

సరదాగ చిన్న చిట్కాలే కాదు చక్కని కవితలూ అల్లుతారు శ్రీ లలిత . శ్రీలలిత గారి కవితల తో అప్పుడప్పుడూ నా సాహితి కూడా తరించి పోతూవుంటుంది .

ఎప్పుడైనా మూడ్ ఆఫ్ ఐందా ? ఐతే ఈ లలిత స్పందన చూస్తేసరి . కాకపోతే మన పొట్టలు జాగ్రత్తగా చూసుకోవాలి , చెక్కలైపోతే కష్టం కదా !!

అమ్మ కడుపు చల్లగా అందరూ బాగుండాలి అని దీవించే ఆదిలక్ష్మి గారి బ్లాగ్ ఇది .ప్రస్తుత దేశ రాజకీయ విషయాల దగ్గర్నుండి , చిన్ని చిన్ని కథలు కూడా చెప్పే అమ్మవొడి ఇది .

మధుర మధురం గా కబుర్లు , పాటలు విని పిస్తారు మధురవాణి . నాకు బ్లాగ్ లో పాటలు పెట్టాలి అనే కోరిక మధురవాణి బ్లాగ్ చూసాకే కలిగింది .

యమునాతీరానికి వెళితే ధీరసమీరే యమునా తీరే అని సృజనగీతం పాడుతూ ఓ అందమైన అమ్మాయి , కృష్ణుని వెతుకూ కనిపిస్తుంది , తనే సృజనా రామానుజం .

ఎందరో మహానుభావులు, మరెందరో భావకవులు, భావుకులు ఎన్నెన్నో భావాలూ, కవితలు, కొటేషన్స్........ వాటితో పోలిస్తే నా భావాలు......... ఎంత............ ఆకాశం ముందు............ పిపీలికమంత అప్పుడప్పుడు ఏదైనా చదివినప్పుడు విన్నప్పుడు............... ఆ భావుకతకు.... గుప్పెడు మల్లెలు గుభాళించినట్లు మనస్సుప్పొంగుతుంది ఆ పరిమళాన్ని కొందరికైనా పంచాలని కాదు, కాదు, కొందరితోనైనా పంచుకోవాలని ఆశ............., ఆకాంక్ష.

నేను ఆర్డినరీ వుమెన్ ని అంటూనే , పెళ్ళి పెటాకులూ , ఇది ఇంతే అని బోలెడు కబుర్లు చెబుతారు సునీత , తన -నేనూనా బ్లాగ్ లో .

ఏ పుస్తకము గురించి వివరము కావాలన్నా సిరిసిరిమువ్వను అడుగుతే చాలు .

మూసిన కను రెప్పల మాటున ఎన్ని స్మృతుల సవ్వడులో

నేను రౌడీని , బాడ్ గర్ల్ ను అంటూనే బోలెడు కబుర్లు చెపుతుంది ప్రియ , తన ప్రియరాగాలు లో . ఏ రోజునైనా నా పోస్ట్ లో కామెంటక పోతుందా అని ఎదురుచూస్తున్నాను .

వాలు కొబ్బరి
చెట్టుకింద నిలబడి కబుర్లు చెపుతున్నట్లే చెబుతూనే , నేతిగిన్న తో , గురూజీ ఎప్పుడు నన్ను మొట్టుతారా అని ఎదురుచూస్తూ , తనూ మొట్టికాయలు తింటూ వుంటుంది ఈ సుభద్రమ్మ . కొన్ని సార్లు మొట్టికాయలు తప్పించుకోవటానికి ఒకరికొరం సాయం కూడా చేసుకుంటూ వుంటాము , ఇది రహస్యం .

.శ్రీదేవి , కాని శ్రీదేవి అనకండి , శ్రీ అనండి చాలు . మహా భయస్తురాలు .చాలా బాగా పాడివినిపిస్తుంది మకరందం లో .

ఏదైనా బ్లాగ్ ప్రాబ్లమా ? దిగులు పడుతున్నారా ? ఐనా అండగా బ్లాగ్ గురువుండ గా దిగులెందుకు దండగా !! నాలాంటి వారందరికీ అండ , బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ జ్యోతి .

రమ్యం గా కుటీరాన రంగవల్లు లు వేస్తారు నీహారిక .

రాధిక గారు అల్లుకున్న పొదరిల్లు ఈ అందాల పిల్లన గ్రోవి .

నాస్నేహం నువ్వే , నా ప్రియ సత్ర్వు వు నువ్వే , అమ్మా హమ్మామ్మా అంటున్నారు శ్రీ .

శ్రీనిఖ భావనలు తెలుసుకోవాలంటే నా భావనలు చదవాల్సిందే .

టి .శ్రీవల్లీ రాధిక గారి కథలూ , కవితలు , మహార్ణవం లో చదవచ్చు .

నా గురించి చెప్పటం సులువు కాదు , అర్ధం చేసుకోవటం కష్టం కాదు అంటున్నారు మోహన .

ఎవరి లైఫ్ వాళ్ళది కాదా అని అడుగుతున్నారు చైతన్య .

అమ్మో సెల్ల్ ఫోన్ సెగలోస్తున్నాయి జిగీష నుండి .

" మా ఇంటి దాదా " , ఎవరు ? ఏమో ? గోదావరిని అడగాల్సిందే !

తోచిన భావాలకు తెలిసిన భాషలో మాటలు అల్లుకుని ఆనందించే సాధారణ పల్లెటూరు అమ్మాయిని. కవిత్వం రాయడం నాకు చేతకాదు.భాష మీద పెద్దగా పట్టు కూడా లేదు , అంటూనే మంచి మంచి కవిత లను అందించారు రాధిక నా స్నేహమా లో .


ఇంకా వున్నారు . . . . .