Sunday, June 20, 2010

హపీ బర్త్ డే
ఈ రోజు మా మనవడు విక్కి పుట్టిన రోజు . ఇప్పుడే పార్టీ నుండి వచ్చాను . ఎంత ఎంజాయ్ చేసామో . థాంక్ యు విక్కీ ఫర్ నైస్ పార్టీ .

హాపి బర్త్ డే విక్కీ .


Saturday, June 19, 2010

బ్లాగ్ అంతర్జాలం లో అబ్బాయిల హవా

మహిళా బ్లాగర్ ల గురించి రాసేటప్పుడు టైటిల్ కోసం ఆలోచిస్తుంటే , బ్లాగ్ అంతర్జాలం లో అతివలు అనే టైటిల్ తో పాటు చక్ మని బ్లాగ్ అంతర్ జాలం లో అబ్బాయిల హవా అనే టైటిల్ కూడా మెరుపులా మెరిసింది . హరే ఈ టైటిల్ కూడా బాగుందే , అబ్బాయిల బ్లాగ్స్ గురించికూడా రాస్తే పోలా అనుకున్నాను . ఏదైనా మొదలుపెడితేనే గాని తెలీదు కదా ! అమ్మాయిల బ్లాగులు లింక్స్ వెతుకుతూ రాసుకుంటేనే కాని తెలీలేదు ఎంత కష్టపడాలో . అంత భూతద్దం పెట్టి గాలించినా ఇప్పటికీ అప్పుడప్పుడు నేను లింక్స్ ఇవ్వని బ్లాగ్స్ ఒకటో అరో కనిపిస్తూనే వున్నాయి . ఓ వంద బ్లాగులే కనిపెట్టలేకపోతున్నాను , బోలెడు వున్న అబ్బాయిల బ్లాగులకు ఏమి న్యాయం చేయగలను అని అనుకుంటూ వుండగా , బ్లాగ్ సోదరి గారు ఆ బృహత్కార్యాన్ని భుజాన వేసుకున్నారు . హమ్మయ్య అనుకున్నాను , అక్కడికి నన్నెవరో రాయమని అడిగినట్లు . ఐనా అదేమిటో ఈమద్య , ఏదైనా ఓపనీ చేద్దామని ఉత్సాహ పడటము , ఆ పని తప్పగానే అమ్మయ్య అనుకోవటము ఓ అలవాటుగా మారింది . అమ్మయ్య అనుకుంత సేపు పట్టలేదు , ఈ టైటిల్ ను ఏమిచేయాలా అని మధనపడటానికి ! సరే ఏమైతే అది అయ్యిందనుకొని , ఆ టైటిల్ ను బాధపెట్టకూడదనుకొని , ఇదో ఇలా , ఈ ఫాదర్స్ డే రోజున నేను చదివే బ్లాగుల గురించి రాద్దామని డిసైడ్ ఐపోయాను .

నేను ముందుగా ధన్యవాదాలు తెలుపు కోవలసింది కొత్తపాళి గారికి . ఆయన పోస్ట్ కు నేను ఇంగ్లీష్ లో కామెంట్ రాస్తే , మాలా అని హెడ్మాస్టర్ లా బెత్తం చూపించి , తెలుగు లో ఎలా రాయాలో , లేఖిని ని పరిచయము చేయక పోతే , బహుషా , తప్పుల తడక తెలుగు రాయలేక బ్లాగ్ వ్రాయటము మానుకునేదానిని . హెడ్మాస్టర్ గారూ , మీకు చాలా , చాలా ధన్యవాదాలండి .

నేను నా బ్లాగ్ ను కూడలి లో చేర్చిన కొత్తల్లో , జరిగిన బ్లాగర్స్ మీటింగ్ కు , కృష్ణకాంత్ పార్క్ కు వెళ్ళాను . మీటింగ్ ఎక్కడ జరుగుతోందో తెలీలేదు . అంతా వెతుకుతూ వుండగా , కూడలి అని రాసివున్న షర్ట్ వేసుకున్న ఓ అబ్బాయి కనిపించాడు . బహుషా మీటింగ్ కే వచ్చాడేమోనని వూహిస్తూ , అతని దగ్గరగా వెళ్ళాను . సెల్ లో బిజీ గా మాట్లాడుతున్న అతను , మాట్లాడటము ఆపి , ఏమిటి మేడం అని మర్యాదగా అడిగాడు . అలా కమల్ చక్రవర్తి నాకు మొదటగా పరిచయం ఐన బ్లాగర్ . కనిపించిన ప్రతిసారి , మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తాడు . నేనేమో ఇల్లు వెతుక్కోలేను , మావారికి తీరికైనఫ్ఫుడు వస్తాను , మీరు , స్వాతి మా ఇంటికి రండి అని నేను ఆహ్వానిస్తాను .

ఆ మీటింగ్ లోనే పరిచయం అయ్యారు , సి.బి రావు గారు . వారి దీప్తిధార అంతకు ముందే , దీప్తిధార పేరు బాగుందే అని ఆ బ్లాగ్ చూసాను .

ఈ మీటింగ్ లోనే వీవెన్ గారు పరిచయం అయ్యారు . మీ కూడలి , లేఖిని చాలా బాగున్నాయండి అంటే చాలా మొహమాటపడ్డారు .

అలా అంటే ఎలా మాస్టారూ అని సాహితి లో పలకరించారు నూతక్కి గారు . సర్ మీరేం చేస్తుంటారు అని అడిగారు సురేష్ చాట్ లో ( సురేష్ బ్లాగ్ ఏదో తెలీలేదు ) . అది మీ పొరపాటు కాదండి , ఏం చేయను ? మావారి పేరు లేకుండా నన్ను రానీయలేదు గూగులమ్మ . కొంగుకు ముడేసుకున్నాక తప్పదు కదా !

లీలామోహనం లో చిలమకూరు విజయ మోహన్ గారు వేసే పేంటింగ్స్ ను చూస్తుంటే , నా పేంటింగ్స్ కూడా బ్లాగ్ లో పెట్టుకోవాలని , మళ్ళీ పేంటిగ్స్ వేయటము మొదలు పెట్టాలని అనిపిస్తుంది .

నాకున్న భయాల పోగొట్టుకునేందుకు మంచి సలహాలు ఇచ్చారు , సత్యనారాయణ శర్మగారు ఆలోచనాతరంగాలు లో . కాక పోతే అవి పాటించాలన్నా భయమే !

మా పిల్లలతో ఆడుకోవటానికి వచ్చేఅల్లరి బుడుగు లా అనిపిస్తాడు ఏటిగట్టు శేఖర్ పెదగోపు . మీ పక్కింటికి వస్తామనే మాటకు ఇప్పటికీ ఓకేనే అబ్బాయ్ , కాకపోతే ఓ కండీషన్ , నా లాప్టాప్ గొడవ చేసినప్పుడల్లా కాస్త చూసిపెటాలి , అంతే ! ( ఎక్కడ జిడ్డులా పట్టుకుందిరా బాబూ - శేఖర్ స్వగతం )

శిరాకదంబం లో చాలా విశేషాలున్నా నేను మాత్రం పాత సినిమా విశేషాల ను చాలా ఆసక్తిగా చూస్తాను .

మురళిగారు చెప్పే చిన్ననాటి విశేషాలు మా పిల్లల కబుర్ల లాగే వుంటాయి . పుస్తకాల పరిచయము చదువుతుంటే అప్పటి కప్పుడే ఆ పుస్తకం తెచ్చుకొని చదివేయాలని పిస్తుంది . ఏమైందో ఈమధ్య కనబటము లేదు . బహుషా సెలవల్లో వున్నట్లున్నారు .

అదేమిటో వేణు శ్రీకాంత్ ను , నేస్తం గారి లా నేనూ ఓ వాలుజడ అమ్మాయి పక్కన వూహించుకున్నాను . పాపం ఇంకా పెళ్ళే కాలేదుట . శీఘ్రమేవ వాలుజడ అమ్మాయి ప్రాప్తిరస్తు !

ఇంటావిడ మీద ఇంటాయన , ఇంటాయన మీద ఇంటావిడ బోలెడు పితూరీలు . అయ్యో మధ్యలో మనమేమీ మాట్లాడకూడదండి , పణిబాబు గారి బాతాఖాని వింటూ నవ్వుకోవాలి అంతే ! నన్ను పూణే వచ్చి మా స్మృతులను గుర్తు తెచ్చుకోమని ఆహ్వానించారండోయ్ , అక్కడికీనూ మావారికి తీరినప్పుడే , ఆ రోజెప్పుడో మరి .

కళగా కనిపించే వెకటేశ్వరస్వామి ని చూడగానే , సహజం గానే పూజలు , వ్రతాలు అంటే ఆసక్తి వున్న నేను హరిసేవను దర్షించుకున్నాను . అక్కడ చేసే పూజలంటే చాలా అసక్తి . ముఖ్యంగా గులాబిరంగు తామర పూల తో ఆ జగన్మాతను కొలవటము చాలా నచ్చింది . మావారికి తీరినప్పుడోసారి వెళ్ళి తప్పక ఆపూజ చేసుకొని రావాలనే వున్నది .

సృజన ద్వారా గీతాచార్య పరిచయం అయ్యారు . ఆయన వింబుల్డన్ విలేజ్ మావారు కూడా చదువుతారు . మోటర్ సైకిల్ మీద బుర్ బుర్ మంటూ తిరుగుతూ ఎప్పుడూ సత్యాన్వేషణ నేనా ? మాకు పార్టీ ఇచ్చేదెప్పుడబ్బాయ్ ?

నవ్వులాటకెళుతే హాయిగా కాసిని జోక్స్ విని , నవ్వుకొని రావచ్చు .

చిత్ర విచిత్రమైన కుఠోలు చిత్రం భళారే విచిత్రం లో . ఏమిటో ఈ అబ్బాయి ఊహలు భలే విచిత్రం గా వుంటాయి .

ఎన్ని సార్లు పడతావయ్యా బాబు . త్వరగా లేచి నిలబడు , ఇవి మా గౌరవ్ మాటలు . హాస్యాంజలి లో అబ్బాయి పడి
పోతూ లేవటానీకి చేసే ప్రయత్నం మా వాడికి మహా ఇష్టం .

గుండె లోతుల్లోనుంచి ప్రవహించే - - - అంతర్వాహిని . ఈ టైటిల్ చూడగానే ఈ రవిచంద్ర ఎంత పెద్దవాడో అనుకున్నాను . అబ్బే ఏం కాదు చాలా చిన్నవాడే .

సన్నీ బన్నీ బ్లాగ్ లో అన్ని భలే ఫొటో వుంటాయి .

లేలేత నీలి రంగు ఆకాశంలో విహరించినట్లుగా ఆహ్లాదంగా వుంటుంది క్రియేటివ్ కిరణ్ తేజ బ్లాగ్ .

చాలా చిన్నవాడీ బాబు , మాస్టర్ విజయేంద్ర . కాని , కథావిశ్వం లో చిన్న కథలు ఎంతబాగా రాస్తాడో .

అశోక్ నా పాటల బ్లాగ్ కమ్మటికలలు ద్వారా పరిచయం . మొదటిసారిగా ఈ పాటలు ఎలా పెట్టారండీ అని తెగ ఆశ్చర్య పోయాడు . ఎందుకో బ్లాగ్ పేరు ఎప్పుడూ మార్చేస్తూ వుంటాడు . ప్రస్తుతపు పేరు బుజ్జి బ్రమరం .

గీతల తో తెగ నవ్వించే కార్టూన్ లు రేఖా చిత్రం సొంతం .

పూల కుండీలలో వూగే కుర్రాడు , టి వి లో బుడుగు చూడాలంటే ధరణీ బీట్స్ చూడాల్సిందే .

ఒక్కసారైనా బాలానందం ప్రోగ్రాం కు వెళ్ళాలని , అక్కయ్య , అన్నయ్యలను చూడాలని నా చిన్ననాటి కల . కాని తీరనే లేదు . ఆ బాలానందం ప్రోగ్రాం లో రెగ్యులర్గా పాల్గొన్నారట రవిగారు . ఎంత అదృష్టవంతులో !

నేను కమ్మటికలలు బ్లాగ్ మొదలు పెట్టిన కొత్తలో చాలా పాటల గురించి చెప్పారు వినయ్ చక్రవర్తి గోగినేని . అలలు - కలలు లో నాకు నచ్చిన సినిమా వద్దంటేడబ్బు చూసి ఎంత సంతోష పడ్డానో .

నాజీవితం లో సగ భాగం మావారి సెల్ వెతకటానికే ఐపోతోంది అని వాపోతున్న తరుణం లో ఇది చదివాను . ఆహా వోహో అనుకుంటూ మా వారి సెల్ , ఆయన షూ లో ఇక్కడ చెప్పినవిధంగానే ముడి వేసాను . హుం టీ .వి చూస్తూ , ముడి విప్పి విసిరేసిన చార్జర్ దివాన్ కింద , , , కాలి మీద ఏదో పడిందనుకొని ఓ దులుపు దుపుతే ఫుట్ బాల్ లా ఎగిరి బయట ఎక్కడో చెట్లలో పడిన సెల్ ను వెతితెచ్చి ఇచ్చేసరికి . . . . ఆ పైన ఏమిటీ పిచ్చిపనులు అని మావారు తిట్టిన తిట్లకు . . . మంచుపల్లకి గారూ , , , నా కళ్ళ ముందు * * * * *

నేస్తం అభిమానసంఘం ( అక్కడికి మేము ఆ అభిమాన సంఘం లో లేనట్లు ) అని , మంచు పల్లకి వెనకాల హడావిడీగా టుయ్ టుయ్ అని పరుగులు పెడుతూ వచ్చిన ఈ వీరాభిమాని , త్రీజి ఎవరా అనిచూస్తే అక్కడ ఇద్దరు ఇంజనీర్లు గోదావరిగలగలలు వినిపించేందుకు తలలు బద్దలు కొట్టుకుంటు న్నారు .

నేను విశాఖపట్టణం రైల్వే స్టేషన్ లో 1974 లో కందిపొడి కొన్నాను అంటే తెగ ఆచర్యపోయారు రాజేంద్ర కుమార్ దేవర పల్లి . నిజమేనండి . వైజాగ్ ఇప్పుడు మారిపోయిందని వాపోయారు . మీ వైజాగ్ ఏమిటండి , మా హైదరాబాదూ చెట్టుచేమా లేకుండా ఐపోతోంది . ఏం చేయగలం ?

అనంతం లో చరిత్ర గురించి చదువుతుంటే అరే నాకూ ఎప్పుడూ ఇలానే అనిపిస్తుందే అనుకున్నాను . ఉమాశంకరం గారి స్పెసాలిటీ అదే . ఆయన రాసేవన్నీ మన భావాలేనేమో అన్నంత చక్కగా రాస్తారు .

రామా కనవేమిరా అనే బ్లాగ్ లో రాజశేఖరుని శర్మ గారు సనాతన పద్దతుల గురించి వివరిస్తున్నారు . శర్మ గారు మంచి ఫొటో గ్రాఫర్ కూడా . చక్కటి ఫొటోలను కుడా చూడవచ్చు .

మా అబ్బాయి కన్నా కూడా ఐదారేళ్ళు చిన్నవాడు , కార్తీక్ అక్కా అంటే చాలా గమ్మత్తుగా అనిపించింది . ఇటలిలీ లో చదువు కోసం వెళుతున్నానని చెప్పాడు . బుజ్జి తమ్ముడూ అల్ల్ ద బెస్ట్ .


జాన్ హైడ్ కనుమూరి మహిళా దినోత్సవపు టపా నచ్చేసింది . వారే పరిచయం చేస్తున్న ఇంకో బ్లాగ్ నెల నెలా వెన్నెల .


పరుపు చుట్ట చంకన బెట్టుకొని , పోతూ , నేనో చిరు వుద్యోగిని అనే శివచెరువు ను ఎప్పుడు చూసినా తెగ నవ్వొచ్చేస్తుంది . మంచిమనసులు సినిమాలోని ఏమండోయ్ శ్రీవారు పాట గుర్తొస్తుంది . ఐతే వెనకాల సావిత్రి ఏది చెప్మా ?

సుత్తి నా సొత్తు అనగానే ఏం సుత్తో చూద్దామని వెళ్ళాను . అబ్బే సుత్తి ఏం కాదు , చాలా సరదాగా వున్నది .


ఈ మద్య కొత్తగా చూసాను మంచుకురిసే వేళలో . రామకృష్ణ రెడ్డి అట పేరు బాగానే రాస్తున్నాడే అనుకున్నాను . రామ కృష్ణా , నా బ్లాగ్ కొస్తే మటుకు పంపిచేయనులే !


రోజూ కొన్ని బ్లాగ్ స్ చదివి ఓపికుంటే వాఖ్యలు రాయటము అలవాటే కాని ఏవి చదివాను , ఎవరికి వాఖ్యలు రాసానో గుర్తుండదు . ఇప్పుడా బాధ లేదు ఎందుకంటే హారం లో వాఖ్యలలో నా పేరు దగ్గర క్లిక్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు . ఎక్కువగా చదివిన టపాల లో అప్పుడప్పుడు నా పేరు చూసుకొని మురిసి పోవచ్చు . భాస్కర రామి రెడ్డి గారు మీరు చేసిన హారం చాలా బాగుందండి . థాంక్ యు .


ఇవ్వండీ నేను ఎక్కువగా చదివే అబ్బాయిల బ్లాగులు . ఏదో మా వారిని ఉద్దరించటానికి పొద్దున కాసేపు పేపర్ చదువుతానే కాని రాజకీయాల మీద ఇంటరెస్ట్ లేదు . కవితలు ఎక్కవు . చర్చలంటే భయం . ఇష్టమైన సబ్జెక్ట్ హాస్యం . ఏవో సరదా కబుర్లు , కథలు , కాకరకాయలు . ఇలా వడబోసుకొని కొన్నీ , నాకు వాఖ్యలు రాసేవారివి కొన్ని చదువుతానన్నమాట . అంతేకాని మిగితా బ్లాగులు బాగుండవని కాదు . ఇప్పటికే మా వాళ్ళు నువ్వు బ్లాగ్లలోనే బతుకుతున్నావు , ఏవీ పట్టించుకోవటము లేదు అంటున్నారు . కొన్ని నాకిష్టమైన విషయాలున్న బ్లాగ్స్ మిస్ కుడా అవుతున్నానేమో తెలీదు . .అన్ని చదవలేను కదా ! అమ్మాయిలకే భావుకత ఎక్కువ అనుకునేదానిని . అబ్బాయిలంటే డిష్యుం డీష్యుం లు , క్విజ్ లు , వంగ్య రచనలు , ద్వందర్ధాలవి , హాట్ హాట్ డిష్కషన్స్ మాత్రమే రాస్తారు అనుకునే దానిని . కాని ఇక్కడ చాలామటుకు ఇరవై ఏళ్ళలో వున్నవారు , కొత్తగా వుద్యోగాలలో చేరిన అబ్బాయిలు , చక్కటి తెలుగు భాషలో , భావుకత తో రాస్తుంటే నా అభిప్రాయాన్ని మార్చుకోక తప్పలేదు . అసలు ఒక్కక్కరు టెంప్లెట్స్ కూడా ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో ! చాలా ముచ్చటగా వుంది .అబ్బబ్బ ఏమబ్బాయిలో కాని చాలా అల్లరి వాళ్ళు సుమండీ ! అమ్మాయిలు బుద్దిగా చెప్పిన మాట విని కూర్చో బెట్టిన చోట నేను వచ్చేవరకు కూర్చున్నారు . కాని ఈ అబ్బాయిలున్నారు చూసారూ , అందరినీ ఓ దగ్గర చేర్చి భొజనం చేసి వద్దామని వెళ్ళేసరికి ఎటు వాళ్ళటు పారిపోయారు . ఏంచేయాలో తోచక , ఎవరికీ చెప్పకుండా రహస్యం గా రాసి , పోస్ట్ చేద్దామనుకున్నదానిని , జ్యోతిగారికి , జయకు చెప్పుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను . పోనీ మేము వెతికి ఇయ్యమా అన్నారు వాళ్ళు . కళ్ళ నీళ్ళు తుడుచుకొని , వద్దులెండి నేనే వెతుక్కుంటాను అని వాడ వాడ లా వెతికి తెచ్చుకునేసరికి తల ప్రాణం తోక కొచ్చిందంటే మీరు నమ్మితీరాలి !!!!!


అంటే ఏమీ లేదండి . నేనలా వెళ్ళి వచ్చేసరికి మొత్తం డిలీట్ ఐపోయింది !!!!!!!!!!!!
మా గౌరవ్ లా , ముక్కు తుడుచుకుంటూ , అరచేయి వెనకకి , భుజానికి , కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ మళ్ళీ మొత్తం రాసానన్నమాట .
అంచేత ఏవైనా తప్పులున్న మన్నించండి .

Wednesday, June 9, 2010

భూమికకు ధన్యవాదాలు

బ్లాగ్ అంతర్జాలం లో అతివలు పోస్ట్ , ఏమైనా తప్పుగా రాస్తానా , ఎవరినైనా నొప్పిస్తానా , ఎవరినైనా మరిచిపోతానా ఇలా ఎన్నో ఎన్నెన్నో అనుమానాల తో , చాలా భయపడుతూ పడుతూ రాసాను . నా బ్లాగ్ కు నేనే మహారాణిని కాబట్టి ఏమైనా రాసుకోవచ్చు . మావారి మీద రాసినా , మనవళ్ళు , మనవరాళ్ళ మీద రాసినా మన వాళ్ళేకాబట్టి ఏమనుకోరులే అని ధైర్యం . వాళ్ళేకాదు మేమంతా నీ వాళ్ళ మే అని , నా రాతలను సంతోషం గా స్వీకరించారు మితృరాళ్ళు . ఆ ఆనందం తోనే వుబ్బి తబ్బిబౌతుంటే , భూమిక లో ప్రచురించి , నా ఆనందాన్ని ఆకాశమంత చేశారు , సత్యవతి గారు . సరదాగా మొదలు పెట్టిన ఈ ఆర్టికల్ ఇంతటి ఆదరణను పొందిదంటే నాకు నమ్మశక్యం కావటము లేదు . నా సంతోషాన్ని ఎలా తెలపాలో , మాటలు రావటము లేదు . సత్యవతి గారూ మీకు నా ధన్యవాదాలను ఎలా తెలపాలో నిజం గా తెలీటము లేదండి . మాటలు తడబడి పోతున్నాయంటే నమ్మండి . అచ్చులో మొదటి సారిగా నా పేరును చూపించారు . చాలా చాలా ధన్యవాదాలండి .

నా ఈ పోస్ట్ రాయటానికి కారణమైన , కృష్ణ వేణి , లలిత డి గార్లకు , లింకులు వెతికి పెట్టి సహకరించిన , వరూధిని , జ్యోతి , మధురవాణి , జయ , సుభద్ర గార్లకు ధన్య వాదాలు . పి .డి యఫ్ చేసిపెట్టిన జ్యోతిగారికి ప్రత్యేక ధన్యవాదాలు . చదివి ఆదరించిన మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు .

ఈ మధ్య నా కర్సర్ ఎందుకో నా మాట వినటము లేదు . ఈ రోజే సత్యవతి గారి దగ్గర నుండి భూమిక పుస్తకం అందింది . థాంక్స్ చెబుదామని , ఇంతకు ముందున్న టైటిల్ , ఇంకా పిక్చర్ మారుద్దామని ఎడిట్ చేసేసరికి ఎటో వెళ్ళిపోయింది . అదృష్టవసాత్తు టెస్ట్ బ్లాగ్ లో వుండటము వలన మళ్ళీ పోస్ట్ చేయగలుగుతున్నాను !

Tuesday, June 8, 2010

ధఢ్ . . . ధఢ్ . . . ధఢ్ . . . ధఢాల్ . . . .

మావారిని , టిఫిన్ కారియర్ తో సహా పంపించేసి , తలుపేసుకొని , హాయిగా లాప్ టాప్ ముందు సెటిల్ అయ్యాను . సుజ్జి తో కబుర్లు చెప్పుకుంటూ , నేను ఇంతకు ముందు పోస్టు లకు వాఖ్య లిచ్చానో వాటికి ఎవ్వరైనా రిప్లై ఇచ్చారా చూసుకొని , ( ఇంతకు ముందైతే పోస్ట్ లకు వాఖ్య లిచ్చానా అని తెగ ఆలోచించి ఆలోచించి సతమత మైయ్యేదానిని . ఇప్పుడా భాధ లేకుండా హారం వాళ్ళు అన్ని ఒక చోట వచ్చేలా చేసారు . అమ్మయ్యా థాంకూ హారం ) , ఇంకాసిని వాఖ్య లిచ్చేసరికి ఆకలి వేస్తున్నట్లు గా అనుమానం వచ్చింది . సరే ఏదో కాస్త తినొస్తే పనైపోతుంది కదా అని , స్టడీ రూం నుండి బయటకు వచ్చాను . ఇదేమిటీ ?? ఆయనను పంపించి మేన్ డోర్ వేసినట్లు గుర్తే ! తీసివుందేమిటి ? ? ?


ఏమిటో వేసాననుకున్నాను కాని వేయలేదన్నమాట , అనుకొని తలుపు వేసి వంటింట్లోకి నడుస్తుండగా ఫోన్ పిలిచింది . దాని సంగతి చూసొద్దామని అటెళ్ళాను . పనయ్యాక మళ్ళీ ఆకలి గోలెట్టింది . వాకే బాబా తింటున్నాను , అని ఆకలిని బుజ్జగిస్తూ బయటకొస్తే మళ్ళీ మేన్ డోర్ తీసి వుంది . . .


ఏమిటీ వేసాననుకొని మళ్ళీ వేయలేదా ? ? ?

కాని నాకింత మతి మరుపు లేదే ! కొంపదీసి దొంగోడో దూరలేదుకదా !! !

చిన్నగా చప్పుడు కాకుండా అడుగులు వేస్తూ ఇల్లంతా వెతికాను . ఎవ్వరూ లేరు . మరి ఇదేమి మాయ . . . పక్క తలుపు దగ్గరగా వేసి ( దొంగోడో వస్తే తొందరగా బయటకు పరుగెత్తొచ్చని ) , మేన్ డోర్ తలుపు వేసి , సారి బోల్ట్ వేసి పక్కకు తిప్పాను . ఐనా ఏమిటో అంతా అయోమయం అనుకుంటూ అలాగే సోఫా లో కూర్చుండి పోయాను . ఇంతలో ఎవ్వరో తలుపు గట్టిగా కొట్టారు . ఎవరబ్బా అనుకొని వస్తున్నా అంటూ లేచాను .


ఆగకుండా ధడా ధడ్ అని అలా కొడుతారేమిటి అనివిసుక్కుంటూ సోఫాలోనుండి లేస్తూ తలుపు వైపు చూస్తే , తలుపు గట్టిగా వూగుతూ . . . .

బోల్ట్ చిన్నగా పక్కకు తిరుగుతూ . . .

నేను భయం భయం గా చూస్తూ వుండగానే , , ,

బోల్ట్ వూడి పోయి , తలుపు ధఢ . . ధఢ . . . కొట్టుకుంటూ ధఢాల్ మని తెరుచుకుంది .

నిశ్చేస్టురాలినై నిలబడి పోయాను . అర్ధరాత్రి దయ్యాలొస్త్తాయంటారు , కాని మిట్ట మధ్యాహ్నం కూడా వస్తాయా ? ? ? కాళ్ళూ చేతులూ చల్లబడ్డాయి . బుర్ర పని చేయటము లేదు . . .

అలా ఎంత సేపు నిలబడిపోయానో తెలీదు . మా పనమ్మాయి జహీరా లోపలి కొస్తూ క్యా అమ్మా ఐసే ఖడే హోగయే అని అడిగి , తలుపు వేసి , బోల్ట్ పెట్టి , నా జవాబు వినకుండానే లోపలి కెళ్ళింది . నేను ఉసూర్ మంటూ సోఫా లో కూలబడ్డాను . వెంటనే జహీరా బయటకొస్తూ , అమ్మా ఖానా నై ఖాయే క్యా ఆపకా ప్లేట్ నై హై అంటూ ఏదో చెపుతోంది . కాని మాటలు నా చెవిలోకి పోయే లోపలే . . .

ధఢా . . . ధఢ్ . . . ధడా . . . ధఢ్ . . . తలుపు భయంకరంగా వూగి పోతోంది .

బోల్ట్ పక్కకి తిరిగి పోతోంది . . .

నేను అప్రయత్నంగా లేచి నిలబడి , నిలువు గుడ్లేసుకొని చూస్తున్నాను . . . . .

తిరిగింది . . . బోల్ట్ వూడి పోయింది . . .

ధఢ్ . . . ధఢ్ . . . ధఢ్ . . . ధఢాల్ . . . . .

Saturday, June 5, 2010

ముచ్చటగా మూడు కథలు

నేను నా బుక్స్ కొనుకున్నప్పుడల్లా , మా పిల్లల కోసం కూడా కథల పుస్తకాలు కొంటూ వుంటాను . ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు పిల్లలకు కథలు చెప్పుకోవటము ( వాళ్ళు నాకు , నేను వాళ్ళకు ) తప్పనిసరి . ముందుగా కొన్ని బుడుగు కథలు , అందులో కాళిదాసు కవిత్వం కొంత , నా కవిత్వం కొంత కలిపి చెప్పుకున్నాక , వేరే కథలు చెప్పుకుంటామన్న మాట . అందులోని , ముచ్చటగా మూడు కథలు చెపుతాను . ఆలకించండి .

అమ్మ పెట్టేవి రెండు .

ఒకరోజు మా మనవరాలు అదితి అన్నం తినటానికి మారాము చేస్తోంది . అప్పుడు అక్కడ పనిచేసుకుంటున్న , మా పనిమనిషి సుబ్బులు రెండు పీకమ్మా , ఆమే తింటది . మా అమ్మ అంతే చేస్తది అంది . అంతే ఆ పనమ్మాయి పేరుతోనే చిన్నప్పటి నుండి నేను విన్న కథ అదితి కి చెప్పాను . అంతే కాదు , నా మనవలు , మనవరాళ్ళందరికీ అన్నం తినేముందు ఈకథే చెపుతాను . నేను మొదలు పెట్టగానే , సుబ్బలక్ష్మి కథ వద్దు బాబోయ్ , మేము అన్నం తింటాం కాని ఇంకేదైనా కథ చెప్పు అంటారు వాళ్ళు ! వద్దు బామ్మా వద్దు మేము అన్న తింటాము అని మా మనవలు దండాలు మొదలు పెడుతారు . అన్నం మింగావా .. . మింగు లేక పోతే అమ్మమ్మ , సుబ్బలక్ష్మి కథ చెపుతుంది అని పాటలు పాడుతారు . అంత సరదా మా మనవలకి , మనవరాళ్ళకి ఈ కథ అంటే . అంతటి పేరు , ప్రఖ్యాతి కలిగిన కథ ఇది .

అనగనగా ఒక వూళ్ళో సుబ్బలక్ష్మి అని ఓ అమ్మాయి వుంటుంది . ఆ అమ్మాయికి పెళ్ళై అత్తవారింటి కి వెళుతుంది . కొత్త కోడలు వచ్చింది కదా అని మురిపెంగా అత్తగారు , పులిహోర , పాయసం చేసి , కోడలి కి వడ్డిస్తుంది . అప్పుడు సుబ్బలక్ష్మి నాకు మా అమ్మ పెట్టేవి రెండు కావాలంటుంది . ఏమిటమ్మా , మీ అమ్మ పెట్టేవి అని అత్తగారు ఆప్యాయంగా అడుగుతుంది . మా అమ్మ పెట్టేవి అని మాత్రమే అంటుంది సుబ్బలక్ష్మి . కొత్త కదా మొహమాటం పడుతోందేమో చెప్పటాని కి అనుకొని , అత్తగారు , లడ్డూలు చేసి పెడుతుంది .

అబ్బే , సుబ్బలక్ష్మి తింటేనా ?? ఊం హుం ! మా అమ్మ పెట్టేవీ . . . అని మొదలు పెడుతుంది .

సరే పోనీయ్ పాపం అనుకొని అత్తగారు గారెలొండి పెడుతుంది . అబ్బే తినదే ! మళ్ళీ మా అమ్మపెట్టేవీ అని రాగాలు మొదలుపెడుతుంది . ఇంటిల్లి పాదీ వచ్చి , నీకేం కావాలో చెప్పమ్మా , వండిపెడతాము . బంగారు తల్లి వి కదూ ఏడవకమ్మా అని బతిమిలాడుతారు . నాకు ఆకలేస్తోంది , మా అమ్మ పెట్టేవి కావాలి అని ఏడుస్తూ ఎంతసేపటికీ ఆపదే ! అపుడు సుబ్బలక్ష్మి భర్తకు విసుగొచ్చి ఇవి మింగుతావా మింగవా అని రెండు దెబ్బలేస్తాడు . అంతే సుబ్బలక్ష్మి ఏడుపాపేసి , ఇవే మా అమ్మ పెట్టేవి అని ఆనందంగా అని అత్తగారు చేసినవన్ని తినేస్తుంది .

మింగావా మింగు అని కూడా మా పిల్లలు అన్నం దగ్గర పాట పాడుతూ వుంటారు . ఇదండీ అమ్మ పెట్టేవి రెండూ కథ .

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -


ఇక రెండో కథ , కలసివుంటే కలదు సుఖం .

అనగనగా ఒక వూళ్ళో సంజ్యొత్ , సతీష్ ( అను , బిపు ) అనే అమ్మానాన్న వుంటారు . వారికి అదితి , విక్రం ( మేఘ , గౌరవ్ ) అని , ఇద్దరు పిల్లలుంటారు . ఒకరోజు అమ్మ బేగంపేట బేకర్స్ ఇన్ కు వెళ్ళి మంచి కేక్ తెస్తుంది . పిల్లలకిచ్చి మీరు తినండి , నాకు పని వుంది అని లోపలకు వెళుతుంది . నేను కట్ చేస్తాను అంటే నేను కట్ చేస్తాను అని ఇద్దరూ పోట్లాడుకుంటూ వుంటారు . ఎందుకంటే ఎవరు కట్ చేస్తే , వారు పెద్ద ముక్క తీసుకుంటారని రెండోవారికి అనుమానమన్నమాట . ఇంతలో పక్కింటి కరటకుడు వచ్చి నేను ఇద్దరికీ సమానం గా కట్ చేసి ఇవ్వనా అంటాడు . సరే అంటారు పిల్లలు .

కరటకుడు కేక్ ను కట్ చేసి చెరో ముక్కా ఇస్తాడు . అప్పుడు ఊ ఊ అక్కకు పెద్దది ఇచ్చావు , నాకు చిన్నది ఇచ్చావు అని తమ్ముడు ఏడుపు మొదలు పెడుతాడు . ఓహో అవునా , సరే ఐతే అని తమ్ముడి దాని లోనుండి కొంత కట్ చేసి తినేస్తాడు కరటకుడు . అప్పుడు అక్క నాకు చిన్నదిచ్చావు అని గొడవ పెడుతుంది . అప్పుడేమో ఎంచక్కా అక్క కేక్ లోనుండి కట్ చేసి తినేస్తాడు . అలా కేక్ మొత్తం తినేసి , పిల్లలకు టా టా చెప్పి హాపీగా వెళ్ళి పోతాడు . ఇద్దరూ ఏడుపు మొహాలేసుకొని కూర్చుంటారు . అమ్మ వచ్చి , సంగతి తెలుసుకొని , చూసారా , అందుకే సిస్టర్ , బ్రదర్ ఎప్పుడూ పోట్లాడుకో కూడదు . కలిసి మెలిసి వుండాలి . పెద్దవాళ్ళైనా కూడా ఒకరికొకరు ఫ్రెండ్లీ గా వుండాలి అంటుంది . అప్పటి నుండి పిల్లలు పోట్లాడుకోకుండా హాపీ గా కలిసి మెలిసి వుంటారు .

ఇహ కొసమెరుపేమిటంటే ఈ మధ్య ఈకథ చెపుతుంటే ఇంత కష్టం ఎందుకు , హాయిగా స్కేల్ తో కొలిచి కట్ చేసుకుంటే ఐపోతుంది కదా అంటున్నారండి , మా పిల్లలు . ఇదీ ఈ కథ ఎఫ్ఫెక్ట్ !!!!!!

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

ముచ్చట గా మూడో కథ :

ఆడిన మాట తప్పరాదు .

ఒకసారి అమ్మ అను ( సంజు ) , పిల్లలు , మేఘ , గౌరవ్ ( అదితి , విక్రం ) లను అడివికి పిక్నిక్ కు తీసుకెళుతుంది . చాలా సేపు ఆడుకున్నాక పిల్లలు అలిసి పోతారు . వాళ్ళదగ్గర వున్న నీళ్ళు ఐపోతాయి . అందుకని అమ్మ , పిల్లలూ మీరిక్కడే వుండండి , నేను ఎక్కడైనా నీళ్ళు దొరుకుతాయేమో చూసి తెస్తాను అని , నీళ్ళు వెతుక్కుంటూ వెళుతుంది . ఇంతలో ఓ పులి గాండ్రు మంటూ అమ్మ మీదికి వస్తుంది . అప్పుడు అమ్మ అయ్యో నా పిల్లలు అనుకుంటుంది .
పులీ , పులీ , ప్లీజ్ ,ప్లీజ్ నన్నొదిలేయవా , నా పిల్లలు అక్కడ వొంటరిగా వున్నారు అని పులిని వేడుకుంటుంది .

ఆ నిన్నొదలను . నాకు చాలా రోజులకు ఆహారం దొరికింది అని గాండ్రిస్తుంది పులి .

అయ్యో , నా పిల్లలు అడవిలో ఒంటరి వాళ్ళై పోతారు . చాలా చిన్న పిల్లలు . ఇంటికి దారి కూడా తెలీదు . పోనీ వాళ్ళను ఇంటిదగ్గర వదిలేసి వస్తాను ప్రామిస్ అంటుంది అమ్మ .

సరే . నువ్వు తిరిగి రాక పోయావో , మీ ఇంటికి వచ్చి నీ పిల్లలను కూడా తినేస్తాను . పో , వాళ్ళను దింపేసి తొందరగా రాపో అని పర్మిషన్ ఇస్తుంది పులి .

అమ్మ పిల్లలను ఇంటిదగ్గర దింపేసి వాళ్ళను వదలలేక వదలలేక వదిలేసి ఏడ్చుకుంటూ పులి దగ్గరకు తిరిగి వస్తుంది . అప్పుడు పులి , అమ్మ చేసిన ప్రామిస్ ను తప్పలేదని , అమ్మను చాలా మెచ్చుకొని , నీ పిల్లల దగ్గరకే వెళ్ళిపో అని అంటుంది . అమ్మ పులికి థాంక్స్ చెప్పి , సంతోషం గా ఇంటికి తిరిగి వస్తుంది . కాబట్టి ఎప్పుడు కూడా ఆడిన మాటను తప్పరాదు అని నీతి .

( నా మొహం . ఇప్పుడైతే ఈ కథ మొదలు పెట్టగానే మా పిల్లలు అడవికి వెల్లేటప్పుడు గన్ తీసుకెళితే సరి . అప్పుడు ఏ ఆనిమల్ వచ్చినా కాల్చేయొచ్చు అంటారండి మా పిల్లలు . ఇవన్ని పంచతంత్రం మొదలైన పుస్తకాల లోవే . కాకపోతే కాస్త మార్చి వాళ్ళ పేర్ల తో చెపితే ఇంట్రెస్ట్ గా వింటారని ఇలా చెపుతానన్నమాట . కాక పోతే చిన్నపుడు బాగానే వినేవారు . ఇప్పుడే ఇలా తెలివి మీరిపోయారు హుం ! )

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - - - - - -

ముసలమ్మ సూది కథ కొనసాగింపు

మా అమ్మమ్మ అలా నేనేదంటే అలా నటే సూది వస్తుందా అని అడుగుతూ వుండేది . ఇహ విసుగూ , కోపం వచ్చి పక్కకు తిరిగి పడుకునేదానిని . కాసేపైనాక అమ్మమ్మ అమండూ నిద్రపోయావురా అని అడిగేది . అమ్మమ్మ , ముసలమ్మ సూది ఎలా వస్తుందో చెపుతుందేమోనని ఆశ తో గబ్బుక్కున లేదమ్మమ్మా అంటూ లేచి కూర్చునేదానిని . చటుక్కున అమ్మమ్మ లేదమ్మమ్మా అంటే సూది వస్తుందా అని అడిగేది . అంతే ఉక్రోషం తో మాట్లాడకుండా పడుకుండి పోయేదానిని . అప్పుడు అమ్మమ ' బూచివాడు వచ్చి బుట్ట్లల్లుతున్నాడు ' అని పాడటము మొదలు పెట్టేది . మా అమ్మమ్మ చాలా బాగా పాడేది . నాకు ఈ పాటలో ఈ ఒక్క చరణమే గుర్తుంది . చిరు చీకటిలో , కింద నుండి తడి మట్టిమీద నుండి సువాసనలు తేలుతూ వస్తున్న చల్లటి గాలి లో , అమ్మమ్మ సన్న సన్నగా పాడుతున్న పాట తో ఎప్పుడు నిద్ర పోయే దాని నో నాకే తెలీదు .

నా మనవళ్ళు , మనవరాళ్ళు ఎంతసేపటికీ నిద్ర పోకుండా ఇంకా ఇంకా కథలని వేధిస్తూ వుంటే నేనూ ఈ కథే చెప్పి , మా అమ్మమ్మ ట్రిక్నే ఉపయోగిస్తాను . కాక పోతే అమ్మమ్మ అంత మధురంగా పాడ్లేను . అసలు పాడనే లేను , కాని ఇదో ఈపాట తో వాళ్ళను నిద్ర పుచ్చుతాను .

ఆటలు ఆడి , పాటలు పాడి అలసి పోయానే
తియ్యా తియ్యని తాయిల మేదో తీసీపెట్టమ్మా .

గూటి లోని బెల్లం ముక్క కొంచం పెట్టమ్మా
చాటలోని చాయా పప్పూ చారెడు పెట్టమ్మా
అటకా మీది అటుకుల పళ్ళెం అమ్మా దింపమ్మా
తియ్యా తియ్యని తాయిల మేదో తీసి పెట్టమ్మ .

ఆటలు ఆడి పాటలు పాడి అలసీ పోయామే
తీయా తీయని తాయిల మేదో తీసీ పెట్టమ్మా .

Wednesday, June 2, 2010

మాగాయే మహా పచ్చడి !!!
మాగాయే మహా పచ్చడి ,
పెరుగేస్తే మహత్తరి ,
అదివేస్తే అడ్డవిస్తరి ,
మానీయా మహా సుందరి.

అన్నారండి పెద్దలు . మాగాయ రుచి మహా గొప్పది . ఏ కూరలు చేసే ఓపిక లేనప్పుడు , పెరుగన్నం లో మాగాయ కలుపుకుని తిన్నామనుకోండి , గిన్నెడన్నమూ ఒక్కరికి కూడా సరి పోదు ! అందుకే నేను కూర వండటానికి బద్దకించను . అలాగే ఏ దోశో , చపాతి నో చేసుకొని , కూర వండే టైం లేక , శ్రీవారు బయటకు వెళ్ళే తొందర లో వున్నప్పుడు , కూర వండటము ఇంకా కాలేదా అని కోపం తో చిందులు తొక్కుతున్నప్పుడు , కొద్దిగా మాగాయ , పెరుగులో కలిపి , మెంతులు , ఇంగువ వేసిన ఘుమ ఘుమ లాడే పోపు వేసామను కోండి కోపం గీపం పోయి శుభ్రం గా లాగించేస్తారు .

అంతటి మహత్తరమైన మాగాయ మేము చేసే విధానము : -

పెద్ద సైజు మామిడికాయలు - 20
ఉప్పు - 4 పావులు
ఖారం - 2 పావులు
మెంతులను ఎర్రగా వేయించి కొట్టుకున్న మెంతి పొడి - అర్ధ పావు
ఆవపిండి - అర్ధ పావు
పసుపు
నువ్వుల నూనె - 1 1/2 కిలో
ఎండుమిరపకాయలు ,
మెంతులు -
పాల ఇంగువ ,
ఈ చివరవి మూడూ పోపుకు సరిపడ

చేసే విధానము : -
మామిడి కాయలను శుభ్రం గా కడిగి , తుడిచి , తొక్కతీసి మనకు కావలసినట్లు గా ముక్కలు కోసుకోవాలి . టెంక అవసరము లేదు . ఆ ముక్కలలో నాలుగు పావుల ఉప్పు , కొద్ది గా పసుపు వేసి బాగా కలుపు కోవాలి . ఒక జాడీ లోకి తీసుకొని మూత పెట్టి మూడు రోజులుంచాలి . మూడో రోజు ఆ ముక్కల లోని నీటిని గట్టిగా పిండి , వాటిని ఎండ లో పెట్టాలి . ఆ ఊటను పారబోయ కూడదు . మధ్య మధ్య లో నెరుపుతూ కచ్చా పచ్చా గా ముక్కలను ఎండనీయాలి . అంటే మరీ ఎండిపోయినట్లు కాకుండా , కొద్దిగా పచ్చిగానే వుండనీయాలి . ఆ తరువాత ముక్కలకు , ఎండ వేడి తగ్గిన తరువాత , ఒక పెద్ద బేసన్ లోకి తీసుకోవాలి . ఊటను ఒక సన్నని బట్ట తో వడకట్టుకొని ( గట్టిగా బట్టను పిండవద్దు . తేలికగా ఆ రసమును రానివ్వాలి ) , ఆ రసమును , రెండు పావుల ఖారం ను , అర్ధ పావు ఆవపిండి , అర్ధ పావు మెంతి పిండి , ఆ ముక్కలలో వేసి బాగా కలపాలి . ఒక బాణలి లో కిలోన్నర్ర ఇదయం నువ్వులనూనె ను పోసి , బాగా కాచాలి . నూనె బాగా కాగాక కొద్దిగా మెంతులు , ముచ్చికలు తీసిన కొన్ని ఎండుమిరపకాయలు వేసి ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి . ఆ తరువాత మంట తగ్గించి , పొడి చేసుకొని వుంచుకున్న పాల ఇంగువను వేసి వెంటనే , ఆ నూనె ను మాగాయ ముక్కలలోకి వంచేయాలి . ఇంగువ వేసినప్పుడు జాగ్రత్తగా వుండాలి ఎందుకంటే , కొన్ని సార్లు ఇంగువ వేయగానే నూనె పొంగుతుంది . ఆ తరువాత నూనె చల్లారాక మాగాయను జాడి లో భద్ర పరుచుకొని ఆరగించటమే !చుందా

ఈ ఆవకాయ , మాగాయ పెట్టినప్పుడు , ముక్కలు కోసే సమయము లో , అందులోనూ ఈసారి రెండు సార్లు ఆవకాయ పెట్టటముతో ఓ పది మామిడికాయల ముక్కల వరకూ మిగిలి పోయాయి . వాటిని ఏమి చేయాలా అని మా ఫ్రెండ్ ప్రభను అడిగాను . చుందా చేసేయ్ అంది . అసలు పిల్లలు చుందా తింటారా తినరా కనుక్కొని చేద్దాం , లేక పోతే వేస్ట్ అవుతుంది అనుకొని , మా కోడలికి ఫోన్ చేసి అడిగాను . తను కాసేపు ఆలోచించి నేను తీపి తినను కదా ఆంటీ , ఐనా కొత్త వెరైటీ చేస్తున్నారు కదా కొద్దిగా ఇవ్వండి అన్నది . మా అమ్మాయిని అడుగుతే అమ్మా చుందానా వెంటనే నేర్చుకొని , చేసేసెయ్ . సతీష్ , మా మాగారు ఎప్పుడూ బడీచావిడీ జోషీ షాప్ నుంచి కొనుక్కొస్తారు అంది . అమ్మయ్య అనుకొని ప్రభాకు చేద్దాము , చూపించు అని చెప్పాను . మీ కోడలు తీపి తినదా ఐతే కొద్దిగా ఖారం ది చేద్దాం అన్నది .

చుందా చేసే విధానము : -
పది మామిడికాయలను ( ముక్కలను ) తురమాలి . ఆ తురుమును లో ఓ పావు ఉప్పును కలిపి కొద్ది సేపు ఉంచాలి . ఆ తరువాత ఊరిన నీటిని పైపైన పిండాలి . అంటే నీరు మొత్తం తీసేయకుండా కొద్ది తడిని వుండనీయాలన్న మాట . ఆ తురుమును కొలుచుకొని దానికి రెట్టింపు పంచదారను వేసి బాగాకలిపి ఓ రెండు దాల్చిని ముక్కలను అందులో వేసి , దానిని ఓ గిన్నలో వేయాలి . ఆ పైన ఓ శుభ్రమైన బట్టను , ఆ గిన్నెకు వాసెన కట్టి ఎండలో పెట్టాలి . మధ్య మధ్య లో కలుపుతూ , పంచదార బాగా కరిగి , తీగ పాకం లా అయ్యేంత వరకూ ఎండ లో వుంచాలి . రెండు రోజలో అవుతుంది . అప్పుడు అందులో , జీలకర్రను దోరగా వేయించి కొట్టుకున్న పొడిని ఓ చెంచాడు కలపాలి . సగము విడిగా తీసుకొని అందులో మన టేస్ట్ ప్రకారము ఖారం కలుపుకుంటే సరి . తీపి , ఖారం చుందా రెడీ . ఇది జాం లాగా బ్రెడ్ లోకి , చపాతిలలోకి బాగుంటుంది . ఎండాకాలం పిల్లలకు మంచిది .

ఇహ తురుమును పిండిన నీటి లో , దానికి రెట్టింపు పంచదార వేసి , ఓ సీసాలో పోసి , మూత బెట్టి ఎండలో పెట్టాలి . రెండు రోజులలో పంచదార కరిగి , మాంగో షరబత్ రెడీ .

లేదా ఆ ఊటలో పోపేసుకొని పచ్చి పులుసు చేసుకోవచ్చు .

ఇవండీ ఈసారి నేను చేసిన పచ్చడులు , చుందానూ .