Wednesday, September 14, 2011

రాధ - మధు



టి. వి చూసే అలవాటు లేని నేను , యద్దనపూడి నవల సీరియలా గా వస్తోంది అని విని , ఏదేమిటో చూద్దామని టి. వి ఆన్ చేసాను . అంతే రెండు సంవత్సరాల పాటు రాత్రి 8 కాగానే మా టి. వి ముందు హాజరు . రాధ - మధు సీరియల్ తెగ నచ్చేసి , అప్పుడప్పుడు పిల్లలతో కూడా టి. వి కోసం యుద్దం చేసేంతగా నచ్చేసింది :)))))

ఈ తియ్యనైన ఎడబాటు ప్రేమ కథ ను స్కార్ఫియో ప్రొడక్షన్ వారు " రాధ- మధు " గా టి . వి సీరియల్ గా తీసారు . ఈ సీరియల్ లో కథ ను బేస్ గా మాత్ర మే తీసుకున్నారు . తాతయ్యను , నానమ్మ గా చూపించారు . కొన్ని పాత్రల నిడివి ని పెంచారు . కొన్ని ఎక్స్ ట్రా పాత్రలు చేరాయి . ఐనా ప్రతిపాత్ర బలమైందే . ప్రతి పాత్రా అవసరమైందే అన్నట్లుగా వున్నాయి . వొకటి ఎక్కువ , వకటి తక్కువగా లేవు . చిన్న పాత్రల మీద కూడా శ్రద్ద చూపించారు . ఏ పాత్రను తీసుకున్నా సహజం గా అనిపించింది . డైలాగులు చాలా మామూలు బాషలో వున్నాయి . అనవసరమైన ఇంగ్లీష్ పదాలు లేవు .ఎక్కడా అతిలేదు . సంభాషణలు చాలా మాములుగా మనం ఇంట్లో మాట్లాడుకున్నట్లే వున్నాయి . అంతేకాని భారీ డైలాగులు లేవు . హాస్యం కూడా బాగా పండించారు . చాలా అద్భుతంగా తీసారు .

హీరో పేరు రాధాకృష్ణ . అందరూ రాధా అనిపిలుస్తుంటారు . హీరోయిన్ పేరు మధూలిక . మధు అని పిలుస్తుంటారు . నానమ్మ రాజరాజేశ్వరీ దేవి . కథ కు ప్రాణం ఈ మూడు పాత్ర లే . సినిమాలలో గుంపులో గోవిందమ్మ గా , చిన్న చిన్న పాత్రలు వేసే శివపార్వతి ని ముందు నానమ్మ గా చూసి , ఈమె ఏమి చేయగలదు అనుకున్నాను కాని , జమీందారు భార్య గా ఆ వశం ప్రతిష్ఠ కాపేడేందుకు కొడుకును దూరం చేసుకొన్నప్పుడూ , ఆ తరువాత పశ్చాతాపం చెందినప్పుడూ , మనవడి ని పెంచేటప్పుడు బాద్యత గల నానమ్మగా , మనవడి ని మార్చాలి , పెళ్ళి చేయాలి అని తపించినప్పుడూ , పనివాళ్ళ మీద కూడా అభిమానం చూపించేటప్పుడూ , పేద ఇంటి పిల్లను మనవడి కి ఇచ్చి పెళ్ళి చేసినప్పుడూ , రాధ ప్రేమ కథ తెలిసి , తనకు తెలీకుండానే ఇద్దరు అమ్మాయీల జీవితాన్ని నాశనం చేసానే అని పరితపించినప్పుడు , మితృ , గోపాలం ల బాల్య స్నేహితురాలిగా చాలా బాగా నటించింది . నటించింది అంటము కాదు జీవించింది . నానమ్మ అంటే ఇలా వుండాలి అనిపించేట్లుగా వుంది . చాలా హుందాగా వుంది . రాధగా కళ్యాణ ప్రసాద్ తోరం , మధుగా మౌనిక చాలా సహజం గా వున్నారు . అసలు వాళ్ళిద్దరికీ సీరియల్ తీసే ముందే , ఎలా నటించాలి అని శిక్షణ ఇప్పించారేమో అని నా అనుమానం . వాళ్ళ హావ భావాలు , బాడీ లాంగ్వేజ్ , డ్రెస్సింగ్ అన్నీ నాచురల్ గా వున్నాయి . ఆ పాత్రలకు తగ్గట్టుగా నవలలో నుంచి ప్రాణం పోసుకొని వచ్చారా అన్నట్లుగా వున్నారు . వాళ్ళ ముందు , శోభన్ బాబు , జయప్రద తేలి పోయారు . మధు చీర కట్టు చూస్తే సింతటిక్ చీరలు కూడా ఇంత అందం గా కట్టుకోవచ్చా అనిపించింది . పద్మశ్రీ , లక్ష్మి ల జడలు కూడా పెద్దగ్గానే వున్నా మధు జడ డామినేట్ చేసింది . నడుస్తూ , నడుస్తూ భుజం మీదు గా చూడటము ఓహ్ చాలా అందంగా అనిపించిందీ అమ్మాయి .(ఇన్ని తెలివితేటలు , అందమూ , మంచి గుణాలన్ని కలవోసిన అమ్మాయిని నిజ జీవితం లో భరించటం కష్టమేమో :)) కాకపోతే కొన్ని సార్లు మధు కాన్ ఫిడెన్స్ ఓవర్ గా చూపించిదా అనిపించింది .

జూలీ గా లహరి బాగా ఇమిడిపోయింది . అందరి సానుభూతి నీ దోచుంది . మిగితా పాత్ర ధారు లంతా కూడా బాగా చేసారు . కాకపోతే అందరివీ అసలు పేరులు తెలీలేదు . సాయన్న , గొదావరి , బాపి మొదలైన వారి అసలు పేర్లు తెలీలేదు . యువజంట రాధ - మధు తో పోటీ పడ్డారు గోపాలం ఆది లక్ష్మి , వెంకట్రావు , జానకమ్మ . సాయి , పద్మశ్రీ హాస్యాన్ని బాగా పండించారు . ముందు పారిజాతం పాత్ర అనవసరం అనుకున్నాను కాని రాధ - మధు ల ను కలిపేందుకు పరోక్షం గా ఆ పాత్రే సాయపడింది . రాఘవయ్య పాత్ర సగము నుంచి ముఖ్యమైన పాత్రైపోయింది . రాజు , శీను , సరోజ , భారతి , బబ్లు , అనసూయ , సన్నీ లాంటి చిన్న పాత్రల కు కూడా న్యాయం చేసారు . మధు ఆప్తులుగా మూర్తీ , లక్ష్మి బాగా చేసారు . మధు తమ్ముడు రవి చాలా ముద్దుగా వున్నాడు . వరమ్మ పాత్ర పల్లెటూరి అమ్మలక్కల పాత్ర ను సజీవం గా చూపారు . రాధ - మధు లను కలపాలని అందరూ ప్రయత్నం చేయటం టచీగా అనిపించింది .
ఇహ రాధ మధు కలుస్తారు అనుకోగానే ఏదో అవాంతరం రావటం , మనం ఉసూరు మనటం . అందుకే డైరక్టర్ దీనిని తీయని ఎడ్బాటు ప్రేమ కథ అన్నాడు :) సీరియల్ రెండు సంవత్సరాల పాటు కళ్ళు తిప్పుకోనీయకుండా టి. వి కి కట్టి పడేసిన అద్భుతమైన సీరియల్ ఇది . కాని , కొన్ని సార్లు సాగతీతగా అనిపించింది . కొన్ని చోట్ల పద్మశ్రీ , పారిజాతము ల ఎపిసోడ్స్ కొంచం బోర్ కొట్టించాయి . అలాగే ఆద్యంతమూ రాధ మధుల మేకప్ మొదలైన వాటిల్లో శ్రద్ద చూపించారు కాని చివరి ఎపిసోడ్ కు వచ్చేసరికి ఇద్దరి మేకప్, హేర్ స్టైల్ రెండూ బాగాలేవు . అంతకు ముందు రెండు పెళ్ళి కూతురి గెటప్ లో ముచ్చటగా వున్న మధుకు హేర్ స్టైల్ పూర్తిగా మార్చి , ఓవర్ మేకప్ చేసారు . పాన్ కేక్ బాగా కనిపించి మోటుగా వుంది . అంతవరకు వున్న అందమే పోయింది . అలాగే రాధ కు కూడా . హేర్ మొత్తం వెనక్కి దువ్వేసి , మేకప్ కూడా ఓవర్ గా చేసారు . ఒకేసారి గా ఇద్దరూ వయసు ఎక్కువ వాళ్ళుగా అగుపించారు . చిన్న చిన్న లోపాలు తప్ప సీరియల్ చాలా బాగుంది .
కొన్ని సరదా అబ్జర్వేషన్స్ ; రాజరాజేశ్వరి జమిందారిణి ఐనా , పాపం ఆ రాజమాత కు సీరియల్ మొత్తం లో పది చీరల కన్న ఎక్కువ లేవు ! మధు జడ మొదట్లో చాలా వదులుగ సన్నగా వుండి రాను రాను లావైంది . జుట్టు కు క్లిప్ పెట్టుకొని గుడికి వెళ్ళి నప్పుడు జుట్టు జడంత పొడువులేదు . సీరియల్ చివరలో జడకు బోలెడు క్లిప్స్ పెట్టారు . సీరియల్ అంతా బెడ్ కాఫీ తో మొదలుకొని , బ్రేక్ఫాస్ట్ , లంచ్ , డిన్నర్ అన్నీ యధావిధిగా పెట్టారు . అందుకేనేమో సీరియల్ ఐపోయే సమయానికి అంతా కాస్త లావెక్కారు :) ప్రతి చిన్న విషయాన్ని అంటే ఎవరైనా ఆక్టర్ ఇక ముందు కనిపించరు అంటే ముందే వారిని పని మీద వూరికి పంపటం వగైరా చేసి మనకు డౌట్స్ రాకుండా చేసారు . కాని చివరలో రాధ కు , పేపర్ లో చూసి , ఆపరేషన్ కోసం సహాయం చేసింది రవి కేనని ఎలా తెలిసిందో చెప్పటం మర్చిపోయారు . సీరియల్ అంతా తన నొటి తో దడ దడ లాడించిన వరమ్మ లాస్ట్ సీన్ లో లేకపోవటం కొరతే మరి :)
ఇది యద్దనపూడి సులోచనారాణి నవల " గిరిజా కళ్యాణం " ఆధారం గా నిర్మించ బడింది . దాని కథ చిత్రమాలికలో " గిరిజా కళ్యాణం " లో చదవండి ..
ఇది యు ట్యూబ్ లో వుంది . చూడని వారు చూడవచ్చు .
కొస మెరుపేమిటంటే , ఈ సీరియల్ వస్తున్న రోజుల్లోనే ఎందుకో జి చానల్ పెడితే అందులో " ఆట" అనే ప్రోగ్రాం వస్తోంది . అప్పుడు మధు అందులో " ఆ అంటే అమలాపురం " పాటకు డాన్స్ చేస్తోంది . అది చూడగానే మనసంతా బాధ తో నిడిపోయింది . ఆర్టిస్టులంటే అన్నీ పాత్రలూ పోషించాలి కాని ఆ సీరియల్ వస్తుండగా ఆ అమ్మాయి ఈ డాన్స్ చేయకుండా వుండాల్సింది అనిపించింది :(

ఈ మద్య నవల ఆధారిత సినిమా ల గురించి చిత్రమాలిక లో వ్రాస్తున్నాను :) ఐతే నా దగ్గర అన్నీ యద్దనపూడి , యండమూరి , శరత్ బాబు నవలలు , సినిమాలే వున్నాయి . నాకు తెలిసినంతవరకు మాదిరెడ్డి , కొమ్మూరి వేణుగోపాల రావు , మల్లాది , కావలిపాటి విజయలక్ష్మి , బలభద్రపాత్రుని రమణి మొదలైన వారి నవలలు కూడా సినిమాలుగా వచ్చాయి .కాని ఏ సినిమాలు ఏ నవలల ఆధారం గా వచ్చాయో తెలీటం లేదు . అలాగే కొన్ని నవలలు తెలుగు లో , హిందీ లో కూడా వచ్చాయి . ఎవరికైనా , నవల పేరు , అది సినిమా గా వచ్చిన సినిమా పేరు తెలిస్తే చెప్పగలరు ప్లీజ్ . అలాగే ఈ ఆర్టికల్ ఇలాగే కాకుండా ఇంకా కొంచం వేరుగా వ్రాయవచ్చేమో సలహాలు ఇచ్చినా సంతోషిస్తాను . ఆ * * * నవలలు , సినిమా సిడీ లు నేను కొనుక్కుంటానులెండి .నవలలైతే ప్రతినెలా కోటీ దాకా ఏమొస్తావులే అని నాలుగు నెలల క్రితమే మా ఇంటి వెనుకే విశాలాంద్ర వారు బ్రాంచ్ తెరిచారు . ఏ నవల కావాలన్నా తెప్పించి ఇస్తాం మేడం అని నాకు ప్రామిస్ చేసారు . కాబట్టి నొప్రాబ్లం :) సి.డి లే సుల్తాన్ బజార్ కు వెళ్ళి తెచ్చుకోవాలనుకోండి . కాకపోతే దొరకాలి :)
అందరికీ అడ్వాన్స్ గా థాంకూలు :)