Monday, December 27, 2010

అయ్యబాబోయ్ సాహితి కి రెండేళ్ళట !!!!!!!!!!!!!!కొత్త పోస్ట్ హారం, మాలిక లో వెంటనే కూడలి లో పది నిమిషాలు ఆలశ్యముగా విడుదలైంది . ఎలా నడుస్తుందో ఏమో ? కూడలి నుండి 63 టికెట్స్ అమ్ముడయ్యాయట . హారం నుంచి 49 , మాలిక నుంచి 26 అమ్ముడయ్యాయని స్టేట్స్ చెపుతోంది ! స్చప్ . . . అంతేనా ???? మొత్తం 200 లైనా కాలేదు (((( . . . . . ఈ గ్రాఫ్ ఎప్పటికి పైకి పోను ? కామెంట్స్ కూడా 8 ఏ వచ్చాయి , , , , ,

కొత్త పోస్ట్ రాసినప్పుడల్లా , కోట్లు గుమ్మరించి కొత్త సినిమాను విడుదల చేసిన నిర్మాతను మించి ఆత్రుత , టెన్షన్ :) అవును మరి కోటి కోటి ఆలోచనలు చేసి రాస్తాను కదా ఆమాత్రం ఆత్రుత వుండదేమిటి ?:-)అలా అని అన్ని పోస్ట్ల కూ ఆ ఆత్రుత వుండదు . చాలా బాగా రాసాను అనుకున్నదానికే , రామచరణ్ సినిమానో , జూనియర్ యంటీఅర్ సినిమానో కోట్ల తో నిర్మించి , విడుదల చేసి , రిజల్ట్ కోసం అన్ని కేంద్రాల లోని తన ఏజంట్ల కు కాల్ చేసి , ఎప్పటికప్పుడు ఎలా నడుస్తోందో తెలుసుకుంటూ వుండే నిర్మాతలా ఫీలైపోతూవుంటాను ! టెన్షన్ పడిపోతూవుంటాను . కాని అదేమిటో నేను బాగున్నది అనుకున్న పోస్ట్ కు టుక్కూ . . . టుక్కూ . . . టుక్కూ అనుకుంటు రెండో మూడో కామెంట్స్ వస్తాయి :)

అసలు రెండు సంవత్సరాల క్రితం బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు రెండు సంవత్సరాలు బ్లాగ్ వ్రాస్తానని నేనేమాత్రమూ ఊహించలేదు . ఏదో కొన్ని రోజు వ్రాసి ఆపేస్తాననుకున్నాను .రాస్తూనే వున్నాను . పైగా ఈ ఎదురుచూపులు ! ఇంకా ఆపైన ఐదు బ్లాగులు ! అంతేనా బుక్స్ అండ్ గర్ల్స్ ఫ్రెండ్స్ కు ఫస్ట్ గెస్ట్ ఆథర్ ని ! అంతేనా ? చిత్రమాలిక కూ మొదటి అథిది రచయిత్రినే :) ఏమిటో అంతా మాయ , కల ! కమ్మటికల :)

సాహితి కి జన్మదిన శుభాకాంక్షలు .

శ్రీలలిత గారు , ఈ కార్డ్ చేసి కానుకగా పంపారు .అభిమానము తో వచ్చిన కానుకను మరి అందుకోకుండా వుండగలనా ? థాంక్ యు శ్రీలలిత .ఇంకా ఎవరైనా కానుకలు ఇద్దామనుకుంటే ఇచ్చేయండి . ఎంతైనా రెండు సంవత్సరాల పాపాయే కదా ! అందుకే ఈ పుట్టినరోజు కు కానుకలు స్వీకరించబడవు అని రిస్ట్రిక్షన్ పెట్టలేదు :))

Wednesday, December 22, 2010

ప్రమదావనం పండుగఈ రోజు మా ప్రమదావనం పండుగ . ఇదేమి పండుగ పేరు వినలేదే అంటున్నారా ? అవునండి ఇది మాకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ . మా అందరికీ స్నేహితురాలు , హితురాలు , మాలో కొందరికి బ్లాగ్ గురువు , ఈ ప్రమదావనం రూపకర్త జ్యొతి పుట్టిన రోజు .
మరి మా గురూజీ పుట్టిన రోజు న షడ్రుచుల తో విందివ్వాలా ? ,
వీనుల కింపైన పాటలు వినిపించాలా ?
చక్కనైన చిత్రాలు తీయాలా ?
అమ్మో అమ్మో ఎంత హడావిడి . మీతో మాట్లాడేందుకు టైం లేదు . మా పార్టీ అయ్యాక ఆ విశేషాలతో అభినందనమాల లో కలుద్దాం * * * * *

Saturday, December 18, 2010

అమ్మ నా కోడలా :)))))
అనగ అనగా ఒక వూళ్ళో కాంతమ్మ అని వొకావిడ వుంది . అదిగో . . . అంత వూళ్ళో కాంతమ్మ అనే వొకావిడేనా ఇంకెవరూ లేరా అని చచ్చు , పుచ్చు ప్రశ్నలడగద్దు . కథ పక్క దారి పడుతుంది . సరే ఆవిడకొక చక్కని చుక్క లాంటి కూతురుంది . ఆ అమ్మాయి పేరు చుక్క . ఓరోజు కాంతమ్మ చెరువు కు నీళ్ళు తేవటానికి , చుక్కను వెంట పెట్టుకొని వెళ్ళింది . చెరువు లో బిందెతో నీళ్ళు ముంచి , బిందెను ఎత్తబోయింది చుక్క . కాలు బురదలో పుసుక్కున జారి ఆ బిందె తో సహా బుళ్ళుక్కుమని నీళ్ళలో మునిగిపోయింది చుక్క . అయ్యో అయ్యో అని కాంతమ్మ కేకలు పెట్టసాగింది . అప్పుడు చక్కనైన ఓ అబ్బాయి వచ్చి , బాధపడకండి , నేను మీ అమ్మాయిని తీసుకొస్తాగా అన్నాడు . మా బాబే మాబాబే నీపేరిమిటినాయనా అంది కాంతమ్మ . ' దాని మొగుడు ' అని చెప్పి గబుక్కున చెరువులోకి దూకాడు దాని మొగుడు . చుక్కను రక్షించి , బయటకు తెచ్చి లాఘవంగా గుర్రమెక్కించుకొని వస్తానత్తా అని దౌడుతీసాడు . చుక్క కూడా కిల కిలా నవ్వుకుంటూ ప్రియుడి సరసన కూర్చొని తుర్రుమన్నది గమనించని కాంతమ్మ లబో దిబో మంటూ ఏడవసాగింది . అప్పుడు దారిన వెళుతున్న వాళ్ళు ఏందుకేడుస్తున్నావు అంటే నా కూతురి ని వాడెత్తుక పోయాడు అన్నది . అయ్యో ఎవరువాడు అని అడిగారు దారినపోయే దానయ్యలు . దాని మొగుడు బాబూ . మా చుక్కను వాడినుంచి రక్షించండి అని ఆదానయ్యలను వేడుకుంది కాంతమ్మ . అంత దాని మొగుడు దాన్నెత్తుకు పోతే ఏడుస్తావేమిటి అని పకపక నవ్వుతూ వెళ్ళిపోయారు దానయ్యలు . . . . . .

ఏమిటీ పొద్దున్నే కథలు చెపుతున్నావు , పనీపాటా లేదా అంటే ఎందుకు లేదు ? ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ముగించి వచ్చా . ఓ పది రోజుల క్రితం మా అబ్బాయి యు.యస్ నుంచి వచ్చాడు . రెండు నెలల క్రితమే ఇక్కడి నుంచి యు.యస్ కు షిఫ్ట్ అయ్యారులెండి . పని మీద ఇటొచ్చాడు . వాడంతే వాడి కాళ్ళకు చక్రాలున్నాయి . ఎప్పుడే దేశం లో , ఏవూళ్ళో వుంటాడో వాడికే తెలీదు ! ఐందా , సరే పిల్లగాడు అంత దూరము నుంచి వచ్చాడు కదా అని రోజూ ఏదో చేసిపెడుతునే వున్నాకాని , ఈ రోజు పొద్దుటి నుంచి కాస్త సుస్త్ గా వుండి గోధుమరవ్వ ఉప్మా చేసాను . మా వాడికి ఉప్మానే ఎక్కదు . అందులో గోధుమరవ్వది .నిన్న తెచ్చిన పుల్లారెడ్డి స్వీట్లు రెండు , మొన్న తెచ్చిన వెల్లంకి చక్కిలాలు రెండు కసా పిసా నములుతూ అబ్బా ఏమిటి మాతే ఈ ఉప్మా ? అన్నాడు మావాడు . నిన్న రాత్రి రగడా కట్లెట్ చేసాను . మొన్న చాట్ చేసాను . ఆలూ పరోఠా , మూలీ పరోఠా , పాలక్ పూరీ ఇలా రోజు చేస్తునేవున్నానుకదరా ఓరోజు ఉప్మా చేస్తే గొణుగుతావు . ఐనా నేను వైన వైనాలు గా వండలేను బాబూ మీ అవిడను వండమను అని నేను , మా ఆవిడను ఇబ్బందిపెట్టకురా వండిందేదో తిను అని మా ఆయనా క్లాసులుపీకితే ఓ చెంచాడు తిని పైకి వాడి రూములోకి వాడు , బాల్కనీ లోకి నేనూ , ఆఫీస్ కు మావారూ , ఎక్కడివాళ్ళం అక్కడ సద్దుకున్నాము .

బాల్కనీ లో కుర్చీలో సెటిలై పేపర్ తీసాను . ఈ సారి న్యూ ఇయర్ పార్టీలు ముందుగానే చేసుకుంటున్నారట . ఆ వార్త చదువుతూ వండగా మేడం అని వినిపించింది . ఎవరా అని చూస్తే ఓ కొరియర్ బాయ్ చేతులో కంట్రీ ఓవెన్ పాకెట్ పట్టుకొని వున్నాడు . ఏమిటీ అంటే అనుపమ గారు , బిపిన్ గారికి యు. యస్ నుంచి ఆర్డర్ చేసారండి అన్నాడు . ఓహో వీళ్ళూ న్యూ ఇయర్ పార్టీ ముందుగానే చేసుకుంటున్నారా , కేక్ పంపినట్లుంది అనుకొని బిపు ను పిలిచాను . బిపు వచ్చి తీసుకొని , కంట్రీ ఓవన్ నుంచి వెజ్ పఫ్ లు పంపింది అను అన్నాడు . హోరినీ అప్పుడే ఎప్పుడు చెప్పావురా గోధుమరవ్వ ఉప్మా చేసానని నువ్వు తినలేదనినూ అని బోలెడు హాచర్యం ప్రకటించా !!!!!

హి హి హి నేను చెప్పలేదు మాతే అన్నాడు బిపు .

ఐతే మీ ఆవిడకు సిక్స్త్ సెన్సా అన్నాను నవ్వుతూ .

యెప్ అని నవ్వుకుంటూ వాళ్ళావిడ పంపిన వెజ్ పఫ్స్ తీసుకొని లోపలికి తుర్రు మన్నాడు !!!!!

అవును మరి వాళ్ళావిడ వాడికి పంపింది :)))

Wednesday, December 15, 2010

కదంబమాలిక -3

బ్లాగులో రాసేది ఒకే పోస్టు . ఒకే అంశం. లేదా ఒకే కథ.. కాని పది మంది కలిసి ఒకే కథను రాస్తే. అదే ఒక్కో పుష్పం కలిసి తయారు చేసే అందమైన కదంబమాలిక. అలాగే ఈ బ్లాగర్లు ప్రతి వారం ఒక్కొరుగా ఈ కథను అందిపుచ్చుకుని కొనసాగిస్తారు . కొత్తగా చేయాలనే కోరికతో ప్రమదావనం సభ్యులు కొందరు చేసే ఈ ప్రయోగాన్ని మీరు సహృదయంతో పరిశీలించి, సరిదిద్ది, ప్రోత్సహిస్తారని కోరుతున్నాను..


ఈ కదంబమాలిక లోని మొదటి భాగం సురుచి లో జ్ఞానప్రసూన గారు , రెండో భాగం మమత రెడ్డి గారు ప్రభాతకమలం లో వ్రాయగా , మూడో భాగం నేను వ్రాస్తున్నాను . ఇలా అందరమూ కలిసి గొలుసుకట్టు కథ రాద్దామని శ్రీలలిత ప్రతిపాదించగానే , అందరమూ ఉత్సాహంగా సరే నని అమోదించేసాము . నాలాగా కథలు వ్రాయటము రానివారికి జ్యోతి , శ్రీలలిత సహాయమందిస్తామన్నారు . అంతే ' ధైర్యే సాహసే లక్ష్మీ ' అని , వారి అండ , దండ చూసుకొని దూకేసాను . జ్యోతి గారు , శ్రీలలిత గారు , మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలండి . నేను ఇంత వరకూ కథలు వ్రాయలేదు . ఇదే మొదటి సారి . మరి ఎలా వ్రాసానో ఏమో ? కొంచం టెన్షన్ గానే వుంది . ఏమైనా తప్పులుంటే నవ్వకండెం ! ఇహ కథ చదవండి . . .

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

ఊ ఊ ఇక పని సంగతి చూడు పిల్లలకు స్కూల్ కు ఆలశ్యం అవుతోంది అంటూ లోపలికి వెళ్ళింది నారాయణమ్మ .

అమ్మా నేను పోతున్నా , మళ్ళొచ్చి చేస్తా అని జానకి వెళ్ళి పోయింది .
ఇంతలో 'రోజా ' అని గట్టిగా పిలిచాడు భాస్కర్ . వస్తున్నానండీ అంటూ వెళ్ళింది సరోజుని . చూడు , నా షర్ట్ హాండ్ కు బటన్ వూడి పోయింది . అసలు నువ్వు నా సంగతి పట్టించుకోవటమే మానేసావు . నా సాక్స్ , హాంకీ ఏవీ ? నా సెల్ చార్జింగ్ కు పెట్టనే లేదు . ఒక్కో పని పదిసార్లు చెప్పాల్సి వస్తోంది . అసలు రోజంతా ఏచేస్తున్నావు ? అని గట్టి గట్టిగా అరవటము మొదలు పెట్టాడు భాస్కర్ . భర్త అరుపులకు కళ్ళలోనించి దుమికే నీటిని అదిమేసి , మౌనముగా బటన్ కుట్టి ఇచ్చి , హంకీ , సాక్స్ తీసి ఇచ్చింది . అమ్మా నాకు అత్త జడవేయలేదు అని ఏడుస్తూ వచ్చింది కీర్తి . భోజనాల గదిలోనుంచి అమ్మా అని అరుస్తున్నాడు శ్రీకర్ . కీర్తి కి జడవేస్తూ అటెల్లింది సరోజిని . సరోజిని ని చూడగానే నారాయణమ్మ ఎటెళ్ళావు ? నేను జరుగుతున్నాకాని నాపని జరగటము లేదన్నట్లున్నావమ్మాయ్ . ఈ అనిత ఏదీ ? పొద్దుటి నుంచి కనిపించలేదు . ఈ మద్య పిల్ల కూడా మాటా పలుకూ లేకుండా వుంటోంది అన్నది . సరోజిని అనిత ను పిలుద్దామని అనుకునేలోగానే , చిన్నగా అనిత భోజనాల గది లోకి వచ్చింది . పిల్ల ల తో సమానము గా అల్లరి చేస్తూ ఉషారుగా వుండే అనిత , ఈ మద్య ఇలా డల్ గా ఎందుకు వుంటోందా అని దిగులు పడుతున్నారు , నారాయణమ్మ , సరోజిని . అనిత , నారాయణమ్మ భర్త శ్రీరాం గారి అన్నయ్య గారి అమ్మాయి . అనిత కు ఐ .ఏ .యస్ చదవాలి అన్న కోరిక . చదువంటే అమితమైన ప్రేమ . అది గుర్తించే , శ్రీరాం గారు వాళ్ళ అన్న గారి ని ఒప్పించి , వూరి నుండి తీసుకొచ్చి , తన దగ్గరే వుంచుకొని ,కాలేజ్ లో , ఇంటర్ లో చేర్చారు . అనిత చాలా చురుకైనది . బాబాయి ఇంట్లో ని పిల్ల లా కలిసిపోయి , పిన్ని కి చేదోడు గా వదిన తో స్నేహము గా , పిల్లలకు ప్రియమైన అత్త గా కలిసిపోయింది . అందుకే ఈ మద్య అనిత డల్ గా వుంటే తల్లడిల్లుతున్నారు నారయణమ్మా , సరోజిని .

పిల్లలను బుజ్జగించి , తినిపించేసరికి స్కూల్ ఆటో రానే వచ్చింది . గబ గబా పిల్లలను తీసుకెళ్ళి ఆటో ఎక్కించి , రోజులా ఆటో డ్రైవర్ కు జాగ్రత్తలు చెప్పింది సరోజిని . పిల్లలు టాటా చెప్పి వెళ్ళిపోయారు . భాస్కర్ , అనిత కూడా వెళ్ళాక చూస్తే , కూరల బండి దగ్గర మామగారు కనిపించారు . ఆయన కూరల బేరం ఇప్పటో తెమిలేటట్లు లేదనుకొని , ఆయన చేతిలో వున్న సరుకుల సంచీ తీసుకొని లోపలికి నడిచింది సరోజిని .
" మీ మామగారు , వచ్చారేమిటి ? " అడిగింది నారాయణమ్మ .
" అవునత్తయ్యా , బయట రాజమ్మ దగ్గర కూరలు బేరమాడుతున్నారు " అంది సరోజిని .
" ఊమ్హ్ , ఇహ ఇప్పట్లో కూరలొచ్చినట్లే , నేను వండి నట్లే " నిట్టూర్చింది నారాయణమ్మ . అంతలోనే లోపలి కొచ్చి కూరలు భార్య కిచ్చి , ' టిఫిన్ పెట్టేదేమన్నా వుందా లేదా ? నీ పూజలైనాయా ' అడిగారు శ్రీరాం గారు .
టిఫిన్లూ , ఆ తరువాత భోజనాలూ , ఆ తరువాత పిల్లలకు టిఫిన్లూ , రాత్రి భోజనాలూ . . . అబ్బ ఎంతసేపటికీ తిండి గోలే ! విసుగొచ్చేస్తోంది . కాసేపు ఏదైనా పుస్తకం చదువుకుందామన్నా వీలు చిక్కటము లేదు . మళ్ళొస్తా అని వెళ్ళిన జానకి వచ్చేజాడలేదు . సందున నాలుగు బకెట్ల బట్టలు పిలుస్తున్నాయి . ఇల్లంతా ఖంగాళిగా వుంది . మొగుడుగారినోసారి తీసుకొచ్చి , చూపించి , ఓ మొట్టికాయ వేస్తే ఎలావుంటుంది ? . మొగుడిని మొట్టటమే ! తన ఊహకు , తనే నవ్వుకుంది సరోజిని . ఏమైనా చేయక తప్పదుగా అనుకుంటూ పనంతా పూర్తిచేసి , భోజనం కానిచ్చి టి. వి ఆన్ చేసుకొని జాజిపూలు కట్టేందుకు కూర్చుంది సరోజిని . చిన్నగా అటూ ఇటూ చూస్తూ లోపలికొచ్చిన లక్ష్మమ్మను చూసి జ్వరం తగ్గిందా అని అడిగింది . తగ్గిందమ్మా అంది లక్ష్మమ్మ .
' లక్ష్మమ్మా నిజం చెప్పు , నీకు నిజం గా జ్వరం వచ్చిందా ? జానకి ని ఇక్కడ పని కి పంపి , నువ్వు వేరే చోట చూసుకున్నావు కదూ "
" నీదగ్గర దాచలేనమ్మ , ఏం చేయమంటావు చెప్పు ? అందరమూ సంపాదించినా సరిపోవటము లేదు . నీకు తెలీనిదేముందమ్మా ? "
" లక్ష్మమ్మా , జానకికి చదువుకోవాలని వుంది దాని ని స్కూల్ కు పంపు . నువ్వూ , మీ ఆయన సంపాదించేదానిలో సద్దుకోండి . ఐనా నీకు తెలుసా ఇంత చిన్నపిల్ల ని పనిలోకి పంపుతే , పంపినందుకు నిన్ను , పనిలోకి తీసుకున్నందుకు మమ్మలిని జైల్లో పెడతారు "
చిన్నగా గొణుకుంటూ చీపిరి తెచ్చి ఇల్లు ఊడుస్తోందల్లా , సరోజి ని చూస్తున్న చిన్న బాబు ప్రకటన చూసి , అమ్మా ఆ బాబు నిజం బాబేనా అని అడిగింది . ముద్దుగా వున్న చిన్నబాబు పడుతూ లేస్తూ నడుస్తున్నాడు .ఏదో డైపర్ ప్రకటన అది . ఆ బాబును చూస్తూ అవును అంది సరోజిని .
" అమ్మా ఆ బాబు కు పైసలిస్తరా ?" అడిగింది లక్ష్మమ్మ .
" ఇస్తారు " .
" మరి ఆ బుడ్డోడు సంపాదిస్తేగాని , తల్లి తండ్రులకు ఎళ్ళదా ? ఆ తల్లి తండ్రులను జైల్లో పెట్టరా ? సినిమాలలో , ప్రకటనలలో ఎక్కడచూసినా బొడ్డూడని పిల్లగాళ్ళను తీస్తారు . వాళ్ళకు చదువు అక్కరలేదా ? శ్రీదేవి , అలీ చిన్నప్పటి నుంచే సినిమాలలో పని చేస్తున్నరంట . స్కూల్ కు కూడా వెళ్ళలేదట . . అట్లాంటి పిల్లలు మా కృష్ణ నగర్ లో ఎంతమందో వున్నారు . ఈ రూల్స్ అన్నీ మాలాంటి రెక్కడితే కాని డొక్కాడని వాళ్ళకే కాని , పెద్దోళ్ళకు కాదు " .
ఏకధాటిగా మాట్లాడుతున్న లక్ష్మమ్మకు జవాబు ఏమి చెప్పాలో సరోజిని కి తోచలేదు .
" ఏమిటి లక్ష్మమ్మా ఇప్పుడొచ్చి ముచ్చట పెట్టావు ?" అంటూ గదిలో నుండి బయటకు వచ్చిన నారాయణమ్మ ను చూసి ఏమిలేదమ్మా అంటూ చిన్నగా లోపలికి జారుకుంది లక్ష్మమ్మ . " అమ్మాయ్ మేము గుడి కివెళ్ళి వస్తాము " అని చెపుతూ , సరోజిని మొహము చూసి , " ఏమిటమ్మాయ్ అట్లా మొహం వాడి పోయింది . పొద్దున భాస్కర్ అరిచాడని బాధ పడుతున్నావా ? అట్లాంటి చిన్న చిన్న గొడవలు మామూలేకదా ? ఐనా భార్యాభర్తల గొడవ తామరాకు మీది నీటి బొట్టులా వుండాలి . ఆ గొడవను మనసు బయటే వుంచేయాలి . మనసులోకి రానీయకూడదు ." అని చెప్పి వెళ్ళిపోయింది . అత్తగారిని చూస్తే ఎప్పుడూ ఆశ్చర్యమే సరోజినికి . మామగారు ఎంత అరిచినా నవ్వుతూనే వుంటారు . ఒక్క మాటా మాట్లాడరు . ఏమీ కానట్లే , సాయంకాలము కాగానే , శుభ్రం గా తయారై , ముడి చుట్టూ పూలు తురుముకొని , మామగారితో కలిసి గుడికి వెళుతారు . ఇద్దరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వుంటారు . ఇంతలోనే దెబ్బలాట , అంతలోనే ముచ్చట్లు . అసలు ఏమీ చదువుకోని అత్తగారు , అన్ని విషయాలనూ కను సైగ తోనే సరిదిద్దుతారు . ఆమెలా ఎందుకు వుండలేక పోతున్నాను అనుకుంటూ , అత్తగారు , మామగారు వెళ్ళాక తలుపేసుకొని లోపలికి వస్తున్న సరోజిని కి ఫోన్ రింగ్ వినిపించింది . ఫోన్ తీయగానే " హాయ్ వదినా ఎలావున్నావు ?" అని అడిగింది ఆడపడుచు సుమ .
సంతోషం గా " హాయ్ సుమా నువ్వెలా వున్నావురా ? ఇప్పుడే అత్తయ్యగారు , మామయ్య గారు గుడికి వెళ్ళారు కొంచం ముందు చేసి వుంటే వాళ్ళ తో మాట్లాడేదానివి . ఐనా ఈ సమయం లో చేసావేమిటి ? కొత్తకాపురం ఎలా వుంది ? "
" చాలా మనాది గా వుందొదినా . మీరంతా ఒకటే గుర్తొస్తున్నారు . రోహిత్ బాగానే వున్నాడు . ఫ్రెండ్లీగానే వుంటాడు కాని , మిమ్మలిని వదిలి వుండలేక పోతున్నాను .అమ్మ ప్రసాదాలు గుర్తొస్తున్నాయి . నాన్న కు తెలీకుండా ఇద్దరమూ సినిమా కు ఎట్లా వెళ్ళే వాళ్ళము కదా ? ఆ విషయాలన్నీ రోహిత్ కు చెపుతూ వుంటాను . మా వదిన నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎంత ఆశ్చర్యపోయాడో తెలుసా ? "
" అవును సుమా నాకూ నువ్వు చాలా గుర్తొస్తున్నావు . పిల్లలు కూడా అత్తా అత్తా అని నిన్నే కలవరిస్తూ వుంటారు . కొంచం లో కొంచం నయం , అనిత రావటము తో మా అందరికీ కాస్త మనాది తగ్గింది ."
" వదినా అనిత ఎలా చదువుతోంది .దాన్నితీసుకొచ్చి నాన్న మంచి పని చేసారు . అది కోరుకున్నట్లే కలెక్టర్ అవుతుంది చూడు . దానికా పట్టుదల వుంది ."
" ఏమో సుమా , ఈ మద్య అనిత అదోలా వుంటోంది . ఏమడిగినా జవాబు చెప్పదు . . . . . ఒక్క నిమిషం బయట ఎవరో తలుపు కొడుతున్నారు చూసి వస్తాను ."
" మంచిదొదినా నేను మళ్ళీ చేస్తానులే వుంటా బై ."
"ఎవరదీ వస్తున్నా .. . . అంత గట్టిగా కొడ్తారేమిటి బాబు కాస్త ఆగలేరు ?? ?"

(సశేషం )
వచ్చేవారం దుర్గ గారి బ్లాగ్ లో కలుసుకుందాము .బెస్ట్ ఆఫ్ లక్ దుర్గ.

Sunday, December 12, 2010

ఐ లవ్ యు లిల్లీ
తెలుపు రంగుతో సై అంటే సై అంటుంది . ఎందుకుండదు ? పూల కుండే బేలతనమే లేదు . దోరాకు పచ్చని బుడిపె మీద మందముగా త్రికోణాకారము తో , మందమైన రేకుల తో ఠీవిగా , తలెత్తుకొని మరీ నిలబడి వుంటుంది . ఏ తుఫానులకూ దడవను , నాకు నేనే సాటి అని పొగరుగా చూస్తుంది ఇంకెవరు తెల్లని లిల్లీ పూవు :) తెల్ల తెల్లగా శ్వేత వర్ణము లో మెరిసిపోతూ చక్కని సువాసనలు వెదజల్లే లిల్లి పూవంటే నాకు చాలా ఇష్టము . మనసుకు స్వాంతన కలిగించేట్లుగా , సన్న సన్నని సువాసనలు వెదజల్లుతుంది . ఎంతసేపు చూసినా చూడాలీ అనే అనిపిస్తూ వుంటుంది .

మా చిన్నప్పుడు , మా ఇంట్లో రెగ్యులర్గా వుండే సన్నని లిల్లీ కాకుండా చిన్ని తెల్ల గులాబీలా వుండే తెల్ల లిల్లీ పూల చెట్లు వుండేవి , ఆ తరువాత అవి ఎక్కడా నాకు కనిపించలేదు .మామూలు లిల్లీ నైతే మా ఇంట్లో పెంచుకుంటున్నాను కాని , ఈ లిల్లీ చెట్లు ఇక్కడ దొరకవట . బెంగుళూరు నుంచి తెచ్చుకోవాలట ! ఇదిగో ఇన్ని సంవత్సరాలకు నాగార్జున సర్కిల్ దగ్గర వున్న పూల షాప్స్ లో కనిపించాయి . ఎప్పుడు అటు నుండి వెళుతున్నా కొందామనుకోవటము , ఇప్పుడే కొంటే కార్ లో వాడి పోతాయేమో తిరిగి వచ్చేటపుడు కొందాములే అనుకోవటమూ , తిరిగి వచ్చేటప్పుడు వేరే రూట్లో రావటము తో కొనటము మూడునెలలనుండీ వాయిదా పడుతోంది . అందుకే నిన్న ఎలాగైనా కొనాలి అనుకున్నాను . స్చప్ . . . అదేమిటో ఒక్కొక్క షాపే చూసుకుంటూ వెళుతున్నాము , ఎవరిదగ్గరా లేవు . సీజన్ ఐపోయింది అనటమే ! నిరుత్షాహం వచ్చేసింది . మావారు పట్టువదలని విక్రమార్కునిలా చివరి షాప్ వరకూ వెళ్ళారు .( అవును మరి అడగక అడక అడిగాను కదా ! ఆమాత్రం వెతకకపోతే ఎలా :)) అదృష్టం :) అతని దగ్గర వున్నాయి ! ఎన్ని కావాలి అన్నాడు . నీ దగ్గర వున్నవన్నీ ఇచ్చేయన్నారు , మావారు ( మరే మళ్ళీ మళ్ళీ ఎవరెళ్ళి కొంటారు ). ఏదైతేనేం ఇంత పెద్ద గుత్తి నా చేతిలోకి వచ్చేసింది .

దానిని ఇంట్లో ఏ రూం లో పెట్టాలా అని , బెడ్ రూం లో , డ్రాయింగ్ రూంలో , బాల్కనీలో తిప్పీ తిప్పి , చూసుకొని చూసుకొని మురిసిపోతున్నాను . ఎంత ముద్దుగా వుందో ! ఏ గది లో వుంచినా ఇల్లంతా సువాసనలే సువాసనలు .

' రజనీగంధ ' సినిమా లోని ఈపాట కూడా నాకు చాలా ఇష్టం . విద్యాసిన్ హా చాలా చక్కగా వుంది ఈ పాటలో .చాలా బాగా తీసారు .

Sunday, December 5, 2010

' మగధీర ' కు ' చండేరీ ' నవల ఆధారమా ? నిజమేనా ?????
సినిమాలు గా వచ్చిన నవలలు , ఆ సినిమాలు కలిపి రాద్దాము అని ఆలోచన రాగానే దేర్ కిస్ బాత్ కీ అనుకుంటూ నవలలు , సినిమాల సి. డి లూ తెచ్చుకుందామని బడీచావిడీ కి వెళ్ళాను . బుక్ షాప్ లో ఏ నవలలు కావాలి మేడం అని అడిగాడు శోభన్ బాబు . అయ్యో సినిమా హీరో కాదండీ బాబు . ఆయనెక్కడి నుంచి వచ్చాడా అని ఆశ్చర్య పోకండి . ఆ బుక్ షాప్ ఓనర్ పేరు ' శోభన్ బాబు ' :) సినిమాలు గా వచ్చిన నవలలు ఏమైనా వుంటే ఇవ్వండి అని అడిగాను . ' చండేరీ ' నవల తీసి ఇచ్చాడు . ఇది సినిమాగా వచ్చిందా అని అడిగాను . అవును మేడం ' మగధీర ' ఈ నవలే అన్నాడు . అవునా అని బోలెడు హాశ్చర్య పోయి , నేను వినలేదే అన్నాను . పేపర్ లో కూడా వచ్చింది మేడం అన్నాడు . ఏ పేపర్ లో వచ్చిందో ? సరే కానీయ్ తీసుకొని చదువుతే నీ సొమ్మేం పోతుంది అనుకొని కొన్నాను . ఆ తరువాత ' మగధీర ' సి. డీ కూడా కొన్నాను .

రాజులూ , రాణులూ వారి పునర్జన్మ కథలూ చదవటము ఇష్టమేకనుక ఆ రాత్రే ఏకబిగిన నవల చదివేసాను . ఆ తరువాతే వచ్చింది ప్రాబ్లం ! పెళ్ళికి ముందు ఎండాకాలం సెలవల్లో ఏదో ' పాండవ వనవాసం ' , ' పల్నాటియుద్ధం ' లాంటి సినిమాలు చూసినా , పెళ్ళి తరువాత ఓ నాలుగు సంవత్సరాల క్రితం వరకూ బాగానే చూసాను . ఉదయ్ కిరణ్ నిలదొక్కు కోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు పాపం ఎంకరేజ్ చేద్దాం అనే సదుద్దేశం తో ఏదో ఉదయ్ కిరణ్ ది పిచ్చి సినిమా కూడా చూసాను ! ఎందుకో ఆ తరువాత సినిమాల మీద విరక్తి వచ్చి అడపా దడపా తప్ప ఈ నాటి హీరోల సినిమాలేవీ చూడలేదు . అనుకోకుండా పోయిన నెల జూనియర్ ఎన్ టి ఆర్ సినిమా ' బృందావనం ' చూసాను . దాని కథ మళ్ళీ చెపుతానులే . ఇక తప్పదు అనుకొని ' మగధీర ' బ్లాక్ అండ్ వైట్ సినిమా చూడటము మొదలు పెట్టాను . హబ్బా . . . . . మగధీర బ్లాక్ అండ్ వైట్ ఏమిటని హాశ్చర్యమా ? మా సి. డి ప్లేయర్ లో పంచవన్నెల సినిమా ఐనా బ్లాక్ అండ్ వైట్ లోనే వస్తుంది అంటే అర్ధం చేసుకోరూ . . . .

నవల చదివి , సినిమా చూసాక చాలా చాలా అనుమానాలూ క్వెశ్చన్ మార్కులూ నూ ! వాకే ముందుగా చండేరీ కథ ఆ తరువాత మగధీర కథ చెపుతాను . సావధానము గా విని నా అనుమానాలు తీర్చండి .
'చండేరీ ' నవలా రచయత శేషం పురుషోత్తమాచారి యస్సీచారిగా పాఠకులకు పరిచితులు. " గ్వాలియర్ లో కొంతకాలము ' ఏయిర్ ఫోర్స్ ' లో పని చేసినప్పుడు ఓసారి ' ఓర్చా ' వెళ్ళాను . ఆ ప్రాంతపు వివరాలు సేకరిస్తున్నప్పుడు , అక్కడి ప్రాచీన రాజవంశపు విశేషాలు కొన్ని నాకు తెలిసాయి . వాటిలో వదినగారి తో సంబంధము వుందని ఓ అన్నగారు తమ్ముడిని అనుమానించిన సంఘటన , అందుకా తమ్ముడు ఆత్మాహుతి చేసుకున్నాడని తెలియజేసే చారిత్రిక ఆధారాలు వున్నాయి . ఆ పాయింట్ ఆధారము గా ' చండేరీ ' నవలను విస్తరించి రాయటము జరిగింది " అని రచయిత నవల చివరలో గొల్లపూడి మారుతీరావు కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు .

చండేరి నవల కథ బుందేల్ బావి దగ్గర మొదలవుతుంది . అన్నపూర్ణ బైనాక్యులర్స్ ద్వారా "మాళవ కాజిల్ టవర్" పైనుండి బుందేల్ దిగుడుబావి దగ్గర జరిగిన పులి, దుప్పి మధ్య జరిగిన పోరాటంలో దుప్పి చేతిలో పులి పడిన మరణయాతనను గమనిస్తుంది.
. పులి మరణానంతరము ' వ్యాఘ్ర రుధిరం సమర్పయామి ! వ్యాఘ్ర రుధిరం సమర్పయామి ' అంటూ ఒక వింత అనుభవాని కి లోనై సృహ తప్పి పోతుంది . ఓ రకమైన సుషుప్తావస్తలోకి వెళ్ళిపోయిన అన్నపూర్ణ ముందు ఓ యోగి సాక్షాత్కరిస్తాడు . తెలివి వచ్చిన తరువాత ఆ దిగుడు బావి లోని కి వడి వడిగా వెళుతుంది . అక్కడ శివలింగము , దాని కింద ఒక రాగిరేకు కనిపిస్తుంది . ఆ శివలింగము నుండి ఓ కాంతి పుంజము అన్నపూర్ణను తాకుతుంది . ఆ తరువాత 20 సంవ్త్సరాలకు కథ మొదలవుతుంది . . . . .

400 ఏళ్ళ క్రితము చండేరీ యువరాణి ఇందుమతి , ఓర్చా మహరాజు ఐన జూజావర్ సింహుని తమ్ముడైన వువరాజు హరదౌల్ ప్రేమించుకుంటారు . వారి ప్రేమను ఇరువైపుల పెద్దలు ఆమోదిస్తారు .దాని తో ఇరువురి ఆనందానికి హద్దులేకపోతుంది . ఇంతలో రాజ నర్తకి కుతంత్రము వలన మహారాజు జుజావర్ సింహా తమ్ముని పెళ్ళి మాటలు మాట్లాడేందుకు వెళ్ళి , తనే ఇందుమతి ని వివాహమాడి తెచ్చుకుంటాడు . ఆ సంగతి తెలిసి హతాసుడైన హరదౌర్ ఇందుమతి ని ఆమె గది లో కలుసుకొని తమ వివాహానికై తాను స్వయముగా మణి మాణిక్యాలు పొదిగి రూపొందించిన చీరను చూపి , ఆమెను తీసుకొని వెళ్ళి,ఆ చీరను ఆ పడక గది లో , భూగర్భము లో దాస్తాడు . వారిరువురూ పొంది ,వారిద్దరూ కలుసుకున్నప్పుడు ఆ చీర ఎక్కడ వున్నదో గుర్తుకు వస్తుంది అని చెపుతాడు . వారు మాట్లాడుకుంటూ వుండగా వచ్చిన జుజావర్ , తమ్ముడు తన భార్యైన ఇందుమతి తో సంబంధము పెట్టుకున్నాడని భావించి , హరదౌల్ కు మరణ శిక్ష విధిస్తాడు . అప్పుడే వారి రాజ గురువు అదేశము ప్రకారము ఇందుమతి వోర్చా దిగుడు భావిలో ప్రాణ త్యాగము చేసుకుంటుంది . 400 ల సంవత్సరాల తరువాత హరదౌల్ ప్రవీణ శర్మ గా ఓ ప్రఖ్యాత కోటీశ్వరుడైన చీరల వ్యాపారి కి పుత్రుని గాను , ఇందుమతి ఐశ్వర్య గా నూ జన్మిస్తారు . చిన్న తనము నుండే ప్రవీణ శర్మకు గత జన్మ జ్ఞాపకాలు కొద్ది కొద్దిగా వసంటాయి . పెద్ద వాడై బిజినెస్ ను తన చేతిలోకి తీసుకున్నప్పుడు అందగత్తె ఐన ఇందుమతి ఎక్కడో జన్మించేవుంటుందని భావించి , ఆమెను తెలుసు కునేందుకు వూరూరా అందగత్తెల పోటీలు నిర్వహిస్తూవుంటాడు . ఆ క్రమము లోనే ఐశ్వర్య గా జన్మించిన ఇందుమతి ని ఆమె శరీర పరిమళము ద్వారా గుర్తిస్తాడు . చాలా ఫైటింగుల , కిడ్నాపుల తరువాత ఇద్దరూ ఒకటవుతారు . వారి చీరను వెలికి తీసి ఇప్పటి కాలము ప్రకారము 4 కోట్ల ( అమ్మో అమ్మో ) ధరపలికే ఆ చీరను వారి వివాహములో ఐశ్వర్య కట్టుకున్నాక ప్రభుత్వానికి అందజేస్తారు ! అదీ ' చండేరీ ' నవల కథ .ఇహ మగధీర కథ ;
ఇది 400 సంవత్సరాల క్రితము జరిగే యుద్దము తో మొదలవుతుంది . లోయలోకి జారి పోతున్న యువరాణి ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న ' కాల భైరవుని ' చేతికి చమక్ మటూ చేయి తగులుతూ చిక్కకుండా లోయలోకి జారిపోతుంది ఉదయగిరి , యువరాణి 'మిత్రవింద '. కాల భైరవ కూడా లోయలోకి జారి పోయి మరణిస్తాడు . మిత్రవింద తన అంగరక్షకుడైన కాల భైరవుని ప్రేమిస్తుంది . దాని కి మహారాజు అమోదిస్తాడు . కాని వారి సమీప బంధువు మిత్రాను వివాహము చేసుకోవాలని ఎత్తు వేసి , కాలభైరవ చేతి లో చిత్తై , ఉదయగిరిని ఆక్రమించుకునేందుకు వచ్చిన 'షేర్ఖాన్ ' దగ్గర ఆశ్రయము పొంది , కుతంత్రము తో ఉదయగిరి మహరాజును సంహరిస్తాడు . . మిత్రను సొంతము చేసుకోబోగా పొరపాటున కత్తి గాయమై లోయలో పడి మరణిస్తుంది . అతని తో యుద్దము లో అతనిని సంహరించి , కాలభైరవడు కూడా రాకుమారిని రక్షించబోయి తనూ లోయ పడి మరణిస్తాడు . వారిద్దరి ప్రేమకు , కాల భైరవుని శక్తికి ముగ్ధుడవుతాడు షేర్ ఖాన్ . 400 సంవత్సరాల తరువాత నలుగురూ పునర్జన్మిస్తారు ! . పునర్జన్మలో ఇందు గా జన్మించిన మిత్ర చేతి స్పర్స ద్వారా ఆమెను గుర్తించి దక్కించుకునేందుకు నానా పాట్లు పడతాడు హర్ష గా జన్మించిన కాలభైరవుడు . నానా తిప్పలు పడి ఆమెకు గతం గుర్తు తెప్పించి , విలన్ ను గత జన్మ లో సంహరించిన ప్రదేశము లోనే సంహరించి , ఇందును వివాహమాడుతాడు హర్ష . అనట్లు షేర్ ఖాన్ ఈ జన్మలో హర్షకు సాయ పడతాడు లెండి . ఇదీ స్తూలంగా మగధీర కథ . ఐనా నా పిచ్చి కాని మగధీర కథ తెలీని వాళ్ళు ఎవరు :)

ఇదంతా చదివితే మీకే మనిపిస్తోంది ? ' చండేరీ ' నవల ' మగధీర ' సినిమా కు ఆధారమని పిస్తోందా ? 400 సంవత్సరాల క్రితం కథ , నాయిక పేరు ఇందు , పునర్జన్మ . అంతవరకే రెంటిలోనూ వున్న కామన్ పాయింట్స్ అనిపించింది నాకైతే ! ఆ(( . . . సినిమాలో హీరో హీరోయిన్ చేతి స్పర్శ ద్వారా గుర్తుపడితే , నవలలో నాయిక శరీర పరిమళము తో గుర్తుపడతాడు నాయకుడు ! మరైతే శోభన్ బాబు అలా ఎందుకు చెప్పాడు చెప్మా ? చివరలో , గొల్లపూడి మారుతీరావు రచయతని , మీ నవలలో సినిమా కు కావలసిన మసాలా సరుకులూ , దినుసులు అన్ని చేరాయనిపిస్తోంది . అన్నప్పుడు రచయత నేను సినిమా కోసం అంటూ ఈ నవలను రాయలేదండీ ! అసలీ సబ్జెక్ట్ సినిమాకు పనికొస్తుందని కూడా అప్పట్లో నాకు తెలీదు . నేనెతో నిజాయితిగా నాదంటూ ఏర్పరుచుకోని అలవరుచుకున్న శైలి లో వ్రాశానీ నవలని . అన్నారు . మరదైతే ఈ నవల ఆధారముగా తీసిన సినిమా ఏమిటి ? ఏమిటో బాబు నాకైతే ఏమీ అర్ధం కాలేదు . శోభన్ బాబు పుణ్యమా అని ఓ మంచి నవల చదివి , రాం చరణ్ సినిమా చూసాను :) ఏమో అనుకున్నాను కాని రాం చరణ్ బాగానే వున్నాడు సుమీ ! మా చిన్నప్పుడు ముద్దుగా వున్న పాపలను ' జపాన్ బొమ్మ ' అనేవారు . కాజోల్ అలానే వుంది బొమ్మలా !