Wednesday, June 8, 2011

మా చిన్ని అదితి కి అభినందనలు"అచ్చట్లు ముచ్చట్లు అవ్వలకు ముద్దు ,
తప్పట్లు తట్టితే తాతలకు ముద్దు ,
జోలల్లు పాడితే పాపలకు ముద్దు ,
మాచిన్ని అదితి మాకు ముద్దు ."
అని పాడగానే కిలకిలా నవ్వేది మా చిన్ని అదితి . కళ్ళు విప్పార్చుకొని మరీ చూసేది . అబ్బో మా అదితి కళ్ళు ఎంత అందమైనవో ! పుట్టీ పుట్టగానే కళ్ళు తెరిచేసింది . అప్పుడే లోకాన్ని చూసేయాలని ఎంత ఆరాటమో ! కళ్ళు మిల మిలా మెరుస్తూ , చాలా బ్రైట్ గా వుండేవి . కార్ లో నా పక్కన , కార్ సీట్ లో కూర్చొని రెప్ప వేయకుండా , సీరియస్ గా చూసేది . అమ్మ ఇంట్లో వున్నంతసేపూ నాతో నే ఆటలూ పాటలూ . కాని అమ్మ బయటికి వెళ్ళిందో అంతే ఏడుపే ఏడుపు . అమ్మా కావాలి , అమ్మమ్మా కావాలి :) అంతే తప్ప పాపం ఎప్పుడూ గొడవ చేయలేదు . అసలు పుట్టిన రెండో రోజే ఇంట్లో స్నానం చేయించాలి అంటే ఎంత భయము వేసిందో ! మా అమ్మాయికి , అల్లుడి కి నా గొప్ప చూపించుకోవాలి కదా ! పైగా వాళ్ళిద్దరికీ బేబీ టబ్ లో కాకుండా చక్కగా నూనే రాసి , నలుగు బెట్టి స్నానం చేయించాలని కోరిక . పైగా మా అమ్మ తో సున్ని పిండి ప్రత్యేకముగా చేయించి తెచ్చుకుంది నా కూతురు :) నాకొచ్చు నాకొచ్చు అని బడాయికి పోయి , మా అత్తగారిని మనసులో తలుచుకొని , టబ్ లో కూర్చొని , కాళ్ళ మీద పసిపిల్లను వేసుకొని స్నానము చేయించేసాను . పాపము హాయిగానే వుండిందో , నొప్పే పుట్టిందో తెలీదు కాని , కుయ్ , కయ్ అనకుండా స్నానం చేయించేసుకుంది మా బంగారక్క . ఏడాదికే ముద్దు ముద్దు మాటల తో ,
" ఐ లవ్ యు ,
యు లవ్ మి ,
వుయ్ అర్ ఆర్ హాపీ ఫామిలీ ,
వితె గ్రేట్ కీస్ అండ్ హగ్ ,
ఐ లవ్ యూ అమ్మమ్మా ."
అనిపాడేది . ఎంత సంతోషమో కదా ! మరే మా బంగారుతల్లి అంతా నా పోలికే :)

ఇలా నా మనవరాలి గురించి చెప్పాలంటే బోలెడు కబుర్లు వున్నాయి . అన్నీ నిన్నా మొన్నా జరిగినట్లే వున్నాయి . నిన్న మొన్నటి పసికూన 10త్ మంచి పర్సెంటేజ్ తో పాస్ అయ్యింది . ఈ రోజు నుంచి కాలేజ్ గర్ల్ ! పిల్లలు పెరుగుతూ వుంటే వారి ఆటపాటలను చూస్తూ మురిసిపోవటము బాగానే వుంటుంది కాని అప్పుడే ఇంత పెద్దవాళ్ళు ఐపోయారా అని బెంగ కూడా వేస్తుంది ! కాని తప్పదు కదా !!!
భవిష్యత్తు లో కూడా మంచి మార్కులు తెచ్చుకొని ,
నీకు ఇష్టమైన , నచ్చిన ఫీల్డ్ లో రాణించాలని కోరుకుంటూ ,
ఆల్ ద బెస్ట్ అదితీ .

మా అదితి కి ఇష్టమైన చాక్లెట్ కేక్ తిని , ఈ రోజు నుంచి కాలేజీ కి వెళుతున్న మా అదితి ని మీరందరు కూడా విష్ చేసేయండి మరి.. పెద్దల ఆశీర్వాదమే పిల్లలకు రక్ష కదా !

Friday, June 3, 2011

నాకూ బ్లాగుకూ ఋణం తీరిపోయి _ _ _ _ _మన రోజువారీ కార్యక్రమం మొదలెడుదామని లాప్ టాప్ తీసాను . జిమేయిల్ తీసాను వాకే మేయిల్స్ చూసుకోవటం ఐపోయింది . లేఖిని తీసాను . ఆ తరువాత బ్లాగ్ డాష్ బోర్డ్ క్లిక్ చేసాను . ఇదేమిటి కొత్తగా పాస్ వర్డ్ అడుగుతోంది పేద్ద తెలీనట్లు ! మర్చిపోయిందేమోలే పాపం ఇచ్చేస్తే పోలే ! పాస్ వర్డ్ టైప్ చేసాను . రయ్ ((((( మని వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ పాస్ వర్డ్ అడిగింది . హుం . . . మళ్ళీ ఇచ్చాను . అయ్యారే . . . . . యిదియేమి చోద్యము * * * * * ఎన్నిసార్లు పాస్ వర్డ్ ఇచ్చినా ఇటుల మాయమైపోవుచున్నది !!!!! మళ్ళీ . . . . . మళ్ళీ . . . అడుగుతోంది . ఏమి చేతును ?????? కాళ్ళూ చేతులూ ఆడకున్నవి >>>>> ఇక నేను బ్లాగ్ వ్రాయలేనా ????? అసలు ఏమైంది దీనికి ??? కొంపదీసి నిన్నటి వెల్లుల్లి ఘాటు పడక ఢాం * * * * * అన్లేదుకదా . . . . . అనవసరం గా వెల్లుల్లి కష్టాలు రాసానే !!!!! అప్పటికీ కొన్ని కష్టాలే రాసాను . అన్నీ రాసి వుంటే లాప్ టాప్ నే ఢాం . . . ఢాం అనేదేమో ((((( అని పరి పరి విధములుగా చింతించాను . కాని ఏమీ లాభం కనిపించలేదు . . . . .

ఇంక నా వల్ల కాదు అనుకొని మా మనవడి ని తీసుకు రమ్మని కార్ పంపాను . హాయ్ అమ్మమ్మా అనుకుంటూ మనవడు , మనవరాలు ఇద్దరూ వచ్చేసారు . మా కొడుకు కోడలు యు. యస్ కు వెళ్ళిపోయినప్పటి నుంచీ నాకు విక్కీ నే చేదోడు వాదోడు . అందుకే వాడికే నా గోడు చెప్పుకున్నాను . ఓ గంట సేపు తిప్పలు పడ్డాడు . సారీ అమ్మమ్మా ఏమైందో రావటం లేదు నాకూ తెలీటం లేదు అని చేతులెత్తేశాడు ! వాడికే రాక పోతే ఇక నాకు దిక్కెవరు ? అయ్యో . . . నాకూ బ్లాగ్ కూ ఋణం తీరిపోయిందా ? 2 1/2 సంవత్సరాలుగా నా కష్ట సుఖాలను పంచుకున్న నా బ్లాగ్ మూగపోయిందా ????? ఏదీ దారి ? కళ్ళు చెమ్మగిలిపోగా రాని డాష్ బోర్డ్ వైపు అలాగే చూస్తూ కూర్చున్నాను . నా తోపాటు విక్కీ కూడా బిక్కమొహం వేసాడు . . . . .

సాయంకాలం మావారు రాగానే ఏడుపు గొంతుతో హేమండీ నా డాష్ బోర్డ్ కనిపించటం లేదు అని చెప్పాను . ఆయన గాభరా పడిపోతూ ఏమిటీ అన్నారు . ఓహో ఈయనకు డాష్ బోర్డ్ అంటే తెలీదు కదూ అనుకొని అదేమిటో , అదిలేక పోతే నాకెంత ఇబ్బందో పదినిమిషాలు వివరించి చెప్పాక అంతా విని ఓష్ అంతే కదా . . . నీ ఏడుపు మొహం చూసి ఇంకేమైందో అనుకున్నాను అని తీసిపారేసారు . ఇంకేమి కావాలి . ఇంతకంటే పెద్ద కష్టం ఏముంటుంది అని గొణుకున్నాను . ఏమనుకున్నారో , ఈ ఏడుపు పోతే తప్ప అన్నం పెట్టననుకున్నారేమో , లేదా జాలే వేసిందో పోనీ రవికి ఫోన్ చేసి కనుక్కో అని ఓ సలహా పడేశారు ! ఇంతరాత్రి ఏమి కాల్ చేస్తానులే అని వూరుకున్నాను .

ఒకటా ? రెండా ? మూడు బ్లాగులు నన్ను వదిలి వెళ్ళిపోయాక నాకు మనశ్శాంతి వుంటుందా ? రాత్రంతా నిద్రనే లేదు . నాకు ఎంత కంపెనీ ఇచ్చాయి ! ఎంతమంది స్నేహితులను సంపాదించిపెట్టాయి ! నాకు తోడూ నీడగా వున్నాయి ! ఇప్పుడు నన్ను దిక్కులేనిదానిగా వదిలేసి వెళ్ళిపోయాయి ! వాటికీ నాకూ ఋణం అంతేనేమో ! అయ్యో సాహితీ ఇక నేను నిన్ను చూడలేనా ! కమ్మటి కలలు కంటూ , చల్తే చల్తే అని హాపీగా బ్లాగ్ లోకాన్నీ చుట్టి రాలేనా ! అకటా ఎంత కష్టం వచ్చింది . పగవాళ్ళకు కూడా ఇలాంటి కష్టాలు ఇవ్వకు దేవుడా !!! హుం ఎంత దిగులు పడ్డా ఏమిలాభం !

మరునాడు పొద్దున గబ గబా పనులు కానిచ్చుకొని , మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దాం అనుకొని సిస్టం ఓపెన్ చేసాను . శ్రీమద్ రమా రమణ గోవిందో హరి !!!!! మొదటికే మోసం * * * నెట్ గయాబ్ * * * ఆ పోవటం పోవటం ఐదు రోజులు అత్తా పత్తా లేకుండా పోయి నిన్న నే వచ్చింది . . . చిన్నగా జిమేయిల్ ఓపెన్ చేసాను . వచ్చింది . వెల్లులి కామెంట్స్ పబ్లిష్ చేసాను . లేఖిని వచ్చింది . ఇక తీయనా వద్దా . . . టెన్షన్ * * * టెన్షన్ * * * డెస్క్ టాప్ మీద వున్న ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నాను . . .

రెడీ . . .
వన్ . . .
టు . . .
త్రీఈ . . . ఈ . . . ఈ . . .
ధైర్యం విలోలంబాయే ( కరెక్టేనా ? ఏమో ?)
దేవా * * * దేవా * * * దేవా * * * శ్రీ ఆంజనేయా , ప్రసన్నాంజనేయా * * *
క్లిక్ & & & & &
వావ్ ( ( ( ( ( * * * * * వచ్చేసిందీ . . . ఈ . . . ఈ. . .
హబ్బా ఎంత సంతోషం ! మాటల్లో రాతల్లో చెప్పలేనంత !!! తప్పిపోయిన బిడ్డ దొరికినంత :))