Thursday, August 15, 2019

జననీ జన్మభూమిశ్చ!


జననీ జన్మభూమిశ్చ!

మా మనవరాలు  కి వంట్లో బాగాలేదు అంటే చూద్దామని, రెండోసారి (మొదటి సారి మనవరాలు పుట్టినప్పుడు వెళ్ళాను), అట్లాంటా  కు వెళ్ళాను. నేను వెళ్ళిన మూడు నెలల తరువాత, మా ఏమండీగారు పిల్లల బలవంతము మీద ఒక నెలరోజులుందామని మొదటిసారి అమెరికాకు, వచ్చారు. ఆయన వస్తున్నరోజు, హంట్స్ విల్లే నుండి, మా అబ్బాయి, కోడలు అట్లాంటాకు వచ్చారు. మా అబ్బాయి ని రెండు సంవత్సరాల తరువాత, మావారు చూడటము అప్పుడే! ఏర్ పోర్ట్ నుండి ఇంటికి రాగానే, మా వారు సూట్ కేస్ లు విప్పుతుంటే అందరూ, చాలా క్యూరియస్ గా ఎవరికే బహుమతులు తెచ్చారా అని చూస్తున్నారు. ఒక సూట్కేస్ నిండా స్వీట్ బాక్స్ లు! ఇన్ని స్వీట్స్ తెచ్చారేమిటీ అంటే అవి మనవి కాదు, మా ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలకు ఇవ్వమన్నవి అని రెండో సూట్కేస్ లో నుండి కూడా కొన్ని స్వీట్ బాక్స్ లు తీసి అవి మనకు అని ఇచ్చారు. సరే పిల్లలందరికీ తలా ఒక కానుక ఇచ్చారు. సూట్కేస్ ఖాళీ! అసలు మీ బట్టలేవండీ????? అని నేనడుగుతే పాపం అప్పుడు చూసుకున్నారు తన వస్తువులేవీ తెచ్చుకోలేదని! మరునాడు ఉదయమే మా అబ్బాయి ఆయనను తీసుకెళ్ళి, కావలసినవి కొని ఇచ్చి, ఆయన తెచ్చిన స్వీట్స్ అన్నీ పాక్ చేసి, ఎవరివి వాళ్ళకు పంపి, నేను ఫ్రైడే వచ్చి మిమ్మలిని హంట్స్ విల్లే తీసుకెళుతాను అని, మినియాపొలీస్ కు టూర్ మీద వెళ్ళాడు.
ఫ్రై డే మద్యాహనం  అన్నీ సద్దేసుకొన్నాము. వచ్చి నాలుగు రోజులే కదా అయ్యింది, నెక్స్ట్ వీక్ వెళుదురుగాని అని మా అమ్మాయి కాస్త గునిసింది. ఇక్కడ స్నో చాలా పడుతోంది, ఫ్లైట్స్ అన్ని కాన్సిల్ అయ్యాయి రేపు పొద్దున్నే వస్తానని మా అబ్బాయి  కాల్ చేసి చెప్పాడు. సరే, సాయం కాలము కాసేపు తిరిగి వచ్చి పడుకున్నాము. మద్యరాత్రి మా మనవరాలు ఏడుస్తుంటే పాలు కలుపుదామని లేచాను. ఫోన్ లో ఆన్సరింగ్ మిషిన్ బీప్... బీప్ అంటోంది. చూస్తే, మా మరిదిగారి మెసేజ్, అన్నయ్యా నీతో మాట్లాడాలి అర్జెంట్ అని వినిపించింది. వెంటనే ఏమండీనీ లేపాను. ఆయన ఇండియాకు కాల్ చేసారు. మా ఆడపడుచు విజయ లిఫ్ట్ చేసింది. ఏటమ్మా విజయా, వెంకట్ ఫోన్ చేసాడు అంటే, నాన్న తో మాట్లాడు అన్నయ్యా అని, మా మామగారికి ఇచ్చింది. మాధవా అమ్మకు వంట్లో బాగాలేదురా, కోడలిని తీసుకొని వెంటనే బయిలుదేరి రా అన్నారు, మా మామగారు. మళ్ళీ ఇద్దరూ రండి, నువ్వొక్కడివే కాదు అన్నారు. ఏమైంది నాన్నా అంటే మీరు రండి, అమ్మకు చాలా సీరియస్ గా వుంది అన్నారు. అంతే, ఎవరికీ ఏమి మాట్లాడాలో తెలీలేదు. మా అమ్మాయి  వెంటనే, ఫ్లైట్ టికెట్స్ కోసం ప్రయత్నం మొదలు పెట్టింది. మేము వచ్చిన కోరియన్ ఏర్లైన్స్ ఆ రోజు లేదు. తను టికెట్స్ కోసం ప్రయత్నము లో వుంది. మావారేమో మాటా పలుకూ లేకుండా నిశబ్ధం గా వున్నారు. ఎట్టకేలకు డెల్టా ఏర్లైన్స్ లో 5000$ తో దొరికాయి!
అప్పటికి తెల్లవారుఝాము నాలుగైంది. టికెట్స్ దొరికాయి, బయిలుదేరుతున్నారు అని మామాగారికి చెప్పింది అమ్మాయి. అప్పుడు, ఏమండీ ఫోన్ తీసుకొని, నాన్నా అమ్మతో ఒక్కసారి మాట్లాడుతాను, అమ్మకివ్వు ఫోన్ అన్నారు. మా అత్తగారు ఫోన్లో చిన్నగా ' మాధవా ' ' మాధవా ' అని రెండుసార్లు పిలవటము స్పీకర్ల లో నుండి వినిపించింది అమ్మా నేను వస్తున్నాను ఎక్కడికీ వెళ్ళకమ్మా అని ఘట్టిగా ఏడ్చేశారు. మా అందరికీ కళ్ళళ్ళో నీళ్ళు తిరిగాయి. ఓ పదినిమిషాలకు మా అత్తగారు ఇకలేరు అన్న వార్త తెలిసింది. ఆవిడ గొంతు విన్నప్పుడు, పరవాలేదేమో అనుకున్నాము, కాని అదే ఆవిడ చివరి మాట అని తెలుసుకోలేక పోయాము.
సారీ డాడీ సారీ, నిన్ను రమ్మని బలవంతము చేయక పోతే బామ్మ దగ్గరే వుండే వాడివేమో అని సంజు వల వలా ఏడ్చేసింది. అవును... మావారు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ లో వుండగా, చైనా వార్ లో వెళ్ళేందుకు, చదువు వదిలేసి ఆర్మీ లో షార్ట్ సర్వీస్ కమీషండ్ ఆఫీసర్ గా చేరారట. అప్పుడు మా అత్తగారు ఎంతచెప్పినా, మన అవసరమున్నప్పుడే మాతృభూమికి సేవ చేయాలి అని యుద్ధానికి వెళ్ళారుట. ఇంజనీర్ అవుతాడనుకుంటే, మొండివాడు ఎంత బతిమిలాడినా వినకుండా వెళ్ళాడు అని మా అత్తగారు ఎప్పుడూ అనేవారు. మేము బరోడాలో వుండగా, మావారు, రాజస్తాన్ లో ఎక్సర్సైజ్ కు వెళ్ళినప్పుడు, మా అత్తగారు చాలా సీరియస్ అయ్యారు. ఆయన వెళ్ళింది బార్డర్ కు. అక్కడికి వార్త చేరటము కష్టం. ఆ రోజులలో, మొబైల్ ఫోన్ లు కాదు ఇళ్ళలోనే లాండ్ ఫోన్ లు కూడా వుండేవికావు. యూనిట్ నుండి వార్త వెళ్ళాలి. మేము చేద్దామన్నా వీలుకాని పరిస్తితి. అసలు నాకూ ఆ వార్త అందలేదు! మావారు పదిహేను రోజుల తరువాత తిరిగి వచ్చాక తెలిసింది. అంతే వెంటనే వెళ్ళారు. ఈయనను చూడగానే, అదృష్టవసాత్తు, అప్పటికే కోలుకొన్న మా అత్తగారు, ఇక నువ్వు హైదరాబాద్ వచ్చేయరా మాధవా అని భోరున ఏడ్చేసారుట. బరోడా రాగానే వాలంటరీకోసం అప్లై చేసారు. ఆయన సీ. ఓ ఇంటికి వచ్చి మరీ, నువ్వు లెఫ్ట్ నెంట్ కల్నల్ గా అప్ర్రూవ్ అయ్యావు, ప్రమోషన్ తీసుకొని ఆజ్ ఏ కల్నల్ గా రిటైర్ అవ్వచ్చుకదా అని నచ్చ చెప్పారు. కాని, ఇప్పుడు ప్రమోషన్ తీసుకుంటే ఇంకో రెండు సంవత్సరాలుండాలి, అప్పటి వరకు నేనుండలేను, అమ్మ కోసం వెళ్ళాల్సిందే అని ఆర్మీ వదిలి హైదరాబాద్ వచ్చేసారు. జన్మభూమికి అవసరమైనప్పుడు, చదువును మధ్యలోనే వదిలేసి 19 సంవత్సరాల వయసులోనే ఆర్మీలో చేరారు. జనని కి అవసరము అనుకున్నప్పుడు, వచ్చిన ప్రమోషన్ ను తృణప్రాయముగా వదులుకొన్నారు. ఇప్పటికీ ఆయన ఆర్మీ ఫ్రెండ్స్ అంటూ వుంటారు, నువ్వు వాలెంటరీ తీసుకోకపోతే బ్రిగేడియర్ వి అయ్యేవాడివి అని. ఆ రోజు నుండి నాలుగు రోజుల క్రితం అట్లాంటా వచ్చేవరకూ అమ్మను కనిపెట్టుకొనే వున్నారు. విధివిలాసం..... వెళ్ళి పిల్లల దగ్గర కొన్ని రోజులు గడిపిరమ్మని పంపిన అమ్మ అంత అకస్మాతుగా వెళ్ళి పోవటము ఆయనకు చాలా పెద్ద షాక్... 
 మేము చెక్ ఇన్ అవుతుండగా మా అబ్బాయి  వురుకులు పరుగులు మీద వచ్చాడు. చాలా భారమైన గుండెలతో బయిలు దేరాము. హైదరాబాద్ ఎలా చేరామో తెలీదు. ఇంటికి రాగానే వాకిట్లో బల్ల మీద, పచ్చని మోములో ఎర్రని కుంకుమతో, ఆకుపచ్చని గుంటూరు జరీ చీర తో మెరిసిపోతూ పడుకొని వున్నది మా అత్తగారి పార్ధివ శరీరము అంటే నమ్మకము కలగ లేదు. ' మాధవా, మాధవా ' (అసలు పేరు ప్రభాత్ ఐనా, ఇంట్లో మావారిని మాధవ అనే పిలుస్తారు) అని పిలిచి మాట్లాడి వెళ్ళిపోయారు.
మాతృభూమికి, మాతృమూర్తి కి, కుటుంబ సభ్యులకు అనే కాదు ఎవరికే అవసరమైనా నేనున్నాను అని సహాయానికి వెళుతారు మా ఏమండీగారు.అసలు ఎవరికైనా సహాయం అవసరం అని కూడా వాళ్ళు అడగనవసరం లేదు.అర్ధరాత్రి ,మిట్టమధ్యాహ్నం అని లేదు ఎప్పుడు ఎవరు వచ్చినా మా ఇంట్లో భోజనం పెట్టవలిసిందే. అంత దూరం నుంచి వచ్చారు ఈ సమయం లో హోటల్స్ ఉండవు అని అర్ధరాత్రి వచ్చిన లేబర్ కు అన్నం పెట్టించేవారు.ఆ రకం గా మా ఇంట్లో ఎప్పుడూ ఒక మనిషి భోజనం ఉంటుంది.ఇక చదువు కోసమని, వైద్యం కోసమని ఏ వసరానికైనా ఎవరు అడిగినా పర్స్ లో నుంచి ఎంత చేతికి వస్తే అంత  డబ్బు తీసి ఇచ్చేవారు.ఎంత మందినో ఎన్ని విధాలుగానో ఆదుకున్నా ఏ రోజూ నాకు కూడా చేప్పలేదు. తను పని చేసిన ఈ.యం.ఈ సూత్రం "కరం హీ ధరం" అని నమ్మారు.చివరి వరకూ అదే విధంగా ఉన్నారు.
ఆర్మీ నుంచి వచ్చేసాక ఏపీ.ట్రాన్స్ కో లో కాంట్రాక్ట్స్ చేసారు.నాలుగు సంవత్సరాల క్రితం బైపాస్ అయ్యేవరకూ చేసారు.ఆ తరువాత ఆ కంపెనీ అమ్మేసి,మా అబ్బాయి పెట్టిన సాఫ్ట్ వేర్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు.19 వ సంవత్సరం నుంచి చివరి వరకూ పనిచేస్తునే ఉన్నారు.
ఉదయం మాములుగా నేను ఆరున్నరకే యోగా కోసమని,నిద్ర లేపాను.లేచి ట్రాక్ సూట్ వేసుకున్నాక , కాఫీ ఇచ్చి నేను లోపలికి వెళ్ళాను.నేను మళ్ళీ బయటకు వచ్చేసరికి యోగా బెడ్ మీద పడుకొని ఉన్నారు.అలా సునాయసంగా యోగ నిద్రలోకి వెళ్ళిపోయారు."అనాయాసేన మరణం, వినా దైత్యేన జీవితం " గడిపిన కర్మయోగి.
"ఎవరెవరో వచ్చి అమ్మా మాకు సార్ ఈ సాయం చేసారు.మాకు అండగా ఉండేవారు.అండను కోల్పోయాము" అని నివాళులు అర్పిస్తుంటే ఆశ్చర్యపోయాను.నాకసలు తెలీనే తెలీదు ఇంతమంది కి ఇంత సహాయం చేసారని.మా కాలనీలో అందరూ అనటమే మేజర్ గారి కోసం ఎంత మంది వచ్చారు అని ఇల్లు , బయట సందు అంతా నిండిపోయారు , వంద మంది మహాప్రస్థానం దాకా వెంట వెళ్ళారు, మిలిటరీ హానర్ తో సాగనంపారు.అంతటి పుణ్యాత్ముడికి భార్యను కావటం నా అదృష్టం.
మా ఏమండీగారికి సెల్యూట్ చేయటం తప్ప ఏమీ చేయలేక వంటరిగా మిగిలిపోయాను.

Saturday, August 3, 2019

తిండి గోలతిండి గోల
ఏమండి మా పెళ్ళైన పదిరోజులకే లీవ్ ఐపోయిందని , నన్ను వాళ్ళ అమ్మ దగ్గర వంట నేర్చుకోమని వదిలేసి పటియాలా వెళ్ళారు.మూడు నెలల తరువాత లీవ్ లో వచ్చారు.అప్పటికి నేను మా అత్తగారి దగ్గర కొద్దోగొప్పో వంట నేర్చుకున్నాను.ఆ వంటలు చాలా ఉత్సాహంగా ఏమండీగారికి వండిపెడుతూ సంతోష పడిపోతున్న సమయంలో ఓ రోజు అకస్మాత్తుగా బ్రేక్ ఫాస్ట్ రోజూ ఉప్మాయేనా , మనకు అక్కడ రవ్వ దొరకదు  ఇంకోటి చూపిస్తాను రా అని వంట ఇంట్లోకి తీసుకెళ్ళారు.అప్పటికే మా అత్తగారికి ఏవో ఇన్ష్ట్రక్షన్స్ ఇచ్చినట్లున్నారు ఆవిడ చేసిన వంటంతా భోజనాల గదిలో పెట్టేసి బయటకు వెళ్ళిపోయారు.ఏమండీగారి సూచనల ప్రకారం, ఒక చిన్న గిన్నె, పెనం,అట్లకాడ,ఓ ఫోర్క్, నెయ్యి అన్నీ తీసాను. ఇంతలో మా పనబ్బాయి నారాయణ కొన్ని ఎగ్గ్స్ తెచ్చి ఇచ్చి వెళ్ళాడు.అవి చూపిస్తూ ఇవి ఇట్లా పట్టుకొని ఫోర్క్ తో చిన్నగా పగల గొట్టి ఈ గిన్నెలో వేయి అన్నారు."ఏమిటీ ఈ కోడి గుడూ పట్టుకొని ,పగలగొట్టాలా ?యాక్ థూ" అన్నాను.కాని ఆయనను చూస్తూ ఇంకేమీ మాట్లాడలేక దానిని మునివేళ్ళతో పట్టుకొని కొటాను.అంతే అది మహా ఫోర్స్ గా పగిలిపోయి ,నా చేతిలో నుంచి జారి కిందపడి నానాయాగి చేసేసింది.నేను బిత్తరపోయి నిలబడ్డాను.ఆయన ఇంకేమీ అనక ఇంకో ఎగ్ తీసి తనే పగలగొట్టి గిన్నెలో వేసి బీట్ చేసారు.ఆ తరువాత పెనం స్టవ్ మీద పెట్టి ఆంలెట్ చేయటం ( నాతో చేయించటం) చాలా పెద్ద ప్రహసనం ఐపోయింది.చివరకు ఎలాగో చేసి ప్లేట్ లో వేసి తిను అన్నారు.నేనా ? ఉమ్హూ తినను గాక తినను అని మొండికేసాను."మనం వెళ్ళాక కొన్ని రోజులు మెస్ లో ఉండాల్సి వస్తుంది.అక్కడ మనలను వండుకోనీయరు.బ్రేక్ ఫాస్ట్ ఎగ్ నే ఉంటుంది.నువ్వు ఎంత తినగలుగుతే అంతే తిను, మిగిలింది నేను తింటాను."అని నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేసారు.నేను ముక్కు మూసుకొని అటు పరిగెట్టి, ఇటుతిరిగి చాలా విన్యాసాలు చేసాను.ఇక ఆయన ఓర్పు నశించి, నీ ఖర్మ నువ్వు ఎగ్ తినేదాక నిన్ను తీసుకెళ్ళను ఇక్కడే ఉండు అని ఆ ఆంలెట్ ప్లేట్ సింక్ లోకి విసిరి కొట్టి కోపంగా వెళ్ళిపోయారు.
ఏను ఏమి చేయాలో తోచక ఆట్లా నిలబడిపోయాను."ఏం జరిగిందే వాడట్లా కోపం గా వెళ్ళిపోయాడు"అంటూ లోపలికి వచ్చిన అత్తయ్యగారు,వంటింటి నిడా, గట్టుమీద,స్టవ్ మీద పడిపోయి ఉన్న ఎగ్ సొన, ఆంలెట్ , ప్లేట్ ముక్కలు అన్నీ చూసి వెనక్కి వెళ్ళి ముందు అదంతా బాగుచేయి అని చెప్పి బయటకెళ్ళిపోయారు.నేను ఏడ్చుకుంటూ అంతా శుభ్రం చేసి వాసన రాకుండా ఫినాయిల్ వేసి కడిగి, స్నానం చేసి వచ్చేసరికి అత్తయ్యగారు వరండాలో కూర్చొని ఉన్నారు.ఏమండీగారు కనిపించలేదు.అప్పుడు అసలేమైంది వాడెక్కడికెళ్ళాడు అని అడిగారు.ఇక అంతే ఆవిడను గట్టిగా పట్టేసుకొని భోర్మని ఏడ్చుకుంటూ ఆయన నన్ను వదిలేసి పటియాలా వెళ్ళిపోయారు ఇంక రారు అని ఏడ్చేసాను.ఆవిడ ముందు గాభరా పడ్డా వాడెక్కడికెళుతాడు ఏడవకు అని సముదాయించారు కాని నా ఏడుపు ఆగలేదు.సాయంకాలం ఎప్పుడో ఇంటికి వచ్చారు.మా మామగారు ఆయనని చూడగానే "చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళావురా?అది పొద్దటి నుంచి అన్నం కూడా తినలేదు.ఒకటే ఏడుస్తోంది."అన్నారు.ఆయన మాట్లాకుండా బాత్ రూం లోకి వెళ్ళిపోయారు.నా వైపు కూడా చూడలేదు.నాకు ఇంకా దుఃఖం పొరలుకొచ్చేసింది.వెంటనే మా ఆడపడుచు దగ్గర పెన్ , పేపర్ అడిగి తీసుకొని దొడ్లోకి వెళ్ళి, "మహారాజశ్రీ ప్రియమైన శ్రీవారి పాదపద్మములకు నమస్కరించి వ్రాయునది" అని మొదలు పెట్టి ఓ నాలుగు పేజీలు ఉత్తరం నేను ఇక ముందు ఆయన చెప్పినట్లే వింటానని,నన్ను వదిలి వెళ్ళ వద్దని ఏడ్చుకుంటూ రసి ఆయన బట్టల దగ్గర పెట్టాను. మనలో మన మాట ఆంలెట్ తింటానని పొరపాటున కూడా రాయలేదు.ఇంకోటి కూడా నాకు అర్ధం కాలేదు సినిమాల్లో హీరోయిన్ ఏడుస్తూ ఉత్తరం రాస్తే ఆమె కన్నీళ్ళు అక్కడక్కడా ఉత్తరం మీద పడుతాయి కదా, అదేమిటో నేనెంత ఏడ్చినా ఒక్క బొట్టు కూడా రాలేదు.నాకు కాస్త జెనరల్ నాలెడ్జ్ రావాలని మా మామగారు నన్ను కొన్ని సినిమాలకు తీసుకెళ్ళారులెండి.ఆయన జీవితం లో సినిమా చూడటము అదే ఫస్ట్ లాస్ట్ అట.అందరూ తెగ ఆశ్చర్యపోయారు ఆయనేమిటి కోడలిని సినిమా కు తీసుకుపోవటం ఏమిటి అని.మరేం చేస్తారు పాపం నేను మా అత్తగారికి మామగారికి బాగా నచ్చానుట.మా ఏమండీ గారు చిన్నపిల్లలా ఉంది పెళ్ళిచూపుల్లోనే వంటరాదని చెప్పేసింది అని గునుస్తుంటే చిన్నపిల్లైతే చెప్పినమాట వింటుంది నీకెందుకు మేము అన్ని నేర్పించి పంపుతాము అని ఆయనకు ప్రామిస్ చేసి ,ఆయనకూ నా పెద్దజడ నచ్చి చేసుకున్నారుట.సో ఇప్పుడు తెలిసిందిగా ఆ ఉత్తరం సినిమా పైత్యమని.మామాగారి పుణ్యమా అని అంత జెనెరల్ నాలెడ్జ్ వచ్చేసింది మరి.సరే ఇక ఉత్తరం సంగతికొస్తే నేను బెడ్ రూం లో చాలా టెన్షన్ గా కూర్చొని ఉన్నాను.ఆయన ఆ ఉత్తరం చదివారో లేదో తెలీదు.నేను చూస్తే అక్కడైతే లేదు మరి.మరునాడు ఆయన బట్టలు ఉతకటానికి వేస్తుంటే పైజామా జేబ్ లో కనిపించింది.కాని దాని గురించి ఎప్పుడూ ఏమీ అనలేదు కాకపోతే పిచ్చిపోరి అని నవ్వుకొని ఉంటారని ఇప్పుడనిపిస్తోంది.
ఆ తరువాత ఎప్పుడూ ఆంలెట్ తినమని అనలేదు నేనూ తినేందుకు ప్రయత్నం చేయలేదు కాని తినకపోవటం వలన కొన్ని సార్లు ఇబ్బందైతే పడ్డాను. నేను తినకపోయినా ఏమండీ కోసం ఆంలెట్, ఎగ్ కర్రీ,బుజియా వగైరా,పిల్లల కోసం కేక్ చేయటం నేర్చుకున్నాను.ఎగ్ భుజియా, రెండూ ఏడి వేడి ఫుల్కాలు ఏమండీగారి ఫేవరేట్ డిన్నర్..చాలా ఏళ్ళ తరువాత మేము బరోడా పొస్టింగ్ మీద వెళ్ళినప్పుడు,వెళ్ళిన రోజు ఉదయమే అక్కడ ఆయన ఫ్రెండ్ రమేష్ పార్లీకర్ వాళ్ళ ఇంటికి బ్రేక్ ఫాస్ట్ కు పిలిచారు.నేను ఫ్రెష్ ఐ వచ్చేసరికి అందరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని ఉన్నారు.అందరి ప్లేట్ లల్లో ఆంలెట్, కార్న్ ఫ్లాక్స్ , బ్రెడ్ టోస్ట్ పెట్టి ఉన్నాయి. నాకు ఒక్క నిమిషం ఏమి చేయాలో తోచలేదు.పెళ్ళైన కొత్తల్లోని ప్రహసనం గుర్తొచ్చింది.మాట్లాడకుండా తల వంచుకొని మధ్య మధ్య నీళ్ళు తాగుతూ ఎట్లా గో తింటున్నాను.ఇంతలో కల్పనా పార్లీకర్ వంట ఇంట్లో నుంచి వస్తూ నన్ను చూసి "ప్రభాత్ మాల ఆంలెట్ తినదన్నావు.ఇప్పుడే బాయీ కి చెప్పి వస్తున్నాను చపాతి చేయమని , తింటోంది గా " అంది.ఏమండీ "అవును నేనూ అదే చూస్తున్నాను."అన్నారు ఆశ్చర్యంగా.
యాభై సంవత్సరాల క్రితమే నేను ఏమండీకి మాట ఇచ్చాను ఆయన చెప్పినట్లే వింటానని.ఆయనా నాకు మాట ఇచ్చారు నన్ను వదిలి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళనని ఎక్కడికెళ్ళినా వెంట తీసుకెళుతాని. మరి ఇప్పుడు ఎందుకు నాకు మాటమాత్రమైనా చెప్పకుండా , నన్ను తీసుకెళ్ళ కుండా,నేనిచ్చిన కాఫీ తాగి, పేపర్ చదువుకొని మరీ నన్ను మాయపుచ్చి ఎక్కడికో ఎందుకు మాయమైపోయారు.యోగా చేస్తున్నారనుకున్నాను కాని యోగ నిద్రలోకే వెళ్ళిపోయారని తెలుసుకోలేకపోయాను.ఎప్పుడూ వెంట తీసుకెళ్ళేవారు ఇప్పుడు మాత్రం నన్ను రమ్మంటే నేను రానన్నా అని కలలో నైనా అడుగుదామంటే కలలో కూడా కనిపించరెందుకు ?