Wednesday, June 24, 2009

మా పెరటి బాదం చెట్టు


 
అదృష్టవశాత్తూ,మేమే ఇంటికి వెళ్ళినా కొద్దిగా పెరడు అందులో చెట్లు వుంటున్నాయి.సో, అనందమే ఆనందం. ఈ ఇల్లు చూడటానికి వచ్చినప్పుడు మెట్ట్ల పక్కన పారిజాతం చెట్టు చూడగానే వావ్ అనుకున్నాను.అందరూ ఇల్లు చూస్తుంటే నేను ఇంకా ఏమేమి చెట్లున్నాయా అని చూసుకున్నాను. ఈ ఇల్లు కొందామా అని మా అబ్బాయి అడగగానే కొనేద్దాం అన్న! నువ్వు ఇల్లు చూడలేదుగా అన్నాడు. ఎందుకురా పారిజాతాన్ని చూసాగా అనేసా.అలా చూడగానే నా మదిని దోచిన పారిజాతం పాపం నన్నెప్పుడూ నిరుత్సాహ పరచలేదు .సాయంకాలం కాగానే ,పిట్ట కొంచం ,కూత ఘనం అన్నట్లు చిన్న చెట్టైనా బోలెడు పూలు పూస్తుంది. కొద్ది కొద్దిగా చీకటి పడుతుండగా కొద్ది కొద్దిగా ,ముందు బాల్కనీ లోకి తరువాత డైనింగ్ రూం లోకి,ఆపై బెడ్రూం లో దాకా పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది.రాత్రి పడుకోబోయే ముందు దాని కింద ప్లాస్టిక్ షీట్ ని పరుస్తాను.పొద్దునకల్లా ఆ షీట్ నిండా ఆరెంజ్ రంగు కాడతో తెల్లని సుకుమారమైన రేకుల తో బుజ్జి బుజ్జి పూలు ముద్దుగా సొగసు చూడ తరమా అంటూవుంటాయి.. వాటి తో మా దేవుళ్ళు పరిమళించి పోతుంటారు.


ఇంటి ముందు అయ్యిందా .వెనకకి వెళదాము.అక్కడ వున్నారండీ మా రాజాధి రాజు మహరాజు,మా పెరటి హీరోగారు.యద్దనపూడి హీరో లా నిలువెత్తు అందగాడు.అదేనండీ బాదం చెట్టు.ఇంటి గృహ ప్రవేశం అప్పుడే పిల్ల లందరికి మా ఆడపడుచు ఉష బాదం చెట్టును పరిచయం చేసింది.ఇంటికి వచ్చినవారంతా మీ ఇంట్లో బాదం చెట్టువుందా అని తెగ చూసి, వాళ్ళ వాళ్ళ చిన్నపుడు వాళ్ళ ఇళ్ళ లో వున్న బాదం చెట్టును గుర్తు తెచ్చుకొని దిష్ఠి పెట్టేసారు. అందరూ వెళ్ళాక దానికి దిష్టి తీసి మా కోడలి తో అన్నాను..అన్నం అరిటాకులో,తాటిముంజలు మోదుగాకులో , ఉప్మా తామరాకులో, బాదం ఆకులో తింటే మహారుచిగా వుంటాయి.బాదం ఆకులో గారెలు చేస్తె బాగుంటాయి.ఇన్ని రోజులూ వెధవ ప్లాస్టిక్ పేపర్ మీద చేసాము. ఇకపై బాదం ఆకు మీద చేసుకోవచ్చు ఇంచక్కా (అత్తలకి చిన్న సలహా ఇలాంటివి కొడళ్ళకే చెప్పాలి.వాళ్ళైతేనే మనం చెప్పేవి మొహమాటానికైనా వింటారు అని.. :).ఇక మరునాటినుంచి బ్రేక్ ఫాస్ట్ ఉప్మా బాదం ఆకులో , సాయంకాలం బాదం ఆకుమీద చక్కగా పరచి చేసిన గారెల టిఫిను,అల్లం పచ్చడీ .ఎంచక్కా తినొచ్చుగా ! కొన్ని రోజులు కాగానే జనతాపార్టీ గోలెట్టేసారు.సో. అప్పడప్పుడుకే పరిమితమైపోయాను.


మా బాదం చెట్టు గారికి మహా దర్జా .బోలెడు పొగరు. పక్కన గన్నేరు ,సువర్ణ గన్నేరు ,నందివర్ధనం వున్నాయి కొంచం వాటినీ రానీ అంటే వినదు.ఆ పూలు వస్తె దేవుడిని ఇంకా అలంకరించవచ్చుగా అని నాకోరిక.అయినా ససేమిరా అంటూ పెరడంతా పరుచుకుంది.మేఘా ,విక్కీ ,గౌరూ వంటింటి గట్టు మీద కుర్చొని బయటకి చూస్తూ కిస్కీ కిస్కీ నవ్వుతున్నారు.ఏమిటర్రా అని చూద్దునుగా పక్కింటి బాల్కనీ రెయిల్ మీద చేతులు పెట్టుకొని వాటిమీద గడ్డం పెట్టుకొని వీళ్ళంత అబ్బాయే వీళ్ళవైపు గుర్రున చూస్తున్నాడు.ఏమైంది అంటే మా చిన్నోడికి అనుమానం బామ్మా మన బాదం కొమ్మ చూడు వాళ్ళింట్ళోకి ఎలా వెళుతోందో. అది అలాగే వాళ్ళ బాత్ రూం దాకా వెళితే వాడు (ఆ ఎదురింటి అబ్బాయి) లోపలి కి వెళ్ళిన్నప్పుడు తలుపెలా వేసుకుంటాడు?పెద్ద సందేహమే!నిజమే మా కొమ్మ గారు వాళ్ళ గుమ్మం లోంచి లోపలికి తొంగిచూస్తున్నారు. వాళ్ళని మందలించి ,జాజి విరజాజీ ఎలా వున్నారో చూద్దామని కింది కి వెళ్ళాను.పక్కింటావిడ మాలా గారూ అని పిలిచి కాసేపు ఆ కబురు ,ఈ కబురు చెప్పి ఏమండీ మీ బాదం చెట్టు మా ఇంట్లోకి వచ్చేస్తోంది.కొంచం కొట్టేయించండి అని సలహా ఇచ్చింది.కాని మా అబ్బాయి వింటేనా !ఎలాగో వాడిని ఒప్పించి వాళ్ళ వైపు కొమ్మలు కొట్టించాను.కాని ఏం లాభం చూసారుగా ! పక్కింట్లో కి వెనకింట్లో కి అలా తొంగి చూడద్దు అంటే వినదు.మరీ ఇంత మొండిఘటం అయితే ఎలా చావను.దీని మూలంగా పక్కింటోళ్ళ తో తగవు తప్పదా ?

Saturday, June 20, 2009

పుట్టినరోజు జేజేలుఈరోజు మా మనవడి పుట్టినరోజు . వాడికి ఈ రోజు
10 సంవత్సరాలు నిండుతాయి. కొన్ని మరపురాని ముచ్చట్లు..
వాడి మూడో ఏట వాడి బిపు మామ వాడిని ఘట్టిగా పట్టుకొని ,చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి లో వాడిని గుండప్ప చేసాడు. అదో అప్పటి నుండి వాడి కష్టాలు మొదలయ్యాయి. ప్రతినెల వాడి డాడీ నో మమ్మీ నో వాడిని తీసుకొచ్చి,మావారి కి వాడి హేర్ కట్ చేయించమని అప్పగిస్తారు.ఎందుకంటే మా వారి బార్బర్ బాగా కట్ చేస్తాడట. చిన్నప్పుడు పెద్దగా పేచీ పెట్టలేదు కాని పెద్దవాడవుతున్నా కొద్దీ, గుండుకు ఎక్కువ, క్రాఫ్ కు తక్కువ అయిన ఆ డిప్ప మిలటరీ కట్ వాడికి ఏమాత్రము నచ్చటము లేదు. వాడికి రకరకాల లంచాలు లాలిపాప్ దగ్గర మొదలై ఐ మాక్ సినిమా దాకా వచ్చాయి. అపై పెద్ద రాహుల్ , చిన్న రాహుల్, రాజేష్ (వాడి ఫ్రెండ్స్) వాళ్ళ డాడీలు ఫొన్ చేసి అడిగారు, మీ విక్కి హేర్ కట్ బాగుంది ఏక్కడ చేయించారు అని తాత చెప్పిన కథలు పాపం పిచ్చి సన్నాసి నమ్మి తాత తో వెళ్ళేవాడు.
అలా అలా కొన్ని సంవత్సరాలు వాడిని మబ్యపెట్టగలిగారు. కాలం ఎప్పుడూ ఒకే రకముగా వుండదుగా! తాత కథలు నమ్మటము మానేసి ,మా ఇంటికి రావటానికి కూడా సందేహించే పరిస్తితి ఏర్పడింది. కట్ కాదు మేఘ గౌరవ్ తో ఆడుకుందువుగాని అని ఏలానో తీసుకొచ్చి, కొంచంసేపు ఆడుకున్నాక మరిపించి తీసుకెళ్ళి , డిప్ప కట్ చేయించేవారు. వాడి తీసుకెలుతుంటే మా అబ్బాయి డాడీ విక్కీ ని హేర్ కట్ కు తీసుకెలుతుంటే గౌరూను తీసుకుపో అని అప్పగించేసాడు. అంతే. వాడూ డిప్పకట్ తో తయారు.
ఇక లేటెస్ట్ గా ,వాడిని వాడి తోపాటు గౌరవ్ ని షరా మాములుగా తీసుకెల్లటము వాళ్ళతో పాటు తాతా ముగ్గురు ముచ్చటగా ....... కట్తో వచ్చారు కాని ఈసారి విక్కీ ఏంత గోల చేసాడంటే ,మరి మరునాడే వాడి క్లాస్ అమ్మాయి బర్త్ డే ఇలా ఎలా వెళ్ళుతాడు?దానికి తగ్గట్టు గౌరు కూడా నేను ఇంక జెల్ రాసి స్టైల్ చేసుకోలేనుగా అని వాడూ గోల. మనవళ్ళ బాధ చూడ లేక జీవితం లో మొదటి సారి మావారి మీద, వాళ్ళనేమైనా మిలిటరీలో చేర్పిస్తున్నారా, లేకపొతే కనీసం పేరేడ్ కి వెళ్ళాలా అని ఘాట్టిగా అరిచాను (అనుకున్నాను). విక్కీ భీకరం గా ప్రతిజ్ఞ చేసాడు, ఇకపై హేర్ కట్ చేసుకోనని బర్త్ డే కల్లా, పోనీటైల్ వేసుకుంటానని. అంతే మా మనవరాళ్ళిద్దరూ వాళ్ళ రబ్బర్ బాండ్స్ అర్జెంట్ గా దాచేసు కున్నారు .
ఈ రోజు వాడి బర్త్ డే పార్టీకి వెళ్ళినప్పుడు చూడాలి పోనీ టేల్ వేసుకున్నాడా లేదా అని. ఏందుకంటే ఆ తరువాత
మాకు వాడు కనపడలేదుగా! ఈ మధ్యే తెలిసింది. మా మనవరాలు చెప్పింది. విక్కి తలకు వాటర్ రాసి సెట్ చేసుకుని స్కూలుకు వస్తే ప్రిన్సిపల్ తిట్టిందంట...పాపం .. ఎన్ని తిప్పలో వాడికి..

ఇంతకీ వాడి పూర్తి పేరు చెప్పలేదు కదూ!
విక్రం మాగల్
5
వ తరగతి, చైతన్యా విద్యాలయ

Wednesday, June 3, 2009

వారే వీరు

అక్కడ బుడుగున్నర బుడుగు చదివారుకదా !
ఆ బుడుగులు వీరే .నా మనవలు.నా పొస్ట్ లలో వీరి గురించి ఎక్కువగానే రాసాను. మనవల గురించి మాట్లాడుతుంటే నీకు వళ్ళు తెలిదు అంటారు మా వారు. ఏం చేయను చెప్పండి, వాళ్ళ తో నాకు అంత అనుబంధం ఏర్పడింది.

నా చిన్నప్పుడు ఎప్పుడు చదివానో గుర్తులేదు కాని బుడుగు నా అభిమాన హీరో అయిపోయాడు.నాకంటే రెట్టింపు అభిమానము మా పిల్లలకి. రోజూ ముందుగా బుడుగు కథ చెప్పుకున్నాకే వేరే కథలు చెప్పుకుంటాము.
చైతన్య కళ్యాణి ఏ దైనా పుస్తకము గురించి రాయండి అని అడగగానే నాకు బుడుగు గుర్తుకువచ్చాడు.
అక్కడ రాసాక మా బుడుగులను మీకు చూపించాలని పించింది.
ఇది వారి కుఠో నే.

వీరే మా బుడుగులు . పెద్దొడు విక్రం,చిన్నోడు గౌరవ్.వారే వీరు.
అదీ సంగతి