Monday, September 3, 2012

లక్ష్మీనారాయణ యజ్ఞంమావారు , ఆయన ఫ్రెండ్ అనుకోకుండా , జూబిలీహిల్స్ లోని పూరీజగనాథ ఆలయాని కి వళ్ళారుట . అక్కడ లక్ష్మీనారాయణ యజ్ఞం జరుగుతొందిట . మావారి కి ఆ యజ్ఞం చూడగానే , ఆయజ్ఞం లో కూర్చోవాలి అనిపించి , కార్యకర్త లను , మాకూ కూర్చునే అవకాశం ఇవ్వగలరా అని అడిగారట . ఆయనేమో , లేదండి అన్ని బుక్కైపోయాయి అన్నారట . ఐనా సరే నా నంబర్ తీసుకోండి , ఒకవేళ ఏకారణం చేతైనా , ఎవరైనా డ్రాప్ అవుతే మాకు అవకాశం ఇవ్వండి అని ఆయన ఫోన్ నంబర్ ఇచ్చి వచ్చారట .ఆ మరునాడే కార్యకర్త శంకర్ నారాయణజీ కాల్ చేసి మీ సంకల్పం చాలా బలంగా వుంది , 31 న ఒకరు డ్రాపైపోయారు , మీకు వీలైతే మీరు రావచ్చు అన్నారు . అంతే మావారు చాలా సంతోషపడిపోయి ఓ తప్పకుండా వస్తాము అన్నారు . అలా లక్ష్మీనారాయణ యజ్ఞం లో పాలుపంచుకునే అవకాశం మాకు వచ్చింది .
శుక్రవారం 31 వుదయం 8 గంటలకే యజ్ఞవాటిక కు వెళ్ళాము .మావారి కి దీక్షా వస్త్రాలు ఇచ్చారు . అవి వేసుకొని , గుడిలోకి వెళ్ళి స్వామివారి ధర్షనం చేసుకొని వచ్చాము . 8.30 కు యజ్ఞం మొదలైంది . మొత్తం ఐదు యజ్ఞ కుండాలు వున్నాయి . వాటి దగ్గర ఐదుగురు బ్రాహ్మలు , ఇద్దరు దంపతులు కూర్చున్నారు . యజ్ఞ ప్రధాన ఆచార్యులవారు లక్ష్మీకాంత్ జీ ధీక్షిత్ వారణాశి నుంచి వచ్చారు . ఇంకా పదహారుగురు ఆచార్యులు కూడా వారణాశి నుంచి , మిగిలిన ఆచార్యులు ఇక్కడివారు వున్నారు . మేము వెళ్ళిన ది యజ్ఞం మొదలైన ఆరోరోజు న . ఇలా యజ్ఞం లో కూర్చొవటం మాకు ఇదే మొదటిసారి . శుక్రవారం , పౌర్ణమి , శతబిషం నక్షత్రం వున్న రోజున మేము యజ్ఞం లో కూర్చోవటం చాలా మంచిదైంది అన్నారు ఆచార్యులవారు . అక్కడివారి పద్దతి ప్రకారము దంపతులలో మొగవారి కండువాకు , ఆడవారి వోణీ కొసకు , తొమ్మిది ముడులు వేసారు . అందులో రూపాయి కాసును , బియ్యం , ఇంకా ఏవో పెట్టారు . పూజలో వున్నంతసేపూ ఇద్దరి ముడులనూ అలాగే వుంచారు .

ముందుగా గణపతి పూజను ఆ తరువాత వాస్తుదేవుని పూజను చేయించారు . ఆ తరువాత యాగ కుండాల దగ్గర కూర్చోబెట్టి , అగ్ని లో నెయ్యి ని , నవధాన్యాలు వేయిస్తూ , ఉదయము , స్త్రీ సూక్తం తోనూ , మధ్యాహ్నము పురుష సూక్తం తోనూ యాగం చేయించారు . 12 .30 విరామం ఇచ్చి ప్రసాదం ఇచ్చారు . మళ్ళీ మధ్యాహ్నం 3.30 మళ్ళీ మొదలు పెట్టారు . మధ్య విరామ సమయంలో లలితాసహస్రనామం చేసారు . అప్పుడు తామరపూవులతో అమ్మవారిని పూజించారు . 6.30 యజ్ఞం ముగిసిన తరువాత లక్ష్మీనారాయణులకు హారతి , నివేదన చేసారు .
మరునాడు శనివారం సాయంకాలం 4.30 కు పూర్ణాహుతి కోసం వెళ్ళాము . ముందుగా ఈ ఏడురోజులూ యజ్ఞం చేసిన వారినందరినీ యాగస్తలం ఉత్తర్దిశగా తీసుకెళ్ళారు . అక్కడ అందరి మధ్యలో ఒక బుట్టలో శనిదేవుని విగ్రహం పెట్టి అందరూ దక్షణలను సమర్పించారు . ఆ తరువాత పూజ చేసారు . ఆపైన ఆ బుట్టను ఒకతను ( అతని ని ఏదో అన్నారు , మర్చిపోయాను ) నెత్తిన పెట్టుకొని అందరి చుట్టూ తిరిగాడు . అప్పుడు అందరిని తలలు వంచుకొని కళ్ళు మూసుకోమన్నారు . ఆ కార్యక్రమము చూడకూడదుట . అలాగే యజ్ఞవాటిక చుట్టూ కూడా తిప్పించారు . అప్పుడు మా అందరినీ దూరం గా వుండమన్నారు . ఆ తరువాత కాళ్ళూ చేతులు కడుక్కొని మళ్ళీ యజ్ఞవాటికలోకి వళ్ళాము . అందరినీ అన్ని కుండాలచూట్టూ నిలబెట్టి , కుండాలలో నెయ్యిని పోయించారు . దానికి అరటిబోదలతో పైపులా చేసి . కుండం ముందు వెదురుకర్రల సపోర్టుతో నిలబెట్టారు . దాని ద్వారా నెయ్యిని పోయించారు .( అగ్ని కి కి ఆజ్యం తోడవటం ఏమిటో అప్పుడు నాకు తెలిసింది ) ఆ తరువాత ప్రధాన ఆచార్యులవారు అందరి నీ ఆశీర్వదించి లక్ష్మీరూపును , ప్రసాదాన్ని ఇచ్చారు . కొంగుకు వేసిన ముడులను విప్పదీసి , అందులోని అక్షితలను మా శిరస్సున వేసారు . దాని తో యజ్ఞం ముగిసింది .

అలా మా రిటైర్మెంట్ రోజులు మొదలయ్యాయి :)