Saturday, February 25, 2017

బ్లాగ్ పుస్తకం

ఓసారి సి.ఉమాదేవిగారు బ్లాగ్ పుస్తకం అవిష్కరిస్తున్నారట, వెళుదాం వస్తారా అని ఫోన్ చేసి అడిగారు.సరే నన్నాను.ఉమాదేవిగారి శ్రీవారు మమ్మలిని అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ వస్తానని వెళ్ళారు.అప్పటికి కొద్ది మంది ప్రమదావనం సభ్యుల తో తప్ప వేరే బ్లాగర్స్ ఎవరితోనూ పరిచయం కాలేదు.ఉమాదేవిగారికీ ఎవరూ తెలీదు.అలాగే వెళ్ళాము.అప్పటికే కొంతమంది వచ్చి హాల్ లో ఉన్నారు.అందులో ఓ అబ్బాయి నా దగ్గరకు వచ్చి, "మీరు సాహితీ బ్లాగర్ మాలాకుమార్ గారా ?"అని అడిగాడు.నేను ఆశ్చర్యానందాలతో ఉబ్బితబ్బిబ్బై అవును అన్నాను.నాగార్జున అని అతని పేరు పరిచయం చేసుకున్నాడు.ఎవరితోనూ పర్సనల్ గా పరిచయము లేకపోయినా రెగ్యులర్గా వ్రాసే బ్లాగర్స్ అందరి పేర్లూ తెలుసు.అతనే మాకు మిగితా అందరినీ పరిచయం చేసాడు.సరే మీటింగ్ మొదలవుతోందని మీటింగ్ రూంలోకి వెళ్ళాము.అక్కడ కిరణ్ చావా, వీవెన్ మొదలైన వాళ్ళు ఉన్నారు.స్చప్ ఎవరెవరు ఉన్నారో గుర్తు రావటం లేదు.బ్లాగ్ ల గురించి, బ్లాగ్స్ గురించి పరిచయం చేసారు.బ్లాగ్స్ గురించి పరిచయం చేసేటప్పుడు ఆ బ్లాగ్స్ ను స్క్రీన్ మీద చూపించారు.ఆ విధంగా వచ్చిన బ్లాగర్స్ అంతా కూడా తమ తమ బ్లాగ్ లను పరిచయం చేసారు.నేనొక్కదాన్ని తప్ప అందరూ మాట్లాడ్ది, అక్కడున్న బోర్డ్ మీద సంతకం చేసి వచ్చారు.ఆ తరువాత కిరణ్ చావా అందరికీ బ్లాగ్ పుస్తకం ఇచ్చాడు.నాకు ఇవ్వలేదు.వరూధిని గారు మాలాగారికి ఇవ్వలేదు అంటే మాట్లాడిన వాళ్ళకే ఇస్తున్నాను అన్నాడు. పోనీ కొనుక్కుంటాను అన్నాను.మీరు మాట్లాడితేనే ఇస్తాను , అమ్మను అని ఖరాఖండీ గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు! ఏం చేయాలి? కొత్త వాళ్ళ తో మాట్లాడాలంటేనే భయం. పైగా స్టేజ్ మీద అంటే వణుకు, గొంతు లేవదు. మాట్లాడకుండా ఉందామటే పుస్తకం రాదు.అందులో నా బ్లాగ్ గురించి కూడా ఉంది.ఉమాదేవిగారు మీరు ఎలా కంప్యూటర్ నేర్చుకున్నారో, బ్లాగ్ ఎలా స్టార్ట్ చేసారో చెప్పిరండి పరవాలేదు అన్నారు.భయపడుతూ , వణుకుతూ వెళ్ళి , చిన్నగా మొదలుపెట్టి "మా మనవడి మీద పంతం తో అమీర్పేట్ లో కంప్యూటర్ ఇన్ష్టిట్యూషన్ కు వెళ్ళి నేర్చుకున్నాను అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు.అంతే ఉత్సాహం వచ్చి ఏదో నాలుగు మాటలు మాట్లాడి,బోర్డ్ మీద  సంతకం చేసి పుస్తకం తెచ్చుకున్నాను
అంత కష్టపడి తెచ్చుకున్నానా ఎవరో అడిగితే ఇచ్చాను.తిరిగి రాలేదు.ఎవరికిచ్చానో గుర్తులేదు :) అదేమిటో కొంతమంది తీసుకెళ్ళి తిరిగి ఇవ్వరు.కొన్ని సార్లు ఎవరికిచ్చానో గుర్తుండదు.గుర్తున్నా పదే పదే అడగటానికి మొహమాటం.ఇది వరకు నవోదయా, విశాలాంధ్రా తిరిగి తిరిగి పుస్తకాలు తెచ్చుకునేదానిని.ఇప్పుడు ప్రమదాక్షరి, కథాకుటుంబం లో అందరూ పరిచయం అయ్యాక కొత్తపుస్తకాల అవిష్కరణకు వెళ్ళి నచ్చినవి తెచ్చుకుంటున్నాను.కొత్తవి ఎమి వచ్చాయా అని వెతికే పని తప్పింది :)ఏమిటో మరీ ఈ పుస్తకాల పిచ్చి :)

Tuesday, February 21, 2017

నేనూ-నా జిం!

కొత్థ లాప్ టాప్ మీద టైప్ చేస్తుంటే మాలా మమ్మీ బాగానే టైప్ చేస్తున్నావే అన్నాడు సుపుత్రుడు.
"అవును రా చేయి పూర్తి తగ్గిపోయింది "చూడు అని చేతిని అటు తిప్పీ ఇటుతిప్పీ వాడు చూడకుండా కష్టం మీద చేతిని వెనక్కి తీసికెళ్ళీ హాపీగా చూపించేసాను.
"చేయే కాదు మామ్మ్ చూడటానికి కూడా ఫ్రెష్ గా ఉన్నావు.ఆక్టివ్గా కనిపిస్తూ ఇదవరకటి మాలా మమ్మీ లా ఉన్నావు ."అని మెచ్చుకున్నాడు.
అమ్మయ్య ఇక పొద్దున్నే ఆరింటికల్లా లేచి, ట్రాక్ సూటేసి జిం కెళ్ళక్కరలేదు , ఎంచక్కా 8.30 కు వలలి వచ్చి కాఫీ ఇచ్చేటప్పుడు లేవచ్చు ఊహించుకుంటూ సంతోషపడిపోతున్నాను.
"జిం కెళ్ళటం ఆపేయకండి డాడీ కంటిన్యూ చేయండి.ఈ సారి వన్ ఇయర్ కి కట్టేయండి." బాంబ్ పేల్చాడు.
"ఎందుకురా చేయి బాగయిందిగా " మళ్ళీ చూపించబోయాను.
"చెయ్యి చూసాలే. ఫిట్నెస్ కోసం వెళ్ళాల్సిందే.ఆగస్ట్ లో వచ్చినప్పుడు ఎట్లా ఉన్నావు ?ఎంత నీరసంగా కళ్ళుమూసుకుపోతూ, ఈ సోఫా లో పడుకొని, ఆ సోఫాలో పడుకొని, నేనున్న వారం లో నాలుగు సార్లు డాక్టర్ దగ్గరకు వెళ్ళావు.ఇప్పుడు చూడు ఎంత ఆక్టివ్ గా పన్లు చేసుకుంటున్నావో.లైఫ్ సెంటర్ కెళ్ళండి డాడీ మానకండి"
"అదికాదు బేటా , లైఫ్ సెంటర్ కు వెళ్ళినప్పటి నుంచీ లావవుతున్నాను.బరువు పెరిగాను.ఇలా టుం టుం అయితే కష్టం కదా!"
"ఏం కాదు అది హెల్దీ లావు బరువే!"
"నా ట్రాక్ సూట్ లు టైట్ ఐపోయాయి.ఒక్కొకటి 1000 రూపాయలపైన. మళ్ళీ ఎక్కడ కొంటాను.పైగా వన్ ఇయర్ కంటే లక్ష పైన పేచేయాలి."
"ఏం పరవాలేదు.నేను చెక్ ఇస్తాలే. పద ఇప్పుడే ట్రాక్ సూట్ కొనిస్తా."
చివరాకరుగా "నా మనవళ్ళు యు.యస్ రమ్మంటున్నారు.అప్పుడు నాలుగు నెలలు వెళితే కట్టిన డబ్బు వేస్ట్ కాదూ!"
అప్పటి దాకా నిశబ్ధం గా ఉన్న ఏమండీ "వినయ్ దానికి ఎక్సటన్షన్ ఇస్తానన్నాడులే!"
ఇంకా ఆశ చావక నా ట్రైనర్ సూర్య పెళ్ళిచేసుకొని ఊరెళ్ళిపోయాడు. కొత్త ట్రైనర్ పూజ నాకు నచ్చలేదు అన్నాను. స్వాతి ని అడుగుదాము లే ఆ అమ్మాయి బాగానే చేయిస్తుందిగా అన్నారు ఏమండి నా వైపు చూడకుండా!
ఐతే ఇది స్వదేశీ , విదేశీ కలిసి పన్నిన కుట్రా :(
"నిన్ను చిన్నప్పుడు బలవంతంగా , ఏడుస్తున్నా స్కూల్ కు పంపానని కక్ష తీర్చుకుంటున్నావా బేటా"
చిద్విలాసంగా నవ్వేసాడు.అందుకే వాడి కి నేనూ పిల్లలూ హిట్లర్ అని పేరు పెట్టింది.
ఈ రోజు కట్టేసారు.వినయ్ మొహమంతా నోరు చేసుకొని విశాలంగా నవ్వాడు.నవ్వడూ అతనికేం పోయింది.
మళ్ళీ పొద్దున్నే లేవటాలూ. . . పరుగులూ దేవుడా. . .

Thursday, February 16, 2017

అలారం మ్రోగింది

మా ఏమండీ నా మతిమరుపుకు సూచించిన పరిష్కారం , ఫిబ్రవరి నెల తెలుగుతల్లికెనడా అంతర్జాలపత్రిక లో వచ్చిన నా కథ " అలారం మ్రోగింది." లో చదివి మీ అభిప్రాయం చెప్పగలరు.

http://www.telugutalli.ca/#


అలారం మోగింది

సూదిపడ్డా వినిపించేంత నిశబ్ధం.ఎక్కడా ఎటువంటి చడీచప్పుడు లేదు.కరెంట్ పోయినట్లుంది.చుట్టూ గాఢాంధకారం.కన్నుపొడుచుకున్నా కనిపించని చిమ్మచీకటి! ఇంతలో ధబ్బ్ మని ఏదొ పడ్డ చప్పుడు పెద్దగా వినిపించింది.కెవ్వ్ . . . కెవ్వ్ మని కేకపెట్టింది సుమ.
ఉలిక్కి పడ్డాను.

ఇంతలో కుకుకూ. . . . కుకుకూ. . . సన్నని కోయిల రాగం. . . . .

ఒక్క క్షణం నాకేమీ అర్ధం కాలేదు.అయోమయంగా చుట్టూ చూసాను.ఈసారి కొంచం స్పష్ఠంగా  కోయిల రాగం చెవి దగ్గరగా వినిపించింది.అప్పటి కి చిన్నగా తేరుకున్నాను.చేతిలో అప్పటి వరకూ చదువుతున్న డిటెక్టివ్ నవలను పక్కన పెట్టి, కోయిల రాగం ఏమిటా అని పక్కకు తిరిగి చూసాను.సోఫా పక్కన కుర్చీలో ఉన్న సెల్ నుంచి వస్తోంది రాగం!కప్పుకున్న కంఫర్టర్ ను పక్కకు జరిపి,లేవబోతే ,పొట్ట మీద పెట్టుకొని, అప్పటి వరకూ తిన్న చెగోడీలపళ్ళెం ధన్ అని కింద పడింది.హూఫ్ అనుకుంటూ సోఫాలో పడుకున్న దానిని లేచాను.వళ్ళు విరుచుకుంటూ ఇంకా కోయిల రాగం వినిపిస్తున్న సెల్ ను ఆపాను. అలారం దేనికి మోగిందా అని ఆలోచనలో పడ్డాను.
అదేమిటో మధ్య తెగ మతిమరుపు వచ్చేసింది.ఏదో తీద్దామని ఫ్రిజ్ దగ్గరకు వెళుతానా , ఫ్రిజ్ తలుపు తీసి ఏమి తీద్దామనుకున్నానబ్బా అని ఆలోచనలో పడుతాను.ఏదో పని మీద గదిలోకి వెళ్ళి , ఇక్కడకు ఎందుకు వచ్చానా అని ఎంత తల బద్దలు కొట్టుకున్నా గుర్తురాదు.వంట చేస్తూ, పుల్కా చేద్దామని పిండి తీయబోతే ,ఏదీ పిండి? స్టవ్ పక్కనలేదు.ఫ్రిజ్ లో పెట్టానా ఏమిటి? ఎంత గట్టిపడిందో!అబ్బా అనుకుంటూ ఫ్రిడ్జ్ తీసి అంతా వెతికినా కనిపించదు.ఎక్కడ పెట్టాను చెప్మా ఆలోచనలో పడ్డాను.ఓఫ్  పొద్దున టిఫిన్ చేసినప్పుడు పిండి తడపలేదని అప్పుడు గుర్తొస్తుంది.అప్పటికప్పుడు పిండి తడిపి పుల్కాలు చేస్తే  గట్టిగా అట్టముక్కలలా అయ్యాయి.దేవుడా!ఏమండీ తో చివాట్లు తప్పవు అనుకుంటూ భయం భయంగా పెట్టానా , కళలో ఉన్నారో ఏమిటీ ఇట్లా ఉన్నాయి అంటూ పక్కకు జరిపి అన్నం తినేసారు.అమ్మయ్య బతికిపోయాను అనుకుంటూ పెరుగు గిన్న కోసం చూసాను.ఏదీ ? దీనికేమొచ్చింది ఎక్కడుంది.దేవుడా మళ్ళీ వెతుకులాట.ఊం రాత్రి తోడుపెడితేగా ఉండటానికి. ఏమండీ కి రాత్రి పెరుగు ఫ్రిడ్జ్ లోది వేసి ఎట్లాగో గట్టెక్కాను.చల్లటి పెరుగు తినలేక నేను చేయికడిగేసుకున్నానుపెరుగులేక ఏడుపొస్తుంది . మతిమరుపుకు తోడు లావు కూడా అవుతున్నాను.లాభం లేదు రాత్రి తొందరగా తినేసి, తొందరగా పడుకొని , తెల్లవారు ఝామున లేచి తొలి ఎండ లో వాకింగ్ చేయాల్సిందే.ప్రతిజ్ఞ చేసుకున్నాను.భోజనానికి బల్ల మీద అన్నీ సద్దేసి, ఏమండీని భోజనానికి పిలిచాను.ఇప్పుడే వస్తున్నాను ఐదు నిమిషాలు అన్నారు.ఏమండీ వచ్చేలోపు ఓసారు ఫేస్ బుక్ చూద్దామా అని కాస్త టెంప్ట్ అయ్యాను.ఏమొ బాబు ఓసారి తీసానంటే ఓపట్టాన వదలబుద్ది కాదు అంది మనసు.లేదులే తొందరగానే ఏమండీ వచ్చేలోపు నా పోస్ట్ కు ఎన్ని కామెంట్స్ వచ్చాయో చూసుకొని తీసేస్తాను అని మనసును బుజ్జగించి, లాప్ టాప్ ఓపెన్ చేసి , ఫేస్ బుక్ లో మునిగిపోయాను.మన కామెంట్స్ చూసుకోవటం తో ఆగుతుందా అంతా తీరిగ్గా ఓసారి తిరిగేసి తలెత్తేసరికి తొమ్మిదైపోయింది.ఏమండీ ఎప్పుడు వచ్చారో , ఎప్పుడు తిని వెళ్ళిపోయారో గమనించనేలేదు.దేవుడా మళ్ళీ భోజనానికి ఆలశ్యం ఐపోయింది రాత్రంతా ఇబ్బంది తప్పదు.  .పొద్దున్నే మెలుకువ వస్తుంది కాని ఎందుకులేచానో గుర్తుండక మళ్ళీ పడుకుండిపోతాను.దేవుడా. . . అని ఇన్నిసార్లు అనుకోవటమే సరిపోయింది!

మధ్య ఏమైందీ , ఏమండీగారు రాత్రి టి.వి చూసుకుంటూ సెల్ చార్జింగ్ చేసుకోవటం మర్చిపోతున్నారని , నేను చార్జింగ్ లో పెడుతానులేండి అని హామీ ఇచ్చాను.ఏమండీగారి సెల్ చార్జింగ్ లో పెట్టాలి. . . ఏమండీగారి సెల్ చార్జింగ్ లో పెట్టాలీ అని రోజంతా రామనామం లా జపం చేస్తూ, రాత్రి పదింటికి సెల్ చార్జింగ్ లో పెట్టి , హమ్మయ్య మర్చిపోలేదు, చేసిన వాగ్ధానం నిలుపుకున్నాను అని ఊపిరి తీసుకున్నాను.నిశ్చింతగా నిద్రపోయాను. పొద్దున కాఫీ ఇద్దామని వెళితే సెల్ ను ధీర్గంగా చూసుకుంటున్నారు ఏమండి.నావైపు తిరిగి సెల్ చార్జింగ్ లో పెట్టావా అని అడిగారు.

"పెట్టాను కదా!మీరు చూస్తున్నారుగా" నన్ను మెచ్చుకుంటారని సంతోషంగా ధీర్గం తీసాను.

"నువ్వూ చూడు." అన్నారు.

ఏమైంది, సెల్ చార్జింగ్ లోనే ఉందికదా అనుకుంటూచూసాను.ఖర్మ, చార్జింగ్ కు పెట్టాను కాని స్విచ్ ఆన్ చేయటం మర్చిపోయాను.ఏమంటారో అని దీనంగా ఏమండీవైపు చూసాను.

ఏమండీ సెల్ ను చార్జింగ్ లో సరిగ్గా పెట్టి,స్విచ్ ఆన్ చేసి, ఘంభీరం గా వెనకకు చేతులు పెట్టుకొని , ధీర్ఘం గా ఆలోచిస్తూ , హాల్ లో అటూ, ఇటూ పచార్లు చేస్తున్నారు.నేను ఏమండీ ఎటుతిరుగుతే అటు తిరుగుతే అటు నా తల గిర్రున తిప్పుతూ, టెన్షన్ గా చూస్తున్నాను.కాసేపు చూసాక నా మెడ నొప్పిపుట్టి గోళ్ళు చూసుకుంటూ కూర్చున్నాను.కొద్ది యుగాలు అతి నిశబ్ధంగా గడిచాక,
" పని చేద్దాం ." అన్నారు.

ఏమిటి అన్నట్లు చూసాను.

"నీ సెల్ తీసుకురా."

బుద్ధిగా తెచ్చి ఇచ్చాను.

" ఇప్పుడు చెప్పు , పొద్దుటి నుంచి నువ్వు చేయాల్సిన  నీ ముఖ్యమైన పనులేమిటో."

"పొద్దున్నే వాకింగ్ కు లేవాలి."

" ఎన్నింటికి?" చేతిలో సెల్ తిప్పుతూ అన్నారు.

"ఆరింటికి"

"ఓకే .తరువాత" సెల్ లో ఏదో సెట్ చేసి అడిగారు.

ఒకటొకటిగా , పిండి తడపటం, పాలు తోడుపెట్టటం వగైరా ఎప్పుడెప్పుడు ఏది చేయాలో అన్నీ చెప్పాను.

" ఇదిగో నీ సెల్.అన్నింటికీ అలారం సెట్ చేసాను.అలారం మోగగానే నీ పనులు చేసుకో.కొద్దిరోజులు ఇలా చేసుకుంటే అన్నీ గుర్తుంటాయి" అని బోధించారు.
నేను భక్తిగా నా సెల్ ఏమండీ దగ్గర నుంచి అందుకొని, నా సమస్యను తీర్చిన ఏమండీ వైపు ఆరాధనగా చూసాను.అలా ఏమండి నా సెల్ లో చక్కటి కోయిలరాగాన్ని కూడా రింగ్ టోన్ గా మార్చి ఇచ్చారు.హాయిగా సోఫాలో కంఫర్టర్ కప్పుకొని పడుకొని,పొట్టమీద చేగోడీల పళ్ళెం పెట్టుకొని తింటూ, మాంచి సస్పెన్స్ డిటెక్టివ్ నవల చదువుతుండగా అలారం మోగింది.ఇప్పుడు అలారం ఎందుకు మోగినట్లు? బుర్ర బద్దలు కొట్టుకున్నా, ఎంత ఆలోచించినా గుర్తురావటం లేదు.దేవుడా . . . కిం కర్తవ్యం. . .  అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు అలారం దేనికి మోగిందబ్బా! పోనీ పని చేస్తే ఏమండీ నే అలారం ఎందుకు పెట్తానో తెలీడానికి యేదైనా ఉపాయం ఉందేమో అడగుతే ఎట్లా ఉంటుంది. నాలుగో ఐదో మొట్టికాయలు పడతాయా?  పడితే పడ్డాయిలే! శ్రీరామచంద్రా నారాయణా ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయిరా నాయనా! ఏమైతే అదైంది రేపు పొద్దున్నే అడిగేస్తాను అని డిసైడైపోయాను.

పొద్దున్నే బాల్కనీ లో కూర్చొని పేపర్ చదువుతున్న ఏమండీ కి కాఫీ తీసుకెళుతూ సెల్ కూడా తీసుకెళ్ళాను.కాఫీ ఇచ్చి , ఏమండీ అని పిలిచాను.ఏమిటీ అన్నట్లు పేపర్ లో నుంచి తలెత్తిచూసారు.

"మరీ ఇన్ని అలారం లైతే దేనికి ఏది మ్రోగిందో తెలీక కంఫ్యూజవుతున్నాను.ఏది దేనికో తెలిసేట్టుగా అలారం సెట్ చేసుకోవచ్చా ?"అని అడిగాను.

ఏమండీ సెల్ తీసుకొని అటూ ఇటూ తిప్పిచూస్తున్నారు.

" అన్నట్లు ఏదో సినిమా లో సెల్ రింగవగానే "మీనూ రామ్మా. . . మీనూ రామ్మా. . . "అని అమ్మాయి నాన్న పిలుస్తున్నట్లుగా వస్తుంది.అలా, పిండి తడుపు. . . పిండి తడుపు,
పెరుగు తోడెయ్. . . పెరుగు తో డెయ్,
వాకింగ్ చేయ్ . . . వాకింగ్ చేయ్ " అని వచ్చేట్లుగా సెట్ చేయచ్చా ? కావాలంటే నేను వాయిస్ రికార్డ్ చేసి ఇస్తాను " అన్నాను గొప్ప విషయం చెపుతున్నట్లు.

"స్నానం చేయ్. . . స్నానం చేయ్,

జడేసుకో. . . జడేసుకో,

అన్నం తినూ . . . అన్నం తినూ వద్దా ?"

"వద్దులెండి.అవి గుర్తుంటాయి " అంటూ ఏమండీ వైపు అనుమానంగా చూసాను.

ఏమండీ నా అరచేయి తీసి అందులో నా సెల్ ఉంచారు."ఏమిటీ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారా? అప్పుడే సెట్ చేసేసారా?"అన్నాను సంబరంగా.

"కాదు. అలారం మోతలకే చిరాకేస్తుంటే ఇంకా వెధవ డైలాగులుకూడానా. అలారం లన్నీ తీసేసాను ."అన్నారు తాఫీగా!

అలారం లు మోగీ మోగీ గొంతు మూగబోయినట్లు దీనంగా నావైపు చూసింది నా బుజ్జి సెల్!( ఫిబ్రవరి-20017 తెలుగుతల్లి కెనడా అంతర్జాలపత్రిక)