Wednesday, December 28, 2011

సాహితి అలిగింది :(



నిన్నటి తో సాహితి కి మూడు సంవత్సరాలు నిండాయి . నిన్న బర్త్ డే చేసేందుకు వీలు కాలేదు . పొద్దటి నుంచీ వీలు కాలేదు . స్చప్. . . ఏమి చేయను ? ఇంతలోనే అలిగేసింది నా సాహితి . పాపం ఎంతైనా మూడు సంవత్సరాల ముద్దు పాపాయి కదా ! నా వీలూ చాలూ తెలుసు కునే వయసెక్కడిది ? సారీ రా అమ్మలూ వెరీ వెరీ సారి . చూడు . . . చూడు నీకోసం ఇప్పటి కిప్పుడే బర్త్ డే కార్డ్ చేసానా ? మరి నీకోసమే కదా ఈ కార్డ్ :)




మా బుజ్జి కదూ . . . మా బంగారు కదూ దామ్మా కేక్ కట్ చేద్దాం . . .
హాపి బర్త్ డే టు యూ . . .
హాపీ బర్త్ డే టు యూ . . .
హాపీ హాపీ బర్త్ డే డియర్ సాహితీ . . .
హాపీ బర్త్ డే టు యూ * * * * *

ఇక నవ్వమ్మా నవ్వు . . . నవ్వాలి మరి . . . . .




హే . . . . . నవ్విందమ్మా నవ్వింది . మా బంగారు తల్లి అలక తీరి నవ్వింది :)

మూడు సంవత్సరాల క్రితం బ్లాగ్ లోకం లోకి వచ్చాము నేనూ , మా సాహితి . బెరుకు బెరుకుగా ఏమీ తెలియని తనం తో , ఈ వింత ప్రపంచం లోకి అడుగు పెట్టి మూడు సంవత్సరాలైంది * * * మూడు సంవత్సరాలు మూడు క్షణాల్లా గడిచిపోయాయి . బెరుకు తనం పోయిందా ????? ఏమో :))))) కొంచమైనా పెపంచ జ్ఞానం వచ్చిందా ????? ఏమో ????? ఏహే అన్నింటి కీ ఏమో ఏమిటి ????? ఏమో :)))))
సాహితి ని ప్రేమగా ఆదరించిన మీ అందరి కీ ధన్యవాదాలు .

Thursday, December 8, 2011

అన్నపూర్ణావారి ఆణిముత్యాలు


యుట్యూబ్ లో ఏవో పాటల కోసం వెతుకుతుంటే "దొంగరాముడు " సినిమా కనిపించింది . దొంగరాముడు చూడాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను . సి.డి కోసం వెతికాను కూడా ! అప్పుడు దొరకలేదు . అనుకోకుండా ఇప్పుడు చేతికి చిక్కింది అనుకొని హాపీగా చూసేసాను :) అప్పుడే ఎందులోనో అన్నపూర్ణావారు సినిమాలు తీయబట్టి 60 సంవత్సరాలు అయ్యింది అని చదివాను . అంతే అన్నపూర్ణావారి సినిమాలు చూద్దామని కోరిక పుట్టింది . నెట్ లో వెతికితే ఇదో లిస్ట్ దొరికింది . ఆ లిస్ట్ తీసుకొని కోటీ వెళ్ళి సి. డి షాప్ లో వెతికాను . " పెళ్ళీడు పిల్లలు " , " సుడిగుండాలు " తప్ప మిగితావన్నీ దొరికాయి . ఈ లిస్ట్ లో " పల్నాటి యుద్దం " కూడా వుంది కాని అది అన్నపూర్ణావారిది కాదు . మరి అన్నపూర్ణావారిది కూడా పల్నాటియుద్దం సినిమా వుందేమో మరి నాకైతే కనిపించలేదు ...
"దొంగరాముడు " చూస్తూవుంటే చాలా ముచ్చటగా అనిపించింది . ఏ. నాగేశ్వరరావు , సావిత్రి , జమున ఎంత చిన్నగా వున్నారో . పరిస్తితులు మనుషులను ఎలా దొంగ గా మారుస్తాయో చూపిస్తారు ఇందులో . నాకైతే తెగ నచ్చేసింది . హీరో పరిస్తితుల ప్రభావం తో దొంగ గా మారటము కాదు నచ్చింది , సినిమా నచ్చింది :)
శరత్ నవల " నిష్కృతి " ఆధారం గా నిర్మించిన చక్కటి కుటుంబ కథా చిత్రం " తోడికోడళ్ళు " . ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపూ సొలుపేమున్నదీ . . . . . ఎవర్ గ్రీన్ సాంగ్ . . .
తెలిసీ తెలియని వయసు లో జరిగిన పెళ్ళికి , కట్టిన మాంగల్యానికి ఇచ్చిన విలువే " మాంగల్య బలం ". నావరకు నాకైతే పాటలన్నీ సూపర్ హిట్ .
ఒకే పోలికల తో వున్న అజయ్ , విజయ్ వారి స్తానాలు మార్చుకొని , వారి ఇంటిని సరిదిద్దుకున్న , ఇద్దరు యువకుల కథే " ఇద్దరు మితృలు ". ఆద్యంతమూ సరదాగా సాగిపోతుంది .
ముగ్గురు స్నేహితురాళ్ళ జీవితాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో చెప్పే కథ " చదువుకున్న అమ్మాయిలు ."
తనను పెంచినవారి కోసం పాటుబడిన ఓ మంచి అమ్మాయి జీవితం లో సుఖ దుఖాల కథే "వెలుగునీడలు ."
కోడూరి కౌసల్యా దేవి వ్రాసిన నవల " చక్రభ్రమణం " కు సినిమా రూపమే " డాక్టర్ . చక్రవర్తి ." ఈర్శ , అసూయలు ఒక ముచ్చటైన దంపతులను ఎలా విడదీస్తాయో చూస్తూవుంటే చాలా బాధ కలుగుతుంది .
ఇద్దరు నాయికల మద్య అందమైన నాయకుడు . ఎక్కడా ? ఇంకెక్కడ " ఆత్మగౌరవం " లో :)
తలితండ్రుల అదుపు , ఆప్యాయత ఎరుగని ఓ అబ్బాయి , తన స్నేహితురాలి సంతోషం కోసం ఓ హత్య చేస్తడు . పిల్లలకు కుటుంబం లో సరి ఐన ఆప్యాయత , క్రమశిక్షణ లేకపోతే ఎలా తయారవుతారు ? ఎలా అంటే ఇదో " సుడిగుండాలు " లోని అబ్బాయి , అమ్మాయిలా .
హత్య చేసాడని జైలుకు వెళ్ళిన తండ్రి , నిరపరాధి అని నిరూపిస్తాడీ "పూలరంగడు ."
ఓ స్వాతంత్ర్య సమరయోధుని కొడుకు ఓ జవాన్ . అతను పెళ్ళిచేసుకో బోతున్న ప్రేయసి కార్ ఆక్సిడెంట్ లో చనిపోయింది . కాని ఆమె కొన్ని రోజుల తరువాత అతనికి ఓ గైడ్ గా కనిపించింది ! ఇదేమి వింత ! తెలుసుకోవాలని వుందికదూ ఐతే చూడండి " జై జవాన్ ".
ప్రేమించి పెళ్ళి చేసుకోబోతూ , కాదనుకొని తనను పెంచిన మేనమామ కూతురిని పెళ్ళిచేసుకోవటానికి సిద్దపడ్తాడు హీరో గారు . ఎందుకంటే " అమాయకురాలు " చూస్తే కాని తెలీదు !
ఓ జమిందారు కూతురు , పొగరుబోతు అమ్మాయి తనను ఏడిపించిన అబ్బాయికి బుద్ది చెప్పబోయి జీవితమే నాశనం చేసుకుంటుంది పాపం , యద్దనపూడి సులోచనారాణి నవల విజేత ఆధారం గా తీసిన " విచిత్రబంధం " లో .
ఎంత చదువుకున్నా , ఎంత తెలివి కలదైనా అమ్మాయికి నా అనే వారి అండ చాలా అవసరం . ఈ సంగతే చెప్పారు , యద్దనపూడి సులోచనారాణి నవల " బంగారుకలలు " అధారం గా తీసిన " బంగారుకలలు " సినిమాలో .
విభిన్న మనస్తత్వాలు కల ఇద్దరు అమ్మాయిలు వారి జీవితాన్ని ఎలా తిప్పుకున్నారో చెప్పే కథ , యద్దనపూడి సులోచనారాణి నవల "ప్రేమలేఖలు " ఆధారం గా తీసిన సినిమా " ప్రేమలేఖలు ."
అంతస్తుల భేధం ప్రేమికుల మద్య ఎడబాటును కలిగిస్తుంది . అవును వారు ఎంత ప్రేమించుకున్నా విడిపోకతప్పదు , యద్దనపూడి నవల " రాధాకృష్ణ " నవల ఆధారం గా తీసిన " రాధాకృష్ణ " సినిమాలోలా !
"అమెరికా అబ్బాయి " పాపం ఏమయ్యడో ఏమో ! షాపువాడు పని చేయని సి.డి ఇచ్చి నన్ను సినిమా చూడనీయకుండా చేసాడు హుం !

గత ఆరు నెలలుగా వీలు చిక్కినప్పుడల్లా " అన్నపూర్ణావారి ఆణిముత్యాల " ను చూసాను. దొంగరాముడు లో నాగేశ్వరరావు బంగారు కలలు లో ఎంతా మారిపోయారో ! దొంగరాముడు లో " అందచందాల గడుసరివాడు విందు భోంచేయ వస్తాడు నేడు " , అని చక్కగా డాన్స్ చేసిన సావిత్రి కి , వెలుగునీడలు లో " చిట్టీ పొట్టీ చిన్నారీ పుట్టినరోజు " లో కదలలేక కదిలిన సావిత్రి కి ఏమాత్రం పోలికలేదు . నటనలో కాదు ఆకారం లో :) ఆ రోజులలో నటన మీద తప్ప ఆకారం మీద అంత శ్రద్ద పెట్టినట్లు లేరు . వాళ్ళు అసలు నటిస్తున్నట్లుగా లేదు . ఆ పాత్రలలో ఇమిడిపోయారు . అరే సూర్యకాంతం తోడికోడళ్ళు లో ఎంత బాగుంది . గయ్యాళితనం మటుకు మారలేదు :) పాపం రేలంగి కి ముందునుంచీ ఒకటే పర్సనాలిటీ . అన్ని సినిమాలల్లో పాత్రదారులనందరినీ ఆ ఆ పాత్రలకు తగ్గట్టుగా సెలెక్ట్ చేసారు .

నటీ నటులకు తగ్గట్టు కథ ఎంపిక చేసారా ? కథకు తగ్గట్టు నటీ నటులను తీసుకున్నారా ? చెప్పటం కష్టమే ! అన్నీ చక్కటి కథా చిత్రాలే . కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు . కుటుంబ సబ్యులకు మద్య వుండే అనురాగాలు , ఆప్యాయతలు , ఈర్శాద్వేషాలు బాగా చూపారు . ఎక్కువగా నవల ఆధారం గా , ఎక్కువగా యద్దనపూడి సులోచనారాణి నవలల ఆధారంగా తీసారు . దాదాపు చాలా వరకు మద్య తరగతి వారి కథలే .

40 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎలా వుండేదో ఈ సినిమాలలో చూడవచ్చు . గండిపేట , కాలాపహాడ్ , నౌబత్ పహాడ్ , రిట్జ్ హోటల్ , నేను చదువుకున్న రెడ్డీవుమెన్స్ కాలేజ్ చూస్తూ వుంటే తప్పిపోయిన పిల్ల ను చూసినంత ఆనందం వేసింది . ఇప్పుడు ఆ పరిసరాలు చాలావరకు మారిపోయాయి . ఇప్పుడు గండిపేట అంత అందం గా ఎక్కడుంది ? కాలపహాడ్ , నౌబత్పహాడ్ లేనే లేవు . రూపు మార్చేసుకొని , బిర్లా మందిర్ , బిర్లా సానిటోరియం అయ్యాయి . అప్పట్లో కాలపహాడ్ ఎక్కి చూస్తే హైదరాబాద్ అంతా కనిపించేది .

నటీ నటులు , కథలు , హైద్రాబాద్ పరిసరాలు బాగా చూపించటం సరే , చందమామను ఎంత అందముగా చూపారని ! బాల్కనీ , అందులో గుత్తులు గుత్తులు గా పూసిన మాలతీ తీగ , ఆకాశం లోని జాబిల్లి , ఆ బాల్కనీ లో పరవశించిపోయిన నాయికా , నాయకులు , ఎంత అందమైన దృశ్యం ! చందమామ పాట తో పాటు , దాదాపు ప్రతి సినిమాలోనూ దేశభక్తి గేయం కూడా తప్పకుండా వుంది .

అన్ని సినిమాలు చూడ చక్కగా వున్నాయి . ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలే ఐనా కలర్ వి కూడా వున్నాయి . కొన్ని సినిమలైతే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంత బాగున్నాయి . మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేంత వినసొంపైన పాటలు , మంచి కథలు తో హాయిగా ఆహ్లాదంగా సాగిపోయే సినిమాలే అన్నీనూ . పోట్లాటలు , కాట్లాటలు , రక్తపాతాలు , రౌడీయిజాలు , దయ్యాలు , భూతాల తో వున్న సినిమాలే కాని ఇంత చక్కటి కథా చిత్రాలు ఈ రోజులలో ఎందుకు తీయరో !

Thursday, November 10, 2011

స్పినాచ్ ఖావో శక్తి బడావో !



ఓ బేద్ద రాచ్చసుడు , వికటాట్టహాసం చేస్తూ ఓ అమ్మాయిని చంకనిరికించుకొని పోతున్నాడు . . . . .
ఆ అమ్మాయి భయం తో కెవ్ . . . కెవ్ మని అరుస్తోంది . . . . .
ఇంతలో వచ్చాడు ఓ అబ్బాయి . ఆ రాచ్చసుడి తో డిషుం . . . డిషుం . . . అని యుద్దం చేస్తున్నాడు . కాని పాపం ఓడిపోతున్నాడు . . . . .
ఇంతలో పై నుంచి ఓ టిన్ ఆ అబ్బాయి దగ్గరకు వచ్చింది . దానిని ఓపెన్ చేసి , అందులో వున్న స్పీనచ్ ను తిన్నాడు .
హంతే . . . హాచర్యం . . . ఆ అబ్బాయి కి కండలు వచ్చి ,బళం వచ్చేసింది . అంతే . . . ఆ రాచ్చసుడి తో యుద్దం చేసి , ఓడించి ఆ అమ్మాయిని కాపాడాడు , ' పపాయా ద సేలర్ ' .
ఈ కథంతా చెప్పి ,
హూ . . . హా . . . " స్పీనచ్ కావో , శక్తి బడావో " అంటూ పరుపు మీద ఓ గెంతు గెంతి యుద్దం ఫోజ్ పెట్టాడు మా మనవడు .
" బామ్మా ! నా కిప్పుడే స్పీనచ్ పెట్టు " అని ఆర్డర్ వేసాడు .

కార్టూన్స్ తో కొన్ని సార్లు మంచి కూడా జరుగుతున్నదన్నమాట ! మరి మామనవడి శక్తి పెంచటానికి స్పీనచ్ తో వంటలు చేయొద్దు ! చేసి పెట్టాను :)

అవే మన వన భోజనాలకు కూడా తెచ్చాను . అందరూ ఎంచక్కా తినేసి , శక్తి ని పొందండి :))



1. పాలక్ పూరి ;
రెండు పాలకూర కట్టలు ,
రెండు కప్పుల గోధుమ పిండి ,
వొక స్పూను వాము ,
కొద్దిగా కొత్తిమీర ,
ఓ పచ్చిమిరపకాయ ,
కొద్దిగా జీలకర్ర పొడి ,
సరిపడా ఉప్పు .
ముందుగా పాలకూరను శుభ్రం గా కడిగి , కట్ చేసుకోవాలి , పాలకూర , కొత్తిమీర , పచ్చిమిరపకాయ మిక్సీ లో వే పేస్ట్ లాగా రుబ్బుకోవాలి .
ఆ పేస్ట్ ను , వామును , జీల కర్రపొడిని , ఉప్పును గోధుమపిండిలో వేసి పూరీపిండిలా తడుపుకోవాలి . పిండి ని తడిపేందుకు ఆ పేస్టే సరి పోతుంది . ఒకవేళ తక్కువ అవుతే నీళ్ళు పోసుకోవచ్చు .
ఆ పిండి తో చిన్న చిన్న వుండలు చేసుకొని , పూరీలు వత్తుకొని కాల్చుకోవాలి .

2.పాలక్ రైస్ ;
రెండు గ్లాసులు బాసుమతి బియ్యం ,
మూడు కట్టలు పాలకూర ,
ఒక గ్లాస్ పాలు ,
మూడు గ్లాసులు నీళ్ళు ,
రెండు ఉల్లిపాయలు ,
కొద్దిగా దాల్చిని చెక్క , షాజీర , పెద్ద ఇలాచీ , చిన్న ఇలాచి , నాలుగు లవంగాలు .
రెండు స్పూన్స్ గరం మసాలా పొడి ,
సరిపడా ఉప్పు ,
పోపుకు నూనె .
ముందుగా బియ్యం ను కడిగి పక్కన పెట్టుకోవాలి .
పాలకూరను శుభ్రం గా కడిగి కట్ చేసుకొని , పేస్ట్ చేసుకోవాలి .
ఉల్లిపాయలను , సన్నగా పొడవుగా కోసుకోవాలి .
కుక్కర్ ను పొయ్యిమీద పెట్టి , అందులో నూనె వేయాలి . నూనె కాగాక దాల్చిని , లవంగాలు , షాజీర , లవంగాలు కొద్దిగా కచ్చా పచ్చాగా కొట్టిన పెద్ద ఇలాచీ , చిన్న ఇలాచీ వేయాలి . అవి వేగాక , ఉల్లిపాయముక్కల ను వేసి , లేత బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి . ఉల్లిపాయముక్కలు వేగాక , పాలకూర పేస్ట్ ను వేసి పచ్చివాసన పోయేట్లుగా వేయించుకొవాలి . ఆ తరువాత అందులో మూడుగ్లాసుల , నీళ్ళు , ఒక గ్లాసు పాలు పోయాలి . ఉప్పు గరం మసాలా పొడి వేసి , బియ్యం వేయాలి . బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి , విజిల్ పెట్టేయాలి . ఐదు విజిల్స్ వచ్చాకా , మంట తగ్గించి ఐదు నిమిషాలుంచి , స్టవ్ ఆపేయాలి .

౩. పాలక్ పన్నీర్ ;
పాలకూర పూరీలు , పాలకూర అన్నమూ అయ్యాక వాటిలోకి ' పాలక్ పన్నీర్ '.
పాలకూర ఐదు కట్టలు ,
వంద గ్రాముల పన్నీర్ పాకెట్ ,
రెండు ఉల్లిపాయలు ,
ఒక వెల్లుల్లి రెబ్బ ,
కొద్దిగా అల్లం ముక్క ,
ఓ స్పూన్ గరం మసాల పొడి ,
ఉప్పు ,
ఖారం ,
పోపుకు నూనె .

పన్నీర్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని , నూనెలొ కొంచం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి .
పాలకూరను శుభ్రం గా కడి , కట్ చేసుకొని , పేస్ట్ చేసుకోవాలి .
ఉల్లిపాయలు , అల్లం , వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకోవాలి .
మూకుడులో పోపుకు సరిపడా నూనె వేసి , అల్లం , వెల్లుల్లి , ఉల్లి ముద్దను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి . ఆ ముద్ద వేగాక పాలకూర పేస్ట్ ను వేయాలి . పాలకూర బాగా వుడికాక , వేయించి వుంచుకున్న పన్నిర్ ముక్కలను , గరం మసాలా పొడిని , ఉప్పు , ఖారం ను వేసి బాగా కలిపి ఇంకొద్దిసేపు వుడికుంచుకోవాలి . కూర గంటె జారుడుగా వుండాలి . ముద్ద కాకూడదు . అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసుకోవచ్చు .
అంతే , పాలక్ పూరి , పాలక్ రైస్ , పాలక్ పన్నీర్ తయార్ :)

వీటి కి తోడు కీరా రైతా . ఇది చేయటము చాలా సులువు . కీరా తొక్కతీసి , తురుము కోవాలి , కీరా తురుము , సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలూ , కొత్తిమీర , ఉప్పు పెరుగులో కలపటమే !

ఇలాగే పూరీ లను , అన్నం ను , బీట్రూట్ , కారెట్ , మెంతికూర , పుదీన ,టమాటా, మటర్ ( మటర్ ను పేస్ట్ చేయ కూడదు . అలానే వేసేయాలి .) ల తో కూడా చేయవచ్చు . కాదేది కవితకనర్హమూ అన్నట్లు ఏ కూరైనా వేసి వండవచ్చు . మామూలా గా తెల్ల అన్నం వండుతే , చిన్నప్పుడు మా అబ్బాయి తెల్లన్నం నాకొద్దు అని గొడవ చేసేవాడు . అదే పోలిక వాడి కొడుకుకు వచ్చింది . పూరీ ఐనా , చపాతీ ఐనా , అన్నం ఐనా కలర్స్ కలర్స్ వుండాల్సిందే ! కొంచం ఓపిక చేసుకొని వండుతే పిల్లలకు అన్ని కూరలూ పెట్టినట్లుగా కూడా వుంటుంది . కడుపు నిడా తింటారు . బలానికి బలమూ , ఆరోగ్యానికి ఆరోగ్యమూనూ . పుణ్యమూ , పురుషార్ధము :)

Wednesday, September 14, 2011

రాధ - మధు



టి. వి చూసే అలవాటు లేని నేను , యద్దనపూడి నవల సీరియలా గా వస్తోంది అని విని , ఏదేమిటో చూద్దామని టి. వి ఆన్ చేసాను . అంతే రెండు సంవత్సరాల పాటు రాత్రి 8 కాగానే మా టి. వి ముందు హాజరు . రాధ - మధు సీరియల్ తెగ నచ్చేసి , అప్పుడప్పుడు పిల్లలతో కూడా టి. వి కోసం యుద్దం చేసేంతగా నచ్చేసింది :)))))

ఈ తియ్యనైన ఎడబాటు ప్రేమ కథ ను స్కార్ఫియో ప్రొడక్షన్ వారు " రాధ- మధు " గా టి . వి సీరియల్ గా తీసారు . ఈ సీరియల్ లో కథ ను బేస్ గా మాత్ర మే తీసుకున్నారు . తాతయ్యను , నానమ్మ గా చూపించారు . కొన్ని పాత్రల నిడివి ని పెంచారు . కొన్ని ఎక్స్ ట్రా పాత్రలు చేరాయి . ఐనా ప్రతిపాత్ర బలమైందే . ప్రతి పాత్రా అవసరమైందే అన్నట్లుగా వున్నాయి . వొకటి ఎక్కువ , వకటి తక్కువగా లేవు . చిన్న పాత్రల మీద కూడా శ్రద్ద చూపించారు . ఏ పాత్రను తీసుకున్నా సహజం గా అనిపించింది . డైలాగులు చాలా మామూలు బాషలో వున్నాయి . అనవసరమైన ఇంగ్లీష్ పదాలు లేవు .ఎక్కడా అతిలేదు . సంభాషణలు చాలా మాములుగా మనం ఇంట్లో మాట్లాడుకున్నట్లే వున్నాయి . అంతేకాని భారీ డైలాగులు లేవు . హాస్యం కూడా బాగా పండించారు . చాలా అద్భుతంగా తీసారు .

హీరో పేరు రాధాకృష్ణ . అందరూ రాధా అనిపిలుస్తుంటారు . హీరోయిన్ పేరు మధూలిక . మధు అని పిలుస్తుంటారు . నానమ్మ రాజరాజేశ్వరీ దేవి . కథ కు ప్రాణం ఈ మూడు పాత్ర లే . సినిమాలలో గుంపులో గోవిందమ్మ గా , చిన్న చిన్న పాత్రలు వేసే శివపార్వతి ని ముందు నానమ్మ గా చూసి , ఈమె ఏమి చేయగలదు అనుకున్నాను కాని , జమీందారు భార్య గా ఆ వశం ప్రతిష్ఠ కాపేడేందుకు కొడుకును దూరం చేసుకొన్నప్పుడూ , ఆ తరువాత పశ్చాతాపం చెందినప్పుడూ , మనవడి ని పెంచేటప్పుడు బాద్యత గల నానమ్మగా , మనవడి ని మార్చాలి , పెళ్ళి చేయాలి అని తపించినప్పుడూ , పనివాళ్ళ మీద కూడా అభిమానం చూపించేటప్పుడూ , పేద ఇంటి పిల్లను మనవడి కి ఇచ్చి పెళ్ళి చేసినప్పుడూ , రాధ ప్రేమ కథ తెలిసి , తనకు తెలీకుండానే ఇద్దరు అమ్మాయీల జీవితాన్ని నాశనం చేసానే అని పరితపించినప్పుడు , మితృ , గోపాలం ల బాల్య స్నేహితురాలిగా చాలా బాగా నటించింది . నటించింది అంటము కాదు జీవించింది . నానమ్మ అంటే ఇలా వుండాలి అనిపించేట్లుగా వుంది . చాలా హుందాగా వుంది . రాధగా కళ్యాణ ప్రసాద్ తోరం , మధుగా మౌనిక చాలా సహజం గా వున్నారు . అసలు వాళ్ళిద్దరికీ సీరియల్ తీసే ముందే , ఎలా నటించాలి అని శిక్షణ ఇప్పించారేమో అని నా అనుమానం . వాళ్ళ హావ భావాలు , బాడీ లాంగ్వేజ్ , డ్రెస్సింగ్ అన్నీ నాచురల్ గా వున్నాయి . ఆ పాత్రలకు తగ్గట్టుగా నవలలో నుంచి ప్రాణం పోసుకొని వచ్చారా అన్నట్లుగా వున్నారు . వాళ్ళ ముందు , శోభన్ బాబు , జయప్రద తేలి పోయారు . మధు చీర కట్టు చూస్తే సింతటిక్ చీరలు కూడా ఇంత అందం గా కట్టుకోవచ్చా అనిపించింది . పద్మశ్రీ , లక్ష్మి ల జడలు కూడా పెద్దగ్గానే వున్నా మధు జడ డామినేట్ చేసింది . నడుస్తూ , నడుస్తూ భుజం మీదు గా చూడటము ఓహ్ చాలా అందంగా అనిపించిందీ అమ్మాయి .(ఇన్ని తెలివితేటలు , అందమూ , మంచి గుణాలన్ని కలవోసిన అమ్మాయిని నిజ జీవితం లో భరించటం కష్టమేమో :)) కాకపోతే కొన్ని సార్లు మధు కాన్ ఫిడెన్స్ ఓవర్ గా చూపించిదా అనిపించింది .

జూలీ గా లహరి బాగా ఇమిడిపోయింది . అందరి సానుభూతి నీ దోచుంది . మిగితా పాత్ర ధారు లంతా కూడా బాగా చేసారు . కాకపోతే అందరివీ అసలు పేరులు తెలీలేదు . సాయన్న , గొదావరి , బాపి మొదలైన వారి అసలు పేర్లు తెలీలేదు . యువజంట రాధ - మధు తో పోటీ పడ్డారు గోపాలం ఆది లక్ష్మి , వెంకట్రావు , జానకమ్మ . సాయి , పద్మశ్రీ హాస్యాన్ని బాగా పండించారు . ముందు పారిజాతం పాత్ర అనవసరం అనుకున్నాను కాని రాధ - మధు ల ను కలిపేందుకు పరోక్షం గా ఆ పాత్రే సాయపడింది . రాఘవయ్య పాత్ర సగము నుంచి ముఖ్యమైన పాత్రైపోయింది . రాజు , శీను , సరోజ , భారతి , బబ్లు , అనసూయ , సన్నీ లాంటి చిన్న పాత్రల కు కూడా న్యాయం చేసారు . మధు ఆప్తులుగా మూర్తీ , లక్ష్మి బాగా చేసారు . మధు తమ్ముడు రవి చాలా ముద్దుగా వున్నాడు . వరమ్మ పాత్ర పల్లెటూరి అమ్మలక్కల పాత్ర ను సజీవం గా చూపారు . రాధ - మధు లను కలపాలని అందరూ ప్రయత్నం చేయటం టచీగా అనిపించింది .
ఇహ రాధ మధు కలుస్తారు అనుకోగానే ఏదో అవాంతరం రావటం , మనం ఉసూరు మనటం . అందుకే డైరక్టర్ దీనిని తీయని ఎడ్బాటు ప్రేమ కథ అన్నాడు :) సీరియల్ రెండు సంవత్సరాల పాటు కళ్ళు తిప్పుకోనీయకుండా టి. వి కి కట్టి పడేసిన అద్భుతమైన సీరియల్ ఇది . కాని , కొన్ని సార్లు సాగతీతగా అనిపించింది . కొన్ని చోట్ల పద్మశ్రీ , పారిజాతము ల ఎపిసోడ్స్ కొంచం బోర్ కొట్టించాయి . అలాగే ఆద్యంతమూ రాధ మధుల మేకప్ మొదలైన వాటిల్లో శ్రద్ద చూపించారు కాని చివరి ఎపిసోడ్ కు వచ్చేసరికి ఇద్దరి మేకప్, హేర్ స్టైల్ రెండూ బాగాలేవు . అంతకు ముందు రెండు పెళ్ళి కూతురి గెటప్ లో ముచ్చటగా వున్న మధుకు హేర్ స్టైల్ పూర్తిగా మార్చి , ఓవర్ మేకప్ చేసారు . పాన్ కేక్ బాగా కనిపించి మోటుగా వుంది . అంతవరకు వున్న అందమే పోయింది . అలాగే రాధ కు కూడా . హేర్ మొత్తం వెనక్కి దువ్వేసి , మేకప్ కూడా ఓవర్ గా చేసారు . ఒకేసారి గా ఇద్దరూ వయసు ఎక్కువ వాళ్ళుగా అగుపించారు . చిన్న చిన్న లోపాలు తప్ప సీరియల్ చాలా బాగుంది .
కొన్ని సరదా అబ్జర్వేషన్స్ ; రాజరాజేశ్వరి జమిందారిణి ఐనా , పాపం ఆ రాజమాత కు సీరియల్ మొత్తం లో పది చీరల కన్న ఎక్కువ లేవు ! మధు జడ మొదట్లో చాలా వదులుగ సన్నగా వుండి రాను రాను లావైంది . జుట్టు కు క్లిప్ పెట్టుకొని గుడికి వెళ్ళి నప్పుడు జుట్టు జడంత పొడువులేదు . సీరియల్ చివరలో జడకు బోలెడు క్లిప్స్ పెట్టారు . సీరియల్ అంతా బెడ్ కాఫీ తో మొదలుకొని , బ్రేక్ఫాస్ట్ , లంచ్ , డిన్నర్ అన్నీ యధావిధిగా పెట్టారు . అందుకేనేమో సీరియల్ ఐపోయే సమయానికి అంతా కాస్త లావెక్కారు :) ప్రతి చిన్న విషయాన్ని అంటే ఎవరైనా ఆక్టర్ ఇక ముందు కనిపించరు అంటే ముందే వారిని పని మీద వూరికి పంపటం వగైరా చేసి మనకు డౌట్స్ రాకుండా చేసారు . కాని చివరలో రాధ కు , పేపర్ లో చూసి , ఆపరేషన్ కోసం సహాయం చేసింది రవి కేనని ఎలా తెలిసిందో చెప్పటం మర్చిపోయారు . సీరియల్ అంతా తన నొటి తో దడ దడ లాడించిన వరమ్మ లాస్ట్ సీన్ లో లేకపోవటం కొరతే మరి :)
ఇది యద్దనపూడి సులోచనారాణి నవల " గిరిజా కళ్యాణం " ఆధారం గా నిర్మించ బడింది . దాని కథ చిత్రమాలికలో " గిరిజా కళ్యాణం " లో చదవండి ..
ఇది యు ట్యూబ్ లో వుంది . చూడని వారు చూడవచ్చు .
కొస మెరుపేమిటంటే , ఈ సీరియల్ వస్తున్న రోజుల్లోనే ఎందుకో జి చానల్ పెడితే అందులో " ఆట" అనే ప్రోగ్రాం వస్తోంది . అప్పుడు మధు అందులో " ఆ అంటే అమలాపురం " పాటకు డాన్స్ చేస్తోంది . అది చూడగానే మనసంతా బాధ తో నిడిపోయింది . ఆర్టిస్టులంటే అన్నీ పాత్రలూ పోషించాలి కాని ఆ సీరియల్ వస్తుండగా ఆ అమ్మాయి ఈ డాన్స్ చేయకుండా వుండాల్సింది అనిపించింది :(

ఈ మద్య నవల ఆధారిత సినిమా ల గురించి చిత్రమాలిక లో వ్రాస్తున్నాను :) ఐతే నా దగ్గర అన్నీ యద్దనపూడి , యండమూరి , శరత్ బాబు నవలలు , సినిమాలే వున్నాయి . నాకు తెలిసినంతవరకు మాదిరెడ్డి , కొమ్మూరి వేణుగోపాల రావు , మల్లాది , కావలిపాటి విజయలక్ష్మి , బలభద్రపాత్రుని రమణి మొదలైన వారి నవలలు కూడా సినిమాలుగా వచ్చాయి .కాని ఏ సినిమాలు ఏ నవలల ఆధారం గా వచ్చాయో తెలీటం లేదు . అలాగే కొన్ని నవలలు తెలుగు లో , హిందీ లో కూడా వచ్చాయి . ఎవరికైనా , నవల పేరు , అది సినిమా గా వచ్చిన సినిమా పేరు తెలిస్తే చెప్పగలరు ప్లీజ్ . అలాగే ఈ ఆర్టికల్ ఇలాగే కాకుండా ఇంకా కొంచం వేరుగా వ్రాయవచ్చేమో సలహాలు ఇచ్చినా సంతోషిస్తాను . ఆ * * * నవలలు , సినిమా సిడీ లు నేను కొనుక్కుంటానులెండి .నవలలైతే ప్రతినెలా కోటీ దాకా ఏమొస్తావులే అని నాలుగు నెలల క్రితమే మా ఇంటి వెనుకే విశాలాంద్ర వారు బ్రాంచ్ తెరిచారు . ఏ నవల కావాలన్నా తెప్పించి ఇస్తాం మేడం అని నాకు ప్రామిస్ చేసారు . కాబట్టి నొప్రాబ్లం :) సి.డి లే సుల్తాన్ బజార్ కు వెళ్ళి తెచ్చుకోవాలనుకోండి . కాకపోతే దొరకాలి :)
అందరికీ అడ్వాన్స్ గా థాంకూలు :)

Sunday, August 21, 2011

మీరజాలగలడా నా ఆనతి

నారదమహర్షి , సువాసనభరితమైన , అందమైన పూవు నొక దానిని చేతబట్టుకొని వస్తున్నాడని సత్యభామాదేవి కి కబురందించింది చెలికత్తె . ఆ పూవునెలాగూ కృష్ణునికే సమర్పిస్తాడని , శ్రీక్రృష్ణుడు ఆపూవును తనకే ఇస్తాడని మురిసిపోతూ ఎదురుచూస్తూ కూర్చుంది సత్య . ఏదీ ఆ నారదు డూ ఎంత సేపటికీ రాడు . ఏమైనాడు చెప్మా అని ఆలోచనలో పడ్డది సత్య . పోనీ శ్రీకృష్ణుడూ ఇగో రాడు , అగో రాడు . ఏమైపోయారిద్దరూ ! అనితర్జన బర్జన్లు పడుతుండగా నారదుడు ఆ పుష్పాన్ని కృష్ణునికి ఇచ్చాడనీనూ , ఆ కిట్టయ్య దానిని రుక్మిణికి బహుకరించాడనీనూ తెలిసిపోయింది . భగ్గుమంది భామ హృదయం . అనదు మరీ ! ఇదేమైనా కాస్తో కూస్తో అవమానమా ! హన్నా . . . ఐనా ఆ వాసుదేవుని కి హెంత ధైర్యం ! భామను కాదని రుక్మిణికి ఇవ్వటమే ! ఈ అవమానాన్ని భరించేదిలేదుగాక లేదు ! పూవే కాదు ఆ పూల చెట్టునే తెచ్చేసి ఇమ్మంటాను . . . హమ్మా . . . హమ్మా . . . మీరజాలగలడా నా యానతి అని ప్రతిన బూనింది సత్యాదేవి .



అంతే అలకపానుపు ఎక్కేసింది . శ్రీకృష్ణ పరమాత్మ పడరాని తిప్పలూ పడ్డాడు . కాలు పట్టుకొని తన్నించుకున్నాడు కూడాను పాపం . ఏమిటీ పాపమా ? పాపం అట పాపం . ప్రియ సతి . . . ముద్దుల సతి అనగానే సరా . . . ముద్దూ ముచ్చటా తీర్చొద్దూ ! తప్పుచేస్తే తన్నరేమిటి ! అందుకేగా పద సఖీ అంటూ దేవలోకానికి ప్రయాణం కట్టాడు . అబ్బ ఎంత అందంగా వుందీ పారిజాత వృక్షం . పూవే కాదు వృక్షాన్నే తీసుకుపోదామంది సత్యభామాదేవి . మీరజాలగలడా ఆనతి * * * * *
దేవలోకాధిపతి తో యుద్దం చేసి , ఓడించి మరీ సంపాదించాడు పారిజాతవృక్షాన్ని . ఆ పారిజాత వృక్షాన్ని , వాసుదేవుని వెంటపెట్టుకొని , ఆనందముగా భూలోకానికి పయనమైంది సత్య .
ఇక్కడ భూలోకము లో బాల్కనీ లో కూర్చొని ఆకాశంలోకి దిక్కులు చూస్తూ , ఏమి పోస్ట్ రాద్దామా అని ఆలోచించుకుంటున్న మాల , సన్న సన్న గా తేలివస్తున్న సువాసనలను పసిగట్టింది . ఎక్కడి నుంచా ఈ సువాసనలు అని మాల ఆకాశం లోకి ఇంకా పరీక్షగా చూడగా , సత్యాభామా దేవి తీసుకొని వెళుతున్న చెట్టు నుంచే ఈ సువాసనలు అని గ్రహించేసింది . అంతే భామా . . . భామా ప్లీజ్ . . . ప్లీజ్ ఆ చెట్టు కొంచం నాకూ ఇవవ్వవా అని సత్యభాను బతిమిలాడింది . పాపం ఏదో అడుగుతోంది కదా కాస్త ఇద్దాములే అనుకుంది భామ . కాని కిట్టయ్య ఠాట్ నేను ఇంత కష్టపడి సంపాదించి నీకిస్తే నువ్వు మాలకు భాగమిస్తానంటావా వీల్లేదు అన్నాడు . మాల వదలకుండా ప్లీజ్ * * * ప్లీజ్* * * అని బతిమిలాడగా కరిగిపోయిన సత్య పోనిద్దూ కొంచం ఇస్తాను . ఐనా మాలా వాళ్ళ ఆయన ను ఇంట్లో నీపేరు తోనేగా ముద్దుగా పిలుస్తారు . అంటే ఆయన నీ తమ్ముడన్నట్లే గా . . . అన్నదమ్ముల మధ్య ఆ మాత్రం సఖ్యత వుండాలి అని శ్రీకృష్ణుని కి నచ్చ చెప్పి కొంచం చెట్టును తుంపి మాల కు ఇచ్చింది సత్యభామాదేవి . అది చూసి మూతి ముడుచుకున్న కన్నయ్య ను " కన్నయ్యా నీ ప్రతి పుట్టినరోజుకు ఈ పారిజాత పుష్పాలతో నిన్ను అలంకరిస్తా లే " అని మాల బుజ్జగించింది . ఇంకేమంటాడు వొప్పుకున్నాడు :)))))
ఇలా సత్యభామ దగ్గర నుంచి నేను సంపాదించిన పారిజాతవృక్షం ఇదే!



" పారిజాతం " పేరు ఎంత సున్నితం గా వుందో పూవూ అంత సుకుమారం .సన్నని ఆరెంజ్ కలర్ కాడ తో , తెల్లనని పలచని రేకుల తో బుజ్జి బుజ్జి గా ఎంత ముద్దుగా వుందో ఈ పారిజాతం ! సాయంకాలం కాగానే విచ్చుకుంటున్న పూల సువాసనలు అల్లనల్లన గాలి లో తేలిపోతూ ఇల్లంతా పరుచుకుంటాయి . చిరు చీకట్లల్లో చల్లని గాలి వీస్తూ వుండగా పారిజాతాలు విచ్చుకుంటూ వెదజల్లే పరిమళాలు వాహ్ * * * మా ఇంటి కి వచ్చే అథిదుల కు , మెట్ల పక్కనే నిలబడి తన పరిమళాలతో స్వాగతం చెపుతుంది మా పారిజాతం . ఆ పరిమళాన్ని గుండె నిండుగా ఆస్వాదించకుండా ఎవరూ ఇంట్లోకి రారు . ఆ ముద్దుగుమ్మలను చూస్తూ కాసేపు అలాగే ఆగిపోతారు . నాకైతే బాల్కనీ లో నుంచి కదలాలనే అనిపించదు . ఉదయం లేవగానే కింద నేల మీద పట్టుపానుపులా పరుచుకొని వుంటాయి . చెట్టును కొద్దిగా వూపగానే మిగిలిన పూలు కూడా జలజలా రాలుతూ ఎంత సందడి చేస్తాయో ! మంచు బిందువులలో తడిసిన పారిజాతాల అందం చూడాల్సిందే కాని వర్ణింపనా తరమా . . . నేను కన్నయ్యకు ఇచ్చిన మాట తప్పకూడదని ప్రతి కృష్ణాష్టమికి కొంచం ముందుగానే పూయటం మొదలు పెడుతాయి . దాదాపు నవంబర్ చివరిదాకా పూస్తాయి .
నీ అలకతో ఇంత మంచి పూలను దివినుండి భువి కి దింపిన ఓ సత్యభామా నీకు వేల వేల థాంకూలు :)

కృష్ణాష్టమి శుభాకాంక్షలు .


Wednesday, June 8, 2011

మా చిన్ని అదితి కి అభినందనలు



"అచ్చట్లు ముచ్చట్లు అవ్వలకు ముద్దు ,
తప్పట్లు తట్టితే తాతలకు ముద్దు ,
జోలల్లు పాడితే పాపలకు ముద్దు ,
మాచిన్ని అదితి మాకు ముద్దు ."
అని పాడగానే కిలకిలా నవ్వేది మా చిన్ని అదితి . కళ్ళు విప్పార్చుకొని మరీ చూసేది . అబ్బో మా అదితి కళ్ళు ఎంత అందమైనవో ! పుట్టీ పుట్టగానే కళ్ళు తెరిచేసింది . అప్పుడే లోకాన్ని చూసేయాలని ఎంత ఆరాటమో ! కళ్ళు మిల మిలా మెరుస్తూ , చాలా బ్రైట్ గా వుండేవి . కార్ లో నా పక్కన , కార్ సీట్ లో కూర్చొని రెప్ప వేయకుండా , సీరియస్ గా చూసేది . అమ్మ ఇంట్లో వున్నంతసేపూ నాతో నే ఆటలూ పాటలూ . కాని అమ్మ బయటికి వెళ్ళిందో అంతే ఏడుపే ఏడుపు . అమ్మా కావాలి , అమ్మమ్మా కావాలి :) అంతే తప్ప పాపం ఎప్పుడూ గొడవ చేయలేదు . అసలు పుట్టిన రెండో రోజే ఇంట్లో స్నానం చేయించాలి అంటే ఎంత భయము వేసిందో ! మా అమ్మాయికి , అల్లుడి కి నా గొప్ప చూపించుకోవాలి కదా ! పైగా వాళ్ళిద్దరికీ బేబీ టబ్ లో కాకుండా చక్కగా నూనే రాసి , నలుగు బెట్టి స్నానం చేయించాలని కోరిక . పైగా మా అమ్మ తో సున్ని పిండి ప్రత్యేకముగా చేయించి తెచ్చుకుంది నా కూతురు :) నాకొచ్చు నాకొచ్చు అని బడాయికి పోయి , మా అత్తగారిని మనసులో తలుచుకొని , టబ్ లో కూర్చొని , కాళ్ళ మీద పసిపిల్లను వేసుకొని స్నానము చేయించేసాను . పాపము హాయిగానే వుండిందో , నొప్పే పుట్టిందో తెలీదు కాని , కుయ్ , కయ్ అనకుండా స్నానం చేయించేసుకుంది మా బంగారక్క . ఏడాదికే ముద్దు ముద్దు మాటల తో ,
" ఐ లవ్ యు ,
యు లవ్ మి ,
వుయ్ అర్ ఆర్ హాపీ ఫామిలీ ,
వితె గ్రేట్ కీస్ అండ్ హగ్ ,
ఐ లవ్ యూ అమ్మమ్మా ."
అనిపాడేది . ఎంత సంతోషమో కదా ! మరే మా బంగారుతల్లి అంతా నా పోలికే :)

ఇలా నా మనవరాలి గురించి చెప్పాలంటే బోలెడు కబుర్లు వున్నాయి . అన్నీ నిన్నా మొన్నా జరిగినట్లే వున్నాయి . నిన్న మొన్నటి పసికూన 10త్ మంచి పర్సెంటేజ్ తో పాస్ అయ్యింది . ఈ రోజు నుంచి కాలేజ్ గర్ల్ ! పిల్లలు పెరుగుతూ వుంటే వారి ఆటపాటలను చూస్తూ మురిసిపోవటము బాగానే వుంటుంది కాని అప్పుడే ఇంత పెద్దవాళ్ళు ఐపోయారా అని బెంగ కూడా వేస్తుంది ! కాని తప్పదు కదా !!!
భవిష్యత్తు లో కూడా మంచి మార్కులు తెచ్చుకొని ,
నీకు ఇష్టమైన , నచ్చిన ఫీల్డ్ లో రాణించాలని కోరుకుంటూ ,
ఆల్ ద బెస్ట్ అదితీ .

మా అదితి కి ఇష్టమైన చాక్లెట్ కేక్ తిని , ఈ రోజు నుంచి కాలేజీ కి వెళుతున్న మా అదితి ని మీరందరు కూడా విష్ చేసేయండి మరి.. పెద్దల ఆశీర్వాదమే పిల్లలకు రక్ష కదా !

Friday, June 3, 2011

నాకూ బ్లాగుకూ ఋణం తీరిపోయి _ _ _ _ _



మన రోజువారీ కార్యక్రమం మొదలెడుదామని లాప్ టాప్ తీసాను . జిమేయిల్ తీసాను వాకే మేయిల్స్ చూసుకోవటం ఐపోయింది . లేఖిని తీసాను . ఆ తరువాత బ్లాగ్ డాష్ బోర్డ్ క్లిక్ చేసాను . ఇదేమిటి కొత్తగా పాస్ వర్డ్ అడుగుతోంది పేద్ద తెలీనట్లు ! మర్చిపోయిందేమోలే పాపం ఇచ్చేస్తే పోలే ! పాస్ వర్డ్ టైప్ చేసాను . రయ్ ((((( మని వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ పాస్ వర్డ్ అడిగింది . హుం . . . మళ్ళీ ఇచ్చాను . అయ్యారే . . . . . యిదియేమి చోద్యము * * * * * ఎన్నిసార్లు పాస్ వర్డ్ ఇచ్చినా ఇటుల మాయమైపోవుచున్నది !!!!! మళ్ళీ . . . . . మళ్ళీ . . . అడుగుతోంది . ఏమి చేతును ?????? కాళ్ళూ చేతులూ ఆడకున్నవి >>>>> ఇక నేను బ్లాగ్ వ్రాయలేనా ????? అసలు ఏమైంది దీనికి ??? కొంపదీసి నిన్నటి వెల్లుల్లి ఘాటు పడక ఢాం * * * * * అన్లేదుకదా . . . . . అనవసరం గా వెల్లుల్లి కష్టాలు రాసానే !!!!! అప్పటికీ కొన్ని కష్టాలే రాసాను . అన్నీ రాసి వుంటే లాప్ టాప్ నే ఢాం . . . ఢాం అనేదేమో ((((( అని పరి పరి విధములుగా చింతించాను . కాని ఏమీ లాభం కనిపించలేదు . . . . .

ఇంక నా వల్ల కాదు అనుకొని మా మనవడి ని తీసుకు రమ్మని కార్ పంపాను . హాయ్ అమ్మమ్మా అనుకుంటూ మనవడు , మనవరాలు ఇద్దరూ వచ్చేసారు . మా కొడుకు కోడలు యు. యస్ కు వెళ్ళిపోయినప్పటి నుంచీ నాకు విక్కీ నే చేదోడు వాదోడు . అందుకే వాడికే నా గోడు చెప్పుకున్నాను . ఓ గంట సేపు తిప్పలు పడ్డాడు . సారీ అమ్మమ్మా ఏమైందో రావటం లేదు నాకూ తెలీటం లేదు అని చేతులెత్తేశాడు ! వాడికే రాక పోతే ఇక నాకు దిక్కెవరు ? అయ్యో . . . నాకూ బ్లాగ్ కూ ఋణం తీరిపోయిందా ? 2 1/2 సంవత్సరాలుగా నా కష్ట సుఖాలను పంచుకున్న నా బ్లాగ్ మూగపోయిందా ????? ఏదీ దారి ? కళ్ళు చెమ్మగిలిపోగా రాని డాష్ బోర్డ్ వైపు అలాగే చూస్తూ కూర్చున్నాను . నా తోపాటు విక్కీ కూడా బిక్కమొహం వేసాడు . . . . .

సాయంకాలం మావారు రాగానే ఏడుపు గొంతుతో హేమండీ నా డాష్ బోర్డ్ కనిపించటం లేదు అని చెప్పాను . ఆయన గాభరా పడిపోతూ ఏమిటీ అన్నారు . ఓహో ఈయనకు డాష్ బోర్డ్ అంటే తెలీదు కదూ అనుకొని అదేమిటో , అదిలేక పోతే నాకెంత ఇబ్బందో పదినిమిషాలు వివరించి చెప్పాక అంతా విని ఓష్ అంతే కదా . . . నీ ఏడుపు మొహం చూసి ఇంకేమైందో అనుకున్నాను అని తీసిపారేసారు . ఇంకేమి కావాలి . ఇంతకంటే పెద్ద కష్టం ఏముంటుంది అని గొణుకున్నాను . ఏమనుకున్నారో , ఈ ఏడుపు పోతే తప్ప అన్నం పెట్టననుకున్నారేమో , లేదా జాలే వేసిందో పోనీ రవికి ఫోన్ చేసి కనుక్కో అని ఓ సలహా పడేశారు ! ఇంతరాత్రి ఏమి కాల్ చేస్తానులే అని వూరుకున్నాను .

ఒకటా ? రెండా ? మూడు బ్లాగులు నన్ను వదిలి వెళ్ళిపోయాక నాకు మనశ్శాంతి వుంటుందా ? రాత్రంతా నిద్రనే లేదు . నాకు ఎంత కంపెనీ ఇచ్చాయి ! ఎంతమంది స్నేహితులను సంపాదించిపెట్టాయి ! నాకు తోడూ నీడగా వున్నాయి ! ఇప్పుడు నన్ను దిక్కులేనిదానిగా వదిలేసి వెళ్ళిపోయాయి ! వాటికీ నాకూ ఋణం అంతేనేమో ! అయ్యో సాహితీ ఇక నేను నిన్ను చూడలేనా ! కమ్మటి కలలు కంటూ , చల్తే చల్తే అని హాపీగా బ్లాగ్ లోకాన్నీ చుట్టి రాలేనా ! అకటా ఎంత కష్టం వచ్చింది . పగవాళ్ళకు కూడా ఇలాంటి కష్టాలు ఇవ్వకు దేవుడా !!! హుం ఎంత దిగులు పడ్డా ఏమిలాభం !

మరునాడు పొద్దున గబ గబా పనులు కానిచ్చుకొని , మళ్ళీ ఒకసారి ప్రయత్నిద్దాం అనుకొని సిస్టం ఓపెన్ చేసాను . శ్రీమద్ రమా రమణ గోవిందో హరి !!!!! మొదటికే మోసం * * * నెట్ గయాబ్ * * * ఆ పోవటం పోవటం ఐదు రోజులు అత్తా పత్తా లేకుండా పోయి నిన్న నే వచ్చింది . . . చిన్నగా జిమేయిల్ ఓపెన్ చేసాను . వచ్చింది . వెల్లులి కామెంట్స్ పబ్లిష్ చేసాను . లేఖిని వచ్చింది . ఇక తీయనా వద్దా . . . టెన్షన్ * * * టెన్షన్ * * * డెస్క్ టాప్ మీద వున్న ఆంజనేయ స్వామికి దండం పెట్టుకున్నాను . . .

రెడీ . . .
వన్ . . .
టు . . .
త్రీఈ . . . ఈ . . . ఈ . . .
ధైర్యం విలోలంబాయే ( కరెక్టేనా ? ఏమో ?)
దేవా * * * దేవా * * * దేవా * * * శ్రీ ఆంజనేయా , ప్రసన్నాంజనేయా * * *
క్లిక్ & & & & &
వావ్ ( ( ( ( ( * * * * * వచ్చేసిందీ . . . ఈ . . . ఈ. . .
హబ్బా ఎంత సంతోషం ! మాటల్లో రాతల్లో చెప్పలేనంత !!! తప్పిపోయిన బిడ్డ దొరికినంత :))

Thursday, May 26, 2011

వెల్లుల్లి కష్టాలు !!!!!


వెల్లుల్లి కష్టాలు !!!!!



పొద్దున లేచినప్పటి నుంచి , రాత్రి పడుకునేవరకూ తిండి గోలే . ఏమి వండాలి అనే ఆలోచనలే ఎంతకూ తెగవు . అసలు జనాభాకి ఎందుకింత తిండి రంధి ? ఏమైనా అంటే " కోటి విద్యలూ కూటికొరకే " అనే సామెతొకటి ! మా కజిన్ సత్య అంటుంది రాత్రి పడుకుంటే ఓ పట్టాన నిద్ర పట్టదక్కా అని . ఎందుకు అంటే పొద్దున లేవగానే బ్రేక్ ఫాస్ట్ ఏమి చేయాలి అని ఒకటే టెన్షన్ . మా ఆయన్ని అడుగుతే పొద్దున లేచాక చూసుకోవచ్చుగా పడుకో అంటారు . ఏదో వకటి చెప్పండి అని పదే పదే అడుగుతుంటే విసుక్కుంటూ ఏదో చెప్తారు . అప్పుడు హమ్మయ్యా డిసైడ్ అయ్యింది అనుకొని హాపీగా నిద్రపోతా అని చెప్పింది :) హుం . . .

సరే ఇంట్లో అంటే ఎలాగో ఓలాగా తిప్పలు పడి సద్దుకుంటాము కాని , బయటకి వెళ్ళి నప్పుడు తిండి కోసం తిప్పలు చెప్పలేనన్ని . అసలే మా ఇంట్లో వెల్లుల్లి , మసాలాలు గట్రా తినము . మా తాతగారి ఇంట్లో ఐతే రాములక్కాయలు ( టమాటాలు ) కూడా నిషేదం ! మా ఇంట్లో మా అమ్మ ఉల్లిపాయలు , ఆలుగడ్డ కూర, టమాటాకూర , పప్పుచారు , పకోడీలు మొదలైన వాటిల్లో వేసేది . మా అత్తగారి ఇంట్లోనూ అంతే తప్ప వెల్లుల్లి అనే ఒక పదార్ధం వుంటుంది అని కూడా నాకు తెలియదు . అవునా అలాంటి అమాయకురాలిని ఈ వెల్లుల్లి ఎన్ని కష్టాలపాలు చేసిందో !

మాపెళ్ళైనాక మూడు నెలలు అత్తగారింట్లో ఆడుతూ పాడుతూ వంట నేర్చుకున్నాక ఓ శుభరాత్రి ఏమండీ  నన్ను పటియాలా తీసుకెళుదామని సదరన్ ఎక్స్ ప్రెస్ ఎక్కించారు . ఆ రాత్రి కి ఎలాగూ ఇంట్లోనే భోజనం చేసాము కాబట్టి , మరునాడు వుదయము తినేందుకు పూరీలు , కొబ్బరి పచ్చడి , మద్యాహ్నం కోసం పులిహోర , పెరుగన్నం కట్టి ఇచ్చారు మా అత్తయ్యగారు . అవే ఆ రోజు రాత్రి కూడా తినేసాము . మరునాడు వుదయము నుంచి మొదలయ్యాయి కష్టాలు ! ట్రేన్ లో బ్రెడ్ & ఆంలెట్ తెచ్చారు . చీపాడు ఆంలెట్ నేను తినను అనేసాను . పోనీ బ్రెడ్ సాండ్విచ్ తిను అన్నారు మావారు . ' బ్రెడ్డా ' అది జ్వరం వచ్చి నప్పుడు కదా తింటారు అన్నాను . ఇంతలో అరటిపళ్ళు వస్తే అవి తిని బ్రేక్ ఫాస్ట్ పని ముగించా . మొదటిసారి కాపురాని కి వెడుతున్నానని అమ్మ ఇచ్చిన కారపూస , మైసూర్పాక్ , పళ్ళతో ఆ రోజూ ఎలాగో నెట్టుకొచ్చాను . మరునాడు ఆగ్రా లో దిగాము . రైల్వే కాంటిన్ కు తీసుకెళ్ళి చపాతీలు , పాలక్ పన్నీర్ తెప్పించారు . చపాతీలుకూడా జ్వరం వచ్చినప్పుడు మాత్రమే తినే పదార్ధం అని అప్పట్లో నా ఘాడాభిప్రాయం . అప్పటికి నవలా సాహిత్యము తెలీదు కాబట్టి , భానుమతి అత్తగారి కథ లు చదవలేదు కాబట్టి పన్నీరు వంటకాలలో వాడుతారు అని తెలీదు కాబట్టి అదికూడా తిన్లేదు ! ఆ రోజు కు ఆపిల్స్ తో సరిపెట్టుకున్నాను . అలాగే ఆగ్రా అంతా తిరిగాము . రాత్రి కి డిల్లీ వెళ్ళాము . అక్కడ పొద్దున తెప్పించిన పూరీ , ఆలూ కూరలో ఏదో వాసన . అదేమిటో తెలీదు . ఎప్పుడూ తిన్లేదు . ఎలాగో కూర లేకుండా పూరీ మటుకు తినేసాను . మద్యాహ్నమూ హోటల్ లో అన్నీ కూరలలోనూ ఏదో వాసన . అబ్బే ఇంత పిచ్చి వాసన తో ఇక్కడి వాళ్ళు ఎలా తింటారు బాబు అని బోలెడు హాచర్య పోయాను . ఆ రోజంతా నీరసము గా డిల్లీలో చూడవలసినవి చూసాను . మరునాడు ఉదయానికి పాటియాలా చేరుకున్నాము . యూనిట్ వాళ్ళు పాపం ఎంటో ప్రేమగా పూరీ కూరా పంపారు . అదేమిటి బాబూ ఇక్కడా కూరలో అదేవాసన ! అంతే మళ్ళీ ఉత్త పూరినే తిన్నాను . లంచ్ కు పక్కింట్లో వున్న మేజర్ . జగనాథ్ వాళ్ళు పిలిచారు . వెళ్ళామా . . . ఏవో డ్రింక్స్ ఇస్తారు కాని భోజనము పెట్టరే ! పెట్టినా వీళ్ళింట్లోవి ఏమి వాసనలొస్తాయో ! ఆకలి నక నక లాడిపోతోంది . చివరాఖరికి భోజనము వడ్డించారు . ఎదురుగా టేబుల్ మీద ఘుమ ఘుమ లాడుతూ టమాటో పప్పు , కొబ్బరి పచ్చడి , బీన్స్ కొబ్బరి కూర , సాంబారు , తెల్లటి అన్నం కనిపించాయి . కొంచం కొంచం చిన్నగా . . . నోట్లో పెట్టుకున్నాను . ఏ వాసనలూ లేవు . అంతే అటాక్ . . . ఏమండీ  ఉరుము చూపులు , మేజర్ . జగనాథ్ హాచర్య చూపులూ ఏవీ పట్టించుకోలేదు . హాయిగా సుష్టుగా భోంచేసేసాను :) మిసెస్ జగనాథ్ కు మావారు బోలెడు బోలెడు థాంకూలు చెప్పేసారు . మిసెస్. జగనాత్ ద్వారా ఆ వాసనలు వెల్లుల్లి , గరం మసాలాలవని అతికష్టం మీద తెలుసుకోగలిగాను . వాళ్ళూ అవి తినరు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆ వాసనలు రాలేదు :)

ఆ విధము గా మూడు రోజులు నన్ను ముప్పతిప్పలు పెట్టిన వెల్లుల్లి మీద నాకు ద్వేషం కాక ప్రేమ వస్తుందా ? ద్వేషమైనా ప్రేమైనా పార్టీలలో మా ఏమండీ  ఉరుము చూపులు , ఇంటి కి వచ్చాక క్లాస్లూ భరించలేక తినక తప్పలేదు . అలా చిన్నగా నామీద కొద్దిగా విజయము సాధించింది వెల్లులి . కొద్దిగానే సుమా ! నార్థ్ ఇండియన్ కూరలలో మాత్రము వెల్లుల్లి తినగలను అంతే . డెలివరీ లు అయ్యాక వెల్లుల్లి ఖారప్పొడీ తినక తప్పలేదు . అలా ఏదో వాసన వచ్చీ రానట్లు ఒక్క పాయ వేస్తే తినగలిగిన స్తితికి వచ్చాను . ఐనా దాని మీద నాకేమీ ప్రేమకారిపోదు ! మా రోజువారి వంటలలో మాత్రము ఏమాత్రమూ తినను గాక తినను . ఏదైనా వూళ్ళ కెళ్ళినప్పుడు మ ఏమండీ  తో చివాట్లు తింటాను . ఎప్పుడూ చివాట్లు తిని ఏమి బతుకుతాము లే అనుకొని ఇలా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ రోజు ఏ దేవుడి రోజైతే ఆ దేవుడి పేరు మీద వుపవాసము వుంటాను :) అదీ ఎక్కువరోజులు వెళితే కష్టమే ! అదేమిటో ఇదివరకు హోటల్స్ లలో టిఫిన్స్ బాగుండేవి . ఇప్పుడు దోస , ఇడ్లీ చట్నీలలో కూడా వెల్లుల్లి వేస్తున్నారు . అదేమిటో అర్ధం కావటము లేదు . ఆ మధ్య రాజమండ్రి వెళ్ళి నప్పుడు హోటల్లో వెల్లుల్లి లేకుండా ఏమిస్తావు బాబూ అంటే పెరుగన్నం అన్నాడు .పోనీ అదే తే అన్నాను . వాళ్ళ టేస్ట్ తగలెయ్య ! పెరుగన్నము లో ఉల్లిపాయ వేసాడు . అదీ తినే ఆశ లేదు . హుం . . .

ఈ మధ్య పెళ్ళిళ్ళల్లో కూడా మసాలా కూరలు ఎక్కువైపోయాయి . అక్కడా పెరుగన్నము , ఇంకా సుగర్ వారు దయ తలచలేదు కాబట్టి , స్వీట్స్ తోనూ సరిపెట్టేసుకుంటున్నాను . ఏదైనా వూరు వెళ్ళినప్పుడు పూరీ పంచదార , (మళ్ళీ కూర్మా అంటే బోలెడంత మసాలా , నూనే వేస్తారు ) పెరుగన్నము , పండ్లు వీటి తోటే గడుపుకుంటాను . అలా ఎన్ని రోజులుండగలను ? మరునాటికి నీరసం మొహం పడుతుంది . ఈ మద్య మా ఏమండీ  తోనే కాక లక్ష్మిగారి తోకూడా చివాట్లు తింటున్నాను . ఇలా ఐతే ఎలా మాలా ? మనము ఇంకా బోలెడు వూళ్ళు తిరగాలి . మీరిట్లా నీరసపడిపోతే ఎట్లా . ఇదివరకు ఎప్పుడూ వెల్లుల్లి వేసారా లేదా అని ఎప్పుడూ గమనించలేదు . ఈ మధ్య మీకోసమని అన్ని చోట్లా అడుగుతున్నాను అంటారు !

ఓసారి సుజ్జి నాకు హాస్టల్ లో తినాలనిపించటము లేదు అంది . ఐతే మాయింటికి వచ్చేయి మంచి లంచ్ పెడతాను కాకపోతే మేము ప్యూర్ వెజిటేరియన్స్ మి . కూరలలో వెల్లుల్లి , మసాలా కూడా వేయము అన్నాను . అదేమిటి నేనేమన్నా ఆశ్రమానికి వస్తున్నానా ? ఇలా ఐతే నేను సన్యాసం పుచ్చుకోవలసిందే అన్నది . చూద్దాం రా అన్నాను . వచ్చి తిని వెళ్ళింది కాని ఇప్పటి వరకు సన్యాసుల్లో కలిసిన ధాఖలా ఐతే లేదు మరి :)

అసలు ఎక్కడికైనా వెళితే వెజిటేరియన్స్ మి అంటేనే తిండి దొరకటము కష్టం . ఆ పైన వెల్లులి లేకుండా అంటే అసలే దొరకదు . మా మాజాంగ్ ఫ్రెండ్సైతే దిస్ ఈజ్ ఫర్ యు అని ప్రత్యేకం గా చేసి పెడతారు . అన్ని చోట్లా అలా దొరకదుకదా ! ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కష్టాలో ! చివరకు ఇంట్లో ఇప్పుడు వచ్చిన వంటావిడ కూడా వెల్లుల్లి లేకుండా అంటే ఎలా అమ్మా వండేది అంటుంది . మా వంటమనిషి , శైలజ అమ్మా మీకు మంచి ఖారం తేనా అని రాజమండ్రి నుంచి అడిగింది . సరే కొత్త ఖారం కదా తీసుకురా అన్నాను . తను వూరి నుంచి వచ్చాక ఓరోజు మామిడి కాయ పప్పులో లైట్ గా వెల్లులి వాసన వచ్చింది . ఆ మన ఇంట్లో ఎల్లుల్లి వాసనా నెవర్ (((( నా భ్రమేమో అనుకున్నాను . కాని రెండోరోజు మామిడికాయ ముక్కల ఖారం వేస్తూ శైలజ తెచ్చిన కొత్త ఖారం అందులో వేయబోయాను . శైలజ గాభరగా వుండండమ్మా అది వేయకండి అందులో కొంచం వెల్లుల్లి వుంది అన్నది . అదేమిటి అందులో వెల్లుల్లి వుండటమేమిటి అంటే మేము కొత్త ఖారం కొట్టించేటప్పుడు కొంచం వెల్లుల్లి అందులో వేస్తాము సువాసన వుంటుంది అన్నది . నీ సువాసన బంగారం కాను , నేను వెల్లుల్లి తిననని తెలుసుగా ఎందుకువేయించావు ? అందుకేనా రెండురోజుల నుంచి కూరలు వెల్లుల్లి వాసన వస్తున్నాయి అని కోపం చేసాను .అలా . . . ప్రస్తుతం ఆమెకు వంట నేర్పే పనిలో వున్నాను . ఆమె నాకు వెల్లుల్లి కొద్ది కొద్దిగా అలవాటు చేసే ప్రయత్నం లో వుంది . చూద్దాం ఎవరు గెలుస్తారో :)



Wednesday, April 13, 2011

రామయ్య మాకు కొడుకు సీతమ్మ మా కోడలు



అవునండి అవును నిజమే !
రెండు రోజుల క్రితము మావారు , "సీతారాముల కళ్యాణం " లో మనము పీటల మీద కూర్చుందామా అని అడిగారు . అంతకన్నానా అన్నాను నేను . మా కాలనీలో సీతారామళ్యాణం , ప్రతి "శ్రీ రామనవమి " కీ పెద్ద ఎత్తున చేస్తారు . ఈ సారి రామయ్యకు తలితండ్రులుగా కూర్చునే భాగ్యము మాకు కలిగింది .
కాలనీ సెక్రటరీ నరసిమ్హరావు గారి ఇంట్లో వున్న , సితా , రాముడు , లక్ష్మణుడు , హనుమంతుని విగ్రహాలను ఉదయము 10 గంటలకు ఊరేగింపుగా మా కాలనీ చుట్టూ మేళ తాళాల తో ఊరేగించాము . ప్రతి ఇంటి ముందూ స్వామివారికి హారతులు ఇచ్చి మము బ్రోవమని వేడుకున్నారు . శాస్త్రొక్తముగా కళ్యాణ మంటపాని కి తీసుకొచ్చాము . మేము వరుని తలితండ్రులుగా , నరసిమ్హరావుగారు , వారి శ్రీమతి మారుతి గారు వధువు తల్లితండ్రులుగా వ్యవహరించాము . ముగురు పెద్దలను సీతమ్మవారికి వరుని వెతుకుటకై , తాంబూలము ఇచ్చి పంపటముతో కళ్యాణ సంబరము మొదలైంది . ప్రవర చదవటము , తెరపట్టటము , జీలకర బెల్లం పెట్టటము , తలంబ్రాలు అన్నీ యధావిధిగా జరిగాయి . ప్రతి దానిలోనూ మా అబ్బాయి పెళ్ళి చేస్తున్నట్లుగానే లీనమయ్యాము . అవును మరి కొద్ది సేపైనా శ్రీరాముని కి తల్లి తండ్రులు కావటమంటే ఎంత అదృష్టము ! ఈ జన్మకీ భాగ్యము చాలు స్వామీ అనిపించింది .



" సీతమ్మ మాయమ్మ , శ్రీరాముడు మాకు తండ్రి "

Tuesday, April 5, 2011

బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్ . . .



ఉదయమే కాఫీ గ్లాస్ తీసుకొని బాల్కనీ లోకి వచ్చాను . చల్లటి గాలి ఆహ్లాదం గా వుంది . ఎదురు పార్క్ లోని చెట్టు మీద పిట్టలు అల్లరి చేస్తూ గోల గోల గా కబుర్లు చెప్పుకుంటున్నాయి . పొద్దున్నే బుజ్జి పిట్టలు , బుల్లి పిట్టలు , పెద్ద పిట్టలు , రంగు రంగుల పిట్టలు ఇంటి చుట్టూ కిల కిలా రావాల తో సందడి చేస్తూ వుంటాయి . ఈ మద్య కోకిలమ్మ కూ . . . కుహూ రాగాలు వినిపిస్తూ వున్నాయి .పక్షుల కూతలను , నా కాఫీ నీ ఆస్వాదిస్తూ చిన్నగా తాగుతున్నాను . ఇంతలో ఎదురుగా వున్న కొబ్బరి కొమ్మ మీదికి ఓ పిట్ట రివ్వున వచ్చి వాలింది . బుజ్జి పిట్ట ముద్దు ముద్దు గా వుంది . కాని ఎందుకో పాపం తల వాల్చుకొని విచారం గా కూచునట్లు అనిపించింది ! దాని నే చూస్తూ వున్నాను . కొద్ది క్షణాల తరువాత ఇంకో పిట్ట వచ్చి దాని పక్కన కూర్చొని ముద్దు చేయసాగింది . భలే బాగున్నాయే పిట్టలు అనుకొని , గబ గబా లోపలికి వెళ్ళి నా కెమెరా తెచ్చుకున్నాను . వాటి ని ఫొటో తీద్దామని ఆంగిల్ సరి చూసుకుంటున్నాను . ఏమైందో ఏమో మొదటి పిట్ట రెండో దాన్ని తప్పించుకొని ,పక్క కొమ్మ మీద వాలింది . ఇప్పుడు తలవాల్చుకొని కూర్చోవటము దాని వంతైంది ! నేను కెమెరా ఆంగిల్ సరి చూసుకు నే సరికి ఇదో ఇలా ఎడమొహం , పెడమొహం పెట్టేసాయి అవి :)



కొద్దిసేపైనాక రెండో పిట్ట ఏమనుకుందో ఏమో మొదటి పిట్ట దగ్గరకు వచ్చింది .
' అలిగితివ ప్రియా సఖీ " అని పాడుతోందో
లేక
" అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు " అని పాడుతోందో అనే వూహ వచ్చింది :)
అప్పుడైనా ఓ ఫొటో తీసుకుందా మనుకున్నాను . అబ్బే ఏదైనా మన దగ్గర కుదరదు అని ఆ పిట్ట అక్కడి నుంచీ వెళ్ళిపోయి , ముందున్న కరెంట్ వైర్ మీద కూర్చుంది !


నాతో పాటు ఇంకో ప్రేక్షకు రాలు కూడా , పక్కింటి వాళ్ళ బోగన్ విల్లా చెట్టుమీద వుందని గమనించాను . పోనీ దాన్నైనా ఫొటో తీద్దామనుకుంటే ఆ ఉడత కాస్తా ఉడతా ఉడతా ఊచ్ . . . ఊచ్ . . . మని పారిపోయింది !

కా సేపు ఆ రెండు పిట్టలనూ చూసి , ఇప్పట్లో అవి సంజోతా చేసుకునేలా లేవనుకొని , నాఖాళీ కాఫీ గ్లాస్ వెనక పెట్టేద్దామని , వెనుక బాల్కనీ లోకి వెళ్ళాను . అక్కడ బాదం చెట్టు నీడలో పావురాయి జంట ముద్దూ ముచ్చట్ల లో కనిపించాయి ! వావ్ . . . పోనీ వీటిని ఫొటో తీద్దాం అనుకొని కెమారా తెచుకొని చూస్తే ఏముందీ ? ఇక్కడా అదే తంతు :) హుం . . . . .



మద్యాహ్నం మైతే బాదం చెట్టు నిడా పక్షులు సేదతీరుతూ వుంటాయి . అలా చెట్టంతా ఆక్రమించుకొని వున్న పిట్టలను ఫొటో తీయాలని ఎన్ని సార్లు ప్రయత్నించానో ! నా చేతిలో కెమేరాను ఓ కొంటె కోణంగి చూసి తుర్రు మంటుంది . అంతే దాని వెనకాలే అన్ని రెక్కలు టపటప లాడించుకుంటూ లేచి వెళ్ళిపోతాయి . మిమ్మలిని గన్ తో షూట్ చేయటం లేదే బుజ్జి తల్లులూ , ఇది కెమేరా అని ఎంత వేడుకున్నా వినవు ! విశ్రాంతి తీసుకుంటున్న వాటికి అంతరాయం కలిగించటము ఎందుకులే అని వూరుకుంటున్నాను . అంతే గా ? ఇంకేమి చేయగలను ?

ఈ బుజ్జి పిట్టలను చూస్తుంటే చిన్నప్పుడు పాడుకున్నపాట ,
బుర్రు బుర్రు పిట్ట తుర్ర్ మన్నది ,
పడమటింటి కాపురమ్ము చేయనన్నది ,
అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది ,
మామ తెచ్చిన మల్లె మొగ్గ ముడవనన్నది ,
మొగుడి చేత మొట్టికాయ తింటనన్నది !!!!!
అన్న పాట గుర్తొచ్చింది :)))))

Saturday, March 19, 2011

సూపర్ మూన్ మా ఇంటికి వచ్చిన వేళ



సూపర్ మూన్ . . . సూపర్ మూన్ అంటూ వారం రోజుల నుండి టి. వి లు , పేపర్ లు హోరెత్తిస్తూ వూరిస్తున్నాయి . అదేమిటో చూద్దామని సాయంకాలం 6 . 30 కు మా డాబా పైకి వెళ్ళాను . ఆకాశమంతా లేత నీలి రంగు , ఆరెంజ్ రంగు లో వుంది . చంద్రుడేమో ఎర్రగా మెరిసిపోతూ ఇదో ఇలా దర్శనం ఇచ్చాడు . కాని అదేమిటో ఫొటోలో మటుకు ఆకాశం నల్లగా వచ్చేసింది !



7.30 కు కొబ్బరాకుల చాటు నుంచి ఇలా వచ్చేసాడు !



8.30 కు మా హాల్ లోకి వచ్చేసాడు :) ఫ్లాష్ తో ఓ రకం గా , ఫ్లాష్ లేకుండా ఆకుపచ్చగా బాగున్నాడు కదూ :))



అది రాత్రి 11 గంటల సమయము . చంద్రుడు ఎలా వున్నాడో చూద్దామని బాల్కనీ లోకి వచ్చాను . ఓహ్ ఒక్క నిమిషం ఊపిరి ఆగిపోయిందా అనిపించింది ! కలా నిజమా ????? నన్ను నేను గిల్లుకున్నాను . అబ్బా * * * నక్షత్రాలు కనిపించాయి .కాదు కాదు మా బాల్కనీలోకి చందమామ వచ్చేసాడు . తెల్లగా మెరిసిపోతున్నాడు . నిజం . . . సత్తెం ప్రమాణికంగా , , , సచ్చీ ఇదో ఇలా దిగి . . . వచ్చేసాడు !!!!!!!! ఆకాశం లో అలా , బాల్కనీ నేల మీద ఇలా * * * * *



చంద్రుని మీద అడుగేసి ఓ పెద్ద రోదసీ యాత్రికురాలును అయినట్లుగా ఫీలైపోయాను . కాకపోతే నా పాదము మీద చంద్రుని ఫొటో తీయటము నా వల్ల కాలేదు . స్చప్ ఏం చేస్తాను ? నాతో పాటు చంద్రుని మీద గెంతేందుకు నా మనవలూ దగ్గరలేరు హుం . . .

Friday, March 18, 2011

వీడ్కోలు



వస్తావు వస్తావు అని ఎన్నెన్ని ఎదురు చూపులు చూసాను
అలిగి జారిన కొప్పులో మల్లెలు ముడవనే లేదు
ఆనందము తో హృదయము నిండనే లేదు
కనులారా నిన్ను కాంచనే లేదు
అప్పుడే మరలి వెళ్ళిపోతావా
చూడు చూడు మబ్బు చాటునుండి చందురుడు ఎలా వెక్కిరిస్తున్నాడో
ప్రియతమా నీకిది తగునా
వెళుతూ వెళుతూ వీడ్కోలు మాత్రము చెప్పకు
నీ వీడ్కోలును నేను భరించలేను .
_ _ _ _ _ _ _ _


(నెట్ లో ఏదో బొమ్మ కోసము వెతుకుతుంటే ఈ కొమ్మ నా కంట బడింది . చూడగానే చాలా నచ్చేసింది . ఎంత అంటే ఓ కవిత రాద్దామూ అన్నంతగా :) స్చప్ . . . మనము కవితలు అల్లటము లో చాలా వీకే ! పైగా ఏమి రాసినా రవి వర్మ బొమ్మకు న్యాయం చేయలేక తిట్ట్లు తింటానేమో అనే ఓ భయమూ లేకపోలేదు .( అంటే ఇప్పుడు న్యాయము చేసానని కాదు . ఓ ప్రయత్నం చేసానంతే ) కాని అలా వదిలేయ బుద్దీ కాలేదు :) సూపర్ మూన్ రోజులలో ఏ సూపర్ డూపర్ ఐడియా ఐనా రాకపోతుందా అన్న ఆశ కూడా అడియాశ ఐంది . ఎన్ని కథ లు ఆలోచించినా అవన్నీ ఇంతకు ముందు నేను చదివిన వాటిలాగే అనిపించాయి ! అందుకే మా ఫ్రెండ్స్ ను అడిగాను . మంచి అమ్మాయిలు అడగగానే రాసి ఇచ్చారు . మరి నేనూ ఓ ప్రయత్నం చేద్దామనుకొని ఇది రాసా :))) మరి దీని ని కవిత అంటారో , వచనమంటారో నాకైతె తెలీదు . )

మంజు , శ్రీ థాంక్ యు .

మా జయ కూడా ఈ రోజు రాసేసింది ! థాంక్ యు జయా .

తృష్ణ గారు థాంక్స్ అండి .

శ్రీలలితగారు కూడా రాసేసారు . థాంక్స్ అండి .

లక్కరాజు గారి కవిత ఇక్కడ . లక్కరాజు గారు థాంక్స్ అండి .

జ్ఞానప్రసూన గారు సురుచి లో రాశారు .

దేవి ప్రభాతకమలం లో మూడు విధాలు గా తన భావనను వ్యక్తీకరించింది .

జ్ఞానప్రసూనగారు , దేవి థాంక్ యు .

Tuesday, March 15, 2011

చెప్పు తెగుద్ది !!!!!



అప్పటికే డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చిన టైం ఆపోవస్తోంది . ఎంత తొందరగా బయిలు దేరుదామనుకున్నా చివరి నిమిషము లో ఏదో వక పని . ఆలశ్యం అవనే అవుతుంది . పైగా ఈ ట్రాఫిక్ ఒకటి ! ఆలశ్యం ఐందంటే డాక్టర్ తరువాత వాళ్ళను పిలుస్తాడు . అందరి చెకప్ లూ అయ్యేవరకూ వుండి , ఆ తరువాతా డాక్టర్ గారికి టైం వుంటే చూస్తాడు . లేదంటే ఊసురో మంటూ మళ్ళీ రేపు రావలసిందే . ఆలస్యం చేసిన మా పనమ్మాయి శైలజ నూ , ట్రాఫిక్ నూ తిట్టుకుంటూ గబ గబా నడుస్తున్నాను . నావెనుకనే శైలజ స్పీడ్ గా వచ్చేస్తోంది . ఇంతలో ఎవరో మా స్పీడ్ కు బ్రేకేశారు . గబుక్కున ఆగిపోయాను . నాతో పాటే ఆగబోయిన శైలజ కిందపడబోయి , నన్ను పట్టుకొని ఆగిపోయింది . ఆ ఊపులో నా చెప్పులో కాలేసింది . అంతే " పుటుక్ " * * * * *
నా చెప్పు తెగిపొయి నేను కిందబడబోయి ఎలాగో బాలెన్స్ నిలుపుకున్నాను ! పక్క నుంచి ఎవరో " కిసుక్ " * * * * *
వాళ్ళ వైపు కొంచం సీరియస్ గా , కొంచం నవ్వు మొహం తో ( అవును మరీ కాస్త నవ్వు మొహం పెట్టక పోతే ఎలా ?) చూసి , నా గొలుసు తీసి చూసుకున్నాను , పిన్నీస్ ఏమైనా వుందా అని . లేదు . శైలజ గొలుసు తీసి చూశాము . ఊమ్హూ లేదుగాక లేదు ." చమక్ " * * * మంటూ గుర్తొచ్చింది , ఆ మద్య నేను సుల్తాన్ బజార్ లో బేరమాడి కొన్న పిన్నీసులు నా పర్స్ లోనే వుండాలి అని . వెంటనే పర్స్ తీసి చూసాను . వున్నాయి . అమ్మయ్య గండం గడిచింది అనుకుంటూ పిన్నీస్ తీసా . ఇటివ్వండమ్మా నేను పెట్టిస్తాను అంది శైలజ . చి చీ నువ్వు నా చెప్పు ముట్టుకోవటమేమిటి వద్దులే అని నేనే పిన్నిస్ ను చెప్పుగారికి అలంకరించి ఉస్స్ అనుకుంటూ , ముందు ముందూ ఇంకా బోలెడు ఉస్స్ బుస్స్ లున్నాయని తెలీక పాపం ముందుకెళ్ళాను .

ఎదురుగా మెట్లు లేకుండా జారుడు బండ లాంటి స్లోప్ నవ్వుతూ ఆహ్వానించింది . అయ్యో రామా అనుకుంటూ చిన్నగా ఎక్కాను . పక్కన లిఫ్ట్ వుందమ్మా అంది అక్కడ వున్న ఆయా . తెలుసు తల్లీ తెలుసు , పక్కన లిఫ్ట్ వుందనీ తెలుసు , అది క్లోజ్డ్ లిఫ్ట్ అనీ తెలుసూ అని స్వగతం అనుకుంటూ ఆయా మాట విననట్లుగా పైకి నడిచా . మూడు అంతస్తులు ఎలా ఎక్కాలో అనుకుంటూ వుండగానే మళ్ళీ " పుటుక్ . . . " మళ్ళీ శైలజ ' అమ్మా ఇటివ్వండి . . . . ." మళ్ళీ నేను " చీ చీ . . . . . " సరే మొదటి అంతస్తు ఎక్కాము . మళ్ళీ హిస్టరీ రెపీట్సూ . . . . . శ్రీరామ చంద్రా నారాయణా ఎన్ని కష్టాలు పెట్టావురా తండ్రీ . . . . . అడుగడుగునా హిస్టరీ రిపీట్సే !!!!!!

అమ్మయ్య ఎలాగైతే నేమి శ్రీరామచంద్రుడు డాక్టర్ దగ్గరకు చేర్చాడు . డాక్టర్ ఏమి చెప్పాడో నేనేమి విన్నానో ఆ శ్రీరాముడికే తెలియాలి , అవును మరి చిత్తం శ్రీరాముడి మీద భక్తి చెప్పులమీదాయే !

మళ్ళీ తిరుగు ప్రయాణం జారుడు బండ మీద . సేం ఓల్డ్ స్టోరీ ! ఈ సారి విసుగొచ్చి శైలజా ఎక్కడైనా డస్ట్ బిన్ వుందేమో చూడు ఈ వెధవ చెప్పులని పారేస్తాను అన్నాను .
" అమ్మా . గేట్ దగ్గర రోడ్ మీద తారు ఇప్పుడే పోసారు . ఎండకు కరిగి వుంటే , మీరు రోడ్ దాటి కార్ లోకి ఎలా వస్తారు ? "
ఓహ్ నిజమేకదూ ! ఆ తారు లో పాదం కూరుకు పోయినా , ఈ జారుడు బండ మీదనుంచి నేను జారినా ఈదరం బోయి బాదరం చుట్టుకుంటుంది ! అసలే నీరసం గా వున్నాను . ఆపైన ఇదొకటి . నేను జారబోవటము , శైలజ పట్టుకోవటము , పట్టుకుంటూ సారీ అమ్మా నామూలంగానే మీరు ఇబ్బంది పడుతున్నారు అంటమూ ఏమి చెప్పాలి నా కష్టాలు పగవాళ్ళంటూ ఎవరైనా వుంటే వాళ్ళకు కూడా వద్దు . ఎలాగో కిందకి దిగాను . లాంజ్ లో కూర్చున్న వాళ్ళ జాలి చూపులను తప్పించుకుంటూ శైలజను పట్టుకొని కుంటు కుంటూ నడుస్తూ వుంటే అటుగా వచ్చిన వార్డ్ బాయ్ శైలజ తో

" అలా మేడం వెనుకే నడుస్తావేమిటి ? నీ కాలు పడిందంటే మేడం చెప్పు తెగుద్ది " * * * * *

Thursday, February 17, 2011

ఈ పోస్ట్ అమ్మాయిలకు మాత్రమే ! అబ్బాయిల కు ఎంతమాత్రము కాదు గాక కాదు !!!



ఎందుకో తలెత్తి ధీర్ఘం గా అలోచిస్తూ వుంటే , , , , , పై కిటికీ లోనుంచి చంద్రుడు కనిపించాడు . అరె ఎల్లుండి కదా పౌర్ణిమ అప్పుడే ఇంతబాగా వెలిగిపోతున్నడేమిటి చెప్మా అనుకొగానే , , , చమక్కుమని గుర్తొచ్చింది ఈ సారి మాఘపౌర్ణిమ అని . ఏమిటో ఈసారి మఘమాసం వచ్చింది కూడా గుర్తుంచుకోలేదు ! చిన్నప్పుడు అమ్మమ్మ , పెరట్లో తులసి గట్టు మీద , రధసప్తమికి , మాఘపౌర్ణిమ కు పాలు పొంగించి , చిక్కుడాకులలో పాయసం నైవేద్యం పెట్టి , అబ్బ . . ఎంత కమ్మగా వుండేదో ఆ పాయసం స్స్స్స్స్స్ . . . . . అబ్బ నోరూరిపోతొంది . నా పెళ్ళైయాక కూడా ఆ అలవాటుపోలేదు . అదే పాలు పొంగించటము , పాయసం వండటము . . . చిక్కుడాకులలో నైవేద్యమూ . . లొట్టలేసుకుంటూ తినటమూ . . . ఆ ((( అది నా గొప్పేమీ కాదు , మా అత్తగారికీ ఆ అలవాటు వుండటము వల్ల అలా కొన్సాగిందన్నమాట . కాక పోతే మా అత్తగారు రెండు గిన్నెలలో పొంగించేవారు . పిడకల తో వెనుక సందు బండల మీద రెండు పిడక పొయ్యి (?) లు చేసి వాటి మీద రెండు ఇత్తడి గుండు గిన్నెలు పెట్టి పొంగించేవారు . ముందు రోజు సాయంకాలమే ఆ బండలన్నీ బోలెడు సర్ఫ్ , సోడా వేసి శుభ్రంగా కడిగించేవారు . పొద్దున్నే మా మామగారు కేశవమెమోరియల్ స్కూల్ దగ్గర , పాలు పితికేవారి దగ్గరకు వెళ్ళి , స్వయం గా పాలు తెచ్చేవారు . మాఘమాసం లో అదివారాలు , రధసప్తమి , పౌర్ణిమ అన్ని రోజులూ పాలు పొంగించేవారు . అప్పుడు పిల్లలంతా అక్కడే కూర్చొని ఆవిడ చేసే పూజ శ్రద్ధగా చూస్తూ , ఆవిడ చెప్పే కథలకు ఊ కొడుతూ వుండేవారు . అది పూజ మీది శ్రద్దా ???లేక కథ మీద శ్రద్దా ??? లేక పాయసం మీద శ్రద్దా ?? ? అంటే చెప్పటము కాస్త కష్టమే :)



శ్రావణ శుక్రవారము , మంగళగౌరీ వ్రతము తప్ప , కొత్త పెళ్ళికూతురుల తో ఏవైనా నోములు నోమించాలంటే , రధసప్తమి రోజున , ఆ రోజు వీలుకాకపోతే మాఘపౌర్ణమి రోజు న , అప్పుడూ వీలుకాకపోతే మాఘపాదివారము రోజున నోమించటము మాకు ఆనవాయితి . మా పెళ్ళైన మొదటి రధసప్తమి రోజున నాతో పదహారుఫలాల నోము పట్టించారు మా అత్తగారు . ఆ మద్య , మావారి మేనత్త రధసప్తమి రోజు మా ఇంట్లో వున్నారు . అపుడావిడ , మీ అత్తగారు పట్టించిన నోములేనా , నువ్వు ఇంకేమైనా పట్టావా అన్నారు . ఏదండి , ఇప్పుడు మీరు , పెద్ద ముత్తైదువ ఇక్కడ వున్నారుగా కొత్తవి చేస్తా అన్నాను . ఆవిడా ఉత్షాహం గా తలూపారు . అంతే ఇద్దరమూ శకరమఠం కు వెళ్ళి అక్కడి నుంచి ఇదో ఈ పుస్తకం , ఇంకా పూజా సామగ్రీ కొనుక్కొచ్చేసాము . ఆవిడ అందులోనుంచి , చిట్ట్టిపొట్టీ నోములు ఏరి పెట్టారు . ఇహ బోలెడు నోములు నోమేసుకున్నాను . అదే ఉత్సాహం లో మా అమ్మాయి తోనూ , కోడలి తోనూ పదహారుఫలాల నోము నోమించేసా ! రోజూ పసుపు కుంకుమ , తాంబూలం తీసుకొని పక్కిళ్ళకు వెళ్ళి వాయనాలిస్తుంటే , అబ్బా మీరు ఎంతా బాగా నోముకుంటున్నారండి . ఎంత శ్రద్దగా చేసుకుంటున్నారండి అని అందరూ మెచ్చుకోవటమే ! అదేమిటో నేనేది చేసినా అందరూ అలా మెచ్చేసుకుంటారు :)

స్చప్ . . . ఆ ధిష్టే కొట్టిందో ఏమో ( బుగ్గన చేయి ) రెండు సంవత్సరాల నుంచి ఏమీ చేసేందుకు ఓపిక లేకుండా పోయింది . ఈ రధసప్తమి కి ముందు శారడ ఫోన్ చేసి అమ్మా , రధసప్తమి రోజున , రధం ముగ్గు మన ఇంట్లోకి వచ్చేట్టుగా వేయాలి కదా మర్చిపోకండి శైలజకు చెప్పండి అని గుర్తుచేసింది . అవును సంక్రాంతి ( కనుమ ) రోజున రధం ముగ్గు వేసి పక్కింటికి కలుపుతారు . అలా వూరంతా కలుపుకుంటూ , వూరి చివరనున్న గ్రామ దేవత గుడి కి తీసుకెళుతారు . అలా చేస్తే వూరు సుభిక్షం గా వుంటుంది అంటారు . అదే రధసప్తమి రోజున , రధం ముగ్గు మన ఇంట్లోకి రధం వస్తున్నట్లుగా వేయాలి . అప్పుడు ఆ రధం మీద సూర్యభగవానుడు మనైంట్లో కి వచ్చి ఆరోగ్యం ప్రసాదిస్తాడుట . హుం . . శారద గుర్తు చేసినా నేను మర్చిపోయాను ((( . . .

ఇదిగో కొత్తగా పెళ్ళైన , పెళ్ళి కావలసిన అమ్మాయిలూ , ఇలా బ్లాగులలో , బజ్ లలో అల్లరి చాలించి ఇలా వచ్చేయండి . రేపు మాఘ పౌర్ణిమ . ఎంచక్కా అందరమూ నోములు నోచుకుందాము . మీ అందరి తో నోమించేందుకు పెద్దవాళ్ళము వున్నాము వచ్చేయండి . ఆ ఆ లక్ష్మి గారూ , మీరేమీ పని చేయక్కరలేదండి . మీ మార్కు జోకులేస్తూ అందరితో పూజ చేయించేయండి . అందరినీ చూసుకునేందుకు శ్రీలలిత గారు , జ్యోతి గారు వున్నారుగా . ఐనా మనం వంటలు , పని చేయటమెందుకండి . ఈ పిల్లలే తలా వొకటి తెస్తారు . ఎవరదీ ? నేను చాక్లెటే తెస్తా , మా ఆయన చూసొకటి చూడకొకటీ నోట్లో ఆడించటము నా అలావాటు అంటారా . అలాగే గౌరమ్మ మటుకు చాక్లెట్ తినదేమిటి ?

ఎవరా బుంగమూతి ? నా మొగలి జడా అనా ? అలాగే అమ్మా మరి సుజాత గారింటి కుండిలో మొగలిపువ్వు విచ్చుకుందేమో తెచ్చేసుకో , జడ వేయటమెంత సేపు అరగంట పని !

ఓ అమ్మాయి లంగామీద డిజైన్ కుట్టుకుంటున్నానంది . ఐందా అమ్మడూ ? ఎంచక్కా ఆ పట్టుపరికిణీ వోణీ వేసుకొని వచ్చేయ్ మరి .
అందరికీ పేరు పేరు నా ఇదే పిలుపు . ఏంచేయను నాకు కొన్ని పేర్లే గుర్తుంటాయి . అన్నీ చప్పున గుర్తురావు . అందుకని ఎవరూ అలగకుండా అందరూ వచ్చేయండి . తెల్లవారు ఝామునే చక్కగా తలంటుకొని వచ్చేస్తే , మా డాబా పైన ఉయ్యాల లేయించాను ఊగొచ్చు . గోరంటాకు పెట్టుకోవటము మర్చిపోకండేం ! మెరిసిపోతున్న వెన్నెల్లో , కిల కిలా రావాల తో అమ్మాయిలు . . . . . జయా నువ్వు కాస్త త్వరగా వచ్చేయి అమ్మవారి అలంకరణ చేయాలిగా .

ఎంతపని వుందో !!! అన్ని రెడీ చేసి పెడతాను వచ్చేయండమ్మ .

( అబ్బాయిలూ టైటిల్ చూసి ఏదో వూహించుకొని , ఇటుతొంగి చూసి నిరాశ పడితే నాది బాద్యత కాదు . ఇది అచ్చంగా అమ్మాయిలను పేరంటానికి పిలుపే ! )

Tuesday, February 15, 2011

Friday, January 28, 2011

బడిచావిడీ /సుల్తాన్ బజార్ ప్రేమికులారా * * * * *



నేను టెంత్ చదువుతున్నప్పుడు మొదటి సారిగా హైదరాబాద్ వచ్చాను . అప్పుడు మా నాన్నగారు టాక్సీ లో గోల్కొండ కోట , సాలార్జంగ్ మ్యూజియం , ఎక్జిబిషన్ చూపించారు . ఎక్జిబిషన్ లో చక్కటి వెండి గొలుసు , ఓ లంబాడి అమ్మాయి బొమ్మ కొనిచ్చారు . ఆ మరునాడు మా చెల్లాయిపిన్ని మమ్మలిని బడి చావిడీ , సుల్తాన్ బజార్ తీసుకెళ్ళింది . అమ్మ కృష్ణా క్లాత్ స్టోర్స్ లో చీరలు కొంటూ వుంటే నేను బయట నిలబడి బజారంతా చూసాను . అదో అప్పుడే సుల్తాన్ బజార్/ బడి చావిడీ తెగ నచ్చేసింది . ఆ తరువాత రెండేళ్ళకు పెళ్ళై హైదరాబాద్ వస్తానని కాని , సుల్తాన్ బజార్ చూస్తానని కాని అప్పుడూహించలేదు గా :) అందుకే కళ్ళు విప్పార్చుకొని మరీ చూసాను !!!!

పెళ్ళై వచ్చాక మా అత్తగారి తో మొదటి సారిగా బడి చావిడీ హనుమాన్ జీ గుడి కి వెళ్ళాను . అప్పటి నుంచి బడి చావిడీ / సుల్తాన్ బజార్ ల తో విడతీయరాని అనుబంధం ఏర్పడి పోయింది . షాపింగ్ ఇప్పటికీ సుల్తాన్ బజార్ వెళ్ళాలసిందే . కొత్తిమీర కట్టలు , పిన్నీసులు అమ్మే వాళ్ళ నుంచి తప్పించుకుంటూ షాపింగ్ చేసుకోవాలంటే ఎంత నైపుణ్యం కావాలి ? చక చకా జనాలను తప్పించుకుంటూ నడుచుకుంటూ వెళుతుంటే పెద్ద విజేత ననే ఫీలింగ్ రాదూ ! చాలా సార్లు సాయంకాలం టాప్ తీసేసిన రిక్షాలో దిక్కులు చూసుకుంటూ వెళ్ళేదానిని .కాసేపు అలా అలా రిక్షా లో , ఇంకాసేపు నడుచుకుంటూ వెళుతూ వుంటే అబ్బో అదో ఆనందం ! ఇప్పటికీ అప్పుడప్పుడు వెళ్ళి ఓచుట్టు తిరిగి వస్తాను . ఓ సారి మా అదితి ' అమ్మమ్మా బోర్ కొడు తోంది ' అంటే సుల్తాన్ బజార్ తీసుకెళ్ళాను . అబ్బ సూపర్ వుంది అన్నది , మా మనవరాలు . మా మనవళ్ళను రిక్షా ఎక్కిద్దామని , డబుల్ డక్కర్ బస్ ఎక్కించాలని నాకు చాలా వుండింది . కాని అవి కనుమరుగై పోయాయి ! స్చప్ . . .

నా పెళ్ళి పట్టు చీరలు నీలకంఠం బాలకృష్ణయ్య షాప్ప్ లో కొనటము తో అక్కడ నా షాపింగ్ మొదలైంది . ఆ రోజు నాకింకా జ్ఞాపకమే ! మావారి అక్కయ్య , అత్తయ్య , నేను , మా అమ్మమ్మగారు వెళ్ళాము . మేము బయిలుదేరే ముందు , మా అమ్మ పక్కకు తీసుకెళ్ళి , ' మీ ఆడపడుచు ఏది కొనిస్తే అది తీసుకో . ఈ చీర బాగుంది . ఇది బాగాలేదు అనకు ' అని చిలక్కు చెప్పినట్లు చెప్పినది . కాని అదేమిటో దుకాణం లో చీరలన్నీ ముందు వేయగానే , క్రీం కలర్ కు వైయ్లెట్ కలర్ బార్డర్ చీర నా మనసునును దోచేసింది . అప్పటి వరకూ మా ఆడపడుచు ఏ చీర చూపించినా మీ ఇష్టం అన్న దానిని , అది తీసి నా వళ్ళో పెట్టుకొనాన్నాను . ఇది కావాలి అనలేను , పక్కన పెట్టేయలేను ! మా అమ్మమ్మగారేమో ఆ చీర పక్కన పెట్టేయమని చిన్నగా నన్ను గిల్లుతున్నారు , అబ్బ ఎంత విపత్కర పరిస్తితి ! మా అడపడుచుకు తెలిసిపోయింది అది నాకు నచ్చేసింది అని . అది తీసుకుంటావా అని అడిగారు . ఊ అనీ అనకుండా అన్నాను . అంతే ఆ చీర నాకొచ్చేసింది . దాన్ని ఎన్ని సార్లు కట్టానో లెక్కలేదు . ఈ మద్యే దాని బార్డర్ తీసి , ఓ ప్లేన్ క్రీం కలర్ చీర కొని దానికి వేయించాను :)

ఏది కొనాలన్నా బేరం తప్పని సరి . చీటియేవాలే మౌజ్ ఆఠాణాకి డజన్ ఇస్తానంటే కాదు బారాణాకి ఇవ్వాల్సిందే నని వాడితో వాదించి , పోట్లాడి మరీ కొనుక్కున్నాను తెలుసా ! అంత బేరమాడాననేమో ఆ అరటిపళ్ళ వాడు ఇంకోసారి నాకు కనిపించకుండా దాక్కున్నాడు . అప్పటి కీ నేను పట్టేసి పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగెట్టాడు . అంత హడల్ మరి మనమంటే ! ఏమాటకామాటే చెప్పాలి మహాలక్ష్మీ బెంగాల్ చీరల అతను నేను వెళ్ళగానే కొత్త రకాల చీరలు తీసి చూపించేవాడు . ఎంత బాగుండేవో . 15 రూపాయలకు మామూలివి , 25 రూపాయలైతే ఇంకాస్త మంచివీ చూపించే వాడు . 25 రూపాయల చీర కొని , కాలేజ్ కి కట్టుకెళితే మా ఫ్రెండ్స్ , ఇంత కాస్ట్లీ చీర కాలేజీ కి కట్టుకొచ్చావా అని కోపం చేసేవారు :) కృష్ణా లోనూ అంతే 15 రూపాయలకు సెమీ వాయిల్ , 20 రూపాయలకు హాఫ్ వాయిల్ , 30 రూపాయలకు ఫుల్ వాయిల్ చీరలు చక్కటి రంగులలో , వివిధ ప్రింట్స్ తో చూడ ముచ్చటగా వుండేవి . కూరగాయల మార్కెట్ లో నైతే దొరకని కూర లేదు . అన్ని రకాలు దొరుకుతాయి . బేరం తప్పని సరి ! కోటీ విశాలంద్రా ఇప్పటికీ నేను వెళ్ళే చోటు . కోటీ లోని ఖాదీ బండార్ షాప్ నుంచే మా మామగారు , ధోతులు , మంచం నవారు కొనేవారు . చాట్ తినాలంటే కోటీ షాలిమార్ వెళ్ళాల్శిందే.

ఎన్ని ఎన్నెన్ని జ్ఞాపకాలో ! అన్నీ కను మరుగై పోతాయట . మెట్రో లైన్ వేసేందుకు , బడి చావిడీ / సుల్తాన్ బజార్ లోని షాప్ లను పడగొడుతున్నారని , రూపురేఖలే మారిపోతున్నాయని , పేపర్ లో చదవగానే చాలా బాధ కలిగింది . నీలకంఠం దుకాణం , ఆర్యసమాజ్ , జేన్ భవన్ అన్నీ తీసేస్తారట . ఇంకో పది రోజులలో కూల్చివేతలు మొదలవుతాయట . దుకాణదారులంతా తీసేయొద్దు అని పిటీషన్ లు పెడుతున్నారట . ఇదంతా చదవగానే మనసు కలిచేసింది . ఏమో ఎంత మారిపోతుందో ఏమో అని , హడావిడి గా వెళ్ళి మా హనుమాన్ జీ ని చూసుకొని , బజారంతా కలియదిరిగి వచ్చాను . పనిలో పని 5 రూపాయలకు ఓ పిన్నీసు పాకెట్ ఇస్తే బేరమాడి పది కి మూడు కొనుక్కొని వచ్చాను !

నాలాంటి సుల్తాంబజార్ / బడి చావిడీ ప్రేమికులు ఎవరైనా వుంటే ఓసారి వెళ్ళీ చుట్టేసి రండి . ఎటొచ్చి ఎటుపోతుందో ! త్వరపడండి !!!!!

Thursday, January 6, 2011

నా 16 గురు అభిమానులకు విజ్ఞప్తి * * * * *



గౌరవ్ ను ఎత్తుకొని , మేఘ చేయి పట్టుకొని , గేట్ దగ్గర బెలూన్ వాడి దగ్గర బేరమాడుతున్నాను . గౌరవ్ ఆ (( ఊ (( అంటూ వాడికే బెలూన్ కావాలో చూపిస్తున్నాడు . అవును మరి ఇది గౌరవ్ కు ఇంకా మాటలు రానప్పటి సంగతన్నమాట ! మా గేట్ ఎదురుగా వున్న కాంపౌండ్ గోడ దగ్గర వరుసగా చాలా బైక్ లు పార్క్ చేసి వున్నాయి . అందులో ఓ బైక్ మీద ఓ అమ్మాయి అటు తిరిగి కూర్చొని వుంది . ఆ అమ్మాయికి ఎదురుగా ఓ అబ్బాయి ఆ అమ్మాయి మీదకు వాలిపోతూ , ఇంచుమించు ఒకరి మీద ఒకరు పడిపోయి , చుట్టుపక్కల ద్యాస లేకుండా కువ కువ లాడుతున్నారు . ఆ అమ్మాయిని చూస్తూ మేఘ హే . . . బామ్మా లుకెట్ దట్ గర్ల్స్ హేయిర్ . సో లాంగ్ అని చూపించింది . అసలు వాళ్ళిదరినీ చూసేందుకే ఇబ్బంది పడుతూ , బెలూన్లు ఎంత తొందరగా కొనేసి , ఎంతతొందరగా ఇంట్లోకి పిల్లలను తీసుకెళిపోదామా అన్న తొందరలో నేను ఆ అమ్మాయి జుట్టు చూడలేదు . చక్కగా , బారుగా , పెద్ద పోనిటేల్ వేసుకొని వుందామ్మాయి . నేనూ ఆ జుట్టును మైమరచి చూస్తుండగానే , బెలూన్ వాడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు . ఇంతలో ఓ నలుగురు అబ్బాయిలు అక్కడి కొచ్చి ఆ అమ్మాయి జడను పట్టి గుంజుతూ గోల గోలగా అరుస్తున్నారు . ఆ అమ్మాయి ఎదురుగా అప్పటి వరకు కువ కువ లాడుతున్న అబ్బాయి వాళ్ళను నెట్టేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు . అమ్మాయేమో కీచుగా అరుస్తోంది . సినిమాలల్లో తప్ప , బయట అలాంటి దృశ్యము చూడనినేను నిశ్చేస్టనయ్యాను . ఏమి చేయాలో తోచలేదు . పక్కన ఇద్దరు చిన్న పిల్లలు . . . ఇంట్లో ఇంకెవరూ లేరు . . . పనమ్మాయి శారద బజారుకెళ్ళింది . మేఘ , గౌరవ్ కూడా వాళ్ళ బెలూన్ ల మాట మరిచి అటేచూస్తున్నారు . . . ఇంతలో ఆ అమ్మాయి గిర్రున ఇటుతిరిగింది . . .వెంటనే మా మేఘ హే . . .బామ్మా షి ఈజ్ నాటే గర్ల్ . హి హీజె గై అని గట్టిగా అరిచింది . ఆ అబ్బాయిలూ మావైపు నవ్వుకుంటూ చూసి , మా పక్కింట్లోకి వెళ్ళిపోయారు ! ఇంతలో శారద వచ్చి , మమ్మలిని అలా చూసి ఏమైందమ్మా అంది . నేను లోపలి కెళుతూ జరిగింది చెప్పాను . ఓ వాళ్ళా అమ్మా వాళ్ళు సినిమాలలో , టి . వీ సీరియలస్ ల లో విలన్ దగ్గరుండే రౌడీ గాంగ్ వేషాలు వేస్తారు . మన పక్కింట్లో సినిమా కంపెనీ వుంది . అక్కడ విలన్ ల కు ట్రైనిగ్ ఇస్తూవుంటారు అని వివరించింది . అంటే మేము విలన్ డెన్ పక్కన వున్నామన్నమాట !!!!!!!

శారద పిల్లలను ఆడిస్తూ వుంటే , నేను బాల్కనీ లో కూర్చొని పుస్తకం చదువుకుంటూ వున్నాను . ' ఆంటీ , ఇక్కడ ఇల్లు అద్దె కు వుందా ? ' అని వినిపించింది . తలపైకెత్తి చూస్తే , మా గేట్ ముందు నలుగురబ్బాయిలు , వాళ్ళ వెనుక ట్రాలీ లో సామాన్ లూ కనిపించారు . లేదు బాబూ అని నేను అనగానే అందులోని ఓ అబ్బాయి ఏదో సైగ చేసాడు . వీడి దుంపతెగ , ఈ పోరగాడేమిటి , ఇలా సైగచేస్తున్నాడు అని కోపం గా అరవబోయాను . అప్పుడే పైకి వచ్చిన శ్రీధర్ , ' మేడం అది షూటింగ్ . ఎవరో టి .వి సీరియల్ వాళ్ళు మన గేట్ బాగుందని దాని ముందు షూటింగ్ చేసుకుంటున్నారు . మిమ్మలిని అడగటములేదు అని సైగ చేస్తున్నాడు ఆ అబ్బాయి ' అన్నాడు . హోరినీ అనుకొని నేనూ చూస్తూ కూర్చున్నాను . అలా సాయంకాలం వరకూ , మా కాలినీలో వున్న ఇళ్ళ ముందు ఆ షూటింగ్ చేస్తూ కనిపించారు . ఆ సీరియల్ పేరు , ఈ భాగం ఏ రోజు వచ్చేది , అసలు ఈ సీరియల్ ఏ చానల్ లో వచ్చేదీ భోగట్టా కనుక్కొని వచ్చింది మా వంటావిడ సావిత్రి . అసలే ఆవిడకు సినిమా వాళ్ళను చూడటము తెగ పిచ్చి . గణపతి కాంప్లెక్స్ దగ్గర ఎవరైనా వున్నారంటే చాలు వుడుకుతున్న వంట కింద ఆర్పేసి అటుపరుగెత్తుతుంది . అక్కడ ఎప్పుడూ ఎవరో వకరు , ముఖ్యంగా సాయంకాలమైతే కిట కిట లాడుతూ టి. వీ ల వాళ్ళు వుంటూనే వుంటారు . వాళ్ళను మైమరచి చూస్తూ , కొండకచో కొంతమందిని పలకరిస్తూ వంట సంగతి మర్చిపోతుంది ! అక్కడ వాళ్ళున్నారు , వీళ్ళున్నారు అని చెప్పకు అని శారదను , శ్రీధర్ నూ కోపం చేస్తాను . వాళ్ళేమో చెప్పక పోతే సావిత్రీ ఆంటీ తిండి పెట్టదని భయపడి చెప్పేస్తారు . సరే మా గేట్ ను టి. వీ లో చూసుకుందామని , అప్పటి నుంచి ఆ సీరియల్ ఇదో వస్తుంది , అదో వస్తుంది అని , టి. వి ని కళ్ళు లాగేటట్టు , తల పగిలిపోయేట్టు చూసి విసుగొచ్చి ఆఫ్ చేయగానే , మొహమింత చేసుకొని సావిత్రి పైకొచ్చి , మన గేట్ , మిగితా వాళ్ళ గేట్ కంటే బాగా వచ్చిందండి . ఎంత బాగుందో అని చెప్పింది . నేను అయ్యో నేను ఇంకాసేపు చూడాలిసిందే అనుకున్నాను ((((((

ఇలా అడపా దడపా ఎవరో , నువ్వు టి . వి లో చూడలేదా ? బాగా చూపించారనటము , పలానా న్యూస్ టి. వి లో చూపించారుగా అని చెప్పటమూ విని నేను కొన్ని రోజులు టి .వి పెట్టి దాని ముందు సెటిలైపోతాను . అదేమిటో నేను చూసినన్ని రోజులూ ఏ ఎక్సైటింగ్ న్యూసూ రాదు . పైగా కింద రెండు స్క్రోలింగ్ న్యూస్లూ , వాటి మీద బ్రేకింగ్ న్యూస్ , ఆపైన ఇంకో న్యూసూ , మద్య లో కని కనిపించకుండా మనుషులూ . . . అసలు ఎటుచూడాలో , ఏ న్యూస్ చదవాలో తెలీక కళ్ళను గిర్రున తిప్పుతుంటానా . . . కళ్ళు గిర్రున తిరగటము , అసలు మామూలుగా కూడా ఎటు చూస్తున్నానో తెలీక పోవటము , చక్కరొచ్చినట్లు వుండటము , మెడ నొప్పి మొదలైనవి వస్తాయి . మొదట్లో తెలీక ఏరోగమొచ్చిందో ఏంపాడో అని భయపడి చచ్చి , మా కజిన్ డాక్టర్ .కుమారి దగ్గరి కెళ్ళి చూపించుకున్నాను . స్పాండిలైటిసేమో , ఇప్పుడే ఇట్లా వుంది అన్నావు కదా , ఓ రెండు రోజులు సూజెరాన్ వేసుకొని పడుకో తగ్గి పోతుందిలే అంది . అదేసుకున్నప్పటి నుంచీ మత్తు మత్తుగా వుంటుంది . ఐన అలానే వేసుకున్నాను . తగ్గిపోయింది . . . గాయబ్ . . . . అమ్మయ్య అనుకున్నాను . మళ్ళీ , ఎవరో దేని గురించో చెప్పటము . . . నేను టి వి ముందు . . . కళ్ళు గిర గిరా . . . సుజెరాన్ . . . మత్తు . . . హుం . ఇలా కాదు అనుకొని మా జయ కు చెప్పాను , నువ్వు ఎప్పుడైనా టి .వి చూస్తుండ గా ఏదైనా ఎక్సైటింగ్ న్యూస్ చూస్తే నాకు కాల్ చేసి చెప్పు . అప్పుడు నేను టి . వి చూసింగ్స్ అని . సరే నని తలాడించింది . తను చూడటము జరుగుతే వెంటనే పాపం కాల్ కూడా చేస్తుంది .

మరింకేమిటి ప్రాబ్లం ? అని విసుక్కోకండి 16 గురు అభిమానులు . ఆ సంగతే చెపుతున్నాను . ఆ న్యూసైపోయాకే నాకు తెలుస్తోంది అదేమిటి నువ్వు చూడలేదా ? నాకు కాల్ చేయలేదా అని మా జయ ను అడిగుతే ఎందుకు చేయలేదు సెల్ కు చేసాను , లాండ్ లైన్ కు చేసాను . తమరు బిజీ . ఫోన్ లిఫ్ట్ చేయరు అంటుంది . అరే సెల్ వున్నది ఎందుకు ? బయటకు వెళ్ళి నప్పుడు ఏదైనా అవసరముంటుందేమో నని కదా ? అందుకే దాన్ని పర్స్ లోనే పెడతాను . పర్స్ ఎక్కడుంటుంది ? అలమారాలో . అంతే కాని ఇంట్లో కూడా పర్స్ భుజానేసుకొని తిరుగుతానా ??? మరి లాండ్లైన్ మాట అంటారా ? నేను బయట బాల్కనీ లో కూర్చొని ఏ నవలో చదువుకుంటూ వుంటాను . లేదా లాప్ టాప్ లో ఏదో పని చేసుకుంటూ వుంటానా ?? అహ ((( వుంటానా లేదా ? మరి అప్పుడు అవి పక్కన పెట్టి చిన్నగా రావాలా వద్దా ? గబ గబా రావటానికి నేనేమైనా చిన్న దాన్నా చితక దాన్నా ? గబ గబ గా వస్తూ జారిపడితే ? పుటుక్కున ఎముక ఇరుగుతే ఎవరిది పూచీ ???? అహా ((((( అసలు ఎవరిదీ అంటా ?? నేనొచ్చేలోపలే కొంపలు మునిగిపోతునట్లు ఫోన్ పెట్టేస్తారు . మాకు కాలరైడి లేదు . మరి ఎవరు కాల్ చేసారో నాకెలా తెలుస్తుంది ? పోనీ అని హడావిడి గా వస్తానా అప్పుడేమో మేడం మేము ఫలనా బాంక్ నుంచి చేస్తున్నాము . మీకప్పిస్తాము అని తెగ మొహమాట పెట్టేస్తారు . లేదా ఏ చీర లో దుకాణం వాడో మా దగ్గర కొత్త స్టాక్ వచ్చింది . మా దగ్గర అరువుబేరం కలదు అంటారు . చిన్నప్పుడు ఆటల్లో మా దోస్త్ ,
తిందాం తిందాం ,
ఎక్కడ తెచ్చుకు తిందాం ,
అప్పు తెచ్చుకు తిందాం ,
అప్పెట్ల్లా తీరుద్దాం ,
ఎగ్గొట్టిపోదాం . అని ఐదు వేళ్ళూ చూపిస్తూ పాడేది . మరి అలా చేస్తే మా ఆయన నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టరూ ? ఈ ఫోన్ల కోసం అని నా ఇల్లు వదలలేనుగా ! ఎంతసేపూ ఫోన్ ఎత్తవూ , మాట్లాడవూ అంటారేగాని అర్ధం చేసుకోరూ !

అరే వస్తున్నా అసలు సంగతికి . ఉపోద్ఘాతం లేకుండా చెప్తే ఎలా అర్ధం అవుతుంది ? మొన్న పొద్దున నేను కాఫీ కలుపుతుండగా బయట నుంచి మా వారు ఘట్టిగా మాలా అని గావుకేక పెట్టారు . ఏమైందా అని హడలిపోతూ పరిగెట్టుకుంటూ వెళ్ళాను . నిన్న మద్దెల సూరిని హత్య చేసింది మన ఇంటి దగ్గరే చూడు అని పేపర్ చూపించారు . అవునా అని బోలెడు హాచర్య పోతూ పేపర్ చూస్తున్నానా , జయ ఫోన్ చేసింది . ఫోన్ ఎత్తగానే , నిన్న రాత్రి నుంచి ఎక్కడున్నావు తల్లీ ? ఫోన్ చేసి చేసి నీరసమొచ్చింది . టి. వి లో అంతా మద్దెలసూరి హత్య , యూసుఫ్ గూడా , గణపతి కాంప్లెక్స్ చూపిస్తున్నారు . మీరెలా వున్నారో , అసలు బావగారు వూళ్ళో వున్నారో లేదో , నువ్వెంత భయపడుతున్నావో నని , రాత్రి టి. వి లో న్యూస్ చూనప్పటి నుంచి నీ ఫోన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను అని గయ్ మంది . నేను ఆ టైం లో ఇంట్లోనే వున్నాను . మా ఫ్రెండ్స్ వస్తే మాజాంగ్ ఆడుతున్నాను . పనమ్మాయి శైలజ కూరలకోసమని గణపతి కాంప్లెక్స్ దాకా వెళ్ళి వచ్చింది కూడా . మాకసలు తెలీదు . నిన్న సూరి హత్య అయ్యింది అని మీ బావగారు చెప్పారు కాని ఆయన అలసిపోయివుండటము తో టి. వి పెట్టలేదు . ఇదో ఇప్పుడే పేపర్ లో చూస్తున్నాము అని చెప్పి ఫోన్ పెట్టేసాను .

ఏమండీ నిన్న మీరు వచ్చేటప్పుడు తెలీలేదా ? ఆ టైం లో వచ్చి వెళ్ళారుగా అని అడిగాను . అవును , గణపతి కాంప్లెక్స్ దగ్గర గుంపుగా మనుషులు , కెమెరాలూ , పోలీసులూ కనిపిస్తే ఏదైనా షూటింగేమో అనుకున్నాను అని జవాబిచ్చారు మావారు . శైలజ ను పిలిచి అడుగుతే అవునాండీ ?? ఇక్కడే జరిగిందాండీ ??? నేనుకూరలకెళ్ళేటప్పుడు రోడ్ మీద ఒక్కరూ లేరు . షాప్ ల లోనూ లేరు . ఎప్పుడూ కిట కిటలాడుతూవుంటుంది , ఇంత ఖాళీగా వుందేమిటా అనుకున్నానండీ అంటూ నన్ను మించి ఆశ్చర్యపోయింది !

హుం . . . మన ఇంటి పక్కనే హత్య జరుగుతే మనకు తెలీదు !

షూటింగ్ అనుకున్నారు మావారు హుం !

రాత్రంతా టి. వి లో మన చుట్టు పక్కల పరిసరాలు చూపిస్తే మనం చూడనే లేదు . హుం . . . హుం . . .

ఇప్పుడైనా చూడాల్సిందే నని రెండు రోజులుగా కళ్ళు తెరుచుకొని , కనురెప్ప మూయకుండా , గుడ్ళు పేలిపోయేట్టుగా . . . ఏఖధాఠిగా . . . టి. వి చూస్తున్నాను . ఏదో ఒక చానల్ లో చూపకపోతారా అని న ఆశ ! స్చప్ . . . ఆశా నిరాశేనా ? ఎప్పటికీ మా ఇంటి చుట్టు పక్కలను టి. వి లో చూడలేనా ????? లేదూ . . . లేదూ . . . లేదూ . . . ఇన్ని షూటింగ్స్ అవుతున్నాయి . ఇంతమంది చానళ్ళ వాళ్ళు వాన్ లలో తిరుగుతూ వుంటారు . ఏదో ఒక రోజు తప్పక చూస్తాను . . . అని కృతనిశ్చయముతో టి. వి ని చూస్తున్నాను . మళ్ళీ . . . కళ్ళు గిర గిరా . . . నో సుజెరాన్ . . . ఐనా సరే పట్టువదలని విక్రమార్కిణిలా టి. వి చూస్తూనే వున్నాను * * * చూస్తూనే వుంటాను * * * * *

కావున ఓనా 16 గురు అభిమానులారా (అవునూ , డాష్ బోర్డ్ మీద 16 గురున్నారు . బ్లాగ్ కొచ్చేసరికి 14 మందే వున్నారేమిటి ? అటునించి ఇటోచ్చేసరి ఇద్దరు ఎటుపరుగెడుతున్నట్లు ? ) . . . నా విజ్ఞప్తి ని ఆలకించండి . అదేమనగా కొన్ని రోజులు నాటపాలు రాకపోవచ్చు . అమ్మయ్య అనుకోకండి . నాకు తొందరోలోనే టి. వి లో మా ఇంటి పరిసరాలు కనిపించాలని నా తోపాటు ఆ భగవంతుని మీరూ ప్రార్ధించండి . అంతే కాని కనిపించకూడదు అని ప్రార్ధించకండి .

వాకేనా ???? ?

మరి వుంటా బై .