Thursday, November 10, 2011

స్పినాచ్ ఖావో శక్తి బడావో !ఓ బేద్ద రాచ్చసుడు , వికటాట్టహాసం చేస్తూ ఓ అమ్మాయిని చంకనిరికించుకొని పోతున్నాడు . . . . .
ఆ అమ్మాయి భయం తో కెవ్ . . . కెవ్ మని అరుస్తోంది . . . . .
ఇంతలో వచ్చాడు ఓ అబ్బాయి . ఆ రాచ్చసుడి తో డిషుం . . . డిషుం . . . అని యుద్దం చేస్తున్నాడు . కాని పాపం ఓడిపోతున్నాడు . . . . .
ఇంతలో పై నుంచి ఓ టిన్ ఆ అబ్బాయి దగ్గరకు వచ్చింది . దానిని ఓపెన్ చేసి , అందులో వున్న స్పీనచ్ ను తిన్నాడు .
హంతే . . . హాచర్యం . . . ఆ అబ్బాయి కి కండలు వచ్చి ,బళం వచ్చేసింది . అంతే . . . ఆ రాచ్చసుడి తో యుద్దం చేసి , ఓడించి ఆ అమ్మాయిని కాపాడాడు , ' పపాయా ద సేలర్ ' .
ఈ కథంతా చెప్పి ,
హూ . . . హా . . . " స్పీనచ్ కావో , శక్తి బడావో " అంటూ పరుపు మీద ఓ గెంతు గెంతి యుద్దం ఫోజ్ పెట్టాడు మా మనవడు .
" బామ్మా ! నా కిప్పుడే స్పీనచ్ పెట్టు " అని ఆర్డర్ వేసాడు .

కార్టూన్స్ తో కొన్ని సార్లు మంచి కూడా జరుగుతున్నదన్నమాట ! మరి మామనవడి శక్తి పెంచటానికి స్పీనచ్ తో వంటలు చేయొద్దు ! చేసి పెట్టాను :)

అవే మన వన భోజనాలకు కూడా తెచ్చాను . అందరూ ఎంచక్కా తినేసి , శక్తి ని పొందండి :))1. పాలక్ పూరి ;
రెండు పాలకూర కట్టలు ,
రెండు కప్పుల గోధుమ పిండి ,
వొక స్పూను వాము ,
కొద్దిగా కొత్తిమీర ,
ఓ పచ్చిమిరపకాయ ,
కొద్దిగా జీలకర్ర పొడి ,
సరిపడా ఉప్పు .
ముందుగా పాలకూరను శుభ్రం గా కడిగి , కట్ చేసుకోవాలి , పాలకూర , కొత్తిమీర , పచ్చిమిరపకాయ మిక్సీ లో వే పేస్ట్ లాగా రుబ్బుకోవాలి .
ఆ పేస్ట్ ను , వామును , జీల కర్రపొడిని , ఉప్పును గోధుమపిండిలో వేసి పూరీపిండిలా తడుపుకోవాలి . పిండి ని తడిపేందుకు ఆ పేస్టే సరి పోతుంది . ఒకవేళ తక్కువ అవుతే నీళ్ళు పోసుకోవచ్చు .
ఆ పిండి తో చిన్న చిన్న వుండలు చేసుకొని , పూరీలు వత్తుకొని కాల్చుకోవాలి .

2.పాలక్ రైస్ ;
రెండు గ్లాసులు బాసుమతి బియ్యం ,
మూడు కట్టలు పాలకూర ,
ఒక గ్లాస్ పాలు ,
మూడు గ్లాసులు నీళ్ళు ,
రెండు ఉల్లిపాయలు ,
కొద్దిగా దాల్చిని చెక్క , షాజీర , పెద్ద ఇలాచీ , చిన్న ఇలాచి , నాలుగు లవంగాలు .
రెండు స్పూన్స్ గరం మసాలా పొడి ,
సరిపడా ఉప్పు ,
పోపుకు నూనె .
ముందుగా బియ్యం ను కడిగి పక్కన పెట్టుకోవాలి .
పాలకూరను శుభ్రం గా కడిగి కట్ చేసుకొని , పేస్ట్ చేసుకోవాలి .
ఉల్లిపాయలను , సన్నగా పొడవుగా కోసుకోవాలి .
కుక్కర్ ను పొయ్యిమీద పెట్టి , అందులో నూనె వేయాలి . నూనె కాగాక దాల్చిని , లవంగాలు , షాజీర , లవంగాలు కొద్దిగా కచ్చా పచ్చాగా కొట్టిన పెద్ద ఇలాచీ , చిన్న ఇలాచీ వేయాలి . అవి వేగాక , ఉల్లిపాయముక్కల ను వేసి , లేత బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి . ఉల్లిపాయముక్కలు వేగాక , పాలకూర పేస్ట్ ను వేసి పచ్చివాసన పోయేట్లుగా వేయించుకొవాలి . ఆ తరువాత అందులో మూడుగ్లాసుల , నీళ్ళు , ఒక గ్లాసు పాలు పోయాలి . ఉప్పు గరం మసాలా పొడి వేసి , బియ్యం వేయాలి . బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి , విజిల్ పెట్టేయాలి . ఐదు విజిల్స్ వచ్చాకా , మంట తగ్గించి ఐదు నిమిషాలుంచి , స్టవ్ ఆపేయాలి .

౩. పాలక్ పన్నీర్ ;
పాలకూర పూరీలు , పాలకూర అన్నమూ అయ్యాక వాటిలోకి ' పాలక్ పన్నీర్ '.
పాలకూర ఐదు కట్టలు ,
వంద గ్రాముల పన్నీర్ పాకెట్ ,
రెండు ఉల్లిపాయలు ,
ఒక వెల్లుల్లి రెబ్బ ,
కొద్దిగా అల్లం ముక్క ,
ఓ స్పూన్ గరం మసాల పొడి ,
ఉప్పు ,
ఖారం ,
పోపుకు నూనె .

పన్నీర్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని , నూనెలొ కొంచం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి .
పాలకూరను శుభ్రం గా కడి , కట్ చేసుకొని , పేస్ట్ చేసుకోవాలి .
ఉల్లిపాయలు , అల్లం , వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకోవాలి .
మూకుడులో పోపుకు సరిపడా నూనె వేసి , అల్లం , వెల్లుల్లి , ఉల్లి ముద్దను వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి . ఆ ముద్ద వేగాక పాలకూర పేస్ట్ ను వేయాలి . పాలకూర బాగా వుడికాక , వేయించి వుంచుకున్న పన్నిర్ ముక్కలను , గరం మసాలా పొడిని , ఉప్పు , ఖారం ను వేసి బాగా కలిపి ఇంకొద్దిసేపు వుడికుంచుకోవాలి . కూర గంటె జారుడుగా వుండాలి . ముద్ద కాకూడదు . అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసుకోవచ్చు .
అంతే , పాలక్ పూరి , పాలక్ రైస్ , పాలక్ పన్నీర్ తయార్ :)

వీటి కి తోడు కీరా రైతా . ఇది చేయటము చాలా సులువు . కీరా తొక్కతీసి , తురుము కోవాలి , కీరా తురుము , సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలూ , కొత్తిమీర , ఉప్పు పెరుగులో కలపటమే !

ఇలాగే పూరీ లను , అన్నం ను , బీట్రూట్ , కారెట్ , మెంతికూర , పుదీన ,టమాటా, మటర్ ( మటర్ ను పేస్ట్ చేయ కూడదు . అలానే వేసేయాలి .) ల తో కూడా చేయవచ్చు . కాదేది కవితకనర్హమూ అన్నట్లు ఏ కూరైనా వేసి వండవచ్చు . మామూలా గా తెల్ల అన్నం వండుతే , చిన్నప్పుడు మా అబ్బాయి తెల్లన్నం నాకొద్దు అని గొడవ చేసేవాడు . అదే పోలిక వాడి కొడుకుకు వచ్చింది . పూరీ ఐనా , చపాతీ ఐనా , అన్నం ఐనా కలర్స్ కలర్స్ వుండాల్సిందే ! కొంచం ఓపిక చేసుకొని వండుతే పిల్లలకు అన్ని కూరలూ పెట్టినట్లుగా కూడా వుంటుంది . కడుపు నిడా తింటారు . బలానికి బలమూ , ఆరోగ్యానికి ఆరోగ్యమూనూ . పుణ్యమూ , పురుషార్ధము :)

17 comments:

లత said...

అన్ని పాలక్ వెరైటీస్ బావున్నాయి మాలగారూ

Anonymous said...

అందరికంటే ముందొచ్చి అన్నీ తినేసాను . బ్రేవ్....మాలగారూ ఓ గ్లాస్ మంచినీళ్ళందుకోండి .

రసజ్ఞ said...

ఆ ఆడ్ సూపరండీ! బాగున్నాయి మీ వంటలు!

కృష్ణప్రియ said...

నైస్ :)

శ్రీలలిత said...

ఈసారికి సొరకాయని ఒదిలి పాలకూరని పట్టారా..?హి..హి..
మీ చేతిలో ఏం చేసినా బాగుంటుంది.
ఐటమ్స్ అన్నీ బాగున్నాయి..అభినందనలు..

Anonymous said...

మీ వంటల రుచి కన్నా, మీకు మీ మనవాడి మీద ఉన్నా ఇష్టం బాగా రుచిగా ఉందండీ :) :) (బాగా తెలుస్తుంది)

శిశిర said...

బాగున్నాయండీ.ఆ పూరీలైతే తెగ నచ్చేశాయి నాకు.

Anonymous said...

మీ చేతి వంటల గురించి వేరే చెప్పాలంటారా! మీరు ఏది చేసిన చాలా అద్బుతంగా ఉంటుంది, అంటే మీరు పెట్టె ఏ వంట అయిన 100/100 మార్క్స్

'Padmarpita' said...

బాగున్నాయండీ మీ వంటలు!

జ్యోతి said...

ఈసారి పాలకూర వంతా?? పర్లేదు ఆరోగ్యానికి మంచిదే. అన్నీ బావున్నాయి. మరి ఇవి చేసింది మీ మనవడికోసం మా అందరి కోసమా?? ముందు ఈ విషయం మాట్లాడుకుంటే ఓ పనైపోతుంది కదా మాలగారు..

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

ఈ వంటలు ఇక్కడ మేము చేస్తూవుంటాము. వంటలకంటె మీ కధతో మమ్మల్ని మీ మనవడి వయసుకు తెచ్చేసారు.మా మనవరాలు కి ఏదయినా పని చెబితే " స్పినాచ్ ఖిలావ్ శక్తి బడావొ , ఫిర్ కామ్ కరుంగీ " అనేది. దాని చిన్నపుడు టి. వి. లో రెగ్యులర్ గా ఈ కార్టూన్ వచ్చేది.

kri said...

మాలగారూ మొత్తంమీద మనవడు అడగ్గానే అన్ని స్పీనేచ్ వంటకాలూ చేసేరన్నమాట! వచ్చే వారం ఏం చేయమని అడుగుతాడా అని ఎదురు చూస్తున్నాను. మీరువాటిని కూడా కూడా చేసిపెడట్టి ఇక్కడ రాసారు కదా! రుచి సంగతి తెలియదు ( చూడలేదు కనుక) ఫోటోలు చక్కగా బాగున్నాయి.
క్రిష్ణవేణి

జయ said...

అలాగే. సుబ్బరంగా అన్నీ తినేస్తా. థాంక్స్

సిరిసిరిమువ్వ said...

బావున్నాయి..మంచి ఆరోగ్యకరమైన వంటలు. పాలక్ పూరీలే ఎప్పుడూ చెయ్యలేదు..ఈ సారి చేసి చూడాలి.

Mauli said...

చక్కని ఐటమ్స్ చెప్పారు :)

Ennela said...

అబ్బబ్బబ్బ! యేమి రుచి! యేమి రుచి! తింటే పాలక్ తినాలి వింటే మాలా గారి కబుర్లు వినాలి..అదుర్స్స్...

మాలా కుమార్ said...

నా స్పినచ్ వంటలు మెచ్చిన అందరికీ ధన్యవాదాలు .
పదిరోజులుగా నాకు ఆన్ లైన్ వచ్చేందుకు వీలు కానందున అందరికీ వెంటనే జవాబు ఇవ్వలేకపోయాను సారీ .
అందరికీ కలిపి ఒకే జవాబు ఇస్తునందుకు , అదీనూ పదిరోజులు ఆలశ్యంగా ఇస్తున్నందుకు నన్ను క్షమించగలరు .
థాంక్ యు వన్స్ ఎగేన్ .