Monday, May 4, 2020

అందమైన అద్భుతమైన గతమాఅందమైన అద్భుతమైన గతమా

రచన;మాలాకుమార్

(కమల పరచ)


" యే షామ్ మస్తానీ
మద హొష్ కియె జాయె
ముఝె దోర్ కొయి ఖీంచె
తేరి ఔర్ లియె జాయె "
మైక్ లో మృదుమధురంగా డేవిడ్ గొంతులో నుంచి జాలువారుతోంది.ఆ పాట కు అనుగుణంగా అందరి పాదాలు కదులుతున్నాయి.లైట్లు డిమ్ గా వెలుగుతున్నాయి.నా చేయి పట్టుకొని అడుగులు వేయిస్తూ " ఈ   షామ్ ఏమిటీ ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం షామ్ నే నన్ను గుంజేసావు ." అన్నారు ఏమండీ నవ్వుతూ.
"కదా! అందుకేగా అప్పటి నుంచీ నేను కింద పడకుండా పట్టుకొని ఇలా మీ అడుగులో అడుగు వేయిస్తూనే వున్నారుగా " అంటూ చుట్టూ చూసాను.అందరూ  జంటలు జంటలుగా పాదాలు కదుపుతూ అదో అలౌకికమైన ఆనందం లో ఉన్నారు.అది డిఫెన్స్ ఆఫీసర్స్ క్లబ్. కల్నల్ .జార్జ్ 75 వ పుట్టిన రోజును వాళ్ళ పిల్లలు అరేంజ్ చేసారు.ఆయన పాత మితృలందరినీ పిలిచారు.అంతే కాక అప్పటి వాళ్ళకు ఇష్టమైన మ్యూజిక్ మాస్టర్.డేవిడ్ ను పిలిచారు.అతను పెద్దవాడైపోయినప్పటికీ ,వీళ్ళ ఆహ్వానాన్ని మన్నించి వచ్చి, అందరికీ ఇష్టమైన పాటలు పాడుతున్నాడు.అంతా ఉత్సాహంగా పాదాలు కదుపుతూ , ఉషారుగా డైభైలో ఇరవై వచ్చేనా ఎవరికైనా అంటే ఆహా అనేస్తున్నారు.ఇంతలో ఎవరొ "అరే భాయ్  హం బుడ్డే నై హుయే బోలో జై జై శివ శంకర్ " అని అరిచారు.అంతే మ్యూజిక్ ఊపందుకుంది.మరి అందరూ రాజేష్ ఖన్నా అభిమానులు!
డాన్స్, కేక్ కట్టింగ్, డిన్నర్ అంతా ముగిసి ఇంటికి వచ్చేసరికి పదకొండైపోయింది.ఒకప్పుడు డాన్స్ అంటే రాత్రి తెల్లవార్లూ చేసి, తెల్ల వారుఝామున క్లబ్ లో ఏదో ఇంత తినేసి వచ్చేసేవాళ్ళము.నేను అదే అంటే "ఎంత కాదనుకున్నా వయసొచ్చేస్తోందిగా ?" అని నవ్వారు ఏమండి.
ఇంటి మెట్లెక్కుతుండగా , మెట్ల పక్కనున్న పారిజాతం, "హాయ్ "అని పలకరించింది."అరెరే ఈ రోజు నిన్ను పలకరించలేదు కదూ ,ఇప్పుడే వస్తానుండు."అని లోపలకెళ్ళి ఫ్రెషప్ ఐ వచ్చి, బాల్కనీ లో కూర్చున్నాను.పారిజాతాన్ని చూస్తుంటే,గేట్ కాంపౌండ్ వాల్ మీద నుంచి "నీకెప్పుడూ అదంటేనే ఇష్టం.నాతో మాట్లాడనే లేదు."అని మూతి ముడిచింది రాధామాధవం.
"అలగకురా బంగారూ."అని రాధామాధవం ను బుజ్జగిస్తుంటే,
"ఏమంటున్నాయి నీ బంగారు తల్లులు?ఇదో కాఫి తాగు ఇంకాస్త ఓపికొస్తుంది వాటితో ముచ్చట్లాడేందుకు." ఎప్పుడు కలిపారో ట్రేలో రెండు కాఫీ కప్ లు తీసుకొని వచ్చి,నాకో కప్పు ఇచ్చి, ఏమండీ ఒక కప్పు తీసుకొని పక్క కుర్చీలో కూర్చున్నారు.
కొద్ది క్షణాలు మౌనం లో గడిచిపోయాయి.
"అవునూ నీ మాలతీలత ఎప్పుడు పెద్దగా అవుతుంది? ఎప్పుడు మనం దాని దగ్గర నిలుచొని పాట పాడుకోవాలి? అన్నారు బాల్కనీ మొదట్లోకి కొద్దిగా పాకిన మాలతి తీగను చూస్తూ.పాల్గుణచంద్రుని కాంతిలో మొక్కలన్నీ మెరిసిపోతున్నాయి.రోడ్ మీద ఎవరూ లేరు.అంతటా నిశబ్ధంగా ఉంది.ఆ నిశబ్ధం,సన్నగా వీచే గాలికి తలలూపుతూ ,సువాసనలు వెదజల్లుతున్న పూల తీగలు,ఆకాశంలోని చందమామ వాతావరణం హాయిగా ఉంది.
వాటిని చూస్తూ నేను ఏమండీని  " ఏ పాట పాడుతారేమిటి ?" అని అడిగాను నవ్వుతూ.
"పచాస్ సాల్ పహలే హమే తుంసే ప్యార్ తా, ఆజ్ భీ హై,ఔర్ కల్ భీ రహేగా " అన్నారు.
"అబ్బో " అంటూ చిన్నగా లేచి కింద కూర్చొని ఆయన మీద తల ఆనించాను.
ఇద్దరమూ కాసేపు ఏవో ఆలోచనలలో ఉండిపోయాము.కొద్ది సేపయ్యాక నేను "ఏమండీ ఎన్ని సార్లు ,ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను కాశీ వెళుదామని.హిందువులమై ఉండి ,హిందువుల పుణ్యక్షేత్రం చూడకపోతే ఎట్లా ? ఇప్పుడు మనము ఫ్రీనే కదా వెళ్దామండీ.” అన్నాను.
"ఇప్పుడు బ్రిడ్జ్ టోర్నమెంట్స్ ఉన్నాయికదా .అవైనాక వెళుదాములే పది రోజుల తరువాత."అన్నారు ఏమండి.
"ఈ మధ్య నాకు నాగార్జున సాగర్ కూడా వెళ్ళాలని ఎందుకో చాలా అనిపిస్తోంది."అన్నాను.
"ఎందుకు?" అని అడిగారు.
"మన పెళ్ళి చూపులు అక్కడే కదా అయ్యాయి.మీకు గుర్తుందా ? పెళ్ళి  మాటలన్నీ అయ్యాక నాన్నగారు లెఫ్ట్ కెనాల్ దగ్గరికి, డాం దగ్గరికి తీసుకెళ్ళారు.అప్పుడే తవ్వుతున్న కెనాల్ కిందికి మీరు రాళ్ళ మీద నుంచి దూకుతూ వెళుతుంటే మొదటిసారి చూసాను మిమ్మల్ని. అమ్మ తలెత్తవద్దు అంటే చూపులప్పుడు తలెత్తనే లేదు నేను.కెనాల్ దగ్గర మీరు కిందికి దిగుతున్నప్పుడు, నాన్నగారు నా దగ్గరికి వచ్చి,నువ్వు ఆ అబ్బాయిని చూసావా అసలు ? అదిగో అతనే అని మిమ్మలిని చూపించారు.అప్పటి వరకు ముమ్మలిని చూడలేదు. అక్కడ నుంచి డామ్ దగ్గరకు వెళ్ళాము.అక్కడ శివాలయం లోకి వెళ్ళి మనిద్దరినీ దండం పెట్టుకురమ్మన్నారు అత్తయ్యగారు.గుడి దగ్గరికి వెళ్ళాక "చెప్పులిప్పాలా ?" అని అడిగారు మీరు నన్ను.పెద్ద గుళ్ళోకెళుతే చెప్పులిప్పాలని తెలీనట్లు .అదే మన మొదటి మాట.మనిద్దరినీ కలిపిన ఆ కృష్ణమ్మనీ,ఆ శివయ్యనీ ఓ సారి చూడాలని ఉందండీ ."అన్నాను.
"అసలు నీకివన్నీ ఎట్లా గుర్తుంటాయి ? ఏదో మాట్లాడించాలి కదా అని అడిగాను.ఎప్పుడూ గతం లోనే ఉంటే ఎట్లా?"అన్నారు ఏమండి నవ్వుతూ.
"ఈ మలి వయసులో  ఎంతో అందమైన, అద్భుతమైన ఆ గత అనుభూతులను తలుచుకుంటే ఎంత బాగుటుందో తెలుసా ?" అన్నాను పరవశంగా .
"సరే సరే.నీకెప్పుడో చెప్పానుగా ఐ ఆం ఆల్ వేస్ ఎట్ యువర్ సర్వీస్ అని." అన్నారు.
"అట్లాగే అంటారు. ఏమండీ . . . ఏమండీ మనము కూడా మీ 75 వ పుట్టినరోజు ఇలాగే సెలబ్రేట్ చేసుకుందామా? పిల్లలను కూడా రమ్మందాము "అన్నాను.
నా తలను మృదువుగా నిమురుతూ" దానికింకా చాలా టైం ఉంది కదా ,అప్పుడాలోచిద్దాములే.ఐనా ఎప్పుడూ పాటలు,పువ్వులు, ఊళ్ళు తిరుగుదాం, పుస్తకాలేనా? కాస్త నా మాట వినిపించుకోవు ."అన్నారు.
"వింటాను కాని ఇప్పుడు కాదు.కాశీ, నాగార్జునసాగర్ వెళ్ళాలి ఇంకా ఏమండీ నన్ను హిమాలయాలు తెగ పిలుస్తున్నాయి.ఓసారి హిమాలయాలకు కూడా వెళ్ళొద్దాము.అవన్నీ అయ్యాక మీరు చెప్పే మాట వింటాను దానికింకా చాలా సమయము ఉంది."అన్నాను ఏమండీ లాగా అంటూ.
అప్పుడే నా మనసు హిమాలయాలల్లో కి వెళ్ళిపోయింది. తెల్లని మబ్బులు చేతికి అందేట్టుగా దూది పింజల్లా అలా . . .  అలా. . .  తేలిపోతున్నాయి.ఎత్తైన హిమాలయాలు తెల్లతెల్లగా,చల్లచల్లగా మనసును ఊహలలో తేలిస్తున్నాయి.అక్కడక్కడ లోయలూ, వాటిల్లో అందమైన పూల తోటలూ మనోహరము గా ఉన్నాయి.
"హిమగిరి సొగసులూ , మురిపించును మనసులూ"అని పాడుకుంటూ ఏమండి చేయి పట్టుకొని, ఆ హిమాలయాలల్లో అలవోకగా నడిచేస్తూ,"ఏమండీ ఇది సిమ్లా నా,డార్జిలింగా ?" అని అడిగాను.
"ఏదైతే నేమి నీ మనసుకు నచ్చే హిమాలయాలు,పద ఎక్కడి దాకా ఎక్కుతావు ? "అన్నారు.
"ఎక్కడికైనా సరే నా మీద మీ ప్రేమనంతా మీ హృదయం నిండా ,కళ్ళల్లో నింపుకొని నన్ను తీసుకుపోతుంటే రానంటానా?ఎక్కడికైనా వస్తాను.ఎక్కడికి రమ్మన్నా వస్తూనే ఉన్నాను కదా, రానని ఎప్పుడైనా అన్నానా ? మీ వెంటే నేను, మీ అడుగులల్లోనే నా అడుగులు." ఉద్వేగంగా అన్నాను.
"ఆహా" తమాషాగా అన్నారు.
ఆ మంచుపర్వతాలల్లో అలా. . . అలా. . . నడుస్తూ ఉన్నాము.ఇంతలో ఆ తెల్లని దూదిపింజలు నల్లని కారుమేఘాల్లా కమ్ముకొచ్చేసాయి. నీలాల గగనం నుంచి ధారాపాతంగా నీళ్ళు కారిపోతున్నాయి.ఎటుచూసినా నీళ్ళే! తెల్లని మంచు, లోయలూ,తోటలూ అన్నీ ఏవీ? నీళ్ళూ. . . నీళ్ళూ. . . నీళ్ళూ  ఏమిటీ ఈ నీళ్ళన్ని ఇలా నా చుట్టూ చేరిపోతున్నాయి.వంటరిగా నీళ్ళ మధ్య లో నిలబడ్డానేమిటి? గుండె దడదడ లాడిపోతోంది.కాళ్ళు వణుకుతున్నాయి. నన్ను చిరునవ్వుతో చూస్తూ,మురిపెంగా చేయి పట్టుకొని నడిపిస్తున్న ఏమండీ ఏరీ ?
"ఏమండీ . . . ఏమండీ . . . ఏమండీ" గట్టి గట్టిగా పిలుస్తున్నాను.
"అమ్మా." మా అమ్మాయి పిలుపు విని ఉలిక్కిపడి చుట్టూ చూసాను . కాలం ఎప్పుడాగిపోయింది ?ఏమి జరుగుతోంది?నేనేమి చేస్తున్నాను ఎమో!ఏమి మాట్లాడుతున్నాను ఏమో!ఎవరితో మాట్లాడుతున్నాను ఏమో?ఎక్కడున్నాను?కాశీ వచ్చామట! ఇదేనా కాశీ ? నేను కొన్ని సంవత్సరాలుగా వద్దామనుకున్నదీ, విశ్వేశ్వరుని దర్షించుకుందామనుకున్నదీ ఈ కాశీయేనా !టోర్నమెంట్స్ ఐపోయాయా! ఇద్దరమూ వచ్చామా ?
"రా అమ్మా"అన్నాడు మా అబ్బాయి. అబ్బాయి చేతిలోని సంచీని చూసి,"బేటా ఆ సంచీ నాకివ్వు.నేను పట్టుకుంటాను.వళ్ళో పెట్టుకోవచ్చో లేదో నాకు తెలీదు.నా ఏమండి చివరి క్షణం వరకూ నా దగ్గరే ఉండాలి."అన్నాను చిన్నగా వణుకుతూ.
మా అమ్మాయి నన్ను పట్టుకొని పడవ లో కూర్చోపెడుతూ,"అమ్మా నీకెట్లా ఇష్టమైతే అట్లా చేయి.ఇతరులకు ఇబ్బంది కలిగించనిది,మన కిష్టమైనది మనము చేసుకోవచ్చు అనేవారు డాడీ ఎప్పుడూ గుర్తుంది కదా.ఈ సంచీ నీదగ్గర ఉంటే ఎవరికీ ఏ కష్టమూ లేదు."అని చెపుతూ కూర్చోబెట్టి , ఆ సంచీ నా చేతికి ఇచ్చింది.
"ఈ సంచీలో రోజూ బయటకు వెళ్ళినఫ్ఫుడు డాడీ కోసం, ఒక మజ్జిగ సీసా,నాకోసం ఫ్రూట్ జ్యూస్, బిస్కెట్ పాకెట్, ఒక పండు పెట్టుకొని తీసుకెళ్ళేదాని."అన్నాను సంచీని  నిమురుతూ.
" "ఎప్పుడూ పిల్లలకేనా నూనే రాసి, నలుగు పెట్టేది?  నాకూ రాయొచ్చుగా ?
"పిల్లలవంటే చిన్ని శరీరాలు.మీ వీపు పదెకరాల పొలం అంతుంటుంది బాబూ .నేను రాయలేను , నాకు చేతులు నొప్పి పుడుతాయి."
"నూనె రాయమన్నానని కుంకుడుకాయ రసం కళ్ళల్లో పోస్తున్నావా ? అబ్బా చిన్నగా ."
"అయ్యో సారీ సారీ కళ్ళల్లో పడిందా ?" "
ఏదీ ఆ పదెకరాల వీపు ? ఈ చేతిలో ఇమిడిపోయిందా? ఏవీ ఆ ప్రేమ నిండిన నయనాలు ఎక్కడున్నాయి?  ఆ సంచీని గుండెకదుముకున్నాను.
"అమ్మా" అంటూ చేయిచాపాడు.
చుట్టూ చూసాను.నది మధ్యలోకి వచ్చాము. చుట్టూ నీళ్ళు!మధ్యలో పడవలో మేము!సంచీలో నుంచి ,తెల్లని వస్త్రములో కట్టి ఉన్న కుండను తీసి, చివరిసారిగా కళ్ళ నిండుగా చూసుకొని, కళ్ళకద్దుకొని ఇచ్చాను.మా అమ్మాయి తీసుకొని కళ్ళ కద్దుకొని తమ్ముడికిచ్చింది.వస్త్రము ముడి విప్పి నదిలో వేసి, కుండను కూడా వదిలాడు.చేతిలోని సంచీని కూడా నదిలో వదిలేసాను.నది మీద ఆ వస్త్రము తేలుకుంటూ దూరంగా, చాలా ,చాలా దూరంగా సాగిపోతూ.. . కనుమరుగైంది . . .
పడవ వడ్డుకు చేరింది.చెక్కలతో ఉన్న స్టేజ్ మీదకు దిగాము.వెను తిరిగి చూసాను.నా ప్రపంచాన్ని తనలో కలుపుకొని నిశ్చలంగా, గంభీరంగా ఉంది గంగమ్మ!
పూల రధం లో కొత్త కాపురానికి తీసుకెళ్ళావు.
వంటరిగా నీ చేతిని అందుకొని అంత దూరం వచ్చినప్పుడు భయపడ్డా,
ఆప్యాయంగా బ్రతిమిలాడే అమ్మలా నువ్వున్నావని ధైర్యం తెచ్చుకున్నాను.
ఏ పనీ చేతకానప్పుడు నాన్నవై అన్నీ నేర్పావు.
ఆనాటి నుంచి నీ వెనుకే నా అడుగు
నీ వెంటే నా అడుగు
నాదని  వేరే ఏదీ లేనేలేదు.
నా గుండె ఏమండీ ఏమండీ అంటున్న
చప్పుడు వినిపిస్తోందా?
నీ కళ్ళల్లో ప్రేమలు నాకు ప్రకాశానిచ్చాయి,
ఎన్నో మధురానుభూతులను అందించి ,
 పూల పల్లకీ లో ఊరేగించి,
మాటైనా చెప్ప కుండా ,నేను అందుకోలేనంత దూరానికి వెళ్ళిపోయావు
భర్త,హితుడు,స్నేహితుడు,తండ్రి,సోదరుడు,గురువు అన్నీ నీవైన నువ్వు ఇలా హటాత్తుగా మాయమవటం న్యాయమా?
it's not fair
అందమైన, అద్భుతమైన గతమా నీకు నా కన్నీటి నివాళి.”
పిల్లలిద్దరూ చేరోపక్కన నిలబడి,నా చేతులను పట్టుకొని "పదమ్మా" అన్నారు.
నా అడుగుల దిశ మారింది!
(సాహితి,ప్రతిలిపి,ఫేస్ బుక్  - 4-5-2020)
( దీనితో నా "ఏమండీ కథలు " పూర్తయ్యాయి.నా ఏమండీ కథలను ప్రచురించిన వివిధ పత్రికల ఎడిటర్ లకు, ఫేస్ బుక్ లోని వివిధ గ్రూప్ ల అడ్మిన్ లకూ,ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు.

నేనూ-నా ఏమండీ కలిసి రాసుకున్న మా కథలు మాకే అంకితం.

ఏడాది నుంచీ నా తిక్కనూ,దుఃఖాన్ని భరిస్తున్న నా కుటుంబసభ్యులకు, మితృలకు ధన్యవాదాలు చెప్పను.వాళ్ళు నన్ను భరించాల్సిందే తప్పదు :)  )

Wednesday, April 29, 2020

ఎంతెంతదూరం. . .


ఎంతెంత దూరం
సుధీర్, ఉష కొత్త కార్ కొనుక్కున్నామని చూపించేందుకు మా ఇంటికి వచ్చారు. నల్లరంగు కొత్త అంబాసిడర్  మెరిసిపోతోంది.కాసేపు అందరమూ దాని చుట్టూ తిరిగి చూసి,ఆహా ,ఓహో అనేసుకొని లొపలికి వచ్చాము.సుధీర్ మా ఏమండీ కి టెన్నిస్ క్లబ్ ఫ్రెండ్.ఆ క్లబ్ ఫ్రెండ్షిప్ ఫామిలీ ఫ్రెండ్ షిప్ గా మారింది. సుధీర్ ఓ ప్రైవేట్ కంపెనిలో డైరెక్టర్ గా చేస్తున్నాడు.ఈ మధ్యనే బరోడా నుంచి పోర్ బందర్ కు ట్రాన్స్ఫర్ ఐయి వెళ్ళాడు.నెలకో రెండు సార్లు బరోడా వచ్చి వెళుతుంటాడు.ఉషా మటుకు , పిల్లల్లిద్దరి చదువు కోసమనీ,అత్తమామలు పెద్దవాళ్ళనీ బరోడాలోనే ఉండిపోయింది. ఎప్పుడు వాళ్ళు మా ఇంటికి వచ్చినా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినా భోజనం చేయటం అలవాటు.అలాగే భోజనాలయ్యాక కాసేపు కూర్చొని,"ఇక వెళుతాము. నేను రేపు వెళ్ళాలి." అని లేచారు.వాళ్ళతో పాటు మేము కూడా బయటకు వచ్చాము.సడన్ గా సుధీర్ " రేపు మీరూ నాతో రావచ్చుగా ఎలాగూ నేనొక్కడినే వెళుతున్నాను.పిల్లలకూ సెలవలే కదా "అన్నాడు.
ఈ మధ్యనే నేను ఓ కాన్వెంట్ స్కూల్ లో టీచర్ గా చేరాను.మొదటి నెల జీతం వచ్చింది .ఆ ఉషారులో,వెంటనే నేను "నాకూ సెలవలే.వెళ్దామండీ."అన్నాను.పిల్లలూ "వెళ్దాం డాడీ"అన్నారు.
మా హడావిడి చూసి పాపం ఏమనలేక " సరే వస్తాము కాని తిరిగి వచ్చేటప్పుడు ఎట్లా?"అన్నారు.
"నువ్వు కార్ తీసేసుకో, మా ఆఫీస్ వాళ్ళెవరైనా ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు తెచ్చిస్తారులే.నో ప్రాబ్లం.మీరు హాయిగా అక్కడంతా కార్ లో తిరిగేయండి."అన్నాడు.
అంతే చలో సౌరాష్ట్రా!
మరునాడు  బ్రేక్ ఫాస్ట్ ముగించుకొని బయలు దేరాము.ముందుగా అహ్మదాబాద్ పోదాము, అక్కడ నాకు కొంచం పని ఉంది.” అన్నాడు సుధీర్.సుధీర్ ఆఫీస్ పనయ్యాక, "ఇక్కడ టెక్స్టైల్ మిల్ల్స్ ఎక్కువ కదా , మిల్లుల వాళ్ళు కట్ పీస్ లని బండిల్స్ లల్లో మిగిలిన బట్ట ముక్కలను, కిలోల లెక్కన అమ్ముతారు.ముక్కలన్న మాటే కాని పెద్దగా డ్రెస్ లు కుట్టించుకునేట్లుగా ఉంటాయి.ఉషా ఎప్పుడూ ఇక్కడే తీసుకుంటుంది.నువ్వు కూడా తీసుకుంటావా?"అని నన్ను అడిగాడు.నేను జవాబు చెప్పే లోపలే, ఏమండీ "చూద్దాం పద"అన్నారు.
మంచి మంచి ప్రింట్లతో,చక్కని లేతరంగులలో ఆ కట్ పీస్ లన్ని బాగున్నాయి.కొన్ని ఏరి పక్కనున్న తరాజు లో వేసాను.ఇంకా తీసుకో, నీకు,సంజు కూ ఇద్దరికీ డ్రెస్ లు కుట్టుకుందువుగాని అని దగ్గర దగ్గర ఐదు కిలోల పైనే తీసుకున్నారు.ఆ పక్కనే కాటన్ ఫుల్ వాయిల్ చీరలు కూడా భలేగా ఉన్నాయి.నాకిష్టమైన వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో,తెల్లని చీర మీద అక్కడక్కడా నల్లని చిన్నచిన్న పూలతో ముద్దుగా ఉన్న చీర చాలా నచ్చింది.కాని అప్పటికే చాలా తీసుకున్నాము,ఇంకా ప్రయాణం మొదట్లోనే ఉన్నాము, డబ్బులన్నీ ఇప్పుడే ఖర్చు చేస్తే ఎట్లా అని నేను అనుకుంటూ ఉండగానే ఏమండీ నా చూపులను కనిబెట్టి కొనేసారు.వద్దు వద్దు అంటూనే కొంచం ఇష్టం తో కొంచం అయిష్ఠం తో తీసేసుకున్నాను.
హోటల్ రూం లో కాసేపు రెస్ట్ తీసుకొని, చాయ్ తాగి డ్రైవ్ ఇన్ మువీ కి  వెళ్ళాము.షమ్మీకపూర్,సైరాభానుల సినిమా "జంగ్లీ"వేస్తున్నారట ఆ రోజు.మేము ప్లేస్ చూసుకొని సెటిలైయ్యేసరికి సినిమా మొదలైంది.పెద్ద గ్రౌండ్ లో పెద్ద స్క్రీన్ మీద వేస్తున్నారు.కొందరు కార్లల్లోనే కూర్చొని చూస్తున్నారు.కొంత మంది కార్ పక్కన ఫోల్డింగ్ చేర్స్ వేసుకొని, కింద దుప్పటి పరుచుకొని కూర్చొని , హాయిగా ఇంట్లో కూర్చొని చూస్తున్నట్టు చూస్తున్నారు.ఓపెన్ ఏర్ థియేటర్ లో సినిమా చూసాము.కాని ఇలా కార్ లో కూర్చొని చూడటం గమ్మత్తుగా ఉంది.సినిమాలో సైరాభాను చాలా సున్నితంగా అందంగా ఉంది.సుధీర్,ఏమండీ షమ్మీకపూర్  డాన్స్  లు  ఎంజాయ్ చేస్తుంటే, నేను మాత్రము చాహే కోయి ముఝే జంగ్లీ కహే అని పాడేసుకుంటూ, పిల్లలతో కలిసి రకరకాల చాట్ లు అబ్బో ఎన్ని రకాలొ  తింటూ ఎంజాయ్ చేస్తూ ,మధ్య మధ్య కాసిని వాళ్ళిద్దరికీ ఇస్తూ ,సినిమా ఏమో కానీ డ్రైవ్ ఇన్ మువీ ,చాట్ లూ బహూ మజా ఆవీ :)
మరునాడు పోర్ బందర్ చేరాము.మాకు చౌపాటీ (గెస్ట్ హౌస్) లో రూం ఇప్పించి, తన అసిస్టెంట్ ఒక అబ్బాయిని మాకు గైడ్ గా ఏర్పాటు చేసి,మీకు పోర్ బందర్,సోం నాథ్, ద్వారకా అన్నీ ఇతను చూపిస్తాడు ,నేను మళ్ళీ  మీరు వెళ్ళేటప్పుడు కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు.మహాత్మాగాంధీజీ పెరిగిన ఊరు అని తలుచుకుంటుంటేనే చెప్పలేని భావమేదో వచ్చేసింది.ఎంతో ఆనందంగా ఊహించుకుటూ ఉంటే ఆ  గుంతల రోడ్డులు, ఇరుకు సందులు ఇబ్బంది పెట్టాయి."ఇదిగో ఇదే గాంధీజీ ఇల్లు " అని సుదీర్ అసిస్టెంట్ అరవింద్ లోపలికి తీసుకెళ్ళాడు.ఎంత అబ్బురంగా చూసామో.మేడ మీదికి తీసుకెళ్ళి, పక్కనున్న ఇల్లు చూపిస్తూ "అదే కస్తూరిబా ఇల్లు.ఈ పక్కన కనిపిస్తోందే అది కస్తూరిబా గది.ఇదో ఈ కిటికీ లోనుంచే కస్తూరిబా గాంధీజీ ని చూస్తూవుండేది ఎప్పుడూ" అని ఓ ప్రేమ కథ వినిపించేసాడు. అబ్బో గాంధీజీ ,కస్తూరీబా కు కూడా ఓ ప్రేమకథ ఉందే అని ఆశ్చర్యపోయాము.
తిరిగి తిరిగి చౌపాటీకి వచ్చాము.డిన్నర్ చేసి పిల్లలు అలిసిపోయి పడుకున్నారు.నేను బాల్కనీ లోకి వచ్చాను.ఎదురుగా సముద్రుడు ఎగిసిపడుతున్నాడు.కార్తీక చంద్రుడు నన్ను చూడు,నా అందం చూడు అని మెరిసిపోతూ చుక్కలకందకుండా ఏడిపిస్తున్నాడు.అబ్బ ఎంత మనోహరంగా ఉంది.వాలు కుర్చీ జరుపుకొని కూర్చొని పరవశించిపోతున్నాను.ఏమండీవచ్చి "పడుకోకుండా ఏమి చేస్తున్నావు.పడుకో ."అన్నారు.
"అశ్వద్దామ కోసం చూస్తున్నాను."అన్నాను అప్రయత్నంగా.
"ఎవడాడు?"అడిగారు.
"అయ్యో తప్పు అలా అనకూడదు చెంపలేసుకొండి.ద్రోణాచార్యుడి కొడుకు."అన్నాను.
నేనెక్కడ ఆయన చెంపలేస్తానో అని కాస్త దూరం జరిగి"ఎవరు"అని మళ్ళీ అడిగాడు.
"అబ్బా అన్నీ చెప్పాలి.భారతం లో పాండవుల గురువు ద్రోణాచార్యులున్నారా ?ఆయన కొడుకు అశ్వద్దామ."అన్నాను.
"ఏడిచినట్టుంది.ఇన్ని యుగాల తరువాత నీకు కనిపిస్తానని చెప్పాడా?"
"నాకేమీ చెప్పలేదు,మీరేమీ నన్ను వెక్కిరించనక్కరలేదు.అశ్వద్దామ చిరంజీవి.ఆయనకు మరణం లేదు.ఈ సముద్రం వడ్డునే తిరుగుతూ ఉంటాడట.ముఖ్యంగా పౌర్ణమి రోజులల్లో తప్పక వస్తాడట.దాదాపు ఇరవై అడుగులపైన ఉంటాడట. చాలా గంభీరంగా ఉంటాడట.మన పనిమనిషి తులసీబెన్ చెప్పింది."అన్నాను చాలా ఉద్వేగంగా.
"ఎంతుంటాడటా, నీ కూతురి ఆకాశమంత సిస్టర్ లా ఉంటాడటనా ? ఏదీ మన ఇంటి వెనుక పౌర్ణమి రోజు ఓ నల్లనాగు ఓ మణి ని నెత్తిన పెట్టుకొని డాన్స్ చేస్తుందని ,తులసీబెన్ చెప్పిందనేగా ప్రతి పౌర్ణమికీ కిటికీ పక్కన కూర్చొని ఎదురుచూస్తూ ఉంటావు అలాగ ఇక్కడ అశ్వద్దామ వస్తాడని ఈ రాత్రంతా ఎదురు చూస్తావా ? సరే సరే కానీ చూసి తరించు."అని  " అశ్వద్దామా హతః కుంజరః" అంటూ, నవ్వుకుంటూ లోపలికి వెళ్ళారు.
పెద్ద అశ్వధామ ఎవరో తెలీనట్లు చేసారు.,హుం ఎప్పుడూ నన్ను వెక్కిరించటమే .
బోట్ సముద్రపు అలల మీద చిన్నగా తేలిపోతోంది..సూర్య కిరణాలు నీటి మీద పడి తళతళా మెరిసిపోతున్నాయి.రాత్రి చాలా సేపు బైట కూర్చొని ఎప్పటికో నిద్రపోయాను.పొద్దున లేవగానే అందరమూ రెడీ అయ్యి,సోమనాథ్ చూసి ,బేట్ ద్వారక చూద్దామని వెళుతున్నాము.సముద్రము పక్క నుంచి వెళుతుంటే ఏమండీకి కాసేపు బోట్ లో వెళ్ళాలనిపించి బోట్ ఎక్కాము.వచ్చీ రాని గుజరాతి లో పడవతని తో ముచ్చట్లేస్తున్నారు ఏమండి. మనము ఏ స్టేట్ లో ఉంటే అక్కడి భోజనం తినటం,వాళ్ళ భాషా కొంచమైనా నేర్చుకోవాలి అని ఏమండీగారి సిద్దాంతము.ఇంతలో కొంచం దూరం లో ఓ పెద్ద భవనము చూపించి అదే బేట్ ద్వారక అన్నాడు పడవతను.
దానితో మహా ఉత్సాహంగా "అదిగో ద్వారక, ఆల మందలవిగో"పద్యం ఎత్తుకున్నారు ఏమండీ.డాడీ తోపాటు కొడుకుకు కూడా అంతకన్నా ఉత్సాహం ఎక్కువైపోయి ,"బావా ఎప్పుడు వచ్చితివీవు ?"అని ఎత్తేసాడు.
""ఓరోరి బేటా ఈ పద్యం దీనికి చదవరురా"అంటే వింటేనా! తండ్రీకొడుకులు ఓ వచ్చిన పద్యాలన్నీ పాడేసుకుంటూ , బోట్ షికార్ ముగించి , ద్వారక చేరాము.అసలు ద్వారక సముద్రము లో మునిగిపోయాక, ఈ భవనం ఒక్కటే మిగిలిందని గైడ్ చెపుతూ , ఇది రుక్మిణి అంతఃపురం, ఇది సత్యభామ అంతఃపురం అని చూపించాడు.ఏమిటబ్బా ఇంత చిన్న గుమ్మాలున్నాయి.ఇన్ని రంగులేసారు అనుకుంటుంటే ఏమండీ "బహుశా ఇది తరువాత జ్ఞాపకచిహ్నంగా కట్టి ఉండవచ్చు అన్నారు.
మొత్తానికి ఏదైతేనేమి ద్వారక చూసాము.సోమనాథ్, గాంధీజీ ఇల్లు,కస్తూరిబా ఇల్లు,కచ్ దగ్గర గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం చేసిన ప్రదేశము అన్నీ చూసుకొని, సుధీర్ కు థాంక్స్ చెప్పి తిరుగు ప్రయాణమయ్యాము.
దారంతా చిన్న చిన్న పల్లెటూళ్ళు.పొద్దున్నే బయలుదేరటము తో పోర్ బందర్ లో లంచ్ పాక్ చేసి తెచ్చుకోలేక పోయాము.ఏమి చేయాలా అనుకుంటూ ఓ ఊరు కొంచం పెద్దగా కనిపిస్తే ,పక్కన కార్ ఆపి అక్కడున్న ఒకతనిని అడిగారు ఇక్కడ భోజనం ఏమైనా దొరుకుతుందా? అని అతను ఆ పక్కనే ఉన్న గుడిసె చూపించి , ఇందులో ఒక ముసలమ్మ రోటీ, సబ్జీ చేసి అమ్ముతుంది అని చెప్పాడు.అమ్మయ్య అనుకొని ఏమండీ లోపలికి వెళ్ళి రోటీ, సబ్జీ పాక్ చేయించుకొచి "లక్కీగా టైం కు వచ్చాము.ఆవిడ చేయటం ఆపేస్తోంది.మన కోసం అని వేడి వేడిగా జొన్న రొట్టెలు చేసిచ్చింది. మూంగ్ సబ్జీ కూడా ఇచ్చింది.కాని అక్కడ తినేందుకు వీలుగా లేదు ఎక్కడన్నా ఆపుకొని తిందాము."అన్నారు.కొంచము ముందుకు వెళ్ళగానే రోడ్ పక్కన ఒక పొలం కనిపించింది.దాని గేట్ ముందు పెద్ద రావి చెట్టు ఉంది.దాని కింద కార్ ఆపారు.అందరము కిందికి దిగాము.నేను కార్ డిక్కీ లో నుంచి ప్లేట్ లూ, గ్లాస్ లూ ఉన్న బుట్ట తీస్తున్నాను .ఇంతలో లోపల నుంచి ఒకతను బయటకు వచ్చి,మమ్మలిని చూసి,” థం బద్దా బాహర్ బైఠా చో.ఘర్మా అందర్ ఆవో. (బయటెందుకు కూర్చున్నారు? లోపలికి రండి. ).అన్నాడు.
అతనితో నలుగురమూ లోపలికి వెళుతూ ఏమండీ ఆ రైతును "తమారూ సూ నాం చే?"(నీ పెరేమిటి?) అని అడిగారు.
"మారూ నాం ముకుంద్".అని చెప్పాడు.
లోపలికి తీసుకెళ్ళి ముకుంద్, పెద్ద మామిడి చెట్టు కింద మాకోసం రెండు నులక మంచాలు తెచ్చి వేసాడు.వాటి మీద దుప్పట్లు వేసాడు .మేము ముసలమ్మ దగ్గర నుంచి తెచ్చిన జొన్నరొట్టెలు,మూంగ్(పెసల)కూర తీసి, నా దగ్గర ఉన్న పళ్ళాలల్లో వేస్తున్నాను. ఇంతలో ముకుంద్ ఒక పెద్ద కటోరీ నిండా తెల్లటి పేరి నెయ్యి, ఒక కూజాలో మంచి నీళ్ళు తెచ్చిచ్చాడు మళ్ళీ వెళ్ళి,తళతళా బంగారం లా మెరుస్తున్న నాలుగు పెద్ద పెద్ద ఇత్తడిగ్లాస్ ల నిండా మజ్జిగ తెచ్చిచ్చాడు. అన్నీ అక్కడ పెట్టి ఆరాం గా తినమని చెప్పి తన పనిలోకి వెళ్ళిపోయాడు.ఏమండి వెన్నముద్దలా ఉన్న ఆ నెయ్యి కొద్ది కొద్దిగా తీసి రొట్టెల మీద వేసి పిల్లలకు ఇచ్చారు.జొన్న రొట్టెలు అలవాటు లేవు,పిల్లలు  ఎట్లా తింటారా అనుకున్నాను కాని , చల్లగా హాయిగా ఉన్న ఆ పొలం లో చెట్టు నీడన కూర్చొని "డాడ్ నువ్వెప్పుడూ భలే పిక్నిక్ అరేంజ్ చేస్తావు"  అంటూ ఆ వేడి వేడి రొట్టెలు ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మా భోజనం అయ్యాక ఏమండీ ముకుంద్ తో ముచ్చట్లేస్తూ పొలం అంతా ఓ రౌండ్ కొట్టచ్చారు.
కాసేపు విశ్రాంతి తీసుకున్నాక, బయిలుదేరుతూ ఏమండీ ముకుంద్ భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకొని , "బహు మజా ఆవీ.మహర్మాని"( చాలా ఎంజాయ్ చేసాము.థాంక్ యూ ) అని  ధన్యవాదాలు చెప్పారు.ముకుంద్ విప్పారిన మొహం తో మాతోపాటు గేట్ దాకా వచ్చి,"ఆవ్ జో " (బై) అన్నాడు.
'మాధవపురం ' అని బోర్డ్ చూసి కార్ ఆపి,ఇక్కడేమన్న ప్రత్యేకమా అని అడిగారు అక్కడున్న ఓఅతనిని.అతను కొంచం దూరం లో ఉన్న ఓ చెట్టు చూపించి , ఈ చెట్టు కిందనే శ్రీకృష్ణుడు నిర్యాణము చెందాడని, అప్పటి నుంచి ఈ చెట్టును ఎండిపోకుండా కాపాడుతున్నారని చెప్పాడు.చూద్దాం అని దిగి పిల్లలను ఆ చెట్టుకు దండం పెట్టమని ఫొటో తీసాను.
"బాగుంది.అతను చెప్పటమూ, నువ్వు నమ్మటము, పిల్లలను నిలబెట్టి ఫొటో తీయటమూ "అంటూ నవ్వారు ఏమండి.
"పోనీయండి నాది పిచ్చే.పిల్లలూ పెద్దయ్యాక ఈ ఫొటో చూసి నవ్వుకుంటారు సరదాగా"అన్నాను కాస్త కినుకగా.
కనుచీకటి పడుతుండగా 'వీర్ పూర్ ' చేరాము.ఇదేదో కాస్త పెద్ద ఊరులా ఉంది ఈ రోజు ఇక్కడ ఉండి రేపు పొద్దున వెళుదాము అని అక్కడ ఉండేందుకు ఏముందా అని కనుక్కుంటే "జలారాం" మందిర్ ఉందని, దానికి అనుబంధంగా ధర్మశాల ఉందని, భోజనము కూడా అక్కడ పెడతారని చెప్పారు.ధర్మశాల క్లర్క్ తో మాట్లాడి గది తీసుకున్నాము.గది శుభ్రంగా బాగుంది కాని కామన్ వాష్ రూంలే వాడుకోవాలి.గుణుస్తున్న పిల్లలకు ఇదీ ఒక ఎక్స్పీరియన్స్ .అన్నీ నేర్చుకోవాలి అని నచ్చ చెప్పారు ఏమండీ.ఏమాటకామాటే చెప్పాలి కామన్ ఐనా చాలా శుభ్రంగా ఉన్నాయి.
రాత్రి భోజనం లో,పెద్దగా గుండ్రంగా ఉన్న ఇత్తడి కంచం లో ,ఒక కటోరీ లో ఆలూ సబ్జీ, ఒక కటోరీలో, ఉల్లిగడ్డ ముక్కలూ, నిమ్మకాయ ముక్క, ఒక కటోరీలో దాల్ వేసి తెచ్చి ముందు పెట్టారు. రోటీలు వేడిగా చేస్తూ వడ్డించారు.కటోరీలు, గ్లాస్ లూ అన్నీ ఇత్తడివే.తళతళా బంగారంలా మెరిసిపోతున్నాయి. గుజరాతీలు పాత్ర సామానులన్నీ ఇత్తడివే వాడుతారు.పైగా మెరిసేట్టుగా తోముతారు.అంతలా ఎలా మెరిపిస్తారా అని నాకెప్పుడూ ఆశ్చర్యమే!
రాత్రి హాయిగా విశ్రాంతి తీసుకొని, పొద్దున్నే ధర్మశాల వాళ్ళు పెట్టిన పోహా తిని మళ్ళీ రోడ్ ఎక్కాము.దారిలో వస్తున్న చిన్న చిన్న ఊళ్ళన్నిటికీ కృష్ణుని పేర్లే ఉన్నాయి.అవన్నీ శ్రీకృష్ణుడు నడయాడిన ఊళ్ళట.శ్రీకృష్ణపరమాత్మ బాల్యం అక్కడే గడిచిందని ఒక్కో ఊళ్ళో ఒక్కో కథ చెప్పారు.అన్నీ తాఫీగా చూసుకుంటూ వెళుతున్నాము.పిల్లలు వెనక సీట్లో ఏవో ఆటలాడుకుంటున్నారు.ఏమండీ చిన్నగా విజిల్ వేస్తూ డ్రైవ్ చేస్తున్నారు.మాధవుడు బాల్యం గడిపిన ప్రదేశాలు చూస్తుంటే పవిత్రమైన భావన కలుగుతోంది.చిలిపి కృష్ణుడు గుర్తొచ్చి, "బడ నట్ కట్ హైరే కిషన్ కన్నయ్యా ,
కా కరూ యశోమతి మయ్యా."
అని కూని రాగం తీస్తూ పరవశించిపోతున్నాను.
"డాడ్"
వెనక నుంచి పిల్లలు పిలిచారు.కూనిరాగం ఆపి,ఏమైందా అని వెనక్కి తిరిగాను.
"వాట్?" అన్నారు ఏమండి.
నాలుగు రోజుల నుంచీ ప్రయాణం చేస్తున్నారేమో ,ఆటలూ, పాటలూ అన్నీ ఐపోయి విసుగొచ్చేసినట్లుంది, "ఇంకెంత దూరం?" అన్నారు కోరస్ గా.
"అట్లా అడగ కూడదు.ఎంతెంత దూరం అని అడగాలి."జవాబిచ్చారు.
"సరే ఎంతెంత దూరం ?" అన్నారు ఇద్దరూ.
ఏమండీ నాతో "ఇప్పుడు నువ్వేమనాలి?" అన్నారు.
ఓహో పిల్లలను ధ్యాస మళ్ళించి, ఎంగేజ్ చేస్తున్నరన్నమాట అనుకొని "కోసు కోసు దూరం." అన్నాను.
"కోసు అంటే ఏమిటి డాడీ? సుపుత్రిక ప్రశ్న.
"కోసు అంటే కొంచం దూరం అన్నమాట.ఏదీ మళ్ళీ అడగండి ఎంతెంత దూరం అని."
"వెనక నుంచి వాళ్ళు ఎంతెంత దూరం అనటం , ముందు నుంచి మేము కోసు కోసు దూరం అనటం.ఇంతలో జునాఘడ్ వచ్చింది.అక్కడే ఓ పక్కన ధాభా దగ్గర ఆపి కాసేపు కూర్చొని,మేము చాయ్, పిల్లలు ఐస్ క్రీం కానిచ్చేసాము.
మళ్ళీ "ఎంతెంత దూరం డాడీ ?"
"కొంచం కొంచం దూరం బేటీ."
సరే ఇంకేం బేటా, బేటీ, డాడీ పాడుకుంటుంటున్నారుగా అని నేను నా కన్నయ్య లోకం లోకి వెళ్ళాను.
"శ్యాం తేరీ, కన్నయ్యా తేరీ బంశీ పుకారే రాధా నాం,
రాధా కాభీ శ్యాం హైతో, మీరా కాభీ శ్యాం హై."
 చిన్న జర్క్ తో కార్ సడన్ గా ఆగింది.నేను ఏమైందా అని చూసాను.ఏమండీ కిందకి దిగి చూస్తున్నారు.
"డాడ్ మేము కార్ తొయ్యం.” పిల్లలు గట్టిగా అరిచారు. ఓసారి ఇలాగే సుధీర్ పాత కార్ లో పిక్నిక్ కు వెళితే, కార్ స్టార్ట్ చేయాల్సిన ప్రతిసారీ కొద్ది దూరం తోస్తే కాని ముందుకు పోనని మారాము చేసేది.పాపం పిల్లలు పిక్నిక్ సరదా లో కార్ వెనుక చేరి వాళ్ళ డాడీ చెపుతుంటే "హైలెస్సో హైలెస్సా "అని నెట్టారు.పైగా అప్పుడు వాళ్ళ పిల్లలిద్దరు, మా పిల్లలిద్దరు , సుధీర్ ఉన్నారు కాబట్టి సరిపోయింది.ఆ తరువాత ఆ కార్ మళ్ళీ ఎక్కమని ప్రతిజ్ఞ చేసారు.అది గుర్తొచ్చి ,"మేము తొయ్యమంటే తొయ్యం ."అని గొడవ మొదలుపెట్టారు.
"అబ్బ ఆగండి డాడీ చూస్తున్నారు గా ఏమైందో."అన్నాను.
ఏమండి లోపలికి వచ్చి "అంతా బాగానే ఉంది, పెట్రోల్ చెక్ చేస్తాను "అని చెక్ చేసి,"అరే పెట్రోల్ తక్కువగా ఉందే.ముందు చూసుకోలేదే "అన్నారు.
"అమ్మో మరి ఎట్లా ?బరోడా ఇంకెంత దూరం ఉంది? ఎట్లా వెళుతాము?"అన్నాను గాభరాగా.
"ఇంకో గంటా ,రెండు గంటలు పట్టవచ్చు.చూద్దాం అక్కడి దాకా వస్తుందిలే."అన్నారు కాస్త నీరసంగా.
"కొంచం ఉంది కదా.దారి లో ఎక్కడైనా పెట్రోల్ బంక్ కనిపిస్తే పోయించుకుందాం లెండి."అన్నాను.
కార్ స్టార్ట్ చేసి "డబ్బులు లేవు ఐపోయాయి."అన్నారు .
"ఆ"అన్నాము ముగ్గురమూ ఒక్కసారే పెద్దగా.చూద్దాం అన్నారు.అప్పటి దాకా అందంగా కనిపించి, ఊహల్లో విహరింపచేసిన ఆ ప్రదేశం ఇప్పుడు భయం కలిగిస్తోంది.
"పోనీ లెండి. నా చెవికి రింగులున్నాయి. చేతికి గాజులున్నాయి.అవెక్కడన్నా అమ్మవచ్చు." అన్నాను కాస్త తేరుకొని.
"ఎక్కడ అమ్ముతావు ?"అన్నారు.
నిజమే ఎక్కడ అమ్ముతాము ?అంతా అడవి లాగా ఉంది .రోడ్ కు రెండు వైపులా దయ్యాల్లా పెద్ద పెద్ద చెట్లు తప్ప ఎక్కడా ఊరు కనిపించటం లేదు.పిల్లలు "డాడ్ ఇప్పుడేం చేద్దాం." అన్నారు ఏడుపు గొంతుతో.
"ఓ పని చేద్దాం. మనం జలారాం ను దర్శించుకొని వచ్చాము కదా ఆయననే ప్రార్దిద్దాం క్షేమం గా బరోడా చేర్చమని.సరే నా అనండి , శ్రీరాం, జై రాం,జై జలారాం.అని మనం ఇంటికెళ్ళేదాకా భజన చేయండి ఓకే నా స్టార్ట్." అన్నారు.
పిల్లలిద్దరూ "శ్రీరాం, జై రాం,జై జలారాం"అని భజన మొదలు పెట్టారు.
"అహ్మదాబాద్ లోనే అన్నాను మొదట్లోనే షాపింగ్ ఎందుకు అని.అన్ని బట్టలు కొన్నారు.అవి కొనకుండా ఉంటే డబ్బులైపోయేవి కాదు కదా."చిన్నగా గొణిగాను.
"ఏదో నువ్వు సంతోషిస్తావని కొన్నాను కాని ఇట్లా అవుతుందనుకున్నానా?"విసుక్కున్నారు.
ఇంకా ఏమీ మాట్లాడే ధైర్యం లేక "నాకోసం కొన్నారట."అని గొణుక్కుంటూ పిల్లలతో నేనూ గొంతుకలిపాను శ్రీరాం, జై రాం,జై జలారాం అంటూ.పాపం అనీ అనీ నీరసిస్తున్నారు పిల్లలు అనుకున్నట్లున్నారు."ముగ్గురూ ఒకేసారి కాకుండా ఒకళ్ళ తరువాత ఒకరు  బారీ బారీ అనండి."అన్నారు ఏమండీగారు.
ఏమి చేస్తాం హై కమాండ్ ఆర్డర్.మధ్య మధ్య "డాడ్ ఇంకెంత దూరం ఉంది ?"అని అడుగుతున్నారు.ఎంతెంత దూరం అనుకుంటూ అమ్మయ్య మొత్తానికి చీకటి పడక ముందే ఇంటికి చేరాము.ఇంటి ముందు కార్ ఆగగానే ఊఫ్ అమ్మయ్య జలారాముడు క్షేమంగా చేర్చాడు అనుకున్నాను.పిల్లలిద్దరూ "హే హే హే"అని సంతోషంగా అరుచుకుంటూ కార్ లో నుంచి దూకినట్లుగా దిగారు.ఏమండీ డిక్కీ తీస్తుంటే, "ఇంటి కీ ఇవ్వండి"అని అడిగాను.
జేబులో నుంచి కీ తో పాటు పర్స్ కూడా వచ్చింది.అదీ అందుకున్నాను.అప్రయత్నంగా పర్స్ లో చూస్తే వంద రూపాయల నోటు, ఇంకా చిల్లర నోట్లూ కనిపించాయి."డబ్బులున్నాయిగా?లేవన్నారేమిటి?"అడిగాను ఆశ్చర్యంగా.
"కార్ లో పెట్రోల్ కూడా ఉంది."అన్నారు నవ్వుతూ.
"ఐతే "ఆ తరువాత ఏమనాలో తెలీక ఏమండీ వైపు చూసాను.పిల్లలు కూడా గంతులాపి మావైపు చూసారు.
"మీకందరికీ బోర్ కొడుతోందని , కాస్త ఉషార్ చేద్దామని అట్లా చెప్పాను."అన్నారు నవ్వుతూ .పిల్లలిద్దరూ "డాడీ" అంటూ ఏమండీని కొట్టసాగారు.ఏమండీ వాళ్ళ నుంచి తప్పించుకుంటూ,"నేనట్లా మిమ్మలిని భజన చేయించకపోతే డాడీ ఎంతెంత దూరం అంటూ ఎంత గోల చేసేవారు."అని తల పైకెత్తి ఓ అంటూ బిగ్గరగా నవ్వారు.
(సాహితి-29/4/2020)

( ఈ కథా కాలం 1983.అప్పుడు పోర్ బందర్ లో రోడ్ లవీ అట్లాగే ఉండేవి.ఇప్పుడు చాలా డెవలప్ అయ్యింది.చౌపాటీలో ఉండక్కర లేదు.ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయట.అట్లాగే వీర్ పూర్ కూడా బాగా డెవలప్ అయ్యిందిట.షిరిడీ సాయిబాబా లాగా మేమంతా జలారాం ను కొలుస్తాము.మేము రెగ్యులర్ గా వెళుతుంటాము అని చెప్పింది మా ఫ్రెండ్ ఉష. అలాగే అప్పుడు వంద రూపాయలంటే ఎక్కువ మనీ కిందే లెక్క  :) పాఠకులు ప్రశ్నించకుండా ముందు జాగ్రత్త అన్నమాట.)Tuesday, March 3, 2020

Wednesday, February 26, 2020

Tumhin Meri Mandir

Tuesday, February 25, 2020

కొబ్బరి మిథాయి

రేపు మా అమ్మాయి యు.యస్ వెళుతోంది.మధ్యలో ఒక రోజు దోహా లో పని ఉంది ఆగుతానన్నది.దారిలో తినడానికి కర్రుం కుర్రుం ఏమైనా చేసిపెట్టు మమ్మీ అంది. అన్నదే కాని నేను చేసేదాకా ఆగకుండా పుల్లారెడ్డి నుంచి కారప్పూస ,భక్ష్యాలు తెప్పించుకుంది.ఐనా నాకు మనసు ఆగక కొబ్బరి మిఠాయి చేసాను.పనిలో పని పది రోజుల క్రితం చేసిన మైసూర్పాక్ కూడా ( ఎందుకైనా మంచిదని ఫొటో తీసాను లెండి) చూసేయండి.
నేను ఏ పనికైనా ఎక్కువ కష్టపడనబ్బా .చాలా ఈజీ బూజీ వి చేసుకుంటాను రాతలైన , వంటలైనా :)
పచ్చి కొబ్బరి కోరు -1 గ్లాస్
పంచదార -1 గ్లాస్
ఇలాచీ పౌడర్
చిటికెడు సోడా ఉప్పు
ఒక కప్ నెయ్యి.
కొబ్బరికోరు,పంచదార బాగా కలిసేటట్టుగా కలుపుకొని మూకుట్లో వేసి ,సిం మీద పెట్టి కరిగే వరకు తిప్పుతుండాలి.పంచదార కరిగాక కప్ పాలు పోసి దగ్గరకు వచ్చేదాకా తిప్పుతూ (కలుపుతూ) ఉండాలి.దగ్గర పడి , పాకం కొద్దిగా గట్టిపడిందనుకున్నాక ( నేనైతే కొంచం అంటే ఎంతో లేదు చిటికెడు తీసి పళ్ళెం లో వేసి ,కాస్తా ఊదుకుంటూ చెంచాతో నోట్లో వసుకొని చూస్తుంటాను.అబ్బా పూర్తయ్యేలోపల వేరే వాళ్ళకు మిగులుతుంది లెండి) ఇలాచి పొడి వేసి ఓ కలుపు కలిపి, సోడా ఉప్పు వేసి బుస బుస పొంగుతుండగా ,ముందుగా నెయ్యి రాసి ఉంచుకున్న పళ్ళెం లోకి వంచేయాలి.హుం చూసారా నెయ్యి సంగతి మరిచేపోయాను.పళ్ళెం లోకి వంచేసాక గుర్తొచ్చింది ఏమి చేయను మరి మతిమరుపు ఎక్కువైపోయింది.మీరు మటుకు పాలు పోసిన తరువాత ,మిఠాయి దగ్గరగా వస్తున్నప్పుడే వేడిగా కరిగి ఉన్న నెయ్యి కప్పెడు వేసేయండి.నెయ్యి వేస్తే కమ్మగా ఉంటుంది.(వేయకపోయినా బాగానే ఉంది మమ్మీ అంది పాపం పిచ్చిపిల్ల )

Tuesday, January 21, 2020

చోరీ చోరీ


చోరీ చోరీ
మేము బరోడాలో ఉన్నప్పుడు ఓ సారి సినిమాల కబుర్లు వస్తే మా కల్పనాదీదీతో రాజ్ కపూర్ ,నర్గీస్ సినిమాలు చాలా బాగుంటాయని విన్నాను కాని చూడలేదు అన్నాను.అదేమిటీ రాజ్ కపూర్ ,నర్గీస్ సినిమా చూడని జన్మ వేస్ట్ అంది.అయ్యో మరెలా నా జనం వ్యర్ధమైపోయిందే అని చింతిస్తుంటే చింత వద్దు చెల్లీ, ఇప్పుడు ఓ థియేటర్ (చాలా ఏళ్ళైపోయింది కదా , ఆ థియేటర్ పేరు గుర్తులేదు)లో రాజ్ కపూర్ సినిమాల వారం నడుస్తోంది.ఇప్పటికే మూడు సినిమాలైపోయాయి, నీ అదృష్ఠం మిగితా నాలుగూ చూద్దువు,అందులో రెండు నర్గీస్ ,రాజ్ కపూర్ ల వి కూడా ఉన్నాయి  పదా అని "చోరీ చోరీ,శ్రీ 420,మేరానాం జోకర్, సంగం" రాజ్ కపూర్ సినిమాలను నాలుగు చూపించింది.అందులో మేరా నాం జోకర్ అంతగా నచ్చలేదు.మిగితా మూడూ చాలా నచ్చేసాయి.అందులో చోరీ చోరీ ఇంకా నచ్చి ఇప్పుడు కూడా అప్పుడప్పుడు యూట్యూబ్ లో పాటలు చూస్తూ ఉంటాను.
మల్టీ మిలియనీర్ గిరిధారీలాల్ ఏకైక కూతురు కమ్ము.కమ్మును గిరిధారీలాల్ తల్లిలేని లోటు తెలియకుండా ముద్దుగా పెంచుకుంటాడు. తన ఐశ్వర్యం చూసి కాకుండా కమ్మూని మనస్పూర్తిగా ఇష్ఠపడిన అబ్బాయితో వివాహం జరిపించాలనుకుంటాడు.కాని కమ్మూ సుమన్ కుమార్ అనే పైలట్ ను ప్రేమిస్తుంది.గిరిధారీలాల్ అతని గురించి వాకబు చేస్టే వుమనైజర్ అని తెలుస్తుంది.విషయము కమ్మూకు చెప్పి అతనినికి ఇచ్చి పెళ్ళిచేయటము ఇష్ఠంలేదని చెపుతాడు.కానీ కమ్మూ వినకుండా షిప్ లో నుంచి పారిపోతుంది. కమ్మూ జాడ తెలిపిన వారికి 1.25 లక్షరూపాయలు బహుమతి ఇస్తానని ,రేడియోలో, న్యూస్ పేపర్ లో ప్రకటిస్తాడు గిరిధారీలాల్.షిప్ నుంచి తప్పించుకున్న కమ్ము సుమన్ ను కలుసుకునేందుకు బస్ లో ప్రయాణిస్తుంది.సాగర్ అనే ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్. తన కథ పారితోషకము ఎడిటర్ దగ్గర నుంచి తెచ్చుకునేందుకు అదే బస్ లో బెంగుళూర్ కు వెళుతుంటాడు.సాగర్ కమ్మూ గురించిన వార్త పేపర్ లో చూస్తాడు.బస్ దారిలో టీ కోసం ఆపినప్పుడు , కమ్మూ ప్రకృతి చూసి పరవశించిపోతూ బస్ మిస్సవుతుంది.సాగర్ కూడా కమ్మూ కోసం ఉండిపోతాడు.ఇద్దరూ తరువాతి బస్ లో బయిలుదేరుతారు.కొద్ది దూరం వెళ్ళాక ఆ బస్ బ్రేక్ డౌన్ అవటం తో , సాగర్ , కమ్మూ ఒక హోటల్ లో భార్యాభర్తలమని చెప్పి గది తీసుకుంటారు.వారి ఆ ప్రయాణం లో కమ్మూ కు సుమన్ గురించిన నిజాలు తెలుస్తాయి.అతని మీద మనసు విరిగిపోతుంది.సాగర్,కమ్మూ ఇద్దరూ ప్రేమించుకుంటారు.పెళ్ళి చేసుకుందామనుకుంటారు.హోటల్ డబ్బులు కట్టేందుకు , పెళ్ళికోసం అనీ డబ్బులు ఎడిటర్ ను  అడిగి తెచ్చేందుకు సాగర్ బెంగుళూర్ వెళుతాడు.సాగర్ ఇలా వెళుతున్నానని రాసి పెట్టిన ఉత్తరం ఎగిరిపోయి,సాగర్ తనను వదిలేసి వెళ్ళిపోయాడని భావించిన కమ్మూ , తన వార్త తెలిసి వెతుక్కుంటూ వచ్చిన తండ్రితో వెళ్ళిపోతుంది.తిరిగి వచ్చిన సాగర్ కమ్మూ తండ్రితో కలిసి కార్ లో వెళుతుండటము చూసి కమ్మూ ను అపార్ధం చేసుకుంటాడు.దిగులుగా ఉన్న కమ్మూ సుమన్ కోసం దిగులు పడుతోందని భావించి గిరిధారీలాల్ కమ్మూ పెళ్ళి సుమన్ తో నిశ్చయిస్తాడు.సరే చివరికి అపార్ధాలు తొలిగి సాగర్,కమ్మూ ఒకటవుతారు
ఇదీ చోరీ చోరీ సినిమా కథ. ఇందులో సాగర్ గా రాజ్ కపూర్ ,కమ్మూ గా నర్గిస్,సుమన్ గా ప్రాణ్ నటించారు.
రాజ్ కపూర్ నర్గీస్ ల నటన గురించి చెప్పేదేముంది.నాకైతే ఇద్దరూ చాలా నచ్చేసారు.రాజ్ కపూర్ కళ్ళల్లో ప్రేమని ఎంత బాగా చూపించాడో.నర్గీస్ ను  ముందు చూడగానే పెద్ద పర్సనాలిటీ అనిపించింది కాని తరువాత ఆమె నటన ముందు ఆ పర్సనాలిటీ కనిపించలేదు.ఎంతైనా ఆనాటి వారు హావభావాలు పలికించటంలో సిద్ద హస్తులు. చాలా బాగా అనిపించింది.సినిమా అంతా చాలా నీట్ గాఉంది.ఎక్కడా వెకిలి శృగారంకాని , అతి హాస్యం కాని లేదు.అసలు సినిమా చూస్తుంటే బోర్ గా కూడా అనిపించలేదు.
 l.b.లచ్మన్ నిర్మించగా అనంత్ ఠాకూర్ దర్శకత్వం వహించారు.Aghajani Kashmeri కథా రచయిత.ఇది 1956 లో a,v,m, ప్రొడక్షన్ ద్వారా రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా కు సంగీత సమకూర్చిన శంకర్ జై కిషన్ కు బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ వచ్చింది.పాటలు అన్ని కూడా బాగున్నాయి.ఆల్ లైన్ క్లియర్ పాట లో జానీవాకర్ కుటుంబం తో మార్చ్ చేసుకుంటూ వెళుతుంటే భలే నవ్వొచ్చింది."సవా లాఖ్ కీ లాటరీ"పాట లో రాజసులోచన,భగవాన్ లను చూసి నవ్వుకోవచ్చు.నర్గీస్ "పంచి బనూ ఉడితి ఫిరూం"అని పాడుకుంటూ హాయి వెళుతుంటే నిజంగా అలా పక్షిలా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది.ఆ పొలాలు , ఆ పరిసరాలూ చాలా బాగా చూపించారు."యెహ్ రాత్ భీగి భీగి","జహన్ మై జాతి హూన్","ఆజ సనం మధుర్ ఛాంద్ ని మే"పాటలు లతా మంగేష్కర్, మన్నాడేలా గళం లో మధురంగా సాగిపోయాయి."రసిక బలమా","మన్ భావన్ కె ఘర్ జాయే గౌరి"పాటలు మనసును భారం చేసాయి.ఇలా అన్ని పాటలు బాగున్నాయి.అన్నట్లు ఓ తిల్లానా కూడా ఉంది.
"ఆజా సనం మధుర చాందినీ మే హం తుం "పాట లో చందమామ ఏమి అందాలు చిందించాడో!
"ఓరే సాజన్ లేచల్ ముఝే తారోంకే పాస్
లగతానహీ దిలా యహా".
Aaja sanam madhur chandni mein hum
Tum mile to wirane mein bhi aa jayegi bahaar
Jhumne lagega aasman
Jhumne lagega aasman
Kehta hai dil aur machalta hai dil
More saajan le chal mujhe taaron ke paar
Lagta nahin hai dil yahan
Lagta nahin hai dil yahan
Bheegi bheegi raat me, dil ka daaman thaam le
Khoyi khoyi zindagi, har dam tera naam le
Chand ki behki nazar, keh rahi hai pyaar kar
Zindagi hai ek safar, kaun jaane kal kidhar
Chand ki behki nazar, keh rahi hai pyaar kar
Zindagi hai ek safar, kaun jaane kal kidhar
Aaja sanam madhur chandni mein hum
Tum mile to wirane mein bhi aa jayegi bahaar
Jhumne lagega aasman
Jhumne lagega aasman
Kehta hai dil aur machalta hai dil
More saajan le chal mujhe taaron ke paar
Lagta nahin hai dil yahan
Lagta nahin hai dil yahan
Dil ye…

(పాట పదాలు గూగుల్ సౌజన్యం తో)
ఈ పాట సంస్క్రుత వర్షన్ లో కూడా ఉందని .డీడీ చానల్ వాళ్ళు కొన్ని పాటలు సంస్క్రుతం లోకి మార్చమంటున్నారని .ఇది కూడా బాగుంది.కలర్ లోకి కూడా మార్చారు ఈ పాటను.


Wednesday, January 15, 2020

Monday, January 13, 2020

Thursday, January 9, 2020

Aa Ja Re Ab Mera Dil Pukara - Raj Kapoor - Nargis - Aah - Lata - Mukesh ...

Aa Ja Re Ab Mera Dil Pukara - Raj Kapoor - Nargis - Aah - Lata - Mukesh ...

Thursday, January 2, 2020

2019 !!!

2019
మహిషి గంటలు గణగణా మోగిస్తూ
నువ్వెంత నీ బతుకెంత అని
విజయగర్వం తో వికటాట్టహాసం చేసూ
వెనుదిరిగింది 2019
20202 ఐనా 2030 ఐనా ఒకటే!