Saturday, July 31, 2010

సొరకాయ పాల పిండి మిరియం చెప్పకుండా నన్నెవరూ ఆపలేరు - ఇంక్విలాబ్ జిందాబాద్ !!!!!

' మీ ఇంట్లో ఏవైనా విలువైన వస్తువులు , నగలు , డబ్బు వగైరా వుంటే బియ్యం డబ్బాలోనో , దేవుడి పీట కిందో దాచుకోండి . ఎందుకంటే ఈ మద్య దొంగల బెడద ఎక్కువైంది . ' అని పొద్దున్నే కాలనీ సొసైటీ ఆఫీస్ నుండి సర్క్యులర్ వచ్చింది . ' ఆ మనింట్లో ఏమున్నాయి లెండి , బియ్యం డబ్బాలో , దేవుడి పీట కింద దాచుకుందుకు ' అని మా వారి తో అన్నాను . ఏమో నీ లాప్ టాపే ఎత్తుకుపోవచ్చు వాడు అన్నారు మా ఆయన జోక్ గా . నా లాప్ టాపా . పాత డొక్కుది , వాడేం చేసుకుంటాడు . . . . చక్ *** లైట్ వెలిగింది బుర్ర లో ((( . . . అయ్య బాబోయ్ ఇది విదేశీ కుట్ర కాదు కదా అసలికే నేనీ మద్య సొరకాయ వంటకాలు ఎక్కువగా రాస్తున్నానని మానేయమని బెదిరిపు మేయిల్స్ వస్తున్నాయి . .ఎవరైనా స్వదేశీ మిత్రులు నాకు క్లూ ఇస్తున్నారే మో , నీ లాప్ టాప్ పేల్చేసే ప్రయత్నాలు జరుగు తున్నాయి , జాగ్రత్తగా బియ్యం డబ్బాలో నో , దేవుడి పీటకిందో దాచు అని . లేక పోతే మా కాలనీకి దొంగలు రావటమేమిటి ? వాడి మొహం వాడి కేమి , సారీ దొంగ గారు , వారికేమి దొరుకుతాయి , ఇక్కడ ఏ ఓల్డ్ మెడల్సో తప్ప !

ఐనా వాళ్ళ పిచ్చి కాని , బెదిరిం పు మేయిల్స్ , ఇక సొరకాయ గురించి రాయటము ఆపండి బాబొ అనే వేడికోళ్ళు నన్నేమి చేయగలవు ? పిచ్చమ్మాయిలు . సొరకాయ వద్దు , ఆలు ముద్దు ' అని నాతో వంద సార్లు ఇంపోజిషన్ రాయించారు . ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయనే మా కంప్యూటర్ సార్ ముందుగా కాపీ , పేస్ట్ నేర్పించారు . వందసార్లేమి ఖర్మ వెయ్యి సార్లు ' సొరకాయే ముద్దు , ఆలు వద్దు ' అని రాయగలను . ఇలాంటి , అలాంటి వేవీ నన్ను సొరకాయ వంటలు రాయకుండా ఆపలేవు . వెలిగే సూర్యుని కి అర చేయి అడ్డు పెట్టి ఆపలేరు . ఇంక్విలాబ్ జిందాబాద్ . దీనికి ఈ వాక్యం సరిపోక పోయినా ఇలా అంటే బాగుంటుందిట .

ఈ రోజు నేను చెప్పబోయే సొరకాయ వంట ' సొరకాయ పిండి మిరియం ' ఓ చిన్న వివరణ . ఇది నా వంటకము కాదు , మా మేనకోడలు , స్నిగ్ధ , వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకొని , తన ' స్నిగ్ధాస్ కిచెన్ ' లో రాసుకున్నది . అడుక్కున్న అమ్మకు అరవైఆరు వంటకాలు దొరుకుతాయి . నా సొరకాయ వంటలకున్న ఏకైక అభిమాని అ. సౌమ్య కోసం , ఈ మాల ఏమైనా చేయగలదు . ఈ బెదిరింపులకు భయపడకండి సౌమ్యా . నా నెక్స్ట్ వంటకం ' సొరకాయ కోఫ్తా ' . మావారు ఈ మసాలా వంట నేను తినను చేయకు అని మారాము చేస్తున్నారు కాని , మీకెందుకు , బుజ్జగించో , బెదిరించో . మీ కోసం ' సొరకాయ కోఫ్తా ' చేస్తాగా . ఇదే ఈ మాల శపఢం !! ఇంక్విలాబ్ జిందాబాద్ !!!!

సొరకాయ పాల పిండి మిరియం చేసేవిధానం తెలుసుకుందామా .
కావలసినవి ,
సొరకాయ - 1,
ఉప్పు సరిపడ ,
బెల్లం రెండు చెంచాలు .

పొడి కి కావలసినవి ;
మిరియాల పొడి 1 స్పూన్ ,
బియ్యం 2 స్పూన్లు ,
ధనియాలు 1 స్పూన్ ,
శెనగపప్పు 2 స్పూన్లు ,
ఎండుమిరపకాయలు 2,
ఎండు కొబ్బరి పొడి 1 స్పూన్ ,
మెంతులు 1/4 స్పూన్ .
ముందుగా పొడి కోసం చెప్పిన వన్నీ , నూనె లేకుండా వేయించుకొని , మెత్తగా పొడి చేసుకోవాలి .
సొరకాయముక్కలను ఆవిరి లో వండాలి .
తరువాత ఒక బాణలి లో కొద్దిగా నూనె వేసి వేడి చేసి , ఆవాలు , శెనగ పప్పు , ఇంగువ పోపు చేసి , అందులో కరివేపాకు వేసి , ఉడికించిన సొరకాయ ముక్కలను వేయాలి . బెల్లము ను , ముందుగా పొడిచేసి సిద్ధం గా వుంచుకున్న పొడిని వేసి , కొద్ది సేపు ఉడికించాలి .
ఆ తరువాత కొంచం పాలు పోసి , మరి కొంచము సేపు ఉడికిస్తే " సొరకాయ పాల పిండి మిరియం " సిద్ధం .

వచ్చే వారము ఇదే చోట , ' సొరకాయ కోఫ్తా ' పోస్ట్ లో కలుసు కుందాము . అప్పటి వరకు టా టా .

Monday, July 26, 2010

థాంక్ యు ఫ్రెండ్స్




నువ్వు సీనియర్ సిటిజన్ వి కాదు అని మా వారు , నేను జూనియర్ సిటిజన్ ని అని నేనూ అప్పుడప్పుడు ఒకరినొకరిని టీజ్ చేసుకునేందుకు ఇంకొక్క సంవత్సరము మాత్రమే అవకాశం వుంది . లాస్ట్ ఆఫ్ ద ఫిఫ్టీస్ కు వచ్చేసాను . అందుకే ఈసారి పుట్టిన రోజు వెరైటీగా చేసుకుందామా అనుకున్నాను ! ఏలా అని అలోచించగా . . . చించగా . . . ప్రతిసారి , అందరూ నాకు బర్త్ డే విషెస్ చెపుతారు . ఈ సారి అందరికంటే ముందుగా నాకు , నేనే విష్ చేసుకుంటే ఎలావుంటుంది ?? అందరూ నవ్వుతారేమో !!! నవ్వనీ అని ధైర్యం తెచ్చుకున్నాను . అందుకే ' కమల ' పోస్ట్ తయారు చేసుకున్నాను . ' హాపీ బర్త్ డే టు మి ' అని ప్రమదావనం లో పెట్టేందుకు మేయిల్ రెడీ చేసుకున్నాను . రాత్రి 11 .30 అయ్యింది . పొద్దున్నే 6 గంటలకు పబ్లిష్ చేద్దామనుకున్నాను . అమ్మో ఈ జ్యోతి ని నమ్మేందుకు లేదు . అసలే నిన్న సొరకాయ రసిపీ లు అడుగుతాను , మీ నంబర్ కావాలి ఇవ్వండి అని అడిగి తీసుకుంది . హమ్మా జ్యోతీ మీ సంగతి నాకు తెలీదు . . రసిపీల కోసం అవుతే చాటింగ్ లో అడుగుతారు . లేదా మేయిల్ ఇవ్వండి అంటారు కాని ఫోన్ నంబర్ ఎందుకు ? అనుకుంటునే సరే చూద్దాం అని నంబర్ ఇచ్చాను . ఆ సంగతి ఇప్పుడు గుర్తు రావటం ఎంత మంచిదైంది . 12 కల్లా నా పోస్ట్ పబ్లిష్ చేయక పోతే , నా మేయిల్ ప్రమదావనం లో పెట్టకపోతే ఇంకేమైనా వుందా ? ? ? ఇలా ఆలోచించుకుంటూ నా పోస్ట్ కు తుది మెరుగులు దిద్దుతూ . . . వుండగా . . .

ట్రింగ్. . . ట్రింగ్ . . . అని టెలిఫోన్ రింగైంది . మాలా చూడు ఇంత రాత్రి పూట ఎవరు ఫోన్ చేసారో అన్నారు మావారు . ఫోన్ లిఫ్ట్ చేసి , హలో అనగానే మాలా గారున్నారాండి అని ఎవరో ఆడవాళ్ళు అడిగారు . ఒక్క క్షణం భయం వేసి , టెన్షన్ వచ్చింది . ఇంతరాత్రి 11. 30 కు నన్ను అడిగేది ఎవరూ , అని ఆ వన్ సెకన్ లోనే , విద్యానగర్ లోని మా అమ్మ పక్కింటి సరళ , మా అమ్మాయి సంజు తోటి కోడలు లక్ష్మి గుర్తొచ్చి , ఏం వార్త వింటానో అని గుండె దడ దడ లాడుతుండగా మాట్లాడుతున్నాను అన్నాను . హాపీ బర్త్ డే మాలా గారు అని చాలా సంతోషం గా అటు నుండి వినిపించింది . ఒక్క క్షణం ఏం వింటున్నానో అర్ధం కాలేదు . సారీ అండి , మిమ్మలిని నిద్రలేపానా ? అసలు 12 గంటలకు చేద్దామనుకున్నాను . కాని నాకు నిద్ర వస్తోంది అందుకే ఓ అరగంట ముందుగా చేసాను . అన్నారు . అప్పటి కి తేరుకొని , థాంక్స్ అండీ , ఇంకా పడుకోలేదండీ అన్నాను . నేనెవరో చెప్పుకోండి చూద్దాం అని చిలిపిగా అడిగారు . అప్పటికి నా బుర్ర యధా స్తానానికి వచ్చి అమ్మా ఈ ప్లాన్ వేసారా ప్రమదలూ , ఇహ రాత్రంతా ఇలా ఫోన్ లు చేస్తారన్న మాట అని స్వగతం అనుకుంటూ కృష్ణ వేణి గారే నా అన్నా . అంతే ఈసారి అటునుండి అవాక్ !! అమ్మా అమ్మా మాలా గారు ఎలా తెలుసుకున్నారండీ ? అని బోలెడు హాచర్య పోయాక , కాస్త హస్కేసుకొని ఫోన్ పెట్టేసాము .
ఇంకొక పది నిమిషాలు , పది యుగాలుగా ఎదురు చూసి , 12. 05 కు , అటు నా 'కమల ' ను , ఇటు నా మేయిల్ ను పంపేసి ఊపిరి పీల్చుకున్నాను . చూసారా అప్పటికే ఓ ఫోన్ కాల్ వచ్చేసింది . అమ్మయ్యా ఈ లోపల ఇంకెవరూ కాల్ చేయలేదు అనుకుంటూ వుండగా ట్రింగ్ . . . ట్రింగ్ . . ఆ ట్రింగ్ లు ఈ రోజు ఉదయము వరకూ వస్తూనే వున్నాయి . కాదు కాదు ఇప్పుడు ఇది రాస్తుండగా కూడా వచ్చిందోచ్ !
నాకూ డాక్టరేట్ వచ్చేసిందోచ్ టంట టంటా . . . నిజమే * * * సచ్చీ $ $ $ . మహా దానందంగా మా వారికి నా డాక్టరేట్ చూపించాను . ఎవరు ఈ అమ్మాయి ? అన్నారా ఏకధాటిగా చెప్పాను . అదే నండి , చెన్నై లో వుంటుంది . చాలా ఇంటలిజెంట్ . ఫొటో కూడా చూపించాను . తిరుచూర్ణం పెట్టుకుంది . గడ్డం మీద సొట్ట , ఆ అవునవును గుర్తొచ్చింది . చాలా ముచ్చటగా వుంది అన్నాను కదూ , ఆ అమ్మాయా ?? నీకు స్నేహశీలివి అని డాక్టరేట్ ఇచ్చిందా ?? అని తెగ హాచర్య పోయారు . అవును మరి , ' ఎవరి తో మాట్లాడవు . ఎక్కడికెళ్ళినా నోరు బిగించుకొని కూర్చుంటావు . కనీసం చిన్న నవ్వైనా నవ్వవు ' అని 42 ఏళ్ళుగా నాకు క్లాస్ లు తీసుకుంటున్న ఆయన హాచర్య పోయారంటే పోరు మరీ ! మా ఇంట్లో మా వారు , మా అమ్మాయి , మా మనవరాలు మేఘ కు వున్నంత మంది స్నేహితులు ఇంకెవ్వరి కీ లేరు . మా వారి నస భరించలేక , మేఘ ను ఓసారి అడిగాను . అమ్మలూ కొత్తవాళ్ళ తో ఫ్రెండ్షిప్ ఎలా చేసు కోవాలిరా అని . చాలా సింపుల్ బామ్మా , చూడగానే ముందు స్మైల్ ఇవ్వాలి . ఆ తరువాత హాయ్ మై నేం ఈజ్ మేఘ అని చెప్పాలి అని చెపుతుండగా , బంగారూ నేను మైనేమీజ్ మేఘ అంటే నవ్వుతారేమోరా అని అనుమానం వ్యక్తీకరించాను . పో బామ్మా అందుకే నీకెవరూ ఫ్రెండ్స్ లేరు అని తేల్చేసింది . సో మనది అంతటి ఘన చరిత్ర ! నాకు ఆరోజు ఇంకా గుర్తు . కంప్యూటర్ లో సాలిటర్ ఆడుకుంటూ వున్నాను . చిన్నగా , సున్నితంగా పక్కనుండి హాయ్ అని వినిపించింది . ఉలిక్కి పడి ఎవరా అని చూసాను . హాయ్ మాలాగారు నా పేరు సృజనా రామానుజం అండి అంది . నేను మొహమాటం గా హాయ్ అన్నాను . ఆ తరువాత ఏం మాట్లా డాలో తెలీ లేదు . ఆ తరువాత రోజూ సృజన తో మాట్లాడకుండా వుండలేని పరిస్తితి వచ్చింది . తనిచ్చిన ధైర్యం తోనే అందరి తో మాట్లాడాను . ఈ రోజు నా వయసులో సగము కన్న తక్కువ గా వున్న మధురవాణి , సుజ్జి , ప్రియ , సుభద్ర , మంచుపల్లకి , అశోక్ పాపాయ్ లాంటి పిల్లల తో మాట్లాడ గలుగుతున్నాను అంటే అదంతా సృజన మహత్యమే . అయ్యో ఇదేమిటీ సృజనా నాకు రావటము లేదు అనగానే మీరు ఊరికే కంగారు పడకండి అదే వస్తుంది అని ధైర్యం ఇచ్చేదీ సృజననే . నా తొలకరి పోస్ట్ కు రాజ్ కపూర్ , నర్గిస్ ఫొటోలు వెతికి పెట్టింది . చేయి తిరిగిన రచయతలు రాస్తున్నారు , నేనేమి రాయగలు అని భయ పడితే , ప్రోత్సహించి బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ లో తొలి అథిది గౌరవాన్ని తెప్పించిందీ సృజననే . అలాంటి సృజన నాకు స్నేహము లో డాక్టరేట్ ను , నా పుట్టిన రోజున బహుకరించింది . చెప్పలేనంత సంతోషం గా వుంది . కొత్త పెళ్ళికూతురు , నా చిన్నారి స్నేహితురాలు సృజనకు ఆశీస్సులు తప్ప ఇంకేమి ఇవ్వగలను ? ధీర్ఘ సుమంగళీభవ .
ఫోన్ రింగ్ కాగానే లిఫ్ట్ చేస్తే ఎవరో అబ్బాయి ఫోన్ . రాత్రి నుండి ప్రమదావనం ఫ్రెండ్స్ దగ్గర నుండి విషెస్ రిసీవ్ చేసుకుంటున్న నేను , అబ్బాయి గొంతు విన గానే అయోమయం అయ్యాను . పైగా హపీ బర్త్ డే మాలా గారు అన్నడు . ఎవరు చెప్మా ? మొహమాటపడుతూ మీ పేరండి ? అని అడిగాను . కాసేపు పేరు చెప్పకుండా భయపెట్టి , భరద్వాజ నండీ అని నాకు అర్ధం కాలేదని తెలుసు కొని , మలక్పేట్ రౌడీ నండి అన్నాడు . వెంటనే రిసీవర్ చేతి లోనుండి జారి పోయింది . కాళ్ళూ చేతులూ గజ గజ లాడి పోయాయి . ఓ ఎప్పుడో మీరు మలక్ పేట్ రౌడీ ఐతే మాకు యూసుఫ్ గూడా రౌడీ లున్నారు జాగ్రత్త అన్నాను . అప్పుడు అన్నానే కాని చాలా భయపడ్డాను . ఈ రౌడీ కొట్టటానికి వస్తాడే మో నని . ముందు జాగ్రత్త చర్యగా , మా అబ్బాయిని నీకెవరన్నా రౌడీ లు తెలుసారా అని అడుగుతే ఎందుకు మాతే అన్నాడు . చెపితే బ్లాగ్ వొద్దు ఏ వద్దూ మానేయ్ అంటాడని ఊరికే అడిగాను లేరా అన్నాను . మావారిని అడగాలంటే భయం . మా పనమ్మాయ్ శారద , అమ్మా సరస్వతి పనిచేసేది ఒక రౌడీ ఇంట్లో నే నమ్మా అని చెప్పింది . సరస్వతి పనికి రాగానే అడిగాను , నువ్వు పని చేసే ఇంకో ఇల్లు రౌడీ దా అని . అవునమ్మ దేనికి అన్నది . అవసరమొచ్చినప్పుడు చెపుతానులే అని , రోజూ బాల్కనీ లో కూర్చున్నప్పుడు ఎవరైనా రౌడీలు ఇంటి మీదికి గొడవకు వస్తున్నారా అని భయపడుతూ వుండే దాని . రాలేదు . చిన్న చిన్న గా ఆ సంగతి మర్చి పోయాను . ఇప్పుడు ఫోన్ లో మలక్ పేట్ రౌడీని అనగానే అంతా గుర్తొచ్చింది . సంవత్సరం తరువాత , ఇప్పుడు పోట్ల్లాటకు వచ్చాడా ఈరౌడీ . అందులోనూ పుట్టిన రోజున . ఏం చేయనురా దేవుడా అని భయ పడ్డాను . విష్ చేసి ఫోన్ పెట్టేసారు కాని భయపడుతూనే వున్నాను .
ఇంతలో ప్రమదావనం లో మలక్ పేట్ రౌడీ గారు ఓ పొస్ట్ వేసారు అని లింక్ వచ్చింది . అంతే ఈ రౌడీ గారు ఏ రాసారురా దేవుడా అను కుంటూ పడుతూ లేస్తూ అటు పరుగెత్తాను . నా కళ్ళను నేను నమ్మలేక పోయాను . ' మాలకు విరుల స్వర మాలిక ' వావ్ . ఎంత ఆచర్యం ! ఎంత ఉద్వేగం ! ఏమాత్రమూ ఊహించనిది . భరద్వాజ గారు , రౌడీలను వెంటవేసుకొని వచ్చి కొట్టిస్తారనుకున్నాను కాని ఇలా మీ అమ్మగారిని , పాపను వెనకేసుకొచ్చి పాట తో కొడతారనుకోలేదు . సీతా లక్ష్మిగారూ , నేనెవరో తెలీక పోయినా , నా కోసం చాలా అద్భుతమైన పాటరాశారు . మీకు చాలా చాలా ధన్యవాదాలండి . బంగారుతల్లి అనఘ , చాలా బాగా పాడావురా . అలా వింటూనే వుండి పోయానురా అమ్మలూ . నీ పాట కు మా మేఘ , గౌరవ్ డాన్స్ చేసారు . అందరికీ ఎంత నచ్చిందో చెప్పలేను . నిన్న మా ఇంటికి వచ్చిన వారందరికీ నీ పాట వినిపించాము . ఇండియా వచ్చినప్పుడు నీకు పెద్ద ట్రీట్ ఇస్తాను . ప్రామిస్ . ఈ లోపల మీ డాడీని నాతరుపున పెద్ద కాడ్బరీ చాక్లెట్ , ఐస్క్రీం కొనివ్వమని చెప్పు . డబ్బులు మాత్రం నేనివ్వను . థాంక్ యూ బంగారు థాంక్ యూ వెరీమచ్ . రౌడీ గారు , మీకు , మీ వెనకనున్న లేడీ డాన్ కు కూడా థాంక్స్ అండి .( కొంచం దూరం నుండి చెపుతున్నాను . ఎంతైనా రౌడీ గారు కదా భయం )
నా పుట్టినరోజున , వారి మొదటి అతిధి రచయిత్రి గౌరము నిచ్చి , ఈ పోస్ట్ ను ప్రచురించిన బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ టీం కు ధన్యవాదాలు .

రాత్రి కృష్ణ వేణి గారి తో మాట్లాడాక , నా పోస్ట్ , మేయిల్ పెడుదామని సిస్టం ఓపెన్ చేయగానే గా , సత్యవతి గారి విషెస్ కనిపించాయి . సత్యవతి గారు థాంక్ యు అండి .

అసలు కూర్చునేందుకు ఓపిక లేదు అన్నారు తృష్ణ . కాని ఓపిక చేసుకొని నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు మేయిల్ ద్వారా పంపిన తృష్ణ గారూ , మీరు దిగులును మర్చిపోయి , తొందరగా తేరుకొని , మళ్ళీ మాకు మీ బ్లాగ్ ద్వారా రచనలు అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలండి .
కృష్ణ వేణి నైతే వెంటగుర్తుపట్టేసాను కాని తరువాత వచ్చిన ఫోన్ ఎవరిదో తొందరగా గుర్తుపట్టలేక పోయాను . చెపుకోండి చూద్దాం , మీరు అండి అనే దానిని కాదు అన్నది ఎవరబ్బా ? ఐతే సుజ్జి వి కాదు అన్నాను . ఏం సుజ్జి చేసేసిందా ఆరాటం వినిపించింది గొంతులో . అవును మరి 12 కాగానే చేస్తే , తనకన్నా ముందు సుజ్జి చేసేసి వుంటే ? చేయలేదు కాని తన గొంతును గుర్తుపట్టగలను అంటుండగానే గుర్తొచ్చింది , ఆ మధురవాణి వి కదూ ? అవునండి . ఓకే నెక్స్ట్ ఎవరో అనుకుంటూ వుండగా మొహమాటం గా చిన్నగా మాలాగారాండీ , హాపీ బర్త్ డే అండి , నేను దుర్గనండి అన్నారు అమ్మయ్య కాస్త మెదడుకు పని తగ్గింది . ఇంతలో ఫో రింగ్ కాగానే లిఫ్ట్ చేసి థాంక్ యు అన్నాను . అరే నేను విషెస్ చెప్పకుండానే థాంక్ యు చెప్పేస్తున్నారే ,గుర్తుపట్టారా ? మరి ఇప్పుడు మీరంతా కాల్ చేసేది విష్ చేయటానికేకదా అన్నానే కాని ఎవరైవుంటారు అని ఆలోచిస్తూనే వున్నాను . పాపం ఎక్కువ కష్ట పెట్టకుండా నే భావన నండీ అన్నారు . వాళ్ళ అబ్బాయి తో కూడా విషెస్ చెప్పించరు . భావనగారబ్బాయి , నువ్వు సిగ్గు పడుతూ చెప్తుంటే నేనూ , నీ పేరు అడగ లేదు . థాంక్ యూ కన్నా . తెల్ల వారు ఝాము నుండి ప్రయతిన్స్తున్నా , ఇంత బిజీ ఏమిటీ తల్లీ ? ఇంకెవరు జయ నే . సంగతి చెప్పగానే సరే సరే నేను పెట్టేస్తున్నా , ఇంకెంత మంది ఎదురుచూస్తున్నారో అంటూ విష్ చేసి పెట్టేసింది . నెక్స్ట్ ఎవరబ్బా . . మాలాగారండి హాపీ బర్త్డే నేనెవరో చెప్పుకోండి . బాబ్బాబు చెప్పేద్దురూ . నేనండీ శ్రీలలితను . అమ్మో వీరితో జాగ్రత్తగా మాట్లాడాలి . లేక పోతే ఇంకేమైనా వుందా నా మీద , పద్యమో పాటో రాసేస్తారు . ఒహో నెక్స్ట్ ఎవరు చేస్తున్నారా అని క్యూరాసిటీ . . . నేనండీ ఎవరూ ? రాజమండ్రి యాస ',ఆ సుభద్ర కదూ ' ' కాదండీ ' .' ఓ ఐతే లలిత అవునా ' అవునండీ బాబూ కనిపెట్టేసారే .' ' మరి మీ బాష పట్టించింది లెండి . ' గొప్పగా అన్నాను . అటునుంచి నవ్వు . ' కావాలనే అలా మాట్లాడానండి ' . తుస్ . . . ఎంతైనా హాస్యపు జల్లు కదా ! అసలు కథా నాయకి ఏదీ ఇంకా రాదే ?? ఆ వస్తున్నానండి , ఇప్పటి దాకా మీ పని మీదే వున్నానంటూ రానే వచ్చారు , ఫోన్ కాల్ తో జ్యోతి . పొద్దున్నే నేనెవరో చెప్పుకోండీ అంటూ ఫోన్ . మీకు బాగా తెలిసిన దానిని అంటూ కాసేపు ఊరించి ఊరించి , జాజిపూలు పేరు విన్నారా అన్నారు . హేమిటీ , నేస్తం గారా , అయ్య బాబోయ్ భూమి పైకి తేలి పోతున్నానే . . వుండండి వుండండి కుర్చీ తెచ్చుకుంటా . అంతే ఆ తరువాత బోలెడు కబుర్లు . పెట్టేసాక , అయ్యో పేరైనా అడగలేదే , సెల్ నంబరైనా అడగలేదే . ఎంత గడుసుగా పేరు , నంబర్ చెప్పకుండా , అసలు అడగకుండా మాటల్లో పెట్టేసారు ! అందరూ చెప్పేసినట్లే ఇక పోస్ట్ రాద్దామని మొదలు పెట్టాను . అంతే ట్రింగ్ అంటూ పలకరించారు పి.యస్ .యం లక్ష్మి గారు . ఆవిడనూ వెంటనే గుర్తుపట్టేసాను . ఇద్దరమూ చాలా సేపు కబుర్లేసుకున్నాము .
బయట వాన జల్లు - ఇంట్లో శుభాకాంక్షల జల్లు ల తో ఈ పుట్టిన రోజు ను చాలా త్రిల్లింగ్ గా చేసాయి . చాలా చాలా సంతోషాన్ని పంచారు మితృలు .

ఫోన్ ద్వారా , ప్రమదావనం ద్వారా , శుభాకాంక్షలు తెలిపిన కృష్ణ వేణి , భావన , మధురవాణి , శ్రీలలిత , జాహ్నవి ,నీహారిక ,మంజూష , ప్రియ , లలిత , లక్ష్మీ కామకోటి ,మంజు , పరిమళం , పద్మకళ , టీం లీడర్ జ్యోతి గారు ల కు , బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లో ' మాలకు విరుల స్వర మాలిక ' లో శుభాకాంక్షలు తెలిపిన , రామకృష్ణా రెడ్డి , స్వప్న , బద్రి , గార్లకు , ' భలే డాక్టర్ కమాలా కాయ ' లో పాట రాసిన శ్రీలలితకు , ఇతర మితృలకు , నా ' కమల ' లో శుభాకాంక్షలు తెలిపిన , భావన , శ్రీలలిత , భాస్కర రామిరెడ్డి , జయ ,సునీత , హరే కృష్ణ , సి. ఉమాదేవి , మేయిల్ ద్వారా నూ , బ్లాగ్ లోనూ విష్ చేసిన అశోక్ పాపాయి , రాజి , శిశిర , లలిత , అ. సౌమ్య చాటింగ్ లోనూ , బ్లాగ్ లోనూ విష్ చేసిన సుజ్జి , చక్కటి అన్నమయ్య పాటలో విష్ చేసిన కొత్త పాళి గారు , జ్యోతి , నేస్తం , మధురవాణి , పి. యం .యస్ లక్ష్మి గార్ల కు , మేయిల్ ద్వారా విష్ చేసిన మంచుపల్లకి గారికి ,

కమాలాసని , కమల ప్రియ ,
కమలముల తో పూజించిన సంతృష్టు రాలగు ,
ఆ నారాయణి , మీ కందరికీ శుభాలను ఇవ్వాలని కోరుకుంటూ ,

పద్మాసనే , పద్మకరే , సర్వ లోకేకపూజితే
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా .

" థాంక్ యు ఫ్రెండ్స్ "

Sunday, July 25, 2010

కమల






హిమగిరులలోని ఒకానొక తటాకము లో జలకాలాడు తోంది సంజ్ఞాదేవి . అప్పుడే అటుగా వచ్చిన దినకరుడు సంజ్ఞా దేవి మోహన రూపాన్ని చూసి పులకించి పోయాడు . ప్రభాకరుని తీక్షణ దృష్టి ని తట్టుకోలేని సంజ్ఞా దేవి , కోమలమైన తన అరచేతి నుండి , సుందరము , అతి కోమలము , శీతలమైన రెండు మొగ్గలను సృస్టించి , తన కను దోయికి అడ్డుగా వుంచుకుంది . ప్రభాకరుని , తీక్షణ కిరణాలు సోకి , అవి , లేత గులాబీ , శ్వేత వర్ణములలో , మృదువైన రెక్కలు ఒకటొకటిగా , సహస్ర రేకులు గా విచ్చుకున్నాయి . అందమైన కమలములను చూసి ప్రభాకరుడు పరవశించి పోయాడు . . అలా సంజ్ఞా దేవి చేత సృష్టించపడిన కమలము దేవతలందరికీ ప్రీతిపాత్ర మైంది . గబ గబా అందరూ ,తమ చేతుల లో ధరించటమో , ఆసనముగా చేసుకోవటమో చేసారు . అవును మరి , మానవుల కోరికలు వినీ , వినీ వాటిని తీర్చి తీర్చి బుర్రలు వేడెక్కి వున్నారాయే . బుర్రలను చల్లబరుచుకునేందుకు వారికి చల్ల చల్ల గా , ముద్దులు గొలిపే కమలమే రక్షణ ఐంది పాపం .

చక్కటి లేలేత గులాబీ వర్ణం లో , మృదువైన రేకుల తో వున్న కమలము ను చూసి , లక్ష్మీ దేవి ముచ్చట పడి , అందులో హాయిగా పద్మాసనం తో ఆసీనురాలై , కమల నామమును స్వీకరించి ,

పద్మాసన స్తితే దేవీ పరబ్రహ్మ స్వరూపిణీ ,
పరమేశి జగన్మాతర్మహాలక్ష్మీ నమోస్తుతే .
అని భక్తుల చే స్తుతించ బడి సంతృష్టు రాలైంది .

ఇహ శ్రీదేవీ వల్లభుడైన వెంకటాచలపతి ,
కమలా కుచ చూచుక కుంకుమతో
నియతారుణి తాతుల నీల తనో
కమలాయత లోచన లోక పతే
విజయీభవ వెంకట శైల పతే .

అని సుప్రభాతం పలుకుతే కాని మేలుకొనడు .

బ్రహ్మదేవుడైతే ఏకం గా , విష్ణుమూర్తి నాభి లోనుండి వచ్చిన తామర పువ్వులోనే జన్మించి , సుఖాసీనుడై , సృష్టి బ్రహ్మైనాడు .

అలా దేవతల చేత కొనియాడబడిన కమలము భూలోకము లోని కొలనుల లోనికి చేరింది .ముని కన్య లు , కరకంకణములుగా , మెడలో హారములుగా ధరించి , మురిసిపోయారు .

తామర కొలను లో నుండి వినిపిస్తున్న కిల కిలా రావము లు ఎక్కడి నుండి వస్తున్నయో తెలుసుకోలేక , కొలనంతా కలయచూసాడుట రాకుమారుడు . అవి తామర పువ్వులా , లేక రాకుమారి నేత్రాల తేల్చుకోలేక విస్త్తు పోయి , పద్మాక్షీ , నీరజాక్షీ అని కవితలల్లేశాడుట . తామరపత్రాల మీద కొన గోటి తో ప్రేమలేఖలు రాసేదిట రాకుమారి . చాలా మంది రాకుమారులూ , రాకుమార్తెలూ ఇలా ప్రేమలో పడ్డవారే !


ఇహ కన్నె పిల్లలే మో ,
తామర పువ్వంటీ తమ్ముణ్ణియ్యవే అనీ గొబ్బిగౌరమ్మ ను వేడుకుంటారు . .

ప్రాచీన కవులు తామరతూడులని అమ్మాయి చేతులని , పద్మాక్షి అని , జలజాక్షీ అనీ ఇలా బోలెడు నామధేయాల తో పొగిడేసారు .
కమలము మన జాతీయ పుష్పం కూడానండోయ్ !

ఆధునిక , యండమూడి లాంటి రచయితలు మాత్రం తక్కువ తిన్నారా ? వాళ్ళ హీరో లు , స్మగులర్స్ ను పట్టుకునేందుకు , కొలనుల లో తామర కాడ ను నోటి లో వుంచుకొని , దాని ద్వారా గాలి పీలుస్తూ గంటల కొద్ది నీళ్ళ లో ఎదురుచూస్తూ వుంటారు .
కొత్త పెళ్ళి కొడుకులు , అలకపానుపు మీద తామరాకు రూపము లోని వెండి కంచం కావాలని కోరుకునేవారు . అదిస్తే గాని అలకపానుపు దిగే వారు కాదు .
పెళ్ళిళ్ళ లో ఉప్మా వడ్డించాలంటే తామరాకు తప్పనిసరి . అసలు తామరాకులో ఉప్మా రుచే వేరు .

ఒకానొక్కప్పుడు ' కమల ' అనే పేరు అందరికీ నచ్చిన పేరు . నవల లో , సినిమాల లో నాయికలకు కమల అనే పేరుండేది . భావకురాలైన అమ్మ నాజూకైన పేరు ను , . . ఏళ్ళ క్రితం , రోజు పుట్టిన తన పాపాయి కి పెట్టుకుందిట . పదిహేడు సంవత్సరాలు ' కమల ' గా వున్న అమ్మాయి . . . సంవత్సరాల క్రితం , ప్రభాతుని కోరిక పై మరింత నాజుకుగా ' మాల ' గా మారి పోయిందిట !!!

ఇదంతా నిన్న , మొన్న జరిగినట్లుగా వుంది .
కాలమా ఎందుకే నీకింత తొందర ?
ఏమి చేయాలని , ఏమి చూడాలని , ఎవరో తరుముతున్నట్లు అలా కను రెప్పల మాటునుండి పోతున్నావు ? ? ?
స్చప్ ! నా మాట వినిపించుకోని కాలం , అలుపు సొలుపు లేకుండా . . . అలా . . . పరుగెడుతూనే . . . పరుగెడుతూనే . . . వుంది . . .

( ఇందులోని కమలములు కొన్ని నేను ఫొటో తీసినవి , కొన్ని తామరకొలను నుండి తెచ్చినవవి , కొన్ని నెట్ నుండి తీసుకున్నవి . )

మా అమ్మాయి చిన్నప్పుడు , తన పుట్టిన రోజున ఇలా పాడుకునేది .

" హాపీ బర్త్ డే టు మి "

Tuesday, July 20, 2010

సొరకాయ చాట్

పాము పగ పట్టినట్లు ఈ సొరకాయ వంట లేమిటి రా బాబూ , అని అనుకుంటున్నారా ? ఏం చెయ్యను చెప్పండి ? మొన్నటికి మొన్న సొరకాయ టిక్కీ తో ఐపోయిందనుకున్నామా , మళ్ళీ ఇంత బేద్ద సొరకాయా , నా తలకాయంతది , బిర బిర దొర్లుకుంటూ వచ్చేసింది . ఆ పోదురూ , దాంతట అది వచ్చేస్తుందే మిటి ఎవరో తెచ్చేవుంటారు అంటున్నారా ? నిజమేనండి , కాని మీరూహిస్తునట్లు గా , మావారు తెచ్చారు అని చెప్పటము లేదు . నాకు తెలుసు లెండి నేనలా చెప్పగానే , ఈ మధ్య మీవారిని ఆడిపోసుకోవటం ఎక్కువైంది ఆయ్ అని అరుద్ధామని చూస్తున్నారా ? ఆ చాన్స్ మీకివ్వనుగా ! పాపం ఈ సారి సొరకాయ రావటము లో మా ఆయనగారి హస్తం ఏమాత్రం లేదండి . పొద్దున్నే పిల్లలు వస్తున్నామని కాల్ చేసారా ? చేసారు కదా ! సరే ఏమైనా చేద్దామంటే ఇంట్లో కూరలు లేవు . మరెలాగా అనుకుంటూ వుంటే , మా పనమ్మాయి , ఈ రోజు కమల్ స్టోర్ వాలా కూరలు తెచ్చాడమ్మా అంది . ఓహో అనుకొని , కమల్ స్టోర్ కు కాల్ చేస్తే , ఒక్క సొరకాయ మాత్రమే వుందమ్మా అన్ని కూరలూ ఐపోయాయి అన్నాడు . హుం ! ఇంకేం చేయగలను ? అదే తెమ్మన్నాను . విధివిలాసము ను ఎవరు తప్పించగలరు ? దేవుడు రాశినరాతను చెరప నాతరమా ? ఈ రోజు కూడా సొరకాయ తినే ప్రాప్తం నాకు , నేను చేసిన చాట్ చూసే భాగ్యము మీకు రాసి పెట్టివుంది . అంతే ఇందులో నా తప్పు కూడా ఏమీ లేదు . దీని తరువాత , సొరకాయ కోఫ్తా చేసి పెడుతాను ఏం ? అవును మరి సౌమ్య గారికి ప్రామిస్ చేసాను కదా ! ప్రామిస్ ను ఎలా బ్రేక్ చేస్తాను చెప్పండి .

ముందుగా ఖట్ మీట్ చట్నీ చేయటము చూద్దాం .

కావలసిన పదార్ధాలు ;
కర్జూరం పళ్ళు - 500 గ్రాములు ,
చింతపండు 100 గ్రాములు ,
రెంటినీ కలిపి నాలుగైదు గంటలు నానబెట్టాలి . ఆ తరువాత , కావలిసినంత ఉప్పు వేసుకొని బాగా మెత్తగా పిసకాలి . అందులో చెత్త , గింజలు లేకుండా , రవ్వ జల్లెడ లో పట్టాలి . అసలు , గింజలు లేని కర్జూరాలైతే శ్రేష్టం . ఆ తరువాత , కొద్దిగా రుచి చూసి ఎక్కువ పులుపు కనుక వున్నట్లైతే , బెల్లము ముక్కలుగా చేసి రుచికి సరిపడా , అందులో కలుపుకొని , మిక్సీ లో వేసి మెత్తగా చేసుకోవాలి . ఆ పైన కొద్దిగా జీలకర్ర పొడి కలుపు కోవాలి . అంతే .
ఈ చట్నీ ఫ్రిజ్ లో వుంచుతే కనీసం ఆరునెలలైనా పాడుకాకుండా వుంటుంది .

తరువాత కావలసినది , గ్రీన్ చట్నీ ;
దానికి కావలసిన పదార్ధాలు ;
పుదీన ,
కొత్తిమీర ,
పచ్చిమిరపకాయలు ,
జీలకర్ర పొడి ,
ఆంచూర్ ,
ఉప్పు .
పుదీనా , కొత్తిమీర సమానంగా తీసుకోవాలి . పచ్చిమిరపకాయలు ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు వేసు కోవచ్చు . ఈ మూడింటిని ని కలిపి , మిక్సీ లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి . తరువాత , ఉప్పు , జీలకర్ర పొడి , ఆంచుర్ వేసుకొని బాగా కలుపుకోవాలి . ఒకవేళ ఆం చూర్ లేక పోతే నిమ్మకాయ రసం కలపొచ్చు . కాని అది ఎక్కువ రోజులుండదు .
సరే ఖట్ మీట్ చట్ నీ , గ్రీన్ చట్నీ రెడీ అయ్యాయిగా . ఒక ఉల్లిపాయ , కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి వుంచు కోవాలి .
ఓ కప్ పెరుగు , ఉండలు లేకుండా గిలక్కొట్టి , అందులో , ఉప్పు , చాట్ మసాలా పొడి , కొద్దిగా పంచదార , కొద్దిగా జీలకర్ర పొడి కలుపు కోవాలి .

సొరకాయ టిక్కి లు కూడా చేసేసుకొని ,

అన్నీ ఇలా సద్దు . . . . .

' అరే ఏమిట్రా మేఘమ్మా , వుండు నేను కలిపిస్తానుగా .'

'యమీ యమీ బామ్మా , వుండు నేనే చేసుకుంటాను . '

అంతేనండి ఈ పిల్లలు . ఇలా అన్ని చూడగానే యమీ అంటూ ఇదో ఇలా తనే చేసుకొని , ఫొటో కూడా తీసింది మా మనవరాలు .


ఈ రెండు చట్నీలు చేసుకొని , ఇలా సాస్ బాటిల్స్ లలో వేసుకొని , ఫ్రిజ్ లో రెడీ గా వుంచుకుంటే బోలెడు చాట్ లు చేసు కోవచ్చు .

సొరకాయ టిక్కి బదులు , ఆలు టిక్కి చేసు కోవచ్చు . లేదా సమోసా , కచోరీ , లేదా రెండు ఆలు గడ్డలు ఉడకపెట్టుకొని అవి . వాటిమీద , ఖట్ మీట్ చట్ నీ , గ్రీన్ చట్నీ , పెరుగు , ఉల్లిపాయముక్కలు . కొత్తిమీర ఇలా డ్రెసింగ్ చేసుకుంటే , ఎందులో వేస్తే ఆ చాట్ తయార్ . అంతే కాదు , చపాతి నైన పూరీనైన పెద్ద పెద్ద ముక్కలు గా చేసి , వాటి మీద ఈ చట్నీలు , పెరుగు , ఉల్లిపాయ ముక్కలు , కొత్తిమీర వేసుకొని తింటే సూపర్ గావుంటుంది .

ఏవీ లేక పోతే మురమురాలు , కాస్త చుడవా కలుపుకొని , ఉల్లిపాయ ముక్కలు , కొత్తిమీర , , ఈ రెండు చట్నీలు కలిపేస్తే భేల్ పూరీ రెడీ .

నల్ల శెనగలు నానేసుకొని , ఉప్పేసి ఉడకబెట్టి , రెండు ఆలుగడ్డలు ఉడకబెట్టి , పొట్టు తీసేసి , చిన్న ముక్కలుగా చేసుకోవాలి , గ్రీన్ చెట్నీ ని నీళ్ళలో వేసి , పలచగా కలుపుకోవాలి . అందులో కొద్దిగా పానీ పూరీ మసాలా వయాలి . పానీపూరీ , పూరిలు తెచ్చుకొని , అందులో ఈ నల్లశెనగలు , ఆలు ముక్కలు , ఖట్ మీట్ చట్నీ వేసుకొని , పానీపూరీ నీటి తో తినేయటమే .

అలా ఈ రెండు చట్నీల తో , కాదేది చాట్ కు అనర్హం అనుకొని , ఏదైనా చేసుకోవచ్చు . మన చాటూ , మన ఇష్టం !

Friday, July 16, 2010

డబ్బులోయ్ డబ్బులు - కొసమెరుపు



ఫిబ్రవరి లో నేను రాసిన , డబ్బులోయ్ డబ్బుల కు ఇది కొసమెరుపు .
ఎన్నాళ్ళుగానో వేచి చూస్తున్న తరుణం వచ్చేసింది . రూపాయి కి కూడా ఓ గుర్తును నిర్ధారించారు . దేవనాగరి లిపి లో ' ర అనే అక్షరం , ఇంగ్లీష్ లోని ' ఆర్ ' స్పురించేలా ఓ గుర్తును ఖరారు చేశారు . బాంబే ఐఐటి లో పి. జి చేసిన , ఉదయకుమార్ రూపొందించిన ఈ చిహ్నం ను కేంద్ర మంత్రి వర్గం గురువారం ఆమోదించింది . " భారతీయ కరెన్సీ విషయం లో ఇదో పెద్ద ముందడుగు . మన కరెన్సీకి ఈ గుర్తు ఓ విశేషమైన గుర్తింపును , వ్యక్తిత్వాన్ని ఆపాదిస్తుంది . విశ్వవ్యాప్తం గా భారతీయ ఆర్ధిక వ్యవస్త బలాన్ని ఇది ప్రతిబింబిస్తుంది ." అని సమాచార , ప్రసార శాఖ మంత్రి అంబికా సోనీ కేంద్ర మంత్రి వర్గ సమావేశం అనంతరం తెలిపారు . ఆరు నెలల్లోగా ఈ గుర్తును , మన దేశం లో పూర్తిగా అమలులోకి తీసుకొస్తారు . ప్రపంచ వ్యాప్తం గా 18 - 24 నెలల్లో అమలు చేస్తామని సోనీ చెప్పారు . ఈ గుర్తు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని అన్నారు .

దేశవ్యాప్తం గా మొత్తం మూడు వేల డిజైన్ లు పోటీ పడగా , వాటిలో ఉదయ్ కుమార్ రూపొందించిన డిజైన్ ను ఆమోదించారు . రిజర్వు బాంక్ డిప్యూటీ గవర్నర్ నేతృత్వం లోని కమిటీ ఐదు గుర్తులను ఎంపిక చేసి కేబినెట్ ఆమోదానికి పంపగా , అక్కడ తుది గుర్తును ఎంపిక చేసారు . కంగ్రాట్యులేషన్స్ , ఉదయ్ కుమార్ .

Thursday, July 15, 2010

వానా వానా వెల్లువాయే , కొండా కోనా తుళ్ళి పోయే






వానా వానా వల్లప్పా ,
చేతులు చాచు చెల్లప్పా ,
తిరుగూ తిరుగూ తిమ్మప్పా ,
తిరగలేను నరసప్పా .
చిన్నప్పుడు , వాన మొదలు కాగానే , చేతులు బార్లా చాచి , గిర్రున తిరుగుతూ , ఈ పాట పాడుకునే వాళ్ళం . ఆ బాల్య స్మృతి ఇంకా మది లో భద్రం గానే వుంది . వాన పడ్డప్పుడల్లా బయిటికొస్తూ , ఇప్పుడూ అలా తిరగొచ్చుగా ? పాడుకోవచ్చుగా అని పురమాయిస్తూ వుంటుంది . హుం దానికేం తెలుసు , ఇప్పుడు నేనలా చేస్తే జనాభా దడుచుకుంటారు !

అలా చేసి ప్రజలను భయపెట్టటము ఎందుకులే పాపం . పోనీ పెరట్లోనైనా అలా తడిసి పోదామని మనసు తెగ పీకుతుంది . అమ్మో ఇంకేమైనా వుందా నేనున్నాను అంటూ సైనసైటిస్ ప్రతాపం చూపించేస్తుంది . స్చప్ ఏం చేయను . ఆ తరువాత డాక్టర్ చుట్టూ ప్రదక్షణాలు , ఆవిరి పట్టటాలూ . ఎందుకులే బాబూ , మనకు వర్కౌట్లు కాని వాటి జోలికి పోవటం ? ఇదంతా ఎందుకు కాని , వాన పడుతున్నప్పుడు ఎంచక్కా కొన్ని ఫొటోలు తీసి బ్లాగ్ లో పెడదామని డిసైడై పోయాను . ఆ ఫొటోలు ఎలా వస్తాయో ! ఆ పోనీలే చూసేవాళ్ళ అదృష్టం .

ఎదురు చూడగా చూడగా వానలొచ్చేసాయి . వహవా ఇంటి చూట్టూతా కొండా , కోనా పచ్చ పచ్చగా కన్నుల పండువగా ఐపోయాయి . ఓ ఫొటో వాన పడేటప్పుడు తీస్తే ఎంత బాగుంటుంది . దీని దుంప తెగ , ఈ వాన కేమొచ్చిందో రాత్రిళ్ళే పడుతోంది . ఈ దిక్కుమాలిన ఫుట్ బాల్ మాచులూ ఇప్పుడే వచ్చేడిసాయి . వాళ్ళూ , వాళ్ళు ఒక బాల్ కోసం కొట్టుకొని చస్తే నాకేమీ బాధ లేదుకాని , రాత్రి తెల్లార్లూ మా ఆయన గారు ఆ టి .వి ముందు సెటిలైపోతారే .

' మాలా ఇంకా నిద్ర పోలేదా ? '
' లేదండీ '
' ఇంత అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావు ? మళ్ళీ పొద్దున్నే లేవ లేనంటావు . తల నొప్పంటావు . పడుకోరాదూ . '
. . . . . . . . . . . . .
' ఏమిటీ మాట్లాడవు ? ఏం రాచకార్యం వెలగపెడుతున్నావు ?'
( నా మొహం ఏం చెప్పను ? చెపితే ఇకేమైనా వుందా ? )
అనుకునంతా అయ్యింది . లోపలి కోచ్చి , ఈ టైం లో కంప్యూటర్ ముందు కూర్చున్నావా ?
' అది కాదండి కొంచం బ్లాగ్ పని వుంది . . . . '
' నీకు మరీ బ్లాగు పిచ్చి , కంప్యూటర్ పిచ్చీ ముదిరిపోయాయి . ఈ కంప్యూటర్ అవతల పారేస్తే కాని మనుషుల్లో కలవవు . '
' ఏమండీ . . . ఏమండీ కంప్యూటర్ బయట పారేయకండి . '
ఘబ్బుక్కున మెలుకువ వచ్చింది . థూ థూ అని వీపుమీద కొట్టుకున్నాను . ఎంత పీడకల వచ్చిందీ . మా వారు అంతటి ఘనులే . కంప్యూటర్ అవతల పారేసినా పారేస్తారు .

ఆ వెధవ ఫుట్ బాల్ మాచ్ ఐపోయేదాకా ఎదురుచూసి , ఆయన పడుకోగానే , నా బ్లాక్ బెరీ తీసాను . చిన్నగా అడుగుల చప్పుడు కాకుండా , వెనకకు వెళ్ళి , ఇంకా చిన్న . . . గా తలుపు తీసాను . హుం వానాగిపోయింది !! కాసేపు ఎదురుచూద్దాం వస్తుందేమో . ఎలాగూ మా అబ్బాయి చదువుకునే రోజులలో రాత్రంతా , ఆపైన పని చేసుకుంటున్నప్పుడు పక్కన పుస్తకం పట్టుకొని నిషాచరిలా కూర్చోవటము అలవాటేగా .

లైట్ వేయకుండా , లాప్ టాప్ ఓపెన్ చేసాను . అవును మరి వానొచ్చేదాకా కాలం గడవద్దూ . తీయగానే చాటింగ్ ఫ్రెండ్స్ ఏమిటండీ మాలా గారూ ఈ టైం లో . ఇంకా నిద్రపోలే . వాన కోసం ఎదురు చూస్తున్నానంటే నవ్వరూ ? అందుకే మా కోడలు ఫొటో పంపుతానందండి అందుకే ఎదురుచూస్తున్నాను అని సగం నిజం చెప్పాను . పాపం తను ఫొటో పంపి గంటైంది . అలా ఆరోజు ఎదురు చూపుల తోనే గడిచి పోయింది .

మరునాడు కూడా పట్టూవదలని విక్రమార్కిణిలా , ఫుట్ బాల్ మాచ్ అయ్యే దాకా ఎదురు చూసి , మా వారు పడుకున్నాక , నేనూ , నా బ్లాక్ బెరీ రెడీ . అమ్మయ్య ఈ రోజు వాన పడుతోంది . థాంక్ గాడ్ . వెంట వెంటనే నాలుగు ఫొటోలు తీసేసాను . కంప్యూటర్ లొ కి అప్ లోడ్ చేసాను . ఇదేమిటీ . . . . ఈ మండే సూర్యుడెక్కడినుండి వచ్చాడు ? ధారలు ధారలు గా పడుతూ వాన కనిపించిందే . ఏదీ ఆ వాన ? అంతా ఏదో గ్లాస్ డోర్ లోనుండి వచ్చినట్లు వచ్చింది ? ? ? నేను తలుపు తీసి బయటకు వెళ్ళే తీసానే ? ? ?
" ఏమండీ మాలా గారూ ఈ రోజూ ఇంకా నిద్ర పోలేదా ? '
' లేదండీ , మా ఆబ్బాయి కోసం చూస్తున్నాను '
సగమే నిజం . మా వాడు కనిపిస్తే ఇదేమిటిరా ఇలా వచ్చింది అని అడుగుదామనే వుంది . కాని మావాడు వుండేది యాహూ లో . నేను జి లో !

పొద్దున్నే లేచి కాఫీ గ్లాస్ పట్టుకొని బయటకు వెళ్ళగా నే ఎంత సుందర దృశ్యం ! ఇంటి ముందు వాన నీళ్ళు పడి మడుగులా తయారైంది . అందులో పై నుండి చినుకులు పడుతూ , గిర గిరా తిరుగుతున్నాయి . వారెవా . మా వారు మాలా నా కాఫీ ఏదీ అన్నా వినిపించుకోకుండా ( అవును మరి ఆ దృశ్యం ఎంత సేపుంటుంది . అది ఫొటో తీయటము చాలా ముఖ్యం కదా ) , ఏ మాత్రం భయపడకుండా , ఆయన వైపు చూడ కుండా ఒలంపిక్ రేసులో లా లోపలికి పరుగెత్తుకెళ్ళి , బ్లాక్ బెరీ తెచ్చి టక టకా రెండు స్నాప్ లు తీసాను .

ఊఊం ఏవీ ఆ వాన చినుకులు ? ఆ రింగులు ? ఏమాట కామాటే చెప్పుకోవాలి , వాన చినుకులు రాక పోయినా , ఆ మడుగులో చెట్ట్ల నీడలు ఎంత బాగా వచ్చాయో !

వాన లో తీయలేక పోయినా , మా ఇంటి చుట్టూ పచ్చపడ్డ కొండా కోనా నైనా తీయ గలిగాను .

పగలంతా ఎదురు చుపులాయే ,
తీర్చి దిద్దుకొని రాత్రి వేళ వస్తావాయే ,
నా కంటి కే కనిపిస్తావాయే ,
నా బ్లాక్ బెరీ కి అగుపడవాయే ,
నను కరుణించక చినుకమ్మా ఎటు పోతివే ? ? ? ? ?

Sunday, July 11, 2010

సొరకాయ టిక్కీ

రెండు పుల్కాలు , సొరకాయ కూరనో , టమాట పాలకూర పులుసుకూరనో చేసి పెడితే , మా వారు చాల రుచిగా మంచి భోజనం పెట్టినట్లుగా సంతోషపడిపోతారు . మా మామగారు కూడా సొరకాయ కూర చేసిన రోజు , ఇవ్వాళ్ళ వంట బాగా కుదిరిందమ్మాయ్ అనేవారు . మాకు వారం లో కనీసం నాలుగు రోజులైనా సొరకాయ కూర తప్పనిసరి . డి .డి కాలనీ లో వుండగా మా ఇంట్లో సొరకాయలు తెగ కాసేవి . మా కూరలతను , అమ్మా అవి నాకు ఇస్తే అమ్ముకొస్తాను అనేవాడు . నాయనా అవి మాకే సరిపోవు , ఇంక అమ్మటము కూడా నా అనేదానిని . ఇప్పుడూ , ఈ ఇంట్లో కూడా సొర విత్తనాలు వేసాను . ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి .

నేను ఎక్కువగా పెసరపప్పు కాని , సెనగపప్పుకాని వేసి , ఇంగువ పోపేసి వండుతాను . అప్పుడప్పుడు , పాలు పోసి కాని , నువ్వుపిండి వేసి కాని , పచ్చి కొబ్బరి వేసి కాని కూడా వండుతాను . ముక్కల పులుసు , సాంబార్ లో కూడా సొరకాయ ముక్కలు వేస్తాను . కాని ఏమాట కామాటే చెప్పుకోవాలి , యాక్ అనక పోయినా నాకు సొరకాయ కూర అంత ఇష్టం వుండదు . తప్పదన్నట్లు తింటాను . కాక పోతే అప్పుడప్పుడు , నా కోసం , మా పిల్లల కోసం ఇదిగో ఇలా వెరైటీస్ చేస్తుంటాను . ఈసొరకాయ టిక్కీ నేనూ , నా మనవడు గౌరవ్ కలిసి చేసాము .

సొరకాయ టిక్కీ కి కావలసిన సామానులు ;
సొరకాయ తురుము 1- కప్పు ,
ఉడక పెట్టిన ఆలుగడ్డల ముద్ద రెండు కప్పులు ,
పచ్చిమిరపకాయ , అల్లం ముద్ద - 1 టీ స్పూన్
కొద్దిగా కొత్తిమీర , పుదీనా - వాటిని శుభ్రం గా కడిగి , సన్నగా కట్ చేసుకోవాలి ,
గరమ మసాలా పొడి ఒక స్పూన్ ,
జీలకర్ర పొడి , ధనియాల పొడి కొద్దిగా ,
కార్న్ ఫ్లోర్
సొరకాయ తురుమును గట్టిగా నీరు లేకుండా పిండాలి . అందులో , కారన్ ఫ్లోర్ తప్ప మిగితావన్నీ కలపాలి . బాగా చపాతీ పిండి లా కలిపాక చిన్న చిన్న వుండలు చేసుకొని కావలసిన షేప్ చేసుకోవాలి .
మూకుడు లో నూనె వేసి , బాగా కాగాక , ఈ టిక్కీ లను ఒకటొకటి తీసుకొని , ఒక పళ్ళెం లో వేసుకొని వుంచుకున్న కారన్ ఫ్లోర్ లో పెట్టి , టిక్కి కి చుట్టూ అంటుకునేటట్లు తిప్పాలి . ఆ తరువాత దానిని నూనెలో వేసి , గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి . అంతే సొరకాయ టిక్కీ రెడీ !

ఈ టిక్కిలలో సొరకాయ తురుము బదులు , క్యాబేజ్ తురుము కాని , కారెట్ తురుము కాని , బీట్రూట్ తురుము కాని , పాలకూర కాని , ఉడకబెట్టిన బఠానీలు కాని వేసుకోవచ్చు .

అన్నట్లు సొరకాయ తురుము పిండగా వచ్చిన నీరు పారబోయద్దండోయ్ . అందులో ఓ టమాట , కాస్త కొతిమీర వేసి చేసుకుంటే సొరకాయ సూప్ ఐపోతుంది .

ఈ టిక్కి ల మీద ఖట్ మీట్ చట్నీ , గిలకొట్టిన పెరుగు , చాట్ పౌడర్ , సన్నగా తరిగిన ఉల్లిపాయ , కొత్తిమీర్ , పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని తింటే స్స్ . . . . .

రేపు ఖట్ మీట్ చట్నీ చెపుతాను . అన్నీ ఒకే రోజైతే మీకే గుర్తుండవు మరి.



ఈ ఫొటో మా గౌరవ్ తీసింది . బాగుంది కదూ .

Saturday, July 10, 2010

సొరకాయ - పాము మంత్రం



మావారికి , ఇంటి కొస్తుంటే , దారి లో బండి మీద లేలేత సొరకాయలు కనిపించాయట . ఓటి కొనుక్కొచ్చారు . అంత పెద్ద లేత సొరకాయను చూడగానే ప్రాణం వుసూరుమనిపించింది . ఇద్దరి కోసం , గుప్పెడు బియ్యం , చిటికెడు పప్పు వండటమే ఇంకా అలవాటు కాలేదు . ఇప్పుడు టాంక్ బండ్ అంత పెద్దగా వున్న ఈ సొరకాయను , ఆయన ఒక్కరి కోసం , ఎన్ని రకాలు , ఎన్ని రోజులు వండాలిరా దేవుడా అనే నాబాధ . నాకు సొరకాయ ఇష్టం లేక కాదు కాని పాము మంత్రం నేర్చుకుందామనుకుంటున్నాను కదా ఎలా తింటాను ? పాము మంత్రం ఎందుకంటారా దాని కథా కమీషూ ఇక్కడ చెప్పానుగా . ఎవరెంత చెప్పినా నా భయం నాది . పాము మంత్రం నేర్చుకుంటే ఎందుకైనా మంచిది అని డిసైడైపోయాను . కాక పోతే నేర్పేది ఎవరా వెతకాలి . ఇంత బృహత్ కార్యం ముందు పెట్టుకొని సొరకాయ ఎలా తినేది ????? మరి పాము మంత్రం వేసేవాళ్ళు సొరకాయ తినకూడదుట ! లేత సొరకాయ కోయటం లేదండీ బాబూ . మావారు చెప్పారు , పాము మంత్రం పెట్టేవాళ్ళు సొరకాయ తినరని . ఆయనేది చెప్పినా నేనిట్టే నమ్మేస్తాను . నిజం ! ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చిపడింది , ఎలా చెప్మా అని ధీర్గం గా ఆలోచనలో పడ్డాను .

లేడీస్ మీటింగ్ లో లక్ష్మి గారిని కలిసినప్పుడు ,పాముల సంగతి మళ్ళీ ఓసారి కఫర్మ్ చేసుకుందామని , లక్ష్మి గారూ ఇక్కడ పాములు వస్తాయాండీ అని అడిగాను . అబ్బే లేదండి . మేము పదేళ్ళనుండి వున్నాము . ఎప్పుడూ చూడలేదండి అన్నారు . మరి ప్రేమా వాళ్ళ ఇంటి . . . . .

' ఓ అక్కడకా వాళ్ళ ఇల్లూ కాలనీ చివర . పైగా అటువైపంతా అడవిలా వుంటుంది కదా అందుకే ఏమైనా వచ్చిందేమో . ఐనా కాలనీ అంతా సెక్యూరిటీ గార్డ్ లు తిరుగుతూ వుంటారు . అంతెందుకు సాయంకాలం చూడండి పిల్లలు ఎంతమంది ఆడుకుంటూ వుంటారో . '

' అవునండి . సాయం కాలం కాగానే పిల్లలంతా చిలకల్లా కిల కిల లాడుతూ ఎంత బాగా ఆడుకుంటూ వుంటారో . చాలా ముచ్చటగా వుంటుంది . కాని . . . మరి షకీలా కూడా చెప్పిందే , ఇక్కడెవరో రోజూ పాము కోసం పాలూ పోసి వుంచుతారని ?'

' ఎవరూ షకీలానా ? దాని మొహం అదో తింగరి బుచ్చి . దాని మొగుడు మాడ్రైవరే గా . నాగుల చవితి రోజు మా కోడలు మా ఇంటి పక్కనున్న పుట్టలో పాలు పోస్తుంది . అది చెప్పిందేమో . మా కోడలి కి భక్తి ఎక్కువ లెండి . అలా అని చదువుకోనిదనుకునేరు , యం ఫార్మసీ చేసింది . యు. యస్ లో వుండగా జాబ్ కూడా చేసింది . ఇక్కడి కొచ్చాక పిల్లల చదువు చూసుకోవటానికి జాబ్ చేయటము లేదు . ఎప్పుడూ పామును చూడలేదు . పాము ఎవరినీ కరిచినట్లూ వినలేదు . '

అమ్మయ్య పాము మంత్రం నేర్చుకునే బాధ తప్పింది . అవునండీ ఇంతమంది చెప్పాక నమొద్దూ ? ఇక హాయిగా సొరకాయ తినేయొచ్చు . ఆ సంతోషం లో రెండు రోజులుగా నేను చేసిన సొరకాయ వంటలు . పాము మంత్రం పెట్టని వాళ్ళు శుభ్రంగా , హాపీ గా తినొచ్చు . చాలా రుచిగా కూడా వుంటాయి .

సొరకాయ పరోఠా







కావలసిన సామానులు ;
సొరకాయ తురుము 1/2 కప్ ,
కొద్దిగా అల్లం ,
పచ్చిమిర్చి - 3
గోధుమ పిండి ,
శెనగ పిండి 1 కప్
కొతిమీర కొద్దిగా .
ముందుగా అల్లం , పచ్చిమిర్చి , ఇష్టమున్న వాళ్ళు వెల్లులి వేసుకొని , పేస్ట్ చేసుకోవాలి .
సొరకాయ తురుము , అల్లం ముద్ద , కొతిమీర , శెనగపిండి , ఒక చెంచా నూనె ను కలపాలి . సొరకాయ తురుము నుండి నీటిని పిండకూడదు . ఆ మిశ్రమము లో కొద్ది కొద్దిగా గోధుమ పిండి వేస్తూ గట్టి పడేలా , చపాతీ పిండి లాగా తడుపుకోవాలి . ఆ పిండిని పదినిమిషాలు వుండనిచ్చి , తరువాత చపాతీలలా చేసుకోవాలి . అంతే సొరకాయ పరోఠా రెడీ !

అందులోకి కి మాగాయే మహా పచ్చడి వుందిగా !!
కప్ పెరుగులో రెండు చెంచాలు మాగాయ వేసి , మెంతులు , ఆవాలు , ఇంగువ తో పోపేస్తే మాగాయ పచ్చడి తయార్ !





సొరకాయ ముఠియా








కావలసిన పదార్ధాలు ;
సొరకాయ తురుము 1 కప్
పెరుగు కొద్దిగా
బియ్యం రవ్వ లేదా ఇడ్లీ రవ్వ 2 కప్ లు
ఈ మూడిటిని కలిపి రెండు గంటలు నాన బెట్టాలి .
నానాక , ఆ పిండిలో జీలకర్ర పొడి , వాము , ధనియాల పొడి , కొతిమీర , అల్లం , ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి , ఉప్పు మన ఇష్ట ప్రకారము వేసుకొని కలపాలి . పావు చెంచా ఈనో కూడా కలపాలి . కొంచము నీరు కనుక వుంటే గట్టి పడేందుకు శెనగ పిండి ని కలప వచ్చు . ఆ పిండిని పైన ఫొటో లో చూపిన మాదిరి వుండలు చేసుకొని స్టీం ఇవాలి . కుక్కర్ లో కాని , లేదా ఒక పెద్ద మూకుడు లో నీరు పోసి , ఈ వుండలు వుంచిన పళ్ళెమును వుంచి కాని వుడికేవరకు , స్టీం ఇవ్వాలి . ఆ తరువాత వాటిని చల్లారనివ్వాలి . అవి చల్లారాక , ముక్కలుగా కట్ చేసుకోవాలి .
మూకుడు లో నూనె వేసి , ఆవాలు , ఇంగువ , నువ్వులు వేసి పోపు చేసుకొని , అందులో ఈ ముక్కలను వేసి , కొద్ది సేపు వేగనివ్వాలి . ఆ పైన కొతిమీర చారాలి .
ఆ పైన తినేయటమే !







మిగిలి పోయిన అన్నము తో , పులిహోరనో , బిరియానీ నో కాకుండా వెరైటీగా ఈ ముఠియాలు చేసు కోవచ్చు . అన్నం ను మెత్తగా చేసి అందులో వాము , ధనియాల పొడి , అల్లం , కొద్దిగా శెనగ పిండి , ఈనో వేసి , చపాతి పిండిలా తడుపుకొని , మిగితా అంతా ముఠియా పద్దతి లో చేసు కోవాలి .

Tuesday, July 6, 2010

రాకోయీ అనుకోని అతిధి

పక్క తలుపు వంటింటి తలుపు వేసి వుంచు మాలా అన్నది మా ఫ్రెండ్ ప్రేమ . కుక్కలొస్తాయని అంటుందేమో అనుకుంటూనే దేనికి అని అడిగాను . ఏమిలేదు అప్పుడప్పుడు పాములొస్తాయి అందుకని అంది . వెంటనే ఎలర్ట్ ఐపోయి , పాములా అని భయం భయం గా అడిగాను . మీదగ్గర రావులే మా ఇంటి వెనుకంతా అడవి కదా అందుకే అందుకే మా ఇంటిని అప్పుడప్పుడు విజిట్ చేస్తూవుంటాయి . భయం లేదు , నేనొక నంబర్ ఇస్తాను . పాము రాగానే వాళ్ళకి కాల్ చేస్తే పది నిమిషాలలో వచ్చి పట్టుకెళుతారు అంది . అప్పటికే నా మొహం , గొంతు మారి పోయి , ఇంట్లోకి కూడా వస్తాయా అని అడిగాను . ఇంట్లోకెందుకొస్తాయి ? ఐనా ముందు జాగ్రత్త గా ఎప్పుడూ తలుపులేసి వుంచు అని ఓ సలహా పడేసింది .

ఎరక్క పోయి ఇక్కడికి వచ్చానురా దేవుడా అనుకుంటూ పొద్దున షకీలా రాగానే , షకీలా ఇక్కడ పాములొస్తాయా అని అడిగాను . ఇటువైపు రావమ్మా . అటుపక్కనంతా అడవి కదా అటొస్తాయి . అక్కడ నేను పనిచేసే అమ్మా రోజూ రాత్రీ , ఓ గిన్నెలో పాలు , ఓ గుడ్డు వెనకవైపు జాగా లో పెడుతుంది . పామొచ్చి తాగి , తిని వెళుతుందిట అంది . ఓరి నీ భక్తి తగలెయ్య అనుకొన్నాను . ఐనా పక్కింటి సర్వమంగళ గారిని అడిగాను , ఇక్కడ పాములొస్తాయాండి అని . ఆవిడ ఎబ్బె లేదండి , ఇటువైపు మనుషులు తిరుగుతుంటారు కదా అందుకే రావు . పదిహేను ఏళ్ళనుండి ఇక్కడ వున్నాము . ఎప్పుడూ పాము రాలేదు అంది . ఐనా నా భయం నాది . పై ఇంటి పద్మ గారినడిగాను . ఏమోనండి , మేము ఇరవైదు సంవత్సరాలనుండి వున్నాము . మావారు , ట్రాన్స్ఫర్ ల మీద వెళుతుంటే నేనొక్కదాన్నే పిల్ల ల చదువుకోసం ఇక్కడే వున్నాను . ఎప్పుడూ ఇక్కడ పామును చూడలేదు . ప్రేమా వాళ్ళి ఇల్లు కాలనీ చివరకు వుంది కదా . పైగా ఆవైపు అడవి లా వుంటుంది . అందుకే అటొస్తాయి అంది . ఐనా ఏమిటో ప్రేమను చూడగానే పాము గుర్తొస్తుంది . ఈ రోజు మీ ఇంటి వైపు పాము గారొచ్చారా అని అడుగుతాను . ఓ సారి మాజాంగ్ ఆడుతున్నప్పుడు , అరుణ టీ తేవటాని కి లోపలికెళ్ళినప్పుడు అడిగాను . వెంటనే ఠప్ మని నెత్తినొకటి వేసింది . రోజూ రావటానికి అదేమైనా నా చుట్టమా ? ఫ్రెండా ? పదేళ్ళలో ఒక్క సారి వచ్చింది . పొరపాటున చెప్పాను . ఇక నన్ను వదిలేయి తల్లీ అని ప్రేమ చేతులు జోడించింది ! ఇంతలో అరుణ వచ్చి ఎందుకు , ఏమైంది అన్నది . అరే దిస్ మాడ్ గర్ల్ ఈజ్ ఈటింగ్ మై బ్రేన్ అని విషయం చెప్పింది . అంతే అరుణ , ప్రభ , ప్రేమ అందరూ కలిసి , ఓ అరగంట , హిందీ లో , ఇంగ్లీష్ లో ఇంకా అన్ని భాష లలో క్లాస్ పీకారు !

ఈ పాము గోల తోటే ఠారెత్తి పోతుంటే , మొన్న పొద్దున్నే , జహీరా పని లోపలికొస్తూనే , అమ్మా పీచేకా , యే బాజూ కా దర్వాజా హమేషా బంధ్ రకనా . ఆజ్ ఏక్ బందర్ కాల్ని మే ఘూం రై . అభి మై కాం కర్ రైనా ఉదర్ ఆయీ అని చెప్పింది . ఇదెక్కడి గొడవరా నాయానా !! అప్పటినుంచి ,రాత్రి పడుకునే ముందు ,
రాకోయీ అనుకోని అతిధి ,
నీకై తలుపులు తీసి ,
రెడ్ కార్పెట్ పరచి ,
వాకిట మంగళ హారతి తో సిద్ధం గాలేను . అని పాడుకుటూ పడుకుంటాను !!!
అవి నెట్ చూస్తాయేమో నని నా జి మేయిల్ దగ్గర , రాకోయీ అనుకోని అతిధి అని మెసేజ్ కూడా పెట్టాను . కాక పోతే ఆ మెసేజ్ చూసి నా చాట్ ఫ్రెండ్స్ , వాళ్ళనేమో ననుకొని అపార్ధం చేసుకున్నారనుకోండి . అది వేరే విషయం .
పొద్దున్నే పేపర్ వాడు , పాలవాడు బెల్ కొట్టగానే , పడగ విప్పి వూపూతూ బుసకొడుతూ పాము గారు , తోకూపుతూ కిచ కిచ లాడుతూ కోతిగారు ' హాయ్ మాలా గుడ్ మార్నింగ్ ' చెపుతాయేమోనని భయం తో , చిన్నగా తలుపు తీస్తూ అటూ ఇటూ చూసి , పేపర్ , పాల పాకెట్ ఘభుక్కున తీసుకొని తలుపేసేస్తాను .

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ** * * * * * * *


సీరియస్ గా పని చేసుకుంటున్నాను . గిన్నెల చప్పుడు వినిపించింది . పక్కింట్లో నేమో అనుకున్నాను . కొద్ది క్షణాలయ్యాక ఇంకా ఎక్కువగా దబ దబా మూతలు పడేస్తున్న చప్పుడొచ్చింది . పనిమనిషి వెళ్ళిపోయాక , తలుపులు వేసుకొనే వచ్చానే . ఏమిటా చప్పుడు చూద్దాం అనుకుంటూ బయటకి వచ్చాను . ఎదురుగా కనిపిస్తున్న దానిని చూసి నిశ్చేష్టనై పోయాను . ముందుకు తూలి పడబోయి , రేలింగ్ ను గట్టిగా పట్టుకొని ఆపుకున్నాను . అలాగే కొద్ది క్షణాలు చూస్తూ . . . వుండి పోయాను !!!

ఎదురుగా డైనింగ్ టేబుల్ దగ్గర , కుర్చీలో కూర్చొని ఓ కోతి హాయిగా ఓ చేత్తో చపాతి తింటూ , ఇంకో చేత్తో బాటిల్ లోని నీళ్ళు తాగుతూ కనిపించింది ! టేబుల్ మీదంతా , చపాతీ ముక్కలు , అన్నం , కూర , పప్పు వెదజల్లి వున్నాయి . అన్ని గిన్నెల మీది మూతలు అటూ , ఇటూ పడి వున్నాయి . నీళ్ళన్నీ కింద ఒలికి పోయాయి . రూం అంతా ఖంగాళీ గా వుంది . నేను అలా చూస్తుండగానే చేతిలోని చపాతి కిందపడేసి , ఇంకోటి తీసింది . దాన్ని కొంచం రుచి చూసి పడేసింది . అలా ఇంకా ఇంకా అన్ని తీసేసి పడేస్తొందే కాని తినటం లేదు . నేను తేరుకొని , మల్లేష్ , మల్లేష్ అని పిలిచాను . మల్లేష్ , మహేష్ ఇద్దరూ పైకి వచ్చారు . కాని వాళ్ళూ అలాగే దాన్ని చూస్తూ వుండి పోయారు . ఇహ తప్పదనుకొని , పక్కనే పిల్లల బాట్ వుంటే దాన్ని తీసుకొని కింద కొడుతూ ఉష్ ఉష్ అన్నాను . అప్పుడు ఆ కోతి మమ్మలిని చూసి వంట ఇంట్లోకి పరిగెత్తింది . అక్కడి నుండి దానికి వెళ్ళేదారి లేక నిలబడి పోతే పక్క తలుపు తీసాము . వెళ్ళి పోయింది . ఆ తరువాత రూం తుడుచుకునేసరికి నీరసమొచ్చి , తిందామన్నా ఏమిలేక పోయాయి అని చెప్పటం ముగించింది , మా కోడలు అను .

నువ్విక్కడ కోతొస్తుందని ఎదురుచూస్తున్నావు , అక్కడ నీ కోడలి దగ్గరకి వచ్చింది అని నిన్న మావారు చెప్పగానే ఏమిటో సంగతి కనుకుందామని గౌరవ్ ను తీసుకొని శ్రీనగర్ కాలనీ వచ్చాను . నేనూ , గౌరవ్ అడిగి అడిగి మరీ చెప్పించుకున్నాము . ఆ సమయము లో మేము లేక పోయామే అని విచారించాము ! కనీసం ఫొటో ఐనా తీయొద్దా అనూ , మేమూ చూసేవాళ్ళము కదా అంటే , పొద్దున కూడా వచ్చింది ఆంటీ . బ్రేక్ ఫాస్ట్ మొక్కజొన్నపొత్తు తిని వెళ్ళింది . అప్పుడు సరదా వేసి ఫొటో తీసాను , మీకు మేయిల్ చేస్తానులెండి అంది . అదీ సంగతి అలా చెప్పు , రెండు మొక్కజొన్న పొత్తులున్నాయ్ తిందువా అనినువ్వే పిలిచి వుంటావు . ఎంచక్కా నువ్వు కాల్చుకొని , ఉప్పూ , ఖారం , నిమ్మకాయ దట్టించి వుటావు . హాపిగా బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్ళింది . వంటావిడ సువర్ణ వంట నచ్చలేదేమో , అంతా వెదజల్లేసింది . మళ్ళీ డిన్నరు కొస్తుందేమో కాస్త రుచిగా వండమని చెప్పు , సువర్ణకి అన్నాను . ఐనా ఎలావచ్చింది మమ్మీ అని గౌరవ్ ప్రశ్న . వాడికేమిటో ఎన్ని ప్రశ్న లోస్తాయో ! బాదాం చెట్టు కొమ్మ మీద నుండి , వంట ఇంటి వెంటిలేషన్ లోనుండి వచ్చిందిరా . రాగానే గౌరవ్ , గౌరవ్ , మా ఫ్రెండ్ గౌరవ్ ఏడీ అని ఇల్లంతా వెతికింది . నువ్వేమో బామ్మ దగ్గర వున్నావు . నాకేమో ఎంత భయం వేసిందో అని కాసేపు వాడిని ఆట పట్టించింది .