Thursday, July 15, 2010

వానా వానా వెల్లువాయే , కొండా కోనా తుళ్ళి పోయే


వానా వానా వల్లప్పా ,
చేతులు చాచు చెల్లప్పా ,
తిరుగూ తిరుగూ తిమ్మప్పా ,
తిరగలేను నరసప్పా .
చిన్నప్పుడు , వాన మొదలు కాగానే , చేతులు బార్లా చాచి , గిర్రున తిరుగుతూ , ఈ పాట పాడుకునే వాళ్ళం . ఆ బాల్య స్మృతి ఇంకా మది లో భద్రం గానే వుంది . వాన పడ్డప్పుడల్లా బయిటికొస్తూ , ఇప్పుడూ అలా తిరగొచ్చుగా ? పాడుకోవచ్చుగా అని పురమాయిస్తూ వుంటుంది . హుం దానికేం తెలుసు , ఇప్పుడు నేనలా చేస్తే జనాభా దడుచుకుంటారు !

అలా చేసి ప్రజలను భయపెట్టటము ఎందుకులే పాపం . పోనీ పెరట్లోనైనా అలా తడిసి పోదామని మనసు తెగ పీకుతుంది . అమ్మో ఇంకేమైనా వుందా నేనున్నాను అంటూ సైనసైటిస్ ప్రతాపం చూపించేస్తుంది . స్చప్ ఏం చేయను . ఆ తరువాత డాక్టర్ చుట్టూ ప్రదక్షణాలు , ఆవిరి పట్టటాలూ . ఎందుకులే బాబూ , మనకు వర్కౌట్లు కాని వాటి జోలికి పోవటం ? ఇదంతా ఎందుకు కాని , వాన పడుతున్నప్పుడు ఎంచక్కా కొన్ని ఫొటోలు తీసి బ్లాగ్ లో పెడదామని డిసైడై పోయాను . ఆ ఫొటోలు ఎలా వస్తాయో ! ఆ పోనీలే చూసేవాళ్ళ అదృష్టం .

ఎదురు చూడగా చూడగా వానలొచ్చేసాయి . వహవా ఇంటి చూట్టూతా కొండా , కోనా పచ్చ పచ్చగా కన్నుల పండువగా ఐపోయాయి . ఓ ఫొటో వాన పడేటప్పుడు తీస్తే ఎంత బాగుంటుంది . దీని దుంప తెగ , ఈ వాన కేమొచ్చిందో రాత్రిళ్ళే పడుతోంది . ఈ దిక్కుమాలిన ఫుట్ బాల్ మాచులూ ఇప్పుడే వచ్చేడిసాయి . వాళ్ళూ , వాళ్ళు ఒక బాల్ కోసం కొట్టుకొని చస్తే నాకేమీ బాధ లేదుకాని , రాత్రి తెల్లార్లూ మా ఆయన గారు ఆ టి .వి ముందు సెటిలైపోతారే .

' మాలా ఇంకా నిద్ర పోలేదా ? '
' లేదండీ '
' ఇంత అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావు ? మళ్ళీ పొద్దున్నే లేవ లేనంటావు . తల నొప్పంటావు . పడుకోరాదూ . '
. . . . . . . . . . . . .
' ఏమిటీ మాట్లాడవు ? ఏం రాచకార్యం వెలగపెడుతున్నావు ?'
( నా మొహం ఏం చెప్పను ? చెపితే ఇకేమైనా వుందా ? )
అనుకునంతా అయ్యింది . లోపలి కోచ్చి , ఈ టైం లో కంప్యూటర్ ముందు కూర్చున్నావా ?
' అది కాదండి కొంచం బ్లాగ్ పని వుంది . . . . '
' నీకు మరీ బ్లాగు పిచ్చి , కంప్యూటర్ పిచ్చీ ముదిరిపోయాయి . ఈ కంప్యూటర్ అవతల పారేస్తే కాని మనుషుల్లో కలవవు . '
' ఏమండీ . . . ఏమండీ కంప్యూటర్ బయట పారేయకండి . '
ఘబ్బుక్కున మెలుకువ వచ్చింది . థూ థూ అని వీపుమీద కొట్టుకున్నాను . ఎంత పీడకల వచ్చిందీ . మా వారు అంతటి ఘనులే . కంప్యూటర్ అవతల పారేసినా పారేస్తారు .

ఆ వెధవ ఫుట్ బాల్ మాచ్ ఐపోయేదాకా ఎదురుచూసి , ఆయన పడుకోగానే , నా బ్లాక్ బెరీ తీసాను . చిన్నగా అడుగుల చప్పుడు కాకుండా , వెనకకు వెళ్ళి , ఇంకా చిన్న . . . గా తలుపు తీసాను . హుం వానాగిపోయింది !! కాసేపు ఎదురుచూద్దాం వస్తుందేమో . ఎలాగూ మా అబ్బాయి చదువుకునే రోజులలో రాత్రంతా , ఆపైన పని చేసుకుంటున్నప్పుడు పక్కన పుస్తకం పట్టుకొని నిషాచరిలా కూర్చోవటము అలవాటేగా .

లైట్ వేయకుండా , లాప్ టాప్ ఓపెన్ చేసాను . అవును మరి వానొచ్చేదాకా కాలం గడవద్దూ . తీయగానే చాటింగ్ ఫ్రెండ్స్ ఏమిటండీ మాలా గారూ ఈ టైం లో . ఇంకా నిద్రపోలే . వాన కోసం ఎదురు చూస్తున్నానంటే నవ్వరూ ? అందుకే మా కోడలు ఫొటో పంపుతానందండి అందుకే ఎదురుచూస్తున్నాను అని సగం నిజం చెప్పాను . పాపం తను ఫొటో పంపి గంటైంది . అలా ఆరోజు ఎదురు చూపుల తోనే గడిచి పోయింది .

మరునాడు కూడా పట్టూవదలని విక్రమార్కిణిలా , ఫుట్ బాల్ మాచ్ అయ్యే దాకా ఎదురు చూసి , మా వారు పడుకున్నాక , నేనూ , నా బ్లాక్ బెరీ రెడీ . అమ్మయ్య ఈ రోజు వాన పడుతోంది . థాంక్ గాడ్ . వెంట వెంటనే నాలుగు ఫొటోలు తీసేసాను . కంప్యూటర్ లొ కి అప్ లోడ్ చేసాను . ఇదేమిటీ . . . . ఈ మండే సూర్యుడెక్కడినుండి వచ్చాడు ? ధారలు ధారలు గా పడుతూ వాన కనిపించిందే . ఏదీ ఆ వాన ? అంతా ఏదో గ్లాస్ డోర్ లోనుండి వచ్చినట్లు వచ్చింది ? ? ? నేను తలుపు తీసి బయటకు వెళ్ళే తీసానే ? ? ?
" ఏమండీ మాలా గారూ ఈ రోజూ ఇంకా నిద్ర పోలేదా ? '
' లేదండీ , మా ఆబ్బాయి కోసం చూస్తున్నాను '
సగమే నిజం . మా వాడు కనిపిస్తే ఇదేమిటిరా ఇలా వచ్చింది అని అడుగుదామనే వుంది . కాని మావాడు వుండేది యాహూ లో . నేను జి లో !

పొద్దున్నే లేచి కాఫీ గ్లాస్ పట్టుకొని బయటకు వెళ్ళగా నే ఎంత సుందర దృశ్యం ! ఇంటి ముందు వాన నీళ్ళు పడి మడుగులా తయారైంది . అందులో పై నుండి చినుకులు పడుతూ , గిర గిరా తిరుగుతున్నాయి . వారెవా . మా వారు మాలా నా కాఫీ ఏదీ అన్నా వినిపించుకోకుండా ( అవును మరి ఆ దృశ్యం ఎంత సేపుంటుంది . అది ఫొటో తీయటము చాలా ముఖ్యం కదా ) , ఏ మాత్రం భయపడకుండా , ఆయన వైపు చూడ కుండా ఒలంపిక్ రేసులో లా లోపలికి పరుగెత్తుకెళ్ళి , బ్లాక్ బెరీ తెచ్చి టక టకా రెండు స్నాప్ లు తీసాను .

ఊఊం ఏవీ ఆ వాన చినుకులు ? ఆ రింగులు ? ఏమాట కామాటే చెప్పుకోవాలి , వాన చినుకులు రాక పోయినా , ఆ మడుగులో చెట్ట్ల నీడలు ఎంత బాగా వచ్చాయో !

వాన లో తీయలేక పోయినా , మా ఇంటి చుట్టూ పచ్చపడ్డ కొండా కోనా నైనా తీయ గలిగాను .

పగలంతా ఎదురు చుపులాయే ,
తీర్చి దిద్దుకొని రాత్రి వేళ వస్తావాయే ,
నా కంటి కే కనిపిస్తావాయే ,
నా బ్లాక్ బెరీ కి అగుపడవాయే ,
నను కరుణించక చినుకమ్మా ఎటు పోతివే ? ? ? ? ?

9 comments:

నేస్తం said...

మాల గారు మీరు భలే రాస్తారు ...వాన లో తడవడం ఇష్టమా.. నాకు చాలా ..కాని ఈ మద్య చల్లగాలి తగిలిన చిరుజల్లు మీద పడినా వణుకు వస్తుంది..బాగా రాసారు :)

భావన said...

చినుకమ్మ మా వూరొచ్చింది ఇంక మీ బ్లాక్ బెర్రీ కు అగుపడదు మరి. ;-) బాగా రాసేరు.. ఈ సగం నిజం సగం అబద్ధం పాలసీ బాగుంది ఆపద్ధర్మం గా వుపయోగపడేటట్లే వుంది.

psmlakshmiblogspotcom said...

మొత్తానికి సాధించారు. very good.
psmlakshmi

శ్రీలలిత said...

మొత్తానికి మా దోస్త్ ని అదే మీ వారిని ఆడిపోసుకోకుండా టపా పెట్టరుగా..
హన్నా.. బొత్తిగా భయం లేకుండా పోతోంది. (అబ్బే ..వుట్టినే సరదాకి..)
మీ టపా, మీరు పెట్టిన ఫొటోలు, మీరు వ్రాసిన స్వగతం అన్నీ బలే బాగున్నాయి..

మధురవాణి said...

Wow! excellent post మాలా గారూ! మీ స్వగతం చాలా బాగుంది. చివర్లో రాసిన పాట సూపర్! భావన గారన్నట్టు, ఇదేదో మంచి అయిడియాలా ఉంది. మేమూ వాడేస్కుంటాం. మీలాగే నాక్కూడా వానలో తడిసిపోడమంటే చాలా ఇష్టం. :)

divya vani said...

చాలా బాగుంది మాల గారు.nice post

మాలా కుమార్ said...

నేస్తం గారు ,
మీరు అంతలా మెచ్చుకుంటే చాలా మొహమాటం గా వుందండి . థాంక్ యు .

& భావనా ,
ఈ చినుకే కాదు , ఏదీ అవుపడటం లేదని , మా అబ్బాయి , నా బ్లాక్ బెరీ ని అవతల పారేశాడు . ఇక అంతే సంగతులు .

మాలా కుమార్ said...

లక్ష్మి గారు ,
ఏదో మొహమాటనికి బాగున్నాయంటున్నారు కానీయండి , అందులో ఒక్క చినుకైనా కనిపిస్తోందాండీ ? హుం .
మెచ్చుకున్నందుకు థాంక్స్ అండి .

& శ్రీలలిత గారూ ,
అండగా మీరుండగా మీ దోస్త్ ను ఆడి పోసుకోవటమే ! అంత ధైర్యం నాకెక్కడి దండీ బాబూ .
నా ఫొటోలు , నా స్వగతం , నా టపా బాగుందంటారా వాకే థాంక్ యూ అండి .

మాలా కుమార్ said...

మధురవాణీ ,
నా బాధ నీకు పాటలా కనిపించిందా , హుం .
అవును మరి కొన్ని సార్లు , అబద్ధం ఆడలేము . అలా అని నిజం చెప్పలేము . ఐనా ఇది మనకు ధర్మరాజు నేర్పిందే కదా !
థాంక్ యు .

& దివ్య వాణి గారు ,
మీకు నా పోస్ట్ నచ్చినందుకు థాంక్స్ అండి .