Sunday, January 29, 2017

రచయిత్రుల హంగామా



పక్క పియస్యం గారు కొబ్బరినీళ్ళల్లో జలకాలాడుతున్నారు అదే గ్లాస్ లల్లో పోస్తున్నారు.శ్రీశాంతి తను తెచ్చిన ఆలూ బజ్జీలు అందరిమీదా ప్రయోగించేందుకు ఆయత్తమవుతోంది(పాపం మొదటిసారి చేసిందిట).నేను నా వడలు వేడిచేసి , అల్లం పచ్చడితో వడ్డించేందుకు తయారు చేసుకుంటున్నాను.కొంత మంది బల్ల మీద అన్నీ సద్దుతున్నారు.కొంతమంది కుర్చిలల్లో కాళ్ళు బార్ల జాపుకొని కూర్చొని థాఫీగా కబుర్లేసుకుంటున్నారు.ఇంకొంతమంది బెడ్ రూం లో మంచం మీద జారిగలపడ్డారు. దూరం నుంచి ఒక్కళ్ళూ రాలేక బతిమిలాడి బామాలి కొంతమంది వెంట తెచ్చుకున్న ఏమండీలు  మా గోల భరించలేక ఇంకో గది లో తలుపులేసుకొని కూర్చున్నారు.ఇంకో గది లో అమ్మాయి మేకప్ అవుతోంది.భారతి ఫొటోలు తీస్తుంటే జియస్ గారు తన కళంకారీ చీర బాగాపడేటట్లు సూచనలిస్తున్నారు.అబ్బో ఇంకా చాలామంది బొలెడు ఫొటోలు తీసారు. ఏమిటీ ఏదో పెళ్ళి ఇల్లు అనుకుంటున్నారా? అబ్బే కాదు హడావిడి అంతా సుజలావాళింట్లో ప్రమదాక్షరి సభ్యుల కలకలం :) అదో మా పాటికి మేము హడావిడి పడుతుంటే సందట్ల్లో సడేమియా అని టి.వి వాళ్ళు , బాబ్బాబు ఇంతమంది ప్రముఖ రచయిత్రులు, మీరంతా  చేనేత చీరల్లో మెరిసిపోతున్నారు. మిమ్మలిని  మేమూ షూటింగ్ చేసుకుంటాము మా చానల్ ల్లో ప్రసరించుకుంటాము అన్నారు.సరేనని కరుణించాము.
అదో అలా మొదలైంది.అందరమూ చక్కగా చేనేతచీరలు కట్టుకొని,తలా ఒక ఐటెం చేసుకొని పాట్ లక్ లంచ్ చేసుకున్నాము.టి.వి షూటింగ్ తో పాటు అంత్యాక్షరి ఆడుకున్నాము. చిన్నపోరిని చేసి మావాళ్ళంతా ఆంకర్ స్వీటీ కి బోలెడు సలహాలిచ్చారు.రచయిత్రులా మజాకా! బోలెడు కబుర్లు చెప్పుకున్నాము.పాటలు పాడుకున్నాము.సరే ఫొటోలు రాత్రి నుంచి చూస్తూనే ఉన్నారుగా :) చాలా అంటే చాలా అలసి సొలసి ఇంటికి ఎలానో వచ్చి పడ్డాము :)
అన్నట్లు జ్యోతి మా అందరికీ బోలెడు బుక్స్ రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చింది.ఎందుకా మేమంతా బుద్దిగా టి,వి వాళ్ళు చెప్పిన మాట విన్నామని. ఇంకా ఉమా ఏమో కంప్యూటర్లెందుకు పెన్ తో రాసుకోండి అని తలా పెన్,దానితో పాటు చాక్లెట్ ఇచ్చింది.ఏమిటీ నా ఫొటోలో పెన్ కనిపించటం లేదా ? సాయంకాలం అవి తెచ్చి బల్ల మీద పెట్టాను.పొద్దునకల్లా పెన్ మాయం.మా ఏమండీ కి పెన్ లు చాలా అవసరం.వారానికో డజన్ కొంటూ ఉంటారు.మరి ఉమా నాకు ఇంకో నాలుగివ్వు మా ఏమండీ కోసం ఇవ్వొచ్చుగా భాగ్యమా బంగారమా ?  ఇవ్వలేదు.చూసుకుందాం.పెన్నేటి శ్రీదేవి గారు సంత్రా ఇచ్చారు.అదీ మా ఏమండీ కోసం నేను తినకుండా తీసుకొచ్చానన్నమాట,ముచ్చెర్ల రజనీ శకుంతల వెంకటేశ్వవరవ్రతం చేసుకుందిట .ప్రసాదము, శ్రీవెంకటేశ్వర స్తోత్రావళి పుస్తకమూ ఇచ్చింది. చిన్న రహస్యం సుమన నాకో చీర ఇస్తానన్నది. ఉష్ గప్ చుప్ మావాళ్ళెవరికీ చెప్పొద్దు. కుళ్ళుకుంటారు.
.మేమేమో బోలెడు ఎంజాయ్ చేసాము.పాపం మీరేమో తిండీతిప్పలు మానేసి మా కోసం . . .  మాకోసం మీరూ , మీ ఏమండీ గారు చాలా కష్ట పడ్డారు.అందుకు ప్రతిఫలంగా  మీ మనవరాలి పెళ్ళికి వచ్చి ఇలాగే సందడి చేసిపెడతామని మాట ఇస్తున్నాను.మీ ఆదర, ఆత్మీయ ఆథిధ్యానికి చాలా చాలా ధన్యవాదాలండి సుజలగారు, మూర్తిగారు.


Thursday, January 26, 2017

ఏమండీ తో సినిమాకి!



అదేమిటో సినిమా కు వెళ్ళిన కాసేపటికే మా ఏమండీ కి తెగ నిద్ర వచ్చేస్తుంది.హాయిగా సీట్ వెనకకు ఆనుకొని నిద్రపోతారు.జ్యోతి సినిమా కు వెళ్ళినప్పుడు , అందులో జయసుధ కాసేపు ఫ్లాష్ బాక్ లో కాసేపు ఫూచర్ లో ఉంటుండుండేది.ఏమండీ కి మధ్య మధ్య మెలుకువ వచ్చినప్పుడు అదేమిటీ ఇందాక జయసుధ మురళీమోహన్ తో డ్యూఎట్ పాడుతోంది కదా ఇప్పుడు గుమ్మడిని ఏమండీ అని పిలుస్తోంది ఏమిటీ అని కన్ ఫ్యూజ్ ఐపోయి ఊరుకోవటమే కాక ప్రశ్నలు కూడా.చుట్టుపక్కల వాళ్ళేమిటో నవ్వటం.ఇహ ఇట్లా కాదనుకొని సినిమా వచ్చి పాతబడ్డాక హాల్ లో కొంతమంది మాత్రమే ఉన్నారు అని ఖచ్చితం గా తెలిసాక,అదీ .సీ హాలైతే వెళ్ళటం మొదలు పెట్టాము.ఏమండీ కూడా డిస్ట్ర్బెన్స్ లేకుండా హాయిగా నిద్దరోయేవారు.ఏమి చేయాలి నీకు సినిమాహాల్ లో గేట్ దగ్గర టికెట్లు చింపే ఉద్యోగం ఇస్తారేమో చేరు అని నా సినిమా పిచ్చి భరించలేక ఏమండీ కోపం చేసేరోజులవి మరి.అప్పట్లో సినిమాలు, నవలలే నా లోకం.ఆర్కేవాడు కూడా ఉద్యోగం ఇస్తాడేమోకనుక్కోమనేవారు.అలా అలా ఆరు పుస్తకాలు, ఆరు సినిమాలు గా రోజులు దొర్లిపోతూ ఉండగా ఒకానోన రోజు సడన్ గా బోలెడు భయాలు వచేసాయి.సినిమా మొదలుకాగానే , వాళ్ళు తలుపులు వేసేయగానే భయం మొదలు.దానితో పదేళ్ళుగా సినిమాలు బంధ్. పదేళ్ళల్లో పట్టుమని పది సినిమాలు కూడా చూసి ఉండము.అవి కూడా శాంతి థియేటర్ లో. ఎందుకంటే వాళ్ళు తలుపులు తీసి ఉంచేవారు.
మధ్య చేతికి దెబ్బ తగిలినప్పుడు చాలా మతిమరుపు వచ్చేసింది. మతిమరుపులో భయాలు కూడా చాలా వరకు మర్చిపోయినట్లున్నాను. మధ్య అలమారా లిఫ్ట్ ఎక్కుతే భయం వేసింది కాని కాళ్ళూ చేతులూ వణకటం వగైరా లేవు.అందుకని సారి సినిమాకు కూడా పోదామ నుకొని ,నిన్న లాప్ టాప్ లో ధీక్ష గా బ్రిడ్జ్ ఆడుకుంటున్న ఏమండీ తో ఏమండీ సినిమాకు పోదాం అన్నాను.,ఏమిటీ అన్నారు షాక్ గా. గ్లాసెడు మంచినెళ్ళిచ్చి అవునండి.పోస్టర్స్ చూస్తుంటే శతమానంభవతి బాగున్నట్లుంది పోదామా అని అడిగాను.పాపం షాక్ నుంచి తేరుకోవటానికి కాస్త సమయం పట్టింది.
పేపర్ లో 1.10 కే అని ఇచ్చాడు.అప్పటికే 12.15 అయ్యింది. ఆదరాబాదరా అన్నం తినేసి రెడీ అయ్యి వెళ్ళాము.తీరా వెళితే 4 కు మేడం అన్నాడు.విక్రమార్కిణి లా షోకే టికెట్స్ అవీ రెక్లేన్ చేర్ వి కొన్నాను.ఇంకా టైం ఉందని ఎప్పటి నుంచో వెళుదామని వాయిదా వేసుకుంటున్న ఫ్రెండ్ ఇంటి కి వెళ్ళి  తీరికగా కబుర్లు చెప్పుకొని టీ తాగి పళ్ళ ముక్కలు ( అదేమిటో మధ్య అందరూ పళ్ళే పెడుతున్నారు ) తిని సినిమాకు వెళ్ళాము.తలుపులేసి , లైట్లు ఆఫ్ చేయగానే చుట్టూ కొద్దిగా గాభరాగా చూసాను ఇంకా తలుపులెక్కడైనా ఉన్నాయా ని , కనిపించలేదు.ఐనా గుంటలు పడ్డ చేర్ లోనే సద్దుకొని కూర్చున్నాను.ఇంటర్వెల్ లో ఏమండీ పాప్కార్న్ కూడా తెచ్చారు. చేర్స్ దగ్గరకు వేయిటర్ కూడా వచ్చి ఏమైనా కావాలా అని మధ్యమధ్య అడుగుతునే ఉన్నా మన సొంతగా తెచ్చుకోవటం లో మన తుప్తి మంది కదా!

విధంబుగా భయమూ గట్రా లేకుండా శతమానంభవతి చూసాము.మళ్ళీ చేతికి దెబ్బతగిలి పోయిన మతి తిరిగి వచ్చి, మతిమరుపు పోయి, అన్నీ గుర్తొస్తే చెప్పలేను  :)

Saturday, January 7, 2017

విధివిన్యాసాలు




16-12-2016 గో తెలుగు.కాం అంతర్జాలపత్రిక లో వచ్చిన నా కథ "విధివిన్యాసాలు."

http://www.gotelugu.com/issue193/4989/telugu-stories/vidhivinyasalu/