Tuesday, April 24, 2012

బ్లాగ్ తారలే దిగి వచ్చిన వేళ - బహుమతులే తెచ్చిన వేళ

నిన్నటి నుంచీ జ్యోతి గారు , జ్ఞానప్రసూన గారు ,శ్రీలలిత గారు , ప్లసులలో జ్యోతి గారు, వరూధిని గారు , రమణి గారు మా గెట్ టుగేదర్ గురించి చెప్పిన విశేషాలు వింటున్నారు కదా , ప్లీజ్ ప్లీజ్ నా ముచ్చట్లు కూడా కాస్త విందురూ ! అవును మరి నాకు బోలెడు బహుమతులు వచ్చాయి . అవి చూపించవద్దూ :) అవి చూపించే ముందు మా గెట్ టుగేదర్ గురించి శ్రీలలిత గారు రాసిన కవిత చదవండి . ఆ తరువాత తీరిగ్గ నాకొచ్చిన బహుమతులు చూద్దురుగాని . ముందే చెపుతున్నాను అవి చూసి ఎవరూ కుళ్ళుకోవద్దు :)


మహిళలందరు కలిసి ముదమార జతకూడి
మాటల మూటలు కట్టగ మాల ఇల్లు చేరేరట...
సంతోషం, సంరంభం, సల్లాపాల వెల్లువలై
వేసవిలో వానపాటలు వరదల్లే పొంగేనట...

ఒకరి వంట ఒకరు మెచ్చ
ఒకరి మాట ఒకరు చెప్ప
నీది బాగంటే నీదిబాగంటూ
ఒకరినొకరు మెచ్చుకొనగ
ఎదుటివారిలోని మంచి
ఎదుటివారి గొప్పతనం
ఒకరికొకరు గుర్తించి
ఒకరినొకరు పలుకరించి

జ్యోతి మనకు గురువంట
ప్రసూనయే స్ఫూర్తి యంటూ
స్వాతి, సుజన లనే మామ్మలకు
మరల మరల గుర్తు చేస్తూ..
(ఇక్కడో పిట్ట కథ..సుజ్జి మాలాకి ఫోన్ చేసి "అక్కడందరూ పెద్దవాళ్ళుంటారు..నేనొస్తే బాగుంటుందా?"
అన్నట్టందిట. "ఫరవాలేదు, బాగుంటుంది ర" మ్మని సుజ్జికి చెప్పి, మాలా ఆ విషయం మాతో చెప్పి, సుజ్జిని రమ్మని చెప్పిన ఆవిడ విశాలహృదయాన్ని చూపించుకున్నారు.
కాని మేము మాలా కి అంత పేరు వచ్చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా..అబ్బే..
నేనూ, పి.ఎస్.ఎమ్.లక్ష్మిగారు కలిసి సుజ్జి అన్న ఆమాట పట్టుకుని,
ఒక్కదాన్నీ ఏడి్పిస్తే ఏమైనా అనుకుంటుందని, సుజ్జికి తోడు స్వాతిని కూడా కలిపేసి, అక్కడున్నంతసేపూ వాళ్ళిద్దరినీ మామ్మలని చేసేసి, అలాగే పిలిచేసి, నేనూ లక్ష్మిగారు పేద్ద యూత్ లా ఫీల్ అయిపోయాం.. ఇక్కడ "మామ్మ" అన్నమాట వెనకాల అంత కథ వుందన్నమాట. )

ఆటలలో ముందుంటూ
పాటలతో "సై" అంటూ
ఒకరినొకరు చేయి పట్టి
మున్ముందుకు నడిపిస్తూ

సుజాత కూతురు సంకీర్తన
పెట్టిన పోటీలో ఓడి
సన్న మొగ్గ కళ్ళలోని
సంతోషం గమనించి..

నడుంకట్టి మన మాలే
వేడి వేడి పూరీలు
అప్పటికప్పుడు చేయించి
అందంగా అమరిస్తే

వెనక వెళ్ళి వేలు పెట్టి
అత్తగారి పోజ్ కొట్టి
ఫొటో కావాలన్న స్వాతి , సుజ్జి ల
చిలిపితనం చిరునవ్వులు తెప్పిస్తే...

పూర్ణం బూరెలు నిండుగ తెచ్చిన
అపర అన్నపూర్ణ..
స్వీట్ లివిగో తినమంటూ
ఉమాదేవి, సుజాతలు..

చిప్స్ నమిలి, కోక్ పుచ్చుకోమని
యాత్రాలక్ష్మి హడావిడి..
కేరట్ తురుముతొ మెరుస్తున్నవెన్నలాంటి ఆవడలు
చెప్పకనే చెప్పెనులే వరూధిని గొప్పలు

ఘుమఘుమ లాడిపోతున్న పుదీనా చట్నీ,
కమ్మనైన బజ్జీల ఎంచక్కటి మజ్జిగపులుసు
అందరికీ తెలిసినదే అది షడ్రుచుల ప్రతిభేనని
కావాలా వేరేగా దానికొక ప్రతిభ తెలిపే పట్టీ

నా పులిహోరకు న్యాయం చెయ్యమంటూ
రమణి పెట్టిన గట్టి హుకుం
కొత్తావఘాటెక్కించే స్వాతి ఆవకాయ ,
వేడి పూరీలకు జత కలిసే
శ్రీలలిత చోలే

ఇంకా ఇంకా చాలాచాలా
తిని పెట్టి, తాగి పెట్టి (సోడా కలుపుకోకుండా)
ఆటలాడి అలసిపోయి
పాట పాడి సొక్కి పోయి

వేడి వేడి తేనీటితో
అలసటంత తీర్చుకుని
ఇంటిముఖం పట్టామందరం
తప్పదు కదా ఇంక అంటూ....

అసలు మా ఇంట్లో గెట్ టుగేదర్ కు పిలుపుల కార్యక్రమం లో వరూధిని గారు సాయపడ్డారు . పాపం ఆ విషయంలో ఆవిడే ఎక్కువ కష్టపడ్డారు . ఇహ వచ్చిన వాళ్ళతో పేర్లు చెప్పించే , పరిచయాలేమో లక్ష్మి గారు చేసారు . మరి నేనేమి చేసానంటారో ఇదో ఇవన్నీ అందుకుంటూ బిజీగా వున్నానన్నమాట :)

క్లుప్తంగా ఇవీ మా గెట్ టుగేదర్ విషయాలు .

ఇహ పోతే అందరికనా ముందుగా వచ్చిన జ్ఞానప్రసూనగారు నాకో చక్కటి రామాయణం పుస్తకం బహుమతిగా ఇచ్చారు .అలా వూరికే ఇచ్చేసారనుకుంటున్నారా ? కాదు ఎంచక్క నన్ను ఎలా పొగిడుతూ ఇచ్చారో చూడండి :)

పరిమళము , తెల్లదనము
చల్లదనమూ , కోమలత్వమూ
కలగలిసిన మల్లెపూలవంటి
మాలాగారికి చిక్కని స్నేహముతో
జ్ఞానప్రసూన
అని వ్రాసి మరీ ఇచ్చారు .

అది అలాంటి ఇలాంటి ది కాదు .యస్. ఆర్ . కొల్లూరి గారు , కంప్యూటర్ గ్రాఫిక్ పైంటింగ్స్ వేసి రచించిన అపురూపమైన పేంటింగ్స్ తో వున్నది . దానికి ఇంకో విశేషము కూడా వున్నది . అదేమిటంటే ఈ పుస్తకము అమ్మగా వచ్చిన డబ్బులను బ్లైండ్ స్కూల్ వారికి డొనేషన్ గా ఇస్తారట .

ఇదిగో ఇదే ఆ పుస్తకం ;



జ్ఞానప్రసునగారితోపాటు వచ్చిన శ్రీలలిత గారు గేంస్ అరేంజ్మెంట్ చూసారు . అంటే గిఫ్ట్స్ కొనుకొచ్చారు , తంబోలా సెట్ తెచ్చారన్నమాట .ఇంకా జై శ్రీరాం , జై శ్రీ క్రిష్ణ ఆడించారన్నమాట . అలాగే ఇదిగో , ఇది వారి నాన్నగారు వ్రాసిన పుస్తకం " పిడపర్తి వారు , కథలూ - గాధలు " ని బహుమతిగా ఇచ్చారు .




మండే వేడి , ఫాన్ గాలీ వేడిని ఆపదు . ఏ.సీ ఆపదు . వుడికి వుడికి పోతూ , ఉష్ బుష్ అనుకుంటూ చిరాకు పడే బదులు చక్కని పాటలు వింటూ వుంటే వేడీ గీడీ అన్నీ ఎగిరిపోతాయి . కదా ! అందుకే జ్యోతి గారు చల్ల చల్లగా కూల్ కూల్ గా ఆ పాత మధురాలను డి. వి. డి లో వెయ్యి తెలుగు పాటలు , వెయ్యి హిందీ పాటలు ఓపికగా అప్లోడ్ చేసి ఇచ్చారు .ఎంత గొప్ప ఐవిడియానో కదా !




ఓపక్క చక్కని పాటలూ , ఇంకోపక్క ఓ చక్కటి నవల చదువుతూ వుంటే హబ్బ . . . స్వర్గం ఎంత దూరంలోనో లేదు . మనమే స్వర్గం లో వున్నట్లు అనిపించదూ . ఆ అనుభూతిని పొది ఆనందించమనే సుజాత గారు చూడండి ఎన్ని పుస్తకాలిచ్చారో ! గదిలోనే ఎందుకు చల్లని సాయంకాలం హాయి హాయిగా తోటలో కూర్చోండీ అంటూ , బ్రహ్మకమలం , మల్లె మొక్కలు కూడా ఇచ్చారు తెలుసా !!!!!






సుప్రసిద్ద రచయిత్రి మంథా భానుమతిగారు , ఆవిడ స్వహస్తాలతో ఆటోగ్రాఫ్ చేసి , ఆవిడ నవల ఒకటి , కథలసంపుటి ఒకటి ఇచ్చారు . ఎంత హాపీసో :) మంథా బానుమతి గారు నాకు పాత స్నేహితులే . దాదాపు 20 ఏళ్ళ తరువాత కలుసుకున్నాము . చాలా సంతోషం కలిగింది . సమయం వున్నంతలోనే పాత సంగతులు గుర్తు తెచ్చుకున్నాము .



హేమిటీ ఏదో ఏ మూలనుంచో ఇన్ని పుస్తకాలా అని గొణుగుడు వినిపిస్తోంది . ముందే చెప్పానా కుళ్ళవద్దు అని :) అన్నీ తీరికగా చదివి పరిచయం చేస్తానులెండి .

Thursday, April 5, 2012

ప్రజ్ఞాధురీణ ప్రసూన



ఉరకలు వేసే ఉత్సాహానికి వయసు అడ్డు వస్తుందా ? అంటే రాదనే చెపుతున్నారు "సురుచి " బ్లాగర్ 'జ్ఞానప్రసూన ' గారు . ఆవిడ కు ఖాళీ సమయము ,సమయాన్ని వేస్ట్ చేయటము , తోచక పోవటము అంటే తెలియదు . టీచర్ గా ఉద్యోగ బాధ్యల నుంచి విరమించుకున్న తరువాత , రచనలు చేయటము , వివిధ విషయాల పైన రేడియో లో ప్రసంగించటము , కుట్ట్లు , బొమ్మల తయారీ , అబ్బో ఆవిడ చేయని పని లేదేమో !వారిని "సాయి కల్పం" అనే అసోషియేషన్ వారు ' విశిష్ఠ వ్యాకుల ' పురస్కారం తో సత్కరించారు .

ఇలా ప్రసూన గారి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు . అందుకే ఈనాడు ' వసుంధర ' లో ప్రసూన గారి గురించిన వ్యాసం వచ్చింది .

ప్రస్తుతము ప్రసూన గారు "సిరి " లో పేంటింగ్ ( చిత్రకళ ) ను నేర్చుకుంటున్నారు . ఇప్పటి వరకు 30 క్లాసులకు అటెండ్ అయ్యారట. . పెన్సిల్ స్కెచ్ లు ఎంత బ్రహ్మాండం గా వేసారో చూడండి . మొన్న మార్చ్ 31 నుంచి నుంచి నిన్న 3 వ తారీకు వరకు , సిరి వారు ,' హోటల్ మార్రిట్ట్ ' లో నిర్వహించిన పేంటింగ్ ఎక్షిబిషన్ లో జ్ఞానప్రసూన గారివి రెండు పేంటింగ్స్ ప్రదర్షించారు .

ఆ పేంటింగ్స్ ఇవే ;






నిన్న నేనూ , పి. యస్ .యం . లక్ష్మిగారు , శ్రీలలిత గారు ప్రసూనగారి పేంటింగ్స్ చూసి వచ్చాము . ఇంటి కి రండమ్మా ఇంకా చాలా వున్నాయి చూపిస్తాను అన్నారు . మేము వీలుచూసుకొని ఒక రోజు వారి ఇంటి కి వెళ్ళి మిగితా పేంటింగ్స్ కూడా చూసి రావాలనే అనుకుంటున్నాము . ప్రసూన గారు పెట్టిన బిస్కెట్స్ తిని , వారిని అభినందించి వచ్చాము .


జ్ఞానప్రసునగారి నుంచి నేర్చుకోవలసిన వి ఎన్నో వున్నాయి . జ్ఞానప్రసూన కాదు ప్రజ్ఞా ప్రసూన గారు. ఆవిడ ఉత్సాహం చూస్తునే మనమూ వున్నం ఎందుకు అనుకున్నాం మేము ముగ్గురం :)

జ్ఞాప్రసూన గారు మీరు చిరకాలం ఇలాగే ఉత్సాహం గా ఉండి మాలాంటి వారందరికీ మార్గదర్శం కావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను . మరో సారి మీకు హృదయపూర్వక అభినందనలండి .