Monday, June 17, 2013

కుశలమా :)








ఫొటో లో వున్నదేమిటో ఎవరైనా చెప్పగలరా? తరం వాళ్ళు ఎప్పుడైనా చూసారా?ప్రయత్నించండి చెప్పగలేరేమో చూద్దాం :)

పోస్ట్ అన్న కేక వినగానే రయ్ మంటూ పరుగెత్తుకొచ్చి , ఉత్తరాలు అందుకోవటము లో ఎంత ఆనందం. పోస్ట్ మాన్ వచ్చే సమయాని కి ఎంత ఎదురుచూపులు :) ఫ్రెండ్స్ కు పేపర్ల కొద్దీ ఉత్తరం వ్రాయటం , వాళ్ళ దగ్గర నుంచి అంతే పెద్ద పెద్ద ఉత్తరాలు అందుకోవటం మా చిన్నప్పుడు మాకు చాలా సంతోషం కలిగించే విషయం. మానాన్నగారి కి ట్రాన్స్ఫర్ వచ్చి వేరే వూరికి వెళ్ళగానే ముందున్న వూరి ఫ్రెండ్స్ దగ్గర నుంచి బోలెడు వుత్తరాలు వచ్చేవి .ఏప్రిల్ ఫస్ట్ ఇన్లాండ్ లెటర్ లో 'ఏప్రిల్ ఫూల్ ' అని రాసి ఏడిపించటం భలే సరదాగా వుండేది :)

పి.యు.సి లో  రకరకాల అందమైన గ్రీటింగ్ కార్డ్స్ పంపటం అలవాటైంది.హైదరాబాద్ వచ్చాక రకరకాల లెటర్ పాడ్స్ కలెక్ట్ చేయటం, వాటి మీద అందంగా వుత్తరాలు వ్రాయటం చక్కని అనుభూతి. బషీర్ బాగ్  లో షాప్ లో దొరికేవి. ప్రత్యేకం లెటర్ పాడ్స్ కోసం షాప్ కు వెళ్ళేదానిని . లెటర్ పాడ్స్ కు సరిపోను కవర్ లు కూడా వుండేవి.ఫ్రెండ్స్ కు వ్రాయటాని కి రకం , అమ్మ కు వ్రాయటానికి రకం, శ్రీవారి కి వ్రాయటాని కి వక రకం ఇలా ప్రత్యేకమైన లెటర్ పాడ్స్ దొరికేవి. ఎంత అందంగా వుండేవో!మరి ఇప్పుడు షాప్ వుందో లేదో తెలీదు.ఎందుకంటే ఉత్తరాలు వ్రాసి, అందుకొని చాలా ఏళ్ళైపోయింది .దాదాపు అందరూ వచ్చి ఇక్కడే స్తిరపడ్డారు. ఉత్తరాలు వ్రాయటము కూడా కళ. రోజులలో సినిమాల్లో నాయికా నాయకులు అందం గా ప్రేమ లేఖలు వ్రాసుకుంటూవుండేవారు. స్చప్ . . .  ఇప్పుడు ఉత్తరాలే లేవు :(
ఇప్పుడూ పోస్ట్ మాన్ వస్తాడు. పోస్ట్ అనగానే ఎంతలేదన్నా ఆత్రుతగానే వుంటుందికాకపోతే వచ్చేవన్నీ బిల్లులు!
ఉత్తరము కుశలము తెలెపేది అందరికీ ఆనందము కలిగించేది. ఐతే టెలిగ్రాం అనగానే అందరూ భయపడిపోయేవారు.టెలిగ్రాం లో ఎక్కువగా అశుభవార్తలే వచ్చేవి.తరువాత తరువాత గ్రీటింగ్ టెలిగ్రాం లు కూడా వచ్చాయి. మా పెళ్ళి కి,మా అమ్మాయి పుట్టినప్పుడు  చాలా గ్రీటింగ్ టెలిగ్రాంస్ , మావారి స్నేహితుల దగ్గర నుంచి వచ్చాయి. ఏమిటో అప్పుడు అవి దాచుకోవాలని తోచలేదు .
ఉత్తరాలు మాయం అయ్యాయి. ఇహ టెలిగ్రాం సర్వీసులు కూడా నిలిపేస్తున్నారని పేపర్ లో చదివినప్పుడు చాలా బాధ కలిగింది. అదేమిటో చిన్న చిన్నగా నాకు తెలిసినవన్నీ కనుమరుగవుతున్నాయి:( నేను వంట మొదలు పెట్టినప్పుడు మా అత్తగారింట్లో కుంపట్లలో చేసేవారము .ఇప్పుడు ఎక్కడా కుంపటి లేదు.పచ్చడి అన్నా , పిండి రుబ్బాలన్నా రోలు తప్పనిసరి. ఇప్పుడు దాని స్తానం లో మిక్సీ వచ్చేసింది. రాచిప్ప బదులు నాన్ స్టిక్ పాన్లు వచ్చేసాయి.రిక్షా , జట్కా లేవు.ఎంత అభివృద్ధి చెందాము అనుకున్నా అవన్నీ తలుచుకుంటే దిగులుగా వుంటుంది.

పైన వున్నది మా అబ్బాయి పుట్టినప్పుడు మావారికి ఇచ్చిన టెలిగ్రాం:)

Tuesday, June 11, 2013

మధురస్మృతులు

ఈ ఫొటోలో వున్నది మా అత్తగారు శ్రీమతి పరచ అనసూయ  , మామాగారు శ్రీ పరచ కిషన్ రావు గార్లు.. ఈ రోజు వాళ్ళు ఎందుకు గుర్తొచ్చారా అంటారా  పోయిన వారం మా అత్తగారి వూరు "పోలంపల్లి"వెళ్ళి వచ్చాము . ఆ వూరి గురించి చెప్పేముందు మా మామగారిని , అత్తగారిని తలుచుకున్నానన్నమాట.


"పోలంపల్లి" లో మా మామగారి పూర్వీకులు అంటే తరతరాలుగా అక్కడే స్తిరపడ్డారు . ఇది ఆంధ్రాకు , తెలంగాణాకు బార్డర్ ఏరియా. ఈ సంగతి ప్రత్యేకం గా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే , రజాకార్ మూమెంట్ సమయం లో ఈ వూరు కూడా పాల్గొంది . జమలాపురం కేశవరావు గారి ఆధ్వర్యం లో మా మామగారు , వూరి కరణం అప్పారావు గారు మరి కొందరు వూరి యువకులు వాళ్ళ వుద్యోగాలు వదులుకొని వచ్చి పాల్గొన్నారట. రజాకారులు తరుముతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడి కి వచ్చేవారు.బార్డర్ లో వున్న గ్రామాలలో వారి కాంప్ లు ఏర్పాటు చేసుకునేవారు.అలాంటి వక కాంప్ , పరిటాలకు కాంప్ కమాండర్ మా మామగారు. ఇక్కడ కరణం గారింట్లో ఉద్యమం వ్యూహ రచనలు చేస్తుండేవారు. ఇళ్ళలో ఆడవాళ్ళు నూలు వడకటం చేసేవారు.కార్యకర్తలకు మా ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసారు . మా అత్తగారు , ఆవిడ ఆడపడుచు అందరి కీ వండేవారట.అసలు రోజంతా వండుతునే వుండేవాళ్ళము అనేవారు మా అత్తగారు ఈ వూరి నుంచి మొదటిసారిగా చదువు కోసం బయటకు వెళ్ళింది మా మామగారేనట.

మావారి బాల్యం ఇక్కడే గడిచింది. మా పెళ్ళైన కొత్తల్లో మా బంధువులు , స్నేహితులు అందరూ మావారు చిన్నప్పుడు చేసిన అల్లరి గురించి తెగ చెప్పి భయపెట్టారు.ఓసారి మా అత్తగారి మీద కోపం వచ్చి నాలుగు కిలోల నెయ్యిని ఇంటి ముందు వేపచెట్టు కింద పారబోసారట. ఎంత అల్లరి చేసినా పిల్లలను కొట్టకూడదు , తిట్ట కూడదు అని మామాగారి రూలట. ఈయన అల్లరి భరించలేక ఓసారి , ఇంటి వెనుక వున్న గోతిలో ఈయనను దింపి మా అత్తగారు ఏడుస్తూ కూర్చున్నారట. అలాంటివి బోలెడు సంగతులు , నేను మా పెళ్ళైన కొత్తల్లో అక్కడ వున్నప్పుడు ఎదురింటి వాళ్ళు చెప్పారు.మేము కొన్ని రోజులు ఆ ఇంట్లో వుండాలని , మామాగారు ఆయన చెల్లెలిని తోడిచ్చి వుంచారు. అప్పటికే ఆక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసి చాలా ఏళ్ళైందిట.కాని పొలాలు చూసుకోవటానికి ఆయన వెళుతూనే వుండేవారు.అప్పుడే ఎదురింటి వాళ్ళు మావారి చిన్నప్పటి ఫొటోలు చూపించారు. నేను అడుగుతే అన్నీ ఇచ్చారు కాని వకటి మాత్రం ఇవ్వలేదు . అందులో మావారు చాలా చిన్నగా , బహుషా నాలుగేళ్ళు వుండ వచ్చు , తెల్ల పైజామా కుర్తా వేసుకొని , చేత్తో జంఢాపట్టుకొని వూరేగింపు ముందు వున్నారు . అది రజాకార్ మూమెంట్ ఐపోయిన తరువాత వూళ్ళో వూరేగింపు చేసారట అప్పడు తీసారుట. ఆ తరువాత ఇన్ని సంవత్సరాలకు అక్కడకు పోయిన వారం వెళ్ళము.మధిరలో మా వారి కజిన్ కూతురు పెళ్ళైతే అక్కడికి వెళుతూ పోలంపల్లి వెళ్ళాము. మా ఇద్దరి తోపాటు మావారి కజిన్ సంధ్య కూడా వచ్చింది. ముందుగా తిరుమలగిరి లో వెంకటేశ్వరస్వామి దర్షనము చేసుకున్నాము. ధర్షనం అయ్యాక అక్కడ వున్న క్లర్క్ ను , పోలంపల్లి ఏ రూట్ లో వెళ్ళాలి అని అడిగారు. ఆయన పోలంపల్లి వాళ్ళదే ఇక్కడ పెళ్ళవుతోందండి అని చెప్పారు. అక్కడి వెళి కనుక్కుంటే అప్పుడే పెళ్ళైపోయి అంతా కిందకు దిగారని తెలిసింది. వాళ్ళలో తులశమ్మగారి అబ్బాయి అంటే మా ఇల్లు కొనుక్కున్నావిడ కొడుకు కూడా వున్నట్లు తెలిసింది . అంతే అప్పటి నుంచి మావారి ఆనందం , ఎక్సైట్మెంట్ చెప్పలేనివి . మీరు కార్ లో కింది కి రండి నేను మెట్ల మీదుగా దిగి వాళ్ళను అందుకుంటాను అని వడి వడిగా వెళ్ళిపోయారు.మేము కింది కి వెళ్ళేసరి కి తులశమ్మగారి అబ్బాయి , మావారు చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నారు.ఇప్పటికీ ఆయన పేరు తులశమ్మగారి రెండో అబ్బాయి అనే తెలుసు .ఆయన వెంట పోలంపల్లి బయిలుదేరాము . మీరూ మాతో పాటు రండి.


వూళ్ళో కి వెళ్ళే ముందు భోజనం చేసి వెళ్ళాలి కదా , అక్కడ ఎవరిని ఇబ్బంది పెడతాము . ఇది పోలంపల్లి కి ముందు వున్న 'వత్సవాయి 'అనే వూళ్ళోని హోటల్.భోజనం వేడి వేడిగా వడ్డించారు. ముఖ్యం గా ఎందులోనూ వెల్లుల్లిలేదు :)పెరుగైతే ఎంత రుచిగా వుందో .హాయిగా కడుపు నిండా తినేసాము.
ఈ ఫొటో ఆ హోటల్ ముందుదే. మావారి పక్కన వుంది తులశమ్మగారి రెండో అబ్బాయి ఆపక్కవారు హోటల్ నడుపుతున్న దంపతులు .
ఇహ పోలంపల్లి లోకి పదండి. వూళ్ళోకి వెళుతూనే గుడి పక్కన మా మాష్టారు ఇల్లు అని ఆపారు . ఆయన గురించి అడుగుతే పాపం పోయారు లేరు:( ఇంట్లో కూడా ఎవరూ లేరు.


ఇదే మా యిల్లు. మట్టి ఇంట్లో వాళ్ళ అమ్మ ఇబ్బంది పడుతున్నది అని , వుద్యోగం రాగానే ఈ ఇల్లు అమ్మ కోసం కట్టించారట మామాగారు. కార్ ఆగటం ఆలశ్యం మావారు ఎలా పరుగెత్తుతున్నారో !అప్పటి నుంచి నేనూ, సంధ్యా ఫొటోలు తీస్తూ మావారి ఆనందాన్ని చూస్తూవున్నాము:)
"అరే ఇంటి ముందు పెద్ద వేపచెట్టుండాలి లేదే" మావారి ఆశ్చర్యం.
"దాని కిందేనా మీరు రెండు కిలోల నెయ్యి వంపేసింది ?"నా ఆరా.
"రెండు కాదు నాలుగు కిలోలు "
"మరే వదినా మా అన్నయ్యను తక్కువ అంచనావేయకు ."
మా ఇద్దరి మాటలు ఆయనెక్కడ విన్నారు . ఇంట్లోకి దూరిపోయారు. ఆ ఇంటిని రెండు భాగాలుగా చేసి తులశమ్మగారి రెండో అబ్బాయి , మూడో అబ్బాయి వుంటున్నారట. ఇల్లు చూసేలోపల తులశమ్మగారి రెండో అబ్బాయి వెళ్ళి తెలిసినవాళ్ళను తీసుకొచ్చాడు. మాధవయ్యగారు వచ్చారు అంటూ వాళ్ళూ సంతోషంగా వచ్చారు .








మావారి పక్కనే బుజం మీద చేయి వేసి నిలుచున్నది , ఆయన చిన్నప్పటి గోలీలాడిన ఫ్రెండ్ లచ్చుమయ్య.


ఇది తులశమ్మగారి రెండో అబ్బాయి ఇల్లు . ఆయన భార్య, కొడుకు . ఆవిడ మంచిటీ చేసి ఇచ్చింది.టీ తాగమన్నప్పుడు ఎలాంటి టీ ఇస్తుందో అనుకున్నాను. కాని చాలా బాగుంది . ఆవిడతో టీ బాగుందండి అంటే , మీ మామగారు కూడా వచ్చినప్పుడల్లా "తులశమ్మా నీ రెండో కోడలు టీ చాలా బాగాపెడుతుంది " అనేవారు అంది .మాకు బొట్టుపెట్టి జాకెట్టుబట్టలు పెట్టింది .


ఇది మావారి చిన్ననాటి స్నేహితుడు మన్నెం గోపాలారావుగారి ఇల్లు. ఆయన కొడుకు , కోడలు , మనవడు. ఆవిడా బొట్టుపెట్టి జాకెట్టుబట్టలు పెట్టింది.
అందరూ చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. ఇన్నిసంవత్సరాల తరువాత వెళ్ళినా వూళ్ళో కొంతమందైనా గుర్తుపట్టేవాళ్ళు వున్నారని చాలా సంతోషపడిపోయారు.
అప్పుడు పెట్టిన ముగ్గులు కూడా అలానే వున్నాయి అని తరువాత అన్నారు. ముందే చెపితే అవి కూడా ఫొటోలు తీసే వాళ్ళము కదా అనుకున్నాము . ఎదురింటి వారు వుంటే మావారి ఫొటో అడుగుదామనుకున్నాను . ఇప్పుడైతే వాళ్ళకంత ఆసక్తి వుండదుకదా అనుకున్నాను. ఆ పెద్దవాళ్ళు లేరు . వాళ్ళ పిల్లలు ఖమ్మం లో సెటిలయ్యారు. వాళ్ళ పిల్లలు అమెరికావెళ్ళారు.






ఇదీ మా అత్తగారి వూరు , ఇల్లు.



Saturday, June 1, 2013

విహంగ లో నా కథ "మట్టిలో మాణిక్యం "


"మీరు కథలు వ్రాయొచ్చుకదా?" కలిసినప్పుడల్లా , కాల్ చేసి నప్పుడల్లా పి.యస్.యం లక్ష్మి గారి డైలాగ్ ఇది .అబ్బే నాకేమొచ్చండి నేనేమి వ్రాయగలనండీ నా మొహమాటపు జవాబు . "పొనీ ఏదైనా ఆర్టికల్స్ వ్రాసి మాగ్జిన్స్ కు పంపండి ." అనేవారు . ఆవిడంత ప్రోత్సహించినా ,బ్లాగ్ వ్రాసి ఇప్పటికే జనాలను తింటున్నాను , ఇహ కథలు కూడా వ్రాసి ఎందుకు ఏడిపించటము అనుకొని ఆవిడ మాటలను వినిపించుకోలే:)(ధైర్యం చాలలే )అలా అలా గడిచిపోతూ వుండగా ఓ సంవత్సరము నుంచి శ్రీలలితగారు మొదలయ్యారు . ఆవిడ కు ఉమాదేవి గారు తోడయ్యారు . అబ్బే అప్పటికీ మనం ఏమి వ్రాయగలం లే అనె అనుకున్నాను . ఇలా కాదని వాళ్ళు ముగ్గురూ కలిసి దండెత్తారు . అదేమిటో పాపం వాళ్ళకు నా మీద అంత నమ్మకం :)

"నిన్న ఉమాదేవి గారితో మాట్లాడానండి . మీ టాపిక్ కూడా వచ్చింది . మీరు కథలు వ్రాస్తే బాగుంటుంది అనుకున్నాము ఇద్దరమూ "అన్నారు శ్రీలలిత చాట్ లో. మరునాడు ఉమాదేవిగారు కాల్ చేసి "మాలా ,నేను శ్రీలలిత గారు మీరు కథ లు వ్రాస్తే బాగుంటుంది అని నిన్న మాట్లాడుకున్నప్పుడు అనుకున్నామండి "అన్నారు . నాకేమి మాట్లాడాలో తోచలేదు .సరే పోనీ వాళ్ళు ముగ్గురూ అంత ముచ్చటపడిపోతున్నారు . వాళ్ళ కోరిక తీరుస్తే పోలా అనుకొని ఎడమ చేత్తో , కుడి చేత్తో ఓ నాలుగు కథలు వ్రాసేసాను :)

వాటిని నా మొదటి శ్రోతలైన , మా అమ్మాయి , మాచెల్లెలు జయ లకు వినిపించేసి కాసిని మార్పులు చేసేసి శ్రీలలిత గారి మీద దండెత్తాను . మీరు చదవాల్సిందే నని మొహమాట పెట్టి చదివించేసాను . పాపం ఏదో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు బలైపోయారు .మావారి కి కూడా వినిపించాను కాని పాపం వెరీ గుడ్ వెరీ గుడ్ అనేసారు .

సరే నాలుగు లో ఒహటి విహంగ కు పంపాను . మిగితావి పరిశీలనలో వున్నాయి .(నా పరిశీలన లోనే )దాని సంగతి అటో ఇటో తేలాక , మిగితావి చూద్దామనుకున్నాను :)
అప్పటి నుంచి టెన్షన్ . ఏమంటారో . బాగాలేదనంటారో , బాగుందంటారో అబ్బో చెప్పలేను .వారం క్రితం హేమలత గారు మీ కథ ఈ నెల విహంగ లో వేస్తున్నామండి అని చెప్పగానే వావ్. . . నిజంగా వేస్తున్నారా ? మీకు నచ్చిందా ? అని ఎన్ని ప్రశ్నలు వేసాను .పాపం ఆవిడ ఓపిక గా జవాబిచ్చారు :)

అదీ సంగతి . అలా నా మొదటి కథ వచ్చేసింది .ఇదో ఇక్కడుంది . చదివేసి మీ అభిప్రాయాలు కూడా చెప్పండి .

పట్టుబట్టి నాతో కథ వ్రాయించిన మామంచి స్నేహితులు , శ్రీలలిత గారి కి , పి.యస్. యం లక్ష్మి గారి కి , ఉమాదేవి గారికి బోలెడు ధన్యవాదాలు . నా మొదటి కథ ను ఆదరించిన హేమలత గారి కి చాలా చాలా ధన్యవాదాలు .