Saturday, December 27, 2014

హాపీ హాపీ బర్త్ డే సాహితి
హలో హలో,
అందరూ ఎలా వున్నారు ? సాహితి వైపు రాక చాలారోజులైంది .ఏమీ లేదు కొంచం బద్దకం , కొంచమేమో కథలు వ్రాయమని మా మితృలు మొహమాట పెట్టేస్తుంటే , బద్దకం లేనప్పుడు కథలు ఆలోచిస్తున్నానన్నమాట.అంతే ఇంకేమీలేదు! మరి ఈ రోజేమో  సాహితి పుట్టినరోజు.హాపీ బర్త్ డే సాహితీ!

అసలు సాహితి పుట్టినరోజు తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా వుంటుంది.అవి బ్లాగ్ అంటే  అమితాబచన్ మాత్రమే వ్రాస్తాడని , అదో పేద్ద ఘనకార్యం అనుకుంటున్న రోజులు . అకస్మాత్తుగా మనము కూడా బ్లాగ్ వ్రాయవచ్చు , అదేమీ పెద్ద ఘనకార్యం కాదు అని జ్ఞానోదయం ఐయింది. అంతే  నా " సాహితి " జన్మించేసింది . నా మదిలోని మధురానుభూతులు అలా . . . అలా . . . వచ్చేసాయి. నాకు వినిపిస్తూనే వున్నాయి మీ కిచ కిచ కిచలు . ఎవరైనా మొదట్లో బాగావ్రాయగలరేమిటి :) ఏదో డైరీ లా వ్రాసానే అనుకొండి , అంత మాత్రాన అలా నవ్వేయాలా :( ఏదీ ఇప్పుడు నవ్వండి చూద్దాం :) ఊరికే సరదాకి అన్నాను.మీరెవరూ నవ్వటం లేదు , పైగా నా వ్రాతల్ని ప్రోత్సహిస్తున్నారు నాకు తెలుసు. మీ అందరి ప్రోత్సాహంతోనేగా రోజు చిరు రచయిత్రిగా ఎదిగాను :)
2008 డిసెంబర్ 27 మొదలైన నా నూతనాద్యాయం ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ ఇలా సాగింది.

జూన్ 2013 లో మొదటగా నా కథ " మట్టిలో మాణిక్యం " ప్రచురించి విహంగ పత్రిక బుక్కైపోయింది . అప్పటి నుంచి ప్రతినెల నా పుస్తక సమీక్ష లు వేసుకోక తప్పటం లేదు పాపం .అంతేకాదండోయ్ ఆంధ్రభూమి వాళ్ళు కూడా నా కథలు ప్రచురించారు. నిజం!ఇహపోతే స్వప్న మాసపత్రిక వాళ్ళు కూడా నా కథలు వేసుకున్నారండోయ్!మధ్య మాలిక వెబ్ మాగ్జిన్ వారు నా కథ " చాందిని" పబ్లిష్ చేసారు. దీనికో ప్రత్యేకత వుంది. అది , తండ్రి- కూతురు అనుబంధం అనే విషయం మీద ఇరవైఐదు మంది రచయిత్రి లు కథలుగా వ్రాశారు. కథ లన్నీ కలిపి " ఈండ్రి-తనయ" అనే పేరు తో ప్రమదాక్షరి గ్రూప్ ( ఫేస్ బుక్ లోని రచయిత్రుల గ్రూప్) జే.వి పబ్లిషర్స్ ద్వారా పుస్తకం గా ముద్రించారు.పేరు పొందిన ప్రముఖ రచయిత్రుల కథల సరసన నా కథ కూడా చోటుచేసుకుంది. అదీ సంవత్సరం నా సాహితి  నాకు ఇచ్చిన గొప్ప కానుక!


ఇంకా జాగృతి మాసపత్రిక వారు నిర్వహించిన కథలపోటీలో నా కథ " ఆత్మీయబంధం" సాధారణ ప్రచురణకు ఎన్నికైంది.

రచన మాసపత్రిక లో " నీ జతగా నేనుంటాను" అనే కథ ప్రచురణకు తీసుకున్నారు. రెండూ ఇంకా పబ్లిష్ కాలేదు . ఐనప్పుడు తప్పక చెబుతాను కదా !

ఇంకో మూడు కథలు వివిధపత్రికలలో పరిశీలనలో వున్నాయి.
సో ఇదన్నమాట సంగతి. ఇదంతా మీ తప్పే! మీరంతా నన్ను ఇంతలా ప్రోత్సహించకపోతే నేను వ్రాసేదాన్నా చెప్పండి!

మరోసారి సాహితి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ , మీ అభిప్రాయాలతో  ప్రోత్సహిస్తూ , తప్పొప్పులు దిద్దుతూ నన్ను ముందుకు నడిపిస్తున్న  మితృలకు , కుటుంబసభ్యులకు , ఆత్మీయులైన మీకందరి కీ , కొత్త రచయిత్రిని ఐనా నా కథలను ప్రచురించి ప్రోత్సహించిన  పత్రికాధిపతులకు ,నా హృదయపూర్వక ధన్యవాదాలు.నా "సాహితీ" ప్రయాణం కు  మీ ప్రోత్సహాన్ని , ఆశీస్సులను ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ,
మీ మాల.


Monday, August 11, 2014

చాందినీ

"చాందినీ" నాన్నగారాల కూతురు.చదువులో సరస్వతి.పదవతరగతి చదువుతున్న చిన్నారి.అలాంటి బంగారుతల్లి దారి తప్పుతుందేమో నని అమ్మకు అనుమానం వస్తుంది, అదీనూ నాన్న అలవాటు వల్ల.అది ఏమిటి ? అమ్మ చాందినీ ని, నాన్నను ఎలా దారిలోకి తెస్తుంది మాలిక పత్రిక లో ప్రచురించిన నా ఈ "చాందినీ" లో చదివి మీ అభిప్రాయం చెప్పండి.

చాందినీ


చాందిని
గుప్పిళ్ళు రెండూ మూసుకొని , తలకు రెండుపక్కలా పెట్టుకొని ,ఉయ్యాలలో అమాయకంగా నిద్రపోతున్న బుజ్జిపాపని తదేకంగా చూస్తున్నాడు శ్రీహర్ష . పక్కన మంచం మీద పడుకొని వున్న శ్రీదేవి నవ్వుతూమీ అమ్మాయికి దిష్ఠి తగులుతుంది.”అన్నది
మాట వినిపించుకోకుండా ఎంత ముద్దుగా వుంది పాపాయి. చందమామలా వుంది. అందుకే నా పాప పేరు  ‘చాందినీ మురిపెంగా అన్నాడు.శ్రీహర్ష.
అదేమిటి, నార్త్ ఇండియన్ పేరు పెడతారా? అని ప్రశ్నించింది శ్రీదేవి.
నార్త్ ఇండియన్ పేరైతే ఏమి పెట్టకూడదా? ఐనా పేరును బట్టి కులము, నార్త్ ఇండియనా , సౌతిండియనా అని తెలవాల్సిన అవసరమేమిటి? నాకిష్టమైన పేరు నేను పెడతాను.అన్నాడు హర్ష.
బారసాల రోజు బియ్యములో చాందిని అన్నపేరును చూసి, సారి కొడుకు పుడితే చాంద్మా అని పేరు పెడుతావా అని స్నేహితులు వేళాకోళం చేసారు శ్రీహర్షను. చాందినీ , చాంద్మా అన్నీ  చాందినీ నే నాకు. ఇంకెవరూ వద్దు. చాందినీ నే గొప్పగా పెంచి, బాగా చదివించి ఐఏయస్ ఆఫీసర్ ను చేస్తాను అని గర్వంగా చెప్పాడు శ్రీహర్ష.
న్యూస్ పేపర్ లో ఏవో అండర్ లైన్ లు చేస్తున్న, తీక్షణంగా ఆలోచిస్తున్న శ్రీహర్షను ఏమిటి హర్షా రెండు రోజుల నుంచి తెగ ఆరాటపడుతున్నావు ?అని అడిగింది శ్రీదేవి.
చాందినీ ని స్కూల్ లో చేర్చాలా అని మంచి స్కూల్స్ వెతుకుతున్నాను.అన్నాడు హర్ష.
అంత ఆలోచన ఎందుకు , ఇప్పుడు మూడేళ్ళే కదా పక్కనున్న స్కూల్ లో చేరుద్దాము. ఫస్ట్ క్లాస్ కు వచ్చాక ఏదైనా పెద్ద స్కూల్ లో చేర్చొచ్చు. అంది దేవి.
అలా కాదు ముందు నుంచి మంచి కార్పొరేట్ స్కూల్ లో చేరుస్తే పునాది బాగుంటుంది.ఐయెయస్ అంటే మాటలా ముందు నుంచీ బాగా చదివించాలి.
కార్పొరేట్ స్కూల్ లంటే ఫీజులు లక్షల్లో వుంటాయి. అవేకాక పై ఖర్చులు చాలా వుంటాయి.మనం అంత భరించగలమా? పైగా చాందినీ ని డేకేర్ లో వుంచొద్దు, మనమే చూసుకోవాలి అని నా ఉద్యోగం కూడా మానిపించావు. సందేహపడింది శ్రీదేవి.
ఏం ఎందుకు భరించలేము? నా సంపాదనంతా దాని కోసమేకదా!అతిశయంగా అన్నాడు హర్ష.
అనుకున్నట్లుగానే మంచి , కార్పొరేట్ స్కూల్ లో చాందినీని చేర్చాడు. కూతురు కాలు కిందపెడితే అరిగిపోతుందేమో నన్నంత గారాబం చేస్తాడు. ఆఫీసు నుంచి రాగానే చాందినీ కనిపించాలి.  ప్రతిరోజూ తప్పకుండా చాక్లెట్ తేవాల్సిందే! నీ ఒక్కడికే కూతురున్నట్లు మరీ గారాబం చేస్తున్నావు హర్షా. అది అంత మంచిది కాదు . అని అప్పుడప్పుడు మందలిస్తుంటుంది శ్రీదేవి. కాని దేవి మాటలు లక్ష్య పెట్టడు.
శ్రీహర్ష నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి క్లాసూ మంచి మార్కులతో పాస్ అవుతూ పదవతరగతి కి వచ్చింది చాందిని.
చాందినీ అని పిలుస్తూ చాందిని గదిలోకి వచ్చింది శ్రీదేవి. అమ్మను చూడగానే తత్తరపడుతూ లాప్ టాప్ ను మూసేసింది చాందిని. దేవి కూడా ఏదో ద్యాసలో వుండి అంతగా పట్టించుకోలేదు. కాని అలా రెండుమూడు సార్లు తను గదిలోకి వెళ్ళగానే చాందిని హడావిడిగా లాప్ టాప్ మూసేయటము గమనించి చాందినీ ఏమి చూస్తున్నావు?అని అడిగింది.
ఏమి లేదమ్మా అంటూ గాభరా పడిపోయింది చాందిని.
చాందినీ తత్తరపాటు చూసి అనుమానంగా లాప్ టాప్ తీసి చూసింది శ్రీదేవి.అక్కడ నగ్న చిత్రాలు దర్శనమిచ్చాయి!
చాందినీ ఇవి చూస్తున్నావా? నివ్వెరపోతూ అడిగింది.
నేను ఓపెన్ చేయలేదమ్మా నిజం , మధ్య లాప్ టాప్ ఓపెన్ చేయగానే అవే వస్తున్నాయి.అని ఏడుపు గొంతుతో చెప్పింది చాందిని.
నువ్వు తీయకపోతే అవే ఎలా వస్తాయి? అంటూ హిస్టరీ తీసి చూసింది.అక్కడ సైట్ ఓపెన్ చేసినట్లుగా ఏమీ కనిపించలేదు. మరి చిత్రాలు ఎలా వస్తున్నాయి అని ఆలోచనలో పడింది దేవి.
ఎంతా అలోచించినా ఏమీ తెలీలేదు. పోనీ హర్షను అడుగుదామా అనుకుంది. అడిగితే హర్ష బాధపడతాడో , ఎలా రియాక్ట్ అవుతాడో అనుకొని టెక్నీషియన్ ను పిలిచి అడిగింది.
మీ ఇంట్లో ఎవరో సైట్ రెగ్యులర్ గా చూస్తున్నారు.అందుకే వస్తోంది.అని చెప్పి వెళ్ళాడు.
ఇంట్లో వున్నది ముగ్గురమే , నేను చూడటంలేదు. చాందినీ చూడటంలేదు . మరి హర్ష చూస్తున్నాడా? హర్ష అలాంటివి చూడడే అని ఆలోచనలో పడింది శ్రీదేవి. ఐనా ఓసారి అడిగి చూద్దాం, అడిగినట్లూ వుంటుంది , చెప్పినట్లూ వుంటుంది అనుకొని శ్రీహర్ష తో హర్షా , చాందినీ లాప్ టాప్ లో నగ్న చిత్రాలు వస్తున్నాయి. అదేమో నాకు తెలీదు నేను చూడటం లేదు, సైట్ ఎందుకో ఓపెన్ అవుతోంది అని ఏడుస్తోంది. టెక్నీషియనేమో మీ ఇంట్లో ఎవరైనా రెగ్యులర్గా చూస్తున్నారేమో , అందుకే సైట్ కూడా వస్తునట్లుంది అన్నాడు.ఎవరు చూస్తున్నారంటావు? ఏమై వుంటుందంటావు. అని అడిగింది.
ఎవరు చూస్తారు?అని విసురుగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీహర్ష.
అర్ధరాత్రి గబుక్కున మెలుకువ వచ్చింది శ్రీదేవికి. పక్కన శ్రీహర్ష లేడు. పక్క గదిలో దీపం వెలుగుతోంది.ఎవరా అని వెళ్ళి చూస్తే శ్రీహర్ష లాప్ టాప్ ను దీక్షగా చూస్తూ కనిపించాడు. దగ్గరగా వెళ్ళి చూసింది. చాలా సీరియస్ గా నీలి చిత్రం చూస్తున్నాడు. నిర్ఘాంత పోయింది. హర్షా ఇదేమిటి? అని అవేదనగా అడిగింది. నవ్వి , తిరిగి చిత్రం చూడట లో మునిగిపోయాడు.కోపం పట్టలేక లాప్ టాప్ మూసేసి, అలవాటేమిటి? నీతో సాయంకాలం చెప్పినప్పుడు కూడా నువ్వు మాట్లాడలేదు. ఇది చాందినీ భవిష్యత్తు మీద ఎంత దెబ్బతీస్తుందో గ్రహించుకోలేవా?అని అరిచింది.
అనవసరంగా గొడవ చేయకు దేవీ. ఇక్కడి నుంచి వెళ్ళిపో.అని తిరిగి అరిచాడు.
పిచ్చి పిచ్చిగా మాట్లాడకు హర్షా, నువ్వీ అలవాటు మానేయి. లేకపోతే పిచ్చి సినిమాలు చూసి నువ్వే పర్వర్టెడ్ గా మారిపోతావో! అఘాయిత్యం చేస్తావో!అని గట్టిగా అరిచింది శ్రీదేవి.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ కోపం పట్టలేక శ్రీదేవి చెంప చెళ్ళుమనిపించాడు శ్రీహర్ష.
నన్ను కొడతావా ? దారి తప్పున్నది నువ్వు. నీ ముద్దుల కూతురిని గురించి కూడా ఆలోచించటంలేదు.ఇక ఇంట్లో క్షణం కూడా వుండను . తెల్లవారగానే చాందినీని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. తరువాత నీ ఇష్టం నువ్వేమైనా చేసుకోఅని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రీదేవి.
చేత్తో సూట్కేస్ నూ , చేత్తో చాందినీ ని పెట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న శ్రీదేవి ని నిశ్చేష్టుడై చూస్తూ, నోట్లోమాట రాక అలా నిలబడిపోయాడు హర్ష.
బయటకు వచ్చిన శ్రీదేవి క్షణం సాలోచనగా నిలబడిపోయింది. చాందినీ ని పుట్టింట్లో వదిలి శ్రీహర్ష స్నేహితుడు మోహన్ దగ్గరకు వెళ్ళి పరిస్తితి వివరించింది. మోహన్ ఎలాగైనా శ్రీహర్ష ను వ్యసనం నుంచి బయటపడేయాలి. దానికి నువ్వే సహాయం చేయాలి ప్లీజ్.అన్నది.
చిన్నగా హర్షతో మాట్లాడి , మా కజిన్ సైకాలజిస్ట్ రాం దగ్గరకు తీసుకెళుతాను.నువ్వు ధైర్యం గా వుండు.అని మోహన్ హామీ ఇచ్చాడు.
శ్రీహర్ష కు శ్రీదేవి, చాందినీ లేని ఇల్లు శూన్యంగా వుంది. ఎటుచూసినా వాళ్ళిద్దరే కనిపిస్తున్నారు. చాందినీ నవ్వులూ, ఆటలు, కబుర్లు గుర్తొస్తున్నాయి. ఆఫీస్ నుంచి రాగానే డాడీ అని అల్లుకుపోయే చాందినీ లేక మనసంతా దిగులుగా భారంగా వుంది. అలా అని నీలి చిత్రాలు చూసే అలవాటును మానుకోలేకపోతున్నాడు.
మూడీగా వున్న శ్రీహర్షను చూసి,  మోహన్  ఏమీ తెలీనట్లు మధ్య అలా వుంటున్నావేమిరా ?దేవి వూళ్ళోలేదా? అని అడిగాడు.  బిడియపడుతూ తన సమస్యను చెప్పుకున్నాడు శ్రీహర్ష.
నీకు నిజంగా అలవాటు మానేయాలని వుందా ?అని అడిగాడు మోహన్.
వుందిరా కాని మానటం నావల్ల కావటం లేదు.విచారంగా చెప్పాడు శ్రీహర్ష.
ఐతే మా కజిన్ రాం అని సైకాలజిస్ట్ వున్నాడు. అతనిని కలుద్దాము. ఏదో ఒక ఉపాయము చెపుతాడు.అన్నాడు.
మరునాడు ఇద్దరూ రాం దగ్గరకు వెళ్ళారు.
అసలు మీకీ అలవాటు ఎలా వచ్చింది అని అడిగాడు రాం.
సారి ఏదో సినిమా కోసం వెతుకుతుంటే అనుకోకుండా కనిపించింది.క్యూరియాసిటీ తో చూసాను.అప్పటి నుంచి ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా ఉత్సుకతను ఆపుకోలేక అదే సైట్ కు వెళుతున్నాను.
మీకు బలంగా మానేయాలని వుంటే నాలుగైదు సిట్టింగ్స్ లలో కౌన్సిలింగ్ చేస్తే తగ్గిపోతుంది.అని చెప్పాడు రాం.
అలాగే తప్పక వస్తాను.అన్నాడు శ్రీహర్ష.
శ్రీహర్ష క్రమం తప్పకుండా రాం దగ్గరకు సిట్టింగ్స్ కు వెళ్ళాడు.రాం కౌన్సిలింగ్ తో నెమ్మది నెమ్మదిగా నీలిచిత్రాలు చూడాలనే కోరిక తగ్గసాగింది. చిన్నగా పూర్తిగా మానేసాడు.  చాందినీ ని చూడాలనే ఆరాటం! కాని  శ్రీదేవిని కలవాలంటే ఏదో సంకోచం! ఎటూ తోచక దిగులు పడుతున్నాడు.శ్రీహర్ష ను గమనిస్తున్న మోహన్ ఓరోజు శ్రీదేవి కి కాల్ చేసి, శ్రీహర్ష కౌన్సిలింగ్ తీసుకున్నాడు. , నీలి చిత్రాలను చూసే అలవాటును మానేసాడు. ఎంతైనా కూతురంటే ప్రేమ కదా పాపం కూతురికోసం కష్టపడ్డాడు.  ఇప్పుడు అతనిని జాగ్రత్తగా చూసుకోవాలి. అని చెప్పాడు.
భర్త మారినందుకు శ్రీదేవి చాలా సంతోషించింది.
అదేరోజు శ్రీహర్ష ఇంటికి రావటానికి ముందే చాందినీ ని తీసుకొని ఇంటికి వచ్చేసింది.
శ్రీహర్ష ఆఫీస్ నుంచి రాగానే డాడీఅంటూ అల్లుకుపోయింది చాందిని. లవ్ యు డాడీ. మిస్ యు డాడి.అంది.
ఈవెన్ టూ మిస్ యు. చాందినీ ని దగ్గరకు తీసుకుంటూ గద్గద కంఠము తో అన్నాడు శ్రీహర్ష.
ఇద్దరినీ చిరునవ్వుతో చూస్తూ వుండిపోయింది శ్రీదేవి!

విశ్లేషణ- మంథా భానుమతి
కన్నపిల్లలమీద ఎంత ప్రేమ ఉన్నా తమ అలవాట్లను, వ్యసనాలను వదిలించుకోలేరు కొందరు తల్లిదండ్రులు. తల్లులకేం వ్యసనం అనుకుంటాం.. కానీ పిల్లలు పిలుస్తున్నా వినిపించుకోకుండా పుస్తకాలు పట్టుక్కూర్చోడం, ఇంటిపనులని గాలికొదిలి టివీ చూస్తూ కూర్చోడం వంటివన్నీ మానసిక బలహీనతలే.
ఇంక తండ్రుల విషయానికొస్తే, అలవాట్లేంఖర్మ.. వ్యసనాలే కోకొల్లలు. ఒకటో తేదీనాడే జీతం అంతా పేకాటకి అర్పణం చేసి ఇల్లు చేరే వాళ్ళు నాకు నలుగురైదుగురు తెలుసు. ఇంక మందుబాబులు, బియ్యం నిండుకున్నా సిగరెట్ పెట్టెకి తగలేసే వాళ్ళు.. లాటరీ టికెట్ల మోజుతో కోటీశ్వరులవాలనుకే వాళ్ళు, నష్టాలొచ్చినా షేర్లమార్కెట్లో లక్షలు పోగొట్టుకొనేవాళ్ళు ఎంతమందో! పెళ్ళాం, పిల్లలు అలో లక్షణా అని గోలెడుతున్నా వాళ్లకేం పట్టదు.
ఒక కొత్తరకం వ్యసనానికి అలవాటుపడ్డ తండ్రి శ్రీహర్ష. పుట్టిన క్షణంనుంచే కూతుర్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళాలని కలలు కంటాడు. అపురూపంగా పెంచాలనుకుని ఒక్క కూతురే చాలనుకుంటాడు. మొదట్లో ఎంతో సంతోషంగా, కూతురే లోకంగా గడుపుతూ, పాప ఉన్నతికే అహర్నిశలూ శ్రమించే తండ్రిని మహమ్మారి లాంటి వ్యసనం తగుల్కుంది. రూపాయి ఖర్చు లేకపోయినా అది కూతురి భవిష్యత్తుకి ముప్పు కలిగించేది. అనుకోకుండా భార్య కంట పడిన శ్రీహర్ష తత్తరపాటుతో అరిచి ఆవిడ నోరు మూయిస్తాడు.
కూతుర్ని తీసుకుని ఇల్లు విడిచిపోయిన తల్లి, సమస్యని పరిష్కరించిన విధానం మనసుకి హత్తుకుంటుంది. అయితే దానికి తండ్రికూడా మనఃస్ఫూర్తిగా సహకరిస్తాడు. మళ్లీ ఇంట ఆనందాలు వెల్లి విరుస్తాయి. భయంకరమైన ఊబిలోకి పడాల్సిన తమ చిన్నారి పాపని రక్షించుకుంటారు.
శ్రీమతి కమలా పర్చా గారి కలం నుండి వెలువడిన, తండ్రీ కూతుళ్ళ బంధంలో ఒక కొత్త కోణం చూపించే కథ చాందినీ. కమలా పర్చాగారు నాలుగైదు సంవత్సరాలనుండి బ్లాగును నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మంచి మంచి కథా వస్తువులని తీసుకుని, కథలు రాస్తున్నారు. సులభమైన శైలిలో, పాఠకుల హృదయాలను స్పృశించే నేర్పు ఉన్న రచయిత్రి. వీరి కలం నుండి మరిన్ని కథలు రావాలని ఆశిద్దాం.(6-8-2014 - మాలిక వెబ్ మాగ్జిన్)