Wednesday, December 27, 2017

నా చిన్నారి సాహితి నవవసంతాలు పూర్తిచేసుకుంది :)

రాధామాధావాల పావడాను  కట్టి
జాజిపూలను జడలో తురిమి
గులాబీల అందాన్ని పొదుపుకొని
పారిజాతాల పరిమళాన్ని అద్దుకొని
ముద్దమందారాన్ని ముద్దుగా అరచేత ఉంచుకొని
మంచు బిందువులో తడిసిన నందివర్ధనం లా
ఓ వెన్నెల కిరణంలా, ఓ పిల్ల తెమ్మెరలా

నా చిన్ని ప్రపంచంలోకి వచ్చి, నాలోని ఊహలకు రూపాన్ని ఇస్తూ , నన్ను తొమ్మిది సంవత్సరాలుగా సాహితీవనంలో విహరింపజేస్తున్న నా చిన్నారి "సాహితి" కి జన్మదిన శుభాకాంక్షలు.

Saturday, December 23, 2017

కొత్త కాపురం లో సునామీ సృష్ఠించబోయిన "జీవన తరంగాలు "

లక్ష్మీవసంత గారు , పద్మాదాశరధిగారు యద్దనపూడి సులోచనారాణి గారి నవల "జీవనతరంగాలు " మీద సమీక్ష రాసారనీ, అది తనకు చాలా నచ్చిందనీ, ఆ సమీక్ష ఇస్తూ రాసిన పోస్ట్ నాలోని కొన్ని జీవంతరంగాలు నవల కు సంబంధించిన జ్ఞాపకాలను తట్టిలేపింది.
అవి మా పెళ్ళైన తొలిరోజులు. ముందుగా పటియాలా వెళ్ళి, అక్కడ ఒక నెల మాత్రమే ఉండి , పూనా మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్ లో మా ఏమండీ కి కోర్స్ రావటం వల్ల, ఒక పెద్ద నల్ల పెట్టెలో వంట సామునులు, ఒక నల్ల పెట్టెలో ఏమండీ యూనిఫాం లు షూస్ , కిట్స్ , ఒక సూట్కేస్ లో ఆయన బట్టలు, ఒక సూట్కేస్ లో నా బట్టలు తో  పూనా వెళ్ళి కొత్తకాపురం మొదలు పెట్టాము.ఆయనకు పూనాలో వకటిన్నర సంవత్సరము, సికింద్రాబాద్ లో ఒకటిన్నర సంవత్సరము ట్రైనింగ్ అన్నమాట. పూనా వెళ్ళగానే ఆయన యంసియం లో చేరటమే కాకుండా నన్ను వాడియాకాలేజ్ లో బియే మొదటి సంవత్సరం లో చేర్చారు. ఇద్దరమూ పొద్దున్నే ఏడుగంటలకే ఇల్లు వదిలేవాళ్ళము.పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే కూర, పప్పు కూడా వండేసుకొని , అన్నం మాత్రం వచ్చాక వండేదానిని.ఏమండీగారి ప్రిన్సిపుల్స్ వల్ల అమ్మ దగ్గర నుంచి కాని , అత్తగారి దగ్గర నుంచి కాని ఏమీ సామానులు  తెచ్చుకోలేదు.హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు భాటియా షాప్ లో అత్యవసరమైన గిన్నెలు మాత్రము కొనుకొచ్చుకున్నాము.ఒక్కో నెల ఒక్కోటి కొందామని ఏమండీ ప్లాన్ అన్నమాట. అప్పుడప్పుడే గాస్ స్టవ్ లు వస్తున్న కొత్త రోజులు .కొంచం కాస్ట్లీ కదా అందుకని ఇంకో నెలకు అని పోస్ట్పోన్ అవుతోందన్నమాట.కిరోసిన్ స్టవ్ మీదే వంట . అన్నట్లు అప్పుడు మా పెళ్ళిలో మా ఏమండీ ఫ్రెండ్ కాప్టెన్ నగేష్ ప్రెషర్ కుక్కర్ బహుమతిగా ఇచ్చినా అందులో ఎట్లా వండాలో తెలీక చాలా ఏళ్ళు వండలేదు :)  ఇదీ నేపధ్యం :)
ఒక రోజు కాలేజ్ నుంచి వచ్చేసేటప్పుడు మా ఫ్రెండ్ నందిని ఎందుకో రైల్వే స్టేషన్ కి వెళుదాము రమ్మంది.సరే నని తనతో పాటు వెళ్ళాను.అక్కడ బుక్ స్టాల్ లో ఆంధ్రజ్యోతి వారపత్రిక కనిపించింది. అప్పటి వరకు చందమామ,బాల మిత్ర, టాంసాయర్, బారిష్టర్ పార్వతీశం లాంటి బాల సాహిత్యం చదివానే కాని పెద్దవాళ్ళ పుస్తకాలు చదవలేదు.అమ్మ ప్రభ తెప్పించేది చదువుదామని ఉన్న అమ్మ కోపం చేస్తుందని చదివేదానిని కాను.ఇక్కడ అమ్మలేదుగా కోపం చేసేందుకు ఐనా పెళ్ళైంది, కొంచం పెద్దదానయ్యాను కదా అని ధైర్యం చేసి కొనేసాను. ఇంటికి వెళ్ళాక,అన్నం వండి ఏమండీకి పెట్టి మధ్యాహ్నం క్లాస్ లకు పంపించేసి,పుస్తకం  తెరవగానే "జీవనతరంగాలు"సీరియల్ కనిపించింది.అప్పటికే అది మొదలై కొన్ని వారాలైంది.ఐనా జరిగిన కథ చదివి , సీరియల్ చదివాను.సీరియల్ తగ నచ్చేసింది. కాని ఒక్క పేజీ నే ఉంది.రెండోపేజ్ లో సగం ఇచ్చి, మిగితా సగం లో అడ్వటైజ్మెంట్ ఇచ్చాడు.ఎంత నిరాశగా అనిపించిందో!ఇక అప్పటి నుంచి ప్రతివారం (ఏ వారం వచ్చేదో గుర్తులేదు మరి ) దానికోసం ఎదురు చూడటం , బస్ లో నుంచి కిరికీ బుక్ షాప్ లో కనిపించగానే బస్ దిగేసి , పత్రిక కొనుక్కోని ఇంకో బస్ ఎక్కి వెళ్ళటం అలవాటయ్యింది. పత్రిక రాగానే కొనకపోతే మరునాడు దొరికేది కాదు. ఒక సారికిరికీ లో అప్పుడే ఐపోయాయి అన్నా డు.మరి మరునాడుస్టేషన్ లో కూడా దొరకకపోతే ప్రాణం నెక్స్ట్ వీక్ దాకా ఆగదుకదా అందుకని మళ్ళీ స్టేషన్ దాకా వెళ్ళి బుక్ కొనుక్కొని ఇంటి కి వచ్చేసరికి ఏమండీ అటూఇటూ అచార్లూ పచ్చార్లూ చేస్తున్నారు. మరి అన్నం తిని మళ్ళీ క్లాస్ కు వెళ్ళాలికదా! ఎందు కంత లేట్ అయ్యింది అన్నారు.చిన్నగా నసుగుతూ, భయపడుతూ చెప్పాను.అప్పుడేమీ అనలేదు.అన్నం గబగబా వండేసాను. తిని వెళ్ళిపోయారు.అలా రెండు సార్లు జరిగింది.ఇక మూడోసారి కోపం ఆపుకోలేక నా చేతిలోని పత్రిక లాక్కొని , కిటికీ లొనుంచి బయటకు విసిరేసారు :( అప్పటికి ధుమధుమాలాడుతూ వెళ్ళిపోయినా, నా ఏడుపు ముఖం చూసి జాలేసిందేమో, సాయంకాలమే వెళ్ళి గాస్ స్టవ్ కొనుకొచ్చారు :) ( అహా మొహం ఎంత వెలిగిపోతోందోకదా!) ఇంకెప్పుడూ ఇంత ఆలశ్యంగా రాకు అని వార్నింగ్ కూడా ఇచ్చారనుకోండి. ఇక అప్పటి నుంచి ఆహా నా జీవన తరంగమా అనుకుంటూ  కాలేజ్ లో చివరి క్లాస్ ఎగొట్టి , స్టేషన్ కే డైరెక్ట గా వెళ్ళి పత్రిక తెచ్చుకునేదానిని.
సంవత్సరమన్నర తరువాత సికింద్రాబాద్ వచ్చాము.స్టూడెంట్ ఆఫీసర్, పైగా సింకిద్రాబాద్ పెద్ద స్టేషన్ కాబట్టి ,చాలా మంది ఆఫీసర్ లు ఇంటికోసం వేటింగ్ లో ఉండేవారు.కాకపోతే మారేడ్పల్లిలో  ప్రైవేట్ ఇల్లు అద్దెకు తీసుకొని ఉండేవారు.అప్పటికే నేను ప్రెగ్నెంట్ ని. ఎనిమిదో నెల.అందుకని మేము విడిగా వెళ్ళ కుండా హైద్రాబాద్ లో మా అత్తగారింట్లోనే వున్నాము.ఏమండీనే పొద్దున్నే ఐదుగంటలకు సికింద్రాబాద్ వెళ్ళి, పి.టి, క్లాస్ లు, మధ్యాహ్నం గేం క్లాస్ లు, తరువాత కంబైండ్ స్టడీస్ అన్నీ ముగించుకొని రాత్రి పదింటికి వచ్చేవారు.ఒక్కోసారి ఎక్జాంస్ ఉంటే మెస్ లోనే ఉండిపోయేవారు. ఇక ఇంట్లో ఏమో తరంగాల కోసం కోసం నా మది తల్లడిల్లిపోతుండేది :) నేను బయటకు వెళ్ళేదానిని కాదు మరి ఓపలేనిదానిని కదా! ఏమండీ కంటికే కనిపించరు.మామగారిని పత్రిక కొని తేమని అడగలేనుగా :( అంతే అప్పుడప్పుడు తరంగం లా గుర్తుతెచ్చుకోవటే కాని మరిచిపోయేందుకు ప్రయత్నం చేసాను :( 
అలా అలా కాలం వెళ్ళబుచ్చుతూ ఉండగా మా అమ్మాయి డిసెంబర్ లో పుట్టింది.అప్పట్లో తెలంగాణా ఎజిటేషన్ మూలంగా కాలేజీలు బంద్ అయ్యి, జూన్లో మొదలు కావలసిన కొత్త సెషన్స్ జనవరిలో మొదలయ్యాయి.ఒక ఎకడమిక్ ఇయర్ వేస్ట్ అయ్యిందన్నమాట. నాకేమో కలిసి వచ్చింది.ఫిబ్రవరీ లో ఇంటిపక్కనే ఉన్న రెడ్డీ వుమెన్స్ కాలేజ్ లో బియే సెకండ్ ఇయర్ లో చేరాను. ఒక రోజు మా ఫ్రెండ్ స్వర్ణ హడావిడిగా వెళుతుంటే ఎక్కడికి అని అడిగాను.ఆర్కే లైబ్రరీ కి. ఇప్పుడే వెళ్ళక పోతే ఆంధ్రజ్యోతి దొరకదు.అంది.ఆంధ్రజ్యోతి పేరు వినగానే టక్కున తలెత్తి ఎక్కడా ఆ లైబ్రరీ అన్నాను.ఇక్కడే నువ్వు పుస్తకాలు చదవవా ? అంది .ఎందుకు చదవను నాకూ ఆంధ్రజ్యోతి కావాలి అని తన వెంట వెళ్ళాను.తను రెంట్కు తీసుకుంది.నేను కొనుకున్నాను.గబగబా పేజ్ తిప్పి చూసాను.జీవనతరంగాలు సీరియల్ ఉంది. ఐపోలేదు.ప్రాణం లేచి వచ్చింది.అప్పుడే స్వర్ణ ఈ రచయిత్రిదే సెక్రెట్రీ అని నవల ఉంది.చాలా బాగుంది చదువు అని రెంట్ కు ఇప్పించింది.అలా ఆలైబ్రెరి లో చేరిపోయాను.పత్రిక రెంట్ పది పైసలు రోజుకు.నవల పావలా. జీవన తరంగాలు చాలా నిరాశపరిచేది.ఒక్కటిన్నర పేజ్ మాత్రమే ఇచ్చేవాడు.ఒక్క నిమిషం లో చదవటం ఐపోయేది.ఉక్రోషం, కోపం, ఏడుపు వచ్చేవి :) అలా చాలా ఏళ్ళు వచ్చినట్లుంది ఆ సీరియల్.
ఆ విధము గా జీవనతరంగాలు మా కొత్తకాపురం లో సునామీలా వచ్చి చిన్నపాటి తుఫానుగా మారింది.నన్ను యద్దనపూడి అభిమానిగా చేసింది. లైబ్రరీ కి అంకితం చేసి పుస్తకాల పిచ్చి తగిలించింది :)  ఓ విధంగా రచయిత్రిని అయ్యేందుకు దారి వేసింది :) అన్నట్లు మా ఇంట్లో గాస్ పొయ్యి కూడా వెలిగించింది :)


Sunday, December 17, 2017

ప్రపంచ తెలుగు మహా సభలో నేను మా ఏమండి :)


ప్రపంచ తెలుగు మహా సభలో నేను మా ఏమండి :)
"ఎప్పుడెళుతున్నావు సభలకు ?" అని అడిగారు ఏమండి.
"హుం నేనేమి వెళుతాను ? ఓ నాలుగు రోజులాగి వెళ్ళవచ్చుగా పి.యస్.యం గారు.ఉమ్హు సరిగ్గా సభల ముందే యు.యస్ వెళ్ళారు. జి.యస్.లక్ష్మిగారు బిజీట.మీరు రానన్నారు.కనీసం రిజిస్టర్ చేయించుకోమన్నా చేయించుకోలేదు.నేనొక్క దాన్ని ఏ వెళుతాను?" నిట్టుర్చాను.
కాసేపు ఇద్దరమూ పేపర్ చూడటం లో మునిగిపోయాము.సడన్ గా "నేను ఈ నాలుగు సెలెక్ట్  చేసాను ."అన్నారు ఏమండి.
"ఏమిటి?ఎందుకు?"
"నువ్వు తెగ ఫీలైపోతున్నావుగా అందుకు సభలకు వెళుదామని ఈ ప్రోగ్రాంలు సెలెక్ట్ చేసాను.పద వెళుదాము ."
"అబ్బా కవి సమ్మేళనాలా ? హాస్యావధానానికి వెళుదాము.ఐనా మీకోసం ఫాం తీసుకొని, ఆధార్ కార్డ్, ఫొటో తీసుకొని వచ్చినా రిజిస్టర్ చేయించుకోలేదు.మరి మిమ్మలిని రానిస్తారో లేదో"నా సందేహం.
"పరవాలేదు లే నా ఐడి కార్డ్ తెస్తాను.రానీయకపోతే తిరిగి వచ్చేద్దాం"భరోసా.
అంతే చెంగున లేచి అలమారా తీసి ఏమి చీర కట్టుకోనబ్బా అనుకుంటూ ఇక్కత్ సారీ కట్టుకుందాము తెలంగాణా అభిమానం ఇలా చాటుకుందాం డన్ :)
హాస్యావధానం చూద్దామనుకుంటూ రవీంధ్రభారతి చేరాము.కార్ బయటనే ఆపేసారు. లోపల జనం హడావిడిగా తిరుగుతున్నారు. ఒక చోట క్యూ కనిపించింది.మరి ఏమండీగారి కి రిజిస్ట్రేషన్ చేయించాలి కదా అని అక్కడికి వెళ్ళి ఈ క్యూ ఎందుకు అని అడిగాను.ఇది ఎంప్ల్యాస్ క్యూ అని సమాధానం వచ్చింది.మరి రిజిస్ట్రేషన్ ఎక్కడ అంటే రిజిస్ట్రేషన్ లు ఐపోయాయి.అన్నారు.ఇంకో కౌంటర్ దగ్గర అడుగుతే రిజిస్ట్రేషన్ లేకపోయినా వెళ్ళవచ్చు అన్నారు.మరి ఎక్కడా హాస్యావధానం అని వెతుకుతుంటే
"మీరు మాలాకుమార్ గారు కదూ" అని వినిపించింది.ఈ మహాసభలల్లో నన్ను గుర్తుపట్టి పలకరించేవారెవరు చెప్మా అని తెగ హాశ్చర్యపోతూ వెనక్కి తిరిగాను. ఓ అబ్బాయి చక్కగా చిరునవ్వులు నవ్వుతూ కనిపించాడు.ఎవరో గుర్తుపట్టలేకపోయాను.జానీ భాషా నమ్మా అన్నాడు.హోరినీ నువ్వా ?ఫొటోలల్లో గడ్డంతో గంభీరంగా ఉంటావు ఇంత చిన్న అబ్బాయివా అని ఇంకా బోలెడు హాశ్చర్యబోయాను!మా ఏమండీ కి పరిచయం చేసాను.ఈ అబ్బాయిని ఇంతకు ముందు చూసావా అని అడిగారు.జాని లేదండి ఫొటో చూసాను కదా అందుకే గుర్తుపట్టాను అని చెప్పి నవ్వి తన పుస్తకాలు ఇచ్చాడు.ఇంతలో ఇంకో ఆవిడ వచ్చి జానీ ని పలకరించారు.ఆవిడ ఇందిర అని ఒక రచయిత్రి అని పరిచయం చేసాడు జానీ. కుంచె అని ఇంకో కార్టూనిస్ట్ ను అతను మా ఫొటో తీసాక పరిచయం చేసారు.మీ కార్టూస్ చూస్తానండి అన్నాను కుంచె తో. అనుకోకుండా వీళ్ళను కలవటము ఆనందం అనిపించింది.
ఆ తరువాత మేము ప్రోగ్రాం చూద్దామని వెళుతుంటే మెట్ల దగ్గర అంతా హడావిడిగా ఉంది.విడియోలు, ఇంటర్వ్యూ లు ఎవరెవరో ఎవరెవరినో తీసుకుంటున్నారు.ఆ హడావిడి చూస్తూ లోపలికి వెళ్ళాము.అత్తలూరివిజయలక్ష్మి గారు హాస్యవధానానికి వెళుతున్నాను ఎవరైనా వస్తే రండి అని చెప్పింది గుర్తొచ్చి ఆవిడకు ఫోన్ చేసాను.హాస్యావధానం దగ్గర చాలా రష్ ఉందండి లోపలికి వెళ్ళలేకపోయాను మేన్ హాల్ లో ఉన్నాను ,మీరు ఇటొచ్చేయండి సీట్లు ఉన్నాయి మీకు పెడుతాను అన్నారు.నేనూ మా ఏమండీ వచ్చాము అన్నాను,మీకూ మీ ఏమండీకి కూడా సీట్లు పెడుతాను రండి అన్నారు.సరే అని, ఐనా ఆశ కొద్దీ హాస్యావధానం వైపు వెళ్ళాము.అస్సలు లోపలికి వెళ్ళే సందేలేదు.కిక్కిరిసిపోయి ఉన్నారు.వేడి గాలులు బయటకు వస్తున్నాయి. నాకు గాభరావేసి మెట్ల దగ్గరే నుంచుండిపోయాను.ఏమండీ మాత్రం తలుపు దగ్గర నిలబడి కాసేపు విని నవ్వుకుంటూ వచ్చారు. బాగుంది మనం ఇంకొంచం ముందు వస్తే లోపలికి వెళ్ళేవాళ్ళం అన్నారు. ఒకవేళ ముందుగా వచ్చి లోపలికి వెళ్ళినా ఆ రష్ కు బయటకు రాలేక లోపల ఉండలేక ఉక్కిరిబిక్కిరి ఐపోయేదానిని అమ్మో అనుకుంటూ ఎందుకూ నవ్వుతున్నారు ఏమిటీ జోక్ అన్నాను.
"ఒకావిడ పాయసం చేస్తూ వాళ్ళాయనను కిస్ మిస్ లు తెమ్మన్నదిట.ఆయన రోడ్ మీద ఒక మిస్ ను చూసి బస్ మిస్సయ్యాడుట." దాని మీద నడుస్తొంది అన్నారు :)
మేన్ హాల్ కు వెళుదామని వెళుతే ఎంత ప్రయత్నించినా లోపలికి వెళ్ళలేకపోయాము అంత రష్.విజయలక్ష్మిగారికి ఫోన్ చేసి సారీ అండి లోపలికి రాలేకపోతున్నాము , మేము వెళుతున్నాము అని చెప్పి బయటకు వచ్చి ఊపిరిపీల్చుకున్నాము. బయట మెట్ల మీద ఓ అబ్బాయిని అడిగి ఫొటోలు తీయించుకొని లంచ్ కౌంటర్ వైపు వెళ్ళాము.అక్కడ మెళ్ళో రిజిస్ట్రేషన్ కార్డ్ ఉన్నవళ్ళనే రానిస్తున్నారు.మరి ఏమండీకి బిళ్ళ లేదుగా అందుకని దగ్గరలో ఉన్న పురానాధిల్లీ కి వెళ్ళి భోజనం చేసాము.
మిగితా వేదికలు కూడా అలాలా తిరిగొద్దాము అనుకొని ముందుగా యల్.బి స్టేడియం కు వెళ్ళాము.అక్కడ ఒక పోలీసు మా ఏమండీ కి బిళ్ళ లేదని ఆపేసాడు.ఆయన ఐ.డి కార్డ్ బయటకు తీయబోయారు ఇంతలో ఇంకో పోలీస్ వెళ్ళండి సార్ అన్నాడు.వాళ్ళు భార్యాభర్తల్లా ఉనారు ఆవిడనొక్కదాన్నే పంపటం ఎందుకని ఇద్దరినీ వెళ్ళమన్నాను అతను మొదటి పోలీస్ తో చెప్పటం వినిపించి ఔరా ముక్కూమొహం తెలీని వాళ్ళు కూడా నా బిక్క మొహం చూసి, నేను ఒక్కదాన్ని వెళ్ళలేనని కనుక్కుంటున్నారే! అనుకోవటం తప్ప నేనేమి చేయ్గలను!
గేట్ పక్కనే ఉన్న మ్యూజియం చూసుకొని వేదిక దగ్గరకు వెళ్ళాము.ఏమి ప్రోగ్రాంలు లేవు కదా ఎందుకు అన్నారు.ఐనా చూద్దాం అని తీసుకెళ్ళాను.సీటింగ్ అరేంజ్మెంట్ వేదిక అన్నీ చూసాను.అక్కడక్కడా కొంత మంది ఉన్నారు.వాళ్ళు ఏవో పనులు చేసుకుంటున్నారు.అక్కడే ఉన్న ఇద్దరబ్బాయిలను చూసి మాకు ఫొటో తీస్తారా అని అడిగాను.ఒకతను వచ్చి మమ్మలిని అటూ ఇటూ నిలబెట్టి ఫొటోలు తీసాడు.ప్రొఫెషన్ల్ లా తీసావు అని ఏమండీ జోక్ చేస్తే నవ్వుతూ నా సెల్ ఇచ్చాడు.అప్పుడు అతని బాడ్జ్ చూస్తే పోలీస్ అని ఉంది.నాలుక్కరుచుకొని హోరినీ పోలీస్ నే ఫొటో తీయమని అడిగానా అని సారీ అన్నాను.పరవాలేదు మేడం అన్నాడు అతను.మీరు యూనీఫాం లో లేరు సెక్యూరిటీ నా ? అంటూ ఏమండీ వాళ్ళతో కాసేపు ముచ్చట్లేసుకున్నారు.స్వజాతి అభిమానం :)
అక్కడి నుంచి స్టేడియం అంతా చుట్టేస్తూ వెనకవైపుకు వెళ్ళాము.అక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి.చాలావరకు మూసి ఉన్నాయి.కొన్ని స్వగృహ స్టాల్స్ అని తెరిచిఉంచారు.అక్కడ అన్నీ తెలంగాణా పలగారాలు (స్నాక్స్) అమ్ముతున్నారు .ఇంకొంచం లోపలికి వెళితే మన  కనిపించాయి. అన్నీ కిటకిటలాడిపోతున్నాయి.ఒక్కొక్కళ్ళు మోయలేనన్ని పుస్తకాలు కొని తీసుకెళుతున్నారు.చివరగా ఉన్న ఒక స్టాల్ లో ఒక పెద్దాయన ఒక్కరే ఉన్నారు.ఆయనతో ఏమండీ కాసేపు కబుర్లేసుకున్నారు.ఆయన విష్ణుసహస్రనామం పుస్తకం బొమ్మలతో , అర్ధం తో వేయించారు.అవి బయట ఎక్కడా చూడలేదు అని నేను అంటే ఆయన పుస్తకం అమ్ముకోవటంలోని ఇబ్బందులు, పబిషర్స్ డబ్బులు సరిగ్గా ఇవ్వకపోవటం చెప్పుకున్నారు.ఏమండీ అంతా ఓపికగా విని  500 లకు కొనుకున్నారు. ఆయన నన్ను మీరు పుస్తకాలేమీ వేయించలేదామ్మా అని అడిగారు.ఇదో మీరు చెపుతున్న సాధకబాధకాలు పడలేకే ప్రింట్ చేయించకుండా ఈ బుక్స్ తో సరిపెట్టుకున్నానండి అన్నాను నవ్వుతూ.నేనేమో సాఫ్ట్వేర్ అబ్బాయిలు కృష్ణచైతన్యవారి పుస్తకాలు  అమ్ముతుంటే పునర్జన్మం గురించిన పుస్తకం కొనుకున్నాను.
చిన్నగా బయటకు వచ్చేసరికి ఇద్దరికీ ఓపిక ఐపోయి ఇంక వేరే ఏ వేదికల దగ్గరకూ వెళ్ళ కుండా ఇంటికి వచ్చేసాము.అదీ సంగతి :)

ప్రపంచమహాసభల ఏర్పాట్లు అన్నీ చాలా ఘనంగా చేసారు.ప్రతినిధులుగా రిజిస్టర్ చేయించుకున్నవారికి ,బయటవారికి వసతి , రవాణా, భోజన ఏర్పాట్లు , వేదికల వద్ద సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేసారు.రిజిస్టర్ చేయించుకోని వారికి ప్రవేశము వుంది కాని , భోజనము , సిట్టింగ్ అరేంజ్మెంట్స్ లేవు.దూరంగా గాలరీలో కూర్చోవాలి.బాంబే నుంచి వచ్చిన మా ఫ్రెండ్ రమేష్ గారు మంచి హోటల్ లో ఇచ్చారండి.హోటల్ లోనే బస్ కూడా ఉంచారు వేదికల దగ్గరకు తీసుకెళ్ళేందుకు అన్నారు. పోలీస్ వారు కూడా చాలా మర్యాదగా ప్రవర్తిస్తున్నారు.మరి విమర్శలు వస్తున్నాయి అంటే, మన ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకుంటేనే పొరపాట్లు జరుగుతాయి మరి ఇంత పెద్ద ఫంక్షన్ లో జరగకుండా ఎలా ఉంటాయి.పొరపాట్లూ సహజమే!విమర్శలూ సహజమే! అవన్నీ పట్టించుకోకుండా మన ఊళ్ళో జరుగుతున్న ఇంత పెద్ద సాహితీ సదస్సును చూసి ఆనందిద్దాము అనుకుని వెళ్ళి వచ్చాము.

Saturday, October 21, 2017

భగినీ హస్త భోజన్

ఈ రోజు అంగా కార్తీక శుద్ద విదియ . ఉత్తరాదిన ముఖ్యంగా  "భగినీ హస్త భొజన్" అని జరుపుకుంటారు. మన వైపు కూడా కొంత మంది చేస్తారు కాని అంతగా ప్రాచుర్యం లో లేదు. భగినీ అంటే సోదరి. సోదరుడు , సోదరి చేతి భోజనం చేయటమన్నమాట. వివాహమైన అమ్మాయి ఇంట్లో మనవాళ్ళు భోజనం చేసేవారు కాదు. పంజాబ్ అటువైపైతే తప్పని సరిగా చేయాల్సి వస్తే విస్తరి కింద కొంత డబ్బు ఉంచుతారని మా పంజాబీ స్నేహితులు చెప్పారు. అమ్మాయి ఇంట్లో భోజనం చేయటము తప్పని కాదు కాని ఆడపిల్ల రుణం ఉంచుకోకూడదు అని. శుభకార్యాలల్లో తినొచ్చుట.ఐతే కార్తీక శుద్ద విదియనాడు మటుకు సోదరుని, సోదరి పిలిచి భోజనము పెట్టి కానుకలిచ్చి పంపాలట.
దీనికీ ఒక కథ ఉంది.
సూర్యభగవానునకు  సంధ్యాదేవి వలన కలిగిన సంతానంలో యముడు, యమున ఒకరు. ‘యమునకు’ అన్నయ్య ‘యముడు’ అంటే ఎంతో ఇష్టం. యమునకు కూడా అంతే. యముడు తన చెల్లెలును ప్రేమగా ‘యమీ’ అని  పిలిచేవాడు. యమునకు వివాహం జరిగింది. అత్తవారింటికి కాపురానికి వెళ్లింది. ఒకరోజు యమునకు తన అన్నను చూడాలని కోరిక కలిగింది. తన ఇంటికి విందుకు రమ్మని యమధర్మరాజుకు వర్తమానం పంపింది. విందుకు వస్తానని యమధర్మరాజు యమునుకు మాట ఇచ్చాడు. అ రోజు తన అన్నయ్య కు  ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అన్నయ్య రాకకోసం ఎదురుచూస్తూ కూర్చుంది యమున. ఎంతసేపయినా అన్నయ్య రాలేదు. ఈ రోజు  పని వత్తిడి వల్ల రాలేకపోతున్నానని, మన్నించమని, ‘కార్తీక శుధ్ద విదియ’ నాడు తప్పకుండా విందుకు వప్తానని చెల్లెలికి వర్తమానం పంపాడు యమధర్మరాజు. యమున సంతోషించి ఆ రోజున కూడా తన అన్నయ్యకు ఇష్టమైన పదార్థాలన్నీ తయారుచేసింది.
అన్నమాట ప్రకారం యమధర్మరాజు చెల్లెలు ఇంటికి విందుకు వచ్చాడు. యమున తన అన్నయ్య నుదుట పవిత్ర తిలకం దిద్ది, పూలమాల వేసి తను చేసిన పదార్థాలన్నీ అన్నకు కొసరి కొసరి వడ్డించి ప్రేమగా తినిపించింది. చెల్లెలు అనురాగానికి ముగ్ధుడైన యమధర్మరాజు ఏ వరం కావాలో కోరుకో’ అని అడిగాడు. ‘ ప్రతి యేడు ఇదే కార్తీక శుద్ధ విదియనాడు తన ఇంటికి విందుకు రావాలనీ., అలాగే ప్రతి పోదరుడు ఈ రోజున తన సోదరి చేతి భోజనం భుజించాలనీ’ వరం కోరుకుంది యమున. యమధర్మరాజు ఆ వరాన్ని యమునకు అనుగ్రహించాడు. అందుకే ఈ రోజున ప్రతి సోదరుడు వివాహం అయిన తన సోదరి చేతి భోజనం చేయాలని శాస్త్రం నియమం విధించింది. ఆ నియమం ఇప్పటికీ చాలా చోట్ల కొనసాగుతోంది.
ఇదంతా పుక్కిటి పురాణం అని అనుకున్నా, రాఖీ రోజు సోదరుని ఇంటి కి వెళ్ళి రాఖీ కట్టి బహుమతి తెచ్చుకోవటము, సోదరుడు భగినీ హస్త భోజనము రోజు సోదరి ఇంటికి వెళ్ళి భోజనము చేసి బహుమతి తెచ్చుకోవటమూ, చిన్ననాటి ఆప్యాయతలు , అనుబంధాలు దూరం కాకుడదు అని ఈ సంప్రదాయామును పెట్టి ఉంటారు అనిపిస్తుంది. తరిచి చూడాలే కాని మన సంప్రదాయాలన్నిటిలోనూ ఏదో ఒక అర్ధము ఉంటుంది.అవి ఆషామాషీగా ఏర్పర్చినవికావు.
మా స్నేహితులు చేస్తుంటే చూసి నేనూ మా అమ్మాయితో చేయించేదానిని. మా పిల్లలిద్దరూ ఇక్కడ ఉన్నప్పుడు మా అమ్మాయి తమ్ముడిని భోజనానికి తప్పక పిలిచేది. ఈ రోజు ఎక్కడో చదివారట , మా పెద్ద ఆడపడుచు గారు తమ్ముళ్ళిద్దరినీ భోజనానికి పిలిచారు.వాళ్ళిద్దరి తోపాటు మా తోటికోడళ్ళిద్దరినీ పిలిచారు :)Tuesday, October 17, 2017

బుచ్చిబాబులాంటి మొగుడొద్దన్నాను కానీ . . .తటవర్తి జ్ఞానప్రసూనగారు త్రైమాస లిఖిత పత్రిక "మందానికి" లో నా కథ, "బుచ్చిబాబులాంటి మొగుడొద్దన్నాను కానీ. . . "

బుచ్చిబాబు లాంటి మొగుడొద్దనుకున్నాను కానీ . . . . .

(బుచ్చిబాబు ముప్పాళరంగనాయకమ్మగారి నవల "స్వీట్ హోం" హీరో.విమల మొగుడు.ఎంత మంచివాడంటే పెళ్ళాం ను కోపం చేయాలన్నా మొహమాటపడిపోయేంత. విమల చక్కగా ఉన్న షర్ట్ ను ఫేషన్ పేరిట అడ్డదిడ్డంగా కట్ చేసి కుట్టినా అలాగే ఆఫీస్ కు వేసుకెళ్ళేంత.,అప్పట్లో అమ్మాయిలు మరీ ఇంత మంచివాడిని ,బుద్దావతారం , ముద్దపప్పు ను భరించలేము బాబూ, బుచ్చిబాబు లాంటి మొగుడసలొద్దు అని జోక్ లు వేసుకునేవారు.)

"అత్తయ్యా ఇంక సద్దుకోవటము కాలేదా ?" అని అడుగుతూ లోపలికొచ్చాడు మా మేనల్లుడు.
"అంతా అయ్యిందిరా .ఇదిగో ఈ మందులే హాండ్ బాగ్ లో సద్దుతున్నాను." అన్నాను.
"ఏమిటీ అన్ని మందులు హాండ్ బాగ్ లో సద్దుకుంటున్నావా? ఎందుకు?" ఆశ్చర్యం గా అడిగాడు.
"అవునురా మరి, ఈ మధ్య ఏ పేపర్ లో చదివినా, ఏ టి.వి న్యూస్ చానల్ లో చూసినా టెరరిస్ట్ లు విమానాలను హైజాక్ చేయటమే వార్తలుగా ఉంటున్నాయి. అసలే మీ మామయ్య బైపాస్ ఐనప్పటి నుంచి మందుల మీదే ఉన్నారా ? మా విమానం ఏ టెరరిస్టో హైజాక్ చేసాడనుకో, సంప్రదింపులూ అవీ ముగిసి మమ్మలిని వదిలేసరికి ఎంత లేదన్నా కనీసం పదిరోజులైనా పడుతుంది.అందుకని ముందు జాగ్రత్తగా , ఇద్దరి మందులూ ఓ పదిహేను రోజులకు సరిపడా హాండ్ బాగ్ లో పెట్టుకుంటున్నాను." అన్నాను సీరియస్ గా మందులు లెక్కచూసుకుంటూ.
"నీ పిచ్చిగాని అత్తయ్యా , మిమ్మలిని ఏ టెరరిస్టైనా హైజాక్ చేసి బతికిబట్టకడతాడా ? మామయ్య స్పీచ్ లకు బెదిరిపోయి దండం పెట్టి పారిపోతాడు." అని నవ్వాడు.
"అంతేరా నీకు మమ్మలిని చూస్తే జోక్ గా నే ఉంటుంది. టెరరిస్ట్ నే కానక్కరలేదు, ఏర్ పోర్ట్ లో మీ మామయ్య చేసే సాహసాలకు ఒకవేళ అక్కడే కొన్ని రోజులు ఉండిపోయే అవసరమూ రావచ్చు.ఏం చెప్పగలము." అని రుసరుసలాడాను.
ఫైనల్ గా సద్దుకోవటము లో సహాయము చేసి , ఏర్ పోర్ట్ దాకా మాతో వచ్చి హాపీ జర్నీ అని మామయ్యకు, మామయ్య వినకుండా భయపడకు అంతా బాగానే జరుగుతుంది అని నాకు ధైర్యం చెప్పి వెళ్ళాడు.
స్వామీ ఆంజనేయా మమ్మలిని క్షేమంగా చేర్చు తండ్రీ అని , మా చెల్లెలు నా సెల్ వాల్ పేపర్ లో సెట్ చేసి ఇచ్చిన ఆంజనేయస్వామి ని కళ్ళకద్దుకొని, ఏర్ పోర్ట్ లోకి అడుగు పెట్టాను.బోర్డింగ్ పాస్ తీసుకొని . సెక్యూరిటి చెక్ ముగించుకొని విమానంలో కి వెళ్ళాము. అమ్మయ్య ఇక హాంగ్ కాంగ్ దాకా నిశ్చింత ! 
హాంగ్ కాంగ్ లో దిగి కాస్త ఫ్రెష్ అప్ అయ్యి,నెక్స్ట్ ఫ్లైట్ కు ఎక్కువ సమయము లేదు. అందుకని ఆ గేట్ దగ్గరే కూర్చుందామని , ఆ గేట్ దగ్గరకు వెళ్ళాము.అక్కడ ఉన్న ఖాళి కుర్చిలో కూర్చొబోతు ఎదురుగా చూసాను.అక్కడ ఇద్దరు భార్యాభర్తలున్నారు.వాళ్ళ చేతుల్లో కవలపిల్లలనుకుంటాను ఉన్నారు. బహుషా ఆ పిల్లలకు మూడునెలలు ఉండవచ్చు. వాళ్ళు ఇండియన్స్ లా ఉన్నారు.పక్కన చాలా సామానులు ఉన్నాయి,ఇద్దరూ వాళ్ళను సముదాయించలేక సతమతము అవుతున్నారు. పిల్లలను స్ట్రోలర్ లో పడుకోపెడితే ఊరుకోవటము లేదు. చాలా చికాకు చేసుకుంటున్నారు. పాపం ఇంత చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్నారే అని జాలి పడుతున్నాను. హుం ఇంకో క్షణం లో నా మీదే నేను జాలి పడాల్సి వస్తుందని ఊహించలేకపోయాను. ప్రమాదము రానే వచ్చింది. ఓక్కళ్ళని ఆంటీ కి ఇవ్వండి చూసుకుంటారు అని వాళ్ళ తో అన్నారు మా ఏమండీ గారు.పాపం అప్పటికి వాళ్ళు సంశయిస్తుంటే బలవతం గా నాకప్పగించారు. నేను తేరుకొని చూసే లోపల , పాపం వాళ్ళ కు సహాయం చేయి నేనిప్పుడే కాఫీ తాగి, నీకు తీసుకొస్తాను అని వెళ్ళిపోయారు. నేను నా చేతిలోని పసివాడిని గుడ్ళప్పగించి చూస్తూండిపోయాను! ఒకళ్ళు పాలు కలుపుతుంటే , ఇకోళ్ళు వాళ్ళకు పడుతూ , మధ్యలో రెస్ట్ రూం కు వెళ్ళి వస్తూ, పిల్లలను నాకు మార్చి మార్చి ఇస్తూ , అంతా నా ప్రమేయము లేకుండానే జరిగిపోతోంది. పోనీలే నేనూ కాస్త వాళ్ళకు సహాయము చేస్తున్నాను అనుకొని మాడిన మొహం మీద నవ్వును అతికించుకున్నాను.
ఎంత సమయము గడిచిందో తెలియలేదు. ఇంతలో విమానం లోకి ప్రయాణికులను ఎక్కమని ఎనౌన్స్ చేస్తున్నారు. అందరూ వళ్ళు విరుచుకొని వాళ్ళ వాళ్ళ సామానులు తీసుకొని కదిలారు. అప్పుడు ఈయనేరీ అని చుట్టూ చూసాను. ఎక్కడా కనిపించలేదు. గుండె గుభిల్లుమంది. ఎక్కడున్నారు , ఏమి చేస్తున్నారు కాఫీ తాగి నాకు తెస్తానని వెళ్ళిన మనిషి ఏమైపోయారు? రకరకాల ప్రశ్నలు . భయం. వళ్ళంతా వణికిపోతోంది. పసిపిల్లలవాళ్ళను ముందుగా రమ్మని అనౌన్స్ చేసారు.నా చేతి లో నుంచి పిల్లవాడిని తీసుకొని వాళ్ళు లేచారు. ప్లీజ్ కాసేపు ఉండరా మీ అంకుల్ రాలేదు , భయంగా ఉంది అని దిగులుగా భయం గా అన్నాను ఆ అబ్బాయితో.ఒక్క క్షణం కూర్చొని లేచారు వాళ్ళు రమ్మని అనౌన్స్ చేస్తున్నారాంటీ అని పిల్లవాడిని నా చేతులో నుంచి తీసుకొని వెళ్ళిపోయారు. దీనం గా చూస్తూ ఉండిపోయాను . . . . .
క్షణాలు భారం గా గడుస్తున్నాయి. . . . .
క్యూ లో ఒక్కరొక్కరే కదిలి వెళ్ళిపోతున్నారు. . .
కళ్ళ నిండా నీళ్ళు . . . ఏమి చేయాలో తోచటం లేదు . . . హనుమాన్ చాలీసా చదువుకుందామనుకున్నా గుర్తు రావటం లేదు . . .
అందరూ లోపలికి వెళ్ళిపోయారు. . .
సెక్యూరిటీ గార్డ్ వచ్చి మీరెందులో వెళ్ళాలి అని అడిగాడు. లాంజ్ లో ఒక్కదాన్నే ఉండటము వల్ల అనుకుంటాను వచ్చి అడిగాడు. ఇందులోనే అని వణికిపోతూ , భయపడుతూ చెప్పాను. మరి వెళ్ళండి అన్నాడు. మా హస్బెండ్ కోసం వేట్ చేస్తున్నాను అని చిన్నగా చెప్పాను.అతను విచిత్రంగా చూసి వెళ్ళిపోయాడు!
గేట్ దగ్గర వాళ్ళు లెక్క చూసుకున్నారు కాబోలు మమ్మలిని రమ్మని మా పేర్లు ఎనౌన్స్ చేసారు . చుట్టూ చూసాను ఎక్కడా ఏమండి కనిపించలేదు. దిక్కు తోచక ఏమి చేయాలో తెలీక తల వంచుకొని కూర్చున్నాను.
దిస్ ఈజ్ లాస్ట్ ఎనౌన్స్మెంట్ ఫర్ అని మా పేర్లు మళ్ళీ వినిపించాయి. అలాగే తల వంచుకొని , చేతులు నలుపుకుంటూ కూర్చున్నాను. ఇంతలో నా భుజం మీద చేయి పడింది. ఏమండీనే . . .
పద అని నా చేయి పట్టుకొని లేపారు. మౌనంగా ఆయన వెనక నడిచాను . . .
సీట్ లో కూర్చొని బెల్ట్ పెట్టుకుంటూ "నువ్వు ఎక్కకపొయావా నేను వచ్చే వాడిని కదా " అన్నారు.
" ఏమిటీ మీరు రాకుండా నేను విమానం ఎక్కి, మీరేమయ్యారో తెలీక , మీదారిన మిమ్మలిని వదిలేసి వెళ్ళిపోవాలా ?" అని ఉక్రోశం గా అంటూ ఆయనవైపు చూసాను. కొద్దిగా ఆయాసపడుతున్నారు.
"ఏమిటి ఏమైంది ? ఎందుకలా ఆయాసపడుతున్నారు ?" నా కోపం మర్చిపోయి గాభరాగా అడిగాను.
ఆయన మాట్లాడలేదు . చిన్నగా ఆయాసపడుతూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు.
"ఏమైందండి? అసలు ఇప్పటిదాకా ఎక్కడికెళ్ళారు? ఈ ఆయాసమేమిటి?" ఆదుర్దాగా అన్నాను.
" ఏమీ లేదులే కంగారు పడకు. నేను కాఫీ తాగి నీకు తీసుకొని వస్తుండగా ఒక అమ్మాయి ఎదురుగా వచ్చింది. ఆ అమ్మాయి స్ట్రోలర్ లో చిన్నపాపను తోసుకుంటూ, భుజానికి బాగుల తో , ఇంకో చేతితో ఓ మూడేళ్ళ బాబు ను పట్టుకొని వస్తొంది.ఇంతలో ఆమె చేతి లో ఉన్న బాబు , చేయి విడిపించుకొని పరిగెత్తాడు.ఆ అమ్మాయి ప్లీజ్ కాచ్ హిం అంది నాతో కంగారుగా . కాఫీ కప్పు అక్కడే వదిలేసి వాడి వెనుక పరిగెత్తాను.వాడు దొరకలేదు.చాలా దూరం పరిగెత్తించాడు.చివరకు ఎలాగో వాడిని పట్టుకొని, ఆ అమ్మాయిని కలుసుకొని, తన గేట్ దగ్గర వదిలేసి, ఇక్కడ లేట్ అవుతోందని,నువ్వు భయపడతావని తొందరతొందరగా వచ్చాను.కనీసం ఆ అబ్బాయైనా నీకు తోడుగా ఉంటాడనుకున్నాను, నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా ? అవునులే వాళ్ళకూ ఆలశ్యం అవుతుందికదా " అంటూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు.
"ఆ బాబు వెనుక పరిగెత్తారా ? అక్కడ ఇంకెవరూ లేరా? సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా చెప్పవచ్చుకదా ? " అయోమయంగా అడిగాను.
"అవన్ని నాకప్పుడు తోచలేదు.ఆ అమ్మాయి గాభరా పడుతోంది, వాడు పరిగెడుతున్నాడు.సహాయము చేద్దామనుకున్నాను అంతే " అన్నారు తిరుగులేనట్లు.
ఏర్ హోస్టెస్ ను పిలిచి జ్యూస్ తెమ్మని చెప్పాను.
ఆయన గుండె మీద చిన్నగా రాస్తూ "బుచ్చిబాబు లాంటి మొగుడొద్దన్నాని ఇంత సూపర్ ఫాస్ట్ మొగుణ్ణిచ్చావా" అని ఆంజనేయస్వామి తో నిష్టూరం గా అన్నాను.


Tuesday, September 26, 2017

మీతో నేనుఈ నెల విహంగ అంతర్జాల మాసపత్రిక లొ నా రచనలను నెను చేసుకున్న పరిచయము :)

http://vihanga.com/?p=19997


                          మీతో నేను
ఈ నెల ప్రయాణం హడావిడి  వచ్చాక జెట్ లాగ్ తో సమీక్ష రాయలేకపోయాను ,అని పి.   యస్.   యం లక్ష్మిగారి తో అంటే ఇప్పటి వరకు చాలా మందివి రాసారు కదా ఈ సారి వెరైటీ గా మీ పుస్తకాలనే పరిచయం చేయండి అన్నారు.    ఏమో నా పుస్తకాల మీద నేను సమీక్ష రాసుకుంటే బాగుంటుందా అంటే ఎందుకు బాగుండదు అన్నారు .  ఇప్పటి వరకు ఎవరైనా వాళ్ళ పుస్తకాలకు వాళ్ళే సమీక్ష రాసుకున్నారో లేదో కాని  నా పుస్తకాలకి నేనే సమీక్ష రాసుకోవటం ఎలా ఉంటుందో చూద్దాం 😊  నాకు చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదివే అలవాటు ఉన్నా  వ్రాసే అలవాటు లేదు . 2008 లో బ్లాగ్ మొదలు పెట్టాక వ్రాస్తున్నాను.    నేను వ్రాసిన వన్నీ  మూడు భాగాలు చేసి ఈబుక్స్ గా చేసింది మా కోడలు అను.    
1.     సాహితి

“ఎదో ఒక రాగం పిలిచిందీ మదిలో
నాలో విహరించే గతమంతా కదిలేలా
జ్ఞాపకాలే మైమరపు “
నా సాహితీ లో ఏముందీ అంటే పొత్తూరి విజయలక్ష్మి గారన్నట్లు  నా ఇల్లు  నా తోట మా ఏమండి , మా మనవలు మనవరాళ్ళ ముచ్చట్లు , నా చిన్నప్పటి ముచ్చట్లు ఇలా అంతా నాగోలే 😊 ఓ సగటు ఇల్లాలి మదిలోని మధురానుభూతులు .    నా చిన్ని ప్రపంచం నా కుటుంబం లో ని సరదా సంఘటనలు  గతం లో కి తిరిగి చూసుకుంటే  మనసు ఆహ్లాద పరిచేవి  , ఆనందించేవి రాసుకున్నాను 😊 ఈ సాహితి నా సొంతం . నా ఊహల ప్రతిరూపం . నా చిన్ని పొదరిల్లు . అలా నా “సాహితి “ బ్లాగ్ లో వ్రాసుకున్న సరదా పోస్ట్ లే ఈ సాహితి .
  
                      2.   అనగనగా ఒక కథ

ఏదైనా పుస్తకం చదవగానే దాని గురించి వ్రాసుకోవటం  అలవాటు.    అలా రాయటాన్ని సమీక్ష అంటారని చిన్నప్పుడు తెలీదు కుడా 😊 అలా నాకు నచ్చిన పుస్తకాల గురించి నా బ్లాగ్ , మాలిక ,  చిత్రమాలిక, విహంగ అంతర్జాల పత్రిక లలో వ్రాసిన సమీక్ష లే ఈ “అనగనగా  ఒక కథ “ . ఇందులో  విహంగ మాసపత్రికలో వ్రాసినవే ఎక్కువగా ఉన్నాయి.    2012 నుంచి  విహంగలో ప్రతినెల ఒక పుస్తకమును పరిచయము చేస్తున్నాను. ముందు ఈ తరం వారికి పాత పుస్తకాలను పరిచయము చేద్దామని మొదలు పెట్టాను.    తరువాత ఫేస్ బుక్ లో చాలా మంది రచయిత్రులు పరిచయము కావటము , వారి పుస్తకావిష్కరణకు వెళ్లి నప్పుడు ఆ పుస్తకము తెచ్చుకోవటముతో అవి పరిచయము చేస్తున్నాను . ఆ తరువాత ఆ రచయితలను కూడా పరిచయము చేస్తున్నాను . కొన్ని నవలలు , చిత్రాలు గా వచ్చినవి కూడా పరిచయము చేసాను . అనూహ్యముగా ఈ పుస్తకము చాలా ఆదరణ పొందింది .    చాలా మంది మాకు తెలీని పుస్తకాలను  రచయతలను పరిచయము చేసారు అంటూ మెయిల్ ఇస్తున్నారు ]
.    
                       ౩.నీ జతగా నేనుండాలి

నా బ్లాగ్ లో వ్రాసుకున్న పోస్ట్ లు చూసి నా స్నేహితులు ఇంత బాగా రాస్తున్నావు కదా కథలు కూడా వ్రాయి అని ప్రోత్సహించటము  తో రెండు సంవత్సరాల క్రితము కథలు వ్రాయటము మొదలు పెట్టాను . ఇందులో మొత్తం పందొమ్మిది కథలున్నాయి.    దాదాపు అన్ని కథలూ నేనూ చూసిన, నాకు తెలిసిన , పేపర్ లో చదివిన  సంఘటనల ఆధారముగా వ్రాసినవే.    
  మొదటి కథ “నీ జతగా నేనుండాలి “ , చిన్నప్పుడే పిల్లలకు మేనత్త మేనమామల పిల్లలతో జత కలపటము , ఆ పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఏదైనా కారణము వలన  ఆ పెళ్లి జరగకపోతే దాని మీద ఆశ పెట్టుకున్న అమ్మాయి పరిస్తితి గురించి ఏమిటి అన్న విషయము గురించి మా స్నేహితులతో వచ్చిన చర్చ నుంచి ఈ కథ వ్రాసాను . ఇది నా మొదటి కథ.  దీనికి రచన మాసపత్రిక లో “కథాపీఠం పురష్కారం “ వచ్చింది.    
“మట్టి లో మాణిక్యం” కథలో తల్లీ తండ్రి లేని , అనాకారియిన ఒక అమ్మాయి శాంభవి   మేనమామ ఇంట్లో ఇబ్బందులు పడుతూ  మేనత్త నిరాదరణకు కు గురి అవుతుంది.    అప్పుడు సంఘసేవిక విమల సహాయము తో , తన గాన మాధుర్యము తో రాణిస్తుంది.  ఇది కూడా నేనూ చూసినదే .    
“ధీర” , “విధి విన్యాసాలు “  బంగ్లాదేశ్ వార్ అప్పుడు నేను  చుసిన సంఘటనల నుంచి రాసినవి .    ఎవరో ధీర ఆరాధన హిందీ సినిమా లా ఉంది అన్నారు . మిలిటరీ కుటుంబాలల్లో సామాన్యము గా జరిగేదే ఇది . ఇప్పుడు సాఫ్ట్ వేర్  ఉద్యోగాలతో చాలా మంది అటువైపు వెళుతున్నారు కాని , ఎక్కువగా ఆర్మీ ఆఫీసర్ పిల్లలు 11 క్లాస్ ఐపోగానే యన్. డి. యే లో చేరేవారు . తండ్రి యుద్దములో మరణించాడు అని భయపడేవారు కాదు. ఆర్మీ లైఫ్ వేరుగానే ఉండేది . ఇలాంటివి ఎక్కువగా పంజాబ్ లో జరుగుతూనే ఉంటాయి .   
“చాందిని “ , ఒక పత్రిక లో ఒకావిడ సైక్రియాటిస్ట్ ను , మా వారు ఇలా నీలి చిత్రాలు చూస్తున్నారు , లాప్ టాప్ మీద డిస్ప్లే లో ఉంటె మా పిల్లలు చూస్తుండగా చూసి కోపం చేసాను  ఆయనను చూడ వద్దంటే వినటం లేదు ఏమి చేయాలి అని అడిగింది చదివాను .    మాలిక అంతర్జాల మాస పత్రిక లో “తండ్రి తనయ “ ల మధ్య ఉండే బంధం గురించి కథ రాయమంటే ఇది గుర్తొచ్చి రాసాను .    
సామాన్యము గా కొంత మంది ఆడవాళ్ళ కు , పిల్లలు పెద్దవాళ్ళై వెళ్ళిపోయాక,   బాధ్యతలన్నీ తీరాక ఒక లాంటి డిప్రెషన్ వస్తుంది . ఇది మిడిల్ ఏజ్ క్రైసిస్ కావచ్చు లేదా మెనోపాజ్ ప్రాబ్లం కావచ్చు . అప్పుడు కుటుంబ సబ్యులు వారికి ఎలా చేయూత నివ్వాలి అన్నదాని మీద రాసిన కథలు “ గుండెకి గుబులేందుకు “,  “ఆత్మీయ బంధం “.   
మాకు తెలిసిన అబ్బాయి పెళ్లి కి ఖర్చులు ఆడంబరాలు  వద్దు అని పట్టు బట్టి రిజిస్టర్ మారేజ్ చేసుకున్నాడు .    మాలిక పత్రిక లో వివాహబంధం  గురించి రాయమంటే ఈ సంఘటనను ఆధారము చేసుకొని వ్రాసియన కథ “ మనసు తెలిసిన చండురుడా “
“చూపులు కలవని శుభవేళ “ మా ఇంట్లో జరిగిన ఒక పెళ్లి లో అందరికి కళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చింది . దాని మీద రాసిన సరదా కథ ఇది .   
మిగిలినవన్నీ కొన్ని మాకు జరిగినవి , కొన్ని ఉహించి రాసిన సరదా కథలు .   
ఇవన్ని వివిధ పత్రికలలో ప్రచురించబడ్డవి .   
ఇవండీ నా మూడు పుస్తకాలు . ఇవన్నీ కింద ఇచ్చిన లింక్ లల్లో డౌన్ లోడ్ చేసుకొని చదవచ్చు.    వెల అంటారా  మీ వెలలేని అభిప్రాయాలే వెల.    చదివి మీ అభిప్రాయం చెపుతారు అని ఆశిస్తున్నాను .

   Tuesday, August 22, 2017

ఈ నేలా . . . ఈ గాలీకళ్ళు తెరవగానే కిటికీ లో నుంచి కనిపిస్తున్న వెలుతురు. . .
గోడ మీద గడియారంలో టైం . . . 
గాలిలో తేలి వస్తున్న ,పారిజాతం , మాలతీ సౌరభాలు. . . 
చెట్టు మీది పక్షుల కూతలు . . . 
రోడ్ మీద ఆకుకూరల వాళ్ళ అరుపులు . . . 
పక్కింటి నుంచి నల్లాలో పడుతున్న నీళ్ళ చప్పుడు . . .
ఎక్కడి నుంచో , కాదు మా ఫోనే రింగవుతోంది 
కింద నుంచి అమ్మ " కమలా లేచావా ? కాఫీ పంపనా ?"
"వద్దమ్మా నేను కలుపుకుంటాను "
కాఫీ గ్లాస్ తో బాల్కనీలోకి రాగానే ఎదురు కరెంట్ తీగ మీద పరిగెడుతున్న ఉడతమ్మ పరుగాపి , నా వైపు చూసి " హాయ్ వచ్చావా ? " పలకరింపు . . .
"హాయ్ చిన్నారీ ఎలా వున్నావు ? ఐ మిస్ యు ". . .
"ఐ టూ " అంటూ పరుగో పరుగు . . .
బుజ్జిపాపాయి బోర్లా పడుకున్నట్లు మెట్ల మీద ముద్దుముద్దుగా బోర్లా పరుచుకున్న పారిజాతాలు . . .
మణి పైకి వస్తూ "అమ్మా కాఫీ డికాక్షన్ వేసాను . ఫ్రిడ్జ్ లో పాలున్నాయి. చూసుకున్నారా ? కూరలు తెచ్చాను కాని , పండ్లు తెచ్చుకోవాలి. గాస్, కాఫీ పౌడర్ బుక్ చేయాలి. బియ్యం , సరుకులు తెచ్చుకోవాలి."
ఊం , గీజర్ ఆన్ చేసుకోవాలి నల్లా తిప్పగానే వేడి వేడి నీళ్ళు రావు మినియాపోలీస్ లో లేను , హైద్రాబాద్ లో ఉన్నాను 

Tuesday, August 15, 2017

పొదరిల్లు

" అత్తగారిని హీరోయిన్ గా పెట్టి రాసేసిన భానుమతిగారు . వూళ్ళో వాళ్ళ మీద రాస్తే దెబ్బలాటకి రారూ ! మాఇంట్లో వాళ్ళమీద రాస్తే ఏగోలా ఉండదు అన్న బీనాదేవిగారు , తన బాల్యం .తనఫాక్టరీ నేపధ్యంగా ,తీసుకుని కధలు అల్లిన సోమరాజు సుశీలగారూ ,
తన పల్లెటూరూ తన అనుభవాలని కధల రూపంలో చెప్పే పొత్తూరి విజయలక్ష్మీ (అంటే నేనే )
వీళ్ళందరూ ఆకోవకే చెందుతారు . 
వీళ్లకధల్లో ఏముంది అని అంటే ఏమీ ఉండదు . కానీ పాఠకులకు వీళ్లంటే వల్లమాలిన అభిమానం . వీళ్ళ పుస్తకాలు బాగానే అమ్ముడవుతాయి . 
ఆ రచయిత్రుల్లాటి ఓ ఇల్లాలే ఈ మాలాకుమార్ . ఈవిడ అనుభవాలను అలవోకగా చెప్పటం తో.
అవన్నీ హాయిగా చదివిస్తాయి .
మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి సాహితి అనే బ్లాగ్ లో రాసుకున్న వన్నీ ఒక మాలగా కట్టి ఈ బుక్ గా మనకు అందిస్తున్నారు .
ఈ సువిశాలమైన సాహితీ ప్రపంచంలో ఇది నాతొలి ప్రస్థానం అంటూ భారీగా చెప్పలేదు .
నా చిన్నిప్రపంచం . పొదరిల్లు అన్నారు ఆమె తరహాలో .
నిజమే .పొదరింట్లో కి అడుగు పెడితే కలిగే అనుభవం వేరుకదా. " అని నా అభిమాన రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు ,
" ఎంతో తెలివైనపని చేసేననుకుని గొప్పలు పోయే అమాయకపు ముదిత ముచ్చటైన కబుర్లు వినాలన్నా, ముఖ్యంగా మురిసిపోతూ చెప్పే “ఏవండీ” గారి కబుర్లు ముగ్ధులై వినాలన్నా ఈ సాహితి పుస్తకం వెంటనే చదివెయ్యడం ఒక్కటే మార్గం." అని జి.యస్.లక్ష్మి గారు ( రచయిత్రి బ్లాగర్ ) ,
"షడ్రసోపేతమైన విందు ఆరగించబోతున్నారు కదా, దాని రుచి నేను చెప్పటమెందుకు. మీరే ఆస్వాదించండి.అని పి.యస్.యం లక్ష్మి గారు (రచయిత్రి,బ్లాగర్),

తన పిల్లల్లూ, తన పిల్లల పిల్లలూ వారి ముచ్చట్లూ గురించి రాస్తున్నప్పుడు సంపూర్ణమైన కుటుంబజీవితంలోని ఆనందాన్ని మాధుర్యాన్ని ఆస్వాదించిన గృహిణిగా తల్లిగా కనిపిస్తారు. అలాగే కంప్యూటర్ నేర్చుకోవడంలో ఆవిడ పట్టుదల, పూల పెంపకంలోనూ ఇతర కార్యక్రమాలలోనూ ఆవిడ సౌందర్యారాధనా - వెరసి పాఠకులకి ఒక చక్కని ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. " అని సీనియర్ బ్లాగర్ కొత్తపాళీ గారు అభినందించిన, (అడిగి పోగిడించు కున్నాను అని ఏమండి అంటున్నారు కాని ఆయన మాట వినకండి ) 

ఈ సాహితి నా స్వంతం . . నా ఊహల ప్రతి రూపం.. నా  చిన్ని ప్రపంచమైన నా కుటుంబములోని సరదా సంఘటనలను  పోడుపుకున్న చిన్ని పొదరిల్లు.ఈ  నా "సాహితీ" బ్లాగ్ పోస్ట్ ల తో చేసిన ఈ బుక్ "సాహితీ " నిన్న మా ఏమండి గారు ఆవిష్కరించారు. 
నా సాహితిని , నీ జతగా నేనుండాలి కథా సంపుటిని , అనగనగా ఒక కథ పుస్తక సమీక్శలను ఇంత చక్కగా , ఓపిక గా ఈబుక్స్ చేసి ఇచ్చింది మా కోడలు అను. తన ప్రోత్శాముతోనే తొమ్మిదేళ్లుగా నేనూ చేసుతున్న రచనలన్నీ ఈబుక్స్ గా మారాయి. థాంక్ యు అను. 
ఈ మూడు పుస్తకాలూ , ఇక్కడ సైడ్ బార్ లో ను , 

http://kinige.com/kbook.php?id=8242

https://telugu.pratilipi.com/read?id=4546056755347456


ఇక్కడా ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకొని చదవచ్చు.  
నా పొదరింటి కి ఇదే స్వాగతం .

Friday, July 14, 2017

కూ . ..చుక్ . . . చుక్. . . చుక్
పుస్తకాలు సద్దుకుంటూ , భాను వైపు చూసాను.అప్పటి కి తనూ లేచింది. పుస్తకాల బాగ్ భుజానికి తగిలించుకొని కూ  అని కూత  పెడుతూ పరుగు తీసాము. అవును మరి అప్పటికే కొంచం ఆలశ్యం అయ్యింది. సోషల్ సారు బెల్ల్ మోగినవెంటనే  వదల్లే . అడ్డం వచ్చిన రాళ్ళను తన్నుకుంటూ పరుగులు పెట్టాము. అప్పటి కే గూడ్స్ వచ్చేస్తోంది. దాని వెంట ఒక్కో పెట్టే తో పాటు పరిగెడుతూ చివరి పెట్టే దగ్గర కోచ్చాము. అందులో నుంచి గార్డ్ మామయ్య దిగుతున్నాడు. మమ్మలిని చూసి నవ్వుతూ ఈ రోజు ఆలశ్యం అయ్యిందెందుకు అమ్మాయిలూ అని పలకరించాడు. మామయ్యా ఆ జెండా ఇవ్వవా అని ఆశ గా చూస్తూ అడిగాను. తప్పమ్మా మీకు ఇవ్వకూడదు అని పక్కకు వెళ్ళాడు. అక్కడి నుంచి వెనక్కి కూ అని కూతేసుకుంటూ పరిగేట్టాము. డ్రైవర్ మామయ్యదగ్గరకు వెళ్ళాము. డ్రైవర్  మామయ్యా ఇద్దరికీ చెరొక గాజు గొట్టం ఇస్తూ ఇక  వెళ్ళండమ్మా అన్నాడు. అప్పుడేనా అనుకుంటూ ఆ చివరనుంచి ఈ చివర దాకా పెట్టలు లెక్కపెడుతూ పరుగెత్తి , పట్టాలు దాటి అవతలి ప్లాట్ ఫాం కు వెళ్ళాము. అక్కడ ఫ్లాట్ ఫాం చివర ఉన్న పసుపచ్చని బోర్డ్ మీద నల్లటి అక్షరాల తో రాసి ఉన్న “ మహుబూబాబాద్ “ అక్షరాలను  ఆరాధనగా చూసి, అవి అందుకుందామని ఎగిరాము .కాని ఊమ్హూ  అందలే. కాసేపు బెంచ్ మీద కూర్చున్నాము. అక్కడున్న గానుగ చెట్టు చుట్టు పరిగెత్తాము .ఇంకా అలిసిపోయి ఇంటికి బయలు దేరాము. ఇంతలో ఎక్కడి నుంచో “ ... . . పోవు పాసెంజర్ కొద్దిసేపట్లో . . . “ అని వినిపించింది.  నా కాళ్ళు అప్రయత్నం గా ఆగిపోయాయి. చెవులు నిక్కబొడుచుకొని పూర్తి గా  విన్నాను. అబ్బ ఆ అమ్మాయి ఎంత బాగా చెపుతుందో. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. కాని నాకు అలా వినటం భలే ఇష్టం!  అది పూర్తయ్యే దాకా అక్కడి నుంచి కదిలేదానిని కాదు. నేనూ ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు మానుకోట లో ఇంటి కి వెళ్ళటానికి రైల్వే స్టేషన్ దాటి  వెళ్ళాల్సి వచ్చేది. అదో అప్పుడు అక్కడ నేనూ, నాఫ్రెండ్ భాను ఇలా అలిసిపోయే దాకా ఆడుకునేవాళ్ళం!  ఆ వెళుతున్న పాసెంజర్ ఎప్పుడు ఎక్కుతామా అనుకునే వాళ్ళం. అలా అనుకుంటూ అనుకుంటూ  మా నాన్నగారికి మానుకోట నుంచి వరంగల్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు వరంగల్ వెళ్ళటానికి ఎక్కాము. ఆ డబ్బా లో అమ్మ, నాన్నగారు, నేనూ . అంతే ఇంకెవరూ లేరు. అందులో అద్దం  కూడా ఉంది.ఆ అద్దం  లో ఎన్ని సార్లు చుసుకున్నానో! అలా ఆ మానుకోట రైల్వే స్టేషన్ నా మనసులో ఉండిపోయింది.చిన్నపుడే రైలంటే ఏర్పడిన ఇష్టం మనసులో ఉండిపోయింది.చాలా ఏళ్ళవరకు ఎనౌన్సర్ గా జాబ్ చేయాలని కోరికగా ఉండేది.ఇప్పటికీ రైల్వే స్టేషన్ లొ ఎనౌన్స్మెంట్ వినగానే నా కాళ్ళు ఒక్క క్షణం ఆగిపోతాయి. చెవులు దోర విచ్చుకుంటాయి.
ఆ తరువాత చాలా ఏళ్లకు , పెళ్ళయ్యాక పాటియాలా వెళ్లేందుకు సదరన్ ఎక్స్ ప్రెస్ ఎక్కాను. మూడు రోజుల ప్రయాణం. అందులోనే స్నానం, భోజనం అన్నీ అంటే ఎంత వింతగా అనిపించిందో. ఫస్ట్ క్లాస్ కూపే,కిటికీ దగ్గర కూర్చొని వెనక్కి పరిగెడుతున్న స్తంబాలు,ఇల్లు, పొలాలు అన్నీ తెగ నచ్చేసాయి. మూడు రోజులు రైల్ లో ఉన్నా బోర్ కొట్టలేదు. ఆ తరువాత దేశం నలుమూలలా, కలకత్తా, డిల్లీ , మద్రాస్, పూనా , బొంబాయ్ మొత్తం తిరిగాము.  అప్పట్లో మొదటగా వచ్చిందిట భోగీల మధ్య కనెక్షన్ లేని రైల్ , ఆగ్రా నుంచి డిల్లీ .దాని లో సరదాగా ఈ చివర నుంచి ఆ చివరకు తిరిగాము. కొత్తగా వచ్చిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గంగాకావేరి , బాంబే లో లోకల్ ట్రేన్స్ అబ్బో తనివితీరా ఎన్నిరైళ్ళల్లోప్రయాణం చేసానో! కాకపోతే డార్జ్ లింగ్ లో టాయ్ ట్రేన్ ఎక్కటమే పడలేదు ! సిలిగురి వెళ్ళేటప్పుడు ఆ రోజులల్లో  ఏ.సి భొగీ లు లేవు. మా అబ్బాయి మూడు నెలల వాడు.అమ్మాయి మూడేళ్ళది . మంచి ఎండాకాలం . వడగాలులు. కూపే కిటికీ కి పలచటి గ్లాస్కో దోతీ కట్టి, ప్రయాణం అంతా దానిని తడుపుతూ ఉన్నాము.  ప్రతి రైల్ స్టేషన్ లో అక్కడ దొరికే స్పెషల్స్ తింటం సరదాగా ఉండేది. కలకత్తా లో చిన్న చిన్న మట్టి ముంతలల్లో చాయ్, రసగుల్లాలు, ఇటార్సీ స్టేషన్ లో స్టీల్ గ్లాస్ లో గరమాగరం చాయ్, నాగ్ పూర్  లొ ఆరెంజెస్, లోనావలాలో చిక్కీ , బటాకా వడా, రాజమండ్రి లో ఆకుపచ్చని బత్తాయిలు, వైజాగ్ లో ముసలతని బండి మీది కందిపొడి, జాల్నా లో జామకాయలు ఇలా అన్నీ బాగుండేవి. అన్నింట్లోకి బాంబే వి.టి స్తేషన్ దగ్గర పావ్ భాజి, చాట్ , పానీ పూరీ , భేల్ పూరీ నాకు భలే నచ్చేవి. అంతేనా బరోడా నుంచి బాంబే వెళ్ళేటప్పుడు ఆ కాస్త ప్రయాణానికీ గుజరాతీ లు పెద్ద పెద్ద డబ్బాల నిండా స్నాక్స్ తెచ్చుకునేవారు.మాకూ తినమని పెట్టే ఆ చుడువా , ఘమండ్ , స్వీట్స్ అన్నీ చాలా టేస్టీ గా ఉండేవి. కేరళ, ఉత్తరప్రదేశ్ తప్ప దాదాపు భారతదేశం లోని అన్ని రాష్ట్రాల నుంచీ మా కూ. . . చుక్. . . చుక్ ప్రయాణించింది. ఈ రాష్ట్రం దాటాము, ఈ రాష్ట్రం లోకి వచ్చాము , రాత్రి పడుకున్నప్పుడు ఒక రాష్ట్రం లో, తెల్లారి లేచేటప్పటికి ఇంకో రాష్ట్రం లో, ష్టేషన్ లల్లో వివిధ భాషలు మాటలు గల గలా వినిపించటం అంతా తమాషా గా ఉండేది.

అలాగే రైలు ప్రయాణం లో ఎంతో మంది ప్రయాణికులు పరిచయము అవుతారు.అందులోనూ మా ఏమండీ అందరినీ పలకరిస్తారు . కాకపోతే రైలు దిగగానే వాళ్ళను మర్చిపోతాము అది వేరే సంగతి. కాని ఒక్క జంటను మాత్రము నేను ఇప్పటికీ మర్చిపోలేను . మాకు ఆగ్రా హోటల్ లో పరిచయం అయ్యారు.వాళ్ళూ మాలాగే కొత్త గా పెళ్ళైనవాళ్ళు. నలుగురమూ కలిసి టాక్సీ మాట్లాడుకొని ఆగ్రా అంతా తిరిగాము. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే , తాజ్ మహల్ దగ్గర నేను ఫొటో గ్రాఫర్ తో ఫొటో తీయించుకుందామనుకున్నాను.నై నై భాభీ మై కీంచూంగా అని రకర్కలా ఫొజులల్లో మా ఇద్దరి ఫొటోలు తీసాడు. ఆ తరువాత డిల్లీ దాకా కబుర్లు చెప్పుకుంటూ , రైలంతా కలియ తిరుగుతూ కలిసి ప్రయాణించాము. మా ఎడ్రెస్ కూడా తీసుకున్నాడు.పాటియాలా లో ఉన్నన్ని రోజులూ ఎదురు చూసాను ఆ ఫొటోలకోసం.రాలేదు. పక్కింటి మిసెస్.జగన్నధం కు వస్తాయేమో , వస్తే పంపించమని చెప్పాను . ఇప్పటికీ ఎదురుచూస్తున్నాను ఆ ఫొటోల కోసం . ఆ తరువాత డిల్లీ ఎన్నిసార్లు వెళ్ళినా మళ్ళీ  ఆగ్రా వెళ్ళటం పడలేదు. సన్నగా పొడుగ్గా ఉన్న ఆయన మటుకు గుర్తుండిపోయాడు !
అన్నింటి లో కి మరుపురాని ప్రయాణం పాటియాల నుంచి పూనా కు వెళ్ళింది. పెళ్లి తరువాత మొదటి సారిగా వెళ్ళింది పాటియాలా అయినా అక్కడ ఒక్క నెలనే  ఉన్నాము. అప్పటి కే పూనా పోస్టింగ్ వచ్చింది. పాటియాలా చూపించాలని తీసుకెళ్ళారు. ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాము. మా కొత్తకాపురం మొదలయ్యింది పూనా లో. పాటియాలా స్టేషన్ కు యూనిట్ వాళ్ళంతా వీడ్కోలు ఇచ్చేందుకు కుటుంబాలతో వచ్చారు. అందరమూ స్టేషన్ లో నిలబడి మాట్లాడుకుంటున్నాము. ఇంతలో ఇద్దరు జవానులు ఒక పెద్ద కర్ర కు మల్లె పూల దండలు వెళ్లాడదీసుకొని  చెరో వైపు పట్టుకొని మార్చ్ ఫాస్ట్ చేస్తూ వచ్చారు. యూనిట్ కమాండింగ్ ఆఫీసర్  (c.o) ఒక దండ తీసుకొని మావారి మెళ్ళో వేసాడు. ఆతరువాత ఒక్కక్కరే వచ్చి ఆయనకు ధన్ మని సెల్యూట్ చేసి దండ వేసారు. నేను ఆశ్చర్యం గా చూస్తూ ఉండగా సి.ఓ గారి భార్య  నాకు పెద్ద బుకే ఇచ్చి , “ తుమారా జిందగీ హమేషా ఫూలే ఫలే రహే “ అంది. నాకు అప్రయత్నంగా కళ్ళల్లో  నీళ్ళొచ్చాయి. ఆ తరువాత ఆడవాళ్ళందరు నాకు బుకే లు ఇచ్చారు. జవానులొచ్చి , మా వారికి వేసిన దండలు , నాకిచ్చిన బుకేలు తీసుకుపోయారు.అయ్యొ తీసుకుపోతున్నారే అని మనసులొ బాధ పడ్డాను కాని ఏమీ అనలేదు. రైల్ కదిలాక తలుపు దగ్గర నిలబడి అందరికీ చెయి ఊపి లొపలికి వెళ్ళాము.అద్భుతం. మా దగ్గర తీసుకున్న మల్లెల దండలన్నీ , బుకేలనీ  కిటికీలకి, బర్త్ కి అలంకరించారు. యూనిట్ వాళ్ళు ప్రెజెంట్ చెసిన ఇత్తడి కాండిల్ స్టాండ్ ను తళతళా నెరిసేట్టుగా పాలిష్ చేసి , అందులొ కొవ్వొత్తులు వెలిగించారు. ఆకొవ్వొత్తుల వెలుగు, బయట నుంచి పడుతున్న దీపాల వెలుగు లొ ఆ కూపే ఎంత అందంగా ఉందో చెప్పలేను. కొత్త కాపురానికి తీసుకెళుతున్న పూలరధం లా ఉంది. ఆ ప్రయాణం మరుపురానిది.

అలాగే ఇంకోటి గుర్తొచ్చినప్పుడల్లా భయపెట్టేది. సిలిగురివెళ్ళి నప్పుడు , కలకత్తా లో రైల్ మారాల్సి వచ్చేది. కలకత్తా లో దిగాక నెక్స్ట్ ట్రేన్ కు టికెట్ కంఫర్మ్ అయ్యిందో లేదో కనుక్కొని వస్తాను అని మా వారు వెళ్ళారు. ఎంత కూపే కిటికీలకు గ్లాస్కో ధోతి కట్టి , తడుపుకుంటూ జాగ్రత్తగా తీసుకొచ్చినా మా అబ్బాయి కి వడదెబ్బ తగిలినట్టయ్యి కందిపోయాడు.చాలా చికాకు చేసుకుంటున్నాడు. వాడిని సముదాయించటం లో సతమతమవుతున్నాను. ఇంతలో మావారొచ్చి ఏమిటీ సంజు ను ఇట్లా వదిలేసావు అని కోపం గా అడిగారు.నేను వదలటమేమిటి మీతో వచ్చింది కదా అన్నాను నేను. నా దగ్గర ఉందని ఆయన అనుకున్నారు.ఆయనతో వెళ్ళిందని నేను అనుకున్నాను. ఆయన వెనుక పరిగెత్తిందిట డాడీ అంటూ . ఆయన హడావిడి గా వెళుతూ వినలేదు. నా గుండె జారిపోయింది. మరి అని ఇక అడగలేక పోయాను. నేనూ డాడీ అని పరిగెత్తుతుంటే ఒక తాతయ్య చేయి పట్టుకున్నాడు అంది.ఆ పెద్దాయన దానిని ఆపి అటూ ఇటూ మాకోసం చూస్తున్నాడుట. మావారు తిరిగి వస్తూ చూసారు. మా అదృష్టం  ఎక్కువ దూరం వెళ్ళలేదు అందుకే దొరికింది . అమ్మో లేకపోతే అంత పెద్ద హౌరా ష్టేషన్ లో తప్పిపోతే ! బాబోయ్ తలుచుకుంటేనే ఇప్పటికీ వళ్ళు జలాదరిస్తుంది.
హైద్రాబాద్ వచ్చేసాక రైల్ ఎక్కే సందర్భాలు అంతగా రాలేదు . మావారి కాంట్రాక్ట్ పనులన్నీ ఆంధ్రప్రదేశ్ లోనే కాబట్టి, ఎక్కడికెళ్ళినా కార్ లో , దూరం వెళ్ళాల్సి వస్తే విమానం లోనే వెళ్ళటం! చాలా ఏళ్ళతరువాత  మావారి ఫ్రెండ్ మనవరాలి పెళ్ళి కి బెంగుళూర్ రైల్ లో వెళుతున్నాము. నిన్న రాత్రి రైల్ ప్రయాణం, మళ్ళీ రేపు హైద్రాబాద్ లో పనుండటం వల్ల ఈ రోజే రైల్ ఎక్కాము. రెండు రాత్రులు వరుసగా ప్రయాణం చేసినా అలసటగా లేదు . బయటకు చూద్దామంటే ఏ.సి కంపార్ట్మెంట్ కావటం తో అద్దాలు బిగించి ఉన్నాయి.అంతా మసకగా తప్ప ఏమీ కనిపించటం లేదు. ఆ రోజులల్లో నా కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూసే పిచ్చిని పాపం మావారు ఎంత భరించారో ! ఎక్కడికెళ్ళినా మూడు రోజుల ప్రయాణం తప్పనిసరి.అన్ని రోజులూ నేను వదలకుండా కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తూ ఊహలల్లో ఉంటే పాపం ఆయనే పిల్లలను ఎంగేజ్ చేసేవారు. చీకటి పడింది. అందరూ కబుర్లాపి పక్కలేసారు. పెద్ద లైట్ ఆపేసి చిన్న బ్లూ లైట్ వేసారు. అంతటా నిశబ్ధం  నేనూ పడుకున్నాను కాని నిద్ర రావటం లేదు . బయటకు చూస్తే చీకట్లో అక్కడక్కడ దీపాలు మిణుక్కుమంటున్నాయి.పక్కకు తిరిగి పడుకున్నాను. రైల్ చక్రాలు లయబద్ధంగా కదులుతున్నాయి. వాటి తో పాటే సాగిపోతున్నాయి నా మది లోని మధురానుభూతులు అలా. . .అలా. . .

Monday, May 8, 2017

హాంగ్ కాంగ్ టు శాంఫ్రాన్సిస్కో!


అనుకున్నాను కాని చైనావోళ్ళూ మంచోళ్ళే పాపం :) మొన్న హాంకాంగ్ లో దిగాక , కాసేపు అటూ ఇటూ తిరిగాము. బ్రేక్ ఫాస్ట్ చేద్దామని వెళుతూ రెస్ట్ రూం లో కి వెళ్ళాను.రూం లో నుంచి వచ్చి వాష్ బేసిన్ దగ్గరకు వెళుతుంటే అక్కడ ఉన్న స్వీపర్ ముసలమ్మ ఇంకో బేసిన్ వైపు చూపించింది.అక్కడికి వెళ్ళమంటోందనుకొని అటువైపు వెళ్ళాను.అక్కడ నా హాండ్ కర్చీఫ్ పెట్టి ఉంది. కింద పడిందేమో ననుకొని , అది తీసుకొని ఆవిడకు థాంక్స్ చెప్పాను.ఆవిడ అదేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది.ఫ్రెషప్ బయటకు రాగానే ఇంకో స్వీపర్ ముసలావిడ ఎదురొచ్చి అంటూ ఏదో చెప్పబోయింది.నాకర్ధం కాలేదు.ఏమైందా అని ఒక్క నిమిషం లోనే టెన్షన్.ఆవిడ నా దగ్గరకు వచ్చింది.ఇంకా టెన్షన్.దేవుడా దేవుడా అనుకుంటూ ఉంటే నా చీర కొంగు ఎత్తింది.బిత్తరపోయాను!ఏమైందిరా భగవంతుడా అనుకుంటూ ఉంటే నా బొడ్లో దోపుకున్న కర్చీఫ్ చూసి , తలూపి వెళ్ళిపోయింది. క్షణం అలాగే బిత్తరపోతూ ఆవిడ వైపు చూసి,హోరినీ కర్చీఫ్ కోసమా ఇంత హడావిడి అనుకున్నాను.వాళ్ళకు తెలీదు పాపం నాకు అలా కర్చీఫ్ లు పారేసుకోవటం మామూలని.నాకూ మా ఏమండీ కి ఉన్న ఏకైక కామన్ హాబీ కర్చీఫ్స్ పారేసుకోవటం :) పోయినసారి ఏమండి ఇలాగే రెస్ట్ రూం లో పాస్ పోర్ట్ లున్న బాగ్ మర్చిపోతే ,(ఎందుకు మర్చిపోయారంటే అదో పెద్ద కథ) ఇలాగే స్వీపర్ ముసలమ్మ తెచ్చి ఇచ్చింది.పాపం ఇక్కడి వాళ్ళు చిన్న దానికి కూడా ఆశపడరు.
అక్కడి నుంచి ఎదురుగా ఉన్న బర్గర్ కింగ్ కు వెళ్ళి వెజ్ బర్గర్ , ఫ్రైస్ తిని స్ప్రైట్ తాగాము.బిల్ల్ ఇచ్చి వస్తానని వెళ్ళారు.ఎంతసేపైనా రారు.బిల్ కౌంటర్ దగ్గర లేరు.ఎక్కడి కెళ్ళారు ? రెస్ట్ రూం కనుకుందామనుకుంటే ఇప్పుడే గా అక్కడి నుంచి వచ్చింది.వెతకటానికి ఎక్కడికని వెళ్ళను? పైగా రెండు బాగులు,రెండు హాండ్ బాగులూ పట్టుకొని ఎట్లాపోను.హుం. . . మళ్ళీ ఆంజనేయస్వామిని తలుచుకుంటూ, కూర్చున్నాను.దాదాపు గంట తరువాత వచ్చారు.ఎక్కడికెళ్ళారంటే , బిల్ కౌంటర్ దగ్గర చేంజ్ ఫైవ్ చైనా రూపీస్ కాయిన్ ఇచ్చారట. అది ఏం చేసుకుంటాము , మారుద్దామని అక్కడున్న షాప్స్ అన్నీ తిరిగి , పాపిన్స్ లాంటి పాకెట్ కొనుకొచ్చారు! చెప్పి వెళ్ళ వచ్చుకదా ఇంత టెన్షన్ పెట్టకపోతే.అప్పటికప్పుడు మార్చాల్సిన అవసరం ఏముంది నేనూ కాయిన్ ఎలా ఉందో చూసేదానిని,మేఘ కాయిన్స్ కలెక్ట్ చేస్తుంది తనకిచ్చేవాళ్ళం అని గొణుకున్నాను. అవేవీ పట్టవు!
ఇంకా ఐదు గంటలు గడవాలి, అమ్మో ఇట్లా వదిలేస్తే లాభం లేదు అనుకొని,ఏమి చేస్తే బాగుంటుందా అని చుట్టూ చూసాను. లాంజ్ లో చేర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. చోట ప్లగ్ పాయింట్ కనిపించింది.అమ్మయ్య , ఏమండీ అటు కూర్చుందామా అని అటు తీసుకెళ్ళి , ఏమండీ ఐపాడ్ బాగ్ లోనించి తీసి ఇచ్చాను.ప్లగ్ పాయింట్ లో సెట్ చేసుకొని ఐపాడ్ తీసి బ్రిడ్జ్ ఓపెన్ చేసారు.అమ్మయ్య ఇంక పరవాలేదు , శ్రీలక్ష్మిలాగా గంట కట్టక పోయినా ఐపాడ్ తో కట్టేసాను అని ఊపిరి పీల్చుకొని, నా బాగ్ ఓపెన్ చేసి, లాప్ టాప్ తీసి, నెల రెవ్యూ రాద్దామని ఉంచుకున్న నవల కోసం చూస్తే కనిపించలేదు.చదువుదామని పెట్టుకున్న ఆంధ్రభూమీ కనిపించలేదు. సారి రెండు రోజుల ముందే అన్నీ సద్దుకున్నాను.లాస్ట్ మినిట్ లో ఏమండీ అన్నీ అటూ ఇటూ చేసారు.నా బుక్స్ తీసారా అంటే ఏమో అన్నారు తల ఎత్తకుండానే.ఇంకేం చేస్తాను.కాసేపు స్పైడర్ ఆడి విసుగొచ్చి, కన్ను ఏమండీ మీదనే ఉంచి, ఇంకో కన్ను తో ఎదురుగా ఉన్న ట్రాలీ లను,ఎన్ని తెచ్చి పెడుతున్నారు, ఎన్ని తీసుకుపోతున్నారు లెక్క పెడుతూ, కింద నుంచి వెళుతున్న ట్రేన్స్ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి చూసుకుంటూ,లాంజ్ వచ్చేపోయేవాళ్ళను చూస్తూ,ఎదురు బోర్డ్ మీద మా ఫ్లైట్ ఎన్నింటికి, గేట్ దగ్గరకు వస్తుంది వేసారా చూసుకుంటూ, టైం పాస్ చేసాను.భారంగా ఐదు గంటలు గడిచాయి.మొత్తానికి 3rD గేట్ దగ్గరకు వస్తుందని వేసారు.పదండి పదండి , మనము 35 నుంచి 3 కు వెళ్ళాలి అని ఏమండీని లేపాను. సారి ఐపాడ్ కరుణించింది!
12 గంటల సుధీర్ఘ ప్రయాణం తరువాత శాంఫ్రాన్సిస్కో చేరాము.అక్షరాలా లక్ష రూపాయలు తీసుకుంటారు టికెట్ కు కాని సీట్లు ఎంత ఇరుకో.అటూ ఇటూ మెసిలేందుకే ఉండదు.కాకపోతే జేన్ ఫుడ్ అని చెప్పాము కాబట్టి భోజనం బాగానే ఉంది.తినటం,నిద్రపోవటమే!
3.15 కు విమానం నుంచి బయటకు వచ్చి , ఇమిగ్రేషన్ లో నుంచుంటే చాంతాడంత క్యూ.ఎంత సేపటికీ కదలదు.ఎక్కడెక్కడి నుంచో,ఎన్నెన్ని గంటలో ప్రయాణం చేసి వస్తారు పిల్లలు పెద్దలు. కౌంటర్ లల్లో పది మందిని పెడితే ఏమవతుంది.ఇద్దరో ముగ్గురో ఉంటారు.వాళ్ళు థాపీగా ఉంటారు.నిలబడీ నిలబడీ కాళ్ళుపీకొచ్చాయి.చివరకు కౌంటర్ దగ్గరకు చేరాము.ఏమండీ ని ఏమీ అడగలేదు.నా ఫొటో చూస్తాడు, నన్ను చూస్తాడు.బాబూ అది20 ఏళ్ళ క్రితంది, పేజ్ తిప్పు రెండేళ్ళ క్రితం ఫొటో కనిపిస్తుంది అని చెబుదామంటే భయం!చూసీ చూసి చివరకు ఇక్కడకు ఎందుకు వచ్చావు అని అడిగాడు.గ్రాండ్ చిల్డ్రెన్ తో స్పెండ్ చేద్దామని అని చెప్పాను.ఎన్నాళ్ళుంటావు అన్నాడు.మూడు నెలలు అన్నాను.మళ్ళీ ఫొటోను కాసేపు చూసి మళ్ళీ అడిగాడు ఎందుకొచ్చావు అని.మళ్ళీ చెప్పాను గ్రాండ్ చిల్డ్రన్ తో స్పెండ్ చేద్దామని అన్నాను.ఎన్నాళ్ళుంటావు? అన్నాడు.ఇందాక తప్పు చెప్పానేమో నని త్రీఅండాఫ్హ్ మంత్స్ అన్నాను.మళ్ళీ ఫొటోను నన్ను మళ్ళీ తిప్పి తిప్పి చూసి మళ్ళీ అడిగాను ఎందుకొచ్చావు? నీరసంగా భయం భయంగా గ్రాండ్ చిల్డ్రన్ తో స్పెండ్ చేద్దామని.ఎన్ని రోజులుంటావు? త్రీ మంథ్స్ ఫిఫ్టీన్ డేస్.ఎప్పుడెళ్ళిపోతావు?ఆగస్ట్ 20 కి.సరే పో అని స్టాంప్ వేసాడు.బ్రతుకుజీవుడా అని బయటపడ్డాను.ఇప్పటికీ అర్ధం కాలేదు అతని కి నామీద ఏమనుమానం వచ్చింది? అవే ప్రశ్నలు ఎందుకు అన్నిసార్లు అడిగాడు?నా ఫొటో అదీ పాతది ఎందుకు అన్నిసార్లు మార్చి మార్చి చూసాడు?అన్నీ భేతాళ ప్రశ్నలే!ఎంత టెన్షన్ పెట్టాడు. ఏమండికీ కూడా అర్ధం కాలేదు.ఏమైతేనేమి ఇంటికి చేరుకునేసరికి 8 అయ్యింది. హైదరాబాద్ నుంచి హాంగ్ కాంగ్ వచ్చినంత టైం పట్టింది ఇమ్మిగ్రేషన్ నుంచి బయటపడేసరికి.

అలసిసొలసి ఇంటికొచ్చి అమ్మాయి పెట్టిన వేడి వేడి భోజనం చేస్తూ, కలవటానికొచ్చిన గెస్ట్ ను పలకరిస్తూ , నిద్రపోతూ రెండు రోజులూ గడిచి, ఇప్పటికి కాస్త ఓపిక వచ్చింది.