Monday, December 17, 2018

అమ్మే కావాలి


కొన్ని సార్లు కొన్ని కథలు చదువుతుంటే చాలా విసుగ్గా ఉంటుంది. ఏదో సమస్యల మీద రాయాలని మొదలు పెడతారు.అవి కూడా ఏదో ఒక సామాజిక వర్గానికే సమస్యలు ఉన్నట్లు, మిగితా వారంతా ఆనందంగా జీవిస్తూ, వాళ్ళని నానా హింసలపాలు చేస్తున్నట్లుగా ఉంటాయి.పొనీ మధ్య తరగతి వాళ్ళకు సమస్యలు లేవా అవి రాయవచ్చు కదా అనుకుంటే ఒకప్పుడేమో అత్తాకోడళ్ళ పొట్లాటలు, వదినా ఆడపడుచుల విరోధాలూ (ఇప్పటికీ టివీ లల్లో అవే ప్రసిధ్ది అనుకోండి) మొగుళ్ళ పెత్తనాలు పెళ్ళాల కన్నీటిగాధలు ఉండేవి.అవి తగ్గి ఈ మధ్య కాలం లో పిల్లలు అమెరికా వెళ్ళిపోయి తల్లితండ్రులను నిర్లక్షం చేయటం, ఆ తల్లితండ్రులు భోరున ఏడుస్తూ చావలేక బతుకును ఈడ్చటం కొత్త ట్రెండ్ అన్నమాట. పోనీ ఏవో హాస్య కథలు అని పేరు పెట్టి రాస్తున్నారు చదివి కాసేపు నవ్వుకుందాము అనుకుంటే నవ్వు పెదాలను ఎంత పీకినా రావటం లేదు.కొన్నేమో మహా ఘంభీరమైన కథలు.అన్ని కథలూ అలా ఉన్నాయని అనటం లేదు కాదు కాని ఎక్కువగా ఉంటున్నాయి. యద్దనపూడిలా ఆహ్లాదకరమైన కథలూ, పొత్తూరి లా కడుపుబ్బ నవ్వించే కథలూ ఎల్లవేళలా రావాలని కోరుకోను కాని మాదిరెడ్డి సులోచనలా  సమస్యలు అని కాకుండా సున్నితంగా సమస్యలను చర్చించే కుటుంబకథలను నాలాంటి సామాన్య పాఠకురాలు కోరుకుంటే తప్పేమీ కాదు అనుకుంటాను.ఆ కోరిక తీర్చేందుకే అప్పుడప్పుడు ఇలాంటి పుస్తకాలు దొరుకుతుంటాయి.అలా నా చేతికి వచ్చింది, జి.యస్.లక్ష్మిగారు రాసిన "అమ్మే కావాలి".
అమ్మ మనసు ను అవిష్కరించిన అమ్మే కావాలి, అమ్మ కథల సమాహారం లో మొత్థం పదమూడు కథలు ఉన్నాయి. ఒకసారి చదవటం మొదలు పెట్టాక ఒకదాని తరువాత ఒకటిగా మొత్థం కథలు చదవటం పూర్తయ్యే వరకు పుస్తకాన్ని వదలలేదు. ఒక కథ బాగుంది ఒకటి బాగాలేదు అని లేదు ప్రతి కథలోను అమ్మ కనిపించింది.
 "ప్రేమా పిచ్చి ఒకటే" కథ చదువుతుంటే "భద్రకాళి" సినిమా గుర్తొచ్చింది.అందులో నాయిక జయప్రద భర్తను పసిపిల్లవాడిలా చూసుకుంటుంది.ఆమెకు ప్రసవం లో పిచ్చి ఎక్కుతుంది.తల్లి ప్రొధ్బలం తో ఆమె కు విడాకులిచ్చి ఇంకో పెళ్ళి చేసుకుంటాడు భర్త.కొన్ని సంవత్సరాల తరువాత జయప్రద కు పిచ్చి తగ్గి జరిగింది తెలుసుకొని, ఒకవేళ నా భర్త కే ఇలా జరుగుతే నేను ఆయనకు విడాకులిచ్చేదాని నా అని తల్లిని అడుగుతుంది.ఆ సినిమా నా మనసులో అట్లా నిలిచిపోయింది.ఇప్పటికీ గుర్తొచ్చినప్పుడల్లా బాధగా ఉంటుంది.ఆ సినిమా చూసిన సంవత్సరానికేమో అనుకుంటా నాకు మా అమ్మాయి పుట్టింది.డెలివరీ ముందు నుంచి నాకూ అట్లా జరుగుతందేమో అని ఎంత భయపడిపోయానో! అసలు అప్పుడు ఎందుకు అట్లా పిచ్చి ఎక్కుతుంది అని తెగ ఆలోచించేదానిని.ఈ కథ చదువుతుంటే అదంతా గుర్తొచ్చింది.ఇందులో నాయిక (అనొచ్చా?) వినీత కు డెలివరీ లో ఇలాగే పిచ్చి ఎక్కుతుంది. తల్లీతండ్రి వినీత ను డాక్టర్ కు చూపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటారు.ముందు పిచ్చి కోడలును ఇంటికి తీసుకొచ్చేందుకు అత్తగారు ఒప్పుకోకపోయినా కొడుకు ,భర్త నచ్చచెప్పటం తో ఒప్పుకుంటుంది. ఆ జబ్బును "పోస్ట్ పార్టం డిసార్టర్" అంటారని ,కుటుంబసబ్యుల సహకారం తనకు ఉండాలని డాక్టర్ చెపుతాడు.అది చదవగానే అప్పటి ఆ డైరెక్టర్ కు ఈ సంగతి తెలీదేమో అట్లా ముగింపు ఇచ్చాడు. ఇప్పుడు లక్ష్మిగారు ఇలా చక్కటి ముగింపు నిచ్చారు అనుకున్నాను.
ఇలా ప్రతి కథా సున్నితంగా ఉనంది.దేనికదే ప్రత్యేకం గా ఉంది.చాలా చిన్న చిన్న సమస్యల గురించి నిజమే కదా మనమెప్పుడూ ఇలా అనుకోలేదే అనుకునేట్లుగా మలిచారు.చదవగానే మంచి ఫీలింగ్ కలిగింది. చివరగా "ఎప్పుడొస్తున్నావమ్మా ?" కవిత చదవగానే అమ్మ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.అమ్మలందరూ తమను తాము ఈ కథలల్లో చూసుకుంటారేమో!
ఈ పుస్తకము నిన్ననే మొదలైన పుస్తక ప్రదర్శన లో నవోదయ బుక్ షాప్ నంబర్ 232 నుంచి 238 లో దొరుకుతుంది.ధర ఎక్కువేమీ కాదు 100 రూపాయలే.కొని నేను చెప్పని మిగితా 12 కథలను కూడా చదివండి.