Sunday, November 21, 2010

మాయదారి చంద్రుడుకిర్రు . . . కిర్రు మనే బండి చప్పుడు , అప్పుడప్పుడు , ఏహెయ్ . . . నడవండే అని ఎడ్లను అదిలిస్తున్న మస్తాన్ మాటలు , పక్క వాయిద్యం లా కీచురాళ్ళ ద్వనులు తప్ప , అంతటా నిశబ్ధం గా వుంది . బండి తాపిగా వెళుతోంది . చిన్నగా ముడుచుకొని , అమ్మ దగ్గరకు ఒదిగాను . ' చలేస్తోందా ? అమ్మలూ ' అమ్మ అడిగింది .
' ఊం ' అన్నాను కొద్దిగా వణుకుతూ .
అమ్మ , పక్కనే వున్న గొంగళి తీసి కప్పి దగ్గరగా పొదుపుకుంది . ఇంతలో ఎక్కడి నుంచో సన్నటి సువాసన గాలి లో తేలిపోతూ వచ్చింది . గుండె నిండుగా పీల్చి , ఎంత బాగుందో అన్నాను .
' మొగలి డొంక దగ్గర పడుతోంది పాపగారు . మొగలిపూల వాసన ఇది ' అన్నాడు మస్తాన్ .
'అమ్మలూ ఇటు చూడు , చందమామ ఎంత బాగున్నాడో ! ' అంది అమ్మ .
అమ్మ మీదు గా బయటకు వంగి చూసాను . ఆకాశం లో నిండు చందమామ తెల్లగా మెరిసిపోతున్నాడు. చందమామ వెలుగు లో , ఇసుకలో ని , బండి చారలు తళ తళ లాడుతున్నాయి .
'అమ్మాయిగారూ , ఈ రోజు కార్తీక పున్నమి కదండి అందుకే చంద్రుడు అంత పెద్దగా వున్నాడు .' అమ్మతో అన్నాడు మస్తాన్ .
మొగలి డొంక దగ్గర పడుతున్నట్లుంది . చాలా ఘాటుగా మొగలిపూల సువాసన అంతకంతకూ ఎక్కువకాసాగింది .
బండి చిన్నగా వెళుతూనే వుంది . ఆకాశం లో అందం గా వున్న చంద్రుని చూస్తూ , చందమామ లోని అవ్వ కథ చెపుతూ , ఆకలేస్తోందా ? అని అడిగింది అమ్మ .
' అవును . నువ్వు చందమామ కథ చెప్తుంటే ఇంకా ఆకలేస్తోంది ' అన్నాను .
అమ్మమ్మ పంపిన అన్నం మూట విప్పింది అమ్మ . అందులో అన్నం , కంది పచ్చడి , గోంగూరపచ్చడి వున్నాయి . మద్యాహ్నం , బస్ దిగ గానే , కీసర వొడ్డున కూర్చొని , నేనూ , అమ్మా తిన్నాక , మళ్ళీ నాకోసం మని జాగ్రత్తగా మూట కట్టింది అమ్మ . అందులోనే కందిపచ్చడి , అన్నం కలిపి ముద్దలు అమ్మ పెడుతుంటే ఎంత తిన్నానో కూడా తెలీలేదు ! అలా . . . . . అలా . . . . . మా ప్రయాణం సాగిపోతూ వుంది . . .' వూరు దగ్గర పడుతోంది , తుమ్మ డొంక లొచ్చేస్తున్నాయి జాగ్రత్త , తల లోపలికి పెట్టుకోండి ' అని మస్తాన్ చెపుతూనే వున్నాడు , ఓ పెద్ద తుమ్మ కొమ్మ మొహానికి గీరుకొని ,చుర్ మనటం తో , అబ్బా . . . అంటూ లేచాను .
ఓహ్ . . . ఇదంతా కలా ????? కాదు ,,, కాదు చిన్ననాటి జ్ఞాపకం . కీసరలో బస్ దిగటం , కీసర వొడ్డున అమ్మమ్మ పంపిన కందిపచ్చడి , గోంగూరపచ్చడి తో అన్నం తినటం , ఆ తరువాత బండి ప్రయాణం , మొగలిపూల సువాసన ఆస్వాదిస్తూ , కార్తీక పౌర్ణమి , నిండు చంద్రుని చూస్తూ , అమ్మ చెప్పే కథలు వింటూ , అమ్మ చేతి , అమ్మమ్మ కందిపచ్చడి అన్నం ముద్దలు తినటము , ఎన్ని సార్లు గుర్తుతెచ్చుకున్నా , కొత్తగా అనిపించే మధురమైన బాల్య స్మృతి .

అంతే ఈ సారి వన భోజనాలకు కంది పచ్చడి చేసేయాలని డిసైడ్ ఐపోయాను .కందిపచ్చడి కి కావలసినవి ;
కందిపప్పు 1 గ్లాస్ ,
రెండు ఎండు మిరపకాయలు ,
జీలకర్ర 1 చెంచా ,
చింతపండు కొద్దిగ ,
గ్లాస్ వేడి చేసి చల్లార్చిన నీరు .
మూకుడు లో కందిపప్పును , నూనె వేయకుండా , ఎరుపు రంగు వచ్చేవరకు వేయించాలి . కందిపప్పు వేగాక అందులోనే మిరపకాయలు కూడా వేసి వేయించాలి . దింపేముందు , జీలకర్ర వేయాలి . రోలు ను శుబ్రంగా కడిగి , వేయించుకున్న పప్పు , మిరపకాయలు , జీలకర్ర , చింతపండు , ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి . పచ్చడి గట్టిగా అనిపిస్తే , కాచి చల్లార్చిన నీటిని కొద్ది కొద్దిగా పోసుకుంటూ రుబ్బుకోవచ్చు .
మెత్తగా రుబ్బిన పచ్చడిని , అన్నం లో నెయ్యి వేసుకొని కలుపుకొని తినటమే తరువాత చేయవలసిన పని :)

ఆహా . . . అలా తినేస్తే కార్తీక పౌర్ణమి రోజు వనభోజనం చేసినట్లు కాదు కదా ?????
అందుకే , పెరట్లోని బాదాం ఆకులను కోసుకొచ్చుకొని , ఎంచక్కా విస్తరి కుట్టుకోవాలి . , అన్నం , కందిపచ్చడి , విస్తరి తీసుకొని మేడ మీదికి పదండి . డాబా పైకి వచ్చారా ?
తెల్లని బెడ్ షీట్ నేలపై పరుచుకోండి . పరిచారా ?
వాకే , దాని మీద విస్తరేసుకొని , అన్నం , కందిపచ్చడి వడ్డించుకొని . . .
సరే ఓసారి తల పైకెత్తి చూడండి . అకాశ వీధిలో అందాల చందమామ వయ్యారీ తారల తో ఎలా సయ్యాట లాడుతున్నాడో కదా !!!! వావ్ ,,,,, తెల్లని వెన్నెల ధారలలో తడిసిపోవట్లేదూ . ఆ పైన చిరు చిరు చలి . . .
వాకిట్లోని పారిజాతాల పరిమళాలు , , , , ,
పక్కింటి చెంబేలీల సువాసనలూ , , , ,
సందులో విచ్చుకుంటున్న జాజిపూల పలకరింపులూ . . .
తెల్లని బెడ్షీట్ పైన , పచ్చని ఆకులో , పొగలు కక్కుతున్న మల్లెపూవులాంటి అన్నం , ఎర్రని కందిపచ్చడి . . .

చుక్కలు *********** కనిపిస్తున్నాయా ****** ఇంకెందుకు ఆలశ్యం కానీయండి .

ఇంత వరకూ వాకే . . . ఆ పైనే వచ్చిపడ్డాయి తిప్పలు . వెన్నెల సోనలను కురిపిస్తున్న చందురుని ఫొటో తీద్దామని ఎంత ప్రయతించినా ఊం హూ అంటాడే ! హాల్ లోని పెద్ద కిటికీ నుంచి కనిపిస్తున్న జాబిలిని బతిమిలాడాను , ఒక్క ఫోజ్ ఇవ్వమని . డాబా పై కొబ్బరాకు సందులోని వెన్నెలరేడును వేడుకున్నాను . అబ్బే . . . మాట వింటేనా ??? చూస్తూండగానే తెల్లారిపోయింది . నన్నూ , నా కెమేరాను చూసి , ఎదురింటిస్తంబం మీద ఓ పిట్ట వాలింది . సరే , దానినెందుకు చిన్న బుచ్చాలని ఓ ఫొటో తీసేసాను . అది చూసి బిల బిల లాడుతూ కాకులొచ్చి , గోడపై బైఠయించి , మమ్మలినీ తీయవూ అన్నాయి . వాకే డన్ ! మాయదారి చందురుడే కాని , నేను నీకు కనిపించనా అని మొహమంతా ఎర్రబరుచుకుంటున్న సూర్యునీ ఫొటో తీసాను . అంతే ఇంకేం చేస్తాను ?????

హాపీ కార్తీక పౌర్ణమీ :)

Thursday, November 11, 2010

చీకటి వెలుగుల రంగేళీ . . . జీవితమే ఓ కాకరకాయ ((( * * *
' చీకటి వెలుగుల రంగేళీ , జీవితమే ఒక దీపావళి ' , ఈ పాట తో నా ' కమ్మటి కలలు ' బ్లాగ్ తో సహా బోలెడు బ్లాగులు హోరెత్తిపోయాయి . చీకటి వెలుగులు , కష్ట సుఖాలు , చేదు తీపి అన్నిటి కలగూరగంపే జీవితం . కాదని ఎవరన్నారు ? దీపావళి కోసం వెతికి , వెతికి నీలి మేఘాల లో తేలిపోతున్నట్లు గా , లేలేత నీలి రంగు చీర ముచ్చట పడి కొనుక్కోవటము ఎంత సంతోషం కలిగించిందో మాటల తో తెలపలేను . చక్కటి లేత నీలి మబ్బు రంగు కు , కొంచం ముదురు నీలిరంగులో చిన్ని కొండల అంచు , కనీ కనిపించని నీలి రంగులో సన్నని గడి తో ముద్దు ముద్దు గా వున్న చీరను , మురిపెం గా చూసుకుంటూ , వెండి కంచం శుభ్రం గా తుడిచి , పొందికగా చీరను అమర్చి , అమ్మవారికి చూపించి , ఆత్రుతగా కట్టుకుందామని తీస్తే . . . . . ఇంకేముంది , ఎక్కడి నుండి అంటిందో నూనె మరక దర్షనం ఇస్తే . . . మనసంతా పచ్చి కాకరకాయ తిన్నట్లు చేదైపోక ఏమవుతుంది ? ఎవరు దిష్ఠి పెట్టారో ????? కొంటున్నప్పుడే షాప్ లో పక్కావిడ అననే అంది ఈ చీర బాగుంది , మీరు తీసుకోక పోతే నేను తీసుకుంటాను అని . దిష్టి మొహంది , ఎవరో కాని ఆమె దిష్ఠే తగిలింది అని ఖారాలూ , మిరియాలు నూరకుండా వుండేందుకు , నేనేమైనా సన్యాసినా ? హుం . . . కొంచం లో కొంచం నయం , అంటేదేదో కొంగుకు అంటింది అనుకుంటూ చేదైన మనసును కాస్త , పుల్లగా వగరుగా మార్చుకోక తప్పలేదు . ఆ మరక కనిపించకుండా దాచుకొని , ఆ చీర కట్టుకున్నప్పుడు , అందరి తో పాటు శ్రీవారు కూడా , చీర చాలా బాగుంది అన్నప్పుడు , ఆహా . . . నా జన్మ ధన్యమాయేగా ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కు . . . చేదు , ఖారం , వగరు , పులుపు అన్ని పోయి తీపి వచ్చె ఢాం ఢాం ఢాం . చీకటి వెలుగుల రంగేళి !!!!!

దీపావళి ఐపోయిన ఇన్ని రోజులకు ఈ సంగతి ఎందుకంటే , మరి ఈ రోజే గా కాకరకాయ కూర చేస్తున్నాను . కాకరకకాయ కూరలో అన్ని వేస్తుంటే జీవితానికి , కాకరకాయ కూరకు ఎంతపోలికనో కనిపెట్టేసా :) సరే కాకరకాయ గురించి నేను కనిపెట్టిన కబురు ఎలా చెబుదామా అని అలోచిస్తూ , , , అలోచన పూర్తయ్యే లోపు కూడలి చూద్దాం అని చూస్తే కబుర్లు , కాకరకాయలో
" మరలిరాని కాలం
మరపు తెలియని మనసు
తీపి చేదు జ్ఞాపకాల దొంతరలకు ఆలవాలం. "
అని ఓ మాట కనిపించింది ! వావ్ ((( వాటే కో ఇన్సిడెన్స్ !!!!!

అబ్బా . . . జీవితమూ , జ్ఞాపకమూ వొకటే నబ్బా సద్దేసుకుందాం అనుకొని ఆ మాట ను ఎత్తుకొచ్చేసుకున్నాగా ! చెప్పాలంటే థాంక్ యు . ( హుం . . కిడ్నాప్ చేసి , థాంక్ యు చెపుతున్నావా ? సరే కానీయ్ ఏంచేస్తా ????? ఇది చెప్పాలంటే డైలాగ్ )

ఇహ కబుర్లు ఆపేసి , కాకరకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందామా . . . . .

మా అత్తగారు కాకరకాయ కూర బ్రహ్మాండం గా చేసేవారు . ఒక్క కాకరకయ కూరేమిటి లెండి వంట చాలా బాగాచేసేవారు . అదేమిటో ఏ మసాలాలు వేయకుండానే కూరల రుచి అదిరిపోయేది . సాయంకాలము పప్పుచారు , ధనియాల పొడి వేసి కాస్తూ , వుంటే నాతో కంబైండ్ స్టడీ కోసం వచ్చిన నా ఫ్రెండ్ , మీ అత్తగారు పప్పుచారు చేస్తున్నట్టున్నారే అంటూ , ఆ పప్పుచారన్నం పెట్టే వరకూ , చదువు కోకుండా ముక్కులు ఎగబీలుస్తునే వుండేది ! వంటంతా అయ్యాక కుంపటి లో పప్పుచారు గిన్నె అలాగే వుంచేవారు . అత్తయ్య గారు వుంచుతున్నారు కదా నేనూ అలాగే చేద్దాం అని ఓసారి పప్పుచారు చేసాక , ఇంకాసి ని , నిప్పులు కుంపట్లో వేసి , ఆ గిన్నె ను కుంపట్లో వుంచేసాను . అందరూ తినటాని కి వచ్చేసరికి , మరి అత్తయ్యగారు వుంచినప్పుడే మో వేడి , వేడిగా వుండేది . నేను వుంచినప్పుడేమో శుభ్రం గా గిన్నె మాడి పోయింది . నా బిక్క మొహం చూసి , అన్ని నిప్పులలో వుంచ వద్దమ్మా , వంటంతా అయ్యే సరికి నిప్పులు ఆరిపోతాయి , కాని ఇనప కుంపటి కదా వేడిగా వుంటుంది , ఆ వేడి కి వుంచుతే , పప్పుచారు కూడా అందరూ తినేవరకూ వేడిగా వుంటుంది అని అసలు కిటుకు చెప్పారు . ఎంతైనా , కుంపటి లో , ఇత్తడి గిన్నెలలో , సన్నటి సెగ మీద చేసిన కూరల రుచే వేరు .

హోరినీ . . . మళ్ళీ కబుర్లు వచ్చేసాయి . అంతే అంతే అందుకే కబుర్లూ కాకరకాయలూ అన్నారు .
నేను కుంపటి వాడను కాని , కొన్ని కొన్ని కూరలకు , ఇత్తడి , గుండు గిన్నె వాడుతాను . ఈ గిన్నె అరిగి పోయినప్పుడల్లా , బడీ చావిడీ లో వున్న , ఇత్తడి సామానుల దుకాణం నుంచి మళ్ళీ తెచ్చుకుంటూ వుంటాను . కాకరకాయ కూర మటుకు తప్పని సరిగా ఈ గిన్నె లోనే వండుతాను .

కాకరకాయ కూరకు కావలసిన వి ;
కాకరకాయలు 1/2 కిలో ,
చింతపండు 50 గ్రాములు ,
పెరుగు చిన్న కప్పు ,
బల్లం / పంచదార 100 గ్రాములు లేదా కొంచం ఎక్కువ తక్కువ కూడా కావచ్చు ,
పసుపు ,
ఉప్పు ,
ఖారం ,
పోపుకు ,
వేరుశెనగ నూనె రెండు చెంచాలు ,
అవాలు , జీలకర్ర , శెనగపప్పు , మినపపప్పు , ఇంగువ , కొద్ది కొద్ది గా .
చేసే విధానము ;
ముందుగా కాకరకాయలను శుభ్రము గా కడిగి , రెండు అంగుళాల మందము లో ముక్కలుగా కోయాలి . గిన్నె లో కాకరకాయ ముక్కలను వేసి , పెరుగు , చింతపండు , పసుపు , ఉప్పు రుచికి సరిపడా వేసి బాగా కలిపి స్టవ్ మీద చిన్న మంటలో పెట్టాలి . గిన్నె మీద కొంచం గుంటగా వున్న మూత పెట్టి , దాని నీళ్ళు పోయాలి . ముక్కలు వుడికేవరకూ మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి . ముక్కలు వుడికి , మూత మీది నీళ్ళన్నీ ఇగిరిపోయాక , గిన్నెను దింపి , ముక్కలను చిల్లుల పళ్ళెం లోకి వంచాలి . పైపైన వున్న చింతపండు ను తీసేయాలి . ఆ తరువాత గిన్నెను స్టవ్ మీద వుంచి , నూనె వేసి , కాగాక పోపు గింజలు వేయాలి . పోపు గింజలు కొంచం ఎర్రపడ్డాక , ఇంగువ వేసి , కాకరకాయ ముక్కలను వేయాలి . ఇష్టప్రకారము ఖారం వేసి , పంచదారను కాని , బెల్లము ను కాని వేసి తక్కువ మంటలో వుంచాలి . పంచదార పాకములా అయ్యి అన్ని ముక్కలకూ పట్టేవరకూ వుంచాలి . పంచదార తక్కువవుతుంది అనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు . ముదురు పాకము లా అయ్యి కూర కొంచం బ్రౌన్ కలర్ లోకి మారి , దగ్గర పడి నప్పుడు దింపేసి , డిష్ గిన్నె లోకి వెంటనే మార్చుకోవాలి . అరే కాకరకాయ చేదు పోయిందే , , , గయాబ్ . . . గాన్ . . .

ఆగండాగండి , అలా తినేయకండి . వేడి అన్నం లో ముద్దపప్పేసుకొని , నెయ్యేసుకొని , కలిపి , ముద్ద , ముద్దకూ కాకరకాయ కూర నంచుకుంటూ గుటుకూ . . గుటుకూ మని రుచిని ఆస్వాదిస్తూ తినాలి . . . ఊ (( . . . ఇహ కానీయండి

ఇప్పుడర్ధమైందా , జీవితానికి , కాకరకాయకూ ఉన్న పోలిక (( . . .

లేక పోతే చదువు రాక ముందు ' కాకరకాయ ' , చదువుకున్నాక ' కీకరకాయ ' అన్నట్లుగా వుందా :)

Thursday, November 4, 2010

నా రా( కో )తలు ఎక్కువైపోయాయా & & & & &

సీతాలక్ష్మి గారి , కాల్ చేసి థాంక్స్ చెప్పాలని వారం నుండి ప్రయత్నిస్తున్నాను . ఏమనుకుంటారో , ఎలా మాట్లాడుతారో అని సంకోచం ! చివరికి ధైర్యం చేసి , భయపడుతూనే ( ఆవిడ తో మాట్లాడేందుకు , భయము , సంకోచము , ధైర్యం ఎందుకు అంటారా ? అది టాప్ సీక్రెట్ ) ఫోన్ చేసాను . ముందు , ఇద్దరమూ కాస్త మొహమాటం గా మాటలు మొదలుపెట్టాము . ఎలా జరిగిందో కాని , ఆ క్షణం లోనే ఇద్దరికీ దోస్తీ కుదిరిపోయి , బోలెడు , బోలెడు , కబుర్లు చెప్పేసుకున్నాము . వాళ్ళ పాపాయి గురించి ఆవిడ , మా పిల్లల గురించి నేను కాసేపు చెప్పుకున్నాక , పుస్తకాలమీదికి టాపిక్ మళ్ళింది . యద్దనపూడి , సెక్రటరీ ఈ మద్యే కొన్నాను అని ఆవిడంటే , అరే నేనూ ఈ మద్యే కొన్నాను అన్నాను .కాసేపు ' జీవనతరంగాలు ' గురించి , అలా అలా , ఇద్దరికీ నచ్చిన ,పుస్తకాలు , పాటలు గురించి , మద్య మద్య చాలా సేపటి నుండి మాట్లాడుతున్నాము అని ఒకరితో ఒకరం అనుకుంటూనే చాలా ముచ్చట్లు చెప్పుకొని , వీలైతే , యద్దనపూడి ని నేను సీతాలక్ష్మి గారికి , రావు బాలసరస్వతి ని ఆవిడ నాకు చూపించే ఒప్పందం చేసుకొని , ఆ రోజుకు కబుర్లు ఆపేసాము .

హుర్రే . . . . . ప్రమదావనం లో , సినిమాలు గా వచ్చిన నవల ల గురించి , చర్చజరుగుతోంది . ' చరణదాసి ' గురించి రాద్దామని , రెండు రోజులుగా , ఆ సి. డీ కోసం ఇల్లంతా గాలిస్తున్నాను . దొరకని దాని గురించి ఎందుకు ? ' సెక్రటరీ ' , ' జీవనతరంగాలు ' గురించి వ్రాయచ్చుగా అనుకొని , నా ఎలుకమ్మ ను చేతిలోకి తీసుకున్నాను . నేను , పూణే లో బి. యే ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు , ఓ రోజు ఇంటికి వస్తుండగా , కిరికీ లో ' ఆంధ్ర జ్యోతి ' వీక్లీ చూసాను . ఇంటి కెళ్ళాక బోర్ గా వుంటుంది , ఓ తెలుగు పుస్తకం కనిపించింది , కొనుక్కుందాం అనుకొని , బస్ లోనుండి దిగి , ఆ పుస్తకము కొన్నాను . యాదృచికం గా ఆ సంచిక లోనే యద్దనపూడి వ్రాసిన ' జీవనతరంగాలు ' సీరియల్ మొదలైంది . అలా నా తెలుగు నవలా సాహిత్య పఠనం మొదలైంది . ఆ సినిమా కూడా నచ్చేసింది . ఎంతో ఇష్టం గా చదివిన సెక్రటరీ , సినిమా మటుకు నచ్చలేదు . అదెందుకు నచ్చింది , ఇదెందుకు నచ్చలేదు అంటే , ' చిత్రమాలిక ' లో నేను వ్రాసిన వ్యాసం చదివి తెలుసుకోండి .

మా పిల్లలు , చిన్నప్పుడు , నచ్చని కూర తినకుండా తప్పించుకోవటాని కి , నచ్చిన కూర తినేసి , ఇక కడుపులో ఖాళీ లేదు , ఇక తినము అని మారాము చేసేవారు ! అప్పుడు మావారు , నచ్చని కూర ముందు తిని , నచ్చిన కూర తరువాత తినమని , అలానే తినిపించేవారు ! అదే పద్దతి అలవాటై , పుస్తకం గా నచ్చి , సినిమా గా నచ్చని సెక్రటరీ గురించి ముందు , పుస్తకం గా , సినిమా గా నచ్చిన జీవనతరంగాలు గురించి తరువాత రాసాను . మరి ఎలా రాసానో మీరూ చదివి చెప్పండి .

చిత్రమాలిక టీం వారికి ధన్యవాదాలు .

Tuesday, November 2, 2010

కొడుకు - కొడక్మాం వన్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఫర్ యు అనుకుంటూ వచ్చాడు , మా అబ్బాయి , నాపుట్టినరోజు సాయంకాలం . కెమేరా తెచ్చావా అని అడిగాను . హుం . . . నువ్వస్సలు సర్ప్రైజ్ కాలేదా ??? ఐనా ఎలా తెలుసుకున్నావు మాతే అని బోలెడు హాచర్యపోయాడు . మరి నెల రోజుల నుండి , నాకో కెమేరా కావాలీ . . . అని అడుగుతున్నాను కదా . అదే తెచ్చివుంటావులే అనుకున్నాను హి హి హి . అని నవ్వేసాను . ఎంత వూహించుకుంటూ వచ్చానో తెలుసా అన్నీ వేస్ట్ చేసావు అన్నాడు . నువ్వు కొడక్ తెచ్చినందుకు సర్ప్రైజ్ కావటంలేదు కాని , నా కొడకా ( ఉష్ . . . తిట్టుకాదు , మురిపెం ) నీకు గుర్తుండి తెచ్చిన్నందుకు మాత్రం సర్ప్రైజ్ అవుతున్నాను . నిజం చెప్పు ఇది నీ ఐడియా యేనా ? అని అడిగాను . హుం . . . నువన్నీ గెస్ చేసేస్తావు మమ్మీ . బామ్మ బర్త్ డే కి ఏం గిఫ్ట్ ఇద్దాము అంటే . బామ్మ కు కెమేరా అవసరం అదే ఇద్దామన్నారు పిల్లలు . ఐనా నేను కొననేమిటి అన్నాడు . ఎందుకు తేవు , తెస్తావు . కాని ఆ లాప్ టాప్ లో నుండి , సెల్ లో నుంచి తల బయటకు రావాలి , అప్పుడు నీకు గుర్తుండాలి , ఎంత తతంగం ! అన్నాను . అలా నా బర్త్ డే రోజు , నా కొడుకు ( మురిపెం . . . మురిపెం . . . ముచ్చట ) నాకోసం కొడక్ తెచ్చాడు .
ముందుగా ఏ ఫొటో తీద్దామా అని ఆలోచించీ . . . చి . . . ఈ ఫొటో తీసాడు . ఆ తరువాత బర్త్ డే ఫొటోస్ చాలానే తీసామనుకోండి . ఎంతైనా మొదటి ఫొటో ప్రత్యేకతే వేరు కదా . ఆ మరునాడు కష్టపడి ఓ చేత్తో కెమేరా పట్టుకొని నా రెండో చేయి ఫొటో నేనే తీసుకున్నాను . అది నేను నా మొదటి కెమేరాతో , నేను తీసిన మొదటి ఫొటో అన్నమాట ! ఆపైన ఈ పూలను తీసాను . అప్పటి నుంచి నా కొడక్ , వేరెవర్ ఐ గో , ఇట్స్ ఫాలోయింగ్ మి $$$$$

అలా నాతోపాటు వచ్చి నా ప్రయాణములో సరిగమలు పలికించింది . అప్పుడైతే ఫుటువాలు తీసేటప్పుడు ఎవరు నా వైపు చూసినా , నా బుజ్జి కెమేరానే చూస్తున్నారు , ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతారో , ఎక్కడ దిష్ఠి పెట్టేస్తారో అని తెగ టెన్షన్ పడ్డానను కోండి . చున్నీ చాటున దాచుకొని మరీ తీసాను ఫొటోలను . ఎంతైనా కొత్తది , జిందగీలో మొదటిసారి నాకంటూ వచ్చిన కెమేరా కదా ఆ మాత్రం మురిపెమూ , భయమూ వుండదేమిటి ?

అంతేకాదండోయ్ , ఆ తరువాత నెలలో నా సుపుత్రుడు నాకోసం సరికొత్త లాప్ టాప్ కూడా తెచ్చిచ్చాడు . పాపం అదేమిటో . . . అప్పుడూ నేను సర్ప్రైజ్ అవలేదు &&&& మమ్మీ కోసం గిఫ్ట్ తెస్తే సర్ప్రైజే కాదు అని నామీద వాళ్ళ అక్కకు కంప్లైంట్ చేసాడు * నువ్వు తేక పోతే సర్ప్రైజ్ అయ్యేదానిని , నా పరువు పోయేది . మా ఫ్రెండ్స్ కొత్త లాప్ టాప్ కొనుక్కోండి , ఈ పాత దానితో ఏం తిప్పలు పడుతారు అంటుంటే , మా అబ్బాయి యు. యస్ వెళ్ళాడు తీసుకొస్తాడు అని చెప్పానురా సుపుత్రా అన్నాను .

ఇదిగో ఇదే నా కొత్త లాప్ టాప్ . ఏమిటీ ఇంత కిట కిట లాడిపోతోంది అని ఆశ్చర్యపోతున్నారా ? ఇంతకు ముందు చెప్పాను కదా నా ఆంకోపరి షేరింగ్ ఆటో అని . కొత్త లాప్ టాప్ రావటము ఆలశ్యం , నా మనవళ్ళూ , మనవరాళ్ళూ వచ్చేసారు . మరి అడుగులో అడుగేస్తూ మా వారు వచ్చేసారు . నేను తప్ప వాళ్ళంతా ఎడ్మిన్స్ ట్రేటర్ లే ! బతిమి లాడి బామాలి నేను ఎడ్మిన్స్టర్ అయ్యాను లెండి . మరి , నేనూ , మా అక్కో అన్నాడు మా అబ్బాయి . ఆ ((( . . . మీ ఇద్దరూ నా చేయిజారిపోయారు కదరా అనేసాను .