Thursday, November 11, 2010
చీకటి వెలుగుల రంగేళీ . . . జీవితమే ఓ కాకరకాయ ((( * * *
' చీకటి వెలుగుల రంగేళీ , జీవితమే ఒక దీపావళి ' , ఈ పాట తో నా ' కమ్మటి కలలు ' బ్లాగ్ తో సహా బోలెడు బ్లాగులు హోరెత్తిపోయాయి . చీకటి వెలుగులు , కష్ట సుఖాలు , చేదు తీపి అన్నిటి కలగూరగంపే జీవితం . కాదని ఎవరన్నారు ? దీపావళి కోసం వెతికి , వెతికి నీలి మేఘాల లో తేలిపోతున్నట్లు గా , లేలేత నీలి రంగు చీర ముచ్చట పడి కొనుక్కోవటము ఎంత సంతోషం కలిగించిందో మాటల తో తెలపలేను . చక్కటి లేత నీలి మబ్బు రంగు కు , కొంచం ముదురు నీలిరంగులో చిన్ని కొండల అంచు , కనీ కనిపించని నీలి రంగులో సన్నని గడి తో ముద్దు ముద్దు గా వున్న చీరను , మురిపెం గా చూసుకుంటూ , వెండి కంచం శుభ్రం గా తుడిచి , పొందికగా చీరను అమర్చి , అమ్మవారికి చూపించి , ఆత్రుతగా కట్టుకుందామని తీస్తే . . . . . ఇంకేముంది , ఎక్కడి నుండి అంటిందో నూనె మరక దర్షనం ఇస్తే . . . మనసంతా పచ్చి కాకరకాయ తిన్నట్లు చేదైపోక ఏమవుతుంది ? ఎవరు దిష్ఠి పెట్టారో ????? కొంటున్నప్పుడే షాప్ లో పక్కావిడ అననే అంది ఈ చీర బాగుంది , మీరు తీసుకోక పోతే నేను తీసుకుంటాను అని . దిష్టి మొహంది , ఎవరో కాని ఆమె దిష్ఠే తగిలింది అని ఖారాలూ , మిరియాలు నూరకుండా వుండేందుకు , నేనేమైనా సన్యాసినా ? హుం . . . కొంచం లో కొంచం నయం , అంటేదేదో కొంగుకు అంటింది అనుకుంటూ చేదైన మనసును కాస్త , పుల్లగా వగరుగా మార్చుకోక తప్పలేదు . ఆ మరక కనిపించకుండా దాచుకొని , ఆ చీర కట్టుకున్నప్పుడు , అందరి తో పాటు శ్రీవారు కూడా , చీర చాలా బాగుంది అన్నప్పుడు , ఆహా . . . నా జన్మ ధన్యమాయేగా ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కు . . . చేదు , ఖారం , వగరు , పులుపు అన్ని పోయి తీపి వచ్చె ఢాం ఢాం ఢాం . చీకటి వెలుగుల రంగేళి !!!!!
దీపావళి ఐపోయిన ఇన్ని రోజులకు ఈ సంగతి ఎందుకంటే , మరి ఈ రోజే గా కాకరకాయ కూర చేస్తున్నాను . కాకరకకాయ కూరలో అన్ని వేస్తుంటే జీవితానికి , కాకరకాయ కూరకు ఎంతపోలికనో కనిపెట్టేసా :) సరే కాకరకాయ గురించి నేను కనిపెట్టిన కబురు ఎలా చెబుదామా అని అలోచిస్తూ , , , అలోచన పూర్తయ్యే లోపు కూడలి చూద్దాం అని చూస్తే కబుర్లు , కాకరకాయలో
" మరలిరాని కాలం
మరపు తెలియని మనసు
తీపి చేదు జ్ఞాపకాల దొంతరలకు ఆలవాలం. "
అని ఓ మాట కనిపించింది ! వావ్ ((( వాటే కో ఇన్సిడెన్స్ !!!!!
అబ్బా . . . జీవితమూ , జ్ఞాపకమూ వొకటే నబ్బా సద్దేసుకుందాం అనుకొని ఆ మాట ను ఎత్తుకొచ్చేసుకున్నాగా ! చెప్పాలంటే థాంక్ యు . ( హుం . . కిడ్నాప్ చేసి , థాంక్ యు చెపుతున్నావా ? సరే కానీయ్ ఏంచేస్తా ????? ఇది చెప్పాలంటే డైలాగ్ )
ఇహ కబుర్లు ఆపేసి , కాకరకాయ కూర ఎలా చేయాలో తెలుసుకుందామా . . . . .
మా అత్తగారు కాకరకాయ కూర బ్రహ్మాండం గా చేసేవారు . ఒక్క కాకరకయ కూరేమిటి లెండి వంట చాలా బాగాచేసేవారు . అదేమిటో ఏ మసాలాలు వేయకుండానే కూరల రుచి అదిరిపోయేది . సాయంకాలము పప్పుచారు , ధనియాల పొడి వేసి కాస్తూ , వుంటే నాతో కంబైండ్ స్టడీ కోసం వచ్చిన నా ఫ్రెండ్ , మీ అత్తగారు పప్పుచారు చేస్తున్నట్టున్నారే అంటూ , ఆ పప్పుచారన్నం పెట్టే వరకూ , చదువు కోకుండా ముక్కులు ఎగబీలుస్తునే వుండేది ! వంటంతా అయ్యాక కుంపటి లో పప్పుచారు గిన్నె అలాగే వుంచేవారు . అత్తయ్య గారు వుంచుతున్నారు కదా నేనూ అలాగే చేద్దాం అని ఓసారి పప్పుచారు చేసాక , ఇంకాసి ని , నిప్పులు కుంపట్లో వేసి , ఆ గిన్నె ను కుంపట్లో వుంచేసాను . అందరూ తినటాని కి వచ్చేసరికి , మరి అత్తయ్యగారు వుంచినప్పుడే మో వేడి , వేడిగా వుండేది . నేను వుంచినప్పుడేమో శుభ్రం గా గిన్నె మాడి పోయింది . నా బిక్క మొహం చూసి , అన్ని నిప్పులలో వుంచ వద్దమ్మా , వంటంతా అయ్యే సరికి నిప్పులు ఆరిపోతాయి , కాని ఇనప కుంపటి కదా వేడిగా వుంటుంది , ఆ వేడి కి వుంచుతే , పప్పుచారు కూడా అందరూ తినేవరకూ వేడిగా వుంటుంది అని అసలు కిటుకు చెప్పారు . ఎంతైనా , కుంపటి లో , ఇత్తడి గిన్నెలలో , సన్నటి సెగ మీద చేసిన కూరల రుచే వేరు .
హోరినీ . . . మళ్ళీ కబుర్లు వచ్చేసాయి . అంతే అంతే అందుకే కబుర్లూ కాకరకాయలూ అన్నారు .
నేను కుంపటి వాడను కాని , కొన్ని కొన్ని కూరలకు , ఇత్తడి , గుండు గిన్నె వాడుతాను . ఈ గిన్నె అరిగి పోయినప్పుడల్లా , బడీ చావిడీ లో వున్న , ఇత్తడి సామానుల దుకాణం నుంచి మళ్ళీ తెచ్చుకుంటూ వుంటాను . కాకరకాయ కూర మటుకు తప్పని సరిగా ఈ గిన్నె లోనే వండుతాను .
కాకరకాయ కూరకు కావలసిన వి ;
కాకరకాయలు 1/2 కిలో ,
చింతపండు 50 గ్రాములు ,
పెరుగు చిన్న కప్పు ,
బల్లం / పంచదార 100 గ్రాములు లేదా కొంచం ఎక్కువ తక్కువ కూడా కావచ్చు ,
పసుపు ,
ఉప్పు ,
ఖారం ,
పోపుకు ,
వేరుశెనగ నూనె రెండు చెంచాలు ,
అవాలు , జీలకర్ర , శెనగపప్పు , మినపపప్పు , ఇంగువ , కొద్ది కొద్ది గా .
చేసే విధానము ;
ముందుగా కాకరకాయలను శుభ్రము గా కడిగి , రెండు అంగుళాల మందము లో ముక్కలుగా కోయాలి . గిన్నె లో కాకరకాయ ముక్కలను వేసి , పెరుగు , చింతపండు , పసుపు , ఉప్పు రుచికి సరిపడా వేసి బాగా కలిపి స్టవ్ మీద చిన్న మంటలో పెట్టాలి . గిన్నె మీద కొంచం గుంటగా వున్న మూత పెట్టి , దాని నీళ్ళు పోయాలి . ముక్కలు వుడికేవరకూ మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి . ముక్కలు వుడికి , మూత మీది నీళ్ళన్నీ ఇగిరిపోయాక , గిన్నెను దింపి , ముక్కలను చిల్లుల పళ్ళెం లోకి వంచాలి . పైపైన వున్న చింతపండు ను తీసేయాలి . ఆ తరువాత గిన్నెను స్టవ్ మీద వుంచి , నూనె వేసి , కాగాక పోపు గింజలు వేయాలి . పోపు గింజలు కొంచం ఎర్రపడ్డాక , ఇంగువ వేసి , కాకరకాయ ముక్కలను వేయాలి . ఇష్టప్రకారము ఖారం వేసి , పంచదారను కాని , బెల్లము ను కాని వేసి తక్కువ మంటలో వుంచాలి . పంచదార పాకములా అయ్యి అన్ని ముక్కలకూ పట్టేవరకూ వుంచాలి . పంచదార తక్కువవుతుంది అనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చు . ముదురు పాకము లా అయ్యి కూర కొంచం బ్రౌన్ కలర్ లోకి మారి , దగ్గర పడి నప్పుడు దింపేసి , డిష్ గిన్నె లోకి వెంటనే మార్చుకోవాలి . అరే కాకరకాయ చేదు పోయిందే , , , గయాబ్ . . . గాన్ . . .
ఆగండాగండి , అలా తినేయకండి . వేడి అన్నం లో ముద్దపప్పేసుకొని , నెయ్యేసుకొని , కలిపి , ముద్ద , ముద్దకూ కాకరకాయ కూర నంచుకుంటూ గుటుకూ . . గుటుకూ మని రుచిని ఆస్వాదిస్తూ తినాలి . . . ఊ (( . . . ఇహ కానీయండి
ఇప్పుడర్ధమైందా , జీవితానికి , కాకరకాయకూ ఉన్న పోలిక (( . . .
లేక పోతే చదువు రాక ముందు ' కాకరకాయ ' , చదువుకున్నాక ' కీకరకాయ ' అన్నట్లుగా వుందా :)
Subscribe to:
Post Comments (Atom)
29 comments:
మాల గారి కాకర కాయ?
మీ అత్తగారి పప్పుచారు రెసిపీ కావాలి. ఎప్పుడో తిన్న పప్పుచారు గుర్తు చేశారు. చాలా మందికి పప్పుచారు అంటే ఏమిటో కూడా తెలియదు. రాచ్చిప్పలో స్లో కుకర్ కుంపటి మీద చేసిన ఆ పప్పుచారు రుచి !
మాల గారు, రాయడంలో మీ స్టైలే స్టైలు... ఎక్కడ లేత నీలిరంగు చిన్ని కొండంచుల చీరా.. ఎక్కడ నెయ్యీ, ముద్దపప్పులో కాకరకాయ కూర!! ఎటునించి ఎటు తీసుకెళ్ళారో అసలు! సూపర్! :-)
మా అమ్మమ్మ గారి ఇంట్లో,మా బామ్మగారు ఇలా కుంపటి మీద వంటలు చేసవారు.ఎంతయినా ఆ రుచే వేరు.ఆ కమ్మదనం రమ్మంటే ఈ ఎలెక్ట్రిక్ పొయ్యిలమీద ఏం వస్తుంది?? అసలు కట్టెపొయ్యి మీద చేసే పిండివంటల రుచి చెప్పనక్కరలెదు.
నాకు కాకరకయ కూర అంటే ఎంత ఇష్టమో! మా అమ్మ బ్రహ్మాండంగా చేస్తుంది.మళ్ళీ అది గుర్తు చేసారు.
"వేడి అన్నం లో ముద్దపప్పేసుకొని , నెయ్యేసుకొని , కలిపి , ముద్ద , ముద్దకూ కాకరకాయ కూర నంచుకుంటూ"
మాలాకుమార్ గారూ చాలా మంచి కాంబినేషన్ అండీ..
ఇప్పటికిప్పుడు తినాలనిపిస్తుంది.
మీ కాకరకాయకూర,గుండుగిన్నె చాలా బాగున్నాయి...
కాకరకాయను కూడా నోరూరించేలా చేయడం మీకే సాధ్యం మాలాగారూ :) :)
మాలా గారు నా మాటని వాడేసుకుని చెప్తారా!!! నిజం గా భలే ఆనందం వేసింది మీ థాంక్ యు ను చూడగానే...నాకు బోల్డు ఇష్టం కాకరగాయ కూర అంటే
మాల గారూ,
మీ పొస్ట్స్ అన్నీ బావుంటాయ్,
మా ఇంట్లో కాకరకాయ నిషిధ్దం అండీ.లెకపొతే ఒకసారి మీ కూర ట్రై చేద్దును
మాల గారూ
చాలా బాగా రాసారు. మీ అన్ని టపాలు చదివాను ఇంతకు ముందు, కాని ఇదే మొదటి కామెంట్. మీరు రాసే శైలి చాలా బాగుంటుంది.
కాకరకాయ కూర నాకు కూడా చాలా ఇష్టం. మా అత్తయ్య ఒకరు ఇలాగే బొగ్గుల కుంపటి మీద వంట చేసేవారు. ఆవిడ కూడా కాకరకాయ కూర ఇలానే, బెల్లం వేసి చేసేవారు. ముందు అసలు తినేదాన్ని కాదు కాని, ఈ కూర తిన్నప్పటి నుండి నా ప్రియమైన కూర అయిపొయింది. మా ఇంట్లో పిల్లలు, మా అయన అస్సలు తినరు కాబట్టి ఎప్పుడో నాకు మాత్రమే స్పెషల్గ చేసుకుంటాను. కాని ఇప్పుడు నాకు బెల్లం వెయ్యకుండా చిరు చేదుతోనే ఇష్టం ఈ కూర. :-))
పద్మవల్లి
కాకరకాయకూర చెయ్యడం ఎంత తియ్యగా చెప్పారండీ..
ప్రియ ,
:))
& లక్కరాజు గారు ,
ముందుగా నా బ్లాగింటికి స్వాగతం అండి .
మా అత్తగారి పప్పుచారు రసెపీ ఇచ్చేందుకు నాకే మీ అభ్యంతరం లేదు గానీయండి , మరి మీ ఇంట్లో కుంపటి , పప్పు వండేందుకు ఇత్తడి గుండు గిన్నె , ధనియాలు దంచేందుకు , రోలు రోకలి బండ వున్నాయాండి :)
& నిషిగంధ గారు ,
థాంక్ యూ అండి .
ఇందు గారు ,
అవునండి , మేమూ ఒకొప్పుడు , పిండి వంటలు కట్టెల పొయ్యి మీదే చేయించేవారము .
థాంక్ యు అండి .
& రాజీ ,
ఆలశ్యం ఎందుకు ? వచ్చేయ్ మరి పెడతాను .
& పరిమళం గారు ,
థాంక్ యు :) :)
చెప్పాలంటే ,
అమ్మయ వచ్చారా ? ఆనందించారా ? మీ కవిత రాసాను కాని , మీకు చెప్పకుండా తీసేసుకున్నానే ఏమనుకుంటారో అని తెగ టెన్షన్ పడుతున్నానండి . థాంక్ యు .
&లత గారు ,
స్వాగతమండి .
మీ ఇంట్లో కాకరకాయ నిషిద్దమా ? మా అమ్మాయి అత్తగారింట్లో , కొడుకు పెళ్ళయ్యేవరకూ తల్లి కాకరకాయ తినరట . మీకూ అలాంటిదేమైనా వుందా ?
పద్మవల్లి గారు ,
మీకూనూ నా సాహితి కి స్వాగతమండి . నా కాకరకాయ ముగ్గురు అథిదులను తీసుకొచ్చింది . నాకు చాలా సంతోషం గా వుంది .
మీకు నా పొస్ట్ లు నచ్చుతున్నందుకు చాలా థాంక్స్ అండి . మీ అందరి , ఆదరాభిమానాలే నాతో ఇలా రాయిస్తున్నాయి . థాంక్ యు .
& శ్రీలలిత గారు ,
:)
మాల గారూ,
డాలరు పెడితే పోర్త బుల్ గ్రిల్ వస్తుంది. మా యింటి పక్క హిస్పానిక్ షాపు లో మిగతా వాటికోసం వెతుకుతాను. ఏవి ఎలా ఎప్పుడు వెయ్యాలో తెలిస్తే స్లో కుక్కర్ లో ఇమ్ప్రోవయిజు చేయగలం. ఇంకా పప్పుచారు వాసనలు రుచి మనసులో మెదులుతూనే ఉన్నాయి. మీ అత్తగారి పప్పుచారు రెసిపీ కావాలి.
లక్కరాజు గారు ,
మీరు నిజం గా రెసిపీ అడిగారనుకోలేదండి . దానిదేముంది , తప్పక ఇస్తాను . గుండు గిన్నె , రోలు , రోకలి , కుంపటి ఏవీ అవసరము లేదులెండి . చారు , సన్న సెగ మీద కాస్తే చాలు . ముందుగా , కంది పప్పును మెత్తగా వుడక పెట్టుకోవాలి . అది వుడికే లోపు , మీకు నచ్చేంత పులుపు కు సరిపడా చింతపండు ను నీళ్ళ లో నానపెట్టుకోవాలి . ఉల్లిపాయ ( తప్పని సరి ) , మునక్కాడ , గుమ్మడి పండు , బెండ కాయ , వంకాయ , సొరకాయ ( కాప్సికం , మూలీ , టమాటో , కారెట్ లాంటివి వేయవద్దు . అవి వేస్తే సాంబారు రుచి వస్తుంది ) వీటిల్లో మీకిష్టమైనవి , దొరికినవి , పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి . చింతపండును మెత్తగా పిసికి గుజ్జు తీసుకొని , నీళ్ళు కలిపి పులుసు లాచేసుకొని , అందులో కూరగాయల , ఉల్లిపాయ ముక్కలను వేసి , చిన్న మంట మీద ఉడికించుకోవాలి . ముక్కలు మెత్తపడ్డాక , ముందుగా ఉడికించి వుంచిన పప్పును , గరిట తో మెత్తగా చిదుపుకొని ( మిక్సీ లో వేయ వద్దు , పేస్ట్ అవుతుంది ) కాగుతున్న పులుసు లో వేసి బాగా కలపాలి . అది ఉడుకుతూ వుండగానే , కొన్ని ధనియాలను ( ధనియాలను మాత్రమే , ఇంకేమీ వేయవద్దు , ధనియాలను వేయించవద్దు ) మెత్తగా పొడి చేసుకోవాలి . ఈ పొడి ఎప్పటికప్పుడు చేసుకోవాలి . ముందుగా చేసి వుంచుతే , దాని సువాసన పోతుంది . పప్పు ,పులుసు కలిసి బాగా కాగాక , ధనియాల పొడి , ఉప్పు , పసుపు వేయాలి .
ఆ తరువాత , పక్కన ఇంకో స్టవ్ మీద , పోపు గరిట పెట్టి , అందులో ఓ టేబుల్ స్పూన్ వేరుశెనగ నూనె వేసి కాచాలి . నూనె కాగాక , నాలుగు ఐదు గింజలు మెంతులు వేయాలి . మెంతులు ఎరుపు రంగుకు వచ్చాక , ఆవాలు వేయాలి , ఆవాలు చిటపట లాడాక , చిన్న ఎండు మిరపకాయ ముక్క , శెనగ పప్పు , మినపపప్పు , జీలకర్ర అన్నీ , కొద్ది కొద్దిగా వేయాలి . అవి వేగాక ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి . ఆ తరువాత అందులో కరవేపాకు వేసి , వెంటనే మరుగుతున్న పులుసు లో ఆ పోపు వేసేయాలి . ఓ ఐదు నిమిషాలలో దింపేయవచ్చు .
పులుసు స్టవ్ మీద పెట్టినప్పటి నుండి , దింపేవరకూ , చిన్న మంట మీదే వుండాలి .
దీనికి కాంబినేషన్ , కాల్చిన అప్పడాలు .
మరి , ఉల్లిపాయలు , ధనియాల పొడి మరుగుతుండగా వచ్చే సువాసనలకు , మీ పక్కింటి వారు వచ్చి వూడ్చేసి వెళితే నన్నద్దు . మిగిలింది , తిని రుచి ఎలా వచ్చిందో చెప్పండి :))
మాలా గారూ మీ రెసిపీ ప్రింట్ చేసుకున్నాను. కిచెన్ నా చేతిలోకి రాంగానే ట్రై చేస్తాను. తప్పకుండా మీకు చెబుతాను. మా పిల్లల కోసం ఇండియన్ ఫుడ్ రెసిపీ లు వ్రాస్తున్నాను కాకపోతే అవన్నీ టీ స్పూను లెక్కల్లో నేను చేసి వ్రాస్తాను. థాంక్స్ ఎగైన్ ఫర్ ది రెసిపీ.
ఆహా మాల గారు టైటిల్ కెవ్వు కేక ..దీపావళి కి కాకర కాయ కి కలిపారు చూడు ....
ఇక పోస్ట్ అయితే ఎంత నవ్వుకున్నానో... కాకరకాయ ,సొరకాయ పై మీకున్న అభిమానం నిర్వచించలేనిది సుమీ
కాకరకాయంటే నాకూ ఇష్టమేనండీ, చాలామంది చిరాకు పడతారుగానీ నాకు బలే ఇష్టం. కాకరకాయ పెరుగు పచ్చడి, తియ్యపచ్చడి, పులుసు ఇవన్నీ నాకు ఇష్టమే
మీరు చెప్పిన కాకరకాయ కూర మా హాస్టల్ లో బ్రహ్మాండంగా చేసేవారు. నాకు మా హాస్టల్లో అతిగా నచ్చేది అదొక్కటే.
మీరు లక్కరాజుగారికి చెప్పిన పప్పుచారునే మేము పప్పుపులుసు/పప్పులుసు అంటాం. రెండూ ఒకటేనా, వేరు వేరా?
మీరు చెప్పారు కదా అని, మీ పోస్టు చూస్తూ నిన్న రాత్రి అదే కాంబినేషన్ చేసాను, పప్పు చారు అదుర్స్ ! కాకరకాయ.. ఎక్కడో ఏదో కాస్త తేడా చేసినట్టున్నాను. కానీ.. పర్వాలేదు..
శివానీ ,
థాంక్ యు :)
& సౌమ్యా ,
కాకరకాయ పెరుగుపచ్చడి చేస్తారా ? అది నేనెప్పుడూ వినలేదు .
హాస్టల్ లో కాకరకాయ కూర బ్రహ్మాండం గా చేయటమా ? విచిత్రమే !
పప్పుచారు , పప్పు పులుసు ఒకటే నా ? ఏమో మరి నాకు తెలీదు .
మొత్తానికి కాకరకాయ కూర కూడా మీ కిష్టమే నన్నమాట :)
& కృష్ణప్రియ గారు ,
అప్పుడే చేసేసారా ? గుడ్ girl.
కాకరకాయ కూర ఇలా చేయటము మొదటి సారి కదా , మళ్ళీ ఈ సారి చేసి నప్పుడు బాగా వస్తుంది లెండి .
మీకు నచ్చినందుకు థాంక్ యు .
అవునండీ కాకరకాయ పెరుగు పచ్చడి చేస్తారు. వాటిని సన్నగా తరిగి, కాస్త వేయించి, కమ్మటి పెరుగులో పడేసి పోపు వెయ్యడమే....చేదు లేకుందా చాలా బావుంటుంది. ఓసారి ట్రై చెయ్యండి.
మాల గారు, మీ బ్లాగ్ చాలా బాగందండీ..అన్ని టపా లు చదివేసాను..చాలా ఛాలా బాగ రాసారు..మీ దీపావళి కాకరకాయ కాంబినాషన్ అదుర్స్ అండీ..నాకు ఒక చిన్న సందేహమ్..కాకరకాయ పైన బొబ్బర తీయకుండానే చేయాలా..
నాకు చాలా ఇష్టమైన కూర.. కాకపొతే పూర్వం కాయ కాల్చి, ఉల్లి ఖారం కూరి వేయించే వాళ్ళు.. ఆ రుచే వేరు లెండి.. ఇత్తడి గుండు గిన్ని..ఎంతకాలం అయిందండీ.. ఇది వినగానే నాకు మా బామ్మ గుర్తొచ్చేసింది.. అదండీ సంగతి..
అ. సౌమ్య ,
కాకరకాయ వేపుడు , కారకాయ ఉల్లిఖారం , కాకరకాయ ఆవకాయ అన్నీ రాద్దామనుకున్నాను . హుం కాని విదేశీ శక్తులవల్ల వ్రాయటం లేదు :)
నిన్న నే కాకరకాయ పెరుగు పచ్చడి కూడా ప్రయత్నం చేసా బాగుంది . థాంక్ యు .
& సృజన గారు ,
నేనైతే కాకరకాయమీద బొబ్బర తీయనండి . అలాగే వుంచి కట్ చేస్తాను .
మీకు నా పోస్ట్ లు నచ్చినందుకు థాంక్స్ అండి .
& మురళి గారు ,
కాకరకాయ ఉల్లిఖారం కూర మేమూ చేస్తామండి .
నా ఇత్తడి గుండు గిన్నె మీ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చిందన్నమాట :)
మాల గారు మీ బ్లాగ్ రెగులర్గా చదువుతాను కాని బద్దకించి కామెంట్ పెట్టను.మీ కాకరకాయ కూర చాలా బాగుంది.అలాగే కాకరకాయ ఉల్లికారం కూడా పోస్ట్ చేయండి.
మాలా గారు,
నేను మీ పప్పు చారు రేసిపే నిన్ననే చూసాను. నచ్చి ఈ రోజు ట్రై చేశాను. చాల బాగుంది. నచ్చింది. thank you . కంది పచ్చడి కూడా ట్రై చేసి చెప్తాను. మీ పోస్ట్స్ బాగుంటాయి.
శ్రీదేవి.
జ్యోతి గారు ,
నా బ్లాగ్ మీకు నచ్చినందుకు థాంక్స అండి .
& శ్రీదేవి గారు ,
థాంక్ యు .
Post a Comment