Monday, November 30, 2009

వేంటాడే దొంగ గారు వచ్చారహో !

నేను దీర్ఘంగా ఆలోచిస్తుండగా ( ఇంటి పై కప్పు దేని తో వేయాలా అని కాదు , వెలగకాయ , స్లైడ్ షొ ఎలాచేయాలా అని ) , టింగ్ మంది . ఎవరా ? అని చూస్తే , జ్యోతి , మీకు ఆంద్రజ్యొతి చానల్ వస్తుందా అని అడుగుతున్నారు . చూస్తానుండండి , అని చూసి , ఆ వస్తోంది ఏమిటి విశేషం అని అడిగాను . . రేపు మద్యాహనము 1 .30 కి నా ప్రోగ్రాం వస్తుంది , వీడియో తీసిపెడతారా ? అన్నారు , అయ్యో మద్యాహ్నం నేను ఉండనే , ఇంకేటైం లోనూ రాదా అని అడిగా . వస్తుంది , రాత్రి 12.30 కి అన్నారు . సరే అయితే తీసేస్తాను ఎలా తీయాలో చెప్పండి అన్నా . సెల్ తో ఎలా తీయాలో చెప్పారు . మా అబ్బాయి రాగానే , మావారి సెల్ తో ఎలా తీయాలో నేర్చుకొని , కొంచం ప్రాక్టీస్ కూడా చేసేసాను .

స్వగతం ;

నా సెల్ ఎంత బాగుంది . చక్కగా ప్లాటినం రంగులో మెరిసి పోతూ , చేతిలో ఇమిడిపోయీ బుజ్జి కన్న ఎంత ముద్దొస్తుందో . మీ సెల్ చూడండి , ఎర్రగా నల్లగా రౌడీస్ లా వుంది . మీలాగే మీ సెల్ కూడా డిగ్నిఫైడ్ గా వుండాలా వద్దా ? ఆ రౌడీస్ ని నాకిచ్చేయండి . అని ఎంత అడిగినా , నేను రౌడీస్ , నా సెల్ రౌడీస్ నేనివ్వను పో అనేస్తారు మా శ్రీవారు . నా సెల్ తో ఫొటొస్ తీయలేనండి , ప్లీస్ ఇవ్వరూ అని ఎంత బతిమిలాడినా ససేమిరా అనేసారు . ఏం చేస్తాను ? ఆయన ఇంట్లో వున్నప్పుడే ఫొటోస్ తీసుకుంటూ తంటాలు పడుతున్నాను . దేవుడా , దేవుడా ఈ రెండు రోజులూ ఆయనను ఏ కాంప్ కి వెళ్ళకుండా చూడు . అవునూ నేను గురూజీ ప్రోగ్రాం వీడియో నా బ్లాగ్లో "గురుధక్షిణ " అని టైటిల్ పెట్టి , పోస్ట్ చేస్తే ! వావ్ , వాటే గ్రేట్ ఐడియా !

స్వగతం ఐపోయింది :

ఇహ నిద్ర పడితే ఒట్టు ! ఎలా రాయాలి ? , గురూజీకి కోపం రాకుండా , మొట్టికాయలు వేయకుండా , మెచ్చుకునేట్లుగా రాయాలి . అదిరిపోవాలి . రకరకాల భావాలు . మళ్ళీ మర్చి పోకుండా రాసేసుకుంటే ! లేచి టైం చూస్తే , 1.30 అయ్యింది . ఇప్పుడు లాప్ టాప్ తీసానంటే , మొన్ననే ఆయనగారు కోపం చేసారు , అర్ధరాత్రి , అపరాత్రి లేకుండా ఎప్పుడూ ఆ బ్లాగ్ ల లోకమే . ఇలా అర్దరాత్రి లాప్ టాప్ తీసావంటే దాన్ని అవతల పారేస్తా అని వార్నింగ్ ఇచ్చారు , ఇప్పుడు తీసానంటే అన్నంత పని చేస్తారు . మొదటికే మోసం వస్తుంది అని పరి పరి విధాల ఆలోచిస్తూ , ఎప్పుడు నిద్ర పోయానో తెలీదు .

సెల్ రింగవుతుంటే ఏమండీ లేచి చూస్తుంటే,అప్పుడే తెల్లారి పోయిందా ? సావిత్రి వచ్చేసిందా అనుకుకొని సావిత్రి వచ్చిందేమో తలుపు తీయండి అన్నాను.కాదు శ్రీధర్ ఫోన్ చేసి సార్ మా రూం తలుపు బయట నుంచి వేసి ఉంది అన్నాడు.గబగబా కింది కి వెళ్ళి చూసాము.వాళ్ళ రూం తలుపు వేసి ఉంది.ఆఫీస్ రూం తలుపు తీసి ఉంది.కింద ఏమండీ గారి జర్కిన్, బ్రీఫ్ కేస్ పడి ఉన్నాయి. ముందు అర్ధం కాలేదు కాని తరువాత తెలిసింది ఎన్నేళ్ళుగానో , తరతరాలు గా ఎదురుచూస్తున్న దొంగగారొచ్చారు.కాని పాపం పిచ్చి సన్నాసి ఏమీ దొరకక, ఆఫీస్ లో ఉన్న 10000 రూపాయాలు, ఏమండీగారి సెల్ ఎత్తుకుపోయాడు.ఆ. . . . . సెల్. . . . .

ఆక్రోశం ;

ఓరోరి దొంగ వెధవా ! నేను 1.30 దాకా మెలుకువ తోనే వున్నాను గదరా ? ఎప్పుడొచ్చావురా ? వచ్చేవాడివి ముందు చెప్పిరావద్దూ ? ఎన్నేళ్ళనుండి నీ కోసం ఎదురుచూస్తున్నాము . మూడు తరాలవాళ్ళు నిన్ను పిలుస్తున్నారే , ఆమాత్రం మర్యాద వుండక్కరలేదా ? ముందుగా తెలుస్తే నీకు మంగళహారతి తో స్వాగతం చెప్పేదానినే ! పోనీ వచ్చావే పో మా ఆయన సెల్ ఎత్తుకుపోవటమేమిటిరా ? పింజారీవెధవ . బాల్కనీ దూకి వెళ్ళేటప్పుడైనా , ఆయన జాకెట్ , బ్రీఫ్ కేస్ తో పాటు సెల్ కూడా జారవిడుస్తే బాగుండేది కదరా వెధవన్నర వెధవ . అసలు నన్నడుగుతే , బాబ్బాబు ఆ సెల్ వద్దురా , నా సెల్ తీసుకు పోరా అని ఇచ్చేదానిని కదరా కంత్రీ వెధవ . నీ ఫోటో కూడా బ్రహ్మానందం ఫోజు లో తీసి , ఈ నెట్ ఫోటో బదులు నీ ఫొటో నే పెట్టేదానిని కదరా తింగరి వెధవా . నా కలలన్ని కల్లలు చేసావు కదరా కంగిరి వెధవా . నీకేంపోయే కాలమొచ్చిందిరా ? నీ చేతులిరగ , నీ కాళ్ళిరగ . . . . . . . . . .వెధవన్నర వెధవ . . . . . . . .

మా ఆయన ఆయన సెల్లూ నాకియ్యక పాయే . ఈ దొంగోడేమో ,ఆఫీస్ అల్మారాలోని 10000 ల రూపాయలు చాలవనట్లు సెల్లు ఎత్తుకుపోయే ! నేనేమి చేతును ?


దేవుడా దేవుడా , పొలీసాయన చెప్పాడు , సెల్ దొరికే చాన్స్ వుందని . దొరికేట్లు చేయి దేవుడా . నా సెల్ తో మా ఆయన సెట్టిల్ అయి పోకుండా , కనీసం కొత్త సెల్ కొనేట్లైనా చేయి , దేవుడా దేవుడా !

Sunday, November 29, 2009

అబ్బబ్బ పులుపు


ఈ చెట్టేమిటో , దానికి వున్న బంతులాంటి కాయలేమిటో , గిర్రున తిరుగుతూ వూరిస్తున్నాయే , అని ఎవరూ సోచాయింపులో పడివుండరు . ఎందుకంటే చిన్నప్పుడు , ఇంటర్వెల్ బెల్ కొట్టగానే , స్కూల్ గేట్ దగ్గరికి పరుగులు పెట్టి , బండి మీది , వీటిని కొని , తింటూ , స్స్ , హా ఏం పులుపు అని , ఇలా గింగిరాలు కొట్టని వాళ్ళు మాకాలములోనైతే అరుదు . ఆ పులుపును తట్టుకోవటానికి , బండి తాత , కాస్త పంచాదార నో , ఉప్పో చల్లేవాడు కదూ ! గుర్తొచ్చాయా ? అవేనండి బాబు , వెలగకాయలు . చిన్నప్పుడు గుజ్జు అలా అలా తినేసేదానినే కాని , పెద్దయ్యాక , తినలేక , ఆబ్బబ్బ ఏం పులుపు అనుకుంటూ , ఎంచక్కా పచ్చడి చేసుకొని తినేస్తున్నా ! వేడి అన్నములో , నెయ్యేసుకొని కలుపుకొని తింటే అహా ఏమి రుచి అనుకొకుండా వుండ లేరు .

ఈ రోజు పోస్ట్ , ఆ పచ్చడి గురించే . వచ్చిన వాళ్ళకు చెప్పే పని లేదు . రాని వాళ్ళు నేర్చుకోండి . ఇదే కాకుండా , వెలగపండు తో ఇంకేమైనా చేయటము వచ్చినవాళ్ళు , రసిపీలు ఇటు ఇవ్వండి . నాకు చాలా అవసరము . ఎందుకంటే , మా అమ్మాయి వాళ్ళింట్లో బోలెడు కాస్తున్నాయి . ఎప్పుడూ ఒకటే పచ్చడి బోర్ కదా ! మీ పేరు చెప్పుకొని చేసుకొంటాను .

వెలగపండు గుజ్జు ,

పచ్చిమిరపకాయలు ( మీ ఇష్టమైనన్ని ) ,

కొతిమీర , ఒక కట్ట ,

పోపుకు ;

ఎండుమిరాకాయ ముక్కలు ఓ నాలుగు ,

సెనగపప్పు ఒక చెంచాడు .

మినప పప్పు ఒక చెంచాడు ,

ఆవాలు ,

జీలకర్ర ,

ఇంగువ ,

కాసిని మెంతులు ,

పల్లీ నూనె ,

నాలుగైదు చెంచాల పంచదార , కాయ పులుపును బట్టి , లేదా సరిపడా బెల్లమైన పరవాలేదు .

కాచి చల్లార్చిన నీళ్ళు .

ముందుగా వెలగపండుకు గుజ్జుకు సరిపడ నూనె , ( మూడు , నాలుగు చెంచాలు ) వేడి చేసుకోవాలి . అందులో కొన్ని మెంతులు వేసి , ఎరుపు రంగు వచ్చేదాక వేయించాలి . తరువాత ,ఎండు మిరపకాయలు వేయాలి . అవి కొంచం వేగాక , మిగితా పోపుసామునులు వేసి , వేగాక దింపేముందు ఇంగువ వేయాలి . ఆ పోపుకు పచ్చిమిరపకాయలు , కొతిమీర కలిపి , నూరుకోవాలి . ఆ పై వెలగపండు గుజ్జును వేసి , గట్టిగా వుంటే , కాచి చల్లార్చుకున్న నీటిని కొద్దిగా కలిపి నూరుకోవాలి . చివరగా పంచదార కాని , బెల్లము కాని వేసుకొని కలిపేయాలి . అంతే , పచ్చడి సిద్దం !

Saturday, November 28, 2009

ఈ రోజు ఏమీ కొనకూడదుట !

సావిత్రి గారూ ,

పిలిచారాండీ .

అవునండి , పిల్లలు పకోడీ లు చేయమంటున్నారు . కాసిని చేయండి .

పకోడిలాండీ ?

అవునండి .

ఉల్లిపాయ ఒకటే వుందండి . సూపర్ మార్కెట్ నుండి తేనాండీ ?

వద్దులెండి . ఆలుగడ్డ బజ్జీలు చేయండి .

బజ్జీలాండీ ?

అవునండి .

ఆలుగడ్డలై పోయాయికదండి .

అదేమిటి ? మొన్ననే రెండు కిలోలు తెచ్చాము కదండి .

మరి వేయించేసాను కదండీ . సూపర్ మార్కెట్ నుండి తేనాండీ ?

పోనీ బ్రెడ్ లేదా ?

రెండురోజులైంది కదండీ . . పాడైపోయింది . సూపర్ మార్కెట్ నుండి తేనాండీ ?

అమ్మా . . .

ఏమిటిరా ?

అవేమి వద్దుకాని , కొంచం చింతకాయ పచ్చడి పోపేయమను , అన్నం తినేస్తాను .

విన్నారుగదండి .

చింతకాయ పచ్చడి పోపాండీ ?

అవునండి .

అయితే పల్లీ నూనే తెచ్చుకోవాలండి . సూపర్ మార్కెట్ నుండి తెచ్చేదాండీ ?

అబ్బా సావిత్రి గారూ ,ఎంత తెచ్చినా , ప్రతిరోజూ , సూపర్ మార్కెట్ లో వో కాలు వంటింట్లో ఓకాలు పెడుతారు . ఈ రోజు ఏమీ కొనకూడని రోజుట . పొద్దున పేపర్ లో చదివాను . ప్రపంచమంతా పాటిస్తారుట . కనీసం ఈ వొక్క రోజైనా సూపర్ మార్కెట్ కి వెళ్ళకుండా వుండండి .

అలాగాండీ ? మరైతే ఇప్పుడేం చేయమంటారు ?

మీరు బజారు కెళ్ళకుండా వుండండి , అంతే చాలు . కాసిని ఉసిరికాయలు కోసుకురండి . ఏదైనా చేద్దాము .

ఉసిరికాయలాండీ ?

అవునండి , వాటికేమొచ్చింది ?

ఆ గుంట వెధవలు కోసుకెళ్ళారుగండీ ?

ఏ గుంటవెధవలండీ బాబు ?

ఏమో నండీ , నేనక్కడ కూచొని బాబాగారి పుస్తకం చదువుకుంటున్నానండీ , ఇద్దరు గుంట వెధవలు గోడ దూకి వచ్చి ఉసిరికాయలు కోసుకున్నారండీ .

మీరు చూస్తూవూరుకున్నారా ?

ఎందుకూరుకుంటానండీ ? అరిచి వెళ్ళగొట్టానుగదండీ ?

మరైతే ఉసిరికాయలు ఏమైనాయండి ?

ఆఫీస్ గుంటలు కోసుకున్నారు కదండీ ?

మరి పొద్దున కొన్ని గుత్తులు చూసిన గుర్తే ?

అవాండీ ? అవి పని గుంటలు కోసుకున్నారండీ . మరిప్పుడే చేయమంటారండీ ?

మనకు కొనే రోజులు , కొనగూడని రోజులు , ఇంట్లోవి , ఏవీ కుదరవుకానీండి , ఇదో పైసలు , ఏదో కొనుక్కొచ్చి , మీ ఇష్టమైంది చేయండి ఒక్క రోజైనా మీరెళ్ళక పోతే ఆ సూపర్ మార్కెట్ వాడు దివాలా తీస్తాడు . వెళ్ళండి ఇక నాబుర్ర తినకండి ! ! ! !
సరేనండి !

Thursday, November 26, 2009

రామయ్య ( ఎవ్వరి మాట వినడు - ఎవ్వరికీ భయపడడు )

ఎదురింటి గోపాలరావు గారింట్లో పని చేసేవాడు , అయన వద్దని పంపించేసారు , మనింట్లో వుండమని పిలిచాను అంటూ మా వారు రామయ్యను , మా మామగారికి పరిచయము చేయగానే , ఆయన , ఈ ముసలోడేం పని చేస్తాడురా ? నెలకు 50 రూపాయలు దండగ , ఏం వద్దు పంపించేయ్ అన్నారు . కాని మా వారు వినలే , నేనిస్తానులే , కాస్త అన్నం పెట్టి , 50 రుపాయలిస్తె , ఇంటికి కాపలాగా మెట్లకింద వుంటాడు అని వాదించారు . పెద్దోడు చెపుతున్నాడు వుండనీయ రాదయ్యా అంటూ మా అత్తగారి సపోర్ట్ తో మా ఇంట్లో చేరాడు రామయ్య . ఇక అప్పటి నుండి ఇంటికే కాదు , ఇంటి మనుషులకు కూడా కాపలాదారైనాడు .

మా మామిడిచెట్టు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు సంవత్సరానికి ఒకటో , రెండో కాయలు కాసేది కాని , ఆకులు మాత్రము చెట్టునిండా ,గుబురుగా నవనవ లాడుతూ వుండేవి . మా వీధి లో పండగలకి , పబ్బాలకి మామిడాకులు , కొబ్బరాకులూ మా ఇంటినుండి తీసుకెళ్ళేవారు . మా రామయ్య వచ్చాక అదంతా బంద్ ! అరిచిఘీ పెట్టినా ఒక్కటంటే ఒక్క ఆకు కూడా ఇచ్చేవాడు కాదు .మా మామగారరిచినా , నీమ్మకు నీరెత్తినట్లు , దున్నపోతుమీద వానజల్లు పడ్డట్టు వుండేవాడు !

బయటి వాళ్ళకు సరే , ఇంట్లో వాళ్ళకు కూడా , ఏ ఆకు , పూవు ఏది ముట్టుకోవటానికి వీలులేదు . రామయ్య ఇస్తేనే , కొబ్బరికాయైనా , నిమ్మకాయైనా , పూవైనా చివరికి కరివేపాకైనా ! ఇంతకు ముందు ఇంటికెవరైనా వస్తే , వారికి బొట్టుపెట్టి , కొబ్బరికాయ ఇచ్చేవారు , మా అత్తగారు . రామయ్య హయాం వచ్చాక , రామయ్యకు , వచ్చినవారి ముఖారవిందం నచ్చి ఇస్తేనే ఇవ్వటము అలవాటు చేసుకున్నారు ఆవిడ . మా ఆడపడుచులు వచ్చినప్పుడు , రామయ్యా , ఆడపిల్లగాళ్ళు వచ్చారు , కొబ్బరికాయలు తే అని , మా అత్తగారు ఎంత పిలిచినా వినిపించుకునేవాడు కాదు . అన్ని స్టోర్ రూం లో ఎక్కడో దాచేసేవాడు . తనకు ,సబ్బు పైసలు అవసరమైనప్పుడు మాత్రము ,ఓ రెండు కొబ్బరికాయలు , ఓ రెండు నిమ్మకాయలు , కాస్త కరివేపాకు , సంచీ లో వేసుకెళ్ళి , వాళ్ళకిచ్చి , రెండు రూపాయలు తెచ్చుకునేవాడు ! మాకవసరమై ఎంత అడిగినా నిమ్మకు . . . . . దున్నపోతు . . . . . . . . రామయ్య దయ , మా ప్రాప్తం ! బయట అమ్ముకునేవాడా అంటే అదేం లేదు . తన ఇష్టప్రకారము మా కిచ్చేవాడన్నమాట .


పొద్దున లేచినప్పటినుండి , మా మామగారికి , రామయ్యకు ఏదోవక దాని మీద గొడవలే ! ఇద్దరూ మీద పడి కొట్టుకుంటారా అన్నట్లుండేవి . అలా ఇద్దరూ కాసేపు అరుచుకొని , బజారుకు బయిలుదేరేవారు . రామయ్య ఒక సంచీ పట్టుకొని , రామ భక్త హనుమాన్ లా ఆయన వెనుక వెళ్ళే వాడు . ఎంతైనా ఆయనకు నమ్మిన బంటు . మా అత్తగారికి , మామగారికి చాలానే సేవ చేసేవాడు .

మా ఇంటి ముందుకు కు , అసలు మా గేట్ దరిదాపులకు ఎవరూ వచ్చేందుకు వీలు లేదు . పిల్లల తో ఆడుకోవటానికి ఎవరైనా వస్తే , పక్కింటికి వెళ్ళమని పంపించేసేవాడు . ఒకసారి మా అబ్బాయి ఫ్రెండ్ , చదువుకోవటానికి వస్తాడని ఎదురుచూస్తూ వున్నాడు . ఆ అబ్బాయి రాలేదు . ఏమైందా అనుకున్నాడు మా వాడు . మరునాడు స్కూల్ కి వెళ్ళాక తెలిసింది , అతను వచ్చాడట. కాని మా ఇంటికి రావొద్దు , పక్కింటికెళ్ళు అని వెళ్ళ గొట్టాడట . మా వాడు ఒకటే ఏడుపు , వాడు ఒల్డ్ సిటీ నుండి వచ్చాడమ్మా . ఎవరొచ్చినా పక్కింటికి వెళ్ళమని పంపిచేస్తాడు అని . మావారు , రామయ్య ను పిలిచి కోపం చేసారు . అబ్బే నిమ్మకు . . . . . .దున్నపోతు . . . . .


ఇంతేనా ? ఒకసారి మావారికే తగిలింది ఆ దెబ్బ , ఆయన ఫ్రెండ్ , వాళ్ళ అమ్మాయిపెళ్ళికి పిలవటానికి రాత్రి 11 గంటలకి వచ్చారు .నాలుగు రోజులలో కుదిరిందిట . సమయము ఎక్కువ లేదు అందుకని వాళ్ళ దురదృష్టము ఆ టైం లో వచ్చారు . యధావిధి , మా రామయ్య గేట్ తీయనని , వాళ్ళను పక్కింటికెళ్ళమని పంపించేసాడు . ఆ తరువాత కథ ఎందుకులెండి .


మా గేట్ ఎట్టి పరిస్తితులలోనైనా , రాత్రి 10 గంటల కల్లా మూయాల్సిందే . తాళం పడాల్సిందే ! మా ఇంటికి ఎవరైనా వచ్చి 10 తరువాత వుంటే వచ్చి వాళ్ళనే , మీకేం పనిలేదా ? ఇంకెంతసేపుంటారు వెళ్ళండి అనేసేవాడు . అంత మాట అనిపించుకున్నాక ఎవరైనా ఎందుకుంటారు ? పక్కనుంచి మావారు అరుస్తున్నా సరే నిమ్మకు . . . . . . దున్నపోతు . . . . . . .


మా అమ్మాయి కి ఎదురింట్లోనే ఇద్దరమ్మాయి లు ఫ్రెండ్స్ వుండేవారు . ముగ్గురూ , రాత్రి చదువుకోవటము అయ్యాక మా ఇంటిముందు కూర్చొని కబుర్లాడుకునేవారు . మామూలుగానే , మా ఇంటిదగ్గరెందుకు పక్కింటికెళ్ళండి అని పంపేసాడు . వాళ్ళూ సరేనని ఎదురింటి గేట్ ముందు కూర్చున్నారు . 10 కాగానే సంజమ్మా వస్తున్నావా అని అరిచి , పిలిచాడు . పాపం తను రావటము 5 నిమిషాలు ఆలస్యం చేసింది . అంతే గేట్ తాళం పడిపోయింది . ఏంచేస్తుంది ? గేట్ తీయడు , అందుకని గోడ దూకి వచ్చింది . ఇహ చూస్కోండి నువ్వు ఆడపిల్లవి కాదా ? అట్లా గోడ దూకుతావా అని క్లాస్ పీకాడు . మా అబ్బాయి రామయ్య కళ్ళ పడకుండా గోడదూకి , రామాఫలం చెట్టెక్కి , బాల్కనీ లోకి దూకేవాడు . రామయ్య పుణ్యమా అని మా పిల్లలకు గోడలు దూకటము , చెట్లెక్కటమూ బాగా వచ్చింది !

మా అమ్మాయి పెళ్ళై తను వెళ్ళిపోయాక , మావారు కూడ ఎక్కువ టూర్స్ లలో వుండేవారు , ఇల్లంతా ఖాళీనే కదా అని మా అబ్బాయి ఫ్రెండ్స్ రాత్రుళ్ళు మా ఇంటికే వచ్చి , చదువుకునేవారు . మా ఇంట్లోకి నాలుగు మోటర్ సైకిళ్ళు రావటానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు మా రామయ్య . అదీనూ రాత్రి 10 లోపలే రావాలి . పాపం పిల్లలు నలుగురైదుగురు ఒక్కొక్కదానిమీద వచ్చేవారు . ఎప్పుడైనా ఎవరికైనా ఆలస్యమై , గోడ దూకి వచ్చారో , వాళ్ళ నడ్డి విరిగిందే ! వాళ్ళ అమ్మలు మాత్రము మీఇంటికి వస్తే మాకు బెంగ లేదండి , మీ రామయ్య ఎటూ కదలనివ్వడుగా అని సంతోష పడిపోయేవారు .


నేను పార్లర్ కి వెళ్ళిన కొద్దిసేపటికే , పార్లర్ కొచ్చేసేవాడు . ఏమిటి అంటే , ఇంటికి చుట్టాలొచ్చారు , చాయ్ పెడుదువు పదా అని , నేను బయిలుదేరేదాకా అక్కడే బెల్ కొడుతూ కూర్చునేవాడు . ఇక నా క్లైంట్సేమో నేను చేసుత్తున్న ఐబ్రో నో , ఫేషియలో మద్యలో వదిలేసి పోతానేమో నని తెగ భయపడి పోయేవారు . ఆ తరువాత పార్లర్ చుట్టుపక్కల రామయ్య కనిపిస్తే రావటమే మానేసారు .ఇలా కనీసము రోజుకు ఐదారు సార్లన్నా ఇంటికి తీసుకెళ్ళేవాడు . సాయంకాలము గేట్ దగ్గరికి రాగానే ఒక రుపాయివ్వు , సబ్బు తెచ్చుకోవాలే అనేవాడు . నాకు వళ్ళు మండి ,నా దగ్గరలేవు అంటే , పొద్దటిసంది గిరాకి రాలే అని దబాయించేవాడు . నువ్వు నన్నెక్కడ పని చేసుకోనిచ్చావు ? ఇన్ని సార్లు తీసుకొచ్చావు అని నేను ఉక్రోశ పడితే , నీతాన పనిచేసే పిల్లలేం చేస్తున్నారు ? అని తిరిగి దబాయింపు ! ఇంటికి ఇంత దగ్గరగా పార్లర్ వద్దు , కొంచము దూరము వుండాలి అని మావారు చెపితే వినకుండా , ఇంటికి దగ్గరైతే ఇంటినీ , పిల్లలనూ చూసోకొవచ్చని , ఇంటిదగ్గరగా పార్లర్ పెట్టుకున్నందుకు నన్ను నేను తిట్టుకుంటూ రూపాయి సబ్బు కోసం సమర్పించుకునేదాన్ని . నాకు తెలుసు , మా పిల్లల లాగే మీకూ రోజూ సబ్బెందుకు అని అనుమానం వస్తోంది కదా ? సబ్బు అంటే , మా రామయ్య భాష లో సారాయి .

ఇంతేనా అంటే ఇంకా చాలా వున్నాయి చెప్పల్సినవి . కాని ఇంకా ఎందుకులెండి . ఇప్పటికే చాలా ఎక్కువైంది . మా మామగారు చనిపోయిన నెలకే రామయ్య కూడా చనిపోయాడు . అక్కడ కూడా వాళ్ళకు ( మా అత్తగారికి , మామగారికి ) సేవ చేయటానికే వెళ్ళాడు అని అందరూ అనుకోవటమే .

Tuesday, November 24, 2009

ఊర్వశి

లేడీస్ మీటింగ్ లో మిసెస్ . రైనా ఫేషియల్ గురించి చెప్పినప్పుడు తెగ నిద్దరొచ్చేసింది . మహా బోర్ కొట్టినా ఏదో మొహాన కాసిని చిరునవ్వులతికించుకొని , చాలా బాగా చెప్పావు అని మొహమాటం గా విష్ చేసి వచ్చేసానే కాని , ఆ చిరునవ్వులని 20 సంవత్సరాల పాటు అతికించుకోవలసి వస్తుందని , ఆ రోజున ఏమాత్రము ఊహించలేకపోయాను . ఆ తరువాత ఓ నాలుగు సంవత్సరాల కి , ఓ సూర్యోదయాన , మావారు , బేకార్ గా మాజాంగ్ , కార్డ్స్ ఆడుకుంటూ వుండక పోతే , మిసెస్ . బట్నాగర్ బ్యూటీ క్లాసెస్స్ తీసుకుంటోంది కదా చేరొచ్చుగా అని క్లాస్ పీకారు . అదేమిటో మా అమ్మ , మా ఆయన నేను ఎంజాయ్ చేయటము సహించలేరు ! మా అమ్మ , నాకు సెలవలు రాగానే అది నేర్చుకో , ఇది నేర్చుకో అని నెడుతూవుండేది . పెళ్ళైనాక ఆ డ్యూటీ మావారు తీసుకున్నారు . వాళ్ళను ఎదిరంచే సాహసము చేయలేక గొణుకుంటూ , సణుకుంటూ చేరేదానిని . వాళ్ళు దేనిలోనో ఓ దానిలో చేర్చేవరకే , ఆ తరువాత దాని అంతు చూసేదాక నాకు తోచదు . అప్పుడేమో నీకే పిచ్చి పడితే అదే అని తిడుతారు . నేనేం చేయను ? ప్రస్తుతము ,మావారు యానిమేషన్ కోర్స్ పేపర్లు పట్టుకొని కూర్చున్నారు . నేను చిక్కటము లేదు . విషయము పక్కదారి పట్టినట్లుంది ! ఇక అసలు దారికి వస్తే , ఏంచేయగలను ? మా వారి పోరు భరించలేక చేరి , ఆ కోర్స్ లో చివరివరకూ నిలిచినదానిని నేనొక్కదానినే ! అంతేనా ఆతరువాత ప్రతి రెండు సంవత్సరాలకి బాంబే వెళ్ళి కోర్స్ లు చేసాను . . బరోడా లో మా ఫ్రెండ్ ఉష , తన పార్లర్ లో చేరమంది . అప్పుడే యూనివర్సిటీ లో చైల్డ్ డెవలప్మెంట్ లో , పి . జి డిప్లమాలో సీట్ వచ్చింది . నేను , పార్లరా ? చదువా ? అని అటూ ఇటూ ఊగుతుంటే , మా ఇంకో ఫ్రెండ్ కల్పనా దీది , పార్లర్ లో ఎప్పుడైనా చేరవచ్చు . అంతేకాదు బ్యూటీషియన్స్ కి అవకాశాలు వున్నాలేకపోయినా , టీచర్లకి , గైనకాలజిస్ట్ లకి ఎప్పుడూ అవకాశాలు వుంటాయి , ముందు చదువుకో అని నెట్టింది . ముక్కున పెట్టుకొని చదువు పూర్తిచేసి , ఉష వాళ్ళ ఊర్వశి బ్యూటీపార్లర్ లోకి జంప్ చేసేసాను.అలాగ జంప్ చేసినదానిని దాని మీద మక్కువతో , హైదరాబాద్ వచ్చాక ,అదే పేరు తో ఊర్వశి బ్యూటీ పార్లర్ తెరిచేసాను . మా ఇంటికి దగ్గరలోనే ఒక చిన్న పోర్షన్ రెంట్ కి తీసుకొని , దానికి కావలసిన హంగులన్నీ సమకూర్చుకొని , ఆ ఇంటి ఓనర్ గారిని , ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి రమ్మని పిలవటానికి , మా వారితో కలిసి వెళ్ళాను . నన్ను మావారు పరిచయము చేయగానే , ఆ ఇంటావిడ సుకన్య నన్ను పైనుంచి , కిందిదాకా ఎగా దిగా చూసి , ఇంత మైల్డ్ గా వుంది , ఈమేమి పార్లర్ నడుపుతుంది అని పెదవి విరిచేసింది ! ఎంత ఉక్రోషం వచ్చేసిందో . ఇంటికి రాగానే , అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకొని , నేను పార్లర్ నడపలేనా ? ఇంత మాట అంటుందా ? అని ఆవేశ పడిపోయాను .ఇంత ఖర్చు పెట్టి , వెనుకకి పోలేను , అంతా దండగ కావలిసిందేనా ? అని తెగ మధన పడ్డాను . కానీయ్ చూద్దాం అనుకొని ముందడుగు వేసాను .ఆవిడనే , 15 సంవత్సరాల తరువాత పార్లర్ అమ్మేసి , కీస్ ఇద్దామని వెళితే , ఎందుకు మాలా పార్లర్ మూసేస్తున్నారు ? మీరు చాలా హోంలీ గా వుంటారని , బాగా చేస్తారని , మంచి పేరు వచ్చింది . రష్ కూడా బాగా వుంది కదా మూసేయకండి కంటిన్యూ చేయండి అంది !ముందుకు వేసిన అడుగు అలాగే ఎన్నెన్నో జ్ఞాపకాలను పోగుచేసుకుంటూ ముందు ముందుకు వెళ్ళింది . ఎంతో మంది అభిమానాన్ని సంపాదించి పెట్టింది . ఎందరికో ఉపాధిని కలిపించింది . మావారి పార్ట్నర్ చనిపోతే ఆయన భార్యకోసం , బంజారా హిల్ల్స్ లో ఊర్వశి బ్రాంచ్ ని తెరవటము మరిచిపోలేనిది . పలు కార్యక్రమాలకి ముఖ్య అథిది గా , కొన్నిటికి జడ్జ్ గా వెళ్ళటము మధురమైనవి .పార్లర్ కి వచ్చే పిల్లలతో చేరి నేనూ ఒక టీనేజ్ అమ్మాయినే అయిపోయాను . అంతేనా మౌనం గా వుండేదానిని వాగుడుకాయనయ్యాను ! నాకంటూ ఒక గుర్తింపును ఇచ్చింది నా " ఊర్వశి ".ఇంతకీ ఈ సోదంతా ఎందుకంటే నిన్న విజయవాడ , కనకదుర్గ గుడి లోంచి బయటకు వస్తుంటే " ఊర్వశీ ఆంటీ " అని పిలుపు వినిపించింది . నన్ననుకోలేదు . పార్లర్ మూసేసిన 12 సంవత్సరాల తరువాత నన్ను ఆపేరు తో పిలుస్తారని ఎలా అనుకుంటాను ? కాని నన్నే ! ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని ఆప్యాయం గా పలకరిస్తే ఎంత సంతోషం వేసిందో చెప్పలేను !జ్ఞాపకాలే మైమరుపు , జ్ఞాపకాలే మేలుకొలుపు .


జ్ఞాపకాలే నిట్టూర్పు , జ్ఞాపకాలే ఓదార్పు .Thursday, November 19, 2009

పుల్ల పుల్ల గా , తియ్య తియ్యగా , ఖారం ఖారంగాకార్తీకమాసము , నోములు , పూజలే కే కాదు ఉసిరి కాయలకు కూడా ప్రసిద్దే ! ఎక్కడ చూస్తే అక్కడ బళ్ళ ల మీద పచ్చ పచ్చని రాశులుగా నోరూరిస్తూ కనిపిస్తున్నాయి . ఇవి విటమిన్ సి పుష్కలంగా లభించే ఫలాలు . రోజూ ఉసిరికాయ తినేవారిలో ఎటువంటి అనారోగ్యానైనా తట్టుకోగల శక్తి వుంటుందంటారు . . చాలా వరకు చర్మ వ్యాదులని రూపుమాపుతుంది . జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది . చెప్పాలంటే ఇంకా చాలా చాలా గుణాలున్నాయి . అంతెందుకు , క్రమం తప్పక రోజూ ఉసిరికాయను ఏదో రూపములో తినేవారు 100 సంవత్సరాలైనా , ఆరొగ్యం గా జీవించవచ్చుట !

చిన్నప్పుడు ఉసిరికాయ తిని వెంటనే మంచి నీళ్ళు తాగే వాళ్ళము . మంచినీళ్ళు తాగగానే నోరు తియ్య తియ్య గా వుండేది . అదో సరదాగా వుండేది . ఇప్పుడేమో వాటి తో రకరకాలుగా చేసుకొని తినటము అలవాటైంది !

ఉసిరికాయలు రావటము మొదలు కాగానే గింజలు లేకుండా , పొడుగు ముక్కలుగా తరుక్కొని కొంచం నూనె లో మగ్గనిచ్చి ( అంటే ముక్కలలో కొద్దిగా నూనెవేసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలన్నమాట ) స్టవ్ మీదనుండి , దింపి , చల్లారక , కొద్దిగా మెంతిపిండి , ఉప్పు , ఖారం వేసుకొని , వేడి అన్నం లో నెయ్యితో కలుపుకొని తింటే స్ . స్. స్. ఉంటుందికదా , అలా అలా లొట్టలేయటమెందుకు ? వెంటనే చేసుకొని తినొచ్చుగా !

పెద్ద సైజు ఉసిరికాయలను నీడలో ఎండపెట్టి , పైపైన కొడితే , విచ్చుకుంటాయి . అప్పుడు , లోపలి గింజలను తీసేసి , పై తొక్కను మిక్సీ లో వేసి పొడి చేసుకొని , రోజూ ఉదయము పరగడుపున ఒక చెంచాడు తింటే చాలా మంచిది .

అలా పొడిని తినలేనివారు , పెద్ద ఉసిరికాయలను తురిమి , ఆ తురుములో సరిపడ ఉప్పును , పసుపును కలిపి వుంచుకొని రోజూ , బ్రేక్ ఫాస్ట్ తినేటప్పుడు , ఒక చిన్న చెంచాడు తింటేసరి .

అలా కూడా తినలేనప్పుడు , ఉసిరికాయ తురుములో ఉప్పు , పసుపు కలిపి మూడు రోజులుంచి , మూడో రోజు , కొద్దిగా మెంతిపిండి , పండుమిరపకాయల ముద్ద కలిపి వుంచుకోవాలి . ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు ఇంగువ పోపువేసుకొని తింటే బాగుంటుంది .

ఇవన్నీ ఆరోగ్యపరం గా చేసుకునేవి . ఇక అసలు , సిసలు ఉసిరి ఆవకాయ అంటే ,

ఉసిరికాయలు 1 కిలో ,

నువ్వులనూనె కాని పల్లీనూనెకాని ఉసిరికాయలు మునిగేంత ,

ఉప్పు 250 గ్రాములు ,

ఖారం 250 గ్రాములు ,

పసుపు చెంచాడు ,

మెంతిపిండి 100 గ్రాములు .

ఆవపిండి 100 గ్రాములు ,

ఇంగువ ,

,పోపులోకి .ఎండుమిరపకాయలు ,

2 నిమ్మకాయలు .

ఉసిరికాయలను శుభ్రంగా కడిగి , తడిలేకుండా తుడిచి , కాసేపు నీడలో ఆరబెట్టాలి . తరువాత వాటిని ప్రెషర్ పాన్ లో వేసి , అవి మునిగేంతగా నూనె పోసి ,స్టవ్ మీద పెట్టాలి . ఒక్క విజిల్ రాగానే దింపేయాలి . లేదా ఒక గిన్నె లో వేసి , ఉడికేవరకు మగ్గ పెట్టవచ్చు . వాటిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీయాలి . నూనెను , మూకుడు లోకి వంచుకోని , స్టవ్ మీద పెట్టి , ఇంగువ , కొన్ని మెంతులు , కొన్ని ఎండుమిరపకాయలు వేసి వేయించాలి . అవి వేగాక ఉసిరికాయలలోకి పోసేయాలి . ఆ నూనె వేడి తగ్గాక , ఉప్పు , పసుపు , మెంతిపొడి , ఆవపిండి , రెండునిమ్మకాయల రసము వేసి కలిపేయాలి . దానిని అలాగే, మూత పెట్టివుంచి , మరునాడు రుచి చూసుకొని , ఏవైనా తక్కువ అవుతే కలుపుకొని , జాడి లోకి తీసుకోవాలి . ఈ పచ్చడి ఒక నెలవరకు , రంగు , రుచి మారకుండా వుంటుంది . ఇందులో ఇచ్చిన కొలతలు సుమారుగా ఇచ్చినవి . ఎవరికి కావలసిన మార్పులు వారు చేసుకో వచ్చు . ఉప్పు తక్కువ కాకుండా వుంటే సరి . ఉప్పున్న ఊరగాయకి , అత్త చేతికింద కోడలికి తిరుగుండదు అని సామెత .

ఉసిరికాయ జాం ;

ఉసిరికాయ తురుము ; ఒక గ్లాసు ,

పంచదార ; రెండు గ్లాస్లు ,

నెయ్యి పావు గ్లాస్ ;

జీడి పప్పు , బాదాం , ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టమైనవి , మీకిష్టమైనన్ని .

మూకుడు లో నెయ్యి వేసి ,ఉసిరి తురుమును పచ్చివాసన పోయేదాకా వేయించాలి . వేగాక , అందులో పంచదార వేసి , సిం లో వుంచి , అడుగంటకుండా తిప్పుతూ వుండాలి . ముందుగానే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి పొడి చేసుకొని వుంచుకోవాలి . మూకుడులోని జాం దగ్గర పడుతుండగా ఈ డ్రై ఫ్రూట్స్ పొడిని వేయాలి . పంచదార తీగపాకం వచ్చేదాకా వుంచి , దింపేయాలి . చల్లారాక సీసాలోకి తీసి పెట్టుకోవాలి . తడి తగలకుండా వుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా వుంటుంది .

ఇది బ్రెడ్ లోకి , చపాతిలలోకి బాగుంతుంది . రోజూ పిల్లలకి పెడితే చాలా ఆరోగ్యకరం . మా పిల్లల చిన్నప్పుడు ఇది తప్పక చేసేదానిని .

పైన ఫొటోలో వున్నవి రాచ ( చిన్న ) ఉసిరి కాయలు . ఇవి సామాన్యముగా బజారులో దొరకవు . ఎక్కువగా ఇళ్ళలోనే కనిపిస్తాయి . రుచి కి చాలా పుల్లగా వుంటాయి . బాల్కనిలోనుండి తెంపుకొని వుట్టివే తినేస్తూ వుంటాము . కచ్చాపచ్చాగా దంచి పప్పులో వేస్తుంటాను . పుల్ల పుల్ల గా మామిడికాయ పప్పులాగా బాగుంటుంది .

పచ్చి మిరపకాయలు , కొత్తిమీర , పోపు వేసి పచ్చడి కూడా చేస్తాను .

ఇక మీ ఇష్టం , వీటిల్లో ఏదైనా చేసుకొని , లేదా అన్ని చేసుకొని పుల్ల పుల్లగా , తియ్య తియ్య గా , ఖారం ఖారం గా లాగించేయొచ్చు !


ఈ చిన్న ఉసిరికాయలను ఆవిరి పైన ఉడికించి ,కొబ్బరి పచ్చడిలా చేసుకుంటే అన్నం తోనే కాకుండా ఇడ్లీలు , దోసెల తో కూడా బాగుంటుంది అని , సత్య గారు , నా మొట్టికాయలకు వంటింటి చిట్కా పొస్ట్ లో కామెంట్స్ లో చెప్పారు . ఇక్కడ వుంటే బాగుంటుంది అని , ఇక్కడ కలిపాను . థాంక్ యు సత్యగారు .Tuesday, November 17, 2009

నోములు నోయరుగా , టెన్షన్ పడరుగా


ఓ అప్పుడెప్పుడో అంటే మొదటి ఫొటోలో మా వదినగారు వున్నారే అప్పుడన్నమాట నోముకొని , ఇదో రెండో ఫొటో లో వున్నారే ఇప్పుడు తీర్చుకుందామనుకున్నారన్నమాట. మరి ఆవిడ తో పాటు మాకూ టెన్షన్ వుంటుందా ? వుండదా ? అసలే , నా పెళ్ళైన కొత్తలో మా అత్తగారు , ఏదో వూరెళుతూ , ఆత్తగారి కళ్ళు గూట్లో వున్నాయనుకోవే కమలమ్మా అని చెప్పివెళ్ళారు . అప్పుడు నిజంగానే , మా అత్తగారు ఆవిడ కళ్ళు వంటింటి గూట్లో పెట్టి వెళ్ళారేమో నని తెగ వెతికా . నిజంగా నిజం . అంటే అత్తగారున్నపుడు ఎంత జాగ్రత్తగా పని చేస్తానో , ఆవిడ లేకపోయినా అంత జాగ్రత్తగానే పని చేసుకోవాలని అర్ధం అని తరువాత తెలిసిందనుకోండి .అది వేరే సంగతి . కాని ఇప్పుడు ఈ ఫొటోల వెనకాల జాగ్రత్తగా గమనిస్తే , మా అత్తగారిదో , మా మామగారి దో ఫొటో కనిపిస్తుంది . అంటే నేను సరిగ్గా చేస్తున్నానాలేదా అని గమనిస్తునే వున్నరన్నమాట !

మా వదినగారు , ఫోన్ చేసి పలానా రోజు నీకు వీలవుతుందా ? అని అడుగగానే ఆ ఫోన్ కోసమే ఎదురుచూస్తున్న నేను , ఎందుకు వీలు కాదండి ? వీలవుతుంది . నేనేమి చేయాలో చెప్పండి అన్నాను . నువ్వేమి చేయొద్దమ్మా , మీ సావిత్రి తో 20 మందికి వంట వండించు.. ఆమె లేక పోతే కాటరింగ్ కి ఇద్దాము అన్నారు . కాటరింగ్ వద్దండి , సావిత్రి వండుతుంది . ఏమైనా నైవేద్యాలు ప్రత్యేకం గా చేయించాలా ? అని అడిగా . పూర్ణాలు , పులిహోరా , వక కూర , పప్పు , వాయినానికి 16 కుడుములు చాలు అన్నారు . ఓస్ అంతేకదా చేయిస్తాను . మరి ముతైదువులని పిలవాలికదా , వాయినాల కోసం చేటలు చేయించాలికదా ? అని అడిగాను . అవన్నీ నేను చేసుకుంటానులే అన్నారు .సరే అన్నాను .

సావిత్రి తో పలాన రోజున మావదినగారు 20 మందిని తీసుకొని వస్తున్నారు . మీరు ఎక్కడికీ వెళ్ళొద్దు . ఇంట్లోనే వుండాలి అన్నాను

ఆ రోజాండీ అంటూ ఆమె మొదలుపెట్టగానే నా బి . పి రయ్ మంది .ఏం ?

"మరేం లేదండీ ఆ రోజు మా కజిన్ వూరు నుండి వస్తానంది . తను నాకు డబ్బులివ్వాలి . ఆ రోజు కలవక పోతే వాళ్ళ వూరు అనంతపూరు వెళ్ళాల్సి వుంటుంది . "

"ఎంతివ్వాలి ? "

"300 . పరవాలెదు లెండి వుంటాను లెండి ."

అమ్మయ్య బతికించారు అనుకునేంతలో శారద , అమ్మా రేపు మా అమ్మ కాకినాడ వెళుదామంటోంది . మా కొత్త ఇల్లు గృహప్రవేశం చేస్తుందిట . అంది . అంతే నా బి. పి రయ్ .. . . రయ్ . . . రయ్

మీ ఇద్దరిలో ఎవరైనా ఇల్లు కదిలారో కాళ్ళిరక్కొడుతాను . అన్నానే కాని వీళ్ళు ఏలేబర్ యూనియన్ వాళ్ళకో ఫోన్ చేయరుకదా ? వాళ్ళొచ్చి నన్ను జైల్లో వేయరుకదా అనే డౌట్ ! ! అంతలోనే ఆ వీళ్ళకంత ధైర్యం ఎక్కడేడిచిందిలే అని నా ధైర్యం ! వాళ్ళకు నా టెన్షన్ సంగతి తెలుసుగా , కాకపోయినా నా మొహం చూసి కనిపెట్టే వుంటారు .మీరు టెన్షన్ పడకండి మేమెక్కడికీ పోము అని హామీ ఇచ్చారు . ఆ ఏడుపు ముందే ఏడవచ్చుగా ? అమ్మయ్య ఈ ఎపిసోడ్ అయ్యింది .

మా వదినగారు ఏమి చేయొద్దు , అన్ని నేనే తెచ్చుకుంటాను అన్నంతమాత్రాన ఎలా వదిలేస్తాను ? అసలే నాకు అన్నిటికీ టెన్షన్ ఎక్కువ. ఏరొజైనా టెన్షన్ పడే విషయము లేకపోతే ఏ టెన్షన్ లేదే అని టెన్షన్ పడతానని , మా వారు , పిల్లలు వెక్కిరిస్తూవుంటారు . అలాంటిది ఇంతటి బృహత్కార్యం నా భుజాలమీద వుంటే ఇక చెప్పేది ఏం వుంది . అనుకున్నాక మూడు రోజులలోనే ఓ ప్పది సార్లు మా వదినగారికి ఫోన్ చేసివుంటాను . ఇక ముందు రోజు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను . ఈ పిల్ల కి నేరక పోయి చెప్పానురా దేవుడా అనుకున్నారో ఏమో పాపం ఆవిడకి జొరం వచ్చేసి , రాత్రి ఫోన్ చేసి రేపు నోము చేసుకోగలనంటవా మాలా అని అడిగారు . అంతే నా బి . పి రయ్ . . . రయ్ . . . .రయ్ . . . . . రయ్ . . . .

కాస్త ధైర్యం తెచ్చుకొని , పరవాలేదండి నోచుకోగలరు అంతా నిర్విఘ్నం గా జరిగి పోతుంది అని ఆవిడకి ధైర్యం చెప్పాను .

ఏ పండగ పబ్బం ఐనా ఇల్లు కడగటము నాకు అలవాటు . కాని ఈ ఇంట్లోకి వచ్చినప్పుడే మా అబ్బాయి చెప్పాడు , ఇక్కడ కడగటాలు పెట్టుకోకు , మొత్తం మూడంతస్తుల నీళ్ళు , మొదటంతస్తులోకి వస్తాయి , అన్ని ఎత్తి పోయాలి అని . ఏం చేస్తాను ? అందుకే బాల్కనీ , మెట్లు కడిగించి , ఇంటి ముందు ముగ్గేసి వూరుకుంటున్నాను . ఇప్పుడూ అదేపని చేసాను . అమ్మవారు పంపినట్లు పూలవాడు , బంతిపూలు తెచ్చాడు . బంతిపూలు , చామంతులు , గులాబీ లు కొన్నాను . బంతిపూలదండ కట్టి గుమ్మానికి కట్టాను . మామిడాకులు కూడా వుంటే బాగుండేది . పండగ రోజులలో ఐతే బజారులో అమ్ముతారు . మా పక్కింట్లో చెట్టు వుంది కాని , వాళ్ళ పనివాడికి , మా సావిత్రికి పోట్లాట వచ్చినప్పటినుండి వాడు కోసుకోనివ్వటము లేదు . దానికి కూడా టెన్షన్ ఎందుకమ్మా నేను తెస్తాను అని మా అమ్మాయి వాళ్ళింటినుండి తెచ్చింది .

ముందంతా ఇంత టెన్షన్ పడ్డానా ? అసలు సమయం వచ్చేసరికి అంతా చాలా బాగా జరిగింది . ఆ రోజు సావిత్రి మంచి మూడ్ లో , వంట చాలా బాగా చేసిందని అంతా మెచ్చుకున్నారు . లలితసహస్రనామాలు అందరూ కలసి చదువుతుంటే ఇల్లంతా పులకించి పోయినట్లనిపించింది . పొద్దుటినుండి సాయంకాలము 5 గంటల వరకు అందరు ముతైదువులు ఇల్లంతా తిరుగుతూ వుంటే , ఆ కార్యక్రమం అంతా కన్నులపండుగ గా వుండింది .

ముత్తైదువలకేనా , బాలలకు తాంబూలం ఇచ్చారు . ఇంతేనా ? ఐతే నాకేదీ అంటూ . మా మరిదిగారి మనవడు మిహిర్ అడిగాడు . అవునుకదూ , మరి అప్పుడు అక్కడ వున్న మా కుటుంబ పెద్ద , మా మొగ దిక్కు వాడే కదా ! తప్పుతుందా వాడికి , వాడి తో పాటు మిగితా మొగపిల్లలకి తాంబూలము తో పాటు 100 రూపాయలు దక్షిణ .

ఇంత పుణ్య కార్యము మా ఇంట్లో జరుపుకొని , మాకింత మంచి అనుభూతిని కలిగించినందుకు థాంక్ యు వదినగారు .


హరిణీ ,
ఫొటోలు తీసి ఇచ్చినందుకు థాంక్ యు . వాటి కోసం నిన్ను టెన్షన్ పెట్టాను కదూ ! హి హి హి

Sunday, November 15, 2009

చంక లో పిల్లను చూసుకుంటు

ఏడెనిమిదేళ్ళ క్రితం అనుకుంటా వరంగల్ వెళ్ళినప్పుడు , మావారిని పోరు బెట్టి వేయిస్తంబాలగుడి కి తీసుకెళ్ళాను. మా చిన్నప్పుడు , వేయిస్తంబాలగుడి ఎదురుగా వుండేవాళ్ళము . రోజూ , గుడి కెళ్ళి ఆడుకునేవాళ్ళము . అక్కడ తెల్ల రంగులో ,పాము పడగ ఆకారములో కింద చిన్న శివలింగము తో వున్న , చిన్ని , సువాసనలు వెదజల్లే పూల చెట్టు వుండేది . ఆ పూలు చాలా ముద్దుగా వుండేవి . ఆ తరువాత ఆ పూలు మళ్ళీ నేనెక్కడా చూడలేదు . ఆ పూలు చూడాలనే కోరిక తో , ఆ గుడికి వెళ్ళాను .కాని గుడి మంటపము ముందు వుండే ఆ పూపొద లేదు . అక్కడ ఎవరిని అడిగినా తెలీదన్నారు . సరే ఏంచేస్తాం అనుకుంటూ లోపలికి వెళ్ళగానే చమక్ మంటూ ఆవాహన నవల గుర్తుకు వచ్చింది . పూల జాడ తెలీలేదు , కనీసము నవలైనా చదువుదాము అనుకున్నాను .

హైదరాబాద్ రాగానే మొదట చేసిన పని ఆర్కే లైబ్రరి కి వెళ్ళి ఆవాహన నవల కోసం అడగటము , అక్కడ లేదని పించుకోవటము . అక్కడి నుండి ఆవహన కోసం వేట మొదలు పెట్టాను . ఎన్ని లైబ్రరీ లు తిరిగానో , ఎన్ని షాప్స్ లలో అడిగానో !

కొంచం ఆగండి , నెయ్యిగిన్నె తెచ్చుకొని , మిగితాది మొదలు పెడుతాను . ఇక నేను చెప్పేది వింటే ఎంత మంది , ఎన్ని మొట్టికాయలు మొడుతారో , బొప్పి కట్టకుండా చూసుకోవాలిగా !


ముదిగొండ శివప్రసాద్ గారి పెద్దమ్మాయి సుష్మ మా అమ్మాయి సంజు కు , ఇంజనీరింగ్ లో క్లాస్మేట్ , చాలా మంచి ఫ్రెండ్ . దాదాపు మా ఇంటి అమ్మాయి లా వుండేది . మా అత్తగారికి తనంటే చాలా ఇష్టం . వాళ్ళ చదువు ఐపోతూనే సంజు పెళ్ళై యు. యస్ వెళ్ళింది . ఇక ఆ తరువాత సుష్మ ని నేను కలవలేదు . మరి నవల కోసం అడగాలంటే మొహమాటం వేసింది . ఆ తరువాత మేము వాళ్ళ ఇంటి దగ్గరే నాలుగు సంవత్సరాలున్నాము . రోజూ వాళ్ళింటి ముందునుండి వాకింగ్ కి వెళుతూ లోపలికి వెళ్ళి అడుగుదామా ? అని ఓ క్షణం అనుకునేదాన్ని ! ఉమగారు ( శ్రీమతి శివప్రసాద్ గారు ) కూడ పరిచయమే కదా , అడగచ్చుగా అనుకునే దాన్ని . కాని ఏదో బెరుకు . అలా మొహమాటము గా వాళ్ళ ఇల్లు చూసుకుంటూ , షాప్ లో అడుగుతూ , ( అన్నట్లు ఓ నాలుగు రోజుల క్రితం నెమలికన్ను మురళి గారిని కూడా అడిగాను ) ఆ బుక్ కోసం బెంగెట్టుకున్నాను .

నిన్న మా అమ్మ దగ్గరికి వెళుతూ , ఎందుకో సంజు తో ఇదే చెప్పాను . తను వెంటనే సుష్మ కి ఫోన్ చేసి , అమ్మకి , అంకుల్ రాసిన ఓ నవల కావాలట , అంకుల్ ఫ్రీగా వుంటే ఇంటికి వెళుతాము అంది . ఐతే సాయంకాలము రండి , అప్పుడైతే నేనూ వుంటాను అంది . అంతే సాయంకాలము నేనూ , జయ వాళ్ళ ఇంటికి వెళ్ళాము . సుష్మ నన్ను చూస్తూనే చాలా సంతోషించి , మాలా ఆంటీ మీరేమీ మారలేదు , 16 సంవత్సరాల క్రితం ఎలావున్నారో ఇప్పుడూ అలానే వున్నారు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది .

పప్పా , వీరు మా ఫ్రెండ్ సంజు వాళ్ళ అమ్మగారు , అని సుష్మ నన్ను ముదిగొండ శివప్రసాద్ గారికి పరిచయము చెయగానే , ఆయన నన్ను గుర్తు పట్టారు . మీరు బర్కత్పురా లో మేడ మీద వుండే వారు కదా ? మీ అమ్మాయి పెళ్ళికి మీరు బుట్ట బాగా అలంకరించారు . పెళ్ళి చాలాబాగా చేసారు నాకు గుర్తే అన్నారు .ఆయన జ్ఞాపక శక్తికి ఆశ్చర్య పోయాను . ఉమ గారు ఈమధ్య లలితాసహస్రనామాలని ఇంగ్లిష్ లోకి అనువాదము చేసారట . ఆ పుస్తకము చూపించారు . ఆ పుస్తకము రాయటము మొదలు పెట్టగానే దేశం లోని అన్ని అమ్మవారి దేవాలాయాలని సందర్షించారట . అనుకోకుండా ఎక్కడేక్కడో వున్న అమ్మవారి దేవాలయాలని దర్షించుకున్నాను అన్నారు .

ఆవాహన సినిమాగా తీయటానికి మాటలు అవుతున్నాయట . ఈ మధ్యనే 500 కాపీలు ప్రింట్ చేయించాను . అని తెచ్చి ఇచ్చారు . దానిని చాలా అపురూపముగా అందుకున్నాను . ఇంకా శ్రీపదార్చన , ఇది అన్నమయ్య సినిమాకు మూలకథ అట , ఇచ్చారు . పఠాభి అని ఇంకో పుస్తకం చూపించారు . శ్రీలేఖ ప్రింటింగ్ లో వుందని చెప్పారు . అది కూడా మంచి నవల అని విన్నాను . చదవలేదు . అందుకే అది వచ్చాక చెప్పమని సుష్మ కి చెప్పి , శివప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపి వచ్చాను .

చంకలో పిల్లను చూసుకుంటూ వూరంతా ఎనిమిది సంవత్సరాలు వెతుక్కున్నాను .

ఠపా . . . . ఠప్ . . .అబ్బా

Friday, November 13, 2009

మా అమ్మానాన్నలుఈ ఫొటో మా నాన్నగారి చిన్నప్పటిది . బహుషా అప్పుడు ఆయనకి ఐదారుసంవత్సరాలు వుండవచ్చు. మా తాతగారి దూరపు బందువు ఒకరు , మా బామ్మగారి తో , "వదినా , బాబుకు ( మా నాన్నగారిని బాబు అనే పిలిచేవారు .) నగలన్నీ వేసి తయారు చేసి ఇవ్వు , ఫొటో తీయిస్తాను " అన్నాడట. ఆవిడ నగలు వేసి చక్కగా ముస్తాబు చేసి వెంట పంపారట . ఆయన ఫొటో మటుకు తీయించి , నగలు తీసేసుకొని , రోడ్ మీద వదిలేసి చక్కా పోయాడట. అప్పట్లో మా తాతగారు , విజయవాడ టు నందిగామ ప్రైవేట్ బస్సులు నడిపించేవారట . విజయవాడనుండి వస్తున్న ఓ బస్ డ్రైవర్ , రోడ్ మీద ఏడుస్తున్న మా నాన్నగారిని చూసి , అరే ఓనర్ గారి అబ్బాయిలా వున్నాడే అనుకొని బస్ ఆపి , నాన్నగారిని ఎక్కించుకొని , తీసుకొచ్చి ఇంట్లో వొప్పచెప్పారట !


మానాన్నగారు , చిన్నప్పుడే పరిస్తితులవలన , చదువు కొరకు , నల్లగొండ లో హాస్టల్ లో చేరారట. ఇక అప్పటి నుండి నాన్నగారి ఒంటరి పోరాటం మొదలయ్యింది . అప్పుడే పరిచయం అయ్యారు , అన్నమాచారి మామయ్య గారు . ఆయనే మా నాన్నగారి ఆత్మీయుడు , ఆప్తుడు , సహోదరుడు అన్నీనూ . ఇద్దరు కలిసే చదువుకున్నారు .. ఒకేసారి , 17 సంవత్సరాలకే , రాయచూర్లో తుంగభద్ర ప్రాజెక్ట్ లో సూపర్ వైజర్ గా చేరారు . పెళ్ళి కూడా ఇద్దరికీ ఇంచుమించు ఒకేసారి జరిగింది . చివరి వరకు ఒకే చోట కలిసేవున్నారు . బహుషా భగవంతుడు అలా ఓ ఆత్మీయుని తోడు ఇచ్చాడేమో ! కాని అదీ ఎక్కువ రోజులు వుంచలేదు . చారి మామయ్య గారిని ఆయన 50 వ సంవత్సరానికే తన దగ్గరికి తీసుకెళ్ళాడు . కాని మా కుటుంబాల మధ్య ఇప్పటికీ చెదరని ఆత్మీయతాబంధం అలానే వుంది . నా పెళ్ళి లో బావమరిది డ్యూటి , మా అమ్మాయి పెళ్ళిలో మేనమామ డ్యూటీ చేసింది వారి అబ్బాయిలు ఆనంద్ , విజయ్ లే .వారి అమ్మాయి సత్య , మేమూ ఒకే కుటుంబపు అక్క చెళ్ళెలలా వుంటాము . . ఇప్పటికీ వైదేహి అత్తయ్య , మా అమ్మా ఒకే ప్రాణం గా వుంటారు .మా నాన్నగారు స్వతహాగా చాలా తక్కువగా మాట్లాడేవారు . ఎపుడూ ఏదో ఆలోచనలో వుండేవారు . ఆయనకు అసలు కోరికలనేవి వున్నాయా అనిపించేది . మమ్మలిని ఎప్పుడూ కోపం చేసిన గుర్తు కూడా లేదు . ఒక యోగి లా వుండేవారు . నా పెళ్ళి తరువాత ఎప్పటికో నాకు నాన్నగారి తో చనువు ఏర్పడింది . మా వారితో మటుకు ఒక స్నేహితునిలా వుండే వారు . మామా అల్లుళ్ళు కలిసి సినిమాలకు వెళ్ళేవారు .ఇక అమ్మ విషయానికి వస్తే , కరణం గారి పెద్ద అమ్మాయిగారు . ఇంట్లో నుండి బయటకు కదలటాకి లేదు . మరి పుస్తకాలలో , సినిమాలలో చూపించే పల్లెటూరి పిల్లల సంబరాలు తనకేవీ తెలీదుట ! పైగా 11 సంవత్సరాలకే దొంగ పెళ్ళి ! అంటే ఏమీ లేదు , అమ్మ పెళ్ళప్పుడు , శారదా ఆక్ట్ అమలు లో ( పెద్దమనిషి కాని ఆడపిల్లకు పెళ్ళి చేయకూడదు అనే రూల్ ) వుండటము వలన విజయవాడలో ఓ సత్రములో దొంగతనముగా పెళ్ళిజరిపించారన్న మాట. అమ్మ , నాన్నగారి పెదమేనమామ కూతురు . అమ్మ లోకాన్ని చూసింది మాలతీ చందూర్ పుస్తకాలలో . చదువు అంటే చాలా ఇష్టము . ఇప్పటికీ ఏ వో గ్రంధాలు చదువుతునే వుంటుంది .


,

మా నాన్నగారికి చదువులో ఎప్పుడూ మొదటి రాంకే ఉండేది. చాలా తెలివైన వాళ్ళు.నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో చాలా ముఖ్యమైన దశలో అక్కడ ఇంజినీర్ గాపనిచేసారు. లంచగొండి తనమన్నది మా నాన్నగారికి తెలియదు. ఆ రోజుల్లో ఎంతోమంది ఇంజినీర్లు,హైదరాబాద్ లో స్తలం కొని ఇళ్ళు కట్టుకుంటు మానాన్నగారిని కూడా ఇక్కడ స్థలం తీసుకో మన్నారు. తను అక్కడ స్థలం కొనేస్థాయిలో లేనని అనేవారు. ఒక పెద్ద ఇంజినీర్ అయిఉండికూడా చివరి వరకు సొంతఇల్లు లేని ఇంజినీర్ ఆ రోజుల్లో ఒక్క మా నాన్నగారే. మా నాన్నగారుఅనుసరించే నీతినియమాలకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. తోటి వాళ్ళంతా ఎంతో గౌరవించేవారు. రిటైర్ అవ్వటానికి ముందుగా ఖమ్మంలో మాత్రం ఒక చిన్న ఇల్లుకట్టుకున్నారు. అందులో కూడా కాంట్రాక్టర్స్ మోసం చేసారు. అయినా ఎవ్వరినీ,ఏనాడు ఒక్క మాట కూడా పరుషంగా మాట్లాడి ఎరుగరు. రిటైర్ అయిన తరువాత కూడామా నాన్నగారు ఏనాడు ఊరికే కూర్చోలేదు. అంతవరకు తనకు పరిచయమే లేనిజ్యొతిష్య శాస్త్రాన్ని, స్వయంగా ఎన్నో గ్రంధాలు చదివి, ఎందరో పండితులనుకలిసి నేర్చుకున్నారు. పూర్తి పరిపక్వత పొందారు. అందరికి ఉచితంగాజ్యోతిష్యం చెప్పేవారు. ఎక్కడెక్కడినుంచో, ఎందరో ఒచ్చి మా నాన్నగారిదగ్గిర జ్యొతిష్యం చెప్పించుకునే వారు. ఏనాడు ఎవరి దగ్గిర ఒక్క పైసా కూడాతీసుకోలేదు. చివరికి ఎంత స్థాయికి ఎదిగారంటే, జ్యొతిష్య సమావేసాలకుఆహ్వానించే వారు. ఢిల్లీ లో అంతర్జాతీయ సమవేశాలకు కూడా అహ్వానించారు.ఎన్నో సన్మానాలు పొందారు. చక్కటి ఉపన్యాసాలు ఇచ్చే వారు. అప్పటి ఆ ఫొటోలేఇప్పడు మాకు మిగిలిన తీపిగుర్తులు.


మా అమ్మ కూడా ఎప్పుడూ మా నాన్నగారిని అనుసరించే ఉండేది. మా నాన్నగారికిఒచ్చే తక్కువ జీతం లోనే మా మామయ్యలకు చదువు చెప్పించారు. మా పెద్ద మామయ్యసంస్కృత పండితుడవ్వటానికి మూల కారణం మా అమ్మా, నాన్నగారే. మా అమ్మ తరువాతమా ఇంట్లో ఒక పెద్ద గ్రంధాలయాన్నే ఏర్పాటు చేసింది. మేము ముందుగా పుస్తకాలు చదివింది మా అమ్మ లైబ్రరీ లోనే. మా అమ్మకు చదువంటే చాలా ఇష్టం.చిన్నప్పుడు చదువుకోలేక పోయినందుకు ఎంతో బాధ పడేది. మా నాన్నగారు మాఅమ్మతోటి అప్పుడు మెట్రిక్ పరీక్ష రాయించారు కూడా. మా పెద్ద మామాయ్యవొచ్చినప్పుడల్ల, అమ్మ కి మామయ్యకి సాహిత్య గోష్టి జరిగేది. మా మామయ్య మాఇంట్లోని ఒక అల్మైరా నే బోర్డ్ గా చేసి ఎన్నింటినో మా అమ్మకి నేర్పించేవాడు. కళా పూర్ణోదయం వంటి గ్రంధాలను చదివింది. మా అమ్మ స్వయంగా రామాయణంకూడా రాసుకుంది. దానిగురించి నేను ఇప్పటికే మీకు పరిచయం చేసాను.మా నాన్న గారితోటి అప్పుడు రేడియో లో జరిగే సమష్యా పూరణం కార్యక్రమాలకిపద్యాలను వ్రాయించి పంపించేది. మా తల్లి దండ్రుల గురించి మేము ఎంతచెప్పినా అది తరగని సముద్రం. వారికి పిల్లలవటం మా పూర్వ జన్మ సుకృతం. మానాన్నగారిని తొందరగా కోల్పోవటం మా దురదృష్టం.

నేను కూడలి లో చేరిన కొత్తలో , ఒక బ్లాగ్ లో మీ తలితండ్రుల బాల్యము గురించి మీకు తెలుసా ? అన్న ఆర్టికల్ చదివాను . ఏ బ్లాగో గుర్తులేదు . ఈ రోజు మా నాన్నగారి జన్మదిన సంధర్భముగా ,అప్పుడు నాలో కలిగిన ఆలోచనలకు రూపమే మా ఈ మాల - జయ ల భావాల కలయిక .

Wednesday, November 11, 2009

పెళ్లి సందడి

మా స్నిగ్ధ కళ్యాణం నవంబర్ 4 న చాలా బాగా జరిగింది . అంత బాగా జరగాలి అంటే మామూలుగా కాదు , మీరంతా తలాఓ చెయ్యి వేయాలి వదినా అంటూ ఉష ఇదో ఇలా నన్ను కూలేసింది . ఇక చూసుకోండి అప్పటి నుండి మాకందరికీ పనులో పనులు . మరి చీరలు కొనాలా ? నాకే గాజులు కొన్నుకోవాలా ? నాకే . బ్లౌసులు కుట్టించుకోవాలా ? అవీ నాకే లేండి . ఏమిటో ఇన్ని పనులు . తలుచుకొని , తలుచుకొని , ఆలోచించి , ఆలోచించి అలిసిపోయి , అసలు ఏమీ కొనకుండా , వున్నవాటి తోనే సరిపెట్టుకున్నాను .

సరె నా సంగతికేమొచ్చెకాని , మా పిల్లల హడావిడి చూడాలి . ముందుగా యు. యస్ వెళ్ళిన మా పిల్ల జనాభా తిరిగొచ్చి , ఇక్కడ ఉద్యోగాలు చూసుకొని , హాయిగా అమ్మా నాన్నల నీడలో సెట్టిల్ అయ్యిన వాళ్ళ హడావిడే హడావిడి . ముందుగా వీళ్ళ కోసం అన్ని సిద్దం చేసుకోవాలి , ఆ తరువాత యు. యస్ లో వుండిపోయినవారికి , వీళ్ళ సందడి చూపించి ఏడిపించాలి . పాపం ఎంత సమయమూ సరిపోలేదు . దీని తో అమ్మాయిలకేమో ఆ టైలర్ ఒక్క బ్లౌజూ ఇవ్వలేదు . అబ్బాయిలకేమో ఏకుర్తా కొనాలో తేలలేదు ! ఏంచేస్తారు పాపం , కాస్త పెళ్ళి చూడటము , ఏ టేలర్ దగ్గరికో పరిగెత్తటము . ఇంకాస్త పెళ్ళి చూడటము షాపింగ్లకెళ్ళటము . అందులో అబ్బాయిలు తెచ్చుకున్నవి అమ్మాయిలకు నచ్చదు .పోనీ వెళ్ళితేవటాని కి వీరికి సమయం సరిపోదు . అమ్మాయి కట్టుకున్న చీర అబ్బాయికి బాగోదు . మళ్ళీ వెళ్ళి మార్చుకొచ్చుకోవాలిగా ? మధ్య లో పిల్లకాయలని తయారు చేయాలి . ఇలా తయారు చేయగానే అలా మాపేసుకుంటారు . సందులో సటాకు కలికి చిలకల కొలికి మాకు మేనత్త అంటూ పాటలు పాడి ఉషత్తను కుష్ చేయాలి .మరి , మెహందీ ఫంక్షన్ , గాజుల ఫంక్షన్ , వాళ్ళ పెదబావగారి షష్టిపూర్తి , వియ్యపురాలికి , మేనకోడలికి , కోడలికి మ్యారెజ్ ఆనివర్సరీ అంటూ బోలెడు కార్యక్రమాలు పెట్టిందికదా ! అత్తగారిని కుష్ చేసి అల్లుడిని ( కొత్త పెళ్ళికొడుకు ) భద్రం బీ కేర్ఫుల్ బ్రదరూ అని ఆటపట్టించగానే మామగారికి బెంగ , ఈ పిల్లల అల్లరికి కాబోయే అల్లుడు పారిపోతాడేమోనని .

పిల్లలూ ,పెద్దలూ అందరూ పెళ్ళిని చాలా ఎంజాయ్ చేసారు . అందరూ పెళ్ళిసంబరములోనే కాదు , పెళ్ళిపనులలో కూడా పాలుపంచుకున్నారు . ఇక్కడ కొంచం ప్రత్యేకముగా చెప్పుకోవలసినది , మా ఉష ఆడపడుచులగురించి . 4 వ తారీకు ఉదయము నాలుగున్నరకి ఎలా వున్నారో , మరునాడు ఉదయము నాలుగుగంటలకు కూడా అలాగే ఫ్రెష్ గా , ఎంత పనిచేసినా అలసట లేకుండా , చిరునవ్వుతో వున్నారు . అలా ఎలా వుండగలిగారో తెలియాలంటే ఇక్కడ చూడాలిసిందే !

7 వ తారీకున మా మరిదిగారి అబ్బాయి , గౌతం వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచి , మా కుటుంబసభ్యులను కొత్తపెళ్ళికొడుకు అభినయ్ కి పరిచయము చేసి ,ఉషత్త , శివాజి మామయ్యలకు కూల్ కపుల్ అని అవార్డ్ ఇచ్చి , గ్రూప్ ఫొటో దిగటము తో పెళ్ళిసందడి ముగించి , పెళ్ళికూతురు , పెళ్ళికొడుకులను వాళ్ళమానాన వాళ్ళను వదిలేసాము .

Tuesday, November 10, 2009

మొట్టికాయలకు వంటింటి చిట్కా

మా అమ్మాయి అట్లాంటా నుండి వచ్చినప్పుడు , అదితి కి మూడు సంవత్సరాలు , వీక్కీకి మూడునెలలు . తను వచ్చిన కొద్దిరోజులకే , ఇక్కడ జాబ్ దొరికింది . తను జాబ్ కి వెళితే పిల్లలని చూసుకోవటానికి నాకు సహాయముగా , బుజ్జి అని ఓ పనిపిల్లని పెట్టింది . మా అదితి బంగారు తల్లి చెప్పినమాట వినేది . విక్కీ తోనే నా కష్టాలన్ని . మూడునెలల పసి వెధవ అప్పుడే నీ మాట ఏమి వినలేదు అనవద్దు . అప్పుడే వాడికన్ని ,, బుడుగ్గాడి బుద్దులు వచ్చేసాయి . గుండులా వుండే వాడు . నేను ఎత్తుకోలేక పోయేద్దాన్ని .అయినా ఎత్తుకోవటమెందుకని మంచము మీద పడుకోపెట్టేద్దాన్ని . చాప మీద పడుకో పెడదామంటే మా చుటికి ( పప్పీ ) జుట్టు వాడిమీద పడుతుందని భయ్యం ! ఎపుడూ , నేనో , బుజ్జి నో వాడిదగ్గరే వుండే వాళ్ళము . అయినా కొన్నిసార్లు తప్పదు కదా ! ఏదో పని మీద మేమున్న ఆ క్షణమే ,ధఢా మని మంచం మీదినుండి పడిపోయేవాడు . అదేమిటో దిండు అడ్డం పెట్టినా , దాని మీదనుండి కూడ ఢమ్మాల్ ! పడి ఇదో ఇలా చిద్విలాసము గా నవ్వుతుండేవాడు ! అదేమిటో ఇప్పటికీ అంతే ,ధడా , ధడా పడిపోతూవుంటాడు . కాని అస్సలు ఏడవడు . ఏడ్చాడు అంటే చాలా ఇబ్బంది కలిగిందన్నమాట . సరే ఇక అప్పటి ముచ్చటకొస్తే , వాడి నెత్తిన వెంట్రుకలూ తక్కువే . దానితో , వాడు పడగానే , నెత్తిన బుస బుస పొంగుతూ ,బుడిపెలు వచ్చేసేవి . రాత్రి 10 గంటలకు , మా సంజు రాగానే వాడినెత్తుకొని , తల నిమిరేది . పాపం ఆపేక్షగానే . అంతే బొడిపలు చేతికి తగిలేవి ! నన్నేమి అన్లేక కళ్ళనుండి బొట , బొటా కన్నీళ్ళు కార్చేది . అంతే మావారు రంగం లోకి దూకి , నన్నూ , బుజ్జినీ చెడా మడా దులిపేసేవారు ! మరి ఆయన వాళ్ళ అమ్మాయి కన్నీరు చూడలేరుకదా !

ప్రతిరోజూ , అర్ధరాత్రి ఈ మద్దెల దరువేమిటిరా భగవంతుడా అని నేను పెట్టుకున్న , నా మొర భగవంతుడు ఆలకించినట్లున్నాడు , ఓ ఆపత్భాంధవిని , మా చినత్తగారి రూపములో పంపాడు . కిందపడగానే దెబ్బ తగిలినచోట పేరు నెయ్యి రాయి , బొడిపకట్టదు అని ఓ చిట్కా చెప్పారు . అమ్మయ్య ఓ గిన్నెలో పేరు నెయ్యి ఎల్లప్పుడూ సిద్ధంగా వుంచుకొని , వాడు ధడామనగానే , గబ గబా తలంతా నెయ్యి రాసేద్దాని . ఆశ్చర్యం ! ఆ చిట్కా ఎంత బాగా పని చేసిందో ! కాక పోతే ప్రమాదం ఇంకో రూపం లో వచ్చింది . సంజు , రాగానే మామూలుగా ఎత్తుకొని , వాడి తల తడుముతే , ఒక్క టంటే ఒక్క బొడిప తగులుతే ఒట్టు . కాకపోతే " ఇదేమిటమ్మా వీడి దగ్గర నెయ్యి వాసన వొస్తోంది ? " అని హాచర్యపోయింది . నేనూ , బుజ్జీ కిమన్నాస్తి !

ఠపా ఠప్
అబ్బా . . . గురూజీ ఎందుకు మొట్టికాయలేస్తున్నారు ?
ఎంత సేపూ ఈ మనవ డూ , ఆ మనవడూ అంటూ మనవళ్ళ ముచ్చట్లేనా ? నేను చెప్పిందేమిటి ? ఓ లింక్ పంపాను చదివావా ?
మరేమో . . . మరీ . . . గురూజీ , ఇంట్లో పెళ్ళి హడావిడీ ... అదీ . . . . .
ఠఫా .. ఠప్
నేను ఇచ్చి ఎన్ని రోజులైంది . మరీ బద్ధకం ఎక్కువైపోతోంది .
( మా గురూజీ కి జ్ఞాపక శక్తి ఎక్కువే బాబూ , చాలా రోజుల క్రితమే ఇచ్చారు )
గురూజీ , మీరు మొట్టే మొట్టికాయలకు నా కెంత ఖర్చవుతోందా తెలుసా ? నెయ్యి కిలో 300 ల రూపాయలు , ఆ నెయ్యి వాసన పోవటానికి షాంపూ . అది ఓ చిన్న సీసా 300 ల రూపాయలు . నాకు రోజూ 600 ల రూపాయల ఖర్చు ! ఆ ఆ
అయితే చెప్పిన పని చేయి . మొట్టికాయలు తినకు .
సరే గురూజీ . చాలా బుద్దిగా తలూపాను. నా అంత బుద్దిమంతురాలైన శిష్యురాలు ఏ గురూజీకి దొరుకుతుంది ? అయినా మాగురూజీ అర్ధం చేసుకోరూ ! !
ఠపా . . . ఠప్ . . .
అబ్బా . . .మళ్ళీ ఏమిటి ? గురూజీ ?
పుస్తకం కోసం రాయమని చెప్పనా ? ఆ చెత్త టి. వి సీరియల్స్ చూడటం ఆపి , పని చూడు .
ఎంత మాట అన్నారు , గురూజీ . నేను చెత్త సీరియల్స్ చూస్తానా ? ఏదో రాత్రి ఒక్క లయ మాత్రమే చూస్తాను .అదీ ఏదో నా అభిమాన రచయిత్రి యద్దనపూడి నవల కాబట్టి . ఇది చాలా అన్యాయం , దారుణం వా ( ( (

ఏమిటి మాలాగారు , అంత ఏడుస్తున్నారు ? అని మిత్రులడిగారా ? ఏదో కష్టం , సుఖం మిత్రులకు కాక పోతే ఎవరికి చెప్పుకుంటాము ? అందులో ఒకరు కాదు ఇద్దరు కాదు , నలుగురడిగారు . చెప్పుకుంటున్నాను .పాపం మీకెంత బాధ వచ్చిందండి అని పరామర్శిస్తున్నారు . అదీ తప్పేనా ?
అంతే

ఠపా . . . . . ఠప్ . . . . .

Sunday, November 8, 2009

మంచిమాట

బహుషా నేను ఏత్ క్లాస్ చదువుతున్నప్పుడనుకుంటాను , మా అమ్మ ఒక నోట్ బుక్ ఇచ్చి , నువ్వు చదివిన పుస్తకము లోనుండి కాని , నువ్వు విన్నది కాని ఏదైనా ఒక మంచి మాట ఇందులో వ్రాయి . నువ్వు వ్రాసిన రోజు తారీకు వేయి .కనీసము వారానికి ఒక మంచి మాట ఇందులో వ్రాసి నాకు చూపించు , అని చెప్పింది . ఆ బుక్ కు మంచిమాట అని పేరు పెట్టింది . అప్పటినుంచి క్రమము తప్పకుండా ఏదో ఒక మంచి మాట వ్రాసి , ప్రతి వారము మా అమ్మకు చూపించి , అమ్మ సంతకము తీసుకునేదానిని . నాకు పెళ్ళైన తరువాత ఆ అలవాటు ఎప్పుడు పోయిందో గుర్తు లేదు .

ఇన్ని సంవత్సరాల తరువాత , ఈ రోజు 29 అక్టోబర్ ఆంద్రభూమి వీక్లీ లోని , కలిగినీడి దుర్గాదేవి , వ్రాసిన , మంచుశిల అనే కథ లోని ఈ పేరా చదవగానే రాసుకోవాలనిపించింది .

ప్రేమించి , పెద్దలను కాదనుకొని పెళ్ళి చేసుకున్న సౌమ్య , శ్రీకర్ ల మధ్య అసంతృప్తి మొదలవుతుంది . ఆ సంధర్భము లో వారి ఇంటి ఓనర్ , పార్వతమ్మ , సౌమ్య కి చెప్పిన మాట ఇది .
" ఒక చేతి వేళ్ళు కూడా ఒకేలా వుండవు .దాంపత్య మంటేనే ఇద్దరు విభిన్న వ్యక్తుల కలయిక .ఎవరికి ఎవరూ పూర్తిగా నచ్చరు . మనము ఎలా వుండాలనుకుంటామో అలా వుండరు . కొంత మనము సర్దుకు పోవాలి . మరికొంత మారాలి . అంతే కాదు అవతలి వ్యక్తి మారటము లేదూ అని ప్రతిక్షణం బాధ పడకూడదు .మన మనసుకు నచ్చే వ్యాపకాల తో సంతోషం గా గడపాలి . జీవితము చిన్నదమ్మా , దాన్ని బాధ తో తక్కువగా , ఆనందముతో ఎక్కువగా నింపాలి .అలా వుండగలిగితే శతృవుతో కూడా సంతృప్తిగా గడప వచ్చు . భర్తనగా ఎంత ? "

ఇది ఒక దంపతులకే కాదు , అందరికీ వర్తిస్తుంది అనిపించింది .

Friday, November 6, 2009

పదహారు కుడుముల తద్ది

పదహారు కుడుముల నోము బాద్రపదమాసములో , వినాయక చవితి రోజున కాని , బాద్రపదశుద్ధ తదియ నాడు కాని పట్టాలి . వీలైతే అదేరోజున కూడా ఉద్యాపన చేయవచ్చు. ఉద్యాపన తప్పకుండా పుట్టింటిలోనే చేయాలి . లేదా ఆఖర్చులు పుట్టింటి వారు పెట్టాలి . సామాన్యముగా అన్ని నోములు పుట్టినింటిలో అత్తింటివారి ఆద్వర్యము లో నే పడుతారు . ఉద్యాపన పుట్టింటిలోనే చేస్తారు , కాని వేరేవాటికి కన్న ఈ నోముకు మాత్రము పుట్టింటివారి భాద్యత తప్పనిసరి .

ఏనోము కైనా ఆ నోముకు ప్రత్యేకముగా చెప్పిన అమ్మవారినైతే తప్ప , మిగితావాటికి జగన్మాత ఐన గౌరిదేవిని పూజిస్తారు . పసుపు తో గౌరమ్మని చేసి , ఓ తమలపాకులో పెట్టి ,పూజ ప్రారంభించాలి . ముందుగా సంకల్పము చెప్పుకొని , గౌరీ దేవిని శోడషోపచారముల తో పూజించాలి . నేను ,అష్టోత్తర శతనామావళీయుక్త శ్రీనిత్యగౌరీపూజావిధానము అనే పుస్తకము లో వున్న పూజా పద్దతి ప్రకారము చేసుకుంటాను . పూజ తరువాత చేతిలో అక్షింతలు పట్టుకొని , నోము కథ చదువుకోవాలి . ఆ తరువాత ఆ అక్షింతలు , కొద్దిగా అమ్మవారిపై వేసి , కొన్ని మన నెత్తిన చల్లుకోవాలి . ఆ పై నోములో చెప్పిన విధముగా ముతైదువులకు వాయనమిచ్చి , పాదనమస్కారము చేసి , ఆశీర్వాదము పొందాలి . ఇది ఏనోముకైనను తప్పనిసరి .

పదహారుకుడుముల తద్ది కథ :

పార్వతీ పరమేశ్వరు లొకసారి భూలోక సంచారము చేస్తుండగా ఒకానొక అడవిలో , కంటికీ , మంటికీ ఏకధారగా ఏడుస్తున్న ఒక రాచకన్య కనిపించింది " .ఎడతెగని దరిద్రము వలన బాధ పడుతున్నానని " ఆ కన్య చెప్పగా విని , కరుణించిన గౌరీశంకరులు " అమ్మాయీ , గతములో నీవు పదహారుకుడుముల నోము పట్టి , ఉల్లంఘనము చేయటము వల్లనే నీకీ దరిద్రము సంభవించింది . వెంటనే యింటికి వెళ్ళి , ఆ నోమును యధోక్తముగా చేసుకున్నట్లైతే , సిరిసంపదలు కలిగి చిరకాలము సుఖించగలవు ." అని చెప్పిరి . అందుకారాచపడుచు వారికి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి చేరి , యధావిధిగా నోము పట్టి చేసుకొనెను . ఇట్లుండగా నోము నాడు , కుడుములు చేటలో పెట్టి , చల్లకి పొరిగింటికి పోగా , ఆమె వచ్చునంతలో ఓ కుక్క , అక్కడి కుడుములను తినివేసెను . అది గుర్తించిన ఆ రాచకన్య , తాను తెచ్చిన చల్లను కూడా ఆకుక్కకే పోసి , నమస్కరించగా , చల్ల త్రాగి , ఆ కుక్క గౌరిగా మారి , ఆమెకు అఖండ అయిశ్వర్యములను ఇచ్చెను .

విధానము : భాద్రపదశుద్దతదియ ( తెల్లవారితే వినాయకచవితి ) నాడు ఉదయమే తలంటుకొని , పదహారు బిళ్ళ కుడుములు ( బియ్యం పిండిలో తగినంత బెల్లము పొడిచేసి వేసి , కొద్ది గా నెయ్యి , కొద్ది గా ఇలాచీపొడి వేసి , బాగా కలపాలి . ఆ పిండిని పదహారు ఉండలుగా చేసి , ఒక్కో ఉండను కొద్దిగా వత్తి , బిళ్ళలాగా చేయాలి .) చేయాలి . రెండు కొత్త చేటలు తీసుకొని , వాటికి పసుపు రాసి , కుంకుమ బొట్టు పెట్టి , ఒక చాటలో పదహారు కుడుములు , పసుపు ,కుంకుమ , పెట్టి రెండో చాట తో ఆ చాటను కప్పి ,ఒక ముతైదువుకు వాయనమివ్వాలి .

ఉద్యాపన :

నోము పట్టిన రోజేకాని , లేదా ఏదైనా మంచిరోజున కాని ఉద్యాపన చేయాలి . ఆ రోజు పదహారుమంది ముతైదువులను ఆహ్వనించాలి . పదహారు జతల చేటలకు పసుపు , కుంకుమరాసి , వాట్లో ఒక్కొక్క బిళ్ళకుడుమును , పసుపు కుంకుమ ను , రెండు గాజులను , చీర జాకిట్టు బట్టను , నల్లపూసలను వుంచి ,ఒక చాటతో ఇంకోచాటను మూసి , తాంబూలములో పూలు, పండ్లు , ఒక రూపాయి కాయిను వుంచి సిద్దము చేసుకోవాలి . గౌరీదేవిని యధావిధిని పూజించి , ఒకచీర జాకెట్ బట్టనుఒక చేట జత లో వుంచి , సమర్పించి , రెండు బిళ్ళకుడుముల తో పాటు మహానివేదన చేయాలి . తరువాత ఒక్కో ముతైదువుకు , పసుపురాసి , కుంకుమ పెట్టి ,గంధము రాసి సిద్ధముగా వుంచుకున్న చేటలజత ,దక్షిణ తాంబూలాల తో ఇవ్వాలి .

కథ లోపమైనను , వ్రత లోపము కారాదు .

యాభై సంవత్సరాల క్రితము , మా అత్తగారు , మా వదినగారి తో నోమించిన , నోములు , ఈ నోము ఉద్యాపనతో అయిపోయాయని అనుకున్నాము ! ఈ నోము ఉద్యాపన కాగానే , అమ్మయ్య మా అత్తగారి బాధ్యత ను తీర్చాను అని నేను అనగానే , వదినగారు , ఇంకోటి , చిట్టి బొట్టు నోము వుందనుకుంటాను అని చిన్నగా వెళ్ళబెట్టారు ! ఈ రోజు ఉదయమే గుర్తొచ్చింది అన్నారు. ఐతే ఇంకా ఏమేమి వుండిపోయాయో గుర్తు తెచ్చుకోండి ,అన్నీ మాఘమాసం లో తీర్చేద్దాము అని చెప్పాను . కాబట్టి ఇప్పటికి నోముల సంగతులు ఐపోయాయి . మళ్ళీ మాఘమాసములో ,నాకు ఓపిక , మూడ్ వుంటే , మా వదినగారి మిగిలిపోయిన నోముల తో పాటు , నేను చేసుకున్న నోముల గురించి చెబుతాను .

మంగళం

సతతమూ ఆరోగ్య భాగ్యంబు నొసగెడి

శ్రీ గౌరిదేవికి జయ మంగళం

సర్వవిధ సౌభాగ్యములనిచ్చి బ్రోచెడి

శ్రీ గౌరిదేవికి జయ మంగళం

ఇంటా బయట హెచ్చు పసుపు కుంకుమ పండ

స్త్రీల చల్లగ జూచు మా గౌరిదేవికి జయ మంగళం

శక్తి కొలదైన భక్తి మెండుగ నున్న

అభయహస్తము జూపు అమ్మ శ్రీ గౌరికి

జయ మంగళం నిత్య శుభ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం .