Monday, November 30, 2009

వేంటాడే దొంగ గారు వచ్చారహో !

నేను దీర్ఘంగా ఆలోచిస్తుండగా ( ఇంటి పై కప్పు దేని తో వేయాలా అని కాదు , వెలగకాయ , స్లైడ్ షొ ఎలాచేయాలా అని ) , టింగ్ మంది . ఎవరా ? అని చూస్తే , జ్యోతి , మీకు ఆంద్రజ్యొతి చానల్ వస్తుందా అని అడుగుతున్నారు . చూస్తానుండండి , అని చూసి , ఆ వస్తోంది ఏమిటి విశేషం అని అడిగాను . . రేపు మద్యాహనము 1 .30 కి నా ప్రోగ్రాం వస్తుంది , వీడియో తీసిపెడతారా ? అన్నారు , అయ్యో మద్యాహ్నం నేను ఉండనే , ఇంకేటైం లోనూ రాదా అని అడిగా . వస్తుంది , రాత్రి 12.30 కి అన్నారు . సరే అయితే తీసేస్తాను ఎలా తీయాలో చెప్పండి అన్నా . సెల్ తో ఎలా తీయాలో చెప్పారు . మా అబ్బాయి రాగానే , మావారి సెల్ తో ఎలా తీయాలో నేర్చుకొని , కొంచం ప్రాక్టీస్ కూడా చేసేసాను .

స్వగతం ;

నా సెల్ ఎంత బాగుంది . చక్కగా ప్లాటినం రంగులో మెరిసి పోతూ , చేతిలో ఇమిడిపోయీ బుజ్జి కన్న ఎంత ముద్దొస్తుందో . మీ సెల్ చూడండి , ఎర్రగా నల్లగా రౌడీస్ లా వుంది . మీలాగే మీ సెల్ కూడా డిగ్నిఫైడ్ గా వుండాలా వద్దా ? ఆ రౌడీస్ ని నాకిచ్చేయండి . అని ఎంత అడిగినా , నేను రౌడీస్ , నా సెల్ రౌడీస్ నేనివ్వను పో అనేస్తారు మా శ్రీవారు . నా సెల్ తో ఫొటొస్ తీయలేనండి , ప్లీస్ ఇవ్వరూ అని ఎంత బతిమిలాడినా ససేమిరా అనేసారు . ఏం చేస్తాను ? ఆయన ఇంట్లో వున్నప్పుడే ఫొటోస్ తీసుకుంటూ తంటాలు పడుతున్నాను . దేవుడా , దేవుడా ఈ రెండు రోజులూ ఆయనను ఏ కాంప్ కి వెళ్ళకుండా చూడు . అవునూ నేను గురూజీ ప్రోగ్రాం వీడియో నా బ్లాగ్లో "గురుధక్షిణ " అని టైటిల్ పెట్టి , పోస్ట్ చేస్తే ! వావ్ , వాటే గ్రేట్ ఐడియా !

స్వగతం ఐపోయింది :

ఇహ నిద్ర పడితే ఒట్టు ! ఎలా రాయాలి ? , గురూజీకి కోపం రాకుండా , మొట్టికాయలు వేయకుండా , మెచ్చుకునేట్లుగా రాయాలి . అదిరిపోవాలి . రకరకాల భావాలు . మళ్ళీ మర్చి పోకుండా రాసేసుకుంటే ! లేచి టైం చూస్తే , 1.30 అయ్యింది . ఇప్పుడు లాప్ టాప్ తీసానంటే , మొన్ననే ఆయనగారు కోపం చేసారు , అర్ధరాత్రి , అపరాత్రి లేకుండా ఎప్పుడూ ఆ బ్లాగ్ ల లోకమే . ఇలా అర్దరాత్రి లాప్ టాప్ తీసావంటే దాన్ని అవతల పారేస్తా అని వార్నింగ్ ఇచ్చారు , ఇప్పుడు తీసానంటే అన్నంత పని చేస్తారు . మొదటికే మోసం వస్తుంది అని పరి పరి విధాల ఆలోచిస్తూ , ఎప్పుడు నిద్ర పోయానో తెలీదు .

సెల్ రింగవుతుంటే ఏమండీ లేచి చూస్తుంటే,అప్పుడే తెల్లారి పోయిందా ? సావిత్రి వచ్చేసిందా అనుకుకొని సావిత్రి వచ్చిందేమో తలుపు తీయండి అన్నాను.కాదు శ్రీధర్ ఫోన్ చేసి సార్ మా రూం తలుపు బయట నుంచి వేసి ఉంది అన్నాడు.గబగబా కింది కి వెళ్ళి చూసాము.వాళ్ళ రూం తలుపు వేసి ఉంది.ఆఫీస్ రూం తలుపు తీసి ఉంది.కింద ఏమండీ గారి జర్కిన్, బ్రీఫ్ కేస్ పడి ఉన్నాయి. ముందు అర్ధం కాలేదు కాని తరువాత తెలిసింది ఎన్నేళ్ళుగానో , తరతరాలు గా ఎదురుచూస్తున్న దొంగగారొచ్చారు.కాని పాపం పిచ్చి సన్నాసి ఏమీ దొరకక, ఆఫీస్ లో ఉన్న 10000 రూపాయాలు, ఏమండీగారి సెల్ ఎత్తుకుపోయాడు.ఆ. . . . . సెల్. . . . .

ఆక్రోశం ;

ఓరోరి దొంగ వెధవా ! నేను 1.30 దాకా మెలుకువ తోనే వున్నాను గదరా ? ఎప్పుడొచ్చావురా ? వచ్చేవాడివి ముందు చెప్పిరావద్దూ ? ఎన్నేళ్ళనుండి నీ కోసం ఎదురుచూస్తున్నాము . మూడు తరాలవాళ్ళు నిన్ను పిలుస్తున్నారే , ఆమాత్రం మర్యాద వుండక్కరలేదా ? ముందుగా తెలుస్తే నీకు మంగళహారతి తో స్వాగతం చెప్పేదానినే ! పోనీ వచ్చావే పో మా ఆయన సెల్ ఎత్తుకుపోవటమేమిటిరా ? పింజారీవెధవ . బాల్కనీ దూకి వెళ్ళేటప్పుడైనా , ఆయన జాకెట్ , బ్రీఫ్ కేస్ తో పాటు సెల్ కూడా జారవిడుస్తే బాగుండేది కదరా వెధవన్నర వెధవ . అసలు నన్నడుగుతే , బాబ్బాబు ఆ సెల్ వద్దురా , నా సెల్ తీసుకు పోరా అని ఇచ్చేదానిని కదరా కంత్రీ వెధవ . నీ ఫోటో కూడా బ్రహ్మానందం ఫోజు లో తీసి , ఈ నెట్ ఫోటో బదులు నీ ఫొటో నే పెట్టేదానిని కదరా తింగరి వెధవా . నా కలలన్ని కల్లలు చేసావు కదరా కంగిరి వెధవా . నీకేంపోయే కాలమొచ్చిందిరా ? నీ చేతులిరగ , నీ కాళ్ళిరగ . . . . . . . . . .వెధవన్నర వెధవ . . . . . . . .

మా ఆయన ఆయన సెల్లూ నాకియ్యక పాయే . ఈ దొంగోడేమో ,ఆఫీస్ అల్మారాలోని 10000 ల రూపాయలు చాలవనట్లు సెల్లు ఎత్తుకుపోయే ! నేనేమి చేతును ?


దేవుడా దేవుడా , పొలీసాయన చెప్పాడు , సెల్ దొరికే చాన్స్ వుందని . దొరికేట్లు చేయి దేవుడా . నా సెల్ తో మా ఆయన సెట్టిల్ అయి పోకుండా , కనీసం కొత్త సెల్ కొనేట్లైనా చేయి , దేవుడా దేవుడా !

22 comments:

Malakpet Rowdy said...

పొద్దున్నే అనుకుంటున్నా ఎవరు నన్ను తిట్టుకున్నారా అని, ఇప్పుడర్ధమయ్యింది స్టోరీ :))

అయినా ఇప్పుడు మీకు చాన్స్ దొరికిందిగా మీవారిని సాధించడానికి - "నేనడిగినప్పుడే ఆ సెల్ ఇచ్చుంటే ఆ దొంగ ఎత్తుకుపోయేవాడు కదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు, నాకో ఐ ఫోన్ కొనిపెట్టండి" అని :))

భావన said...

హ హ హ రౌడీ... నిన్నే అంటుంది మాల గారు..;-)
అయ్యో సెల్ దొంగోడు ఎత్తుకెళ్ళేడా...
స్వగతం: లేక పోతే నా కు వెలక్కాయ ఫోటో కొంచెం దగ్గర గా తియ్యమ్మా అంటే... హి హి హి బలే తిట్టేరు మాల గారు నాకు బాగా నచ్చేయి ’కంగిరి వెధవా ’ ఎప్పుడు వినలేదండి..

Anonymous said...

ఇంతకీ గురువుగారి వీడియో ఏమైనట్టూ? వున్నట్టా? లేనట్టా? పెసరట్టా? మినపట్టా? వారేం చేసినట్టూ.....? మీరేం చూసినట్టూ...? అన్నట్టూ......????

శ్రీలలిత said...

మాలాగారూ,
ఖంగారు పడకండి. నేను మూడు నిమిషాల్లొ జ్యోతిష్యం అనే పుస్తకం మీ కోసం ఇప్పుడే గబగబా చదివేసాను. మీ ప్రశ్న కి సమాధానం వచ్చేసింది. మీ వారి సెల్ ఫోన్ మరో మూడు నిమిషాలనుంచి మూడు నెలల లొపల తప్పక దొరుకుతుంది. అప్పుడు నా ఫీజు నాకు పంపించెయ్యండి. మనలో మన మాట.. ఇంకా ఎవరింట్లో నైనా ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు కావాలంటే నా పేరు రికమెండ్ చెయ్యండి. ఏదో ఒకరి కొకరం.. అంతే...

మురళి said...

పోనిలెండి.. దొరికేస్తుందని హామీ ఉంది కదా..
@శ్రీలలిత: జ్యోతిష్యం చెప్పించుకుని ఫీజు ఇస్తే ఇచ్చిన వాళ్ళకీ, పుచ్చుకున్న వాళ్ళకీ కూడా మంచిది కాదుటండీ.. నిన్ననే 'శకున ఫలితాలు' అనే పుస్తకం చదివాను.. అన్నట్టు మా చుట్టుపక్కల వాళ్ళందరికీ జ్యోతిష్యం సలహాలు కావాలిట :):)

పరిమళం said...

హ హ హ....
మాలాగారూ!సెల్ దొరికేస్తుందిలెండి.

సిరిసిరిమువ్వ said...

శీఘ్రమేవ మీవారి సెల్లు పునఃప్రాప్తిరస్తు!

సిరిసిరిమువ్వ said...

మరి మాకు ఉసిరికాయలు ఇవ్వకపోతే ఇలానే అవుద్ది మరి!!

మాలా కుమార్ said...

మలక్ పేట్ రౌడీ గారూ ,
ఇంత పెద్ద రౌడీ నంటారు కదా ? కొత్తది కొనుక్కోమని సలహాలివ్వకపోతే ఆ దొంగగాడిని పట్టుకొని , సెల్ ఇప్పించచ్చుకందండీ .
ఆ మొగుడిని సాధించటానికి కరాణాలే దొరకవా ఇదెందుకు ?

మాలా కుమార్ said...

భావనా ,
అసలే నేను దుఖం లో వుంటే ఈ నవ్వులేమిటి ? పోనీలే మీరీసారి వచ్చినప్పుడు వెలక్కాయ మజ్జిగ పులుసు చేసిపెడుతానులే .
కంగిరి వెధవా నేనూ ఎప్పుడూ వినలేదు . కాస్త వెరైటీగా వుంటుందని అలా తిట్టానన్నమాట . ఇంకా తిడుదామనుకున్నాను కాని ఓపిక లేక వదిలేసా !

మాలా కుమార్ said...

లలిత గారు ,
ఇంకేమట్టు ? మాడు మొహం అట్టే .

మాలా కుమార్ said...

శ్రీలలిత గారూ ,
చాలా థాంక్స్ అండి .మీరన్నట్లు ఒకరికొకరం , కాక పోతే మురళిగారు ఏదో చెబుతున్నారు వినండి .

మాలా కుమార్ said...

మురళి గారూ ,
పోలీసుల హామీని ఎంతవరకు నమ్మొచ్చంటారు ?

మాలా కుమార్ said...

ఫరిమళం గారూ ,
మీ నోటిచలవ వలన దొరికితే అదే పదివేలండి .

మాలా కుమార్ said...

సిరిసిరి మువ్వ గారు ,
నోటి తో దీవిస్తూ , నొసటి తో వెక్కిరించట మంటే ఇదేమరి .

శేఖర్ పెద్దగోపు said...

దొరికేస్తుంది లెండి...ఖరీదైన సెల్ ఫోన్లతో ఇదే బాధండీ...అదే ఏ అర్ధరూపాయి మోడల్ కొనుక్కున్నామనుకోండి...కొన్నాళ్ళు వాడినా పోయిన తర్వాత పెద్దగా భాధ ఉండదు...

జయ said...

చాల్లే, ఏదో జోక్ చెప్పినట్లు చెప్పేస్తున్నావ్. నిజంగానే దొంగతనం అయ్యిందని ఎవ్వరికి తెలియదు పాపం. చిన్న కుర్రాడు శేఖర్, ఓ ముసలమ్మ సావిత్రా, మీ ఇంటికి కాపలా! నా మాట విని ఒక వాచ్మాన్ ని పెట్టుకొండి. అదృష్టం కొద్దీ, ఆ దొంగ ఎవరి నెత్తి పగలగొట్టకుండా పారిపోయాడు. ఏమన్నా జరిగిఉంటే? ఆ దొంగ ఒచ్చిన వైపు తలుపు పూర్తిగా మూసేసి, లోపల తాళం వేయండి. కింద ఆఫీస్ తాళం పగలగొట్టి, అన్నీ తీరిగ్గా చక్కబెట్టాడు. ఆఫీస్ ఫైల్స్ ఏమన్నా అయిఉంటే? ఆ సావిత్రిని అక్కడికక్కడే ఏమన్నా చేసినా దిక్కులేదు. రాత్రి ఒంటిగంటకి లైట్ వేసి మరీ అన్ని చక్కబెట్టాడు. పైగా అదేటైం లో కిచన్ కి పోయి అరిటిపండు కూడా తినొచ్చావు. ఇప్పటికైనా ఎప్పుడూ కలవరించే దొంగ నిజంగానే పడ్డాడు అన్న విషయం గుర్తు పెట్టుకొని "సత్వర చర్యలు" తీసుకోండి. పోలీసులు చేసేదేమి లేదు.

శ్రీలలిత said...

మాలాగారూ, మురళిగారు చెప్పింది విన్నానండీ. ఆయనకి బదులు నేనిస్తా కాని మన ఒప్పందం మరిచిపొకండి.
@మురళిగారూ, ’శకున ఫలితాలు’ నేనూ చదివానండీ. ’శాస్త్రం ఏది చెప్పినా కఠినం గానే చెపుతుంది. దాన్ని మనం సౌమ్యం గానే తీసుకొవాలి’ మాయాబజార్ లొ డైలాగ్.
అందుకని శకునశాస్త్రం లో ఫీజు తీసుకొకూడదని అంటే డబ్బు రూపేణా పనికిరాదూ అని. వేరే విధంగా అంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం ఇత్యాది ఏదైనా పాపం వాళ్ళ సంతృప్తి కోసం తీసుకోక తప్పదు కదండీ. లేకపోతే బాధపడతారు చూడండీ..
అన్నట్టు మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ నా పేరు చెప్పడం మరిచిపోకండేం..

మాలా కుమార్ said...

శేఖర్ పెదగోపుగారు ,
ఆ సెల్ లేకపోతే నేను ఫొటోస్ తీయలేనండి . అదీ బాధ .

మాలా కుమార్ said...

జయా ,
నువ్వు పెద్దా ? నేను పెద్దా ? అలా అరుస్తావు .
మా సావిత్రి ముసలామెనా ? విన్నదంటే ఇంకేంలే !
కదా , నేను లైట్ వేస్తే మీ బావగారు , లేస్తారని , లైట్ వెయ్యకుండా చీకట్లో తడుముకుంటూ వంటింట్లో కి వెళ్ళేటప్పుడు , ఆ దొంగోడు నా చేతికి తగలకుండా బ్రహ్మానందం లా పక్కకి జరగటము తలుచుకుంటే చాలా థ్రిల్ గాను వుంది . నిజంగా అప్పుడున్నాడంటావా ?

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
మాఇంటి పక్కన విలన్స్ డెన్ వుందండి . పోనీలెండి ఎలాగో ధైర్యం తెచ్చుకొని , మా శ్రీధర్ తో కబురు చేస్తాలెండి . మీ ముచ్చట ఎందుకు కాదనాలి ?

Srujana Ramanujan said...

ee post ki Nenu comment pettalenu.
I can't believe this.
Nenu teevram gaa khandisthunnaanu.
aa dongathanaanni.

ayyayyo.petteshaane. thooch thooch.