Saturday, November 28, 2009

ఈ రోజు ఏమీ కొనకూడదుట !

సావిత్రి గారూ ,

పిలిచారాండీ .

అవునండి , పిల్లలు పకోడీ లు చేయమంటున్నారు . కాసిని చేయండి .

పకోడిలాండీ ?

అవునండి .

ఉల్లిపాయ ఒకటే వుందండి . సూపర్ మార్కెట్ నుండి తేనాండీ ?

వద్దులెండి . ఆలుగడ్డ బజ్జీలు చేయండి .

బజ్జీలాండీ ?

అవునండి .

ఆలుగడ్డలై పోయాయికదండి .

అదేమిటి ? మొన్ననే రెండు కిలోలు తెచ్చాము కదండి .

మరి వేయించేసాను కదండీ . సూపర్ మార్కెట్ నుండి తేనాండీ ?

పోనీ బ్రెడ్ లేదా ?

రెండురోజులైంది కదండీ . . పాడైపోయింది . సూపర్ మార్కెట్ నుండి తేనాండీ ?

అమ్మా . . .

ఏమిటిరా ?

అవేమి వద్దుకాని , కొంచం చింతకాయ పచ్చడి పోపేయమను , అన్నం తినేస్తాను .

విన్నారుగదండి .

చింతకాయ పచ్చడి పోపాండీ ?

అవునండి .

అయితే పల్లీ నూనే తెచ్చుకోవాలండి . సూపర్ మార్కెట్ నుండి తెచ్చేదాండీ ?

అబ్బా సావిత్రి గారూ ,ఎంత తెచ్చినా , ప్రతిరోజూ , సూపర్ మార్కెట్ లో వో కాలు వంటింట్లో ఓకాలు పెడుతారు . ఈ రోజు ఏమీ కొనకూడని రోజుట . పొద్దున పేపర్ లో చదివాను . ప్రపంచమంతా పాటిస్తారుట . కనీసం ఈ వొక్క రోజైనా సూపర్ మార్కెట్ కి వెళ్ళకుండా వుండండి .

అలాగాండీ ? మరైతే ఇప్పుడేం చేయమంటారు ?

మీరు బజారు కెళ్ళకుండా వుండండి , అంతే చాలు . కాసిని ఉసిరికాయలు కోసుకురండి . ఏదైనా చేద్దాము .

ఉసిరికాయలాండీ ?

అవునండి , వాటికేమొచ్చింది ?

ఆ గుంట వెధవలు కోసుకెళ్ళారుగండీ ?

ఏ గుంటవెధవలండీ బాబు ?

ఏమో నండీ , నేనక్కడ కూచొని బాబాగారి పుస్తకం చదువుకుంటున్నానండీ , ఇద్దరు గుంట వెధవలు గోడ దూకి వచ్చి ఉసిరికాయలు కోసుకున్నారండీ .

మీరు చూస్తూవూరుకున్నారా ?

ఎందుకూరుకుంటానండీ ? అరిచి వెళ్ళగొట్టానుగదండీ ?

మరైతే ఉసిరికాయలు ఏమైనాయండి ?

ఆఫీస్ గుంటలు కోసుకున్నారు కదండీ ?

మరి పొద్దున కొన్ని గుత్తులు చూసిన గుర్తే ?

అవాండీ ? అవి పని గుంటలు కోసుకున్నారండీ . మరిప్పుడే చేయమంటారండీ ?

మనకు కొనే రోజులు , కొనగూడని రోజులు , ఇంట్లోవి , ఏవీ కుదరవుకానీండి , ఇదో పైసలు , ఏదో కొనుక్కొచ్చి , మీ ఇష్టమైంది చేయండి ఒక్క రోజైనా మీరెళ్ళక పోతే ఆ సూపర్ మార్కెట్ వాడు దివాలా తీస్తాడు . వెళ్ళండి ఇక నాబుర్ర తినకండి ! ! ! !
సరేనండి !

8 comments:

భావన said...

బావుంది మాలా గారు. ప్రపంచమంతా శని వారం ఏమి కొనగూడని రోజా. బలె వుందే. మా ఇంట్లో సావిత్రి లేదు గా, నేను ఏమి కొననులే. ఐనా మనం ఏమి కొనక పోతే షాప్ వాడు ఏమై పోతాడండి మీరు మరీను. మాకైతే అసలే అమెరికా రెసిషన్ లో వుంది.:-(
నేను మీ వుసిరి కాయలమీద కన్నేసేను కాని మీ సావిత్రి చెప్పిన ఏ గుంటలలో నేను లేనండోయ్..

మురళి said...

నేనైతే ఏమీ కొనలేదండీ.. మా ఇంట్లో కూడా సావిత్రమ్మ గారు లేరు :):)

మాలా కుమార్ said...

అల్లరి గుంట భావననే కోసుకెళ్ళిందనుకున్నానే , కాదన్నమాట .

మాలా కుమార్ said...

మురళి గారు ,
మా సావిత్రిని 23 సంవత్సరాలనుండి , నేను భరిస్తున్నానంటే , వాళ్ళ అమ్మనే ఎప్పుడూ ఆశ్చర్యపోతూ వుంటుంది . ఆమె నన్ను వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు . కాబట్టి మీఎవరిదగ్గరా వుండివుండదు లెండి .

జయ said...

ఈరోజు ఏమీ కొనగూడదా? ఎందుకూ? ఇదేదో గమ్మత్తుగా ఉంది.

భావన said...

ఎక్కడమ్మా కోసుకుందామని మధ్యాన్నం పిట్ట గోడ చాటు గా చూస్తే ఆ కాయలు అప్పటికే ఆఫీస్ గుంట లు కోసుకెళ్ళి పోయారు, పైగా మీ రామయ్య అక్కడే కూర్చూని పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమని అదిలిస్తేను. వూరికే భావన గుంట అని ఆడి పోసుకుంటున్నారు.. హ్మ్మ్....

పరిమళం said...

:) :) నేనూ విన్నానండీ ...థాంక్స్ గివింగ్ డే మర్నాడు ఏమీ కొనరని కానీ పాటించడానికే ఇబ్బంది :)

మాలా కుమార్ said...

భావన గారు ,
మా రామయ్య పకింటికెళ్ళమన్నాడంటే నమ్ముతానులెండి , మీరు ఆ గుంటలలో లేరని .

అవునండి పరిమళం గారు , ఏదైతే వద్దంటారో దాని మీదే కదా ద్యాసంతాను .

జయ ,
నాకు కూడా నిన్న పేపర్ లో చదువుతేనే తెలిసింది , థాంక్స్ గివింగ్ రోజు చాలా ఎక్కువగా ఖర్చు చేస్తారట , దానికి నిరసనగా , అధిక ఖర్చులను అరికట్టటానికి , మరునాడు బై నథింగ్ డే చేస్తారుట.