Friday, November 6, 2009

పదహారు కుడుముల తద్ది

పదహారు కుడుముల నోము బాద్రపదమాసములో , వినాయక చవితి రోజున కాని , బాద్రపదశుద్ధ తదియ నాడు కాని పట్టాలి . వీలైతే అదేరోజున కూడా ఉద్యాపన చేయవచ్చు. ఉద్యాపన తప్పకుండా పుట్టింటిలోనే చేయాలి . లేదా ఆఖర్చులు పుట్టింటి వారు పెట్టాలి . సామాన్యముగా అన్ని నోములు పుట్టినింటిలో అత్తింటివారి ఆద్వర్యము లో నే పడుతారు . ఉద్యాపన పుట్టింటిలోనే చేస్తారు , కాని వేరేవాటికి కన్న ఈ నోముకు మాత్రము పుట్టింటివారి భాద్యత తప్పనిసరి .

ఏనోము కైనా ఆ నోముకు ప్రత్యేకముగా చెప్పిన అమ్మవారినైతే తప్ప , మిగితావాటికి జగన్మాత ఐన గౌరిదేవిని పూజిస్తారు . పసుపు తో గౌరమ్మని చేసి , ఓ తమలపాకులో పెట్టి ,పూజ ప్రారంభించాలి . ముందుగా సంకల్పము చెప్పుకొని , గౌరీ దేవిని శోడషోపచారముల తో పూజించాలి . నేను ,అష్టోత్తర శతనామావళీయుక్త శ్రీనిత్యగౌరీపూజావిధానము అనే పుస్తకము లో వున్న పూజా పద్దతి ప్రకారము చేసుకుంటాను . పూజ తరువాత చేతిలో అక్షింతలు పట్టుకొని , నోము కథ చదువుకోవాలి . ఆ తరువాత ఆ అక్షింతలు , కొద్దిగా అమ్మవారిపై వేసి , కొన్ని మన నెత్తిన చల్లుకోవాలి . ఆ పై నోములో చెప్పిన విధముగా ముతైదువులకు వాయనమిచ్చి , పాదనమస్కారము చేసి , ఆశీర్వాదము పొందాలి . ఇది ఏనోముకైనను తప్పనిసరి .

పదహారుకుడుముల తద్ది కథ :

పార్వతీ పరమేశ్వరు లొకసారి భూలోక సంచారము చేస్తుండగా ఒకానొక అడవిలో , కంటికీ , మంటికీ ఏకధారగా ఏడుస్తున్న ఒక రాచకన్య కనిపించింది " .ఎడతెగని దరిద్రము వలన బాధ పడుతున్నానని " ఆ కన్య చెప్పగా విని , కరుణించిన గౌరీశంకరులు " అమ్మాయీ , గతములో నీవు పదహారుకుడుముల నోము పట్టి , ఉల్లంఘనము చేయటము వల్లనే నీకీ దరిద్రము సంభవించింది . వెంటనే యింటికి వెళ్ళి , ఆ నోమును యధోక్తముగా చేసుకున్నట్లైతే , సిరిసంపదలు కలిగి చిరకాలము సుఖించగలవు ." అని చెప్పిరి . అందుకారాచపడుచు వారికి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి చేరి , యధావిధిగా నోము పట్టి చేసుకొనెను . ఇట్లుండగా నోము నాడు , కుడుములు చేటలో పెట్టి , చల్లకి పొరిగింటికి పోగా , ఆమె వచ్చునంతలో ఓ కుక్క , అక్కడి కుడుములను తినివేసెను . అది గుర్తించిన ఆ రాచకన్య , తాను తెచ్చిన చల్లను కూడా ఆకుక్కకే పోసి , నమస్కరించగా , చల్ల త్రాగి , ఆ కుక్క గౌరిగా మారి , ఆమెకు అఖండ అయిశ్వర్యములను ఇచ్చెను .

విధానము : భాద్రపదశుద్దతదియ ( తెల్లవారితే వినాయకచవితి ) నాడు ఉదయమే తలంటుకొని , పదహారు బిళ్ళ కుడుములు ( బియ్యం పిండిలో తగినంత బెల్లము పొడిచేసి వేసి , కొద్ది గా నెయ్యి , కొద్ది గా ఇలాచీపొడి వేసి , బాగా కలపాలి . ఆ పిండిని పదహారు ఉండలుగా చేసి , ఒక్కో ఉండను కొద్దిగా వత్తి , బిళ్ళలాగా చేయాలి .) చేయాలి . రెండు కొత్త చేటలు తీసుకొని , వాటికి పసుపు రాసి , కుంకుమ బొట్టు పెట్టి , ఒక చాటలో పదహారు కుడుములు , పసుపు ,కుంకుమ , పెట్టి రెండో చాట తో ఆ చాటను కప్పి ,ఒక ముతైదువుకు వాయనమివ్వాలి .

ఉద్యాపన :

నోము పట్టిన రోజేకాని , లేదా ఏదైనా మంచిరోజున కాని ఉద్యాపన చేయాలి . ఆ రోజు పదహారుమంది ముతైదువులను ఆహ్వనించాలి . పదహారు జతల చేటలకు పసుపు , కుంకుమరాసి , వాట్లో ఒక్కొక్క బిళ్ళకుడుమును , పసుపు కుంకుమ ను , రెండు గాజులను , చీర జాకిట్టు బట్టను , నల్లపూసలను వుంచి ,ఒక చాటతో ఇంకోచాటను మూసి , తాంబూలములో పూలు, పండ్లు , ఒక రూపాయి కాయిను వుంచి సిద్దము చేసుకోవాలి . గౌరీదేవిని యధావిధిని పూజించి , ఒకచీర జాకెట్ బట్టనుఒక చేట జత లో వుంచి , సమర్పించి , రెండు బిళ్ళకుడుముల తో పాటు మహానివేదన చేయాలి . తరువాత ఒక్కో ముతైదువుకు , పసుపురాసి , కుంకుమ పెట్టి ,గంధము రాసి సిద్ధముగా వుంచుకున్న చేటలజత ,దక్షిణ తాంబూలాల తో ఇవ్వాలి .

కథ లోపమైనను , వ్రత లోపము కారాదు .

యాభై సంవత్సరాల క్రితము , మా అత్తగారు , మా వదినగారి తో నోమించిన , నోములు , ఈ నోము ఉద్యాపనతో అయిపోయాయని అనుకున్నాము ! ఈ నోము ఉద్యాపన కాగానే , అమ్మయ్య మా అత్తగారి బాధ్యత ను తీర్చాను అని నేను అనగానే , వదినగారు , ఇంకోటి , చిట్టి బొట్టు నోము వుందనుకుంటాను అని చిన్నగా వెళ్ళబెట్టారు ! ఈ రోజు ఉదయమే గుర్తొచ్చింది అన్నారు. ఐతే ఇంకా ఏమేమి వుండిపోయాయో గుర్తు తెచ్చుకోండి ,అన్నీ మాఘమాసం లో తీర్చేద్దాము అని చెప్పాను . కాబట్టి ఇప్పటికి నోముల సంగతులు ఐపోయాయి . మళ్ళీ మాఘమాసములో ,నాకు ఓపిక , మూడ్ వుంటే , మా వదినగారి మిగిలిపోయిన నోముల తో పాటు , నేను చేసుకున్న నోముల గురించి చెబుతాను .

మంగళం

సతతమూ ఆరోగ్య భాగ్యంబు నొసగెడి

శ్రీ గౌరిదేవికి జయ మంగళం

సర్వవిధ సౌభాగ్యములనిచ్చి బ్రోచెడి

శ్రీ గౌరిదేవికి జయ మంగళం

ఇంటా బయట హెచ్చు పసుపు కుంకుమ పండ

స్త్రీల చల్లగ జూచు మా గౌరిదేవికి జయ మంగళం

శక్తి కొలదైన భక్తి మెండుగ నున్న

అభయహస్తము జూపు అమ్మ శ్రీ గౌరికి

జయ మంగళం నిత్య శుభ మంగళం

జయ మంగళం నిత్య శుభ మంగళం .

7 comments:

మైత్రేయి said...

.మా అమ్మ నాతొ ఈ నోము చేయించారండి.. చాల టెన్షన్ పడుతూ ఇది నా బాద్యత అమ్మా అంటూ .. గుర్తు చేసారు. థాంక్స్.

జయ said...

అబ్బా! అంత బాధ్యతగా, శ్రద్ధగా ఎవరు చేయగలరు. మొత్తానికి చాలా పెద్దరికమే చేపట్టావు. It is really great. అన్ని నోముల వివరములు ఇక్కడ చెప్పబడును అని, మీ ఇంటికొక బోర్డ్ పెట్టేస్తే సరి.

srujana said...

It is really great...

cartheek said...

excellent and great......

మాలా కుమార్ said...

srujana garu ,

cartheek garu ,

thank you

మాలా కుమార్ said...

మైత్రేయి గారు ,
మీరూ ఈ నోము చేసుకున్నారన్నమాట . తొందరగా తీర్చేయండి మరి .
థాంక్ యు .

మాలా కుమార్ said...

జయా ,
ఇప్పుడే టైం సరిపోవటము లేదు , ఇంకా బోర్డ్ కూడానా ? మాఘమాసం లో ఆలోచీస్తానులే !