Wednesday, February 27, 2013

తెలుగు వెలుగు లో నేను
పొద్దున్నే మావారు 'మాలా , మాలా' అంటూ గావుకేకలు పెట్టారు . ఏమైందా అని భయపడుతూ పరిగెత్తాను .

'నువ్వు పత్రిక లోకి ఎక్కావు ' అన్నారు .

ఒక్క క్షణం బుర్ర పనిచేయలేదు .' నేనా . . . పత్రిక లోకి ఎక్కటమా ????' అని తెగ హాచర్యపోయి , ఆ పైన నేనేమి చేసానురా భగవంతుడా అని భయపడుతూ 'ఏ పత్రిక లోకండి ?'అని అడిగాను .

ఇదిగో అని "మాలా కుమార్ " అని వున్నది చూపించారు .

 ఇదేమిటా అనుకున్నాను . 'ఓహో జ్యొతి గారు బ్లాగుల గురించి 'తెలుగు వెలుగు 'లో రాశానన్నారు . పేపర్ అతనిని పుస్తకం తెచ్చిపెట్టమంటే ఇంకా మార్కెట్ లోకి రాలేదమ్మా , వచ్చాక తెచ్చిస్తానన్నాడు . వచ్చినట్లుంది . ఐతే నా గురించి కూడా రాశారన్నమాట 'అని స్వగతంగా అనుకుంటూ , మావారి వైపు కాస్త గర్వంగా చూస్తూ పత్రిక తీసుకొని చూసాను .ఎంతైనా మన గురించి వుంది అంటే కాస్త గొప్పే కదా :)

మార్చ్ నెల ' తెలుగు వెలుగు ' లో తెలుగు బ్లాగుల గురించి , కొంతమంది మహిళా బ్లాగర్స్ గురించి జ్యొతిగారు వ్రాశారు . అందులో నాకూనూ కొద్దిగా ప్లేస్ ఇచ్చారు . అదీ సంగతి . ఏమి వ్రాసారంటే ఆ . . . నేనెందుకు చెపుతాను . మీరే పుస్తకం కొనుక్కొని చదవండి . లేదంటారూ ఇక్కడ చదవండి . అక్కడ చూసి వచ్చి ఇక్కడ మీరేమనుకున్నది చెప్పండి :)

థాంక్ యూ జ్యోతిగారు .

Monday, February 4, 2013

సినిమా చూద్దామా ? ఏ సినిమా చూద్దాం ?మా చిన్నప్పుడు 'ఆత్మబలం' అని ఓ సినిమా వచ్చింది . అందులో నాగేశ్వరరావు , బి.సరోజ 'చిటపట చినుకులు పడుతూవుంటే చెలికాడే సరసన వుంటే ' అనే పాటకు వానలో తడిసి ఓ చెట్టుకిందకు వెళుతారు . మా పెద్దవాళ్ళందరూ అమ్మో ఆత్మబలం లో వానలో తడిసిన సీన్ వుందిట పిల్లలను తీసుకెళ్ళకూడదు అని తెగ చెవులు కోరుక్కున్నారు .అలాగే 'ఆరాదన 'సినిమా వచ్చినప్పుడు ఆరాదన అంటే ఏదేవుడి కి ఆరాదనో అనుకున్నానండి .కాదు హీరో ని హీరోయిన్ ఆరాదిస్తుంది . ఏమి సినిమాలో ఏంపాడో అని మా పక్కింటి ఆవిడ మా అమ్మ తో చెప్పింది . నాకెలా తెలుసంటారా మనం చదువుకుంటున్నా రహస్యం గా ఓ చెవి పెద్దవాళ్ళ కబుర్లలోకి వెళ్ళిపోతుందికదా .నేను పెద్దయ్యాక కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడు ,ఆత్మబలం సుదర్షన్ లో మార్నింగ్ షో వచ్చింది . చిన్నప్పటి సంగతి గుర్తొచ్చి మా ఫ్రెండ్స్ అందరమూ పొలోమంటూ ఆ సినిమా చూడటానికి వెళ్ళాము . తీరా ఆ పాట సీన్ చూసాక హోరినీ దీనికా మన పెద్దవాళ్ళు మనం చూస్తే చెడిపోతామనుకున్నది అనుకొని తెగ నవ్వుకున్నాము :)

 చక్కటి కుటుంబకథా చిత్రాలు వచ్చేరోజులలో అవే మోస్ట్ రొమాంటిక్ సీన్లు . ఏ సినిమా చూసినా అమ్మానాన్న ,తాతయ్యా , బామ్మా , పిల్లలూ వున్న ఉమ్మడి కుటుంబ చిత్రాలే వుండేవి . వుమ్మడి కుటుంబాల లో వుండే ఇబ్బందులూ , లాభాలూ , కష్టాలూ , నష్టాలగురించి చెప్పేవారు . మంచి కుటుంబవ్యవస్త గురించి వుండేది .'కుటుంబగౌరవం ' 'మాంగల్యబలం' 'తోడికోడళ్ళు ' 'శాంతినివాసం' 'నిండుకుటుంబం' 'రాము ' 'భలెతమ్ముడు ' మొదలైనవి కొన్ని . మంచి కుటుంబ విలువలు వుండేవి . అన్నదమ్ముల మధ్య ఆస్తికోసం గొడవలు , తోటి కోడళ్ళ మధ్య , వదినా ఆడపడుచుల మధ్య అభిప్రాయ భేధాలు ఎంతగా చూపించేవారో అభిమానాలు అలాగే చూపించేవారు .పెద్దవదిన దగ్గర మరుదులూ , ఆడపడుచులూ గారాలు పోవటం , వదిన వారిని సమర్ధించటమూ చక్కగా వుండేది . ఇటువంటి పాత్రలకూ దేవిక పెట్టిందిపేరు . అలాగే ఆడపడుచు తల్లి వెనక చేరి కోడలిని సాధించటము కూడా ఇల్లాళ్ళు కన్నీళ్ళు పెట్టుకునేట్టుగా వుండేవి . తామాషాగా వుండేది :) సినిమాలు చూస్తుంటే మన ఇంట్లోనో ,పక్కింట్లోనో జరుగుతునట్లుగా వుండేవి . కుటుంబకథా చిత్రాలేకాదు , దేశభక్తి ప్రభోదించే 'వందేమాతరం 'లాంటి సినిమాలు , అప్పటి సామాజిక దురాచాలను ఖండించే 'కన్యాశుల్కం ,'వరకట్నం 'లాంటివి కూడా వున్నాయి . సినిమాలు , సాంఘికమే కాకుండా ' గండికోటరహస్యం ', 'బాలనాగమ్మ ' పాతాళభైరవి ' 'గులేబకావాళి కథ ' మొదలైన జానపదాలు , 'శ్రీకృష్ణ తులాభారం ','మాయాబజార్ ' 'ప్రమీలార్జునీయం ' లాంటి పౌరాణికాలు , 'పల్నాటి యుద్దం ', 'బొబ్బిలి యుద్దం' లాంటి చారిత్రిక సినిమాలూ, 'పట్టుకుంటేపదివేలు ', 'లక్షాధికారి ' లాంటి డిటెక్టివ్ సినిమాలు , 'ఆమె ఎవరు ' , 'అర్ధరాత్రి ' లాంటి భయపెట్టే దయ్యాల సినిమాలూ రకరకాలుగా వచ్చాయి . మిస్సమ్మ , తొడొకోడళ్ళు , గుండమ్మకథ , మాయాబజార్ , పాతాళ భైరవి , షావుకారు లాంటి పలు సినిమాలు ఇప్పుడు రిలీజైనా హౌస్ఫుల్ తో నడుస్తాయి .

 కాలేజ్ పిల్లలు ప్రేమించుకోవటం వారి పెళ్ళి కి పెద్దలు ఒప్పుకోకపోవటమూ వున్నా క్షక్షలు తీర్చుకోవటాలు వుండేవి కావు . ఓ విరహ గీతం పాడుకునేవారు. కాసిని గొడవలు , కాసిని త్యాగాలూ ఆతరువాత పెళ్ళికావటమూ జరిగిపోయేది . ప్రణయగీతాలు పాడుకున్నా దూరం దూరంగా వుండే పాడుకునేవారు . 'అప్పుచేసి పప్పుకూడు ' సినిమాలో యన్ . టి.ఆర్ సావిత్రి చిన్న వంతెనకు అటూ ఇటూ నిలబడిపాడుకొని ఆ తరువాత ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు . ఆ పాట గుర్తురావటం లేదుకాని ఆ సీన్ ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వువచ్చేస్తుంది . అలాగే మిస్సమ్మ లో రావోయిచందమామ పాట కూడా చెరోచోట వుండి పాడుకుంటారు . ఆ పాటలు ఎంతబాగుండేవని . దాదాపు ప్రతి సినిమా లో ఒక దేశభక్తి పాట ' భలేతాత మన బాపూజీ ' పాడవోయి భారతీయుడా'లాంటిపాటలు ఇప్పటికీ వినిపిస్తూనేవున్నాయి .దాశరధి ,దేవులపల్లి కృష్ణశాస్త్రి , నారాయణ రెడ్డి తదితరులు మంచి భావయుక్తమైన పాటలు వ్రాశారు . అవి ఏ ఫంక్షన్ లోనైనా పాడుకోవటానికి వీలుగా వుండేవి .' ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో ' పాట స్కూల్ డే కి పాడాము .

 పాత్రధారుల వేషభాషలు చాలా డిగ్నిఫైడ్ గా వుండేవి . హీరోయిన్ కు చీరకట్టినా , మోడరన్ డ్రెస్ వేసినా వంటి నిండుగా వుండేది . వెకిలివేషాలు వేయకుండా చాలా హుందాగా వుండేవారు .'చింతామణి ' ' విప్రనాయాణ ' ,'తెనాలి రామకృష్ణ 'లలో భానుమతి ,'కన్యాశుల్కం ' లో సావిత్రి మధురవాణి గా , 'పాండురంగ మహత్యం ', ' అమరశిల్పి జక్కన్న ' లలో బి. సరోజ , 'పునర్జన్మ ' లో కృష్ణకుమారి , 'కళ్యాణ మంటపం ' లో కాంచన 'మల్లెపువ్వు ' లో లక్ష్మి ,'మాయదారి మల్లిగాడు ' లో జయంతి ,'ప్రేమాభిషేకం 'లో జయసుధ పలు హీరోయిన్లు వేశ్య పాత్రలు ధరించినా వంటి నిండా బట్టల తో , హుందాగా నటించారు . ఎక్కడా వెకిలితనం లేదు .అతరువాత తరువాత జ్యోతిలక్ష్మి , జయమాలిని క్లబ్ డాన్స్ లలో కురచ బట్టలు కట్టుకున్నారేకాని , హీరోయిన్లు మాత్రం హుందాగానే వున్నారు . వాళ్ళైనా డాన్స్ లలో మాత్రమే అలా వేసుకునేవారు కాని వేరే సంధర్భాలలో నిండుగానే వుండేవారు .

 హాస్యమూ చాలా సున్నితంగా వుండేది .మాయాబజార్ లొని రేలంగిని , రమణారెడ్డినీ మరిచిపోగలమా ? ఊతపదాలు కూడా వీరతాళ్ళు వేసినాము అని తెగ నవ్వించారు . ' వినరా సూరమ్మ కూతురి మొగుడా ' పాట గుర్తొస్తే రాజబాబు , రమాప్రభల నటన గుర్తొచ్చి ఎంత నవ్వువస్తుందో . రేలంగి , రమణారెడ్డి , పద్మనాభం, రాజబాబు , గిరిజ , రమాప్రభ మొదలైనవారి నటనకే నవ్వులు పువ్వులు పూసాయి .

 ఇహపోతే ఈ నాటి సినిమాలలో ఏముంది చూసేందుకు అనిపిస్తుంది . కుటుంబకథా చిత్రాలు లేనే లేవు . వున్నవాటిల్లో కూడా తల్లి, పిల్లలు కలిసి తండ్రి ని వెక్కిరించటము , అమ్మా ఈయనను ఎలా పెళ్ళిచేసుకున్నావు అని కొడుకు అడిగే డైలాగులు రోత పుట్టిస్తున్నాయి .తండ్రి ని ఒక బఫూన్ గా చూపుతున్నారు . ఏవో జగపతిబాబు , వెంకటేష్ 'సంక్రాంతి ', ఉదయ్ కిరణ్ 'నీ స్నేహం 'బాపు వి , కె. విశ్వనాద్ ,కామెడీ సినిమాలంటే జంధ్యాల వి , రాజేంద్రప్రసాద్ వి,నరేష్ వి కొన్ని సినిమాలు చూడగలిగాను . అంతే . ఇప్పుడు వెరైటీ సినిమాలేలేవు . అన్నింట్లోనూ రక్తపాతాలు , కక్షలూ ,హత్యలు. చివరికి హీరోయిన్ ను హీరో కి పెళ్ళి చేయటం ఇష్టం లేని హీరోయిన్ తండ్రి కూడా రక్తాన్ని ఏరులు పాకిస్తాడు . మృదువుగా చెప్పటమే లేదు .చివరకు ' నిన్నేపెళ్ళాడుతా 'సినిమా ముందునుంచి చక్కగా తీసుకొచ్చి చివరలో గుండాలూ కొట్లాటలూ తప్పలేదు .సుమోలూ తిరిగి పడటమూ , కత్తులూ కటార్లూ గన్లూ అబ్బో చెప్పక్కరలేదు .ఇహ రాయసీమ పౌరుషం అమ్మో తలుచుకుంటే నిద్రే పట్టదు .అసలు నిజంగా రాయలసీమలో అందరూ అలాగే వుంటారా ? నాకైతే ఆ సినిమాలు చూస్తుంటే గుండె దడదడ లాడిపోతుంది .అంతా ధనా ధన్ పఠా ఫట్ . ఏదో కాస్త వెరైటీగా బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం ' సినిమా వుంది . జానపదం కూడా తీస్తాడట . రాణీరుద్రమ సినిమా వస్తుంది అంటున్నారు చూద్దాం .

 ఈ కాలం ప్రేమలంటే పి. టి ఎక్సర్సైజ్ డాన్సులూ , చెవులు అదిరిపోయే పాటలు . ఇంట్లో నుంచి పారిపోతూ పరిగెత్తుతూనేవుంటారు .... పరిగెత్తుతూనేవుంటారు ఎటోమరి .పదో క్లాస్ లోనే ప్రేమ , ఇంటర్ లో పిల్లలు ( చిత్రం సినిమాలో ) . అంత చిన్నపిల్లల తో ప్రేమ సినిమాలేమిటి దిగులేస్తుంది. అసలు సామాజిక విలువలు వున్న సినిమాలేలేవు . వేషబాషలలోనూ సున్నితత్వం పోయింది . హీరోయిన్ కు బట్టలకరువు చాలా వచ్చింది . వాంప్ పాత్రధారి కి, హీరోయిన్ పాత్రధారి కీ తేడాలేకుండా పోయింది . అందరి కీ ఒకటే కురచబట్టలు . అసలు హీరోయిన్ కు ప్రాముఖ్యతనేలేదు .ఎంతసేపూ హీరో వెనకాల గెంతటం తప్ప. ఎంత ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తే అంత గ్రేట్ . తమ డైలాగులు తాము చెప్పుకోలేరు . నాకనిపిస్తుంది అసలు వాళ్ళకి వాళ్ళతో ఏమి మాట్లాడిస్తున్నారోఐనా తెలుసా అని .హీరోయిన్ ను ఓ బొమ్మలా వుపయోగించుకుంటున్నారు .

 హాస్యాన్ని కి అర్ధమే మారిపోయింది .'నీ యెంకమ్మ ' లాంటి డైలాగులు .ఓ సినిమా లో ఓ కామెడియన్ ను , ఇంకో కామేడియన్ కాలుతో తన్నాడట.అది హిటైందిట . ఇహ అక్కడినుంచి ప్రతి సినిమాలో తన్నుల ప్రోగ్రాం వుండాల్సిందే ! ద్వందర్ధాల డైలాగులు , వెకిలివేషాలు . ఎక్కడో తప్ప గుర్తుంచుకునే మంచి హాస్యం కంపడటం లేదు . హాస్యం జంధ్యాల తోనే వెళ్ళిపోయినట్లుంది .

మంచి పాటలూ కనిపించటం లేదు . అర్ధం పర్ధం లేని మాటలు , శబ్ధాలు . మంచి భావయుక్తమైన పాటలెక్కడున్నాయి . వాటి కోసమూ కె. విశ్వనాద్ , బాపు సినిమాలే శరణ్యం .ఈ మధ్య 'ఒక్కడు 'లో ,' మురారి ' లో మంచి పాటలు విన్నాను . అలా అలా ఒకటీ అరా కనిపిస్తూవుంటాయి . అంతే కాని గుర్తుంచుకునే గా వినిపించటం లేదు .విచిత్రమేమంటే ఈ కాలం కుర్రకారు కూడా ఇప్పటి సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నపటికీ  ఎక్కువ మంది పాత సినిమాలను పాత పాటలను ఇష్టపడటం. ఇప్పటి సినిమాలు మేకప్ పరంగా , తెక్నికల్ పరంగా అభివౄద్ది చెందాయే కాని కథ మటుకు శూన్యం. 


 కోట్లు కుమ్మరించి సినిమాలు తీస్తున్నారేకాని వాటిల్లో అర్ధం పర్ధం లేకుండా వున్నాయి . కమల్ హాసన్ లాంటి వాళ్ళు ప్రయోగాలు చేస్తూ దెబ్బ తింటున్నారు . ముఖ్యంగా లాస్ట్ పది సంవత్సరాలలో మంచి సినిమా కు అర్ధమే మారిపోయింది .పదికాలాలు నిలిచే సినిమానే లేదు . రెండోసారి కాదుకదా మొదటిసారే చూడలేకుండా వున్నాము . ఏవో ఎప్పుడో , ' మిథునం ' లాంటి మంచి సినిమాలు సినీ ఆకాశం లో తళ్ళుక్కు మంటున్నాయి అంతే :( నేను థియేటర్ లో సినిమా చూసి రెండేళ్ళయ్యింది . ఆ (( శ్రీరామరాజ్యం , మిథునం చూసాను . ఎప్పుడైనా సినిమా కు వెళుదామనిపిస్తే , ఆ రక్తపాతాలు చూడలేను . ధనాధన్ అనే సౌండ్లను భరించలేను . గుండెల్లో దడ వచ్చేస్తుంది . సినిమా చూద్దామా ఏ సినిమా చూద్దాం అనిపిస్తుంది .