Monday, February 4, 2013

సినిమా చూద్దామా ? ఏ సినిమా చూద్దాం ?మా చిన్నప్పుడు 'ఆత్మబలం' అని ఓ సినిమా వచ్చింది . అందులో నాగేశ్వరరావు , బి.సరోజ 'చిటపట చినుకులు పడుతూవుంటే చెలికాడే సరసన వుంటే ' అనే పాటకు వానలో తడిసి ఓ చెట్టుకిందకు వెళుతారు . మా పెద్దవాళ్ళందరూ అమ్మో ఆత్మబలం లో వానలో తడిసిన సీన్ వుందిట పిల్లలను తీసుకెళ్ళకూడదు అని తెగ చెవులు కోరుక్కున్నారు .అలాగే 'ఆరాదన 'సినిమా వచ్చినప్పుడు ఆరాదన అంటే ఏదేవుడి కి ఆరాదనో అనుకున్నానండి .కాదు హీరో ని హీరోయిన్ ఆరాదిస్తుంది . ఏమి సినిమాలో ఏంపాడో అని మా పక్కింటి ఆవిడ మా అమ్మ తో చెప్పింది . నాకెలా తెలుసంటారా మనం చదువుకుంటున్నా రహస్యం గా ఓ చెవి పెద్దవాళ్ళ కబుర్లలోకి వెళ్ళిపోతుందికదా .నేను పెద్దయ్యాక కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడు ,ఆత్మబలం సుదర్షన్ లో మార్నింగ్ షో వచ్చింది . చిన్నప్పటి సంగతి గుర్తొచ్చి మా ఫ్రెండ్స్ అందరమూ పొలోమంటూ ఆ సినిమా చూడటానికి వెళ్ళాము . తీరా ఆ పాట సీన్ చూసాక హోరినీ దీనికా మన పెద్దవాళ్ళు మనం చూస్తే చెడిపోతామనుకున్నది అనుకొని తెగ నవ్వుకున్నాము :)

 చక్కటి కుటుంబకథా చిత్రాలు వచ్చేరోజులలో అవే మోస్ట్ రొమాంటిక్ సీన్లు . ఏ సినిమా చూసినా అమ్మానాన్న ,తాతయ్యా , బామ్మా , పిల్లలూ వున్న ఉమ్మడి కుటుంబ చిత్రాలే వుండేవి . వుమ్మడి కుటుంబాల లో వుండే ఇబ్బందులూ , లాభాలూ , కష్టాలూ , నష్టాలగురించి చెప్పేవారు . మంచి కుటుంబవ్యవస్త గురించి వుండేది .'కుటుంబగౌరవం ' 'మాంగల్యబలం' 'తోడికోడళ్ళు ' 'శాంతినివాసం' 'నిండుకుటుంబం' 'రాము ' 'భలెతమ్ముడు ' మొదలైనవి కొన్ని . మంచి కుటుంబ విలువలు వుండేవి . అన్నదమ్ముల మధ్య ఆస్తికోసం గొడవలు , తోటి కోడళ్ళ మధ్య , వదినా ఆడపడుచుల మధ్య అభిప్రాయ భేధాలు ఎంతగా చూపించేవారో అభిమానాలు అలాగే చూపించేవారు .పెద్దవదిన దగ్గర మరుదులూ , ఆడపడుచులూ గారాలు పోవటం , వదిన వారిని సమర్ధించటమూ చక్కగా వుండేది . ఇటువంటి పాత్రలకూ దేవిక పెట్టిందిపేరు . అలాగే ఆడపడుచు తల్లి వెనక చేరి కోడలిని సాధించటము కూడా ఇల్లాళ్ళు కన్నీళ్ళు పెట్టుకునేట్టుగా వుండేవి . తామాషాగా వుండేది :) సినిమాలు చూస్తుంటే మన ఇంట్లోనో ,పక్కింట్లోనో జరుగుతునట్లుగా వుండేవి . కుటుంబకథా చిత్రాలేకాదు , దేశభక్తి ప్రభోదించే 'వందేమాతరం 'లాంటి సినిమాలు , అప్పటి సామాజిక దురాచాలను ఖండించే 'కన్యాశుల్కం ,'వరకట్నం 'లాంటివి కూడా వున్నాయి . సినిమాలు , సాంఘికమే కాకుండా ' గండికోటరహస్యం ', 'బాలనాగమ్మ ' పాతాళభైరవి ' 'గులేబకావాళి కథ ' మొదలైన జానపదాలు , 'శ్రీకృష్ణ తులాభారం ','మాయాబజార్ ' 'ప్రమీలార్జునీయం ' లాంటి పౌరాణికాలు , 'పల్నాటి యుద్దం ', 'బొబ్బిలి యుద్దం' లాంటి చారిత్రిక సినిమాలూ, 'పట్టుకుంటేపదివేలు ', 'లక్షాధికారి ' లాంటి డిటెక్టివ్ సినిమాలు , 'ఆమె ఎవరు ' , 'అర్ధరాత్రి ' లాంటి భయపెట్టే దయ్యాల సినిమాలూ రకరకాలుగా వచ్చాయి . మిస్సమ్మ , తొడొకోడళ్ళు , గుండమ్మకథ , మాయాబజార్ , పాతాళ భైరవి , షావుకారు లాంటి పలు సినిమాలు ఇప్పుడు రిలీజైనా హౌస్ఫుల్ తో నడుస్తాయి .

 కాలేజ్ పిల్లలు ప్రేమించుకోవటం వారి పెళ్ళి కి పెద్దలు ఒప్పుకోకపోవటమూ వున్నా క్షక్షలు తీర్చుకోవటాలు వుండేవి కావు . ఓ విరహ గీతం పాడుకునేవారు. కాసిని గొడవలు , కాసిని త్యాగాలూ ఆతరువాత పెళ్ళికావటమూ జరిగిపోయేది . ప్రణయగీతాలు పాడుకున్నా దూరం దూరంగా వుండే పాడుకునేవారు . 'అప్పుచేసి పప్పుకూడు ' సినిమాలో యన్ . టి.ఆర్ సావిత్రి చిన్న వంతెనకు అటూ ఇటూ నిలబడిపాడుకొని ఆ తరువాత ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు . ఆ పాట గుర్తురావటం లేదుకాని ఆ సీన్ ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వువచ్చేస్తుంది . అలాగే మిస్సమ్మ లో రావోయిచందమామ పాట కూడా చెరోచోట వుండి పాడుకుంటారు . ఆ పాటలు ఎంతబాగుండేవని . దాదాపు ప్రతి సినిమా లో ఒక దేశభక్తి పాట ' భలేతాత మన బాపూజీ ' పాడవోయి భారతీయుడా'లాంటిపాటలు ఇప్పటికీ వినిపిస్తూనేవున్నాయి .దాశరధి ,దేవులపల్లి కృష్ణశాస్త్రి , నారాయణ రెడ్డి తదితరులు మంచి భావయుక్తమైన పాటలు వ్రాశారు . అవి ఏ ఫంక్షన్ లోనైనా పాడుకోవటానికి వీలుగా వుండేవి .' ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు దాగెనో ' పాట స్కూల్ డే కి పాడాము .

 పాత్రధారుల వేషభాషలు చాలా డిగ్నిఫైడ్ గా వుండేవి . హీరోయిన్ కు చీరకట్టినా , మోడరన్ డ్రెస్ వేసినా వంటి నిండుగా వుండేది . వెకిలివేషాలు వేయకుండా చాలా హుందాగా వుండేవారు .'చింతామణి ' ' విప్రనాయాణ ' ,'తెనాలి రామకృష్ణ 'లలో భానుమతి ,'కన్యాశుల్కం ' లో సావిత్రి మధురవాణి గా , 'పాండురంగ మహత్యం ', ' అమరశిల్పి జక్కన్న ' లలో బి. సరోజ , 'పునర్జన్మ ' లో కృష్ణకుమారి , 'కళ్యాణ మంటపం ' లో కాంచన 'మల్లెపువ్వు ' లో లక్ష్మి ,'మాయదారి మల్లిగాడు ' లో జయంతి ,'ప్రేమాభిషేకం 'లో జయసుధ పలు హీరోయిన్లు వేశ్య పాత్రలు ధరించినా వంటి నిండా బట్టల తో , హుందాగా నటించారు . ఎక్కడా వెకిలితనం లేదు .అతరువాత తరువాత జ్యోతిలక్ష్మి , జయమాలిని క్లబ్ డాన్స్ లలో కురచ బట్టలు కట్టుకున్నారేకాని , హీరోయిన్లు మాత్రం హుందాగానే వున్నారు . వాళ్ళైనా డాన్స్ లలో మాత్రమే అలా వేసుకునేవారు కాని వేరే సంధర్భాలలో నిండుగానే వుండేవారు .

 హాస్యమూ చాలా సున్నితంగా వుండేది .మాయాబజార్ లొని రేలంగిని , రమణారెడ్డినీ మరిచిపోగలమా ? ఊతపదాలు కూడా వీరతాళ్ళు వేసినాము అని తెగ నవ్వించారు . ' వినరా సూరమ్మ కూతురి మొగుడా ' పాట గుర్తొస్తే రాజబాబు , రమాప్రభల నటన గుర్తొచ్చి ఎంత నవ్వువస్తుందో . రేలంగి , రమణారెడ్డి , పద్మనాభం, రాజబాబు , గిరిజ , రమాప్రభ మొదలైనవారి నటనకే నవ్వులు పువ్వులు పూసాయి .

 ఇహపోతే ఈ నాటి సినిమాలలో ఏముంది చూసేందుకు అనిపిస్తుంది . కుటుంబకథా చిత్రాలు లేనే లేవు . వున్నవాటిల్లో కూడా తల్లి, పిల్లలు కలిసి తండ్రి ని వెక్కిరించటము , అమ్మా ఈయనను ఎలా పెళ్ళిచేసుకున్నావు అని కొడుకు అడిగే డైలాగులు రోత పుట్టిస్తున్నాయి .తండ్రి ని ఒక బఫూన్ గా చూపుతున్నారు . ఏవో జగపతిబాబు , వెంకటేష్ 'సంక్రాంతి ', ఉదయ్ కిరణ్ 'నీ స్నేహం 'బాపు వి , కె. విశ్వనాద్ ,కామెడీ సినిమాలంటే జంధ్యాల వి , రాజేంద్రప్రసాద్ వి,నరేష్ వి కొన్ని సినిమాలు చూడగలిగాను . అంతే . ఇప్పుడు వెరైటీ సినిమాలేలేవు . అన్నింట్లోనూ రక్తపాతాలు , కక్షలూ ,హత్యలు. చివరికి హీరోయిన్ ను హీరో కి పెళ్ళి చేయటం ఇష్టం లేని హీరోయిన్ తండ్రి కూడా రక్తాన్ని ఏరులు పాకిస్తాడు . మృదువుగా చెప్పటమే లేదు .చివరకు ' నిన్నేపెళ్ళాడుతా 'సినిమా ముందునుంచి చక్కగా తీసుకొచ్చి చివరలో గుండాలూ కొట్లాటలూ తప్పలేదు .సుమోలూ తిరిగి పడటమూ , కత్తులూ కటార్లూ గన్లూ అబ్బో చెప్పక్కరలేదు .ఇహ రాయసీమ పౌరుషం అమ్మో తలుచుకుంటే నిద్రే పట్టదు .అసలు నిజంగా రాయలసీమలో అందరూ అలాగే వుంటారా ? నాకైతే ఆ సినిమాలు చూస్తుంటే గుండె దడదడ లాడిపోతుంది .అంతా ధనా ధన్ పఠా ఫట్ . ఏదో కాస్త వెరైటీగా బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం ' సినిమా వుంది . జానపదం కూడా తీస్తాడట . రాణీరుద్రమ సినిమా వస్తుంది అంటున్నారు చూద్దాం .

 ఈ కాలం ప్రేమలంటే పి. టి ఎక్సర్సైజ్ డాన్సులూ , చెవులు అదిరిపోయే పాటలు . ఇంట్లో నుంచి పారిపోతూ పరిగెత్తుతూనేవుంటారు .... పరిగెత్తుతూనేవుంటారు ఎటోమరి .పదో క్లాస్ లోనే ప్రేమ , ఇంటర్ లో పిల్లలు ( చిత్రం సినిమాలో ) . అంత చిన్నపిల్లల తో ప్రేమ సినిమాలేమిటి దిగులేస్తుంది. అసలు సామాజిక విలువలు వున్న సినిమాలేలేవు . వేషబాషలలోనూ సున్నితత్వం పోయింది . హీరోయిన్ కు బట్టలకరువు చాలా వచ్చింది . వాంప్ పాత్రధారి కి, హీరోయిన్ పాత్రధారి కీ తేడాలేకుండా పోయింది . అందరి కీ ఒకటే కురచబట్టలు . అసలు హీరోయిన్ కు ప్రాముఖ్యతనేలేదు .ఎంతసేపూ హీరో వెనకాల గెంతటం తప్ప. ఎంత ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తే అంత గ్రేట్ . తమ డైలాగులు తాము చెప్పుకోలేరు . నాకనిపిస్తుంది అసలు వాళ్ళకి వాళ్ళతో ఏమి మాట్లాడిస్తున్నారోఐనా తెలుసా అని .హీరోయిన్ ను ఓ బొమ్మలా వుపయోగించుకుంటున్నారు .

 హాస్యాన్ని కి అర్ధమే మారిపోయింది .'నీ యెంకమ్మ ' లాంటి డైలాగులు .ఓ సినిమా లో ఓ కామెడియన్ ను , ఇంకో కామేడియన్ కాలుతో తన్నాడట.అది హిటైందిట . ఇహ అక్కడినుంచి ప్రతి సినిమాలో తన్నుల ప్రోగ్రాం వుండాల్సిందే ! ద్వందర్ధాల డైలాగులు , వెకిలివేషాలు . ఎక్కడో తప్ప గుర్తుంచుకునే మంచి హాస్యం కంపడటం లేదు . హాస్యం జంధ్యాల తోనే వెళ్ళిపోయినట్లుంది .

మంచి పాటలూ కనిపించటం లేదు . అర్ధం పర్ధం లేని మాటలు , శబ్ధాలు . మంచి భావయుక్తమైన పాటలెక్కడున్నాయి . వాటి కోసమూ కె. విశ్వనాద్ , బాపు సినిమాలే శరణ్యం .ఈ మధ్య 'ఒక్కడు 'లో ,' మురారి ' లో మంచి పాటలు విన్నాను . అలా అలా ఒకటీ అరా కనిపిస్తూవుంటాయి . అంతే కాని గుర్తుంచుకునే గా వినిపించటం లేదు .విచిత్రమేమంటే ఈ కాలం కుర్రకారు కూడా ఇప్పటి సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నపటికీ  ఎక్కువ మంది పాత సినిమాలను పాత పాటలను ఇష్టపడటం. ఇప్పటి సినిమాలు మేకప్ పరంగా , తెక్నికల్ పరంగా అభివౄద్ది చెందాయే కాని కథ మటుకు శూన్యం. 


 కోట్లు కుమ్మరించి సినిమాలు తీస్తున్నారేకాని వాటిల్లో అర్ధం పర్ధం లేకుండా వున్నాయి . కమల్ హాసన్ లాంటి వాళ్ళు ప్రయోగాలు చేస్తూ దెబ్బ తింటున్నారు . ముఖ్యంగా లాస్ట్ పది సంవత్సరాలలో మంచి సినిమా కు అర్ధమే మారిపోయింది .పదికాలాలు నిలిచే సినిమానే లేదు . రెండోసారి కాదుకదా మొదటిసారే చూడలేకుండా వున్నాము . ఏవో ఎప్పుడో , ' మిథునం ' లాంటి మంచి సినిమాలు సినీ ఆకాశం లో తళ్ళుక్కు మంటున్నాయి అంతే :( నేను థియేటర్ లో సినిమా చూసి రెండేళ్ళయ్యింది . ఆ (( శ్రీరామరాజ్యం , మిథునం చూసాను . ఎప్పుడైనా సినిమా కు వెళుదామనిపిస్తే , ఆ రక్తపాతాలు చూడలేను . ధనాధన్ అనే సౌండ్లను భరించలేను . గుండెల్లో దడ వచ్చేస్తుంది . సినిమా చూద్దామా ఏ సినిమా చూద్దాం అనిపిస్తుంది .

26 comments:

కనకాంబరం said...

అవును. ఆ చిటపట చినుకుల్లో తడుస్తూ హత్తుకొనే సీన్ లో బి సరోజా దేవి,ఏన్ ఆర్ లు...ఆ సీన్ తెలుగు సినీ పరిశ్రమకు తోలి రొమాంటిక్ సీన్.

హరే కృష్ణ said...

బాగా రాసారు మాలా కుమార్ గారు
పాత పాటలు టీవీ లో వస్తే మ్యూట్ చేసుకొని కామెడీ చేసుకుంటున్న ఈ తరం గురించి బాగా చెప్పారు
బాంకాక్ లో స్థిరపడిపోయిన తెలుగు డైరెక్టర్లు ఉన్నంత వరకు తెలుగు సినిమా బాగుపడదు.

Tejaswi said...

50.60 దశకాలలోని తెలుగు సినిమాలమీద ఒక చిన్నసైజ్ థీసిస్ రాసేశారు సుమండీ! చాలా బాగుందండి మీ విశ్లేషణ.

హరే కృష్ణ said...

మీ టైటిల్ కి సమాధానం కార్టూన్ సినిమా :)

Anil Atluri said...

మీకు నచ్చిన సినిమాలు గురించి చెప్పుకున్నారు. అవే చూసుకోండి. వాళ్ళకు నచ్చిన సినిమాలు తీస్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు. ఆవే చూసుకుంటారు.
మీరు మీవి..వారు వారివి. ఇక ఇక్కడ ఇబ్బందేముంది? చి ద హ

చెప్పాలంటే...... said...

:) baavunnayi mi cinima kaburlu maala garu

జ్యోతిర్మయి said...

మంచి చిత్రం వచ్చినా ఆ సినిమా చూసే మనుషులే వుండడంలేదటండీ..మిధునం చాలా దగ్గర్ల విడుదలకే నోచుకోలేదు.

శివరామప్రసాదు కప్పగంతు said...

ఇప్పటి సినిమాల్లో హీరోలనబడే వాళ్ళల్లో కొంతమంది విపరీత హీరోలు చూపించే పొగరుబోత్తనం, అహంకారం చూస్తుంటె ఎక్కడికి పోతున్నాం మనం అని దిగులు వేస్తుంది. ఇలాంటి అహంకారపూరిత పాత్రల నుంచి ఇప్పటి పిల్లలు ఏమి నేర్చుకోకూడదో అదే నేర్చుకుంటారు. ఈనాటి సినిమాలకు ఇది చూపించవచ్చు, ఇది కూడాదు అని లేదు. సర్వం బాక్షాఫీసు పరంగా ఏదంటే అది. టి ఆర్ పి లకు వెంపర్లాడే వెర్రి మీడియాకు సినిమా సమీక్ష అంటేనే తెలియదు.

నవజీవన్ said...

సినిమాల మీద మీ విశ్లేషణ బాగుంది సార్.
ఇకపోతే సినిమాలు కాలాన్ని బట్టి , నవీన సంస్కృతీ ని బట్టి మారుతూనే ఉంటాయి సార్. ఉదాహరణ కు ఈ మధ్య కాలం లో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు అడపా దడపా వస్తున్నాయి (కలెక్షన్లు కురిపించడం అనేది వేరే విషయం). సొంతవూరు , గంగ పుత్రులు, వేదం , గమ్యం ,అనుకోకుండా ఒక రోజు, షో, ఆ నలుగురు, మీ శ్రేయోబిలాషి, సిద్దం, మహాత్మా ఇవ్వన్ని కూడా ఈ కాలానికి,ఈనాటి సంస్కృతి కి దర్పణం గా నిలిచిన చిత్రాలే !

శశి కళ said...

నిజం మాల గారు...ఎంతో కొంత మంచి చెప్పేవి.పాటలు ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించేవి.ప్రతీ విషయం భలే వ్రాసారు మీరు

శ్రీలలిత said...


ఏ సినిమాకి వెళ్ళాలా అనేది బాగా ఆలొచించుకునేలా రాసారు. బాగుంది..

శ్రీ .దు said...

మాలా కుమార్ గారు, బాగా వ్రాసారు.
నేను చూడని పాత సినిమాలు కూడా చెప్పారు. చాలా ధాంక్స్. త్వరలోనే అవి కూడా చూసేస్తాను :)

రాజి said...

నిజమేనండీ ఈ మధ్య సినిమాలు "సినిమా చూడాలా అంత అవసరమా" అనిపించేలా ఉంటున్నాయి..
మీ పాత సినిమాల కబుర్లు బాగున్నాయి..

మాలా కుమార్ said...

ఇంత పెద్ద పోస్ట్ ఓపిక గా చదివి కామెంట్స్ పెట్టిన మీకందరికీ బోలెడు ధన్యవాదాలు .

sambu said...

mala gaaru nejam rasaaru.

మాలా కుమార్ said...

సంబు గారు థాంక్స్ అండి .

అనోనమస్ గారు , నా బ్లాగ్ మీకు నచ్చినందుకు థాంక్స్ అండి .

Sri Rama Murty said...

BAGANE UNDI KANI SRIRAMA RAJYAM CINEMA EMI BAGUNDANDI. eDO ASABYATA LENI CINEMA NE GOPPA MOOVIE ANUKUNTE ETLA. BALAYYA, NAGESWARA RAO , LAVA KUSHULA ACTION, EMINA BAGUNNAYA. VALMIKANNI ISTAM VACHINATLU MARCHI TEESINA DANNI GOPPA CINEMA ANUKUNDAMA. MUNIKI UNDVALASINA PRASANTATHA MATALO, EXPRESSIONLO KUDA CHUPINCHALEKAPOYINA NAGESWARARO ACTION BAGINDANI ETLA CHEPPAGALAM. BAGA ALOCHINCHANDI. IKA PILLALAKU PALAKATAME RADU. SARIGA TELUGU KUDA MATLADALEKAPOYYARU.PICHI CINEMA

మాలా కుమార్ said...

anonymous garu,
my blog theame was designed by my daughter-in-law. thank you for liking my blog. and thanks for all your comments :)

మాలా కుమార్ said...

anonymous garu,
meeru okatae comment rojuu istunnaaru. please ika aapanDi.

విన్నకోట నరసింహా రావు said...

మాలా కుమార్ గారూ, ఈ Anonymous ల వ్యాఖ్యల ముఖ్యోద్దేశ్యం మార్కెటింగో మరోటో అని తోస్తోంది. ఎందుకంటే అటువంటి ప్రతి వ్యాఖ్య క్రింద నా వెబ్ సైట్ చూడండి అంటూ లింకులు ఇస్తుంటారు. అసలు వాళ్ళకి తెలుగు చదవడం గూడా రాదని, ఇక ఆపండి అంటూ మీరు అన్నది వాళ్ళకేమీ అర్ధం కాదనీ నా అనుమానం.
ఇటువంటి పరిస్ధితే "నవరస(జ్ఞ) భరితం" అనే బ్లాగులో కూడా తరచూ కనిపిస్తుంటుందని మీరు గమనించే ఉంటారు navarasabharitham.blogspot.in

మాలా కుమార్ said...

అవునండి నరసింహారావు గారు.మేయిల్ ఓపెన్ చేయగానే ఆ కామెంట్ రోజూ కనిపిస్తూ విసుగొస్తోంది. కొన్నిసార్లు రోజు రెండు మూడు సార్లు కుడా ఉంటోంది.

sarma said...

ఒకప్పుడు ఇటువంటి కామెంట్లతో నా బ్లాగు మీద దాడి జరిగింది. ఆ కామెంట్ కూడా టపాలో కొంతభాగమై ఉండేది,మొదటిలో తెలియక కామెంట్లు తెనుగులో ఉన్నాయనుకుని ప్రచురించా,తరవాత కాలంలో వీటిని డిలీట్ చేయడం ప్రారంభించా. కొంత కాలం తరవాత వదిలేశాయి. నా బ్లాగు మీద దండయాత్ర చేసినది స్పైన్ దేశం మార్కెటింగ్ ....వీటిని కొంతమంది కావాలని ప్రచురించుకుంటారు, తమ బ్లాగ్ ఆగ్రిగేటర్ లో కనపడుతుందని...:)

మాలా కుమార్ said...

శర్మగారు,
మొదట్లో తెలీక కొన్ని ప్రచురించాను.ఆ తరువాత రోజూ చూసి విసుగొచ్చి డిలీట్ చేస్తున్నాను.ఇది గత కొద్దినెలలుగా వస్తున్నాయి.అర్ధం చేసుకుంటారేమో నని నేను కామెంట్ పెట్టాను. ఇప్పుడు తెలిసింది ఇది వాళ్ళ ప్రచారం కోసం అని. ఇంక పట్టించుకోను :) థాంక్స్ అండి.

విన్నకోట నరసింహా రావు said...

మంచి విశ్లేషణ చేసారు మాలా కుమార్ గారూ. చాలా సినిమాలు చూడదగ్గవిగా ఉండడం లేదు.
ఈనాటి సినిమాల్లో మరొక కలవరపెట్టే పోకడ (disconcerting trend) ఎక్కువవుతోంది. అదే - వేరొకరితో నిశ్చితార్ధం అయిపోయిన అమ్మాయి వెంటపడి తనని ప్రేమించమని హీరోగారు వేధించడం / లేదా వేరొకరితో నిశ్చితార్ధం అయిన అమ్మాయే హీరోతో ప్రేమలో పడడం, పెళ్ళికూతుర్ని పెళ్ళిహాలునుంచి తప్పించడం. ఇదీ ప్రేమ, హీరోయిజం. ఈ థీం తో సినిమాలు తీయడం పరిపాటి అయిపోతోంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న నిత్యా మేనన్ కూడా ఇటువంటి సినిమాల్లో నటించడం విచారకరం. సమాజం మీద ఎటువంటి చెడు ప్రభావం చూపిస్తుందో అనే బాధే ఉన్నట్లు లేదు నిర్మాతలకి, రచయితలకి, డైరెక్టర్లకి, నటీనటులకీ.

శ్యామలీయం said...

ఈ రోజుల్లో సినిమా అనేది కేవలం వ్యాపారం. సామాజిక బాధ్యత అన్నది కించిత్తు కూడా పాటించని వ్యాపారం. ఇంతడబ్బు పెట్టుబడి పెట్టి అంతడబ్బు సంపాదించటం అన్నదే ప్రధానం కానీ ఏ విధమైన విలువలూ కానే కావు. జనం కూడా విలువలకోసం పట్టుబట్టటం లేదు. వాళ్ళకు కావలసినది వినోదం. దొందూ దొందే ఐపోయాక, ఇక రాశి తప్ప సినీరంగం నుండి వాసి తక్కువగానే వస్తుంది సహజంగా. విలువల గురించి బాధపడే ప్రేక్షకుడికి చూడటానికి సరైన సినిమా దొరకదు. విలువల గురించి బాధపడే నటీనటులకూ సినీరంగ నిపుణులకూ అవకాశాలు రావు. విలువల గురించి బాధపడే నిర్మాతలకు ఈ రంగం సహకరించే స్థితిలో కూడా లేదు.

Anonymous said...

I'm really impressed with your writing skills and also with the layout on your weblog.
Is this a paid theme or did you modify it yourself? Either way keep up the
excellent quality writing, it is rare to see a great blog like this
one these days.

Review my web blog; instacart promo code 2017 (tinyurl.com)