Wednesday, January 23, 2019

చక్కని పూలకు చాంగుభళా!


చక్కని పూలకు చాంగుభళా!
జ్ఞాపకాలు-9
21-1-2019
ఎప్పుడైనా బంతిపూల జడ వేసుకున్నారా :)
మానుకోటలో ఉన్నప్పుడు, ఒక మానుకోట అని ఏమిటి లెండి,కాంప్ క్వాటర్స్ ఉన్న చోటల్లా ఇంటి ముందు వెనుక చాలా స్తలం ఉండేది.ఇంటి చుట్టూ కర్రలతో దడి కట్టించి అమ్మ చాలా మొక్కలు పెంచేది.కాంపౌండు చుట్టూ ఎర్రని కాశీరత్నాలూ,లైట్ క్రీం కలర్ లో ఉన్న గిన్నె మాలతులు , వైలెట్ కలర్ శంఖంపూలు ఇలా ఒకటేమిటి రంగురంగుల పూల తీగలు అల్లించేది.లోపల వరసగా తెలుపు,గులాబీ, వైలెట్ రంగుల డిసెంబర్ పూల మొక్కలు, ఆ పైన జినియా, బంతి, చిట్టిచామంతి,కస్తూరి చామంతి,తెల్ల పచ్చ చామంతులు ఒకటేమిటి మా ఇంట్లో లేని పూలమొక్క లేదు.వంటి రెక్క లిల్లీ కాదు, చిన్న తెల్ల గులాబీలా ముద్దుగా ఉన్న లిల్లీ పూల మొక్క ఉండేది.అవి ఎంత ముద్దుగా, అందంగా ఉండేదో!నాన్నగారు రిటైర్ అయ్యాక ఖమ్మం లో ఇల్లు కట్టుకున్నప్పుడు సగం జాగా లో ఇల్లు కట్టించి, సగం జాగా అమ్మ మొక్కలకు కేటాయించారు.ఇహ చూసుకోండి ఎన్ని మొక్కలో.చివరికి ఇంటి గోడలను కూడా వదలలేదు.సన్నజాజి,చంబేలి,మల్లె,మొల్ల అన్ని రకాలూ పెట్టి ఇంటి చుట్టుతా గోడల మీద నుంచి డాబా మీద కు పాకించింది.ఖమ్మం లో ఊరి చివర ఇల్లు కావటం తో అప్పటికి పంపులు రాలేదు.బోర్ పడలేదు.టాంకర్ లో నీళ్ళు తెప్పించి, కొనుక్కునేవారు.అంత నీటి ఎద్దడిలో కూడా కూరలు వగైరా కడిగిన నీళ్ళు ఒక బకెట్ లో పోసి, మొక్కలకు పోసేది.మేడ మీద కు బిందె తో తీసుకుపోయి పోసేది.అమ్మ కష్టాన్ని గుర్తించినట్లు మొక్కలు విరగపూసేవి.దేవుడి పూజకు గన్నేరు,మందార, నందివర్ధనం బుట్టలతో కోసినా ఇంకా మొక్కల నిండా ఉండేవి.ఇంటి ముందు నుంచి వెళుతున్నవాళ్ళు , రంగురంగుల పూలతో సన్నని సువాసనలతో ఉన్న ఇంటిని ఒక్క నిమిషం ఆగి, తిరిగి చూడకుండా వెళ్ళేవారు కాదు.జినియా పూలు అరచేతి మందం తో, రంగురంగులవి, ముద్దవి, రెక్కవి ఎంత అందంగా ఉండేవో! మేము సెటిలై పూల మొక్కలు వేసుకుందామనుకున్నప్పుడు,ముద్ద లిల్లీలు, జినియాలు,కాశీరత్నాలు ,కస్తూరిచామంతులు ఎక్కడవెతికినా దొరకలేదు. చిన్న చిన్నవి రెక్కవి జినియాలు కనిపించాయే కాని అప్పటిలాగా అంత అందమైనవి కనిపించలేదు.చివరకు రాజమండ్రి వెళ్ళినప్పుడు కడియం నర్సరీకి కూడా వెళ్ళి వెతికాను దొరకలేదు.
సరే ఇక బంతిపూల జడకు, మానుకోటకు పదండి.మా ఇంటి పక్కనే నాన్నగారి కొలీగ్ ఒకాయన, వాళ్ళ అమ్మానాన్నలతో కలిసి ఉండేవారు.ఆ అమ్మమ్మగారు వాళ్ళ మనవరాలితో పాటు నాకూ బంతిపూల జడ వేసేవారు.అప్పట్లో బంతిపూలు సంక్రాంతి రోజులల్లో మాత్రమే పూసేవి.ఇప్పట్లా తాటికాయలంత కాక , చిన్నవీ పెద్దవీ పసుపు, ఆరెంజ్ ఎరుపు కలిసిన రంగులల్లో , ఒంటి రెక్క, ముద్దబంతి ముద్దుముద్దుగా పూసేవి.కారం బంతి అని ఎరుపు రంగులో పూసేది.అది మా కంత నచ్చేది కాదు.పొద్దున్నే అమ్మ కుంకుడుకాయలతో ,తలస్నానం చేయించి,సాంబ్రాణి ధూపంతో తడి ఆర్పేది.మరి మాకు డ్రైయర్ లు లేవుకదా ! ఓ బుట్ట పట్టుకొని , నేను, భాను(మా పక్కింటి మనవరాలు, నా దోస్త్)పెద్ద పూలు ఏరి కోసేవాళ్ళము.అమ్మమ్మగారు ఇంటి ముందు ఉన్న చింత చెట్టు కింద ,నీరెండలో కూర్చోబెట్టి మా జడలకు బంతి పూలు కుట్టేవారు.ఒకరికి కుడుతుంటే ఇంకోరం, బంతిపూలకు కింద ఉన్న ఆకుపచ్చపొర పూల రేకులు ఊడిపోకుండా జాగ్రత్తగా ఊడదీసి ఇచ్చేవాళ్ళము.ఆవిడ సన్నటి సూదితో, పూలకున్న నల్లటి కొసలను జాగ్రత్తగా ఎక్కించి గుత్తిలా అలాగే పాయ పాయకూ ,అమరుస్తూ కుట్టేవారు.పసుపు ఒక వరుస , ఆరెంజ్ ఒక వరుస వంకీలుగానో , వరుసగానో కుట్టేవారు.ఒక్కోసారి సీతమ్మజడబంతి పూలు కూడా ఒక వరుస బంతి, ఒక వరుస సీతమ్మజడబంతి ఎంత అందంగా కుట్టేవారో!సీతమ్మ జడబంతి పూలు మెజంతా రంగులో ,ముఖమల్ బట్టలా మృదువుగా మెరిసిపోతూ , బంతిపూల మధ్య వయ్యారాలు పోతూ ఉండేవి ( సీతమ్మ జడ బంతి పూల రేకులు వంపులుగా ఉంటాయి). ఆ జడ పూర్తయ్యేందుకు ఒక్కొక్కరికి కనీసం మూడు గంటలైనా పట్టి, సాయంకాలమైపోయేది. మధ్య మధ్యే పానీయం సమర్పయామి అన్నట్లు,మధ్య మధ్య బిస్కెట్లు, చిరు తిండ్లూ అందజేయ బడుతుండేవి :) ఆ జడ ను భద్రంగా రెండు మూడు రోజులు కాపాడుకునేవారము. జడలేని రోజున అమ్మగారు నాజూకుగా దండ గుచ్చి,మా జడలల్లో పెట్టేవారు.అలాగే స్కూల్ కు కూడా వెళ్ళేవాళ్ళము.మరి అప్పుడు స్కూల్ కు పూలు పెట్టుకొని రాకూడదు, బొట్టు పెట్టుకోకూడదు అనే పిచ్చి రూల్స్ ఏమీ లేవు :) అంత అందమైన బంతిపూల జడ సొగసు చూడతరమా !
నా సన్నజాజి పందిరి కింద నాతో ఉన్న పోరి,నిను వీడని నీడను నేనే అంటున్న  నా బాల్యం  :)  అదియును నేనే,ఇదియును నేనే :)   Saturday, January 19, 2019

బుజ బుజ రేకుల పిల్లుంది


బుజ బుజ రేకుల పిల్లుందీ
జ్ఞాపకాలు -8
19-1-2019
మా అమ్మగారింటి వెనుక చల్ల కొస్ఠం అనిఉండేది.అది విశాలంగా ఒక హాల్ లా ఉండేది..అందులోనే ఒక మూల నా బొమ్మరిల్లుండేది.ఆ హాల్ లోనే ఒక గుంజకు పెద్ద పొడగాటి చల్ల కవ్వం కట్టి ఉండేది.అక్కడ మా అమ్మమ్మ  పాటలు పాడుతూ,చల్ల కవ్వం తిప్పుతూ,మజ్జిగ చిలికేది.అమ్మమ్మ పాటలు బాగా పాడేది."మీరజాలగడా నా ఆనతి " పాట చాలా బాగా పాడేది.( అమ్మమ్మ,నేను గుంటూర్ లో శ్రీకృష్ణతులాభారం సినిమా చూసాము.అందులో జమున ఈ పాట పాడుతే, "అమ్మమ్మా నీ పాట " అన్నాను.దానిని జావళి అంటారు అని అమ్మమ్మ అప్పుడు చెప్పింది.) మజ్జిగ చిలుకుతూ ఉంటే పైన వచ్చే నురుగ, ఆ పైన తెల్లగా ముద్దలు ముద్దలుగా వచ్చే వెన్న చూడటం చాలా సరదాగా ఉండేది.వెన్న మొత్తం రాగానే ఇంత ముద్ద తీసి "అమ్మన్నా ( నన్ను అమ్మన్నా అని అమ్మమ్మ ఒక్కతే పిలిచేది.మా బామ్మను అమ్మన్నా అనిపిలిచేవారుట.అందుకని నన్ను అలాగే పిలిచేది.)చేయి పట్టు ."అనేది.యాక్ మనకు వెన్న, మీగడ, పాలు లాంటి పదార్ధాలు పడవు.అప్పటిదాకా అక్కడ కూర్చొని, ఆసక్తిగా చూస్తున్నదానిని అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోయేదాని.ఏం పిల్లమ్మా అని ముద్దుగా విసుక్కునేది అమ్మమ్మ.
మేము రాగానే, మా మస్తాను నా బొమ్మరిల్లు చక్కగా అలికి, తెల్లగా ముగ్గులు వేసేది.ఆకుపచ్చగా మెరిసిపోతున్న తాటాకు మట్ట ఒకటి తెచ్చేది.తాతగారు ఇంట్లో లేనప్పుడు (తాతగారు రానీయరుగా,అందుకన్నమాట)  నల్లగా , లావుగా ఉండే ఒకావిడ, (ఆమే పేరు గుర్తులేదు.)  బూందీ మిఠాయి,చెక్కమిఠాయి, పకోడీలు బుట్టలో పెట్టి వెనక నుంచి తెచ్చి అమ్మమ్మకు ఇచ్చేది. ఆమె ను చూస్తే భయం వేసేది కాని ఆమె తెచ్చిన మిఠాయిలు చాలా బాగుండేవి సరే వరండాలో అప్పటికే దర్జీ సాయెబు వచ్చేసావాడు.పిన్ని అతనితో రంగురంగుల బట్టలు ముక్కలు తెప్పించేది.తాటాకుతో రెండు బొమ్మలు చేసేది.ఆ బట్టలతో వాటికి ధోతి, చీర కట్టి, పూసలతో హారాలు చేసి వేసి సింగారించేది.దొడ్లో ఉన్న పూలతో దండలు అల్లేది.అన్నట్లు, కాగితాలు ,మెంతులు నానేసి రుబ్బి, అందులో కాస్త పసుపేసి, ఇంట్లో ఉన్న చిన్న చిన్న కటోరీలు లకు దట్టంగా పట్టించి ఎండబెట్టేది.అవి బాగా ఎండాక ఆ గిన్నె ఊడొచ్చి , కాగితంవేమో చిన్న చిన్న గిన్నెలుగా తయారయ్యేవి.అవి నేను వచ్చేటప్పటికే తయారయ్యి ఉండేవన్నమాట.బొమ్మరిల్లు, తాయిలాలు, గిన్నెలు, బొమ్మలూ తయార్ ఇక ఆలశ్యం ఎందుకు.ఆ . . . కొబ్బరాకుల బూరలు కూడా రెడీ.
మా స్నేహితులు కుడా వచ్చేసేవారు.అందరినీ రెండు భాగాలు, ఒకరు ఆడపెళ్ళివాళ్ళు, ఇంకోరు మగపెళ్ళివారన్నమాట!
"బుజ బుజ రేకుల పిల్లుందా?
బుజ్జా రేకుల పిల్లుందా?
స్వామీ దండం పిల్లుందా?
స్వరాజ్యమిచ్చే పిల్లుందా?"
అని ఒక పార్టీ అడుగుతే ఇంకో పార్టీ
"బుజబుజ రేకుల పిల్లుందీ
బుజ్జా రేకుల పిల్లుందీ
స్వామీ దండం పిల్లుందీ,
స్వరాజ్యమిచ్చే పిల్లుంది."  అనేవారు.
ఇలా పాటలతో పిన్ని ఆధ్వర్యం లోచాలా వైభవంగా జరిగేది మా బొమ్మల పెళ్ళి.అలా పెళ్ళి చేసి, అలిసి పోయి అమ్మ దగ్గరకు వెళ్ళి
"ఆటలు ఆడీ పాటలు పాడీ అలసిపోయామె,
తియ్య తియ్యని తాయిలమేదో పెట్టమ్మా" అనేదానిని. ఏం పిన్ని పెట్టలేదా అని నవ్వేది అమ్మ. ఎందుకు పెట్టలేదు బోలెడు తిన్నాంగా ఐనా ఆడుకోవటం అయ్యాక అమ్మను అలా అడగాలన్నమాట.అక్కడ మేమున్న నెలలో కనీసం నాలుగైదు సార్లన్నా బొమ్మల పెళ్ళి జరిగేది :)
మా పిన్ని కి పెళ్ళిలో మాతాతగారు ఆవూదూడను ఇచ్చారు.ఆ ఆవూదూడ తో పాటు నన్ను కూడా పిన్ని అత్తగారింటికి తీసుకుపోయింది.అక్కడ బామ్మగారికి అంటే బాబాయిగారి అమ్మకన్నమాట నేను తెగ నచ్చేసాను.అవును మరి నేను బుజ్జి బుజ్జిగా ముద్దుగా ఉండేదానిని కదా! చాలా గారాబం చేసేవారు. వాళ్ళకు మల్లె తోటలు ఉండేవి.సాయంకాలం కాగానే బోలెడు మల్లెపూలు తెచ్చేవారు పాలేర్లు.ఇల్లంతా మల్లెల వాసనతో ఘుమఘుమలాడేది.బామ్మగారు ఆ మల్లె పూలు నా రెండు జడలకూ కుట్టేవారు.ఆవిడ చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలని ఒక బొమ్మలపెట్టె నాకు ఇచ్చారు.అందులో రెండు చెక్క బొమ్మలు ,వాటికి రకరకాల మెరిసిపోయే సిల్క్  బట్టలు, లక్కపిడతలూ ఇంకా ఏవో కొన్ని బొమ్మలున్నాయి.అక్కడ ఉన్నన్ని రోజులూ వాటితో ఆడుకున్నాను. మేము వచ్చేస్తుంటే తీసుకుపో అని నాకే ఇచ్చేసారు బామ్మగారు.ఆ పెట్టెను భద్రంగా పరుపు చుట్టలో చుట్టారు. బస్ స్టాండ్ లో బస్ రాగానే నేను ,పిన్ని లోపల ఎక్కాము.పరుపు చుట్టను బస్ టాప్ మీద ఎక్కించారు.కీసర వచ్చేసరికి చీకటి పడింది.నిదరపోతున్న నన్ను ఎత్తుకొని దిగటంలో , హడావిడిలో పైన ఉన్న పరుపుచుట్ట దింపుకోవటం మర్చిపోయింది. అంతే బామ్మగారు ప్రేమగా ఇచ్చిన బొమ్మలపెట్టె ఏదరి చేరిందో! ఇప్పటికీ పిన్నిని సాదిస్తాను నా బొమ్మలపెట్టె దింపుకోలేదు అని.Friday, January 18, 2019

మేక ఒకటి మే మే అనుచూ * @ $ % ^ & *


మేక ఒకటి మే మే అనుచూ * * * * *
బాల్యం . . . మరుపురానిదీ, మధురమైనదీ.మనసు భారమైనప్పుడూ, ఏమీ తోచక బాల్కనీలో సాయం సమయం లో వంటరిగా  కూర్చున్నప్పుడూ,అదీ అప్పుడప్పుడే విచ్చుకుంటున్న పారిజాతాల సుమధుర సువాసనలూ , చల్లని చిరుగాలి చుట్టుముట్టి అలవోకగా పలుకరిస్త్తున్నప్పుడే  పనున్నట్లు చిన్ననాటి ముచ్చట్లూ గుర్తొచ్చి ఉక్కిరిబిక్కిరి చేసి పెదవులపై అలవోకగా నవ్వులను పూయిస్తాయి .అందులోనూ అమ్మమ్మగారిల్లూ , ఆ ఊరూ, ఆనాటి స్నేహితులూ గుర్తొస్తే ఇక వేరే చెప్పాలా ? అదో అలాంటి సమయములోనే నా కమలీయం లో కమనీయం గా విరబూసిసిన నా జ్ఞాపకం ఒకటి.

మేక ఒకటి మే మే అనుచూ

"నేనుఅమ్మ  కీసర దగ్గర దిగేసరికితాతగారు పంపిన బండి అక్కడ రెడీగా ఉండేది.పక్కన ఉన్న మున్నేరు లో కాళ్ళూచేతులూ కడుక్కొనిఅమ్మమ్మ పంపిన అన్నంకందిపచ్చడిగోంగూర పచ్చడి అమ్మకలిపి ముద్దలు చేసి పెడితే సుష్ఠుగా తిని,బండెక్కి పడుకునేదానిని. ఏమాత్రం తొందర లేనట్లు దారిలో చిన్న చిన్న ఊళ్ళూ పొలాలు దాటుకుంటూ తాఫీగా వెళుతూ ఉండేవి ఎడ్లు.సాయంకాలం అవుతున్నా కొద్దీ దారి పక్కనే ఉన్న మొగలి పొదల నుంచి మంచి సువాసన వస్తుండేది.మొగలిపువ్వు కోసుకుంటానని మారాము చేస్తే మొగలిపొదల దగ్గర పాములుంటాయని భయపెట్టేవాడు పాలేరు.మొగలి పువ్వు కోసుకోవాలనే కోరిక తీరనే లేదు .
మేక ఒకటి మే మే అనుచూ * @  $ % ^ & *
జ్ఞాపకాలు -7
"నేనుఅమ్మ  కీసర దగ్గర దిగేసరికితాతగారు పంపిన బండి అక్కడ రెడీగా ఉండేది.పక్కన ఉన్న మున్నేరు లో కాళ్ళూచేతులూ కడుక్కొనిఅమ్మమ్మ పంపిన అన్నంకందిపచ్చడిగోంగూర పచ్చడి అమ్మకలిపి ముద్దలు చేసి పెడితే సుష్ఠుగా తిని,బండెక్కి పడుకునేదానిని. ఏమాత్రం తొందర లేనట్లు దారిలో చిన్న చిన్న ఊళ్ళూ పొలాలు దాటుకుంటూ తాఫీగా వెళుతూ ఉండేవి ఎడ్లు.సాయంకాలం అవుతున్నా కొద్దీ దారి పక్కనే ఉన్న మొగలి పొదల నుంచి మంచి సువాసన వస్తుండేది.మొగలిపువ్వు కోసుకుంటానని మారాము చేస్తే మొగలిపొదల దగ్గర పాములుంటాయని భయపెట్టేవాడు పాలేరు.మొగలి పువ్వు కోసుకోవాలనే కోరిక తీరనే లేదు . అలా అలా మా బండి సాగిపొతుండగానే చందమామ వచ్చేసి ,వెన్నెలలు కురిపిస్తూ "హాయ్ అమ్మన్నా (అమ్మమ్మ నన్ను అలానే పిలిచేది.మా బామ్మను అమ్మన్నా అనిపిలిచేవారుట.అందుకని.కాకపోతే ఆ పేరు అమ్మమ్మకు, తాతాగారికే పరిమితం.ఇంకెవరు అలా పిలిచినా పలకను.కోపం వస్తుంది.చందమామ కదా పిలిచింది అందుకని కోపం వచ్చినా పోనీలే అని ఊరుకున్నాను.) అమ్మమ్మ దగ్గరకా పదా నేనూ వస్తాను "అని నాతోపాటే వచ్చేవాడు.అమ్మ వడిలో పడుకొని , చందమామను చూస్తూ,అమ్మ చెప్పే కథలు వింటూ , మధ్య మధ్య పాలేరు ఎద్దులను అదిలించే అరుపులు వింటూ వెళ్ళిన ఆ ప్రయాణాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. " అని చెపుతూ ఏమిటీ ఎక్కడా ఉలుకూ పలుకూ లేదు అని పక్కకు చూస్తేమా చెల్లెలుపిన్ని కూతురు,కొడుకు నన్ను చాలా కౄరంగా చూస్తూ ,” నువ్వు ఇంకో మాట మాట్లాడవంటే చంపేస్తాము ముగ్గురము కలిసి అన్నారు.మేము నలుగురం విజయవాడ నుంచి నందిగామ కు వెళుతూదారిలో కీసరను చూసి,కార్ ఆపిఅక్కడున్న రేలింగ్ ను ఆనుకొని నిలబడిమున్నేరు చూస్తూ నా అనుభవాలు  పరవశంగా చెపుతున్న నేను అవాక్కయ్యాను ఏమైంది వీళ్ళకు ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా అని.అంతలోనే తేరుకొని "ఇది మరీ బాగుందిమిమ్మలని బద్దకంగా తీరితీర్చుకొని ఆలశ్యంగా పుట్టమని నేను అన్నానామీరు పుట్టేసరికి నందిగామ నుంచి బస్ లు మొదలవటం నా తప్పాపెద్ద కూతురిగాపెద్ద మనవరాలిగా పుట్టిన నా లాభాలు  నాకుంటాయి.చంపుతాం పొడుస్తాం అని కుళ్ళుకుంటే ఏం లాభం  :) "అన్నాను.
వాళ్ళు ఏడ్చుకున్నంతమాత్రాన నేను చెప్పేది ఆపనుగా :) రోజూ పొద్దున్నే మా తాతగారు వరండా లోని చిన్న బల్ల ముందు కూర్చొని ఏవో కాగితాల మీద రాస్తూ ఉండేవారు. వరండాలోకింద పని మీద వచ్చిన వాళ్ళు చాలా మంది ఉండేవారు.వాళ్ళంతా వెళ్ళిపోయాక పూజకు కూర్చునేవారు.రోజూ సుందరకాండ పారాయణ చేసేవారు.ఒక రోజు ఆయన పక్కనే వేసి ఉన్నచిన్న పీట మీద కూర్చోబోయాను.వద్దని వారించి, “అది హనుమంతులవారి కోసం వేసాను.ఎక్కడ "రామా" అని విపిస్తుందో అక్కడికి హనుమంతులవారు వస్తారు అందుకని , మనము రామాయణం పారాయణం చేసేటప్పుడు, రాముడిని పూజించేటప్పుడు స్వామివారికి ఒక పీట వేసి ఉంచాలి .”అని చెప్పారు.మేము చింతలపాడు రాగానే పొద్దున్నే మాతాతగారు చేసే పని దర్జీ అతన్ని పిలిచి నాకు కొలతలు తీసుకొని గౌన్లు కుట్టమని చెప్పేవారు.అతను ఆ వరండాలోనే మిషిన్ పెట్టుకొని కుట్టే వాడు.ఇక రెండో పని స్కూల్ మాష్టారిని పిలిచి "మాష్టారూ మా మనవరాలిని బడికి తీసుకెళ్ళవయ్యా " అని అప్ప చెప్పేవారు.
ఆ బడి మా ఇంటి పక్కనే ఉండేది. అది ప్రైమరీ స్కూల్ అట.అక్కడా నాకు బడి తప్పేది కాదు.నాకు ఇద్దరు అమ్మాయిలు స్నేహితులు.వాళ్ళ పేర్లు గుర్తు లేవు.ఇప్పుడా అప్పుడా ఎన్ని ఏళ్ళు గడిచిపోయాయోఅసలే ఈ మధ్య మతిమరుపు ఎక్కువై ఇప్పుడు కలిసిన వాళ్ళ పేర్లే గుర్తుండటంలేదు ఇక అప్పటివేమి గుర్తుంటాయి. సీతా గీతా అనుకుందాం పోయిందేముంది :) ముగ్గురికీ పూలంటే తెగ పిచ్చి.రోజూ తప్పకుండా బంతోమందారమోనందివర్ధనమో ఏదో ఒక పూవు నేను పట్నం పిల్లను కాబట్టి షోగ్గా ఒక్క జడలో పక్కగా పెట్టుకుంటే వాళ్ళేమో రెండు జడల నిండా పెట్టుకునేవాళ్ళు.ఒక రోజు గీత తల లో పూలు పెట్టుకోకుండా వచ్చింది.స్కూల్ టైం ఐపోయిందని వాళ్ళ అమ్మ పూలు పెట్టలేదట.వచ్చి నప్పటి నుంచి తెగ బాధ పడిపోతోంది.మేమేమో దాని బాధ చూడలేకపోతున్నాము.మొత్తానికి లంచ్ బ్రేక్ అయ్యింది. వీధిలో దాదాపు అందరి ఇంటి కాంపౌండ్ గోడలకు బఠాణీ పూల తీగలు అల్లుకొని ఉన్నాయి.వాటికి బుజ్జి బుజ్జి గులాబి రంగుబఠాణీ పూలు గుత్తులుగుత్తులుగా పూచి ఉన్నాయి.ముగ్గురమూ చేతికి వచ్చినన్ని పూలు తీగఆకుల తో సహా కోసి దాని జడలల్లో పెట్టాము.అసలే పూలు పెట్టుకోలేదని ఏడుస్తోందని,తల పైన కిరీటం లా కూడా పెట్టాము.మా ఇద్దరి చేతులల్లో కూడా గుత్తులుగా పూలు ఉన్నాయి. ఐనా చాలులే అనుకున్నాము.ఇంతలో గీత "అబ్బా ఇంకా చాలే .నా జుట్టు గుంజకండిఅంది.మేమెక్కడ గుంజుతున్నాము పెట్టటం ఐపోయింది కదా అని దాని వెనకకు చూస్తే ఓ మేక దాని తలలో పూలు అందుకునేందుకు ఎగిరి ఎగిరి జడ గుంజుతోంది.అంతే ఆ మేకను ఒక్క తోపు తోసి పరుగు లంకించుకున్నాము.
రన్నింగ్ రేస్ మొదలైంది.ముందు మేము ముగ్గురమువెనకాల మేక. . .
పరుగో పరుగో మేము. . . మేక. . . ఎవరమూ ఆగటం లేదు.ఆయాసం వస్తోంది. . . రొప్పుతున్నాము. . . ఐనా ఆగే పరిస్తితి లేదు.ఆ మేక వదలదే . ఎండాకాలం మిట్ట మధ్యాహనం వీధిలో కానిఇంటి ముందున్న అరుగుల మీద కాని ఎవరూ లేరు.స్కూల్ కు దూరంగా వచ్చేసాము :( ఇక పరిగెత్తలేక ఏడుపు వచ్చేస్తోంది. మేము గట్టిగా మేక అంతకన్నా గట్టిగా మే మే అని అరుచుకుంటూ పరుగూ. . . పరుగూ . . . ఇంతలో దేవుడిలా ఒకతను అప్పుడే బస్ దిగి వీధిలోకి వస్తూ మమ్మలిని మేకనూ చూసి మమ్మలిని ముగ్గురినీ ఒడిసిపట్టుకుని  మా ఇద్దరి చేతిలోని పూలనుగీత తలలోని పూలనూ పీకి మేక వైపు విసిరేసాడు.అప్పటికి అది కాస్త శాంతించి మా వైపు గుర్రుగా చూస్తూ కసాపిసా నమిలేస్తోంది.మేమూ ఒగర్చుకుంటూ పక్క నున్న అరుగు మీద కూలబడ్డాము!
ఇది నా చిన్నప్పటి ఓ ముచ్చట :) మా అమ్మగారి ఊరు, కృష్ణాజిల్లాలోని నందిగామ దగ్గర "చింతలపాడు."
 పరుగు పందాల కోసం తెగ కష్ట పడుతారు కాని ఇలా మేకను వెనుక తొలుతే ఎంతటి పరుగు పందెం లో నైనా గెలవచ్చని ఎందుకు తోచదో 😊       


పాడమని నన్నడగతగునా! (ఏడిపించటానికి కాకపోతే)


పాడమని నన్నడగతగునా! (ఏడిపించటానికి కాకపోతే)
జ్ఞాపకాలు-6
అవి మేము ములుగులో ఉన్న రోజులు.ముందే చెప్పినట్లు ములుగు ఊరే ఐనా కాంప్ చుట్టూ పెద్ద పెద్ద చెట్లు.ఓ అడవిలాగానే ఉండేది.మా ఇంటి ముందే నాన్నగారి ఆఫీస్ ఉండేది.అక్కడ పెద్ద పెద్ద పున్నాగపూల చెట్లుండేవి.పొద్దున్నే తెల్లటి పూలు నేలంతా పరుచుకునేవి.ఆ పూలను ఏరుకొని , జడలల్లుతూ,రేకులతో, కాడలతో బూరెలు చేసి ఊదుకుంటూ తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం నేనూ నా స్నేహితులు.అది బోర్ కొట్టినప్పుడు , ఊరి బయట అంటే ఎంతో దూరం కాదు, ఇంటికి కూతవేటు దూరం లోనే ఉన్న చింతచెట్ల కింద ఆడుకుంటూ ఉండేవాళ్ళం.అక్కడి దగ్గరలోనే ఓ బడ్డీకొట్టు ఉండేది.అది అప్పట్లో బస్ స్టాప్ అన్నమాట.ఊరి వాళ్ళెవరైనా అక్కడ బస్ దిగినప్పుడు , మిట్టమధ్యహ్నం చింత చెట్టు కింద ఆటలేమిటి దయ్యాలు పడతాయి ఇంటికెళ్ళండి అని భయపెట్టేవారు.అబ్బే అవేమీ చెవికి ఎక్కేవి కావు. ఆవిధంగా హాపీగా ఆడుకుంటున్న ఒకానొక రోజు, భద్రావతి అత్తయ్య బస్ దిగి వస్తూ నన్ను చూసి , "బేబీ ఇంత ఎండలో ఆటలేమిటే? ఇంటికి పద" అంది.భద్రావతి అత్తయ్యకి పొడవాటి రెండు పెద్ద పెద్ద జడలుండేవి.నేను ఆ జడలు పట్టుకొని కాసేపు వేళ్ళాడి , తిరిగి ఆటలో పడిపోయాను.ఇక నేను వచ్చేట్టుగా లేనని వెళ్ళిపోయింది.భద్రావతి అత్తయ్య ములుగు గ్రామసేవిక సత్యవతి అత్తయ్య చెల్లెలు.వెళ్ళినట్లే వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి,"బేబీ రావే, నిన్ను మీ అమ్మ పిలుస్తోంది." అంది.అమ్మ పిలుస్తే తప్పదు అనుకుంటూ వెళ్ళాను.అమ్మా, సత్యవతి అత్తయ్య వరండాలో కూర్చొని ఉన్నారు.నన్ను చూడగానే అమ్మ,"అత్తయ్యావాళ్ళ ఆఫీస్ లో పాట పాడాలట."అని నానెత్తిన ఓ బరువు పెట్టింది. మా అమ్మ కు పాటలంటే చాలా ఇష్టం.అందులో భానుమతి, యం.యస్ .సుబ్బలక్ష్మి పాటలంటే చెవి కోసుకుంటుందిట. (అమ్మ ఆ మాట అన్నప్పుడల్లా ఎక్కడ చెవి కోసేసుకుంటుందో అని నేను భయంభయంగా చూసేదానిని)అందుకని నన్ను ఓపెద్ద గాయనిగా చేయాలని ఎంతగానో ప్రయత్నం చేసేది.సత్యవతత్తయ్య ఆఫీస్ లో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు నాతో పాటపాడించేది. ఇక తప్పేదేముంది? శుభ్రంగా వంటిన ఉన్న మట్టిపోయేట్టుగా స్నానం చేయించి, తెల్లటి ఫ్రాక్ , బూట్లు, పాకెట్ జడతో తయారు చేసి అత్తయ్య తో పంపింది.అక్కడ "భలే తాత బాపూజీ " పాటపాడాను.ఎండాకాలం రాగానే అమ్మ తెల్లని గ్లాస్కో బట్టతో అరడజను గౌన్లు కుట్టించేది.పైగా వాటిని టినోఫాల్ తో సొంతంగా ఉతికేది..దానితో అవి తెల్లగా టినోఫాల్ అడ్వర్టైజ్మెంట్ లో లా తళతళా, మిలమిలా మెరిసిపోతుండేవి. ఆ విధం గా అప్పుడప్పుడు నా గాన కచేరి జరుగుతూ ఉండేదన్నమాట.
అకడి తో ఐపోలేదు.నాన్నగారికి అడవుల్లొకే ట్రాన్స్ఫర్ లు అవుతున్నాయని, నేను చదువుసంధ్య లేకుండా తిరుగుతున్నానని కుట్రతో అమ్మ వరంగల్ కు మకాం మార్చింది.అప్పుడు చదువే కాకుండా , నేను యం.యస్.సుబ్బలక్ష్మి అంత గాయనిని కావాలని,సంగీతం టీచర్ ను కూడా పెట్టింది.పొద్దున రేడియోలో వచ్చే ఈ నెల పాట ముందు కూర్చోబెట్టి లలితగీతాలు నేర్పించేది. అప్పుడే నారాయణరెడ్డి గారి "ఈ నల్లని రాళ్ళల్లో ఏ కన్నులు దాగెనో "పాట నేర్చుకున్నాను.ఆ తరువాత ఆ పాట 'అమరశిల్పి జక్కన్న ' సినిమాలో చూసినప్పుడు, లలిత గీతం సినిమాలో ఎట్లా పెట్టారు అని ఎంత కన్ ఫ్యూజ్ అయ్యానో! కీర్తనలు,జయదేవుని అష్టపదులదాకా నేర్చుకున్నా పాటలు వినేదానినే కాని పాడుదానిని కాని అర్ధం అయ్యింది.పాపం అమ్మ.కాకపోతే నాకూ హాయిగా పాడుకోవాలని ఉంటుంది.ముఖ్యంగా , పద్మారావు నగర్ లో అమ్మవారి గుడిలో రాహుకాల పూజకు వెళ్ళినప్పుడు, అక్కడ తమిళ ముత్తైదువులు పాడుతుంటే ఎంతో బాగుండేది.గళమెత్తి అంత హాయిగా పాడుకోవటానికి కూడా అదృష్టం ఉండాలి.ఎట్లాగూ పాడలేను కనీసం వినైనా సంతోషపడదామని రోజంతా పాటలు పెట్టుకుంటాను.అప్పట్లో పొద్దున వివిధభారతి లో శ్రోతలు కోరిన పాటల తో మొదలవుతే, రాత్రి బినాకా గీత్ మాల దాకా రేడియో పాడుతూనే ఉండేది.ఇరానీ హోటల్ కి వచ్చినట్టుంది  అని ఏమండీగారు గొణుక్కుంటూ ఉంటే ఏమండీ ఉన్న కాసేపు నా రేడియో మూగబోయేది.ఇప్పుడు పాపం ఏమండీ నే అలవాటు పడిపోయారు :)


చాయ్ బిస్కత్


చాయ్ బిస్కత్
జ్ఞాపకాలు - 5
10-1-2029
మా చిన్నప్పుడు మా అత్తయ్యవాళ్ళ ఇంటికి వెళుతుండేవాళ్ళము.పెద్ద అయ్యాక వెళ్ళలేదా అంటే ఎందుకు వెళ్ళలేదు కాకపొతే కాస్త పెద్దయ్యాక పెళ్ళి చేసుకొని ఏమండీ తో కలిసి దేశం మీద పడ్డాను కదా అందుకని తగ్గిపోయిందన్నమాట.
మా అత్తయ్యావాళ్ళు ఆసిఫాబాద్ లో ఉన్నప్పటి సంగతి.ఇల్లు అడవిలో ఉండేది. అదేమిటో "సీత"అన్న పేరున్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాము కాబట్టి అడవులల్లోనే ఉండాలి అనే రూల్ ఉందేమో అన్నట్లు మామయ్య, నాన్నగారు ఎప్పుడూ అడవులల్లో, తాండాలల్లో  నే ఉండేవారు.ఈ సీతమ్మలు కూడా ఆ అడవులు , తాండాలు బాగానే ఎంజాయ్ చేసారుట.ఎప్పుడు ఆ విషయం వచ్చినా , ఓ పెట్టెలో కాసిని గిన్నెలు,వంటసామాన్లు, ఓ పెట్టెలో రెండు చీరలు వేసుకొని వెళ్ళేవాళ్ళం అని మురిపెంగా చెప్పేవారు! ఆ అడవిలోనే మామయ్య కొలీగ్ అనుకుంటా ఇంకో ఆయన కూడా వుండేవారు.ఓసారి అత్తయ్య, అత్తయ్య కూతురు పార్వతి,అమ్మ, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాము.వెళ్ళే ముందు అత్తయ్య, అమ్మ నాకూ పార్వతికీ బోలెడు సూక్తి ముక్తావళి చెప్పారు, అక్కడ వాళ్ళు ఏమైనా పెట్టగానే తినవద్దు.మాకు కావాలి అని అడగవద్దు.ఏమీ మాట్లాడకుండా బుద్దిగా కూర్చోవాలి వగైరా వగైరా అన్నమాట. ఇద్దరం బుద్దిగానే బుర్ర ఊపేసాము.సరే వెళ్ళాము. అత్తయ్య,అమ్మ, అత్తయ్యగారు ( మరి అప్పట్లో  బయట వాళ్ళంతా అత్తయ్యగార్లు, పిన్నిగార్లే కదా) కాసేపు కబుర్లు చెప్పుకున్నాక, అత్తయ్యగారు ఒక ప్లేట్ లో కాసిని బిస్కెట్ లు, రెండు కప్పు లాలో ఏదో ద్రవ పదార్ధం తీసుకొచ్చారు.అమ్మా, అత్తయ్య రోజూ  కాఫీ తాగటం చూసాము కాని ఇదేమిటో మాకు తెలీదు.బిస్కెట్ లు కూడా మా ఇంట్లో ఉండే బిస్కెట్ల లా లేవు.గుండ్రంగా పెద్దగా ఉన్నాయి. నోరూరిస్తున్నాయి. నేను పార్వతి వైపు చూసాను.తనదీ నా పరిస్తితే!ఇద్దరమూ అవి చూస్తున్నాము, అమ్మలను చూస్తున్నాము. "అత్తయ్యగారు పిల్లలు చాయ్ తాగుతారా?" అని అడిగారు.ఓహో దానిని చాయ్ అంటారన్న మాట అనుకున్నాను.అమ్మ కప్ సాసర్ చేతిలోకి తీసుకొని లేదండి వాళ్ళకు అలావాటు లేదు అంది.కాని ఇక ఆరాటం ఆపుకోలేక "లేదు తాగుతాం "అన్నాము ఇద్దరమూ అమ్మలవైపు చూడకుండా జాగ్రత్త పడుతూ.
"మీకు మలాయ్ చాయ్ తెస్తాను." అని అత్తయ్యగారు రెండు చిన్న చిన్న గ్లాస్ లల్లో తెచ్చారు.కప్ లల్లో ఇవ్వలేదని అసంతృప్తిగా ఉన్నా అవి తీసుకున్నాము.చూడగానే ఆ చాయ్ మీద మీగడ తరకలు తేలుతూ తెల్లగా మెరిసిపోతున్నాయి.మనకసలే పాలు, మీగడ,వెన్న లాంటి పదార్ధాలు పడవు.పైగా మీగడంటే డోకు!"యాక్" అంటూ మొహమంతా వికారంగా పెట్టుకొని, పక్కన పెట్టేసి బిస్కెట్ తీసుకుంటూ పార్వతి వైపు చూసాను తనూ డిటో! భలే రుచిగా ఉన్నాయి ఇంకేముంది ఇద్దరమూ రెండేసి బిస్కెట్లు లాగించేసాము! .ఆ తరువాత ఇంటికి వెళ్ళాక మా ఇద్దరి పరిస్తితి ఏమిటి అని అడగకూడదు.అడిగినా మేము చెప్పము

పుట్టినరోజు పండుగ


పుట్టినరోజు పండుగ
జ్ఞాపకాలు-4
6-1-2019
నా మొదటి పుట్టినరోజు గురించి అమ్మ చెప్పిన జ్ఞాపకం. అవును మరి అంత చిన్నపాపాయిని నాకేమి గుర్తుంటుంది అమ్మనే చెప్పాలి కదా!
"మీ నాన్నగారి కి చదువు పూర్తి కాగానే,వైరా లో  ఉద్యోగం వచ్చింది. కొద్ది కాలానికే తుంగభద్ర ప్రాజెక్ట్ కు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇంక మేనల్లుడు పెద్దవాడైపోయాడు, పైగా అటెటో దూరం వెళుతున్నాడు అని మేనమామ పిల్లను ఇచ్చి హడావిడిగా పెళ్ళి చేసేసి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.అప్పుడు నాకు 12 సంవత్సరాలు.కాపురానికి ఎలహంక తీసుకెళ్ళారు.అక్కడ అప్పటికే వైదేహి అక్కయ్య, సత్యవతి అక్కయ్య ఉన్నారు.చారి మామయ్యగారు, మీ నాన్నగారు చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు.అదృష్ఠవసాత్తు ఇద్దరికీ ఒకే చోట ఉద్యోగం వచ్చింది.వైదేహి అక్కయ్య వాళ్ళ పుట్టిల్లు అక్కడికి కాస్త దగ్గరే.సత్యవతి అక్కయ్య, దయాశంకరం బావగారు కూడా మాతో బాగా కలిసిపోయారు.ముగ్గురం ఒకే కుటుంబం లా ఉండేవాళ్ళం.  అందరిలోకి చిన్నపిల్లనని అందరూ నన్ను ముద్దు చేసేవారు.
నాకు 14 ఏళ్ళ వయసు లో నువ్వు పుట్టావు.అప్పటికి వాళ్ళకు ఎవరికీ ఇంకా పిల్లలు పుట్టలేదు.దానితో నువ్వు అందరికీ అపురూపమైపోయావు.చారి బావగారు నిన్ను ఒక్క నిమిషం కూడా వదిలేవారు కారు.నేను , వైదేహి అక్కయ్య,సత్యవతి అక్కయ్య సినిమాకు వెళితే ఆయనే నిన్ను చూసుకునేవారు.ఉయ్యాల లో ఊపుతూ , పాటలు పాడుతూ నిన్ను నిద్రబుచ్చేవారు. బేబీ , మా బేబమ్మ అని తెగ ముద్దుచేసేవారు.( అవును నా చిన్నప్పుడు అందరూ నన్ను బేబీ అనిపిలిచేవారు. ఆ మధ్య నాన్నగారి ఫ్రెండ్ భార్య అమ్మ కు ఫోన్ చేస్తే నేను తీసాను. బేబీ నా మాట్లాడేది అన్నారావిడ :) అమ్మా బేబి ఎవరు , ఆవిడ బేబీనా అని అడుగుతున్నారు అంటే , నువ్వే అన్నది అప్పుడు గుర్తొచ్చింది నా చిన్నప్పటి పేరు :) ఓహో ఐతే చారి మామయ్యగారు పెట్టారన్నమాట నాకు బేబీ అని. ఇలా హరి కథలో పిట్టకథల్లా నా స్వగతాలు కూడా వస్తుంటాయి. )
మీ అత్తయ్య నిన్ను కాళ్ళ మీద పడుకోబెట్టుకొని ,నున్నగా ఉన్న నీ తల కు ఆముదం రాస్తూ దీనికి అస్సలు జుట్టు లేదొదినా కాస్త ఆముదం రాస్తుంటేనన్నా పెరుగుతుందేమో అనేది.( నీ చేతి ఆముదం మహిమా అత్తయ్యా అంత జుట్టు వచ్చింది.పెళ్ళయ్యేదాకా బాగానే ఉంది ఆ తరువాత ఇంత జుట్టు ఎందుకిచ్చావు దేవుడా అని రోజూ తల దువ్వుకుంటూ ఏడ్చేదానిని.ఇప్పుడేమో ఊడిపోయి పిలకలా ఐన జుట్టు చూసుకొని ఏడుస్తున్నాననుకో అది వేరే సంగతి ) ఎప్పుడూ నిన్ను ఎత్తుకొని తిప్పుతూ బంగారు పాపాయి బహుమతు లు పొందాలి పాట పాడుతుండేది.( ఓ చారి మామయ్యగారు, అత్తయ్య నాకు పాటలు వినటం అలవాటు చేసారన్నమాట. ఇదన్నమాట సంగతి.) ఇట్లా అందరూ నిన్ను గారాబం చేసేవారు. "
"అమ్మా ఇంతకీ అక్క ఫస్ట్ బర్త్ డే కి ఏమి చేసిందో చెప్పు." అని తొందర పెట్టింది మా చిన్న చెల్లి ఉష.
"ఉండు చెపుతున్నాను అని, ప్రతి బర్త్ డే కు ఫొటో తీయించాలి అని అనుకున్నాను .చక్కగా ముస్తాబు చేసి స్టూడియో కు తీసుకెళ్ళాము. వెళ్ళే ముందు , డాబా మీద పూసిన సన్నజాజి పూలు అన్నీ ముద్దగా మాల కట్టి తీసుకెళ్ళాను.ఫొటో గ్రాఫర్ రాగానే ఆ దండ మెళ్ళో వేసాను.బుజ్జి తల్లి మెళ్ళో దండతో ముచ్చటగా ఉందని మురిసిపోతూనే ఉన్నాను , పుట్టుక్కున దండ గుంజి తెంపేసింది.పూలన్నీ చెల్లా చెదురుగా పడిపోయాయి."అన్నది.
"ఓస్ ఇంతేనా." అని హాశ్చర్యపోయారు మా చెళ్ళెల్లిద్దరు.


జొన్న రొట్టె- ఉల్లిపాయ ఖారం


జొన్న రొట్టె- ఉల్లిపాయ ఖారం
జ్ఞపకాలు -3
4-1-2019
"బేబమ్మా . . . చుక్కీ . . . బేబమ్మా. . . చుక్కీ "
బిజిలీ  పిలుపులు గట్టిగా వినిపిస్తుంటే చెట్టు వెనుక దాకున్న నేను ఒక్కసారిగా ఉలిక్కి పడి చుట్టూ చూసాను. చీకట్లు కమ్ముకుంటున్నాయి.చుట్టూ పరిసరాలు మసక మసకగా కనిపిస్తున్నాయి.అప్పటిదాకా ఆట ద్యాసలో చీకటిని గమనించని నేను భయపడి బిజిలీ  అని అరుస్తూ పరుగెత్తుకెళ్ళి బిజిలీ  ని వాటేసుకొన్నాను.ఇంకో పక్క నుంచి చుక్కీ కూడా వచ్చి బిజిలీ  వాటేసుకొంది. నన్ను దగ్గరకు తీసుకొని,"ఇంత రాత్రయ్యేదాక బేబమ్మ ను అడివి లో తిప్పుతున్నావా?" అని చుక్కి చెవు పిండి, నెత్తిన మొట్టింది.చుక్కీ ఏడుపు  చూసి నేనూ ఏడుపు లంకించుకున్నాను.ఇద్దరినీ చెరో చేత్తో పట్టుకొని మా ఇంటి దగ్గరకు తీసుకెళ్ళింది. ఇల్లంటే , వెదురు బొంగులు,తడికతో కట్టిన గుడిశ.దాని ముందు పేడతో కళ్ళాపి చల్లి ముగ్గేసి ఉంది.అక్కడే అమ్మ ఒక నులక మంచం మీద కూర్చొని నా లంగా కు అద్దాలు కుడుతోంది.నేను ఒక్క ఉదుటున బిజిలీ  ని వదిలించుకొని అమ్మ దగ్గరకు పరిగెత్తాను.అమ్మ ఒక్క చేత్తో నన్ను ఆపుతూ "చిన్నగా సూది గుచ్చుకుంటుంది.అప్పుడే ఆటలైపోయాయా ?" అంది.
అది ఒక చిన్న లాంబాడీ తాండా.నాన్నగారి పనిమీద అక్కడి కి వచ్చాము.ములుగు దగ్గర అడవి అది.అక్కడ మా  ఇంటి లాంటి వెదురు ఇళ్ళు ఓ పది ఉండవచ్చు. మేము తప్ప మిగితా అందరూ లంబాడీలే. బిజిలీ  అమ్మ కు అసిస్టెంట్. ఇంట్లో పనంతా చేస్తుంది. అమ్మ కు అద్దాలు కుట్టటం బిజిలీ  నే అమ్మకు నేర్పించింది.అప్పట్లో నా లంగాలు, గౌన్ లు అన్నింటి మీద అద్దాలే అద్దాలు :) బిజిలీ  కూతురు చుక్కీ నా వయసుదే, నా దోస్త్. పొద్దున్నే అమ్మ, నేను, బిజిలీ  , చుక్కీ అందరమూ దగ్గరలో ఉన్న వాగుకు వెళ్ళి స్నానం చేసి, కాసేపు నీళ్ళల్లో ఆడుకొని వచ్చేవాళ్ళం.అప్పుడేమిటి రోజంతా ఆటలే. ఆ అడవి, కొండలు, గుట్టలూ  అన్నీ   మా ఇద్దరివే .
ఆడుకొని ఆడుకొని అలిసిపోయి వస్తే బిజిలీ  వేడి వేడి నీళ్ళ తో స్నానం చేయించేది.నాన్నగారు సర్వే నుంచి వచ్చేసరికి కాగులో నీళ్ళు కాగుతూ ఉండేవి.నాన్నగారి స్నానం అయ్యేలోపల రెండు పెద్ద పెద్ద జొన్న రొట్టెలు, అందులోకి ఎర్రగా మెరిసిపొతున్న ఖారం వేసి తీసుకొచ్చి ఇచ్చేది. నాన్నగారు అవి తింటూ నాకూ కాస్త జొన్న రొట్టె, ఖారం పెట్టేవారు. ఆ ఖారం నోట్లో వేసుకోగానే అబ్బ ఎంత మంట పుట్టేదో! ఐనా రుచి బ్రహ్మాండగా ఉండేది.ఇప్పటికీ ఆ రుచి నాలుక మీద ఆడుతూనే ఉంది.
రెండు నెలల క్రితం నీరసంగా పడుకున్న అమ్మ దగ్గర కూర్చొని ఈ సంగతి చెపితే, "అప్పుడు నీకు ఐదేళ్ళు కూడా లేవు . ఇంత గుర్తుందా?" అని ఆశ్చర్యపోయింది.
"ఎందుకు గుర్తులేదు , ఆ ఖారం రుచి, నువ్వు నులకమంచమీద, జుబ్లీ కింద కూర్చొని , అద్దాలు కుట్టటం, అన్నీ గుర్తే నాకు."అన్నాను.
ఆ గూడెం పేరు ఏదో చెప్పింది అమ్మ. కాని ఇప్పుడు అది మర్చిపోయాను." అప్పుడు ఆ చుట్టు పక్కల అడవిలోకి  సర్వే కు వెళుండేవారు మీ నాన్నగారు.సమ్మక్క సారలక్క జాతరకు కూడా వెళ్ళారు.నేనూ వస్తాను అంటే, వద్దు అక్కడ కు పులులు వస్తాయి అని మీ నాన్నగారు నన్ను తీసుకెళ్ళలేదు. అవునూ నీకు అన్నీ గుర్తున్నాయి అంటున్నావు కదా , నీ ఫస్ట్ బర్త్ డే కు నువ్వు ఏమి చేసావో చెప్పు." అంది అమ్మ నీరసంగా నవ్వుతూ.
"పో అమ్మా.మరీ సంవత్సరం అప్పటివి ఏమి గుర్తుంటాయి?నువ్వు చెప్పు నేనేమి చేసానో" అన్నాను.
ఇదంతా వింటున్న మా చెళ్ళెల్లిద్దరూ "అక్క ఏం చేసిందమ్మా ? "అని ఆతృతగా అడిగారు. నా ఫస్ట్ బర్త్ డే కి నేనేమి చేసానో అమ్మ చెప్పింది వింటే అందరూ కమల పరచ కు ఇంత సీన్ ఉందా అని ఆశ్చర్యపోతారు!


మధురమైనవి-మరుపురానివి


మధురమైనవి-మరుపురానివి
జ్ఞాపకాలు -2
2-1-2019
అవి నేను SSLC చదివేరోజులు. ఆ రోజు జనవరి ఫస్ట్.అవి, జనవరి ఫస్ట్ రోజున గ్రీటింగ్స్ ఇచ్చుకోవటం, హాపీ న్యూ ఇయర్ చెప్పుకోవటం తెలీని రోజులు.ఆ రోజు నేను స్కూల్ నుంచి రాగానే అమ్మ , నా నోట్ బుక్ కన్నా చిన్నది నల్లటి కవర్ తో ముద్దుగా ఉన్న బుక్ ఒకటి ఇచ్చి, ఇక నుంచి నువ్వు రోజూ , ఆ రోజు జరిగిన  విశేషాలు ఈ బుక్ లో వ్రాయి అంది.నాకు అర్ధం కాలేదు.అప్పటికే 9th క్లాస్ ఎండాకాలం సెలవల్లో  ఇందులో నువ్వు చదివిన, నీకు నచ్చిన వాక్యాలు ఏమైనా ఉంటే రాసుకో అని ఒక కొత్త నోట్ బుక్  ఇచ్చింది. అలాగే రాసుకొని భద్రంగా దాచుకుంటున్నాను.10th క్లాస్ ఎండాకాలం సెలవల్లో ఏదో బుక్ చదివి అది నాకు నచ్చలేదు అంటే, అది ఎందుకు నచ్చలేదు అని దాని గురించి చెప్పమని అడుగుతే నాకు తోచినవి చెప్పాను. ఆ మరునాడు కొత్త నోట్ బుక్ తెప్పించి,ఇందులో నువ్వు చదివిన పుస్తకాలు నీకు నచ్చితే ఎందుకు నచ్చాయి, నచ్చక పోతే ఎందుకు నచ్చలేదు అన్నవి రాయి అని చెప్పింది. అప్పటి నుంచి అలాగే రాస్తున్నాను.అప్పడప్పుడు అమ్మ ఆ రెండు పుస్తకాలు చదువుతుండేది. కొన్ని సార్లు ఎలా రాయలో వివరించేది. మరి ఇప్పుడు ఈ పుస్తకం ఏమిటో, ఎందుకిచ్చిందో తెలీలేదు. ఆబుక్ చూసేందుకు చాలా ముద్దుగా ఉంది.నల్లటి కవర్ వేరే బుక్ కవర్ ల లా లేకుండా చక్కగా నున్నగా మెరుస్తోంది.ఆ బుక్ ను తిరిగేసాను. మొదటి పేజ్ లో "కమలకు ఆశీస్సుల తో అమ్మ" అని రాసి ఉంది .తరువాత పేజ్ లల్లో ప్రతి పేజ్ మీద డేట్, నెల వేసి ఉన్నాయి.అన్నట్లు పుస్తకం అట్ట మీద ఆ సంవత్సరం వేసి ఉంది.అట్లాంటి పుస్తకం నేనెప్పుడూ చూడలేదు.చాలా ఆసక్తి గా " అమ్మా ఇదేమి పుస్తకం ? దీంట్లో ఏమి రాయాలి?" అని అడిగాను.
"దీన్ని డైరీ అంటారు. నువ్వు రోజూ స్కూల్ నుంచి రాగానే , మీ స్కూల్ లో ఏమి జరిగిందో , మీ ఫ్రెండ్స్ ఏమన్నారో అవన్ని నాకు చెపుతావు కదా , అవి ఇందులో రాయి." అంది.
"ఐతే ఇక నుంచి నీకు చెప్పవద్దా ?" అన్నాను దిగులుగా. స్కూల్ నుంచి రాగానే అమ్మ తో మాట్లాడకపోతే ఎట్లా?
"ఎందుకు చెప్ప వద్దు చెప్పు. కాని ఆ విశేషాలన్నీ ఇందులో కూడా రాసుకొని దాచుకున్నావనుకో,నువ్వు పెద్దదాని వయ్యాక అవన్నీ చదువుకుంటూ ఉంటే తమాషాగా ఉంటుంది. నీ జ్ఞాపకాలన్నీ భద్రంగా దాచుకుంటున్నవన్నమాట.రాసుకునేటప్పుడు ఆ రోజు నువ్వు చేసినవాటిలో  మంచి చెడూ  తెలుసుకోవచ్చు. నిన్ను నువ్వు సరి దిద్దుకోవచ్చు. ఈ రోజు కొత్త సంవత్సరము మొదలు కదా. ఇలాంటి డైరీ లు ప్రతి సంవత్సరమూ మొదటి రోజున వస్తాయి. ఆ సంవత్సరమంతా మనము ఏమి చేసామో రోజూ రాసుకోవచ్చు ఇందులో.అంతే కాదు మనకు ముఖ్యమైన విషయాలు కూడా ఇందులో రాసుకోవచ్చు.ఇప్పుడు నువ్వు SSLC కి వచ్చావు.పెద్దదానివయ్యావు అని ఎండాకాలం సెలవలు కాకపోయినా ఇప్పుడు ఇస్తున్నాను." అని వివరించింది.
అదో అలా మొదలైంది నేను డైరీ రాయటము. చాలా సంవత్సరాలు రాసుకున్నాను. పిల్లల విశేషాలు కూడా రాసుకునేదానిని. నా సంతోషాలను, దుఃఖాలను ఎన్నింటినో అమ్మలా కడుపులో దాచుకుంది నా డైరీ. కాని ఎందుకో గుర్తులేదు రాయటం మానేసాను.ఆ పాత డైరీలు కూడా ట్రాన్స్ ఫర్ లల్లో తిరగటం లో ఎక్కడో పోయాయి.కాని అలా రాయటం తో నా జ్ఞాపకాలన్నీ నా దగ్గర భద్రంగానే ఉన్నాయి.
మా అబ్బాయి నాకు బ్లాగ్ చేసి ఇచ్చి ఇంక రాసుకో అన్నడు. ఏమి రాయాల్రా ఇందులో అని అడిగాను.
"నీ ఇష్టం ఏమైనా రాసుకో నీకు నచ్చినవి, నచ్చనివి,నువు మాకు చెప్పిన కథలు అన్నీ. ఇది నీ ఓపెన్ డైరీ అనుకో." అన్నాడు.
మరిచిపోయిన నా డైరీ నన్ను వెతుక్కుంటూ వచ్చింది అని ఎంత సంతోషం వేసిందో!


కొత్త సంవత్సరం


కొత్త సంవత్సరం
జ్ఞాపకాలు -1
 1968 డిసెంబర్ 31
స్థలం; మద్రాసు మెరీనా బీచ్
ఓ గంటసేపటి నుంచి ఏమండీగారు చాలా ధీర్గాలోచనతో, చేతులు వెనక్కి పెట్టుకొని కాసేపు, పక్కనపెట్టుకొని కాసేపు, గడ్డం రాసుకుంటూ కాసేపు అటూ ఇటూ అచార్లూ పచార్లూ చేస్తున్నారు.నేను ఏమండీగారి వెనక  ఆ కవాతు చేయలేక ,కొత్త కావటం తో మొహమాటం తో ఏమి చెప్పలేక అలాగే నీరసంగా తిరుగుతున్నాను. అప్పటికి మా పెళ్ళై పది రోజులైంది.తిరుపతి లో స్వామివారికి వైభవంగా కళ్యాణం చేయించి, బెంగుళూర్ వెళుదామనుకున్నాము.కళ్యాణం ఐతే వైభవం గానే జరిపించాము కాని స్వామివారు , ఫాగ్ బాగా పడుతొంది, బెంగుళూర్ కు బస్ లు వెళ్ళటం లేదు, మద్రాస్ వెళ్ళండి అని ఆదేశించటం తో ఇదో ఇలా మద్రాస్ లో నాలుగురోజులుగా తిరుగుతున్నాము.ఇంతకీ ఈ అచార్లూ పచార్లూ ఎందుకయ్యా అంటే, ఏమండీగారు నన్ను ఏమని పిలవాలి అని అన్నమాట. కమలను నానా విధాలుగా తిప్పారు.కొన్ని ఏమండీకి నచ్చ్లేదు.కొన్ని మొహమాటం గా ఊ అని బుర్రూపినా నాకు నచ్చలేదని ఏమండీకి తెలిసిపోతోంది. సమస్య పది రోజులైనా ఓ కొలిక్కి రాలేదు.కనీసం ఇప్పుడైనా ఏదైనా తొస్తే బాగుండు అని నేను అనుకుంటుండగానే ,గబుక్కున వెనక్కి తిరిగి "అవును తెలుగు అక్షరాల నుంచే ఎందుకు ?ఇంగ్లిష్ లెటర్స్ లో నుంచి కూడా మార్చవచ్చు కదా?" అన్నారు.గబుక్కున తిరగటం తో కింద పడబోతున్న నేను , నిలదొక్కుకొని "అవును" అన్నట్లు తలాడించేసాను.ఇహ KAMALA లో నుంచి ఏవి తొలిగించాలి అని వాటిని తిరగేసి మరగేస్తున్నారు.నేనూ ఏమి చెపుతారా అని ఆసక్తిగా చూస్తున్నాను.KA తీసేసి, మ కు ధీర్గమిచ్చి, " మాల"  అంటే ఎలా ఉంది అన్నారు? ఓ బాగుంది అన్నాను.ఆవిధం గా యాభైఏళ్ళ క్రితం డిసెంబర్ 31 న మాల గా పునర్జన్మ ఎత్తానన్నమాట :)
ఏమండిగారు మిలిటరీ ఇంజనీరింగ్ కాలేజ్ లో కోర్స్ లో చేరటం తో,ఆ తరువాత సంవత్సరం న్యుఇయర్ కు పునా లో ఉన్నాము.అందరూ స్టూడెంట్ ఆఫీసర్స్, కొత్తగా పెళ్ళైనవాళ్ళు. మరి పార్టీ ఏర్పాట్లు ఘనంగా ఉండాలికదా. రాఫ్ట్ ఫ్లోర్ ఆన్ రివర్( డాన్స్ ఫ్లోర్ రివర్ మీద చెక్కబల్లల తో) తయార్ . ఫేమస్ బాండ్ అదుర్స్. ఇక చీఫ్ గెస్ట్ ఎవరూ టాప్ హీరోయిన్స్ లల్లో ఒకరైన తనూజ.  అన్నీ ఏర్పాట్లూ అదుర్స్. మరి మా ప్రిపరషన్స్ కూడా అందుకు తగ్గట్టు ఉండాలిగా.అబ్బాయిలంతా పెళ్ళి సూట్ లు డ్రైక్లీంగ్ చేయించి, కొత్త టైలు, స్మార్ట్ హేర్ కట్టింగ్స్ తో తయార్.అమ్మాయిలు పెళ్ళి బెనారసీ చీరలు పక్కన పడేసి కొత్తగా వస్తున్న ప్రింటెడ్ సారీస్ , నేల్ పాలిష్ , లిప్ స్టిక్ లతో తయార్. ఇంక హడావిడే హడావిడి. డాన్స్ క్లాస్ లో చేరి ఏమండీ సీరియస్ గా నేను ఈజీబూజీ గా నేర్చుకున్నాము. డాన్స్ మాస్టర్ మీకే ఈ కొత్త స్టెప్స్ నేర్పిస్తున్నాను అని ఏవేవో విన్యాసాలు చేయించేవాడు!వస్తున్నది టాప్ హీరోయిన్. మరి మన మేకప్ కూడా ఆ హీరోయిన్ కు తగ్గట్టు ఉండాలా వద్దా :) మనకేమీ ఆ భయమేమీ లేదు ఎందుకంటే  అప్పటి కల్లా డాన్స్ ఏమో కాని వంట తో పాటు మేకప్ కూడా బాగా నేర్చేసుకున్నాను. ఎదురు చూస్తున్న 31 వచ్చేసింది! హేర్ స్టైల్ కోసం , ఇంత జుట్టు ఎందుకిచ్చావు దేవుడా అని ఏడ్చుకుంటూ బాక్ కోంబింగ్ చేసుకుంటూ ఉంటే, ఏమండీ గారు నా కఫ్ లింగ్స్ పెట్టు, నా షర్ట్ నెక్ బటన్ పెట్టు, నా టై సరి చేయి, కాలర్ సరి చేయి అని ఒకటే పిలవటం. అసలు నాకు తెలీక అడుగుతాను అమ్మాయిలా తయారవ్వాల్సింది అబ్బాయిలా ?( ఇదే మా ఫ్రెండ్స్ అందరమూ తరువాత చెప్పుకొని కొంపదీసి వీళ్ళంతా తనూజ కు లైన్ వేవటం లేదు కదా అని అపోహ పడ్డాము.) మొత్తానికి అందరూ బ్రహ్మాండమైన మేకప్ లతో, డాన్స్ తో పార్టీ అదరగొట్టేసారు.కాకపోతే ఈ మధ్య తెలిసిన సంగతేమిటంటే ఆ డాన్స్ మాస్టర్ దగ్గరకు అందరూ వెళ్ళారు.ప్రతివాళ్ళ తో మీకే కొత్త స్టెప్ అంటూ బాగానే ఫీజ్ గుంజి, రాజేష్ ఖన్నా  టోపీ పెట్టాడు :)  అందుకే అందరికీ విడివిడి క్లాస్ లు ,వేరే వేరే టైంలల్లో తీసుకున్నాడు.హోరినీ అని ఇప్పుడు తీరిగ్గా హాశ్చర్య పోతే ఏమొస్తుంది :) ఆ తరువాత సికింద్రాబాద్ లో కోర్స్.సింకింద్రాబాద్ క్లబ్ కు మారింది సీను. అప్పటి నుంచి ,ఇప్పటి వరకు చాలా వరకు మా న్యూఇయర్ పార్టీ కి సికింద్రాబాద్ క్లబ్ నే వేదిక.
యాభై సంవత్సరాల కాలం గిర్రున తిరిగి పోయింది.అంతా నిన్నమొన్ననే జరిగినట్లుగా ఉంది.అన్నట్లు ఈ 2018 కు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. సరిగ్గా పదేళ్ళ క్రితం, 2008 డిసెంబర్ లో నా బ్లాగ్ "సాహితి" మొదలు పెట్టి చిరు రచయిత్రిగా మారాను :) ప్రతి సంవత్సరమూ కొత్త సంవత్సరం రోజున జ్ఞాపకాలు సుంగంధాలై ఆహ్లాద పరుస్తాయి . మధురమైన జ్ఞాపకాలే మైమరపు ,

అందరికీ ఆ దేవదేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ, అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.

1-1-2019