Monday, May 8, 2017

హాంగ్ కాంగ్ టు శాంఫ్రాన్సిస్కో!


అనుకున్నాను కాని చైనావోళ్ళూ మంచోళ్ళే పాపం :) మొన్న హాంకాంగ్ లో దిగాక , కాసేపు అటూ ఇటూ తిరిగాము. బ్రేక్ ఫాస్ట్ చేద్దామని వెళుతూ రెస్ట్ రూం లో కి వెళ్ళాను.రూం లో నుంచి వచ్చి వాష్ బేసిన్ దగ్గరకు వెళుతుంటే అక్కడ ఉన్న స్వీపర్ ముసలమ్మ ఇంకో బేసిన్ వైపు చూపించింది.అక్కడికి వెళ్ళమంటోందనుకొని అటువైపు వెళ్ళాను.అక్కడ నా హాండ్ కర్చీఫ్ పెట్టి ఉంది. కింద పడిందేమో ననుకొని , అది తీసుకొని ఆవిడకు థాంక్స్ చెప్పాను.ఆవిడ అదేమీ పట్టించుకోకుండా వెళ్ళిపోయింది.ఫ్రెషప్ బయటకు రాగానే ఇంకో స్వీపర్ ముసలావిడ ఎదురొచ్చి అంటూ ఏదో చెప్పబోయింది.నాకర్ధం కాలేదు.ఏమైందా అని ఒక్క నిమిషం లోనే టెన్షన్.ఆవిడ నా దగ్గరకు వచ్చింది.ఇంకా టెన్షన్.దేవుడా దేవుడా అనుకుంటూ ఉంటే నా చీర కొంగు ఎత్తింది.బిత్తరపోయాను!ఏమైందిరా భగవంతుడా అనుకుంటూ ఉంటే నా బొడ్లో దోపుకున్న కర్చీఫ్ చూసి , తలూపి వెళ్ళిపోయింది. క్షణం అలాగే బిత్తరపోతూ ఆవిడ వైపు చూసి,హోరినీ కర్చీఫ్ కోసమా ఇంత హడావిడి అనుకున్నాను.వాళ్ళకు తెలీదు పాపం నాకు అలా కర్చీఫ్ లు పారేసుకోవటం మామూలని.నాకూ మా ఏమండీ కి ఉన్న ఏకైక కామన్ హాబీ కర్చీఫ్స్ పారేసుకోవటం :) పోయినసారి ఏమండి ఇలాగే రెస్ట్ రూం లో పాస్ పోర్ట్ లున్న బాగ్ మర్చిపోతే ,(ఎందుకు మర్చిపోయారంటే అదో పెద్ద కథ) ఇలాగే స్వీపర్ ముసలమ్మ తెచ్చి ఇచ్చింది.పాపం ఇక్కడి వాళ్ళు చిన్న దానికి కూడా ఆశపడరు.
అక్కడి నుంచి ఎదురుగా ఉన్న బర్గర్ కింగ్ కు వెళ్ళి వెజ్ బర్గర్ , ఫ్రైస్ తిని స్ప్రైట్ తాగాము.బిల్ల్ ఇచ్చి వస్తానని వెళ్ళారు.ఎంతసేపైనా రారు.బిల్ కౌంటర్ దగ్గర లేరు.ఎక్కడి కెళ్ళారు ? రెస్ట్ రూం కనుకుందామనుకుంటే ఇప్పుడే గా అక్కడి నుంచి వచ్చింది.వెతకటానికి ఎక్కడికని వెళ్ళను? పైగా రెండు బాగులు,రెండు హాండ్ బాగులూ పట్టుకొని ఎట్లాపోను.హుం. . . మళ్ళీ ఆంజనేయస్వామిని తలుచుకుంటూ, కూర్చున్నాను.దాదాపు గంట తరువాత వచ్చారు.ఎక్కడికెళ్ళారంటే , బిల్ కౌంటర్ దగ్గర చేంజ్ ఫైవ్ చైనా రూపీస్ కాయిన్ ఇచ్చారట. అది ఏం చేసుకుంటాము , మారుద్దామని అక్కడున్న షాప్స్ అన్నీ తిరిగి , పాపిన్స్ లాంటి పాకెట్ కొనుకొచ్చారు! చెప్పి వెళ్ళ వచ్చుకదా ఇంత టెన్షన్ పెట్టకపోతే.అప్పటికప్పుడు మార్చాల్సిన అవసరం ఏముంది నేనూ కాయిన్ ఎలా ఉందో చూసేదానిని,మేఘ కాయిన్స్ కలెక్ట్ చేస్తుంది తనకిచ్చేవాళ్ళం అని గొణుకున్నాను. అవేవీ పట్టవు!
ఇంకా ఐదు గంటలు గడవాలి, అమ్మో ఇట్లా వదిలేస్తే లాభం లేదు అనుకొని,ఏమి చేస్తే బాగుంటుందా అని చుట్టూ చూసాను. లాంజ్ లో చేర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. చోట ప్లగ్ పాయింట్ కనిపించింది.అమ్మయ్య , ఏమండీ అటు కూర్చుందామా అని అటు తీసుకెళ్ళి , ఏమండీ ఐపాడ్ బాగ్ లోనించి తీసి ఇచ్చాను.ప్లగ్ పాయింట్ లో సెట్ చేసుకొని ఐపాడ్ తీసి బ్రిడ్జ్ ఓపెన్ చేసారు.అమ్మయ్య ఇంక పరవాలేదు , శ్రీలక్ష్మిలాగా గంట కట్టక పోయినా ఐపాడ్ తో కట్టేసాను అని ఊపిరి పీల్చుకొని, నా బాగ్ ఓపెన్ చేసి, లాప్ టాప్ తీసి, నెల రెవ్యూ రాద్దామని ఉంచుకున్న నవల కోసం చూస్తే కనిపించలేదు.చదువుదామని పెట్టుకున్న ఆంధ్రభూమీ కనిపించలేదు. సారి రెండు రోజుల ముందే అన్నీ సద్దుకున్నాను.లాస్ట్ మినిట్ లో ఏమండీ అన్నీ అటూ ఇటూ చేసారు.నా బుక్స్ తీసారా అంటే ఏమో అన్నారు తల ఎత్తకుండానే.ఇంకేం చేస్తాను.కాసేపు స్పైడర్ ఆడి విసుగొచ్చి, కన్ను ఏమండీ మీదనే ఉంచి, ఇంకో కన్ను తో ఎదురుగా ఉన్న ట్రాలీ లను,ఎన్ని తెచ్చి పెడుతున్నారు, ఎన్ని తీసుకుపోతున్నారు లెక్క పెడుతూ, కింద నుంచి వెళుతున్న ట్రేన్స్ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి చూసుకుంటూ,లాంజ్ వచ్చేపోయేవాళ్ళను చూస్తూ,ఎదురు బోర్డ్ మీద మా ఫ్లైట్ ఎన్నింటికి, గేట్ దగ్గరకు వస్తుంది వేసారా చూసుకుంటూ, టైం పాస్ చేసాను.భారంగా ఐదు గంటలు గడిచాయి.మొత్తానికి 3rD గేట్ దగ్గరకు వస్తుందని వేసారు.పదండి పదండి , మనము 35 నుంచి 3 కు వెళ్ళాలి అని ఏమండీని లేపాను. సారి ఐపాడ్ కరుణించింది!
12 గంటల సుధీర్ఘ ప్రయాణం తరువాత శాంఫ్రాన్సిస్కో చేరాము.అక్షరాలా లక్ష రూపాయలు తీసుకుంటారు టికెట్ కు కాని సీట్లు ఎంత ఇరుకో.అటూ ఇటూ మెసిలేందుకే ఉండదు.కాకపోతే జేన్ ఫుడ్ అని చెప్పాము కాబట్టి భోజనం బాగానే ఉంది.తినటం,నిద్రపోవటమే!
3.15 కు విమానం నుంచి బయటకు వచ్చి , ఇమిగ్రేషన్ లో నుంచుంటే చాంతాడంత క్యూ.ఎంత సేపటికీ కదలదు.ఎక్కడెక్కడి నుంచో,ఎన్నెన్ని గంటలో ప్రయాణం చేసి వస్తారు పిల్లలు పెద్దలు. కౌంటర్ లల్లో పది మందిని పెడితే ఏమవతుంది.ఇద్దరో ముగ్గురో ఉంటారు.వాళ్ళు థాపీగా ఉంటారు.నిలబడీ నిలబడీ కాళ్ళుపీకొచ్చాయి.చివరకు కౌంటర్ దగ్గరకు చేరాము.ఏమండీ ని ఏమీ అడగలేదు.నా ఫొటో చూస్తాడు, నన్ను చూస్తాడు.బాబూ అది20 ఏళ్ళ క్రితంది, పేజ్ తిప్పు రెండేళ్ళ క్రితం ఫొటో కనిపిస్తుంది అని చెబుదామంటే భయం!చూసీ చూసి చివరకు ఇక్కడకు ఎందుకు వచ్చావు అని అడిగాడు.గ్రాండ్ చిల్డ్రెన్ తో స్పెండ్ చేద్దామని అని చెప్పాను.ఎన్నాళ్ళుంటావు అన్నాడు.మూడు నెలలు అన్నాను.మళ్ళీ ఫొటోను కాసేపు చూసి మళ్ళీ అడిగాడు ఎందుకొచ్చావు అని.మళ్ళీ చెప్పాను గ్రాండ్ చిల్డ్రన్ తో స్పెండ్ చేద్దామని అన్నాను.ఎన్నాళ్ళుంటావు? అన్నాడు.ఇందాక తప్పు చెప్పానేమో నని త్రీఅండాఫ్హ్ మంత్స్ అన్నాను.మళ్ళీ ఫొటోను నన్ను మళ్ళీ తిప్పి తిప్పి చూసి మళ్ళీ అడిగాను ఎందుకొచ్చావు? నీరసంగా భయం భయంగా గ్రాండ్ చిల్డ్రన్ తో స్పెండ్ చేద్దామని.ఎన్ని రోజులుంటావు? త్రీ మంథ్స్ ఫిఫ్టీన్ డేస్.ఎప్పుడెళ్ళిపోతావు?ఆగస్ట్ 20 కి.సరే పో అని స్టాంప్ వేసాడు.బ్రతుకుజీవుడా అని బయటపడ్డాను.ఇప్పటికీ అర్ధం కాలేదు అతని కి నామీద ఏమనుమానం వచ్చింది? అవే ప్రశ్నలు ఎందుకు అన్నిసార్లు అడిగాడు?నా ఫొటో అదీ పాతది ఎందుకు అన్నిసార్లు మార్చి మార్చి చూసాడు?అన్నీ భేతాళ ప్రశ్నలే!ఎంత టెన్షన్ పెట్టాడు. ఏమండికీ కూడా అర్ధం కాలేదు.ఏమైతేనేమి ఇంటికి చేరుకునేసరికి 8 అయ్యింది. హైదరాబాద్ నుంచి హాంగ్ కాంగ్ వచ్చినంత టైం పట్టింది ఇమ్మిగ్రేషన్ నుంచి బయటపడేసరికి.

అలసిసొలసి ఇంటికొచ్చి అమ్మాయి పెట్టిన వేడి వేడి భోజనం చేస్తూ, కలవటానికొచ్చిన గెస్ట్ ను పలకరిస్తూ , నిద్రపోతూ రెండు రోజులూ గడిచి, ఇప్పటికి కాస్త ఓపిక వచ్చింది.

Monday, April 24, 2017

అత్తయ్య మామయ్య

మా మామయ్య చింతలపాటి వెంకట కృష్ణారావుగారు మా అమ్మకు బాబాయిగారి అబ్బాయి,అన్నయ్య.మా అత్తయ్య చింతలపాటి సీత మానాన్నగారి ఏకైక చెల్లెలు,మా మేనత్త.మామామయ్య సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి.ట్రైబల్ వెల్ఫేర్ డైరక్టర్గా రిటైర్ అయ్యారు.ఉద్యోగం చేస్తున్నరోజులల్లో పసర,నాగోలు,రంపచోడవరం,కొత్తగూడెం దగ్గర, బూర్గుంపాడ్ దగ్గరి వివిధ గ్రామాలల్లో అనేక సంక్షేమకార్యక్రమాలు చేపట్టారు.అక్కడ అడవులల్లో నివసిస్తున్న గిరిజనులకు స్కూల్స్ కట్టించటము,వ్యవసాయ నీటి వనరులు ఏర్పరచటం, పాలకేంద్రాలు పెట్టటం మొదలైనవి చేయించారు.పసర లో పెట్టిన పాలకేంద్రానికి"క్షీరాబ్ధి"అని పేరు పెట్టారు.ఆయా ఊర్లకు వెళ్ళినప్పుడు ఏ కరణం ఇంటికో వెళ్ళటం కాకుండా సరాసరి గిరిజనుల ఇంట్లోకే వెళ్ళేవారు.వారి తో పాటే వారు పెట్టిన భోజనం చేసేవారు.ఎవరి నుంచీ ఏమీ ఆశించేవారు కాదు.కొన్ని సార్లు మా అత్తయ్య కూడా వెంట వెళ్ళేది.అప్పుడు ఓ పెట్టలో వంటకు కావలసిన సామాగ్రి అంతా తీసుకెళ్ళి, ఏ చెట్టు కిందో, మూడురాళ్ళు పెట్టి, కట్టెలతో వంట చేసేదట.ఓసారి ఒక చింత చెట్టు నిండా చిగురు ఉంటే అత్తయ్య బాగుందనుకుంటే అక్కడి గిరిజనులు కోసి ఇచ్చారట.వెంటనే మామయ్య మనము వాళ్ళకు ఇవ్వటానికి వచ్చాము కాని తీసుకోవటానికి రాలేదు అని అత్తయ్యను కోపం చేసి చింతచిగురు తిరిగి ఇచ్చేసారట.పెట్టెలో చింతపండు ఉంది,పప్పులో వేసి గట్టిగా చేస్తే పప్పు, నీళ్ళగా చేస్తే పప్పుచారు అవుతుంది,ఆ చిగురు ఎందుకు అడిగాను అని అభిమానపడిందిట అత్తయ్య!ఇది మామయ్య నిరాడంబరతకు ఓ ఉదాహరణ.
మామయ్య 45 సంవత్సరాలు "నెలనెలావెన్నల" అని కవిసమ్మేళనాలు,మితృఅమండలి సమావేశాలు నిర్వహించేవారు.వర్ధమాన కవులందరూ ముందుగా తమ కవితలను నెలనెలావెన్నెలలోనే చదివేవారు.మామయ్య రిటైర్ ఐయి హైదరాబాద్ వచ్చాక నెలనెలావెన్నల చాలామంది సభ్యులతో సాగింది.సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, పొత్తూరి వెంకటేశ్వర రావు గారు,వాడ్రేవు చినవీరభద్రుడు గారు,దీవిసుబ్బారావుగారు,ముకుంద రామారావుగారు,రేణుకా అయోలాగారు,వాసాప్రభావతిగారు,మృణాళిని గారు,కొండెపూడి నిర్మల,శీలంవీర్రాజు గారు మొదలైన వారంతా కలిసి నెలనెలావెన్నలని జరుపుకునేవారు.ప్రస్తుతము కొంచము వినికిడిసమస్యల వల్లా,కొద్దిగా వయసుమీదపడటము వల్లా ఈ సమావేశాలు నిర్వహించలేకపోతున్నారు.అయినప్పటికీ ఆయన అభిమానులు అప్పుడప్పుడూ వచ్చి వారి కవితలు వినిపించి వెళుతుంటారు.
నేను కథలు వ్రాస్తున్నానని తెలిసి చాలా సంతోషించారు.నాదేముంది ,ఆయన వేసిన సాహితీవనం లో ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్న చిరు మొలకని.అందుకని ఈ రోజు ప్రస్తుతం కూతురు పార్వతి వాళ్ళ ఇంట్లో ఉన్న అత్తయ్యమామయ్యల దగ్గరకు వెళ్ళి నా పుస్తకాలని ఇచ్చాను.ఇలా పెద్దవారికి ఇచ్చేందుకే మా ఏమండీ , నా ఈ బుక్స్ ను కొన్ని ప్రింట్ ఔట్ చేయించారు మరి.చాలా సంతోషంగా నా పుస్తకాలను  అందుకొని ,అప్పటికప్పుడే తిరిగేసారు అత్తయ్య మామయ్య.
మా అత్తయ్య ఎప్పుడు నన్ను చూసినా చాలా ఎమోషనల్ అవుతుంది.ఆమె తిరిగే రోజులల్లో కనీసం నెలకోసారైనా వచ్చి నన్ను చూసి వెళ్ళేది.ఇప్పుడు నేను వెళుతున్నా అంత ఎక్కువగా వెళ్ళలేకపోతున్నాను.అత్తయ్య తో నాన్నగారి జ్ఞాపకాలను పంచుకోవటము, నాన్నగారి చిన్నతనము గురించి తెలుసుకోవటమూ నాకు ఇష్టము.ఈ రోజు మా అన్నయ్య ఫొటో ఒకటి తెచ్చి ఇవ్వవా అని అడిగింది.ఈ బుక్ లో ఉందత్తయ్యా అని అనగనగా ఒక కథ పుస్తకం లో ఉన్న నాన్నగారి ఫొటో చూపించాను.ఇది కాదు మా అన్నయ్య ఉద్యోగం లో చేరిన కొత్తల్లో హాట్ పెట్టుకోని తీయించున్నది కావాలి అన్నది , నా పుస్తకం లో నాన్నగారి ఫొటోను ఆప్యాయంగా తడుతూ.ఇంటికి రాగానే ఆ ఫొటో వెతికి తీసాను అత్తయ్యకు పంపటానికి.అత్తయ్య కాసేపు మా చెల్లెలి తో కలిసి పాటలు పాడుకుంది.మమ్మలిని అసలు వదలలేదు.

ఊళ్ళో ఉన్న కుమారి, సరళ మా కజిన్స్ కూడా వచ్చారు.నేను అమ్మ, మా చెల్లెలు వెళ్ళాము.అందరమూ కలిసి లంచ్ చేసాము.మళ్ళీ ఇన్నాళ్ళకు నీమూలంగా ఇంట్లో నెలనెలా వాతావరణం వచ్చింది అనుకున్నారు.ఈనాటి గెట్ టుగేదర్ సంతోషం గా,కొంచం సెంటిమెంటల్ గా జరిగింది.థాంక్ యు పార్వతి.