Wednesday, January 28, 2015

ఆత్మీయబంధం

దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన నా కథ " ఆత్మీయబంధం " 19-25 జనవరి 2015 , జాగృతి వారపత్రిక లో పబ్లిష్ అయ్యింది. చదివి మీ అభిప్రాయం చెబుతారుకదూ :)








ఆత్మీయ బంధం
మాలాకుమార్
రోజు వంట మరీ లగుడుమారిగా వుంది విసుక్కున్నాడు శరత్.కళ్ళల్లో తిరిగే నీళ్ళు కనిపించకుండా తల వంచుకుంది శారద.

"మరీ ఇంత పిచ్చితనమైతే ఎలా శారదా .కొంచం కంట్రోల్ చేసుకో. రెక్కలు వచ్చిన పక్షులు ఎగిరిపోకుండా గూటిలోనే వుంటాయా ? వాళ్ళ బతుకులు వాళ్ళు చూసుకోకుండా నీ దగ్గరే వుండిపోతారా ? దీపూ వెళ్ళినప్పటి నుంచి మరీ పిచ్చిదానివైపోతున్నావు."

"అది కాదండి ఇక్కడలేవా అవకాశాలు?ఇక్కడా బోలెడు కంపెనీలున్నాయి.ఉద్యోగాలు దొరుకుతున్నాయి. బాగానే పే చేస్తున్నారు కదా!" గొంతులో దుఃఖం సుళ్ళుతిరుగుండగా అన్నది శారద.
"ఎంతసేపూ అలాగే ఆలోచిస్తావు. వాళ్ళకు అక్కడ భవిష్యత్తు బాగుంటుందని కదా వెళ్ళారు. పిల్లలు వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడేదాకానే మన బాద్యత. తరువాత వాళ్ళు అడుగేతేనే మనం ఇన్వాల్వ్ అవ్వాలి.మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కదా! చూడు బొత్తిగా నన్ను పట్టించుకోవటం లేదు. అసలు పని మీదా ధ్యాస లేకుండా అయ్యావు. బయటకు వెళ్ళటమే మానేసావు. దేని మీదా శ్రద్ధ లేకుండా అయ్యావు.ఇట్లా ఐతే కష్టం " అని లేచి వెళ్ళాడు.

ఏమి చేయాలి ఎంత ఆపుకుందామనుకున్నా దుఃఖం  ఆగటం లేదు. వంట చేద్దామని వంటింట్లోకి వెళుతే ఏది చేయబోయినా పిల్లలు గుర్తొస్తారు. వాళ్ళ కిష్టమైనవని ఎన్ని రకాలు వండేది. ఇప్పుడు అన్ని రకాలు ఎవరు తింటారు అని ఏదీ వండబుద్దికావటంలేదు.అసలు వంటే చేయాలనిపించక ఏదో వండి పడేస్తోంది. ఇంక వూరుకోలేక రోజు శరత్ చివాట్లేసాడు. అదీ నిజమేకదా ఇంకెన్ని సంవత్సరాలు దిగులు అనుకుంటూ మదనపడిపోతోంది శారద.
శరత్ ఆఫీస్ కెళ్ళిపోయాడు. ఇల్లంతా నిశబ్ధంగా వుంది. తన హృదయ దర్పణం డైరీ తీసింది.రోజూ శరత్ ఆఫీస్ కెళ్ళిపోగానే డైరీ తెసి పాతవి చదువుకోవటం కొత్తది వ్రాయటం అలవాటైపోయింది. రోజు దీపు మరీ మరీ గుర్తొస్తున్నాడు . మాం , మాతాశ్రీ అంటూ నోటికేపేరొస్తే పేరు తో పిలుస్తూ వెనకెనకే తిరిగుతూ వుండేవాడు."కన్నా ఎంత దూరం లో వున్నావు పిలుస్తే హా మాతే అంటూ రాలేవుకదా ? నీకు గుర్తుందా నువ్వు ఫిఫ్త్ క్లాస్ లో వుండగా అనుకుంటా స్కూల్ నుంచి ఎక్స్ కర్షన్ కు వెళ్ళావు. ముందు అసలు వెళ్ళనని గొడవ చేసావు. డాడీ, ఫ్రెండ్స్ , టీచర్ అందరూ చెప్పగా వెళ్ళావు. వారం రోజులు నీకోసం రోజులు లెక్కపెట్టుకుంటూ ఎదురుచూసాను. రాగానే నన్ను చుట్టుకుపోయావు." అమ్మా రాత్రి పడుకోగానే నువ్వు గుర్తొచ్చి ఎంత ఏడ్చానో ! పైకి వినిపిస్తే టీచర్ కోపం చేస్తుందేమో , ఫ్రెండ్స్ నవ్వుతారేమోనని లోపల లోపలే ఏడ్చాను. మిస్ యు మామ్మ్."అంటూ ఏడ్చేసావు. చిన్నప్పుడు స్కూల్ కు వెళటానికి కూడా రోజూ ఏడ్పే! జవాన్ సైకిల్ మీద తిరిగి తిరిగి చూస్తూ ,ఏడుస్తూ వెళ్ళేవాడివి.నువ్వు కనిపించేవరకూ నిన్ను చూసి , కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళేదానిని. రోజూ  ఇద్దరూ ఇలా ఏడుపులు పెడితే వాడికి చదువు వచ్చినట్లే . స్కూల్ కు పంపకుండా నీ చుట్టూ తిప్పుకుంటూ బుద్దూ ను చేస్తావా అని డాడీ కోపం చేసేవారు.అక్క డాడీ తో గేంస్ ఆడటానికి వెళుతుంటే , వాళ్ళు వెళ్ళేటైం కు ఎక్కడో దాక్కొని , వాళ్ళు వెళ్ళాక కాసేపటికి బయటకు వచ్చేవాడివి. నాతోపాటు లైబ్రెరీకి వచ్చి పుస్తకాలు చదువుకుంటూ వుండేవాడివి. నువ్వు సినిమాకు వెళ్ళాలన్నా నేనే నీతోరావాలి. నీకోసం అమితాబ్ , బ్రూస్లీ, లారెల్ అండ్ హార్డీ  సినిమాలు ఒక్కొక్కటీ ఎన్ని సార్లు చూసేదానినో! అందరూ నవ్వేవాళ్ళు. మొగపిల్లవాడు బయట ఆటలకు వెళ్ళకుండా ఇట్లా నా వెనుకే వుంటాడేమిటి అని దిగులు పడేదానిని.అమెరికా వెళ్ళిపోయి ఇన్ని సంవత్సరాలైంది.ఎట్లా వుంటున్నావు నన్నొదిలి? అసలు నేను గుర్తొస్తున్నానా ? ఎప్పుడో తప్ప ఫోన్ కూడా చేయవు. చేసినా ముక్తసరిగా మాట్లాడి పెట్టేస్తావు.ఎప్పుడైనా అమ్మ నీకోసం చూస్తూ వుంటుందని అనుకుంటావా ?నా పిచ్చిగాని నన్ను ఎందుకు మర్చిపోతావు, నీ పనిలో బిజీ గా వుంటావు. ఎప్పుడో తప్ప సమయం దొరకదు నీకు. నాదేముంది రోజంతా నిన్నూ , అక్కనూ తలుచుకుంటూ వుండటమే కదా. . . . .

రాస్తూ రాస్తూ సోఫాలో పడుకుండిపోయింది శృతి.

ఆఫీస్ నుంచి వచ్చిన శరత్ కు శారద సోఫాలో నిద్రపోతూ కనిపించింది.తడిచిన కనురెప్పలు, వాడిపోయిన మొహం చూస్తూ పక్కన వున్న డైరీ తీసాడు.దీపూ కు వ్రాసినది చదివాడు.ముందు పేజీ లలో అంతా వ్రాసివుంది. పేజీ వెనకకు తిప్పి చూసాడు.

"బంగారు తల్లి, ఎలావున్నావురా ? స్కూల్ నుంచి వస్తూనే గల గలా రోజు బస్ ఎక్కినప్పటి నుంచి జరిగిన సంగతులన్నీ చెప్పేదానివి. పనిలో వుండి వినకపోతే అలిగేదానివి.మళ్ళీ ఆవిశేషాలన్నీ పూసగుచ్చినట్లు తమ్ముడికి డాడీ కి కూడా చెప్పేదానివి.అసలు నీకు నోరు నొప్పి పుట్టదా అని నవ్వేవాళ్ళము. ఉడుక్కునేదానివి. అలకంతా క్షణమే! కాలేజీ నుంచి రాగానే , నేను ఎంతపనిలో వున్నా బయటకు పోదామని గొడవ చేసేదానివి.టాప్ తీసేసి రిక్షాలో తిరిగినంతసేపు తిరిగి ఐస్క్రీం తిని రావటం సరదా నీకు.పెద్దవవుతున్న కొద్దీ ఎన్ని సందేహాలో! నీ సందేహాలు తీర్చటం కష్టమైపోయేది.బాల్కనీ లో కూర్చొని టీ తాగుతూ ఎన్ని కబుర్లో! కాలేజీ లో అబ్బాయిలు పేర్లు పెట్టటం , అమ్మాయిలు అబ్బాయిలను ఏడిపించటం , వకటా రెండా అబ్బ ఎన్ని ముచ్చట్లు చెప్పేదానివి. మధ్య మధ్య వింటున్నానాలేదా అని అనుమానం తో చెప్పిందే చెప్పి కొన్ని సార్లు విసిగించేదానివి.ఏదీ దాచుకోవటం రాదు. ఇంత అమాయకంగా ఎలా బతుకుతావో నని నీ గురించి చాలా దిగులు పడేదానిని.ఏవీ కబుర్లు . ఇల్లంతా నిశబ్ధం .మీ సంగతులు తలుచుకుంటూమురిసిపోతూ, దిగులు పడుతూ వున్నాను. . .

డైరీ లో అంతా ఇలాగే పిల్లలకు ఉత్తరాలు రాసుకుంది.సాలోచనగా శారదని చూసాడు. చాలా చిక్కిపోయింది.మొహము లో ఇదివరకటి ఉషారు లేదు. ఏదో పోగొట్టుకున్నట్లు వుంది.ఇలాగే వుంటే మూలన పడుతుంది ఏదైనా చేయాలి అనుకున్నాడు.

రోజు ఇంటికి వస్తూ శరత్ ఐదేళ్ళ బాబుని తీసుకొచ్చాడు. ఎవరీ అబ్బాయి అని ప్రశ్నార్ధకం గా చూసింది శారద. “ఇతని తల్లి మా ఆఫిస్ లో అటెండర్గా చేస్తుండేది.కొద్దికాలం గా జబ్బుతో బాధపడుతూ వుండింది. ఈమధ్యనే చనిపోయింది.బంధువులు వున్నారు కాని వీడి బాధ్యత తీసుకోవటానికి ఎవరూ తయారుగా లేరు. మనం పెంచుకుందామని తీసుకొచ్చాను. దత్తతకు కావాలసిన  ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసే తీసుకొచ్చాను.ముందు వీడికి అన్నం పెట్టు" అన్నాడు. శారద అబ్బాయిని పరిశీలనగా చూసింది. జుట్టు దుబ్బుగా పెరిగిపోయి వుంది. పాత చొక్కా , లాగూ వేసుకొని వున్నాడు.బీదరికం కనిపిస్తోంది. బెదురు బెదురుగా చూస్తున్నాడు. భర్త చేసిన పని శారద కి నచ్చలేదు. ఐనా ఏమనక "లోపలి కి రా బాబూ " అన్నది.భయపడుతూ లోపలికి వచ్చాడు.

" భయపడకు ఆమె ఇక నుంచి నీకు అమ్మ. నేను నాన్నను ."అని చెప్పాడు శరత్.

అన్నం పెడుతూ "నీ పేరేమిటి?" అని అడిగింది.

"ఇంతకు ముందు ఏదైనా ఇక నుంచి వీడి పేరు విక్రాంత్ . విక్కీ అని పిలుద్దాము ."అన్నాడు శరత్.

" ఈవయసులో నేను పిల్లలను పెంచగలనా ? వీడి బాధ్యత మనం నెరవేర్చగలమా ?" అంది శారద.

"ఇప్పుడే మంత వయసొచ్చిందని.వాడేమీ మరీ పసివాడు కాదు.వాడి పనులు వాడు చేసుకోగలడు. అంతగా నీకు చాతగాని రోజు సర్వెంట్ క్వాటర్ లో చంద్రమ్మ వుండనే వుంది.వాడి కి మనము , మనకు వాడు ఆసరా ."నచ్చ చెప్పాడు శరత్.

"కానీయండి మీ మాట నేనెప్పుడు కాదన్నాను." అంది శారద .

అన్నం తినేందుకు బిడియ పడుతున్న విక్కీ ని బుజ్జగిస్తూ కొసరి కొసరి తినిపించాడు . తరువాత బజారుకు తీసికెళ్ళి శుభ్రంగా హేర్ కట్ చేయించి , కొన్ని జతల బట్టలు కొన్నాడు.ఇంటి కి వచ్చాక స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగాడు. మంచి హేర్ కట్ తో కొత్త బట్టల లో శుభ్రంగా వున్నాడు. అంతా ప్రేక్షకురాలిలా గమనిస్తోంది శారద .రాత్రి పిల్ల గదిలో పడుకో బెట్టాడు శరత్.

రాత్రి పూట ఏవో చిన్న చప్పుళ్ళు వినిపిస్తుంటే లేచి చూసింది శారద . పక్కన శరత్ గాఢనిద్రలో వున్నాడు.చిన్నగా లేచి పిల్లలగదిలోకి చూసింది.భయపడ్డ పిల్లి కూనలా మంచం మధ్యలో ముడుచుకొని పడుకొని చిన్నగా వెక్కుతున్నాడు విక్కి. వాడిని అలా చూడగానే జాలి వేసి వెళ్ళి వాడి పక్కన పడుకుంది . వాడి తల నిమురుతూ దగ్గరకు తీసుకుంది.వాడి మీద చేయి వేసింది. అమ్మ వడిలా అనిపించిందేమో ఆమె దగ్గరకు జరిగి పడుకున్నాడు.అలాగే చిచ్చికొడుతూ దగ్గరకు పొదువుకుంది.అలాగే ఇద్దరూ నిద్రపోయారు. పొద్దున్నే శరత్ వాళ్ళను అలా చూసి అమ్మయ్య అని నిశ్చింతగా నిట్టుర్చాడు
.
పిల్లలు శ్రావణి, దీపక్ కు కాల్ చేసాడు శరత్." మా ఆఫీస్ అటెండర్ చనిపోతే , ఎవరూ లేరని ఆమె కొడుకు ను దత్తతకు తీసుకున్నాను.నిన్న ఇంటికి తీసుకొచ్చాను. "అని చెప్పాడు. పిల్లలు మీ ఇష్టం డాడీ మీరేమి చేసినా ఆలోచించే చేస్తారుకదా మాకేమీ అభ్యంతరం లేదు అన్నారు.

ఉదయం లేవగానే "విక్కీ " అంటూ ఆప్యాయంగా పిలిచాడు శరత్.

తనను కాదన్నట్లు ఎటో చూస్తూ నిలబడ్డాడు విక్కి.

దగ్గరగా వెళ్ళి తలమీద ప్రేమగా చేయి వేసి " విక్కి నిన్ను రోజు స్కూల్ లో చేరుస్తాను . వెళుతావా స్కూల్ కు?"అని అడిగాడు శరత్.

వెళతానన్నట్లు తలవూపాడు విక్కి.

"శారదా నువ్వు కూడా రా. వీడికి స్కూల్ అలవాటయ్యేవరకు నువ్వు రోజూ లంచ్ బాక్స్ తీసుకెళుదువు గాని ".
ప్రిన్సిపల్ తో మాట్లాడి స్కూల్ లో మొదటి తరగతిలో చేర్చాడు. కొన్ని రోజులు శారద మధ్యాహ్నం వచ్చి లంచ్ తినిపించేట్లుగా పర్మిషన్ తీసుకున్నారు.

రోజు లంచ్ బాక్స్ తీసుకెళ్ళిన శారద కు , విక్కీ చెట్టు కింద వంటరిగా కూర్చొని కనిపించాడు.దగ్గరకు వెళ్ళి "ఇలా ఒక్కడివే కూర్చున్నావేమిటి? ఎవరూ స్నేహితులు కాలేదా?"అని అడిగింది.

మాట్లాడకుండా తల అడ్డంగా వూపాడు విక్కి. వాడి కి కబుర్లు చెపుతూ అన్నం తినిపించింది.

రెండు మూడు రోజులుగా గమనించింది. ఇంట్లో నూ ఎవరితో మాట్లాడడు. పిలిస్తే పలకడు. పక్కగా కూర్చొని వుంటాడు. ఏమి చేయాలో తోచటం లేదు శారదకు. శరత్ తో చెప్పింది. కొత్త కదా అలవాటుపడతాడులే.అంటాడు. తను ఇంట్లో వున్నంత సేపూ విక్కీ బదులిచ్చినా లేకపోయినాఎవో కబుర్లు చెపుతుంటాడు.

శారద కూడా వీలైనంతగా విక్కీ తోనే సమయం గడుపుతూవుంటుంది.స్కూల్ నుంచి రాగానే వాడి కి కావలసినవి అడిగి అడిగి మరీ చేసిపెడుతుంది.రాత్రి వాడి దగ్గరే పడుకొని కబుర్లు, కథలు చెపుతూ వుంటుంది. ఐనా వాడిలో బిడియం తగ్గలేదు.

విక్కీ ని నిద్రలేపి , బాత్ రూం లోకి పంపి, వంటిట్లోకి వెళ్ళి పాలగ్లాస్ తీసుకొని వచ్చింది శారద. విక్కీ రూంలో ఎక్కడా కనిపించలేదు. ఇల్లంతా వెతికింది. వెనుక మెట్ల మీద దిగులుగా కూర్చొని వున్నాడు.వాడి పక్కన కూర్చొని తల నిమిరింది. "ఎందుకమ్మా ఇక్కడ కూర్చున్నావు ?"లాలనగా అడిగింది.

 "అమ్మ . . . అమ్మ" అని వెక్కి వెక్కి ఏడ్చాడు.

"అమ్మను దేముడు తీసుకెళ్ళాడుగా! నీకు తోడుగా వుండమని అమ్మ నన్ను , నాన్నను పంపింది.అలా ఏడవకూడదు . గుడ్ బాయ్ . పాలు తాగేసి స్కూల్ కు తయారవ్వాలి. టైం ఐపోతోంది మరి." బుజ్జగించి పాలు తాగించింది.

ఇంకాఎట్లా వాడిని మచ్చిక చేసుకోవాలి అని దిగులుపడుతూ వుంటుంది.కొంచం ఓపిక, పట్టు అంటాడు శరత్.ముందు విక్కీని పెంచుకోవటానికి అయిష్టత చూపించినా , వాడి ని ప్రేమగా చూసుకుంటూ కొద్ది కొద్దిగా తన దిగులును మర్చిపోతున్న శారద ను చూసి సంతోషిస్తున్నాడు శరత్.

బయట పిల్లలతో ఆడుకుంటూ వుంటే ఐనా దారిలో పడతాడేమోనని రోజు పార్క్ కు తీసుకెళ్ళింది. అక్కడా బెంచీ మీద కూర్చున్నాదేకాని ఎవరి తోనూ కలవలేదు.ఇలా కాదని మరునాడు పార్క్ లో తనే పిల్లలందరినీ కూడేసి ఆడించింది.దీపూ ని తిప్పినట్లు వీడినీ తిప్పాలేమో అనుకొని నవ్వుకొంది. ఆదివారం లారెల్ అండ్ హార్డీ సినిమా కు తీసుకెళ్ళింది.లారెల్ అండ్ హార్డీ చేష్టలకు విక్కీ  పకపకా నవ్వటం చూసి అమ్మయ్య కొంచం కదలిక వచ్చింది అనుకొంది.తనతోపాటు లైబ్రరీ కి తీసుకెళ్ళి, కార్టూన్ పుస్తకాలు ఇప్పించింది. వాటిని చదివించి , కథ చెప్పమనేది.
తమతోపాటు చుట్టాల ఇళ్ళకు ఫంక్షన్స్ తీసుకెళ్ళేవారు. అందరికీ మా పెంపుడు కొడుకు అని పరిచయం చేసేవారు.ఇద్దరు పిల్లలుండగా వయసు లో పిల్లవాడిని పెంచుకోవటమేమిటని ఎవరైనా అడిగినా నవ్వేసేవాడు శరత్ .

ఇప్పటికి వాడు వచ్చి ఆరునెలలైంది. ఇంకా వాడు ముడుచుకొనే వున్నాడు. అమ్మగారు కాదు, సార్ కాదు అమ్మా , నాన్నా అనరా అని పదే పదే చెప్పాల్సి వస్తోంది. ఇంకా ఎలా వాడి బెదురుపోగొట్టటం అని మధనపడుతోంది శారద.కొన్ని సార్లు విసుగు కూడా వస్తోంది.అదృష్టం చదువు లో చురుకు గానే వున్నాడు అనుకొంది.

పడుకొని నవల చదువుకుంటోంది శారద.నవలలో లీనమైపోయిన శారద కు చిన్నగా చప్పుడు వినిపించింది. కాని పట్టించుకోలేదు. వెంటనే "అమ్మా " అని పిలుపు వినిపించింది. గబుక్కున తలెత్తి చూసింది. ఎదురుగా విక్కి నిలబడి వున్నాడు. శారద తలెత్తి చూడగానే ," అమ్మా ఆకలేస్తోంది " అన్నాడు.

చటుక్కున లేచి కూర్చొని సంతోషం గా వాడిని దగ్గరకు తీసుకొంది.

"ఏం చేసి పెట్టను నాన్నా ?"

"పూరీ " అన్నాడు . గబగబా వాడికి పూరీ చేసి పెట్టి, శరత్ కు కాల్ చేసి," రోజు విక్కీ నన్ను అమ్మా అనిపిలిచాడండి. ఆకలేస్తోంది పూరీ చేసిపెట్టమన్నాడు." ఉద్వేగంగా చెప్పింది
.
"వెరీ గుడ్. అమ్మయ్య ప్రాబ్లం సాల్వ్ అయ్యింది." అని సంతోషించాడు శరత్.

క్షణం నుంచి శారద కు రోజులేలా గడిచిపోతున్నాయో తెలీదు.పొద్దున్నే విక్కీని లేపి తయారు చేయటం, బ్రేక్ ఫాస్ట్ పెట్టి లంచ్ బాక్స్ కట్టిచ్చి , స్కూల్ బస్ ఎక్కించిన తరువాతనే శరత్ పని.దీపూ, శ్రావణి ఫోన్ చేసినా సగం పైగా విక్కీ ముచ్చట్లే! రోజులు చక చకా గడిచిపోతున్నాయి. శరత్ , పిల్లలు , శారద పిల్లల నుంచి ధ్యాస మళ్ళించుకొని విక్కీ తో బిజీ కావటం తో హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు.

" ఇంక ఎన్నేళ్ళు ఉద్యోగం చేస్తారు ? విక్కీ ది కూడా సంవత్సరము తో ఇంజనీరింగ్ ఐపోతుంది. మొన్న వాడికి చెప్పాను, జి.అర్.,టోఫెల్ టెస్ట్ లు వ్రాయమని. ముగ్గురూ  ఇక్కడకి వచ్చేయండి డాడీ.మా దగ్గరే సెటిలైపోదురు "అని పిలుస్తున్నాడు దీపు. ఉద్యోగం చేసే ఓపికైపోయింది మానేద్దామని అనుకుంటునే వున్నాడు కాని అక్కడి కి వెళ్ళి వుండే ఉద్ధేశ్యం లేదు శరత్ కు వాతావరణంలో తాము ఇమడలేరు.

విక్కీ కూడా అమెరికా వెళ్ళిపోతాడా ?  విక్కీ వచ్చిన పదిహేనేళ్ళలో తమలో శారీరికంగా , మానసికం గా చాలా మార్పువచ్చింది. పని చేసుకుందామన్నా వోపిక వుండటం లేదు.చాలా వరకు బయట పనులన్నీ విక్కీనే చేస్తున్నాడు. ఇంటిపనులల్లో కూడా వెంట వెంట వుంటూ అన్నీ అందుకుంటున్నాడు.ఎంత పనివాళ్ళను పెట్టుకున్నా ఇంత శ్రద్దగా చేస్తారా ? కొన్ని సార్లు మాట కూడా వినరు. పోనీ వృద్దాశ్రమం లో వుండటమంటే , మాట తలుచుకుంటేనే దుఃఖం వస్తోంది. ఎంతైనా స్వంత ఇంట్లో వున్నంత స్వతంత్రం వుండదుకదా! ఇప్పుడు వయసులో , చాతకాకుండా ఇద్దరూ ఎలా వుంటారు అని చింత మొదలైంది శారదకు.

"అప్పుడు నువ్వున్న పరిస్థితులలో నీకో వ్యాపకం అవసరం అని వాడిని తీసుకొచ్చాను. సహజంగా నీకు పిల్లలంటే వుండే ఇష్ఠం తో వాడి కీ నీకూ ఆత్మీయబంధం ఏర్పడింది.ఇన్నేళ్ళు మనకు ఆసరా అయ్యాడు. అలా అని వాడి భవిష్యత్తు చూసుకోవద్దని అనలేము కదా ! చూద్దాం ఏమవుతుందో ."అంటాడు శరత్.

రోజు రాత్రి విపరీతమైన కడుపునొప్పి వచ్చింది శారదకు . నొప్పికి తట్టుకోలేక ఉండలు చుట్టుకుపోతోంది. హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. ఎపండిటైటిస్ , ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాలన్నాడు డాక్టర్. పిల్లలకు తెలిపి, వాళ్ళు వచ్చే వ్యవధిలేదు. ఏమి చేయాలో తోచలేదు శరత్ కు.స్తబ్దుగా కూర్చుండిపోయాడు. విక్కీ నే డాక్టర్ తో మాట్లాడి ఆపరేషన్ కు ఏర్పాట్లు చేసాడు.ఆపరేషన్ సకాలం లో చేయటం తో విజయవంతమైంది.

వెంటనే విక్కీ దీపుకు, శ్రావణి కి ఫోన్ చేసి సంగతి చెప్పాడు. ఇద్దరూ చాలా గాభరా పడిపోయారు.వాళ్ళకు టికెట్లు దొరికి వచ్చేసరికి రెండు రోజులైంది. రెండు రోజులూ ఆపరేషన్ అయిన తల్లిని,ఢీలాపడి వున్న తండ్రిని కంటికి రెప్పలా చూసుకున్నాడు విక్కి.

తమతో రమ్మని అమ్మానాన్నలను అడిగాడు దీపు.ఇప్పుడు ప్రయాణం చేసే ఓపిక లేదని వీలున్నప్పుడు వాళ్ళనే వచ్చి చూసిపొమ్మన్నాడు శరత్. వాళ్ళే వచ్చి వుందామంటే పిల్లలు పెద్ద తరగతులకు వచ్చారు. అక్కడి ఎడ్యుకేషన్ సిస్టం కు, అక్కడి వాతావరణానికి అలవాటు పడ్డారు. ఇక్కడకొచ్చి వుండలేరు. వాళ్ళ చదువులకు అంతరరాయం కలిగించలేరు.ఏదీ చేయలేని పరిస్తితి. నెమ్మదిగా శారద కోలుకున్న తరువాత బాధ గా వెళ్ళిపోయారు
.
తను రిటైరైపోయినా , తమ సంస్థలో మంచి పదవి ఇచ్చి తనను ఇన్ని సంవత్సరాలూ అభిమానంగా, గౌరవంగా చూసుకున్న వారి తో ఇంక పని చేసే ఓపిక లేదని చెప్పి, శరత్ పదవీ విరమణ చేసి , స్నేహితుల తో పుస్తకాల తో కాలం గడుపుతున్నాడు.చూస్తుండగానే విక్కీ ఇంజనీరింగ్ ఐపోయింది. రోజు వాడిని పిలిచి ,"దీపూ అన్నయ్య రమ్మంటున్నాడు.మాకు అక్కడ సెటిల్ అయ్యే ఆలోచనలేదు. మేము ఇక్కడే వుంటాము. నీకు వెళ్ళాలని వుంటే చెప్పు . ఏర్పాట్లు చేస్తాను."అన్నాడు.

విక్కీ ఏమి చెపుతాడా అని చూస్తోంది శారద. శారద దగ్గరకు వచ్చి నడుము చుట్టూ చేతులు వేసి భుజం మీద తలానించి "నేను అమ్మను, మిమ్మలిని వదిలి ఎక్కడికీ పోను.అన్నయ్య వ్రాయమన్నాడని జి.ఆర్.. టోఫెల్ వ్రాసాను కాని నాకు ఇష్ఠం లేదు. గేట్ కూడా వ్రాసాను. మంచి రాంక్ వస్తే ఇక్కడే యం.టెక్ లో చేరుతాను.యం.టెక్ లో రాకపోతే , కాంపస్ ఇంటర్వ్యూ లో వచ్చింది కదా జాబ్ లో చేరుతాను ." అన్నాడు.

" మా కోసం అని నీ భవిష్యత్తు పాడు చేసుకోకు." అంది శారద.

"లేదమ్మా .మీరెక్కడ వుంటే నేనూ అక్కడే. నేనెక్కడ వుంటే మీరు అక్కడే. మిమ్మలిని, ఇండియాను వదిలి నేను వెళ్ళను." అన్నాడు విక్కి.

"ఇప్పుడు నీకు వుండాలనే అనిపిస్తుంది. కాని ముందు ముందు నీ ఫ్రెండ్స్ అంతా స్టేట్స్ లో బాగా సంపాదిస్తూ వుంటే నువ్వు ఫీలవుతావేమో. అప్పుడు వెళుదామన్నా అవకాశాలు రావు కదా? " ఆలోచించుకో అన్నాడు శరత్.

"నాన్నా ఎక్కడో గాలిలో , ధూళిలో దిక్కులేకుండా కలిసిపోవలసిన నన్ను చేరదీసారు. మీ నీడలో హాయిగా పెరిగి ఇంత వాడినైనాను.ఇది నేను ఏజన్మలో చేసుకున్న పుణ్యమో ఇంత అదృష్ఠం పట్టింది. అదృష్ఠం నాకు చాలు. ఇంతకు ముంచి నేనేమీ కోరుకోను.నన్ను మీ నీడలోనే వుండనీయండి నాన్నా ."

"నీకు మా దగ్గర వుండటం ఇష్టం కావచ్చు కాని రేపు నీ భార్య ఒప్పుకోకపోవచ్చు. ఆమెకు విడిగా వుండాలనిపించ వచ్చుకదా."అంది శారద.

"ఇక్కడ, మీదగ్గర వుండటానికి ఒప్పుకునే అమ్మాయినే పెళ్ళి చేసుకుంటానమ్మా."అంటూ నవ్వాడు విక్కి.

"అదృష్ఠం నీది కాదురా . మాది. వయసులో స్టేట్స్ కు వెళ్ళి , అక్కడ ఇమడలేక , ఇక్కడవుండి పిల్లలను  బాధ పెట్టకుండా ,భగవంతుడు మాకో ఆత్మీయ బంధం వేసాడు," అంటూ విక్కీని దగ్గర కు తీసుకొని ముద్దాడింది శారద.

" బంధం వేసింది నాన్న అమ్మా ."అంటూ నాన్న పక్కన  చేరాడు విక్కి.

" ఇలా ఇద్దరూ వకరిని వొకరు పొగుడుకుంది చాలు . ఆకలేస్తోంది పదండి." అని విక్కీ భుజం గారంగా తడుతూ లేచాడు శరత్.