Monday, September 21, 2009

పుట్టినరోజు జేజేలు
పెద్దోడు విక్కీ కి చిన్నోడు గౌరవ్ వీరాభిమాని. ఎప్పుడూ విక్కీ లా మారి పోతూ వుంటాడు. కాక పోతే నాకొచ్చిన తిప్పలేమిటంటే వీడెప్పుడు విక్కీ అయిపోతాడో తెలీదు ! గౌరవ్ , గౌరవ్ అని ఓ రెండు సార్లు పిలిచి పలకక పోతే ఓహో విక్కీ ఐపోయాడన్నమాట అని అర్ధం చేసుకొని విక్కీ అనిపిలుస్తే పలుకుతాడు. అంతటి తో ఐపోదు , నేనూ అమ్మమ్మగా పరకాయ ప్రవేశం చేయాలి . నాకైతే అలవాటైపోయింది కాని పాపం తాత బోల్తా పడిపోతారు. తాతా ఈ రోజు విక్కి వచ్చాడు అనగానే గాభరా పడిపోయి ఏమైంది ? వాడెందుకొచ్చాడు ? సంజేమీ చెప్పలేదే ? వాడికి జ్వరం రాలేదుగా ? ( ఎందుకంటే జ్వరం వంక పెట్టి స్కూల్ డుమ్మా కొట్టీ , అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేయటం వాడి సరదా ) అంటూ బోలెడు ప్రశ్నలు వేయగానే హే తాత ఫూల్ అయ్యారు అని వీడు డాన్స్ ! అప్పుడు చూడాలి తాత ఫేస్ !

ఒక విక్కి ఐతే ఎలాగో సర్దుకోవచ్చు. కాదే ఎప్పుడే రూపం ఎత్తుతాడో తెలీదు.దాని కి తగ్గట్టు నేనూ మారకా తప్పదు ! అంతేనా రాత్రి కాగానే మా పక్క నిండా బెన్ 10 లు , సుపర్ మాన్ , బాట్ మాన్ అబ్బో చెప్పనవసరం లేదు అందరు సూపర్ హీరోస్ వచ్చి చేరుతారు . మేమెటో ఓ మూలకి సర్దుకోవాలి ! ఇక తాత కి నీరసమొచ్చి , నొబడీ కెన్ స్లీప్ ఆన్ మై పిల్లో అనేస్తారు. అమ్మో అదీ మరీ డేంజర్ . అందుకే వెంటనే , నో తాతా ఇట్స్ మి గౌరు అని మా గౌరు వచ్చేస్తాడన్న మాట . ఇట్స్ మి గౌరు అన్నది తారక మంత్రం .గౌరవ్ ఐతే అన్నిటికీ ఓకే ! పిల్లో మీదా పడుకోవచ్చు. తాత బొజ్జ మీదా పడుకోవచ్చు !
సరే ఇదీ రోజూ తాతా మనవడికి వుండే పోట్లాటే ! ఇప్పుడు సమస్య ఏమిటంటే ఈ రోజు వాడి బర్త్ డే . మరి నేనెవరికి శుభాకాంక్షలు చెప్పాలి ?
జెర్రీ కా ?
బుడుగుకా ?
సూపర్ మాన్ కా ?
బాట్ మాన్ కా ?
పవర్ రేంజర్ కా ?
నేను గౌరవ్ ని బామ్మా నాకే చెప్పలి .
మరే నాకు ఇంగిలిపీసు రాదు కదా అందుకే తెలుగులో చెప్పాడన్న మాట.
అబ్బా బామ్మా నీకెన్ని సార్లు చెప్పాలి ? ఇంగిలిపీసుకాదు ,ఇంగ్లిష్ .
ఏమోరా బుడుగ్గా , నేనైతే తెలుగులోనే జన్మదిన శుభాకాంక్షలు అంటాను .ఇదో నీ ఫ్రెండ్ ఇంగ్లిష్ లో చెప్తుతాడు . ఎంజాయ్ !
హాపీ బర్త్ డే టు యు , హాపీ బర్త్ డే టు యు.
హాపీ బర్త్ డే డియర్ గౌరవ్ , హాపీ బర్త్ డే టు యు.

నువ్వు అడిగావని ఈ గ్రీటింగ్ కూడా పెట్టాను కదా ! ఇప్పుడు సంతోషమేనా ?
ఐ లైక్ యు సో మచ్ బామ్మా ,యు ఆర్ మై బెస్ట్ ఎస్ట్ బామ్మ .
ఈవెన్ ఐ టూ లైక్ యు సో మచ్ గౌరవ్ .
రాత్రి నేను చేసిన పొస్ట్ వాడికి పొద్దున్నే నేను చూపించగానే మా ఇద్దరి స్పందన్ ఇది . వాడి కోరిక మీద ఇంకో గ్రీటింగ్ పెట్టాను.సాయంకాలం లోపు ఇంకెన్ని ఆడ్ అవుతాయో !

Friday, September 18, 2009

బతుకమ్మ

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో


మా చిన్నప్పుడు మానాన్నగారి వుద్యొగరీత్యా వరంగల్ ,ములుగు ,ఖమ్మం లాటి ప్లేస్లలో వుండటము వలన మా స్నేహితులతో కలిసి బతకమ్మలాడే వాళ్ళము .కాని మాఇంట్లో ఆనవాయితి లేక పోవటము వలన దాని గురించి తెలీదు. మా అత్తవారింట్లో బతకమ్మ ఆనవాయితి వుండటము తో నాకూ అలవాటైంది. ప్రతి సంవత్సరము తప్పకుండా బతకమ్మని పెట్టేవాళ్ళము. మా సందులోని అమ్మయిలంతా వచ్చేవారు. ప్రతి రోజూ నైవేద్యము చేయటము నాకు సరదాగా వుండేది. .తొమ్మిదో రోజు రిక్షాలలో వెళ్ళి టాంక్ బండ్ లో నిమజ్జనం చేసేవారము. మాఇంట్లో ఇది ముఖ్యంగా ఆడపడుచుల పండగ.ఏ పండగకి బట్టలు పెట్టినా లేకపోయినా ఈ పండుగకి మాత్రము తప్పక ఆడపిల్లలని ఇంటికి పిలిచి చీర ,పసుపుకుంకుమ తప్పక ఇచ్చేవారు మా అత్తగారు. మా అడపడుచులకు , మా అమ్మాయికి పెళ్ళిల్లు అయ్యాక చిన్న బతకమ్మని ,గౌరమ్మని దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తున్నాను. ఇదో ఇన్నేళ్ళకు నాలుగు సంవత్సరాలనుండి మా మనవరాలు మేఘ, మా ఈతరం ఆడపడుచు వచ్చాక మళ్ళీ పెద్ద బతకమ్మని పెట్టి అందరిని పిలిచి ఆడిస్తున్నాను. ప్రతి సంవత్సరమూ ఏదో ఒక పూజ ఐనా చేసి ముత్తైదువులను పిలిచి తాంబూలము ఇవ్వటము నాకు అలవాటు. .

ఈ రోజు అమావాస్య . ఈ రోజు బతకమ్మని మొదలు పెట్టి తొమ్మిది రోజులు పెడతాము.
వుదయమే దేవుడి దగ్గర పసుపు తో గౌరమ్మని చేసి ఓ తమలపాకు లో పెట్టి ,పూజ చేసి ,నైవేద్యము పెట్టాలి. మొదటి రోజు పులగం,రెండో రోజు పెరుగన్నం ,మూడోరోజు చలిమిడి ముద్దలు, నాలుగో రోజు నానుపాలు ( అటుకులని పాలలో నానవేసి , బెల్లం, కొద్దిగా ఇలాచి పొడి కలిపినది ) ,ఐదోరోజు అట్లు, ఆరోరోజు సున్నుండలు ,ఏడోరోజు పరవాన్నం ఎనిమిదోరోజు గారెలు ,తొమ్మిదో రోజు చద్దులు ( మేము పెట్టేవి ,పులిహోరా , దద్దోజనం ,చక్ర పొంగలి ) నైవేద్యం పెట్టాలి.

మద్యాహనం రకరకాల ,రంగురంగుల పూలతో బతకమ్మని పేర్చాలి. బతకమ్మ తల పైన మద్యలో ఓ చిన్న పసుపు గౌరమ్మని ,తమలపాకు లో పెట్టి పెట్టాలి.సాయంకాలము పూల గౌరమ్మ తో పాటు దేవుడి దగ్గరి గౌరమ్మని కుడా తెచ్చి ,ఇంటి ముందు శుభ్రంగా వూడిచి ముగ్గు వేసిన చోటులో పెట్టాలి.ముందుగా దీపారాధన చేయాలి.
తరువాత,
ఒక్కొక్క అక్షింతలే గౌరమ్మా , ఒక్క మల్లె సాలెలూ ,
చిన్న చిట్టివత్తులూ గౌరమ్మ సన్న దీపాలూ ,
నీలాటి జలతి వద్దా గౌరమ్మ నీ నోము నాకు చెల్లె,
బంగారు మేడ లోనా గౌరమ్మ నా నోము ఫలము చెప్పు.

ఈ పాట మూడేసి సార్లు పాడుతూ పసుపు ,కుంకుమ , అక్షితలూ బతకమ్మ మీద వేస్తూ పూజ మొదలు పెట్టాలి.ఆ పై రకరకాల పాటలు పాడుతూ ,చుట్టూ తిరుగుతూ పూజించాలి. ఆ తరువాత కోలాటము.అంతా ఒక లయ ప్రకారము , చూడముచ్చటగా ,కనులకింపుగా వుంటుంది.పూజ తరువాత కత చెప్పుకొని ,తలపై అక్షింతలు వేసుకొని, నైవేద్యం పెట్టాలి. పొద్దున చేసినదానిలోనే కొద్దిగా వుంచి ఐనా పెట్టవచ్చు. లేదా పప్పు బెల్లం అయినా పెట్టవచ్చు. పొద్దుటి గౌరమ్మని తీసి దేవుడి దగ్గర పెట్టేయాలి. ఆ రోజు బతకమ్మ మీద పెట్టిన చిన్న గౌరమ్మని ఓ బకెట్ నీళ్ళ లో పోయిరా మాయమ్మ పొయిరావమ్మ ,పోయి నీ అత్తింటనూ సుఖముగా నుండు ,ఎవ్వరేమన్ననూ ఎదురాడబోకు ,మగడేమన్ననూ మారాడ బోకూ అంటూ అప్పగింత పాటలు పాడుతూ ఓలలాడించాలి.ఆ పసుపును ముత్తైదువులు కొద్దిగా తాళికి రాసుకొని , ఆ నీటిని చెట్టు మొదలులో పోసేయాలి. వచ్చిన ముత్తైదువులకి పసుపు ,కుంకుమ తాంబూలం ఇవ్వాలి.
ఈ విధముగా తొమ్మిది రోజులు పూజించి , తొమ్మిదో రోజు పెద్ద గౌరమ్మని కూడా బతుకమ్మ మీద వుంచి వొడి బియ్యం ( చిన్న కొత్త్త బట్ట లో కొద్దిగా బియ్యం ,ఒక రుపాయి పెట్టి ముడి వేయాలి ) పెట్టి, కొత్త జాకెట్ బట్ట పెట్టాలి.పూజా విధానమంతా మామూలుగానే చేసి , ఏదైనా చెరువులో నిమజ్జనం చేయాలి. అప్పుడు బతుకమ్మ మీద చిన్న చిన్న కొవ్వొత్తులు వెలిగించి పెడితే చూడటానికి
చాలా బాగుంటుంది. కొవ్వొత్తుల వెలుగు లో నీటిమీద బతుకమ్మ తేలి పోతూవుంటే చూడటనికి రెండు కళ్ళూ చాలవు.
బరువు బాధ్యతలతో అలిసిపోయిన అమ్మాయి తీసుకొచ్చి ,సేదతీర్చి పంపటమే ఈ కథ లో పరమార్దము అని నాకనిపిస్తుంది.

Tuesday, September 15, 2009

బాల్యమిత్రులునిన్ను శ్యాం వాళ్ళింట్లో దింపి నా పనిచూసుకొని, వస్తాను. అందరము పంచరతన్ కి లంచ్ కి వెళుదాం .శాంతి లో మూవీ చూద్దాం .

ఏమిటీ మాట్లాడవు .నీకేమైనా పనులున్నాయా ?

నా మొహం నాకేం పనులు ? కాకపోతే మాట్లాడుతున్నది మావారేనా ? ,వింటున్నది నేనేనా ? ఇది మా ఇల్లేనా ? ఏమిషో ...... అంతా మాయా .నా స్వగతం లో నేనుండగా ? మళ్ళీ వినిపించింది , ఇది మాయ ,కల కాదు అంటూ మావారి గొంతు, ఏమిటీ సరేనా ?

ఆ సరే సరే ! మళ్ళీ మనసు మార్చుకునే లోపల ఘట్టిగా చెప్పాలిగా !

మావారి ప్రోగ్రాం వినగానే అటునుంచి లీల నమ్మలేక , ఫోన్ నా కిమ్మంది.

ఏమిటి మాలా ప్రభాత్ చెపుతోంది నిజమేనా ?

ఇద్దరమూ ఆ షాక్ లో వుండగానే ఇంకో షాక్ ఫొటో కూడా తీయించుకుందాం !

ఇంతకీ ఈ హడావిడి ,ఈ షాక్ లు ఎందుకంటే సెప్టెంబర్ 13 మావారి బర్థ్ డే , 14 మావారి జిగిరి దోస్త్ శ్యాం బర్త్ డే . ఓ అల్లనప్పుడు 13 రాత్రి 12 గంటలకు ఇద్దరితో కేక్ కట్ చేయించి పిల్ల పెద్ద అందరమూ తెగ అల్లరి చేసేవాళ్ళమన్నమాట !

మేము ఆరునెలలు అమెరికా ,ఆరునెలలు ఇండియా ప్రదక్షణలు పూర్తికాగానే ,శ్యాం లీలా ఓ ఆరు నెలలు సింగపూర్ , ఓ ఆరు నెలలు బెంగుళూర్ ప్రదక్షణ మొదలు పెట్టారు. మా ఈ భూప్రదక్షణలలో మా ప్రోగ్రాములు మా తో పాటు తిరగలేక ఆగిపోయాయి ! మా ప్రదక్షణలాగాయి కాని వాళ్ళవి ఇంకా ఆగలేదు !

మరి మీరు మీ దూడలని మీ పెరట్లో కట్టేసుకున్నారు .మా దూడలింకా దేశాల మీదే వున్నాయి అని లీల ఉవాచ ! ఇదో అనుకోకుండా ఇలా కాలం కలిసిరావటము ,మావారికి బర్త్ డే కి ప్రొగ్రాం వేసుకుందా మనిపించటము జరిగింది.

కార్ లో మావారిని అడిగాను మీకు, శ్యాం కి ఎప్పటినుంచి ఫ్రెండ్షిప్ అని . బహుషా 61 నుంచి అనుకుంటా , ఇద్దరము ట్యూషన్ లో కలిసాము . అంతే ఆ తరువాత సెల్ లో మునిగి పోయారు.

శ్యాం ని విష్ చేసి మావారు మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాక , శ్యాం మిమ్మలిని ఇంటర్వ్యు చేద్దామనుకుంటున్నాను అన్నాను.

ఓ కే అడుగు ఏమడుగుతావో

మీరు ,ప్రభాత్ ఎలా ,ఎప్పటినుండి ఫ్రెండ్స్ ?

1960 లో నరసిం హ రావు సార్ దగ్గర మాథ్స్ ట్యూషన్ లో కలిసాము ,అప్పుడు అంటూ ఉత్షాహం గా మొదలు పెట్టగానే ,లీల లోపలి నుండి వచ్చి ఏంచెప్తున్నారు ? అంది.

వీళ్ళిద్దరి స్నేహితం ఎప్పుడు మొదలయిందా అని అడుగుతున్నాను.

అవునుకదూ ఇన్ని సంవత్సరాలయినా నేనెప్పుడూ అడగలేదు. నేను మటుకు ప్రభాత్ ని 61 లో క్వాలిటీ హోటల్ లో కలిసాను . అప్పుడు టీ తాగాము కదా శ్యాం , ఆ హోటల్ ఆబిడ్స్ మేన్ రోడ్ మీద వుండేది ,ఇప్పుడు అక్కడంతా మారి పోయింది అంటూ ఇంకా ఏమో చెప్ప బోతూ శ్యాం ను చూసేసరికి ఆయన మొహానికి అడ్డం గా పేపర్ ! ఇదేమిటి ?

నన్ను మాల అడుగుతుంటే నువ్వే చెప్పేస్తున్నావు నేనెందుకు మాట్లాడాలి ? నువ్వే చెప్పు . నేను చెప్పను .

అంతే బర్త్ డే బాయ్ అలక తో నా ఇంటర్వ్యూ కి బ్రేక్ !

నా బిక్క మొహం చూసి లీల , వంక లేనమ్మ డొంక వెతికిందిట ! పొద్దటి నుండి మా ఆయన గారు పేపర్ చదవలే అదీ బడాయ్ ! అంది.

హన్నా ! నన్నే ఇంత మోసం చేస్తారా ? చూడండి ఏం చేస్తానో ! వచ్చే సంవత్సరం ఇదేరోజున మీ ఫ్రెండ్షిప్ గొల్డెన్ జూబ్లీ డే సెలబ్రేట్ చేసి మిమ్మలిని సెల్ నుంచి, పెపర్ నుంచి బయటపడేసి , మీతోటే మీ బాల్యమిత్రుల కథ చెప్పించక పోతే ఏం చేద్దాం ఏదో వొకటి ఇదే నా ప్రతిజ్ఞ !

మిత్రులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు .

Tuesday, September 8, 2009

ఉండ్రాళ్ళతద్దె

తెల్లవారు ఝాముననే మా వదినగారింటికి వెళ్ళాలి. 50 సంవత్సరాల తరువాత ఉండ్రాల తద్దె నోము తీర్చుకునే పని పెట్టుకున్నాను ,వస్తావా అన్నారు. అసలు నోములు పుట్టింటి వారే తీర్చాలట ! . నేను ఏమిచేయాలో చెప్పండి అన్నాను. నాకు తెలిసినప్పటి నుండీ చెపుతున్నాను , మీరు తీర్చు కోండి నేను సాయం చేస్తాను అని. ఆవిడ పెళ్ళైనఫ్ఫుడు , అవిడకి 12 సంవత్సరాల వయసులో మా అత్తగారు ,ఆవిడతో చాలా నోములు నోమించారట. ఏమేమి నోముకున్నారో కూడా గుర్తు లేవట . ఇన్ని సంవత్సరాల తరువాత తీర్చుకుందామనుకున్నారు. నువ్వేం తేనవసరము లేదు పొద్దున్నే 5 గంట్లకల్లా వచ్చేయ్ చాలు అన్నారు. ఏదో పెద్దరికం భుజాన వేసుకుందామనుకున్నాను కానీయ్ కుదర్లే ! పాపం ఆవిడే అన్ని చేసుకున్నారు. ముందు రోజు విన్నూ బర్త్ డే పార్టీ లో గోరంటాకు, షాంపు ఇచ్చారు. మరి నాకేది అంది సంజు. పొద్దున్నే వచ్చి భోజనం చేయాలి, మళ్ళీ 12 గంటలకు వచ్చి ,భోజనం చేయాలి రాలేస్తావా ? అన్నారు . అదేంటి పెద్దత్తయ్యా ? మండే పెట్టుకున్నావు ? సండే అయితే అందరం వచ్చేవాళ్ళము కదా ? అమ్మాయిలంతా ఆవిడ మీద దాడి చేసారు. మరేం చేయనర్రా తదియ ఆ రోజే వచ్చింది. అప్పుడే చేసుకోవాలి అని నచ్చ చెప్పారు.

తెల్లవారుఝాముననే మావారికో కప్పు కాఫీ లంచం ఇస్తే చిక్కడపల్లి తీసుకెళ్ళారు. అప్పటికే వదినగారు పూజ మొదలు పెట్టారు.ఐదుగురు ముత్తైదువులకి పసుపురాసి, బొట్టు పెట్టి , బుట్టవుయ్యాల లో ఉయ్యాల లూగించారు. గోంగూర పచ్చడి, కంది పచ్చడి , పొట్లకాయ కూర తో అన్నం వడ్డించారు.ఇంత పొద్దున్నే ఎలా తింటాం అనుకున్నాం కాని ఆ రుచే వేరు. కబుర్లలో బాగానే లాగించాం. ఆ తరువాత బ్రేక్ . మళ్ళీ 11.30 కి పూజ చేసాక అందరం లలితాసహస్రనామం చదివాక ,భోజనం పెట్టి, చీర , ఐదు పూర్ణాలు , తాంబూలం ఇచ్చారు. కథ చదివి ఉద్యాపన చేసారు.

ప్రతి సంవత్సరమూ భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము ఉండ్రాళ్ళ తదియ.ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకి గోరంటాకు ముద్ద ,పసుపు కుంకుమలు ,కుంకుడు కాయలు ,నువ్వులనూనె ఇచ్చి మాయింటికి తాంబూలము తీసుకోవటాని కి రండి అని ఆహ్వానించాలి.
ఉండ్రాళ్ళతద్దె లోని ప్రత్యేకత తెల్లవారుఝాము భోజనాలు.భోజనాలయాక ఉయ్యాలలూగుతారు.

మద్యాహ్నం గౌరీ పూజ.గౌరిని షొడశోపచారాలతో పూజించిన వారికి సమస్త శుభాలు సమకూరుతాయంటారు.ఐదు దారపు పోగులు పోసి,ఐదు ముడులు వేసి , ఏడుతోరాలను అమ్మవారి పక్కనే వుంచి పూజించాలి. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోముకున్నవారికి , మిగితా ఐదు, ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి. బియ్యపు పిండిలో బెల్లము కలిపి ,పచ్చి చలిమిడి చేసి ,ఐదు ఉండ్రాలను చేసి , నైవేద్యం పెట్టాలి.

పూజ తరువాత చేతిలో అక్షింతలనుంచుకొని కథచెప్పుకోవాలి.ఈ వ్రత కథ ఏమిటంటే , పూర్వం ఓ వేశ్య ,తన సౌందర్యం తో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది.ఒక ఉండ్రాళ్ళతద్దె నాడు ,రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు.ఆమె అహంకారముతో దైవ నింద చేసీన నోముకో లేదు. పలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్ళారు.మహా వ్యాది బారాన పడ్డది.తరువాత రాజ పురోహితుడి సలహాతో ఉండ్రాల తద్దె నోము నోచుకొని, తన సంపద ని తిరిగి పొంది, ఆరోగ్యస్తు రాలై శేష జీవితాన్ని ఆద్యాత్మికంగా గడిపి ,మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది.

ఒక గర్విష్టికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా ! సత్ప్రవర్తన తో ఉండి నోచినవారికి ఇంక ఎంత ఉన్నతమైన పలితముంటుందో ఊహించుకొని సన్మార్గం లో నడవండి ! అనేది ఈ కథలోని నీతి.


హిందు సాంప్రదాయములో నోములు ,పూజలకి పెద్ద పీటనే వేసారు. నోము నోచుకుంటేనే సుమంగళిగా వుంటామా ? అందుకోసం వ్రతాలు చేయాలా ? అని వితండ వాదం చేసే వారికి ఏమీ చెప్పలేను . అంత పరిజ్ఞానము నాకు లేదు. నోముకుందాము అనుకోగానే ఇల్లు శుభ్రం చేసి , మామిడాకులు కట్టి, ముగ్గేసి, దేవుడి పీఠానికి పూలూ ,ఆకులు అలంకరించి , ధూప దీప నైవేద్యాల తో పూజించి ,ముత్తైదువులకు ,తాంబూల మిచ్చి , ఆశీస్సులు తీసుకోవటము తో ఇంటికి ఓ కళ వస్తుంది. మనసు లో ఓ ప్రశాంతత ఏర్పడుతుంది.ఇంట్లో పాజిటివ్ వేవ్స్ వచ్చినట్లుగా వుంటుంది. కుటుంబ శ్రేయస్సు ,ఆద్యాత్మికానందం కలుగుతుంది.