Tuesday, January 24, 2012

కథాజగత్ - బుజ్జిగాడి బెంగ



కథ ; బుజ్జిగాడి బెంగ ,

రచయత ; ఎనుగంటి వేణుగోపాల్

బాల్యం . . . ఎంత అపురూపమైనది . చిన్నప్పటి ఆటలు , పాటలు , చిలిపి అల్లరులు జీవితాంతం మరువలేనివి .అమ్మ తో కథలు కథ గా చెప్పించుకొని మురిసిపోని వారెవరు ? బాల్య స్నేహితులంటే ఎంత మురిపెం . . . తూనీగల్లా గెంతుతూ ముచ్చటపడేసేది బాల్యం . ఆటల్లో మోచేయి కొట్టుకొని , మోకాలు డోక్కుపోయి రక్తాలు కారుతున్నా ఆటల్లో దెబ్బ అరిటిపండే ! పైగా పెద్దయ్యాక తమ పిల్లలకు ఆ దెబ్బలగురించి కబుర్లు చెప్పటం ఎంత బాగుంటుంది కదూ ! స్కూల్ నుంచి వస్తూనే స్కూల్ బాగ్ లోపలికి గిరాటేసి , అమ్మ ఇచ్చిన పాలు హడావిడిగా తాగేసి , మూతైనా తుడుచుకోకుండా ఆటలకు పరుగులు పెట్టటం , అలసిపోయి వచ్చి , ఏదో స్నానం చేసాము , చదువుకున్నాము అనిపించుకొని ,నిద్ర తో కూరుకు పోతున్న కళ్ళను బలవంతాన తెరుచుకుంటూ , అమ్మ చెప్పే కథలను వింటూ , అమ్మ చేతి ముద్దలు తింటూ , అలానే పీట మీద నిద్ర కొరగటం , అమ్మ ఎత్తుకెళ్ళి ' పిచ్చితల్లి అలిసిపోయింది ' అని మురిపెం గా అంటూ పడుకోపెట్టటం . . . అబ్బ అవన్నీ తలుచుకుంటూవుంటే మళ్ళీ చిన్నారి తల్లి ఐపోవాలనిపించదూ !!!!! మరి ఈ కాలం పిల్లలకు ఆ మురిపాలు దక్కుతున్నాయా ????? చదువులు , రాంకులూ అంటూ పోటీ చక్రం లో వాళ్ళ బాల్యం బంధీ ఐపోయింది .ఆటలూ లేవు . అల్లరులూ లేవు . పొద్దున్నే స్కూల్ , ఇంటికి రాగానే ట్యూషన్ , హోంవర్క్ ఇంతే జీవితం . మహా ఐతే వీడియో గేంస్ ఆడుకోవటం అంతే కదా * * *

అలా బంధీ ఐపోయిన ఓ చిన్నారి స్వగతమే , ఎనుగంటి వేణుగోపాల్ గారు రచించిన కథ " బుజ్జిగాడి బెంగ " .

బుజ్జిగాడి కి వానపడె ముందు వచ్చే మట్టి వాసన అంటే చాలా ఇష్టం . వానలో తడవట మంటే మరీ ఇష్టం . ఆకాశం లొంచి రాలిపడే ఆ నీటి బుగ్గలను అలా చూడటమంటే భలే సరదా .ఎగిరి గంతేయాలనిపిస్తుంది .వర్షా కాలం వచ్చిందంటే చాలు "రెయిన్ రెయిన్ , కం ఎగేయిన్ " అనే రైం అస్తమానమూ పాడుకుంటూ వుంటాడు . వర్షం వచ్చినప్పుడు తడవాలనుకుంటాడు . కాని వీలవదు . ఎందుకంటే వాడి చెల్లాయి డైనొసార్ లా వదల కుండా వెంబడించి , డాడీకి చెప్పేస్తుంది :( పాపం బుజ్జిగాడు !

వాళ్ళ డాబా కెదురుగా గుడిసెలో వున్న శీను గాడిలా మట్టిలో ఆడుకోవాలని , రెండు జేబుల్లోనూ మట్టివేసుకొని గెంతాలని వుంటుంది . కాని వీలవదు . మార్నింగ్ లేస్తాడా , , ,లేవగానే ట్యూషన్ .ట్యూషన్ నుంచి వచ్చి స్నానం చేసి రెడీ అవుతాడా , స్కూల్ బస్ సిద్దం . సాయంత్రం హోంవర్క్ .తర్వాత మళ్ళీ ట్యూషన్ .ట్యూషన్ అయ్యాక కాసేపు స్టడీ .ఇవన్నీ అయ్యేసరికి రాత్రి తొమ్మిదవుతుంది . అన్నం తినిపించి పడుకోపెడతారు .మార్నింగ్ , ఈవినింగ్ రెండుసార్లు ట్యూషన్ ఎందుకంటే సెకండ్ యూనిట్ లో సెకండ్ రాంక్ వచ్చిందని ! హుం . . . ఆ చిన్నివాడికి ఎంత కష్టం అని గుండె పట్టుకు పోవట్లేదు ?

చివరికి వాడి డాడీ వాడిని వానలో ఆడుకోనిస్తాడు . కాని ఎప్పుడు , వాడికి మళ్ళీ ఫస్ట్ రాంక్ వచ్చినప్పుడు .

ఇలా వున్న బుజ్జిగాడి స్వగతం చదువుతుంటే మనకూ బెంగ వచ్చేస్తుంది . ప్రతి వాక్యం లోనూ వాడి బాధ మన కళ్ళలో నీళ్ళు , ఇదేమిటి ఈ కాలం పిల్లలు ఇలా మెకానిక్ గా ఐపోయారు అనిపిస్తుంది . అసలు నాకైతే చదువుతున్నట్లుగా లేదు , ఓ బుజ్జిగాడు నా ముందు కూర్చొని చెపుతున్నట్లుగా అనిపించింది . అంతలా హృదయాలను తాకేట్లుగా రాసారు రచయిత ఎనుగంటి వేణుగోపాల్ గారు . చాలా సరళ మైన భాష లో , ఓ చిన్నపిల్లవాడు చెపుతున్నట్లుగానే రాసారు . అన్ని సంఘటనలు , మన ఇంట్లోనో , పక్కింట్లోనో జరుగుతున్నట్లుగా వున్నాయి . చిన్నపిల్లలున్న ప్రతి తల్లీ తండ్రి తప్పక చదవ వలిసిన కథ ఇది .

ఏదైనా ఒక నీతి చెప్పాలంటే అది కథలో భాగమవ్వాలి కాని , ఆ కథ ఓ డాక్యుమెంటరీ సినిమా లా ఓ నీతి సూత్రం చెపుతున్నట్లుగా వుండకూడదు , అని నా అభిప్రాయం . ఈ కథలో బుజ్జిగాడి బాధ లో మనం లీనమవుతామే కాని , ఏదో సందేశాత్మక కథ చదువుతున్నట్లుగా వుండదు . పూర్తిగా చదివిన తరువాత పిల్లలను చదువు కోసం ఇలా బాధ పెట్టకూడదు అనిపిస్తుంది . అది నాకు చాలా నచ్చింది .

ఇంత మంచి కథ ను మిస్ కావద్దు . " బుజ్జిగాడి బెంగ " ను " కథా జగత్ " లో చదవచ్చు .
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/bujjigadi-benga---enuganti-venugopal




కినిగె తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా

Sunday, January 15, 2012

మా ఇంటి సంక్రాంతి




గోవు పూజ ; మా ఇంటికి వచ్చిన గోమాత పేరు "సరస్వతి " . లక్ష్మి కి నీళ్ళాడే రోజులట . అందుకని సరస్వతి ని తీసుకొచ్చానన్నాడు . సరస్వతి ఐనా కావలసిందేకదా ! ఆ ఆవు , దూడ ల కు ఇలా పూజలు చేయించుకోవటం అలావాటేమో , చక్కగా మూర్లెత్తి , పసుపూ , కుంకుమా పెట్టించుకున్నాయి .




బంతిపూలు ; మా పక్కింటివాళ్ళు ఫ్లాట్స్ కట్టించటానికి , ఇంటితో పాటు మామిడి చెట్టునూ కొట్టేసారు . అందుకని ఈ సారి మామిడాకులు లేకుండా వట్టి బంతిపూల తో సరిపెట్టుకోవలసి వచ్చింది !



ముత్యాల ముగ్గు ; ముత్యాలెక్కడా అని చూడకండి . ఏదో బాగుందని అలా పేరు పేరు పెట్టాను :)



పొంగలి ,



చెక్కర పొంగలి ; చక్కని తల్లికి చాంగుభళా ! అని ఈ పొంగలి , చెక్కర పొంగలి సంక్రాంతి లక్ష్మికి నైవేద్యం పెట్టానన్నమాట .



మా గేట్ పక్కన పక్కింటి కూలీలు వేసిన బోగిమంట . ( మా గేట్ పక్కన కాబట్టి మాదన్నట్లేగా !)

అన్నీ మేము శాస్త్రొక్తం గా చేసుకున్నట్లేగా ! ఏమిటీ బోగిపళ్ళు , బొమ్మలకొలువు లేవంటారా ? మరి ప్రస్తుతం మా ఇంట్లో చిన్నపిల్లలెవరూ లేరు గా ! ఎప్పుడూ చేసే చక్కిలాలూ , అరిసెలు కూడా చేయలేదు . ఎందుకంటే ఓపిక లేక :)

ఇవీ మా సంక్రాంతి సంబరాలు :)

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు .

Thursday, January 5, 2012

బొమ్మాళీ నన్నొదిలేయ్ !!! నన్ను వళ్ళేయవే బొమ్మాళీ!!!



నేను కూడలి లో చేరిన కొత్తల్లో , కూడలి నిండా " నిన్నొదల బొమ్మాళీ " అని టైటిల్స్ తెగ కనిపించేవి . అప్పుడే స్కూల్ లో కొత్తగా చేరిన మా మనవడు స్కూల్ నుంచి వస్తూనే " నిన్నొదళ బొమ్మాళీ " ( ళ నే , ల కాదు . అప్పట్లో మేము ఎక్సైట్మెంట్ లో అలాగే మాట్లాడేవాళ్ళము :)) అని నా మీదకు తెగ గెంతుతూ వుండేవాడు . ఈ బొమ్మాళీ ఏమిటి చెప్మా అని , ఆ పొస్ట్ లు చదివితే " అరుందతి " సినిమా లో డైలాగ్ అని అర్ధమైంది :) అదేదో దయ్యాలూ , పునర్జన్మలూ వున్న భయంకరమైన సినిమా అని తెలిసి , చూడాలని క్యూరియాసిటీ వున్నా దాని జోలికి పోలేదు .

రెండు నెలల క్రితం కొన్ని సి.డి లు తెచ్చుందామని కోటీ వెళ్ళాను . రెండుమూడు నెలల కోసారి , కొన్ని పుస్తకాలు , సినిమాల సి.డి లు కొనుక్కొచ్చుకోవటం నా అలవాటు :) . సి.డి లు చూస్తూ వుండగా , సేల్స్ మాన్ " అరుంధతి " సి .డి లు తెచ్చి అక్కడ సద్దాడు . ఈ సినిమా ఎట్లా వుంటుంది బాబూ అని అడిగాను అతనిని . మస్త్ వుంటది మేడం అన్నాడు అతను . ఇంతకు ముందు " చంద్రముఖి " సినిమా వచ్చినప్పుడు సుదర్షన్ లో చూడటానికి వెళ్ళి , టికెట్స్ కొనుక్కొని కూడా భయమేసి పది రూపాయల నష్టాని కి అమ్మేసి బయటపడ్డాము . ( వాళ్ళు డబ్బులు తక్కువిచ్చారని బయటకు వచ్చి చూసుకున్నాక తెలిసిదిలెండి . అప్పుడేమో హడావిడిగా వాటిని వదిలించుకునే మూడ్ లో వున్నామన్నమాట ) . ఆ తరువాత సి. డి తెచ్చుకొని చూసి వోరినీ దీనికేనా నేను అంత భయపడి డబ్బు నష్టపోయింది అనుకున్నాను . అలాగే ఈ అరుంధతి కూడా థియేటర్ లోని సౌండ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో తీరిగ్గా చూడవచ్చు అని ధైర్యం చేసి సి. డి తెచ్చేసుకున్నాను . తెచ్చిన రెండు నెలల కి చూడటానికి నాకు ఇప్పుడు టైం దొరికింది. ఈ రెండు నెలలు వూరికే వుండలేదు లెండి . వీలైనప్పుడల్లా వారినీ వీరినీ , ఇలా అరుంధతి ని తెచ్చుకున్నాను చూడవచ్చా అని అడిగి అభిప్రాయ సేకరణ చేస్తూనే వున్నాను . అదేమిటో అందరూ వద్దు చూడకు , చూస్తే భయపడి చస్తావ్ అని బెదిరించారు . అప్పుడు కాస్త భయమేసినా ఆ ఈ మాత్రానికేనా అని నోరు చప్పరించేసాను . ఈ మద్య మావారు ఇంట్లో వుండి అప్పుడప్పుడు సి.డి లు చూస్తున్నప్పుడోసారి ఏమండీ అరుంధతి చూద్దామా అని అడిగాను . ఏదీ ఆ పెద్ద బొట్టు పెట్టుకొని వుంటుంది ఆ సినిమానా నాకు అలాంటివంటే చిరాకు అనేసారు , ఏం చేస్తాం అప్పుడు మిస్సమ్మో మరేదో చూసాము :) . , . ఇహ ఆగలేక ,నిన్న మావారు ఆఫీస్ ఎప్పుడెప్పుడు వెళుతారా అని ఎదురుచూసీ . . . చూసీ ఆయన ఆయనటెల్లగానే నేనిటు అరుంధతి ని బయటకు తీసాను .

కుర్చీనీ టి. వి ముందుకు జరుపుకున్నాను . కొంచం చుడువా ప్లేట్లో తెచ్చుకొని సైడ్ టేబుల్ మీద పెట్టాను . మంచినీళ్ళ గ్లాస్ కూడా తెచ్చుకున్నాను . సెల్ పక్కన పెటుకున్నాను . మళ్ళి మధ్యలో లేచే పని లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ .చేసుకున్నానన్నమాట :) చిన్నగా ఆంజనేయ స్వామిని తలుచుకొని సి.డి ని ఇన్సర్ట్ చేసాను . . . ఆన్ చేసాను * * * *

సినిమా మొదలైంది . ముందు ఏమి వచ్చిందబ్బా . . . ఏమో గుర్తులేదే !!!!! ఎవరో భార్యా భర్త లు కార్ లో వెళుతున్నారు . గద్వాల్ అని ఏదో బోర్డ్ కనిపించింది . ఇంతలో ఓ పాడుబడ్డ కోట . వీళ్ళు దాని దగ్గరికి చేరగానే ఆ కోట లైట్ల తో వెలిగి పోతోంది . అక్కడే వాళ్ళ కార్ ఆగిపోయింది . . . ఎందుకు ? ఏమో గుర్తురావటం లేదు . . . ఇద్దరూ కార్ దిగి ఆ ఇంటి వైపు నడిచారు . . .
గేట్ మొదట్లో ఎవరో కనిపించి ఆ ఇంటికి వెళ్ళవద్దు అంటారు . ఐనా వినరు .ఇద్దరూ లోపలికి వెళుతారు . నేను చూడలేక దడ దడ కొట్టుకునే గుండెను పట్టుకొని బయటకు వెళ్ళాను * * * మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఓ గోడ కూలుతోంది . . . భార్య కనిపించలేదు . భర్త ఏమయ్యాడు . ఏమో . . . ఇదేమిటి నా మైండ్ ఇంత బ్లాంకైంది * * *
ఆ తరువాత సత్యనారాయణ ఓ గదిలోకి వెళ్ళాడు . అక్కడ టేబుల్ డ్రా లో నుండి ఏమో తీస్తున్నాడు . అంతే చిన్నగా ఆ గది తలుపులు మూసుకుంటున్నాయి . . . మూసుకుంటున్నాయి . . . మూసుకున్నాయి . . . అంతే నా గుండె ఇంకా స్పీడ్ గా ధడ్ . . . ధడ్ . . . ధడ్ . . . ఇంక చూడలేక పోయాను . ఆఫ్ చేసి బయటకు వెళ్ళి కూర్చున్నాను .
మళ్ళీ ఆ తరువాత ఏమి జరిగిందో నన్న క్యూరియాసిటీ తో అరుంధతిని పెట్టాను . అప్పటి వరకు చూసినదా నిని ఫార్వర్డ్ చేసి కొంచం ముందు కు పెట్టాను . ఎవరో పకీరు , ఇందాక చూసినబ్బాయిని ఎడా పెడా బాదుతున్నాడు . అనుష్క అతనిని ఆపి ఆ అతనిని కోపంచేసి , ఆ అబ్బాయిని తీసుకెళ్ళబోతుంది . ఇంతలో ఆ పకీరు కు ఆ పాడుపడిన ఇల్లు కనిపిస్తుంది . వెంటనే అతను అనుష్క తో ఇతనికి కాదు నీకు ఆపద పొంచి వుంది జాగ్రత్త అంటాడు . హుం అని హుంకరించి వెళ్ళిపోతుంది .

అనుష్క కు కాల్ వస్తుంది . లేచి కార్ తీసుకొని ఆ పాడుబడ్డ ఇంటి దగ్గరకు వస్తుంది . . . కార్ దిగుతుంది . . . చేతిలో పెద్ద టార్చ్ లైట్ తీసుకొని ఆ భవనం దగ్గరకు బయలు దేరుతుంది . . . . . పెద్ద బొట్టు , పూసలదండలు వేసుకున్న మాంత్రికుడి లాంటి అతను ఎదురొచ్చి అటు వెళ్ళవద్దు అంటాడు . వినదు . . . రాహుల్ . . . రాహుల్ . . . ( రాహులా . . . రోహితా ? ఏమో ఏంపాడో ఏదో వకటి ) అని పిలుస్తూ ఆ పెద్ద టార్చ్ లైట్ వెలిగించి చూస్తూ ఆ భవనం లోకి న. . డి . . చి. . ంది. . .

నా గుండె ధడ్. . . ధడ్. . . ధడ్ . . . బాబోయ్ ఇహ నా వల్ల కాదు చూడటం . ఇలా ఐతే నా గుండె ఆగిపోతుంది బాబోయ్ అనుకొని ఆపేసి " శాంతి నివాసం " పెట్టాను . ఇంకా గుండె దడ తగ్గలేదు . కాసేపు బాలకనీలో తిరిగి వద్దామని కొంచం వాకింగ్ చేసి , గుండెను పదిలం గా పట్టుకొని వచ్చాను . వీడియోలో " రాగాలా సరాగలా " పాట మొదలైంది . దేవిక కాంతారావు పాదాలు కొంగుతో తుడిచి , పౌడర్ వేసి సాక్స్ ఎక్కిస్తోంది . హూమ్మ్ . . . . ఇదెక్కడి పతి భక్తి రా నాయనా . . . . .నీ పతిభక్తి మండ * * * దేవుడా . . . దేవుడా మండే పొయ్యి లోనుంచి కాలే పెనం మీద వేసావా తండ్రీ అని ఆర్తనాదం చేసి , పొయ్యికన్న పెనం బెటర్లే అనుకున్నాను :)

అప్పుడే ఐపోలేదు . ఐపోతే ఇంకేముంది . సి. డి ప్లేయర్ మీద నుంచి అరుంధతి రా రమ్మని పిలుస్తూనే వుంది . అందుకే మా వారిని ఇద్దరం కలిసి మెలిసి అరుంధతి ని చూద్దామని బతిమిలాడాను .ఠాట్ . . . అన్నారు .

జీన్స్ పాంట్ , చక్కని షర్ట్ , మెళ్ళో స్కార్ఫ్ , చేతిలో పెద్ద టార్చ్లైట్ . . . . .అందం గా వున్న అనుష్క .* * * ఆ టార్చ్ లైట్ నా మొహం మీద కు వెసి , అటూ ఇటూ తిప్పుతూ దా* * * దా* * * వచ్చేయ్ * * * అని పిలుస్తోంది .
వద్దు వద్దు * * * రాను * * * బొమ్మాళీ నన్నొదిలేయ్ * * * నన్నొదిళేయ్ బొమ్మాళీ * * *

"మాలా . . . మాలా . . . లే " అని మావారు లేపారు . ఎన్నడూ లేనిది ఏమిటి అంత పెద్ద కేకలు పెడుతున్నావు అని అడిగారు . ( అవును మరి ఇన్నేళ్ళలో ఆయన కలవరించటమే కాని నేను కలవరించటం తెలీదుగా ! ) మొహమంతా చెమటలు . . . వణుకుతున్నాను * * * ఏదో పీడ కల వచ్చిందని చెప్పి తప్పించుకున్నాను .

పొద్దున లేచినప్పటి నుంచి నా కళ్ళు అరుంధతి నే చూస్తున్నాయి . . . నా కాళ్ళు అటే పోతున్నాయి . . . చేతులూ అటే వెళుతున్నాయి . అరుంధతి రా . . . రా . . అని పిలుస్తోంది . ఎప్పటికైనా ధైర్యం తెచ్చుకొని ఆ సినిమా చూడాలి అని నా మనసులోని కోరిక . బయటకు చెపితే మా వారు ఆ సి. డి విరగ్గొట్టి అవతల పారేయరూ !!!!!

నాకు ధైర్యం వచ్చేవరకూ నన్ను వళ్ళెయ్ బొమ్మాళీ * * * * * అని ఆ బొమ్మాళీ ని వేడుకుంటున్నాను :) :) :) :) :)

Sunday, January 1, 2012

హాపీ న్యూ ఇయర్



2011 జనవరి న్యూఇయర్ పార్టీ కి మా అబ్బాయి , మేమిద్దరమూ కలిసి వెళ్ళాము . ఆ తరువాత రెండు రోజులకె అమెరికా వెళ్ళిపోయాడు . అంతకు నెల క్రితమే కోడలు , పిల్లలు వెళ్ళారు . 2011 మొదట్లో 40 సంవత్సరాల క్రితం , పూనా లో వున్నట్లు , ఇంట్లో ఇద్దరమే మిగిలాము . నావరకు నాకు చాలా పెద్దమార్పు. కొన్ని రోజులు దిగులు దిగులుగా వుంది . స్చప్ . . . కాని ఏమి చేస్తాము , పిల్లలు వాళ్ళ అవకాశాలు కూడా వాళ్ళూ చూసుకోవాలిగా , దిగులెందుకు , మేము దేశమంతా తిరగలేదూ ! వాళ్ళు విదేశాలు ఓపికున్నంత కాలం తిరుగుతారు . మట్లాడుతూనే వున్నారు , స్కైప్ లో కనిపిస్తూనే వున్నారు అనుకొని సద్దేసుకున్నాను :)

పిల్లలు పెద్దవాళ్ళైపోయారు . ఇద్దరూ హాపీగా సెటిల్ అయ్యారు . మనవలు , మనవరాళ్ళు బుడుగు లాగా వాళ్ళంత వాళ్ళు వాళైనారు . బరువు లు , బాధ్యతలు లేవు .
" నాకు నువ్వూ , నీకు నేను ,
ఒకరికొకరం నువ్వూ నేనూ "
అని హాపీస్ గా పాడేసుకుంటూ , మాజాంగ్, కార్డ్స్ ఆడుకుంటూ , , , కిట్టీ పార్టీలూ , లేడీస్ మీటింగ్ లూ అటెండ్ అవుతూ , అప్పుడప్పుడు బ్లాగ్ చూసుకుంటూ బేఫికర్ గా వుంటే . . . . .
హూం . . . . .
కాలం పెద్ద జలక్ . . . పెద్ద కుదుపు కుదిపేసింది * * * * *
అలా చేయక పోతే కాలమెలా అవుతుంది ? అమ్మో . . . తలుచుకుంటే నే వళ్ళు జలదరిస్తోంది . పిల్లల ఆసరా , బంధుమితృల సహకారం తో మళ్ళీ మామూలు మనుషులమయ్యాము . 2011 వెళుతూ వెళుతూ , సుఖ సంతోషాలే కాదు , ఇబ్బందులను కూడా తెలుసుకోవాలి అని తెలియ చెప్పింది ! "ఆరోగ్యమే మహాభాగ్యం " అనే నీతి పాఠాన్ని చెప్పి వెళ్ళింది ! లైఫ్ ను ఎంజాయ్ చేయండి , కాని ఆరోగ్యం జాగ్రత్త అని హెచ్చరించింది !

సో 2011 స్టార్టింగ్ , ఎండింగ్ వెరైటీ గా గడిచిందన్నమాట :)
మరి 2012 ఎలా వుంటుంది అని ' శివాజీ ' ( చిలుక పేరు ) ఏమి చెప్పిందంటే ,