కథ ; బుజ్జిగాడి బెంగ ,
రచయత ; ఎనుగంటి వేణుగోపాల్
బాల్యం . . . ఎంత అపురూపమైనది . చిన్నప్పటి ఆటలు , పాటలు , చిలిపి అల్లరులు జీవితాంతం మరువలేనివి .అమ్మ తో కథలు కథ గా చెప్పించుకొని మురిసిపోని వారెవరు ? బాల్య స్నేహితులంటే ఎంత మురిపెం . . . తూనీగల్లా గెంతుతూ ముచ్చటపడేసేది బాల్యం . ఆటల్లో మోచేయి కొట్టుకొని , మోకాలు డోక్కుపోయి రక్తాలు కారుతున్నా ఆటల్లో దెబ్బ అరిటిపండే ! పైగా పెద్దయ్యాక తమ పిల్లలకు ఆ దెబ్బలగురించి కబుర్లు చెప్పటం ఎంత బాగుంటుంది కదూ ! స్కూల్ నుంచి వస్తూనే స్కూల్ బాగ్ లోపలికి గిరాటేసి , అమ్మ ఇచ్చిన పాలు హడావిడిగా తాగేసి , మూతైనా తుడుచుకోకుండా ఆటలకు పరుగులు పెట్టటం , అలసిపోయి వచ్చి , ఏదో స్నానం చేసాము , చదువుకున్నాము అనిపించుకొని ,నిద్ర తో కూరుకు పోతున్న కళ్ళను బలవంతాన తెరుచుకుంటూ , అమ్మ చెప్పే కథలను వింటూ , అమ్మ చేతి ముద్దలు తింటూ , అలానే పీట మీద నిద్ర కొరగటం , అమ్మ ఎత్తుకెళ్ళి ' పిచ్చితల్లి అలిసిపోయింది ' అని మురిపెం గా అంటూ పడుకోపెట్టటం . . . అబ్బ అవన్నీ తలుచుకుంటూవుంటే మళ్ళీ చిన్నారి తల్లి ఐపోవాలనిపించదూ !!!!! మరి ఈ కాలం పిల్లలకు ఆ మురిపాలు దక్కుతున్నాయా ????? చదువులు , రాంకులూ అంటూ పోటీ చక్రం లో వాళ్ళ బాల్యం బంధీ ఐపోయింది .ఆటలూ లేవు . అల్లరులూ లేవు . పొద్దున్నే స్కూల్ , ఇంటికి రాగానే ట్యూషన్ , హోంవర్క్ ఇంతే జీవితం . మహా ఐతే వీడియో గేంస్ ఆడుకోవటం అంతే కదా * * *
అలా బంధీ ఐపోయిన ఓ చిన్నారి స్వగతమే , ఎనుగంటి వేణుగోపాల్ గారు రచించిన కథ " బుజ్జిగాడి బెంగ " .
బుజ్జిగాడి కి వానపడె ముందు వచ్చే మట్టి వాసన అంటే చాలా ఇష్టం . వానలో తడవట మంటే మరీ ఇష్టం . ఆకాశం లొంచి రాలిపడే ఆ నీటి బుగ్గలను అలా చూడటమంటే భలే సరదా .ఎగిరి గంతేయాలనిపిస్తుంది .వర్షా కాలం వచ్చిందంటే చాలు "రెయిన్ రెయిన్ , కం ఎగేయిన్ " అనే రైం అస్తమానమూ పాడుకుంటూ వుంటాడు . వర్షం వచ్చినప్పుడు తడవాలనుకుంటాడు . కాని వీలవదు . ఎందుకంటే వాడి చెల్లాయి డైనొసార్ లా వదల కుండా వెంబడించి , డాడీకి చెప్పేస్తుంది :( పాపం బుజ్జిగాడు !
వాళ్ళ డాబా కెదురుగా గుడిసెలో వున్న శీను గాడిలా మట్టిలో ఆడుకోవాలని , రెండు జేబుల్లోనూ మట్టివేసుకొని గెంతాలని వుంటుంది . కాని వీలవదు . మార్నింగ్ లేస్తాడా , , ,లేవగానే ట్యూషన్ .ట్యూషన్ నుంచి వచ్చి స్నానం చేసి రెడీ అవుతాడా , స్కూల్ బస్ సిద్దం . సాయంత్రం హోంవర్క్ .తర్వాత మళ్ళీ ట్యూషన్ .ట్యూషన్ అయ్యాక కాసేపు స్టడీ .ఇవన్నీ అయ్యేసరికి రాత్రి తొమ్మిదవుతుంది . అన్నం తినిపించి పడుకోపెడతారు .మార్నింగ్ , ఈవినింగ్ రెండుసార్లు ట్యూషన్ ఎందుకంటే సెకండ్ యూనిట్ లో సెకండ్ రాంక్ వచ్చిందని ! హుం . . . ఆ చిన్నివాడికి ఎంత కష్టం అని గుండె పట్టుకు పోవట్లేదు ?
చివరికి వాడి డాడీ వాడిని వానలో ఆడుకోనిస్తాడు . కాని ఎప్పుడు , వాడికి మళ్ళీ ఫస్ట్ రాంక్ వచ్చినప్పుడు .
ఇలా వున్న బుజ్జిగాడి స్వగతం చదువుతుంటే మనకూ బెంగ వచ్చేస్తుంది . ప్రతి వాక్యం లోనూ వాడి బాధ మన కళ్ళలో నీళ్ళు , ఇదేమిటి ఈ కాలం పిల్లలు ఇలా మెకానిక్ గా ఐపోయారు అనిపిస్తుంది . అసలు నాకైతే చదువుతున్నట్లుగా లేదు , ఓ బుజ్జిగాడు నా ముందు కూర్చొని చెపుతున్నట్లుగా అనిపించింది . అంతలా హృదయాలను తాకేట్లుగా రాసారు రచయిత ఎనుగంటి వేణుగోపాల్ గారు . చాలా సరళ మైన భాష లో , ఓ చిన్నపిల్లవాడు చెపుతున్నట్లుగానే రాసారు . అన్ని సంఘటనలు , మన ఇంట్లోనో , పక్కింట్లోనో జరుగుతున్నట్లుగా వున్నాయి . చిన్నపిల్లలున్న ప్రతి తల్లీ తండ్రి తప్పక చదవ వలిసిన కథ ఇది .
ఏదైనా ఒక నీతి చెప్పాలంటే అది కథలో భాగమవ్వాలి కాని , ఆ కథ ఓ డాక్యుమెంటరీ సినిమా లా ఓ నీతి సూత్రం చెపుతున్నట్లుగా వుండకూడదు , అని నా అభిప్రాయం . ఈ కథలో బుజ్జిగాడి బాధ లో మనం లీనమవుతామే కాని , ఏదో సందేశాత్మక కథ చదువుతున్నట్లుగా వుండదు . పూర్తిగా చదివిన తరువాత పిల్లలను చదువు కోసం ఇలా బాధ పెట్టకూడదు అనిపిస్తుంది . అది నాకు చాలా నచ్చింది .
ఇంత మంచి కథ ను మిస్ కావద్దు . " బుజ్జిగాడి బెంగ " ను " కథా జగత్ " లో చదవచ్చు .
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/bujjigadi-benga---enuganti-venugopal
కినిగె తెలుగు పుస్తకానికి కొత్త చిరునామా
10 comments:
chala baga vishleshincharu malagaru, prasthutha kalam lo ippati chaduvulu rank la golalo pillalandaru bujji gadilane enno miss avuthunnaru
అనోనమస్ గారు ,
ఒక్క కామెంటైనా లేదే అస్సలు బాగారాయలేదా అని బుజ్జి గాడిలా బెంగ పడుతున్నాను బెం.న :( మీ కామెంట్ తో నా బెంగ తీర్చారు థాంక్యు చి.న
bagundi andi.. nijangane balyam miss avutunnaru.. balalu
good review
రాజాచద్ర గారు,
నా విశ్లేషణ మీకు నచ్చినందుకు థాంక్స్ అండి .అవునండి బాలలు బాల్యాన్ని మిస్ అవుతున్నారు .
కొత్తపాళి గారు ,
మీరు నా రెవ్యూని మెచ్చుకున్నారు . నాకు చాలా సంతోషం గా వుందండి . థాంక్స్ అండి .
మీరు కథలు రాయవలసిన సమయం ఆసన్నమైంది.తప్పక ప్రయత్నించండి.
మాలగారూ, ఎంత బాగా రాసేరండీ !
>> ఏదైనా ఒక నీతి చెప్పాలంటే అది కథలో భాగమవ్వాలి కాని , ఆ కథ ఓ డాక్యుమెంటరీ సినిమా లా ఓ నీతి సూత్రం చెపుతున్నట్లుగా వుండకూడదు <<
నేను మీకు ముందే చెప్పేనా లేదా మీరు ఏ పత్రికకో దానికో రాయమని!
ఉమాదేవి గారు ,
అంతా మీ అభిమానమండి . నేనేమి కథలు రాయగలను :)
మీ కామెంట్ కు ధన్యవాదాలండి .
కృష్ణవేణి గారు ,
అవునండి , మీరు ఎప్పటి నుంచో చెపుతున్నారు , రెవ్యూలు రాసి పత్రికకు పంపమని . కాని , ఏదో నా బ్లాగ్ కాబట్టి నారాతలు నేను ప్రచురించుకుంటాను . అంతేకాని నా రెవ్యూలు పత్రికల స్తాయి కి వుంటాయని నాకు నమ్మకం లేదండి :) మీ ఎంకరేజ్మెంట్ కు థాంక్స్ అండి .
Post a Comment