Monday, February 22, 2010

డబ్బులోయ్ డబ్బులు * # ? . = 5

" డబ్బులు లేని వాడు డుబ్బుకు కొరకాడు " , " డబ్బంటే చేదా ? " , " మనీ మేక్స్ వండర్స్ " , " పైసా మే పరమాత్మా హై " ఇంకా అన్ని బారతీయ భాషలలో , ఇంకా మాట్లాడి తే హోల్ మొత్తం ప్రంపంచ భాష లలో ( ఆ భాష లలో ఏమంటారో నాకు తెలీదు ) ఎంత చెప్పినా , అన్నింటికీ ఒకటే అర్ధం , ధనమేరా అన్నింటికి మూలం అని . రూపాయిని " రూపాయీ , రూపాయీ , నీ గుణమేమిటమ్మా " అని అడుగుతే , " ప్రాణం గా వున్న వాళ్ళని విడదీస్తాను ." అనీ నవ్వుతుందట !!!!!

అంతటి శక్తిగల రూపాయిని , కళ్ళు మూసుకొని " రూపాయి " అని తలుచుకోండి . ఏం కనిపించింది ? వెయ్యి రూపాయల నోట్ , ఐదువందల నోట్ . ఓ కె , ఓ కే , దాని మీది చిహ్నం ఓసారి గుర్తు తెచ్చుకోండి . నాలుగు సిం హాల బొమ్మా ? , గాంధీ తాత బొమ్మా ? అశోకుడి స్తంభం ? అబ్బే ఏదీ చప్పున గుర్తు రావటము లేదే ? ఐతే సరే డాలర కు చిహ్నమేదో ఆలోచించి చెప్పండి . దీనికి అలోచనెందుకు , $ ఇదే కదా ? అదేమరి , డాలర్ కు వున్నట్లు గా , రూపాయికి ప్రత్యేక మైన చిహ్నం లేదు . అందుకే మనకు వెంటనే ఏ గుర్తూ , గుర్తు రాదు ! అన్నింటిలోనూ అమెరికా తో పోటీ పడుతున్న మనకు ఓ గుర్తు లేకపోవటమా ? ఎంత లోటు ? అందుకే ఈ లోటును పూడ్చటానికి , కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఒక పోటీ పెట్టింది . సులభంగా , అందం గా , అందరికీ అర్ధం అయ్యే విధంగా రూపాయకి చిహ్నాన్ని తయారు చేసి ఇచ్చిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించింది .

పోటీ నియమాలు :
* మన చారిత్రక వారసత్వాన్ని , సంస్కృతి గొప్పతనాన్ని ఈ చిహ్నం ప్రతిఫలించాలి .
* భారతీయ భాషల్లో ఇమిడిపోయే విధంగా ఉండాలి .
* తుది డిజైన్ 232 చదరపు సెంటీమీటర్లకు మించి వుండకూడదు .


దాదాపు ఇరవై ఈదు వేలమంది , ఈ పోటీ లో పాల్గొన్నారు . వీరినుంచి కొందరిని ఎంపిక చేసి పోటీకి ఆహ్వానించారు . గతనెల వీరు తమ డిజైన్లని ప్రభుత్వానికి అందజేసారు . వీటినుండి ఐదు డిజైన్లను ఎంపిక చేసారు .

." రూపాయికి చిహ్నం ఎందుకు వుండాలి ? ఇది కేవలం ఒక సింబాలిజం మాత్రమే అని కొందరు వాదిస్తూవుండవచ్చు . కాని చిహ్నం మన ఆర్ధిక స్వేచ్చకు ప్రతీక . అంతేకాదు మనం ఆర్ధిక లావాదేవీలు చూసే సమయము లో కొన్ని సార్లు ఆర్ అని రాస్తాము . మరి కొన్ని సార్లు ఆర్ఎస్ అని రాస్తాము . అంతే కాదు ఎక్కడ పుల్ స్టాప్ పెట్టాలనే విషయం లో కూడ సంధిగ్దత వుంది . దీనిని తొలిగించాలంటే మనదైన ఒక చిహ్నము వుండాలి ." అంటున్నారు , చివరి ఐదుగురు పోటీదారులలో ఒకరైన , ఆర్కిటెక్ట్ నందిత. తాను రూపొందించిన చిహ్నాన్ని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది అనే నమ్మకం తనకు గాడం గా వుంది అని ఆశాభావం వ్యక్తీకరిస్తున్నారు .

" చిహ్నం అనేది అందరికి సులభం గా అర్ధం కావాలి . అందరూ గుర్తు పట్టగలగాలి . అంతే కాకుండా అన్ని వర్గాలవారికి అర్ధం కావాలి . మహిళలకు , పిల్లలకు , వయోజన విద్య నేర్చుకునేవారు మొదలైన వర్గాలు దీనిని సులభం గా గుర్తించగలగాలి. " అంటాడు హితేష్ . ప్రస్తుతం టోరంటోలో ఒక భారతీయ ప్రాజెక్ట్ లో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న హితేష్ కు చిహ్నాలను రూపొందించటమంటే చిన్నప్పటినుండి చాలా ఇష్టం ." నా డిజైన్ ఎంపికైతే అంతకన్నా ఆనందం ఏముంటుంది ? ప్రతి వ్యక్తి చేతి లో నేనుంటాను ." అంటూ తుది ఫలితం కోసం , హితేష్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు .

" ఒక లిపి పుట్టుక వెనుక పెద్ద ప్రక్రియ వుంటుంది . దీనిని తెలుసుకో గలుగుతే చిహ్నాలను కూడా అర్ధం చేసుకోగలుగుతాము . రూపాయకి చిహ్నం రూపొందించటమనేది ఒక పెద్ద చాలెంజ్ . ఇది చాలా సులభంగా , సామాన్య మానవుడికి అర్ధం అయ్యే విధంగా , గుర్తు పెట్టుకునే విధం గా వుండాలి . నేను రూపొందించిన చిహ్నం అలాగే వుంది ." అంటాడు , ఈ పోటీ గురించి విన్నదగ్గర నుండి చాలా ఆసక్తి చూపించి , ఇందులో పాల్గొన్న , " తమిళ లిపి - టైపోగ్రాఫిక్ మార్పులు " మీద మొంబై ఐ .ఐ .టి లో పి.హె. డి చేస్తున్న ఉదయ్ కుమార్ .

" నేను చేసిన ప్రాజెక్టులన్నిటి లోనూ ఇది క్లిష్టమైనది " అంటాడు షారూక్ ఇరానీ .పబ్లిసిస్ యాంబియన్స్ అనే సంస్థలో క్రియేటిక్ డైరక్టర్ గా పని చేస్తున్న షారుక్ , రూపాయి చిహ్నం తన జీవితాన్ని మలుపు తిప్పుతునదని భావిస్తున్నాడు .

" ఇప్పటి దాకా వందల కొద్దీ లోగోలు తయారు చేసాను .ఇది నాకు పెద్ద చాలెంజ్ " అంటాడు , కేరళ లోని తళసెరి లో ఉపాద్యాయుడిగా పని చేస్తున్న షబీన్ . " మొదట్ రెండు స్కెచ్ లు వేసి పంపా .డిజైన్ చేయమన్నారు . తయారు చేసి పంపాను . తుది జాబితా లో నాది కూడా ఉందనే వార్త చాలా ఆనందం కలిగించింది " అంటున్నారు , షబీన్ .

ఈ ఏడాది మార్చి లో వీటిలోనుండి ఒక చిహ్నాన్ని ఎంపిక చేస్తారు . అది మన రూపాయికి చిహ్నం అవుతుంది . ఈ ఐదుగురి తో పాటు మనము కూడా ఏ చిహ్నం మన చేతులోకి వస్తుందో న్ని అప్పటి వరకు ఎదురుచూస్తూ వుందాము .


27 - 1 - 2010 ఆంద్రజ్యోతి , దినపత్రిక సౌజన్యము తో . . .

ఇవ్వండీ , నా * డబ్బులోయ్ # డబ్బులు ? కబుర్లు .. . .

గళ్ళాపెట్టి గల గలలు ఇక్కడ వినవచ్చు .

కొసమెరుపు - - -

ఆయనగారికి తెలీకుండా ఆవిడ గారు డబ్బులు దాచుకుందా మనుకుందామనుకోవటం ఎందుకో ? శ్రీవారి దగ్గర డబ్బులెన్నివున్నా , శ్రీమతిగారి బ్లాక్ మనీ మీదే శ్రీవారి కన్నులెందుకో ? మరి ఎందుకో ?????

Monday, February 15, 2010

డబ్బులోయ్ డబ్బులు . . . . . 4
నా చిన్నప్పుడు డబ్బులు దాచుకోవటానికి మట్టి ముంతలు దొరికేవి . మా అమ్మ అది కొనిచ్చి , అందులో చిల్లర పైసలు దాచుకోవటానికి అప్పుడప్పుడు ఇచ్చేది . ఇహ ఆ కుండకు రక రకాల రంగులు పూసి ముస్తాబు చేసేదానిని . ఆ కుండ నిండాక చిన్నప్పుడతే బొమ్మలు , పెద్దైనాక బుక్స్ కొనుక్కునేదానిని . ఆ కుండ లకు వేసే పేంటింగ్స్ లకు, నింపే డబ్బులకు , నాకు , మా అత్తయ్య కూతురు పార్వతికి ఎప్పుడూ కాంపిటీషన్ వుండేది . అదేమిటో పాపం , మా పార్వతి కుండ నిండగానే , వాళ్ళింట్లో దొంగలు పడి , తన కుండ పగులకొట్టి , డబ్బులెత్తుకెళ్ళేవారు . తన కెప్పుడూ మట్టి పెంకులే మిగిలేవి . ఐనా అధైర్య పడకుండా మళ్ళీ నింపడము మొదలు పెట్టేది . మళ్ళీ హిస్టరీ రిపీట్స్ !!!!!
నేను నా అలవాటు ప్రకారము , మా పిల్లలిద్దరికీ చెరొక ముంత కొనిచ్చాను . మా అమ్మాయి , సంజు కు దానిని అలంకరించి చూసుకోవటమే సరిపోయేది . మా అబ్బాయి బిపు మటుకు దానిని నింపటానికి ఇంట్లో చిల్లర పైసలు లేకుండా చేసేవాడు . మా మామగారు , కిడ్డీ బాంక్ కొనిచ్చినా , పిల్లలు దీనిని చూసుకునే మురిసి పోయేవారు . నాకు కూడా , ఇంట్లోకి ఏఅవసరం వచ్చినా , కిడ్డీ బాంకైతే తాళం తీసి వాడుకోవచ్చు , ముంతలైతే అంత తొందరగా పగులకొట్టము కదా అనిపించి ఎక్కువగా ముంతలలోనే డబ్బులు వేసేదానిని . ప్రతి నెల మొదటితారీకున , ఇద్దరి ముంతలు తీసి ," బాంక్ ఆఫ్ బరోడా " లోని వాళ్ళ ఎకౌంట్ లో వేసేసేదానిని . అందులో కనీసం 100 రూపాయలు వేయాలి అంటే , ఎక్కడెక్కడి చిల్లర వాడి ముంతలో చేరి పోయేది . మేము వేరే వూళ్ళలో వున్నప్పుడు , హైదరాబాద్ వచ్చేటప్పుడు , మూడు రోజుల ప్రయాణము లో ఖర్చు పెట్టుకోవటము కోసము ,మా వారు , పిల్లలిద్దరికి చెరి పది రూపాయలు ఇచ్చేవారు . మేము హైదరాబాద్ చేరుకున్నాక కూలీకి ఇవ్వటానికి , మావాడి దగ్గరే , ఆ పది రుపాయలు అప్పుచేసేవారు మా వారు . ఖర్చు దగ్గర కూడా మహా పినాసీ . అందుకే , మా వారు , ముద్దుగా " డబ్బులుగా " అని , " రామనాథ్ గోయింకా " అని పిలుచుకుంటారు . ఇప్పుడైతే డబ్బులన్నీ బాంక్ లోనే వుంటాయి . ఎప్పుడైనా అడుగుతే , గిడుగుతే పర్స్ లో లేవు మాతే , ఏ. టి .యం కెళ్ళి తేవాలి , ఇప్పుడైతే నువ్విచ్చేయ్ తరువాత ఇస్తాను అంటాడు . ఎప్పుడూ ఆ ప్లాస్టిక్ మనీ తప్ప , నొట్ మనీ వుండ నే వుండదు . అత్యవసరమైతే ఎలారా ? అంటె నువ్వున్నావుగా అంటాడు . మా కోడలు మొహమాట పడి ఆంటీ నా క్రెడిట్ కార్డ్ వాడుకోండి అంటుంది . కూరలమ్మాయి , పూలవాడు క్రెడిట్ కార్డ్ తీసుకోరుకదమ్మా , నా షాపింగులు అవేకదా అంటాను నేను .వరేయ్ బేటా , మీ ఆవిడకి పూలు కొనియ్యటనికి నువ్వేమీ శోభన్ బాబు కాలం వాడివి కాదు కాని కనీసము మొక్కజొన్న పొత్తులు కొనివ్వటానికైనా దగ్గర కాసిని డబ్బులుంచుకోరా అంటే చిద్విలాసం గా నవ్వేస్తాడు .

ఈ కాలం లో అందరూ , క్రెడిట్ కార్డ్ లూ , ఏ. టి .యం లూ అంటారు . అక్కడ దొంగల చేతికి చిక్కని మాట నిజమే కాని అత్యవసరమైతే మన చేతికి చిక్కేదెలా ? ఈ మద్య బందుల తో ఏ.టి .యం లు కూడా బందే వుంటున్నాయి . ఇళ్ళళ్ళో ఐతే చిల్లర పైసలు ఎక్కడపడితే అక్కడే పడేస్తారు . మా మామగారు , ఒక ప్లాట్ అమ్మినప్పుడు , కొనుక్కున్నతను , ఒక సంచీ నిండా చిల్లర పైసలు తెచ్చి పేమెంట్ చేసాడు . ఇంట్లో పిల్లలంతా కూర్చొని ఆ చిల్లర లెక్కబెట్టారు . మా మామగారు అలాగే బాంక్ లో డిపాజిట్ చేసేసారు !!!

ఏటా పొదుపు దినోత్సవం రోజు " ఉత్తమ పొదుపు ఏజెంట్లు " అవార్డులను ప్రభుత్వం అందజేస్తుంది . ఇలాంటి అవార్డులను , వరుసగా ఆరేళ్ళపాటు అందుకుంది ,మహబూబ్ నగర్ జిల్లాలోని , వనపర్తి లోని బాలస్వామి కుటుంబము . రోజూ మదుపరుల నుంచి సేకరించిన డబ్బును పోస్టాఫీస్ లో జమచేస్తే , వీరికి కమీషన్ వస్తుంది . అదే ఈకుటుంబానికి ఆధారం . ఫామిలీ మొత్తానికి ఫుల్ టైం జాబ్. ఏటా వీరి ద్వారా , చిన్న మొత్తాల పొదుపు సంస్థకు వెళ్ళే సొమ్ము కోటిరూపాయల పైనే . వీరి సంపాదన నెలకు లక్షా ఇరవై వేలు పైనే , అదీను వనపర్తి లాంటి ఓ మోస్తరు టౌన్ లో . కుటుంబము లోని తల్లి ఇంద్రావతమ్మ, తండ్రి బాలస్వామి , ఇద్దరు కొడుకులు చంద్రశేఖర్ , శ్రీకాంత్ ఇదే పని చేస్తారు . కుటుంబ పెద్ద , బాలస్వామి ఇలా చెపుతున్నారు , " ఈ రోజులలో అందరూ విడిపోయి బతకటానికే ఇష్టపడతారు .కానీ , మా ఇంట్లో అందరం కలిసి జీవిస్తున్నాము . కష్టపడి సంపాదిస్తున్నాము . కొడుకులు , కోడళ్ళు , కూతుళ్ళ తో చాలా హాపీ గా వుంటున్నాము . చిన్న మొత్తాల పొదుపు పధకం , మన సొమ్ముకు ఎంత భద్రతను ఇస్తుందో , ఉమ్మడి కుటుంబం కూడా అంతే సామాజిక భద్రతను ఇస్తుంది . అందుకు మేమే ఉదాహరణ . ప్రేమపూర్వక సంబందాలుంటే మన ఇంటికి సిరి సంపదలు వాటంతట అవే నడిచి వస్తాయి "

ఏతా , వాతా చెప్పొచ్చేదేమిటంటే , చిల్లర మా లక్ష్మిని చిన్న చూపు చూడకండి . చిల్లర ఎన్ని వండర్ లైనా చేస్తుంది . " పిల్లలకు చిన్నపటినుండే పొదుపు అలవాటు చేయాలి . డబ్బులు కూడ బెట్టుకొని , కొనుక్కోవటములోని ఆనందాన్ని అనుభవించనీయాలి . . . ధనమే కదా అన్నింటికీ మూలము . ఆ ధనము విలువ తెలియజేయాలి .

ఇల్లన్న చోట , పిల్లలున్న చోట 10,000 ల రూపాయలు , ఓ మనిషి భోజనం ఎప్పుడూ సిద్దముగా వుంచుకోవాలి ."

వచ్చేవారము మరి కాసిని కాసుల కబురులతో కలుసుకుందాము . ఏమిటీ ఇంకా వుందా అంటే వుండదేమిటి ? మనీ నా మజాకా ? వచ్చే వారము దాకా టా టా .

వెళుతూ వెళుతూ మా " డబ్బులు " కు అదేనండి మా " రామ నాథ్ గోయింకా " కి అదేనండీ బాబూ మా అబ్బాయి , బిపిన్ కు హాపీ బర్త్ డే చెప్పి వెళ్ళండి .

Monday, February 8, 2010

డబ్బులోయ్ డబ్బులు ? ? ? ? ? 3నీకేమమ్మా ? మీ ఆయన నెలకు 50 రూపాయలు పంపిస్తారు . హాయిగా నెలకో చీర 15 రూపాయలదీ కొనుక్కుంటావు , 20 రూపాయలైనా కొనగలవు . వారాని కో సినిమా చూడగలవు . మమ్మలినీ సినిమా కు తీసుకెళ్ళొచ్చుకదా , సుదర్షన్ వాడు , ఆడవాళ్ళకు 50 పైసలకే టికెట్ పెట్టాడట . ముందుగా వెళుతే టికెట్ దొరుకుంతుంది అని స్వర్ణ నస పెడుతుంటే , సరే లే నేను ఇంటికెళ్ళి , అత్తయ్యగారికి చెప్పి , విజయను తీసుకొని వస్తాను , నువ్వు ముందు పదా అన్నాను . సినిమా ప్రోగ్రాం వాసన గట్టి జుబేదా , లలితా వాలి పోయారు . చేసేదేముంది . వాళ్ళనూ రమ్మన్నాను . ఇంతలో రెష్మీ , సుష్మ చేరి పోయారు . పైగా వాళ్ళెళ్ళేటప్పుడు నన్ను జమురూధ్ తీసుకెళుతానని బేరం పెట్టారు . వాళ్ళను సుదర్షన్ కి పంపి నేను ఇంటికెళ్ళాను . వరండా లోనే మామయ్యగారు ప్రత్యక్షం ! అప్పుడే వచ్చేసావు కాలేజ్ లేదా ? అనగానే లేదండి సంజును చూసి వెళుదామని వచ్చాను అని చెప్పి చిన్నగా లోపలికి జారుకొని , అత్తయాగారికి సినిమా ప్రోగ్రాం గురించి రహస్యం గా ( అనుకున్నాను ) చెప్పి విజయను రమ్మని బయటపడ్డాను . తిరిగి ఇద్దరమూ విడి విడి గానే ఇంటికి వచ్చాము . అమ్మయ్య నాలుగు రూపాయల్ తో ఫ్రెండ్స్ కి సినీమా పార్టీ ఇచ్చి , వాళ్ళ బారినుండి తప్పించుకున్నాను . మామయ్యగారి కంట పడకుండా కూడా తప్పించుకున్నాను . ఎంత తెలివో కదా !!!!

" అమ్మాయ్ , నీ దగ్గర 10 రూపాయలున్నాయా ? " అని మామయ్యగారు అడుగగానే వున్నాయండి అంటూ తీసుకెళ్ళాను . అవి తీసుకొని నాతో రా అని , ఇంటికి దగ్గర లో వున్న , కోపరేటివ్ బాంక్ కు తీసుకెళ్ళి , ఎకౌంట్ ఒపెన్ చేయించి , ప్రతినెలా , అందులో కూడా పది రూపాయలు డిపాజిట్ చేసి తనకు చూపించమని ఆర్డర్ పాస్ చేసారు . అది సినిమా మహత్యం .హూఊఊఊఊఉం . వచ్చే 50 రూపాయల లో 10 , మా అత్తగారికి పాకెట్ మనీ మావారి బదులు నేనివ్వాలి . అది మా వారి హుకుం . 10 , ఇండియన్ బాంక్ లో , పది కోపరేటివ్ బాంక్లో కట్టాలి . అది మామగారి ఆర్డర్ . 10 నా బ్లాక్ మనీ కింద అత్తగారి కివ్వాలి .అది అత్తగారి ఆజ్ణ . ఇక మిగిలినవి పది రూపాయలు . దానిలోనే నా చదువు , సినిమాలు , బట్టలు , మా అమ్మాయి ఖర్చు అంతా వెళ్ళాలి . మర్చేపోయాను , పైన కనిపిస్తుందే ఓ పెట్టి , అది మా అత్తగారు నేను నా వైట్ మనీ దాచుకోవటానికి ఇచ్చారు . ఆ బొట్టుపెట్ట , మా అత్తగారికి , ఆవిడ మూడో అన్నయ్య పెళ్ళి లో ఇచ్చారట. ఆ పది రూపాయలు అందులో పెట్టుకునే దానిని . ప్రతి నెలా , మావారు 50 రూపాయల చెక్ పంపగానే , విజయను తోడు తీసుకొని ఆబిడ్స్ లోవున్న గ్రిండ్లే బాంక్ కు వెళ్ళి తెచ్చుకోవటమూ , సాయంకాలము లోపల ఎక్కడివక్కడ పంచేసి , మిగిలిన పదిరూపాయలకు బడ్జెట్ వేసుకోవటము , ఆ పది రూపాయలు ఖర్చైపోతే నెల ఎలా గడుపుకోవాలి అని ఖర్చు పెట్టటానికి అసలు ప్రాణమే వొప్పేదికాదు .పైగా అరటిపళ్ళు , చారాణా ( 25 పైసలు ) కో డజన్ అంటే నై , నై బారాణా ( డెబ్బై ఐదు పైసలు ) కో దేవో అని చాలా బేరమాడి , బండి వాడిని మొహమాట పెట్టి , బారాణా కు పళ్ళు కొన్న ఘనచరిత్ర తో , ఏమైనా కొనాలన్నా సరిగ్గా కొంటున్నా నా లేదా అనే అనుమానమొకటి . తెగ పిసినారినై పోయాను . దాని లో కూడా ఐదు రూపాయిలు ఆ పెట్టెలో , ఇంకో ఐదు రూపాయలు నా బట్టల పెట్టెలో నా సొంత బ్లాక్ మనీ దాపరికం . ఏదైనా కొనుక్కోవాలంటే , బజారుకెళ్ళే ముందే లిస్ట్ రాసుకొని , వెయ్యి అవసరమంటే ఐదువందలు తీసుకెళ్ళి , తీరా బజారుకెళ్ళాక ,లిస్ట్ లో సగము వద్దులే అనుకొని , తీసుకెళ్ళిన డబ్బుల లో సగము ఐ పోగానే ఇహ చాలులే అనుకొని ఇంటికి వచ్చేసి , ఇహ చెప్పేందుకేముంది ?

సందడిలో సటాకు అన్నట్లు , మా మరిదిగారు , వదినా మీరు అన్నయ్య చెక్ కోసం ఎదురుచూడటమెందుకు ? అది జాయింట్ ఎకౌంట్ కదా అన్నారు . మా వారు సెలవలో వచ్చినప్పుడు , అడుగుతే అంత దూరం ఎందుకులే , చిక్కడపల్లి లో సిండికేట్ బాంక్ లో తీసుకో అని అక్కడ వున్న ఆయన అకౌంట్ మా జాయింట్ ఎకౌంట్ చేసేసారు . అప్పుడే ఐపోలేదు .ఓ నాలుగు సంవత్సరాల తరువాత . . . మేము సైనిక్ పురి లో ఓరోజు మామయ్యగారు ఒకాయనను వెంటపెట్టుకొనివచ్చి , స్టేట్ బాంక్ లో కొత్తగా కిడ్డీ బాంక్ అని మొదలుపెట్టారు . ఇదిగో పిల్లలిద్దరి కోసం రెండు తీసుకొచ్చాను . రోజూ చిల్లర డబ్బులు ఇందులో వేయి .మొదటి తారీకున ఈయన వచ్చి , వీటి తాళాలు తీసి ఆ డబ్బులు తీసుకెళ్ళి పిల్లల ఎకౌంట్ లో జమ చేస్తాడు అని చెప్పారు . అదైందా , . . ఓ పది సంవత్సరాల తరువాత నా పార్లర్ కోసం లోన్ ఇస్తారని , బాంక్ ఆఫ్ బరోడా లో కరెంట్ ఎక్కౌంట్ ఓపెన్ చేయించారు మావారు అదినూ మా మామగారి సలహా తో . ఓసారి పార్లర్ కి ఒకాయనను వెంట పెట్టుకొని మా మామగారు రాగానే నాకు ప్రమాద ఘంటికలు వినిపించనే వినిపించాయి . ఇదిగో అమ్మాయ్ ఇతనూ రోజూ నువ్వు పార్లర్ మూసే సమయానికి వస్తాడు . ఎంతో కొంత జమచేయి అంటూ నారాయణగూడా విజయా బాంక్ లో ఎకౌంట్ ఓపెన్ చేయించారు . కాస్త ధైర్యం వచ్చాక , మామయ్య గారు , నాదగ్గర ఏమైనా లక్షలు మూలుగుతున్నాయా ? ఇన్ని బాంక్ ల లో ఎకౌంట్ లు ఎందుకండీ అంటే , లక్షలే కాదమ్మాయ్ పైసలు కూడా దాచాల్సిందే అనేసారు . అంతటి తో ఐపోలేదు . మా అబ్బాయి సలహా తో , మా కోడలు మా ఇద్దరి పేరు మీద , ఆంధ్రా బాంక్ లో జాయింట్ ఎకౌంట్ ఓపెన్ చేసింది . ఇప్పటికి ఎన్ని బాంకుల పేరులు చెప్పాను ? గుర్తు పెట్టుకున్నారా లేదా ? ? ?

ఓ ఐదారు సంవత్సరాల కిందట అనుకుంటాను , ఒక రోజు అన్ని బాంక్ లకు వెళ్ళి ఎకౌంట్స్ అన్ని క్లోజ్ చేసాను . పాపం అందరూ ఎందుకు మేడం క్లోజ్ చేస్తున్నారు . కావాలంటే మా శ్రీనగర్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము అని తెగ బతిమిలాడారు . ఈ ప్రక్రియ లో కాచిగూడా ఇండియన్ బాంక్ కనపడనే లేదు . అది ఎప్పుడో ఎక్కడికో షిఫ్ట్ చేసేసారట ! అందుకే మా అత్తగారిలాగా నాకూ బాంకుల మీద నమ్మకం లేదు . అందుకే నా వైట్ మనీ మా అత్తగారిచ్చిన పెట్టిలోనూ బ్లాక్ మనీ . . . . . . లోనూ దాచుకుంటాను . అంతెందుకు , ఈ మద్య తెలంగాణా గొడవలలో ఏ .టి .యం లు కూడా పనిచేయనప్పుడు , మావారు , మా అబ్బాయి నా అలమారాకి కన్నం వేసారు . నా అలమారాలో హీన పక్ష్యం లక్ష రూపాయలైన వుంటాయని మా బిపు ప్రగాఢ నమ్మకం . నా డబ్బులన్ని తీసేసుకున్నారు అని నేను గొడవపెడుతుంటే అందుకే మనీ ఎప్పుడూ ఇంట్లో వుంచకూడదు ఆంటీ , ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయాలి అని మాకోడలు సలహా ఇచ్చింది . " ఇల్లన్నాక , పిల్లలున్న చోట ఓ పది రూపాయలూ , ఒక మనిషి అన్నము వుండాలి " అన్నది మా అత్తగారు చెప్పిన మాట . ఎంతైనా అత్తగారి మాట పట్టుచీరల మూట కదా !!! ( ఈ మాట ఈ మధ్యనే లలిత గారు చెప్పారు .)
కొస మెరుపు ; నా డిగ్రీ పూర్తికాగానే , ఆంధ్రా బాంక్ లో పనిచేసే , మా వారి ఫ్రెండ్ , నారాయణగూడా లో ఆంధ్రా బాంక్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము , మీ పెద్ద కోడలి కి వుద్యోగం ఇస్తాము , పంపుతారా ? అని మా మామగారిని అడిగారు . మా మామయ్యగారు చేరమని ఉత్సాహం చూపించారు . కాని , పిల్లలు చిన్నవాళ్ళని , మావారికి పీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ అవుతే వెళ్ళాలికదా అనీనూ నేను వుద్యోగం లో చేరలేదు . అలా బాంక్ వుద్యోగం కూడా వచ్చిందన్నమాట . చేయక పోయినా , అప్పుడప్పుడు , మా వారిని సాధించటానికి మాత్రము పనికి వస్తోంది !!!
సరే మరి . వచ్చే వారం కలుసుకుందాము . ఏమిటీ ఇంకా వుందా అంటే వుండదేమిటి మనీ నా మజాకా ? వచ్చేవారం , ఇదే రోజు డబ్బుల గురించి మరి కాసిని కబుర్లు . అందాకా సెలవు .

Friday, February 5, 2010

బంగారుతల్లి కి బర్త్ డే గ్రీటింగ్స్
"కంగ్రాట్యులేషన్ యంగ్ గ్రాన్మా" అంటూ వీసా స్టాంప్ వేసి పాస్ పోర్ట్ ఇస్తూ అతను విష్ చేయగానే ," నీ పేరేమిటి ? నీ ఏజ్ ఎంత ? మీ అమ్మాయి ఏం చేస్తుంటుంది ? " అని రక రకాల ప్రశ్నల తో వేదించి , నువ్వు చెప్పేవి నేను నమ్మటము లేదు నీకు వీసా ఇవ్వనుపో అని ఇంతకు ముందు పంపించేసిన ఆవిడలా ఇతనూ , ఏమేమి అడుగుతాడో , అసలు ఆవిడ నేను చెప్పినది ఏది నమ్మలే దో , ఈ సారి కూడా వీసా రాకపోతే ఎలానో అని టెన్షన్ ... టెన్షన్ గా వున్న నాకు ఒక్క నిమిషం అతను ఏం చెబుతున్నాడో అర్ధం కాలేదు . అర్ధం కాగానే థాంక్ యు , థాంక్ యు అన్నానే కాని , ఏమీ అడగకుండా నే ఈయనకు , నేను గ్రాండ్ మా ను కాబోతున్నానని ఎలా తెసింది ? అయినా నాకెందుకులే అతను మళ్ళీ మనసు మార్చుకుంటే కష్టం అనుకొని గబ గబా నా పాస్ పోర్ట్ తీసుకొని , బతుకుజీవుడా అనుకుంటూ బయట పడ్డాను .

ఇహ అప్పటినుండి ఒకటే టెన్షన్ . మొదటిసారి అంత దూరం ఒక్క దాన్నే ప్రయాణం చేయటము . గ్లోబ్ లో అటువైపు కనిపిస్తున్న అమెరికా కు ఎలా వెళుతాను ? తలుచుకుంటేనే భయం . ప్రమోషన్ రాబోతున్న త్రిల్ల్ , మనవడా , మనవరాలా ? అనే సస్పెన్స్ ( అమ్మాయా ? అబ్బాయా ముందే తెలుసు కోవద్దని , మా అమ్మాయి , అల్లుడు తెలుసుకోలేదు ) మొత్తానికి అమెరికా ఐతే చేరుకున్నాను . అదేమిటో పగలు ఎప్పుడూ పడుకునే అలవాటు లేదు అయినా ఒకటే నిద్ర . అమ్మా కొంచం నిద్ర ఆపుకో జెట్ లాగ్ పోతుంది అన్నది సంజు . అదేమిటో ఏం రోగమో ఏం పాడో అనుకొని , నాకు అలాంటివి ఏవీ రావులే అంటూనే నిద్ర పోతున్నాను . అమ్మా అది రోగం కాదు , ఇలా నిద్ర పోవటమే అని నవ్వింది . ఎంతసేపు గడిచిందో , ఆంటీ , ఆంటీ లేవండి సంజును హాస్పెటల్ కి తీసుకెళ్ళాలి అని సతీష్ లేపేసాడు . అంతే మళ్ళీ టెన్షన్ మొదలు .

ఏం అమెరికా నో ఏం పాడో తల్లి , వీళ్ళకు ఏమైనా పిచ్చా ? లేబర్ రూంలో సంజు తో పాటు నేను , సతీష్ వుండటమేమిటి ? అసలే హాస్పెటల్ పేరు చెబితేనే కళ్ళు , కడుపు లో , గిర గిరా తిరిగిపోతుంది . అసలు నాకెక్కువ భయమా ? సతీష్ కెక్కువా తెల్చుకోవటము కష్టమే . అంతా అయోమయం , అస్తావిస్తం ! మాటి మాటికి బయటకు పరుగెత్తటము , సోఫా లో కాసేపు కూర్చొని రావటము . నా ఇబ్బంది చూసి సంజు ఫ్రెండ్ , శాంతిని పిలిచింది . ఏమిటో ఈ చిన్న పిల్లల తో నేను అనుకుంటూ మళ్ళీ బయట సోఫా లోకి చేరుకున్నాను . అంత టెన్షన్ లోనూ అక్కడ ఓ అమెరిక భర్త , ప్రెగ్నెంట్ భార్య తో చేయిస్తున్న ఎక్సర్సైజులు చూడగానే నవ్వొచ్చింది . పక్కున నవ్వేసాను . పాపం వాళ్ళూ నవ్వేసి , హాయ్ అన్నారు .( ఆ తరువాత సంజు , అలా నవ్వకూడదు అని కోపం చేసింది . అది వేరే సంగతి .) వీళ్ళ గోల నాకెందుకులే అనుకొని ,కళ్ళు మూసుకొని ,అమ్మాయైయనా , అబ్బాయైయనా పనికొస్తుంది అనుకుంటూ లలితా సహస్రనామాలు , హనుమాన్ చాలీసా చదువుకుంటూ కూర్చున్నాను .

* * * * * * * * * * * * * *

అమ్మవారి ముందు చేతులు జోడించి వేడుకొని , అందరి తో పాటు ముందుకు కదిలాను . వెంటనే పూజారి అలా వెళ్ళిపోతున్నావేమిటి ? ఈ ప్రసాదము తీసుకో , అమ్మకు ఎర్రంచు పసుపు చీర పెడుతాను అని మొక్కుకో అంటూ నా తలపైన అక్షితలు చల్లారు .

* * * * * * * * * * * * * *


ఆంటీ ఆంటీ అన్న పిలుపుతో అదేమిటి , గుడిలో ఈ పిలుపేమిటి అని చూద్దును కదా ఎదురుగా శాంతి , ఆంటీ పాప పుట్టింది అని చెపుతోంది . ఐతే ఇందాకటిది కల అన్నమాట !
అమ్మ పక్కన పాపాయి , అప్పుడే కళ్ళు తెరిచి చుట్టూ చూసేస్తోంది ." హాయ్ అమ్మమ్మా ఎలావున్నాను ? "
" బంగారుతల్లిలా వున్నావురా అమ్మలూ . ఎంత ముద్దొస్త్తున్నావో "
" అమ్మమ్మా నేను నీకు గాడ్స్ గిఫ్ట్ కదా ? "
" అవునురా బుజ్జీ "
" ఏయ్ అమ్మమ్మా , నేనిప్పుడు టీన్స్ లోకి వెళుతున్నాను . నన్నింకా , బుజ్జీ , కన్నా అనొద్దు ."
అమ్మో అప్పుడే మా బంగారుతల్లి టీనేజ్ గర్ల్ ఐపోతోందా ? కాలం ఎంత వేగంగా పరిగెడుతోంది . నిన్న మొన్న నే ఇవన్నీ జరిగినట్లుగా వుంది . ఇంకా పొత్తిళ్ళ లో పాపాయిగా నే అనిపిస్తోంది .

కాని కాదుట ! పెద్ద అమ్మాయిట ! నాకెంటే పొడుగుట ! ఓకే ఓకే . ఒప్పుకుంటున్నాం మేడం .

మా బంగారుతల్లి అదితి కి జన్మదిన శుభాకాంక్షలు .పై ఫొటో అదితి సొంతముగా వేసుకున్న సెల్ఫ్ పోట్రేట్ ది .

Monday, February 1, 2010

డబ్బులోయ్ డబ్బులు # # # # # 2మా మామగారికి నా షాప్పింగ్ మీద బొత్తిగా నమ్మకం లేదు . దానికి తగ్గట్టుగా నే , కూరగాయల రాజమ్మ దగ్గరి నుండి , బియ్యం కిరాణా దుకాణదారు వరకు నాకొక ధర , మామయ్యగారికొక ధర చెప్పేవారు . కూరగాయల రాజమ్మ , నాకు రూపాయన్నర కిలో చెబితే , రూపాయకి బేరమాడే కొనేదానిని . మామయ్యగారికేమో అదే కూర రూపాయి ముప్పావలాకి చెప్పి , అర్ధ రూపాయకి ఇచ్చేది . అదేమిటి రాజమ్మా అంటే పెద్దయ్య ఎట్లాగూ బేరమాడుతాడని రూపాయి ముప్పావలా చెప్పాను అనేది . మరి అర్ధరూపాయకే ఇచ్చావుకదా అంటే ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి చెప్పకుండా తప్పించుకునేది . బియ్యం వాడూ అంతే !!! నాకు రెండురూపాయలకు కిలో ఇస్తే , మా మామగారికి రూపాయన్న రకే ఇచ్చేవాడు . అదేమిటో నామటుకు నేను చాలానే బేరమాడే దానిని . హూం !!!!!

ఓసారి ఏమైందంటే , మావారు ఓ పనివాడి ని తీసుకొచ్చారు . మావారు ఎవరిని పనికి పెట్టుకున్నా , వాళ్ళకి డిప్ప కట్టింగ్ చేయించేస్తారు . అలా కట్టింగ్ చేయించుకోని వాడికి ఉద్యోగం ఇచ్చే మాటే లేదు . సరే , ఈ సారి ఆయనకు తప్పనిసరిగా వూరెళ్ళాల్సిన పని వచ్చి , పనివాడు రమేష్ కి కట్టింగ్ చేయించమని , నాకు రూపాయిచ్చి , పైగా చెప్పారు , నాన్నకు తెలీకుండా తీసుకెళ్ళు .నాన్నకు తెలిస్తే , నారాయణగూడా బ్రిడ్జ్ మీద చారాణా కే చేయించుకొస్తానంటాడు అని చిలక్కు చెప్పినట్టు మరీ చెప్పెళ్ళారు . తప్పేదేముంది , అలాగే వైయంసి దగ్గర , మా వారు చెప్పిన నైస్ హేర్ కట్టింగ్ సెలూన్ కే తీసుకెళ్ళాను . అతనూ , పాపం నాకు చాలా మర్యాదలు చేసి , మేజర్ గారి కాండిడేట్ కదమ్మా , నాకు తెలుసు ఎలా కట్టింగ్ చేయాలో అని నైస్ గా డిప్ప కట్టింగ్ చేసేసాడు . హమ్మయ్య , మావారు చెప్పిన పని చేసాను అని నిట్టూర్చినంతసేపు పట్టలేదు , నా నిట్టూర్పు మధ్యలో ఆగిపోవటానికి . " పనివాడికి సెలూన్ లో కట్టింగా ? రూపాయి పెట్టా ? పైగా నువ్వు తీసుకెళ్ళావా ? నేనింట్లోనే వున్నాగా ? నాకు చెప్పొచ్చుగా ? నారాయణగూడ బ్రిడ్జ్ మీద పావలా కే చేయించుకొచ్చేవాడిని . నీకు , నీ మొగుడికి బొత్తిగా డబ్బులంటే లక్షం లేకుండా పోతోంది " అని ఇంకా హాట్ బూట్ గా మా మామగారు క్లాస్ పీకేసారు . అదే సమయములో , మా మామగారికి తెలిసిన ఒకాయన వచ్చి , కాచిగూడా లో ఇండియన్ బాంక్ , బ్రాంచ్ పెట్టారని , దానికి వాళ్ళ అబ్బాయిని మేనేజర్ గా వేసారనీనూ , మీ కెవరైనా తెలిసిన వాళ్ళుంటే , అక్కడ ఖాతాలు ఓపెన్ చేయించండి అని ప్రాధేయ పడ్డాడు . ఇంకెవరో ఎందుకు మా పెద్ద కోడలి తోనే చేయిస్తానని , నాతో అక్కడ ఎకౌంట్ ఓపెన్ చేయించి , ఇక పైన ఇలాంటి పనికి మాలిన దండగ ఖర్చులు చేయొద్దని , ఏమైనా ప్రతినెల ఆ ఎకౌంట్లో పది రూపాయలు వేసి , ఆయనకు చూపించాలని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు.

మా మామగారికి నమ్మకస్తులు , మా తోడి కోడలు లక్ష్మి , మా అబ్బాయి బిపిన్ . లక్ష్మి కుడిచేయైతే , బిపిన్ ఎడంచేయి . రామయ్య ఎడమ కాలు . ( మరి ఇంకో చేయి వుండదుగా . అందుకని కాలన్న మాట .) ఆయన బజారుకు వెళ్ళలేక పోతే , ఈముగ్గురిలో ఎవరితోనైనా తెప్పిస్తారన్నమాట. వీళ్ళూ బేరమాడటములో మా మామగారి వారసత్వం పుణికి పుచ్చుకున్నారు . ఇక తాతా మనవడు ఏదైనా కొనటానికి వెళ్ళారంటే , చిక్కడపల్లి , సుల్తాన్ బజార్ , కోటీ అన్నీ తిరిగి , అదీనూ నడుచుకుంటూ ఓ రూపాయి తక్కువకే తెచ్చుకుంటారు . ఓసారి , మంచం నవారు కొనటానికి హోల్ మొత్తం హైదరాబాద్ , ఆబిడ్స్ తప్ప , తిరిగారు . ఆబిడ్స్ లో అంతా మోసగాళ్ళన్నమాట . అందుకని అటెళ్ళరు .

అలా పొదుపు చేసిన డబ్బులు ఏ బాంక్ లో ఎన్ని నెలలకు యఫ్ . డి వేస్తే ఎంత వడ్డీ వస్తుంది అన్నది ఆయనకు కరతామలకం . కోపరేటివ్ బాంక్ , బర్కత్పురా , బాంక్ ఆఫ్ బరోడా కు ప్రతిరోజూ వెళ్ళొస్తూ వుండేవారు . నా దగర 100 రూపాయలు జమ అయ్యాయంటే వాటిని ఏదో ఒక విధం గా యఫ్. డీ చేసేసేవారు . ఆ పేపర్లన్ని ఆయన పేపర్ల తో పాటు ఒక రేకు పెట్టెలో వుంచి , దానిని మంచం కింద వుంచేవారు . తెల్లవారుఝామున లేవగానే బర్ర్ర్ర్ర్ర్ మంటూ ఆ పెట్టిని మంచం కిందనుండి లాగి , ఓ గంట సేపు ఆ పేపర్లు అన్నీ తిరగేసేవారు . ఇక డబ్బులేమో ఆ పైన కనిపిస్తుందే ఆ కోట్ లో దాచేవారు . అందులో అన్నీ ముఖ్యమైనవి వుంచేవారన్నమాట. అలా దాపుడు కే కాని , ఆ కోట్ ఆయన ఎప్పుడూ వేసుకోగా నేనైతే చూడలేదు . అది ఆయన పర్సనల్ బాంక్ అన్న మాట . మా అత్తగారు డబ్బులు అడగగానే ఎందుకు ఎంత అని సవాలక్ష ప్రశ్నలు వేసి , నువ్వు జమిందారిణివే ( మా అత్తగారి పూర్వీకులు జమిందారులట ) , నీకూ , నీ పెద్ద కొడుకుకు డబ్బు విలువ తెలీదు అనేసి , ఆ కోట్ లోనుండి తీసి ఓ పదిసారులు లెక్కపెట్టి మరీ ఇచ్చేవారు . పాపం అంటమే కాని ఎప్పుడూ ఇచ్చేందుకు లోటు చేయలేదు .

మా అబ్బాయి అక్షరాలా తాత పోలికే ! అరిచి ఘీ పెట్టినా వాడి దగ్గరనుంచి ఓ పైసా రాలదు . మా వారు వాడిని " చిన్న కిషన్ రావ్ " అని , " డబ్బులుగా " అని ముద్దు ముద్దుగా పిలుచుకుంటారు .

అలా , అలమారాలో డబ్బులు దాచటము , మా అత్తగారి దగ్గర నేర్చుకుంటే , కొద్దో గొప్పో ఎలా సేవ్ చేయాలి , ఆ డబ్బును బాంక్ లో ఎలా దాచాలి అన్నది మా మామగారి దగ్గర నేర్చుకున్నాను . మా అత్తగారు చెప్పినప్పుడు , నా కళ్ళు అలా చుక్కల్లా మెరిసాయి . అందుకని ఆవిడ గురించి రాసినప్పుడు చుక్కలు పెట్టాను . మా మామగారు చెప్పినప్పుడు ఒక ప్లస్ కాదు రెండు ప్లస్ లు కనిపించాయి అందుకని రెండు ప్లస్లు పెట్టాను . ఇక నేనెంతవరకు నేర్చుకున్నాను , ఎంతవరకు దాచుకున్నాను , ఎలా బేరాలాడాలి ( ఐనా , మా మామగారికి , నాకు బేరాలాడటము రాదనే ప్రగాఢ విశ్వాసము వుండేది . కొన్ని సారులు నిజమే నేమో నని నాకూ అనిపిస్తుంది సుమీ ) అని చెప్పేదానికి ఏమి గుర్తులు , ఎక్కడా అని దీర్ఘం వద్దు టైటిల్ దగ్గర ఆలోచించుకొని , ( ఓవేళ మీరేమైనా సూచిస్తే ) ఆ గుర్తుల తో , నా దాపరికపు అనుభావాల తో , వచ్చే వారం , ఇదే రోజు , ఇదే సమయానికి , ఇదే బ్లాగ్ లోకి వస్తాను . అంతవరకు సెలవా మరి .