Monday, February 8, 2010

డబ్బులోయ్ డబ్బులు ? ? ? ? ? 3నీకేమమ్మా ? మీ ఆయన నెలకు 50 రూపాయలు పంపిస్తారు . హాయిగా నెలకో చీర 15 రూపాయలదీ కొనుక్కుంటావు , 20 రూపాయలైనా కొనగలవు . వారాని కో సినిమా చూడగలవు . మమ్మలినీ సినిమా కు తీసుకెళ్ళొచ్చుకదా , సుదర్షన్ వాడు , ఆడవాళ్ళకు 50 పైసలకే టికెట్ పెట్టాడట . ముందుగా వెళుతే టికెట్ దొరుకుంతుంది అని స్వర్ణ నస పెడుతుంటే , సరే లే నేను ఇంటికెళ్ళి , అత్తయ్యగారికి చెప్పి , విజయను తీసుకొని వస్తాను , నువ్వు ముందు పదా అన్నాను . సినిమా ప్రోగ్రాం వాసన గట్టి జుబేదా , లలితా వాలి పోయారు . చేసేదేముంది . వాళ్ళనూ రమ్మన్నాను . ఇంతలో రెష్మీ , సుష్మ చేరి పోయారు . పైగా వాళ్ళెళ్ళేటప్పుడు నన్ను జమురూధ్ తీసుకెళుతానని బేరం పెట్టారు . వాళ్ళను సుదర్షన్ కి పంపి నేను ఇంటికెళ్ళాను . వరండా లోనే మామయ్యగారు ప్రత్యక్షం ! అప్పుడే వచ్చేసావు కాలేజ్ లేదా ? అనగానే లేదండి సంజును చూసి వెళుదామని వచ్చాను అని చెప్పి చిన్నగా లోపలికి జారుకొని , అత్తయాగారికి సినిమా ప్రోగ్రాం గురించి రహస్యం గా ( అనుకున్నాను ) చెప్పి విజయను రమ్మని బయటపడ్డాను . తిరిగి ఇద్దరమూ విడి విడి గానే ఇంటికి వచ్చాము . అమ్మయ్య నాలుగు రూపాయల్ తో ఫ్రెండ్స్ కి సినీమా పార్టీ ఇచ్చి , వాళ్ళ బారినుండి తప్పించుకున్నాను . మామయ్యగారి కంట పడకుండా కూడా తప్పించుకున్నాను . ఎంత తెలివో కదా !!!!

" అమ్మాయ్ , నీ దగ్గర 10 రూపాయలున్నాయా ? " అని మామయ్యగారు అడుగగానే వున్నాయండి అంటూ తీసుకెళ్ళాను . అవి తీసుకొని నాతో రా అని , ఇంటికి దగ్గర లో వున్న , కోపరేటివ్ బాంక్ కు తీసుకెళ్ళి , ఎకౌంట్ ఒపెన్ చేయించి , ప్రతినెలా , అందులో కూడా పది రూపాయలు డిపాజిట్ చేసి తనకు చూపించమని ఆర్డర్ పాస్ చేసారు . అది సినిమా మహత్యం .హూఊఊఊఊఉం . వచ్చే 50 రూపాయల లో 10 , మా అత్తగారికి పాకెట్ మనీ మావారి బదులు నేనివ్వాలి . అది మా వారి హుకుం . 10 , ఇండియన్ బాంక్ లో , పది కోపరేటివ్ బాంక్లో కట్టాలి . అది మామగారి ఆర్డర్ . 10 నా బ్లాక్ మనీ కింద అత్తగారి కివ్వాలి .అది అత్తగారి ఆజ్ణ . ఇక మిగిలినవి పది రూపాయలు . దానిలోనే నా చదువు , సినిమాలు , బట్టలు , మా అమ్మాయి ఖర్చు అంతా వెళ్ళాలి . మర్చేపోయాను , పైన కనిపిస్తుందే ఓ పెట్టి , అది మా అత్తగారు నేను నా వైట్ మనీ దాచుకోవటానికి ఇచ్చారు . ఆ బొట్టుపెట్ట , మా అత్తగారికి , ఆవిడ మూడో అన్నయ్య పెళ్ళి లో ఇచ్చారట. ఆ పది రూపాయలు అందులో పెట్టుకునే దానిని . ప్రతి నెలా , మావారు 50 రూపాయల చెక్ పంపగానే , విజయను తోడు తీసుకొని ఆబిడ్స్ లోవున్న గ్రిండ్లే బాంక్ కు వెళ్ళి తెచ్చుకోవటమూ , సాయంకాలము లోపల ఎక్కడివక్కడ పంచేసి , మిగిలిన పదిరూపాయలకు బడ్జెట్ వేసుకోవటము , ఆ పది రూపాయలు ఖర్చైపోతే నెల ఎలా గడుపుకోవాలి అని ఖర్చు పెట్టటానికి అసలు ప్రాణమే వొప్పేదికాదు .పైగా అరటిపళ్ళు , చారాణా ( 25 పైసలు ) కో డజన్ అంటే నై , నై బారాణా ( డెబ్బై ఐదు పైసలు ) కో దేవో అని చాలా బేరమాడి , బండి వాడిని మొహమాట పెట్టి , బారాణా కు పళ్ళు కొన్న ఘనచరిత్ర తో , ఏమైనా కొనాలన్నా సరిగ్గా కొంటున్నా నా లేదా అనే అనుమానమొకటి . తెగ పిసినారినై పోయాను . దాని లో కూడా ఐదు రూపాయిలు ఆ పెట్టెలో , ఇంకో ఐదు రూపాయలు నా బట్టల పెట్టెలో నా సొంత బ్లాక్ మనీ దాపరికం . ఏదైనా కొనుక్కోవాలంటే , బజారుకెళ్ళే ముందే లిస్ట్ రాసుకొని , వెయ్యి అవసరమంటే ఐదువందలు తీసుకెళ్ళి , తీరా బజారుకెళ్ళాక ,లిస్ట్ లో సగము వద్దులే అనుకొని , తీసుకెళ్ళిన డబ్బుల లో సగము ఐ పోగానే ఇహ చాలులే అనుకొని ఇంటికి వచ్చేసి , ఇహ చెప్పేందుకేముంది ?

సందడిలో సటాకు అన్నట్లు , మా మరిదిగారు , వదినా మీరు అన్నయ్య చెక్ కోసం ఎదురుచూడటమెందుకు ? అది జాయింట్ ఎకౌంట్ కదా అన్నారు . మా వారు సెలవలో వచ్చినప్పుడు , అడుగుతే అంత దూరం ఎందుకులే , చిక్కడపల్లి లో సిండికేట్ బాంక్ లో తీసుకో అని అక్కడ వున్న ఆయన అకౌంట్ మా జాయింట్ ఎకౌంట్ చేసేసారు . అప్పుడే ఐపోలేదు .ఓ నాలుగు సంవత్సరాల తరువాత . . . మేము సైనిక్ పురి లో ఓరోజు మామయ్యగారు ఒకాయనను వెంటపెట్టుకొనివచ్చి , స్టేట్ బాంక్ లో కొత్తగా కిడ్డీ బాంక్ అని మొదలుపెట్టారు . ఇదిగో పిల్లలిద్దరి కోసం రెండు తీసుకొచ్చాను . రోజూ చిల్లర డబ్బులు ఇందులో వేయి .మొదటి తారీకున ఈయన వచ్చి , వీటి తాళాలు తీసి ఆ డబ్బులు తీసుకెళ్ళి పిల్లల ఎకౌంట్ లో జమ చేస్తాడు అని చెప్పారు . అదైందా , . . ఓ పది సంవత్సరాల తరువాత నా పార్లర్ కోసం లోన్ ఇస్తారని , బాంక్ ఆఫ్ బరోడా లో కరెంట్ ఎక్కౌంట్ ఓపెన్ చేయించారు మావారు అదినూ మా మామగారి సలహా తో . ఓసారి పార్లర్ కి ఒకాయనను వెంట పెట్టుకొని మా మామగారు రాగానే నాకు ప్రమాద ఘంటికలు వినిపించనే వినిపించాయి . ఇదిగో అమ్మాయ్ ఇతనూ రోజూ నువ్వు పార్లర్ మూసే సమయానికి వస్తాడు . ఎంతో కొంత జమచేయి అంటూ నారాయణగూడా విజయా బాంక్ లో ఎకౌంట్ ఓపెన్ చేయించారు . కాస్త ధైర్యం వచ్చాక , మామయ్య గారు , నాదగ్గర ఏమైనా లక్షలు మూలుగుతున్నాయా ? ఇన్ని బాంక్ ల లో ఎకౌంట్ లు ఎందుకండీ అంటే , లక్షలే కాదమ్మాయ్ పైసలు కూడా దాచాల్సిందే అనేసారు . అంతటి తో ఐపోలేదు . మా అబ్బాయి సలహా తో , మా కోడలు మా ఇద్దరి పేరు మీద , ఆంధ్రా బాంక్ లో జాయింట్ ఎకౌంట్ ఓపెన్ చేసింది . ఇప్పటికి ఎన్ని బాంకుల పేరులు చెప్పాను ? గుర్తు పెట్టుకున్నారా లేదా ? ? ?

ఓ ఐదారు సంవత్సరాల కిందట అనుకుంటాను , ఒక రోజు అన్ని బాంక్ లకు వెళ్ళి ఎకౌంట్స్ అన్ని క్లోజ్ చేసాను . పాపం అందరూ ఎందుకు మేడం క్లోజ్ చేస్తున్నారు . కావాలంటే మా శ్రీనగర్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము అని తెగ బతిమిలాడారు . ఈ ప్రక్రియ లో కాచిగూడా ఇండియన్ బాంక్ కనపడనే లేదు . అది ఎప్పుడో ఎక్కడికో షిఫ్ట్ చేసేసారట ! అందుకే మా అత్తగారిలాగా నాకూ బాంకుల మీద నమ్మకం లేదు . అందుకే నా వైట్ మనీ మా అత్తగారిచ్చిన పెట్టిలోనూ బ్లాక్ మనీ . . . . . . లోనూ దాచుకుంటాను . అంతెందుకు , ఈ మద్య తెలంగాణా గొడవలలో ఏ .టి .యం లు కూడా పనిచేయనప్పుడు , మావారు , మా అబ్బాయి నా అలమారాకి కన్నం వేసారు . నా అలమారాలో హీన పక్ష్యం లక్ష రూపాయలైన వుంటాయని మా బిపు ప్రగాఢ నమ్మకం . నా డబ్బులన్ని తీసేసుకున్నారు అని నేను గొడవపెడుతుంటే అందుకే మనీ ఎప్పుడూ ఇంట్లో వుంచకూడదు ఆంటీ , ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయాలి అని మాకోడలు సలహా ఇచ్చింది . " ఇల్లన్నాక , పిల్లలున్న చోట ఓ పది రూపాయలూ , ఒక మనిషి అన్నము వుండాలి " అన్నది మా అత్తగారు చెప్పిన మాట . ఎంతైనా అత్తగారి మాట పట్టుచీరల మూట కదా !!! ( ఈ మాట ఈ మధ్యనే లలిత గారు చెప్పారు .)
కొస మెరుపు ; నా డిగ్రీ పూర్తికాగానే , ఆంధ్రా బాంక్ లో పనిచేసే , మా వారి ఫ్రెండ్ , నారాయణగూడా లో ఆంధ్రా బాంక్ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము , మీ పెద్ద కోడలి కి వుద్యోగం ఇస్తాము , పంపుతారా ? అని మా మామగారిని అడిగారు . మా మామయ్యగారు చేరమని ఉత్సాహం చూపించారు . కాని , పిల్లలు చిన్నవాళ్ళని , మావారికి పీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ అవుతే వెళ్ళాలికదా అనీనూ నేను వుద్యోగం లో చేరలేదు . అలా బాంక్ వుద్యోగం కూడా వచ్చిందన్నమాట . చేయక పోయినా , అప్పుడప్పుడు , మా వారిని సాధించటానికి మాత్రము పనికి వస్తోంది !!!
సరే మరి . వచ్చే వారం కలుసుకుందాము . ఏమిటీ ఇంకా వుందా అంటే వుండదేమిటి మనీ నా మజాకా ? వచ్చేవారం , ఇదే రోజు డబ్బుల గురించి మరి కాసిని కబుర్లు . అందాకా సెలవు .

13 comments:

Anonymous said...

చాలా బాగుందండి.

sudha said...

అలాంటి పెట్టి నాదగ్గర కూడా ఉంది. మా అమ్మ గారిది . నేను దానిని దేవుడు సామాను కోసం ఉపయోగిస్తున్నాను. మీరు చెప్పింది చాలా బావుంది.వచ్చేవారం కోసం ఎదురుచాస్తూ...

సుధ

శ్రీనివాసరాజు said...

బాగుందండీ.. వచ్చేవారం దాకా వేచి చూస్తాం..

మధురవాణి said...

బావున్నాయండీ మీ కాసుల కబుర్లు..! మరిన్ని కబుర్ల కోసం వేచి చూస్తూ..

శ్రీలలిత said...

మీ అనుభవాలన్నీ బలే బాగున్నాయండీ...

భావన said...

పెట్టె బాగుందండి. ఇంతకు ఇప్పుడు ఒక్క బేంక్ లోనన్నా అకౌంట్ వుంచుకున్నారా? :-)

ప్రణీత స్వాతి said...

నాదీ భావన గారి డవుటే నండీ..

మాలా కుమార్ said...

హరెఫలె గారు ,
మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి .

@సుధ గారు ,
ఈ బొట్టు పెట్టి దాదాపు 70 సంవత్సరాల కిందటది అండి . దాని ఆంటిక్ లుక్ పోగూడదని నేను దానిని పాలిష్ చేయటము కాని , కడగటము కాని చేయటము లేదు . అందులో పెట్టే డబ్బులకన్నా ఆ పెట్టే నాకు విలువైనదిగా అనిపిస్తుంది .
మీరు మొదటిసారిగా నా బ్లాగ్ కు వచ్చినందుకు వెల్కం , థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

శ్రీనివాస రాజుగారు ,
నా బ్లాగ్ కు మీరు కూడా మొదటిసారి వచ్చారు . వెల్కం & థాంక్స్ అండి .

@మధురవాణి ,
నా కాసుల కబురులు నచ్చినందుకు థాంక్ యు .

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
మీకు నా అనుభవాలు నచ్చినందుకు థాంక్స్ అండి.
@ భావన ,
నాకూ మా అత్తగారిలా బాంక్ ల మీద నమ్మకము లేదుగా ? అందుకే నాకే బాంక్ లోనూ ఎకౌంట్ లేదుగా !!!!!
@ ప్రణీత స్వాతి గారు ,
మీకు భావన కిచ్చిన సమాధాన మేనండి .నా డబ్బులు . . . . . అక్కడ దాస్తానన్నమాట .

మురళి said...

గుడ్లన్నింటినీ ఒకే పెట్టెలో పెట్టకూడదని ఓ ఇంగ్లీష్ సామెత ఉందండీ.. మీ మామగారు కరక్టే.. యెంత బ్యాంకైతే మాత్రం ఒక్క దాంట్లో మాత్రమే అకౌంట్ ఉంటే ఇబ్బందే.. ఆమధ్య ఒక ప్రైవేటు మూత పడుతోందని రూమరు వచ్చినప్పుడు, అందులో పెద్ద మొత్తంలో డబ్బు దాచుకున్న మిత్రులు పడ్డ టెన్షన్ నాకింకా జ్ఞాపకమే.. అదృష్టవశాత్తూ ఆ బ్యాంకుకి ఏమీ కాలేదు లెండి.. బాగున్నాయి మీ కబుర్లు.. వచ్చే వారం కోసం ఎదురు చూస్తూ..

సుభద్ర said...

గళ్ళపెట్టె భలే బాగు౦ది.. మీ గళ్ళపెట్టె గలగలలు మరీ బాగున్నాయి..సుమారు నెల తరువాత బ్లాగ్స్ చూస్తూన్నా..ఓపెని౦గ్ బాగు౦ది..మీరు క౦టిన్యూ చెయ్య౦డి..నేను ప్లాలో అవుతా.. మీ పెట్టే చూశాక నేను ఎక్కడికో వెళ్ళా..నా దగ్గర పాతపెట్టెలు కొన్ని ఉన్నా..

Srujana Ramanujan said...

:)))))))