Tuesday, May 26, 2009

ఆమె ఎవరు-2



టక్ టక్ టక్
చప్పుడు విని తలుపు తీసిన నాకు,ఎదురుగా చిక్కటి చీకటి లో, కొద్ది దూరములో వెలుగుతున్న నెగడు వెలుగు లో ,తెల్ల చీర కట్టుకొని,మోచేతులదాకా తెల్ల జాకిట్టు వేసుకొని,మోకాళ్ళవరకు జుట్టు విరబోసుకొని కనిపించిన ఆకారము నన్ను చూడగానే మొహము లో తెల్లని పళ్ళు మెరుస్తుండగా నవ్వుతూ చేయి కొద్దిగా ముందుకు జాపుతూ,గీత అరుపులు వినగానే బెదిరి పోయి వెనకకి అడుగు వేసింది.ఇంతలో జీప్ డ్రైవర్ రాంసింగ్ పక్క నుంచి వచ్చి ,”మేంసాబ్ ఇనో కల్నల్ సాబ్ కి బేటీ హై అన్నాడు.ఎప్పుడు లేచి వచ్చిందో పాప హాయ్ ఆంటీ అంటూ ఆ అమ్మాయి వైపు చేయి చాపింది.అప్పటి కి నా బుర్ర మాములు అయ్యి,పార్టీ కి వెళుతూ ఏమండి,ఈ రొజు ఉదయము కల్నల్ పాల్ కూతురు వచ్చింది,ఆ అమ్మాయీ వక్కతే మెస్  లో వుంటుంది కాబట్టి మన యింటి కి పంపుతాను అని చెప్పిన విషయము గుర్తుకు వచ్చింది.అప్పటికే తను హాయ్ స్వీటీ అంటూ సంజు తో చేయి కలుపు తోంది.నన్ను చూస్తూ ,మిసెస్ .కుమార్ ఐ ఆం నీతూ పాల్ అంది. నీతూ చేయి అందుకొని ప్లీజ్ కం ఇన్ అన్నాను.
ఇంకా భయం,భయం గా చూస్తున్న గీత ని చూసి ఎందుకు నన్ను చూసి అరిచింది అన్నది.
"ఒక్కసారి వెనకకి చూడు ."అన్నాను. వెనక్కి చూసింది.నల్లగా  చీకటి, ఉండనా వద్దా అన్నట్లు  కొరివి దయ్యాల్లా ఊగుతున్న నెగడు మంటలు. వెనక జుట్టు విరబోసుకున్న దయ్యాల్లా పెద్ద పెద్ద చెట్లు భీకరంగా చీకటిలో బీతికలిగించేలా ఉన్నాయి .అదే సమయం లో ఊఊఊఊ అని ఊళ వేసుకుంటూ ఒక నక్క అటుగా పరుగెత్తింది.అదంతా చూసి "అమ్మో" అని లోపలికి ఒక్క గెంతులో వచ్చేసింది.
"చూసావుగా ఈ వాతావరణం లో నువ్వు తెల్ల చీర కట్టుకొని , జుట్టు విరబోసుకొని ఇట్లా వస్తే . . . అందులోనూ నిన్న మేము ఓ కౌన్ థీ చూసాము. "
"సారీ ఇలా అనుకోలేదు.డాడీ పశుపతి నుంచి ఈ చీర తెచ్చారు.కొత్తది అని కట్టుకున్నాను,"నాతో అని ,
"ఢర్ గయే క్యా సారీ ." అని గీత చేయి పట్టుకుంది.గీత మొహమాటం గా నవ్వింది.
అమ్మయ్య ఇంకో మనిషి ఉంటే కాస్త సందడిగా ఉంటుంది అనుకొని నీతూ చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాను.పాప మా వెనకాలే తిరుగుతుంటే, బాబు తో గీత కూర్చుంటే  ఇద్దరము కలిసి వంట చేసుకొని ,తిని,కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. అవును మాలా ఇక్కడ కుక్కలేమిటి ఇలా వున్నాయి ? పొద్దున వాటిని చూడగానే చాలా భయం వేసింది అంది.
అవి కుక్కలు కావు నక్కలు .ఇక్కడ అవి, ఏనుగులు చాలా ఎక్కువ.కొంతమంది ఇళ్ళలో కుందేళ్ళని కూడా పెంచుతున్నారు.మిసెస్ .దివాన్ అయితే అడవి లోపలి దాకా వెళుతుంది ఎవైనా డ్రై ఫ్లవర్స్ దొరుకుతాయేమో నని అస్సలు భయం లేదు.ఈ పూలు ఆమె ఇచ్చినవే . నాకైతే చాలా భయం అడవిలోపలికి వెళ్ళాలంటే. పాములూ తిరుగుతుంటాయట.వేరే జంతువులేవీ ఉన్నట్లు లేవు కాని ఏనుగులు చాలా ఎక్కువగా ఉన్నాయి.అందులోనూ అడవి ఏనుగులు సర్కస్ ఏనుగులులా ట్రైనింగ్ ఇచ్చినవి కావు కదా చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తాయి.ఇక్కడ అరటి పళ్ళు, అనాస పళ్ళు బాగా పండుతాయి.రకరకాల అరటిపళ్ళు ఉన్నాయి.అందులో ఎర్రటి అరటి పళ్ళంటే నాకు చాలా ఇష్టం .ఇంత జాగా ఉంది కదా చక్కగా అరటి చెట్ట్లు పెంచుకుందామనుకున్నాను అందులో నాకు అరటి చెట్లంటే చాలా ఇష్టం కాని ఏనుగులు వచ్చి పడతాయని మా ఏమండీ వద్దన్నారు.వాటికి అరటి చెట్లంటే ఇష్టంట.నిన్న ఓ గమ్మత్తు జరిగింది.ఘూర్ఖా రెజిమెంట్ దగ్గర వొక జవాను రెడ్ అరటి పళ్ళు కొన్ని పక్కన పెట్టుకొని తింటున్నాడట.ఇంతలో ఎవరో భుజం మీద తట్టిన్నట్టు అనిపించి అరటిపళ్ళు ఎవరైనా అడుగుతున్నాడేమో అనుకొని జావ్ జావ్ అంటూ వెనుక కి చూస్తె ఏనుగు నిలబడి వుందిట.అంతే అతను పరుగో పరుగు. అన్నాను.అతని ని తలుచుకొని నవ్వుకున్నాము.
"నువ్వెప్పుడన్నా ఏనుగులను చూసావా ?" అని అడిగింది.
"ఆ చూసాను.ఓసారి జీప్ లో వెళుతుంటే రోడ్ కు అడ్డంగా ఏనుగుల గుంపు వెళ్ళింది.అవన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయే దాకా జీప్ ఆపేసాడు డ్రైవర్. గుంపే కాదు ఒక్క ఏనుగు రోడ్ మీద నుంచి వెళుతున్నా మనం అది వెళ్ళేదాకా ఆగాల్సిందేనట. కొద్దిగా చప్పుడైనా అది ఎట్లా ప్రవర్తిస్తుందో చెప్పలేము జీపు ఎత్తి పారేసినా పారేస్తుంది అన్నాడు తరువాత డ్రైవర్."అన్నాను.
ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే కాలము ఎంత గడిచిపొయిందో కూడా తెలీలేదు.
సడన్ గా టైం చూస్తే టు ఓ క్లాక్ అయ్యింది.ఇంకా వీళ్ళు రాలేదేమా అనుకుంటుండగానే వచ్చారు.కల్నల్ .పాల్ లోపలికి వస్తూనే వుయ్ ఆర్ వెరీ లక్కీ ,గాడ్ సేవెడ్ అస్,గాడ్ ఈస్ గ్రేట్ అన్నాడు.
మావారు పిల్లలిద్దరి నీ ఆరాటం గా దగ్గరికి తీసుకున్నారు.ఏమయిందో అర్ధముకాక నేనూ, నీతూ అయోమయంగా చూస్తూ నిలబడ్డాము.కొంచము తేరుకున్నక వాళ్ళు చెప్పిన సంగతి,
మెస్ దగ్గర , లేడీస్ రూం పక్కనున్న నీళ్ళ టాంక్ నుంచి రోజూ నీళ్ళని ఏనుగులు పాడుచేసి పోతున్నాయని,నీళ్ళ టాంక్ దగ్గర మైల్డ్ గా కరెంట్ కనెక్షన్ ఇచ్చారట.ఈ రోజు సాయంకాలము ఓ పిల్ల ఏనుగు అక్కడికి వచ్చి నీళ్ళు తాగబోతే దానికి షాక్ కొట్టిందట.ఇక అది వెళ్ళి మిగితా ఏనుగు గుంపును తీసుకొచ్చిందట.పార్టీ మొదలయిన కొద్దిసేపటికే ఏనుగుల మంద వచ్చి లేడీస్ రూం ని నేల మట్టము చేసేసాయట.వాటి ని ఎవరూ నిలవరించ లేకపోయారట.అందరూ చూస్తూ నిలబడి పోయారట.అదృష్టవసాత్తు వీళ్ళ వైపు రాకుండా చేయగలిగారు. ఎప్పుడు పార్టీలయినా పిల్లలని తీసుకెళ్ళి లేడీస్ రూం లో పడుకో పెడతాము.పిల్లల జ్వరము మూలంగా ఆరోజు వెళ్ళలేదు.నేను వెళ్ళలేదని ,
మిసెస్.షేర్గిల్ కుడా వెళ్ళలేదు.లేకపోతె పిల్లలు నలుగురు, వాళ్ళ పనమ్మాయి ,మా పనమ్మాయి ఏమయిపోయేవారో!  ఆ ఆలోచనతోనే వణుకొచ్చి ఏమండీ దగ్గరకు వెళ్ళి ఆయనను గట్టిగా పట్టుకున్నాను.
"కొంచం వేడిగా కాఫీ తీసుకురా ." అన్నారు ఏమండి.
కాఫీ తాగి కాసేపు ఏనుగుల సంగతులూ , ఆ రోజు తప్పిన ప్రమాదము గురించీ మాట్లాడుకొని కల్నల్ పాల్ , నీతు వెళ్ళిపోయారు.
అవునూ నాకో పెద్ద అనుమానం దయ్యాలు తెల్ల చీరే ఎందుకు కట్టుకుంటాయి?

 

Friday, May 22, 2009

ఆమె ఏవరు?


ఆమె ఎవరు


పాప సొఫా,లో బాబు నా వడిలో పడుకొని నిద్రపొతున్నారు.పనమ్మాయి గీత సోఫా పక్కన ముడుచుకొని కూర్చొని కునికి పాట్లు పడుతోంది.గీత ని చూసినప్పుడల్లా మనసు భాధ తో నిండిపోతుంది.పాకిస్తాన్ వార్  లో , బంగ్లాదేశ్  తెలిసిన వాళ్ళతో కలసి పారిపోయి వచ్చిందట.తల్లీ ,తండ్రీ,తమ్ముడు తన కళ్ళముందే చనిపోయారట.పదహారు ,పదిహేడు సంవత్సరాలు వుండవచ్చు.ఇక్కడ అందరి ఇళ్ళలో ఇలా బంగ్లాదేశీ రెఫ్యూజీ లే పనిచేస్తున్నారు.ఈ యుద్దాలు ఎంత మందిని నిరాశ్రయులుగా చేస్తున్నాయో!ఒకక్కరి గాధలు వింటుంటే మనసు ద్రవించి పోతుంది.
కిటికీ పక్కన నక్క గట్టిగా అరిచింది.పిల్లలు వుల్లిక్కి పడ్డారు.నేను ఆలోచనల నుంచి తేరుకొని ,వెధవ నక్కలు చిరాకు పుట్టిస్తున్నయి అనుకొని కిటికీ తలుపువేద్దామని,చిన్నగా బాబు ని పక్కకి పడుకో పెట్టి లేచాను.
"దీదీ"
"ఏంటి గీతా?"
"టైం ఎంతయ్యింది?"
గడియారం వైపు చూసాను.ఇంకా 8గంటలే అయ్యింది.సత్నా లో పార్టీ వుందని వెళ్ళారు.పిల్లలు కొద్దిగా నలతగా వున్నారని నేను ఆగి పొయాను.లేకపోతే అందరమూ వెళ్ళే వాళ్ళము .పిల్లలని లేడీ స్ రూంలో వుంచే దానిని !
గాలి కి పరదాలు చిన్నగా వూగుతున్నాయి.లేచి కిటికి తలుపులు వేస్తూ బయటకి చూసాను.ఎనిమిది గంటలకే చీకటి పడిపోయింది.బయట రోడ్ పక్కన ఒక జవాన్ నెగడు వెలిగిస్తున్నాడు.అడవి పాకిస్తాన్ యుద్దం తరువాత బంగ్లాదేశ్ ఏర్పడ్డాక , షిలిగురి దగ్గర ఉన్న బార్డర్ లోని అడవిని కొద్దిగా చదును చేసి, కొన్ని క్వాటర్స్ కట్టి, సేవక రోడ్ అని ఓ కాలినీ ఏర్పాటు చేసి,కొన్ని డిఫెన్స్ కుటుంబాలకు ఇచ్చారు.) కదా ఏనుగు ల బెడద ఎక్కువ .అందుకని ఈ నెగడు వెలిగించటము.ఎమో . . కొంచము ఈదురుగాలి మొదలయిందంటే ఆరిపోతాయి.పోనిలే అప్పటి వరకు అయినా వుంటాయి అనుకుంటూ కిటికీ తలుపులు వేసి ,పరదాలు వేసాను .లేకపోతే తలుపు దగ్గరికి మూతి పెట్టి మరీ అరుస్తాయి .ఇక్కడి కి వచ్చిన కొత్తలో కుక్కలేమిటి ఇలా వున్నాయి అనుకున్నాను.అవి కుక్కలు కావని నక్కలని తెలిసుకొని విస్తుపోయాను.కుక్కల లాగే కాంప్ అంతా ,ఊళ పెట్టుకుంటూ తిరుగుతుంటాయి.
దీపాలు డిం గా వెలుగుతున్నాయి . . .
నేను రానంటే వినకుండా నిన్న యూనిట్ లో ఓ కౌన్ థీ సినిమా కి తీసుకు పోయిన మిస్సెస్.షేర్గిల్ మీద చాలా కోపం వస్త్తొంది.ఆవిడకు ఆ సినిమా చూడాలని ఉందని 'తుసీ చలో నా జీ ' అంటూ నా ప్రాణాలు పీకింది.కాలేజీ లో వున్నప్పుడు ఆమె ఎవరు సినిమా వస్తే ఫ్రెండ్స్ ఎంత బలవంత పెట్టినా వెళ్ళలేదు.ఇప్పుడేమో మా ఏమండీ గారి, బాస్ గారి పెళ్ళాం గారి వొత్తిడికి లొంగాల్సి వచ్చింది.అసలే ఇలాంటి సినిమా లన్నా ,కథలన్నానాకు చాలా భయం. మొహమాట మోక్షాలు . . . హుం తప్పలేదు.చుట్టూ సాధన ' నైనా బరిసే ' అని ,తెల్లచీర కట్టుకొని ,జుట్టు విరబోసుకొని తిరుగుతున్నట్టుగానే అనిపిస్తొంది.దానికి తగ్గట్టు వాతావరణమూ అలాగే వుంది.అంతటా నిశబ్ధము .ఏదైనా బుక్ చదువుదామంటే గుడ్డి దీపాలు.అబ్బ ఎంతసేపటి కీ టైం గడవటము లేదు.ఏమండి వెళ్ళి అరగంట కూడా కాలేదు.కనీసము పన్నెండు అయితేకాని రారు.నిశబ్ధం అయినా తగ్గుతుందని రేడియో ఆన్ చేసాను. వెంటనే . "నైనా బరిసే ,రిమ్మ్ జిమ్మ్ రిమ్మ్ జిమ్" అని మొదలయింది . ఓరి దేవుడా ఇక్కడా ఇదేపాటా అని తిట్టుకుంటూ వెంటనే బంద్ చేసాను. టిక్ , , , టిక్ , , , టిక్ , , ,
గడియారం ముల్లు తిరుగుతొంది.
"దీదీ" ,
'"క్యా గీతా "
"డర్ లగరై " .
'"వుండవే తల్లీ నేనే చస్తుంటే నువ్వొదానివి మాట్లాడకుండా పడుకో. "
టైం ఎంతకీ గడవదు.ఇంతా చేస్తే ఇప్పటికి ఎనిమిదీ పది అయ్యింది అంతే.
టక్. . . టక్ . . . టక్ . . .
ఏదో అలాపన ఏమొలే అనుకొని వూరుకున్నాను
అసలు నేనూ పిల్లలని తీసుకొని వెళ్ళా ల్సింది.అక్కడే పడుకో పెడితే అయిపోయేది. . . మళ్ళీ
టక్ . . . టక్ . . . టక్ . . .
ఇంత రాత్రి ఎవరొచ్చరబ్బా !
గీతా జావ్ దేఖొ ."
"నయ్ దీదీ మేరొకొ డర్ లగరా "
మళ్ళీ..
టక్ . . . టాక్. . . టక్ . . .
భయపడుతూ వెళ్ళి తలుపు తీసాను.ఎదురుగా....
తెల్ల చీర కట్టుకొని,మోచేతులవరకు తెల్ల జాకెట్ వేసుకొని ,మోకాళ్ళ వరకు జుట్టు విరబోసుకొని ఒక ఆకారము నిలబడి వుంది.తలుపు తీసిన నాచేయి ఎత్తి అలాగే వుంది .నిశ్చేష్టురాలనయి అలా గే నిలుచుండి పోయాను.ఇంతలో వెనక నుంచి గీత అరుపులు
కెవ్వ్ కెవ్వ్ ………


Sunday, May 10, 2009

అమ్మ

“అమ్మమ్మా” అంటూ వచ్చింది అదితి. నిన్నొక ప్రశ్న అడుగుతాను సరిగ్గా సమాదానం చెప్పాలి.

“అలాగే అడుగు తెలుస్తే చెపుతా” అనగానే...

” నీకు మీ అమ్మ అంటే ఇష్ఠమా”

“అదేం ప్రశ్న? చాలా ఇష్ఠం”

“ఎందుకు కని, పెంచింది వగైరా చెప్పకు కనక పోయినా పెంచిన అమ్మ మీద ప్రేమ వుండదా?”

“ఎందుకువుండదు? వుంటుంది .యశోదా క్రిష్ణులనే చూడు అమ్మ అంటే యశోదయే అనిపిస్తుంది. కృష్ణుడిని ఎంత ప్రేమ గా పెంచుతుంది. కన్నయ్య అల్లరి , యశోద ప్రేమ, ఆ తల్లి కొడుకుల అనుబంధం చదువుతుంటే , వింటుంటే, సినిమాలలో చూస్తుంటే ఎంత మధురంగా వుంటుంది. అసలు తల్లీ కొడుకులు అంటే ఇలాగే వుంటారేమొ , ఇలాగే వుండాలి అనే భావన కలుగుతుంది. అసలు ప్రతి స్త్రీ హృదయము మాతృత్వపు వాత్యలముతో నిండివుంటుంది. రోడ్డు మీద ఏ పిల్లో , పక్షినో దెబ్బతగిలి పడివుంటే చూడగానే ఎంత బాధ కలుగుతుంది? పేపర్ లో ఎక్కడో చంటి పిల్లలు దొరికారు అని చదవగానే హృదయం ద్రవించి పోతుంది. నాకైతే తెచ్చుకొని పెంచుదామని పిస్తుంది.. ఎందుకని? వాళ్ళతో నాకేమీ సంబంధం లేదే

అంతెందుకు సత్యా అంటీ కి బొమ్మలు అంటే ఇష్టం అని అరవింద్ యు.యస్.నుంచి ఒక బాబు బొమ్మని పంపాడట.ఆ బొమ్మకి డుంబు అని పేరు పెట్టి ఒక చిన్న బాబు తో మాట్లాడినట్లే మాట్లాడుతూ గారాబం చేస్తూవుంటుంది. తనే కాదు వాళ్ళ అత్తగారు కూడా ఆ బొమ్మ ను చూసినప్పుడల్లా ఎత్తుకొని ,కాళ్ళ మీద పడుకో పెట్టుకొని జో కొడుతూ వుంటారు. వాళ్ళే కాదు ఎవరు ఆ బొమ్మను చూసినా ముద్దు చేయకుండా వుండలేరు.

అసలు చిన్న చిన్న అమ్మాయిలనైనా చూడు వాళ్ళ బొమ్మలకు పేర్ల్లు పెట్టటము, వాటిని ముద్దు చేయటము,అమ్మ లా లాలించి, స్నానము చేయించి, అన్నము పెట్టి ఎంత ముద్దు చేస్త్తారు. నీకు గుర్తు లేదు , చిన్నప్పుడు నువ్వు ఆడుకున్న బొమ్మలాటలు. చిన్నప్పుడు బొమ్మని లాలించని అమ్మాయి ఎవరైనా వున్నారా? అంటే అమ్మలా వుండటము అమ్మాయికి చిన్నప్పటి నుంచే సహజముగా వచ్చేస్తుంది. అది ప్రకృతి ఇచ్చిన వరము.


“మరైతే అమ్మమ్మా అంత ప్రేమగా పెంచిన యశోదను, క్రిష్ణుడు కొంచము పెద్దవాడు కాగానే వదిలి అసలు అమ్మ దేవకి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు?

“అది బాధ్యత తీర్చుకోవటానికి.అమ్మ చెరసాలలో వుంటే విడిపించటము ఆయన బాధ్యత కాదా! అందుకే ఒకసారి , కృష్ణుడు తన అష్టభార్యలను తీసుకొని యశోద దగ్గరకి వచ్చినప్పుడు, యశోదమ్మ అడుగుతుంది కన్నయ్యా బాల్యములో నీ ముద్దుమురిపాలు చూసాను, లాలించి ఆనందించాను. కాని పెద్దవాడివి అయ్యాక నీ అవసరాలు చూడలేకపోయాను. ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు నేను ఒక్కటి అయినా చూడలేకపోయాను అని విచారిస్తుంది. అప్పుడు కన్నయ్య అంటాడు.. విచారించకమ్మా, వచ్చే నా అవతారములో నా ఆలనా పాలనా చూసి, నువ్వే నా కళ్యాణము జరిపిద్దువుగాని అని వరము ఇస్తాడు. యశోదమ్మ కోరిక కృష్ణుడు వెంకటేశ్వర స్వామిగా తీరుస్త్తాడు. వారిది జన్మ జన్మల బంధం.”

“అప్పుడూ సొంత అమ్మ కాదుగా!నువ్వూ మమ్మలిని చిన్నపటినుంచి పెంచావు,మా చిన్నపుడు నీదగ్గరే వున్నాము .అయితే నేనంటే మీకిష్టమే కదా! నువ్వంటే ఇష్టమే కాని మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అమ్మమ్మా ఎందుకని? నాకే కాదు ,మేఘ,గౌరవ్ ,విక్కి అందరూ అంతే వాళ్ల అమ్మలు రాగానే నీదగ్గరనుండి పరిగెత్తి వెళ్ళిపోతారు.
ఎందుకని ?”

“సరే నువ్వు చెప్పు నీకు మీ అమ్మంటే ఎందుకు ఇష్టం?”

“ఎందుకంటే మా అమ్మ కాబట్టి.

చూసావా అమ్మమ్మ, బామ్మ, అత్తమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మా ఎంతమంది అమ్మలు అమ్మంత అప్యాయత పంచినా అమ్మ అంటే అమ్మే. అందుకే పెద్దవాళ్ళు , తల్లీ పిల్లల బంధాన్ని పేగుబంధం అంటారు. ఆ అనుబందం మానసికానుబందం. మాటలతో నిర్వచించలేని. ఆ ఆప్యాయతకి అర్ధము ఏ డిక్షనీర్ లోనూ దొరకనిది.

అందుకే నాకూ మా అమ్మంటే చాలాఇష్టం. ,