Sunday, March 21, 2010

మిస్టర్ . పెళ్ళాం ?????


మాఏమండీ గారు  , రాజమండ్రి పని మీద వెళుతున్నాను వస్తావా ? అని అడగ్గానే సరే సరే అని ఎగిరి గంతేసి ఒప్పుకున్నాను . కాని మీకు పని వుందన్నారు ఎంతసేపో అని అనుమానం వెలిబుచ్చితే , అదెంత సేపులే , ఓ గంట లో ఐపోతుంది , ఆ తరువాత ఐ విల్ బి అట్ యువర్ సర్వీస్ . అని వాగ్దానం చేసేసారు . రాజమండ్రి ఎన్ని సార్లు వెళ్ళినా , పూర్తిగా చూడ లేదు , పోయినసారి గుళ్ళూ గోపురాలు చూపించారు , ఈ సారి కోనసీమ సైట్ సీయింగ్ కెళుదాము అనగానే , నీ ఇష్టం ఒక గంట లో నా పని పూర్తికాగానే , నువ్వెన్ని రోజులన్నా , ఎక్కడికన్నా నేను రెడి .అనేసారు అహా ఏమి నాభాగ్యమూ అని పాడుకుంటూ , నేను రాజమండ్రి వెళుతున్నానోచ్ అని వూరూ వాడా చాటింపేసి కార్ ఎక్కాను .

పొద్దున బ్రేక్ ఫాస్ట్ కాగానే , ఓ గంటలో వచ్చేస్తాను , రెడీ గా వుండు అన్నారు మావారు . ఈ లోపల నువ్వు రెండు నవల్స్ తెచ్చుకున్నావుకదా , అవి చదువు , ఇక్కడి నుండి గోదావరి ని చూడు అని సలహా ఇచ్చారు . గంట అంటే , నేను రెండు నవలలు చదివేంత సేపా ? రెండు నవలలేం ఖర్మ , స్వాతి కూడా తెచ్చుకున్నాను అన్నాను . మరింకేం, ఓ గంటలో రాగానే ఐ విల్ బి ఎట్ యువర్ సర్వీస్ మేడం అంటూ వెళ్ళి పోయిన మనిషి , సాయంకాలం ఏడు గంటలకు వచ్చారు . రాగానే సినిమా చూస్తావా ? అంటూ పక్కనున్న అసిస్టెంట్ తో ఏం సినినా బాబూ అది , ఏం మాయచేసావోకాని కదా , పద పద అని హడావిడిగా , నన్ను ఇంకో మాట మాట్లాడ నీయకుండా తీసుకెళ్ళారు . హుం వెళ్ళిన కాసేపటికే ఇంటర్ వెల్ !!! నేనొప్పుకోను నేనొప్పుకోను అంటున్నావా అని ఓ జోక్ . ఏమన్నా ఏం లాభం ?? తిరిగొచ్చేటప్పుడు , మహేష్ మనము వెళ్ళిన సినిమా హాల్ పేరేమిటి ? అని డ్రైవర్ ని అడుగుతే ఏమో మేడం అని చాలా వినయంగా జవాబిచ్చాడు .

పొద్దుటి నుండి మల్లాది నవల , ఎంతేంత దూరం చదువుతూ , మద్య మద్య లో గోదావరిని తీసిన ఫొటోలు ఇదిగో ఇవి .ఆ నవల కూడా పూర్తిగా చదివేసానకోండిమరునాడు పొద్దున షరా మామూలే !! ఓ గంటలో వచ్చేస్తాగా , రాగానే ఐ విల్ బి ఏట్ యువర్ సర్వీస్ . అప్పటిదాకా ఇంకో నవల చదివేయి . ఇంచక్కా గోదావరిని చూస్తూ వుండు . గోదావరినా ? అసలు ఇక్కడి నుండి కనిపిస్తోందా అని ఉక్రోషం గా అన్నాను . మాట్ల్లడకుండ వెళ్ళి , ఐదు నిమిషాలలో వచ్చేసారు . వచ్చేసారా అని ఆనందం ప్రకటించేలోపలే , పద పద అన్నారు . ఎక్కడికి అంటే చెప్తాగా పద అన్నారు . వెనుకాలే బాయ్ లగేజ్ తీసుకొని వస్తోంటే , ఏమిటీ అంటే పెద్ద సస్పెన్ మేంటేన్ చేస్తూ లిఫ్ట్ లో పై ఫ్లోర్ కు తీసుకెళ్ళారు . ఇదో చూడు , ఈ ఫోర్ నాట్ వన్ రూం నుండి , గోదావరి వ్యూ ఎంతబాగుందో అన్నారు . మరి త్రీటెన్ నుండి గోదావరి వ్యూ సరిగ్గా లేదన్నావు కదా అందుకే రూం మారిపించాను . ఏమిటీ నా మొహం అలా చూస్తున్నావు ? అన్నారు . ఏం లేదండి , మిస్టర్ పెళ్ళాం లో ఆమనిని బురిడీ కొట్టించిన రాజేంద్ర ప్రసాద్ , మీ మొహం లో కనిపిస్తున్నాడు అన్నాను . సరె సరె లే ఓగంట లో వస్తాను రాగానే . . . ఒకే వెళ్ళిరండి అని పంపించి , "నమ్మరాదే చెలి ఈ మగవరిని నమ్మరాదే చెలి" అని ఆమని పాటి కూనిరాగాలు తీస్తూ, వల్లూరి లక్ష్మి రాసిన అనూహ్య తీరాలు నవల చదువుతూ మధ్య మధ్య లో గోదావరిని చూస్తూ తీసిన ఫొటోలు ఇవి !!!త్రీ టెన్ రూం నుండి , ఫౌర్ నాట్ వన్ రూం నిండి గోదావరి ని ఇంకా చాలా ఫొటోలే తీసాను . అన్ని పెడితే నా బ్లాగ్ గోదాట్లో మునిగి పోతుందేమో ననే భయం తో అన్నీ పెట్టటము లేదు .

ఏమండీ , సాయంకాలము వస్తూనే సారీ మాలా రేపు పొద్దున్నే హైదరాబాద్ వెళ్ళాలి .అనుకోకుండా డైరెక్టర్ గారి తో మీటింగ్ వచ్చింది . నెక్స్ట్ వీక్ వద్దాము . అప్పుడు నీ ఇష్టం వచ్చినన్ని రోజులు వుందాము . కోనసీమ అంతా తిగుదాము . ఈ పని కాగానే ఐ విల్ బి . . .
అవునులెండి , యూఅర్ ఆల్ వేస్ ఎట్ మై సర్వీసే . ఇహ చేసేదేముంది ? పదండి పోదాం . . . . .
ఇంకేముంది ? ఇహ ఇంతేసంగతులు చలో హైదరాబాద్ .

Wednesday, March 17, 2010

మల్లెలు మల్లెలు - 2గల గల పారే సెలయేళ్ళు . . . పక్షుల కిల కిలా రావాలు ... రా రమ్మంటూ ఆహ్వానించే కోయిల స్వరాలూ ..... నెమళ్ళ నృత్యాలూ ... చల్ల గాలులూ .... ఆహ్లాదపరిచే చెట్లు ......
" అమ్మా , మల్లెపూలు కావాలా ? "
చదువుతున్న పుస్తకం లోనుంచి తలెత్తి చూసి , ఓహో మల్లెపూలొచ్చేసాయా అనుకుంటూ , రా బాబూ అని పిలిచి , మల్లెపూలు చూస్తే హామ్మ్ ఎంటి బాబూ ఇవి మల్లెపూలేనా ? ఇంత చిటుకు పుటుకు వున్నాయి ? అని అడిగితే , అమ్మా చిన్న పూలే మంచి వాసన వస్తాయమ్మా అన్నాడు . " సరే కానియ్ మూర ఎంత ? "
" 15 రూపాయలమ్మా "
" పదిహేనే !!! "
" అవునమ్మా , మీకు కాబట్టి పదిహేను . వేరేవాళ్ళకైతే 20 "
" ఎందుకేమిటి ? "
" మీరు దేవుడి కోసం అని కూడా ఐదు మూరలు తీసుకుంటారు కదమ్మా అందుకని " .
ఇంత సెంట్ ( సెంటిమెంట్ కు మేము పెట్టుకున్న పేరు ) కొట్టాక తీసుకోక చస్తానా ?????ఇదిగో ఈ మల్లెల దండ ఖమ్మం ది . అదేనండి బాబు , మా అత్తగారి వూరిది . ఎంత సువాసనలను వెదజల్లుతోందో కదా ? ఎంతైనా అత్తింటిది కదా !!!ఇదిగిదిగో ఈ సుమమాల భద్రాది రామయ్య , గళసీమను అలంకరించిన పుణ్యాత్మురాలు . " మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి " అని సీతమ్మను వేడుకుంటే , దయతో , రాములవారు మాకు అనుగ్రహించిన మాల ఇది .అహా , ఓహో ఏమి వగలు పోతున్నాయండి !! అవును మరి ఎంతైనా గొదావరమ్మ వడిలోని , రాజమహేంద్రవరం పూలు కదా మరి ." ఆ అంటే అమలాపురం " అయ్య బాబోయ్ ఇదేమిటి ? , అమలాపురం లోని ఈ మల్లెలను చూడగానే ఈ పాట గుర్తొచేసింది ?????మా విజయవాడ మల్లెల రూటే వేరండి బాబు . ఎంతైనా మా కృష్ణా జిల్లావి కదా . ఏదేశమేగినా పుట్టింటి మమకారమే వేరు మరి .

ఏవూరైనా మల్లెల సౌరభాలే సౌరభాలు ..... పాపం మల్లెకు ,ఈ వూరని , ఆ వూరని , ఈ దేశమని , ఆ దేశమని బేధభావమే లేదు . తెల్లని స్వచ్చమైన పాల వంటి రంగు , సుకుమారము , మృదుత్వము కలగలుపుకొని , ఒక్క పువ్వు వున్నా చక్కటి సువాసనలతో తన వునికిని చాటుకుంటుంది . భగవంతుని అర్చించినా , అమ్మాయి జడకు ఆభరణ మైనా దాని అందమే అందం !!! మల్లెల తో ఎన్ని రకాల జడలు వేయవచ్చో . వంకీ జడ , చందమామ జడ , నిలువు జడ , అబ్బో ఎన్నో రకాలు . అందులోనూ , కనకాంబరాలు , మరువం కలిపి వేస్తే , ఆ జంపు జడ , సొగసు చూడ తరమా ? వేసవి అంతా పూజా గది లో మల్లెల పరిమళాలే . వేసవి వేడి నుండి , మనలని రక్షించేందుకు వచ్చిన దేవదూత కదా ఈ బుజ్జి మల్లె పూవు .....

సరిగ్గా సంవత్సరము కిందట ,యాదృచికంగా జరిగిన సంఘటన తో (నేను అనుకోకుండా లింక్ వేసిన ), కూడలి లో వచ్చిన , నా మొదటి టపా " మల్లెలు మల్లెలు " . దానికి సీక్వెల్ రాద్దామనిపించి , ఈ వారం మేము చేసిన ప్రయాణము లో కొన్న మల్లె పూల తో ఇలా రాసేసాను .

మా అబ్బాయి తో పోట్లాడి , వాడి సెల్ తీసుకెళ్ళాను . కెమెరా కోసమే లెండి (.ఏం చేయను మరి , నాకు అలవాటైన మా వారి సెల్ ను దొంగోడెత్తు కెళ్ళాడు ). దానికి చార్జర్ తొందరగా ఐపోతుంది . పైగా దానిలో బోలెడు ఫీచర్స్ వున్నాయి . దాని తో ఏదో క్లిక్ చేయ బోయి ఏదో క్లిక్ చేసేయడము , అందులో రక రకాలా మెసేజ్ లు రావటము , నేను హైదరాబాద్ కాల్ చేసి మా అబ్బాయిని అడగటము , అబ్బో , బోలెడు కష్టాలు . ఎలాగో నానా తంటాలు పడి ఫొటోలు తీసాను . కాస్త నిద్ర మబ్బుల్లో వున్నట్లున్నాయి . ప్లీజ్ ప్లీజ్ ఎలాగో సద్దేసుకొండి . మిమ్మలిని కష్ట పెట్టినందుకు మన్నించేసెయండి . మనలో మనం అలా అలా అడ్జెస్ట్ ఐపోవాలన్నమాట !!!!!!!!!!!

Get this widget | Track details | eSnips Social DNA


ఇంకా కొన్ని మల్లెల పాటలను ఇక్కడ వినవచ్చు .

అందరికి ఉగాది శుభాకాంక్షలు .

Monday, March 8, 2010

మరుజన్మ అంటూ వుంటే * * * * *
కూ . . . కూ . . .
కుహూ . . . కుహూ . . .
కూ అనగానే కుహూ అని బదులిచ్చే కోయలమ్మను , మానుకోటలో ( మహబూబాబాద్ ) లో ఇంటి వెనుకనున్న మామిడి తోటలో వెతకటము మధురమైన , మరపురాని బాల్యస్మృతి . నల్లగా వుంటుంది . పొట్టి పిట్ట . అవునా ??? ఐతే ఏమిటంట ? పిట్ట కొంచం కూత ఘనం . ఎంత మధురం గా పలకరిస్తుందో !!! ఆ పలకరింపులో , ఆ ఆత్మీయతలో దాని రూపం గుర్తుకొస్తుందా ? కవి కలం నుండి కవిత గా ప్రాణం పోసుకుంటుంది . కుహూ కుహూ అనే కోయిల అంటూ ప్రేయసి ప్రియులను మధురూహలలో తేలిస్తుంది . వూరి పొలిమేరలోకి రాగానే కూ అంటూ అభిమానంగా కుశల మడుగుతుంది . గానకోకిలై , వసంత కోకిలై గాయణీమణుల గళసీమ నుండి మధురం గా తేనలొలికిస్తుంది . దానికెంత మంది ఆత్మీయులో ! అసలు కోకిలమ్మ పెళ్ళికి వూరంతా సందడే సందడి .

రూపం కాదు కావలసినది , చక్కటి , ఆత్మీయమైన మాటలు , మంచి ప్రవర్తన అనేందుకు సాక్షం కోకిలమ్మే ! నోరు మంచి దైతే వూరు మంచి దౌతుందనే సామెత , కోయిలమ్మను చూస్తే నిజమనిపిస్తుంది .

నాకు , మరుజన్మ అంటూ వుంటే , ఆ జన్మను ఎంచుకునే అవకాశమే వుంటే , కోయిల గా పుట్టి * * * గున్నమామిడి గుబురులో కొమ్మమీద హాయిగా వాలి , మావి చిగురు తింటూ కుహూ . . . కుహూ . . . అని గొంతెత్తి పాడుకుంటూ , అందరి అభిమానాన్ని పొందుతూ , అమాయకంగా , రాగ ద్వేషాలకు అతీతం గా వుండాలని వుంది !!!!!!!!!!!!

విరుద్ధ రూపాలు, స్వభావాలు కల వారి మధ్యనే స్నేహితము బాగా కుదురుతుందట కదా !!!

Get this widget | Track details | eSnips Social DNA
ఇంకా కొన్ని కోయిల కుహు కుహు లు ఇక్కడ .

Friday, March 5, 2010

హాపీ బర్త్ డే మేఘ

చెన్నైలో , మొదటిసారి మేఘ , బూరెబుగ్గల తో , నల్లటి కర్లీ హేర్ తో , చక్రాలాంటి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ నా వైపు చూడగానే , అబ్బ ఎంత ముద్దుగా వుందో ! నా మనవరాలేనా !!! నా దిష్టే తగిలేట్టుగా వుంది అనుకొని మురిసి ముక్కలైపోయి , అప్పుడే " రాణీ యమ్మ " అని పేరు పెట్టేసుకున్నాను .

కొత్తగా మాటలు వచ్చేటప్పుడు , నా మీద ఏమైనా కంప్లైంట్ చేయాలంటే " చూడు తాతా నీ నైఫ్ " అనేది . " అవునమ్మా మీ బామ్మ నాకు నైఫే " అనేవారు తాత . ఏమిటీ నేను నైఫ్ నా అంటే కాదు బామ్మా నువ్వు తాత లైఫ్ అనేది . అంతే అంతే అని తాత తలాడించేవారు . పాపం చాలా సంవత్సరాలవరకు , వైఫ్ అంటానికి , నైఫ్ అనో , లైఫ్ అనో తడబడి పోయేది . నిద్ర లో " డాడీ " అని కలవరించగానే " వస్తున్నా బంగారుతల్లీ " అంటూ తాత లేచి పరుగెత్తుతారు . అయ్యో అది మీ అమ్మాయికాదు , మిమ్మలిని పిలువలేదు , వాళ్ళ డాడీ ని పిలిచింది అని నేనంటున్నా వినీపించుకోరు . ఎంతైనా మా రాణియమ్మ తాత కూచ్ .

" ఈస్ట్ ఆర్ వెస్ట్ " అని మేఘ అనగానే , పక్కనుండి తమ్ముడు " మేఘా ఈజ్ బెస్ట్ " అనాలన్నమాట .( కాకపోతే , మేఘ లేనప్పుడు , వాడు ఈస్ట్ ఆర్ వెస్ట్ అంటే నేను గౌరవ్ ఈజ్ బెస్ట్ అనాలనుకోండి , అది వేరే సంగతి .)

సో, ఈస్ట్ ఆర్ వెస్ట్ మా రాణీయమ్మ ఈజ్ బెస్ట్ !!! మా రాణీయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు .