Friday, March 31, 2017

అలా జరిగింది!
అలా జరిగింది!
పుస్తకావిష్కరణ సభలకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు , పి.యస్.యం లక్ష్మిగారు, ఇక నెక్స్ట్ మీదే అనేవారు.నాదా? నావెవరు కొంటారండి. పుస్తకాలు నేను అమీర్పేట చౌరస్తాలో ట్రాఫిక్ పోలీస్ పక్కన నిలబడి అందరి కీ పంచాల్సిందే అనటము మాకు అలవాటైపోయింది. మధ్య ఒక సభలో కస్తూరి మురళికృష్ణ గారు ,మీవెన్ని కథలయ్యాయండి అని అడిగారు.దాదాపు పదిహేనండి అన్నాను.ఐతే ఇక మీ కథలు బుక్ వేయించేద్దాం అన్నారు.నేను నవ్వి ఊరుకున్నాను.ఇదే విషయం ఓసారి మా కోడలు అనూ ఫోన్ చేసినప్పుడు అన్నాను.వేయించవచ్చుకదా ఆంటీ అంది.ఎందుకమ్మా దగరదగ్గర 20/30 వేలు ఖర్చుపెట్టాలి. పైన పుస్తకాలన్నీ చూసుకుంటూ నేను దిగులుపడాలి.అంత మనీ అలా ఖర్చుపెట్టటం నాకిష్టం లేదు అన్నాను.ఐతే నేను బుక్స్ చేస్తాను మెటీరియల్ నాకు పంపండి అంది.అదో అప్పటి నుంచి, అంటే నాలుగునెలలైందేమో, ఎక్కడెక్కడో ఉన్న నా కథలూ , సమీక్షలూ అన్ని వెతికి పట్టుకొని, వాటిని దిద్ది,సరిచేసి తనకు పంపాను.ఆంటీ చాలా మిస్టేక్స్ వస్తున్నాయి అనేది.ఎంత కళ్ళుపొడుచుకొని చూస్తున్నాను అనుకున్నా ఇలా ఐతోందేమిటి అని , తప్పులు దిద్దేందుకు మా చెల్లెలు జయ, ,జి.యస్ లక్ష్మి గారి హెల్ప్ తీసుకున్నాను.ఐనా కొన్ని వచ్చాయి.మొత్తానికి నా వర్డ్ లోనే ఫాంట్ ప్రాబ్లం అని తేలింది.ఇక మా అబ్బాయి రంగం లోకి దిగాడు.నా స్క్రీన్ షేర్ చేసుకొని ఫాంట్ సరిచేసాడు.అమ్మయ్య ని ఊపిరి పీల్చుకొని, మళ్ళీ అంతా కరెక్ట్ చేసి, జయకు, లక్షి గారికి ఓసారి ఫైనల్ గా చూపించి పంపాను.అనూ కూడా ఓకే అంది.ఇక కవర్ డిజైన్!నేను పంపిన ఫొటో తనకు నచ్చదు.ఏమనుకోకమ్మా ఇది సరిగ్గాలేదు అంటే ఎందుకనుకోను అనుకుంటాను,మీరు వదిలేయండి నేను మాడ్ గా చేస్తాను అని ఎక్కడెక్కడి నుంచో ఇమేజెస్ తెచ్చి,వాటిని కొని రెండు పుస్తకాలకూ డిజైన్ చేసింది.మళ్ళీ నా ఫొటో పెడతానంటుంది.మీ గురించి మీరు చెపుతారా నేను రాసేయనా అంటుంది.దేవుడా ఎక్కడి పిల్లవమ్మా అని ఏదో నా గురించి నేను రాసుకొని ఫొటో ఇచ్చాను.మీ బుక్స్ రెడీ అని పంపేసింది.ఐతే అవి నువ్వే ఆన్ లైన్ లో ఉగాది పండుగ రోజు అవిష్కరించేయి అన్నాను.అలా మా కోడలి ప్రొత్షాహం,కష్టం తో నా బుక్స్ రెడీ అయ్యాయి.
నా బుక్స్ రెడీ అన్నాను లక్ష్మిగారితో, ఐతే పార్టీ అన్నారు.ఇందులో ఏముందండీ పార్టీ కి అన్నాను.మిమ్మలిని కాదు, మేజర్ గారిని అడుగుతాను,ఆయనైతే ఫైవ్ స్టార్ హోటల్ లో ఇస్తారు అన్నారు.నేను నవ్వి ఊరుకున్నాను.మా వదినగారికి, తోటి కోడలికి , చిన్న ఆడపడుచు విజయకు చెప్పి సెల్ల్ లో చూపించాను.ఇలా కాదు పార్టీ కావాలి అంది విజయ.అసలే తనకు ఇలాంటివన్నీ అంటే ఉషారు.వద్దులే అన్నాను.మీరు పిలిచినా పిలవకపోయినా నేను ప్రశాంత్ ఉగాదిరోజు లంచ్ కు వస్తున్నాము అంది మా చెల్లెలి కోడలు రష్మి.ఐతే మీ అత్తగారిని మామగారిని కూడా తీసుకొనిరా అన్నాను.కాదక్కా ఉషా వాళ్ళందరినీ కూడా పిలువు సరదాగా చేసుకుందాము అంది మా చెల్లెలు.ఇక మా కోడలు, అమ్మాయి ఒకటే గొడవ చిన్నగా అన్నా చేయి అని.మేము రికార్డ్ బుక్స్ పిడియఫ్ తో చేయించేవాళ్ళము, కనీసం అలా ఒక కాపీ అన్నా చేయించండి బాగుంటుంది అంది కోడలు.ముందే మా ఏమండీ పార్టీలా చేద్దాము అంటే వద్దన్నాను. ఉగాది ముందు రోజు ఏమనుకున్నారో , కోడలు చెప్పినట్లు,ఎదురుగా ఉన్న జెరాక్స్ సెంటర్ కు వెళ్ళి రెండు పుస్తకాలూ నాలుగేసి కాపీస్ తీయించుకొచ్చారు.అవి చాలా బాగా వచ్చాయి.ఇంతమంది నా కోసం ఆలోచిస్తూ ఉంటే నేనెందుకు వద్దనాలి, ఎవరూ లేనట్ల్లు ఒక్కదాన్నే బ్లాగ్ లో ఎందుకు పెట్టేసుకోవాలి అని సెంటిమెంటల్ గా ఫీలైపోయి, ఏమండీ తో చిన్న పార్టీ ఇద్దామండి అన్నాను.ఎవరెవరి ని పిలవాలో నువ్వే చెప్పు అన్నారు.అప్పటికే రాత్రి ఎనిమిదైపోయింది.తెల్లవారితే పండగ.ఎక్కువ మందైతే ఇంట్లో సరిపోరు.అని కొంత మంది కే చెప్పాను.కుటుంబసభ్యులనందరికీ ఫోన్ చేసి చెప్పారు.మా డ్రైవర్ మహేష్,వాచ్ మాన్ సరేంద్ర సహాయముతో చక చకా ఏర్పాట్లు చేసారు.మా చిన్నాడపడుచు ఉష కు వంటిల్లు అప్పచెప్పేసాను.మా మేనకోడళ్ళు, రష్మి అందరూ వడ్డనలోకి వచ్చేసారు. మావారు అడగగానే లక్ష్మిగారు కార్యక్రమం జరిపించే భాద్యత తీసుకొని చక్కగా అవిష్కరణలు జరిపించేసారు.షరా మామూలుగానే నేను టెన్షన్ పడుతూ ఉండగానే ,అందరూ కలిసి నా ఫంక్షన్ ను అనుకోని విధం గా విజయవంతంగా చేసేసారు.
సాదరంగా ఆహ్వానించలేదు అని అనుకోకుండా మా వియ్యాలవారు , అల్లుడి అమ్మగారు నాకిష్టమని ఐస్క్రీం, కోడలి అమ్మగారు పసుపు,కుంకుమ, చీర, వారింట్లో పూయించిన మరువం గులాబిలతో చిన్న బుకే చేసి తీసుకొని వచ్చారు.రాత్రి పది గంటలకు మెసేజ్ బాక్స్ లో మెసేజ్ పెట్టినా సుందరి నాగమణి వాళ్ళ వారి తో, లక్ష్మిగారు ప్రొఫెసర్ గారితో వచ్చారు.సీనియర్ రైటర్ ,పెద్దావిడ డి.కామేశ్వరి గారు, మెసేజ్ కే స్పందించి ఇంత దూరం ఇల్లు వెతుకుంటూ రావటం చాలా చాలా సంతోషం అనిపించింది.అది నా అదృష్టం గా భావిస్తున్నాను.
ఎంతబాగా జరిగినా అందరు ఆత్మీయులనూ పిలవలేకపోయానే అని చిన్న అసంతృప్తి మటుకు కొద్దిగా ఉంది.మీ అందరీ విషెస్ నాకు ఉంటాయనే భావిస్తున్నాను.
ఇంత మంచి కుటుంబాన్ని, స్నేహితులను నాకు ఇచ్చిన దేవదేవుని కి సదా కృజ్ఞురాలిని .
Saturday, March 11, 2017

రౌడీ గారి తో భేటీ!


కొన్ని పాత విషయాలు తలుచుకుంటే చాలా గమ్మత్తుగా అనిపిస్తాయి.అసలు అప్పుడు అంత పిచ్చిమొహంలా ఎలా బిహేవ్ చేసానా అనిపిస్తుంది.అలాంటిదే సంఘటన. ఇదీ బ్లాగ్ కు సంబందించిందే.నాకు లాప్ టాప్ ఇచ్చినప్పుడు మా అబ్బాయి చాలా స్ట్రిక్ట్ గా,తెలీని వాళ్ళ తో మాట్లాడకు వగైరా వగైరా చాలా చెప్పాడు.నాకూ , మా మనవరాలికీ , మనవడి కీ కలిపి ఒకే లాప్ టాప్ ఇచ్చాడు.అందులో నాకు అడ్మింట్రేషన్ పవర్ కూడా లేదు.రోజూ మా ముగ్గురి బ్రౌజ్ హిస్ట్రీ, మేయిల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉండేవాడు.అదో రోజులల్లో సారి, జ్యోతి. నిడదవోలు మాలతిగారు వచ్చిన సంధర్భంగా  సుజాతగారింట్లో గెట్ టుగేదర్ ఉంది రండి అన్నారు.అప్పటికే ఓసారి జ్యోతి తో కలిసి ఓల్డేజ్ హోం కు వెళ్ళి ఉండటం వల్ల (అప్పుడు మా ఏమండీ పర్మిషన్ , మా వాడికి తెలీకుండా తీసుకొని వెళ్ళాను లెండి.)  మా అబ్బాయి వెళ్ళేందుకు పర్మిషన్ ఇచ్చాడు.సరే అమీర్ పేట్ చందనా బ్రదర్స్ దగ్గర జ్యోతి పికప్ చేసుకొని తీసుకెళ్ళింది.అంతకు ముందే నేనెవరో ఎవరికీ తెలీదు కదా అని మొహమాట పడితే పరవాలేదు, మీ బ్లాగ్ పేరు చెప్పి మీ పేరు చెప్పి పరిచయం చేసుకోండి అంది జ్యోతి.అలాగే బెరుకు బెరుకుగా అందరినీ పరిచయం చేసుకొని , వరూధిని పక్కనే కదలకుండా కూర్చున్నాను :) ముందుంది మొసళ్ళ పండగ అని తెలీక, పరవాలేదు బాగానే గడిచింది అనుకొన్నాను .
మరునాడు నా బ్లాగ్ లో మీటింగ్ గురించీ, జ్యోతి ని అడిగి ఫొటోలు తీసుకొని(అప్పుడు నాకు కెమెరా కాని సెల్ కాని ఏవీ లేవు మరి) పోస్ట్ ఏదో నాకు తోచినట్లుగా రాసుకున్నాను.అప్పుడే ఎవరో కూడా ఫొటో పెట్టి పోస్ట్ వేసారు.అందులో కొత్త బ్లాగర్ ఎవరో సాహితి అట , ఆవిడ తన బ్లాగ్ పేరు చెప్పుకుంటూ తిరిగింది అని రాసారు.అది చదవగానే చాలా దుఃఖం వచ్చింది నేను డప్పు కొట్టుకున్నానా అని :( అది చాలదన్నట్లు కామెంట్స్ లో ఎవరో మలక్ పేట్ రౌడీ అట నేను పాతకాలం దాన్ని అందుకే మా వారి పేరు తగిలించుకున్నాను అని వెక్కిరించాడు.అసలే దుఃఖం లో ఉన్నానేమో ఇంకా ఉక్రోశం, ఆవేశం వచ్చేసాయి.అసలు ఇప్పుడే నన్నెవరన్నా పెద్దదాన్ని అంటే ఊరుకోను. మధ్య మా ట్రేనర్ కు కూడా స్పీచ్ ఇచ్చాను.అలాంటిది అప్పుడు ఊరుకుంటానా?ఏమనుకుంటున్నావు నువ్వు మలక్పేట్ రౌడీవవుతే , మా దగ్గర యూసుఫ్ గూడా రౌడీలున్నారు ఖబడ్దార్ అనేసాను.
ఇహ చూస్కోండి అన్ననే కాని చ్చేంత భయం.ముందు మా అబ్బాయేమంటాదో నని, రెండోది రౌడీ ఇంటిమీదికి వస్తాదేమోనని.మా ఏమండీ టైం కు వెళతారో, టైం కు వస్తారో తెలీదు.నెలలో మూడొంతులు కాంప్ లోనే ఉంటారు.కొడుకూ కోడలూ అంతే సమయం లేని ఉద్యోగాలు.ఇక ఇంట్లో ఉండేది నేనూ, పనమ్మాయి శారద 18 ఏళ్ళది, ఐదేళ్ళ మనవరాలు, మూడేళ్ళ మనవడూ!వాళ్ళిద్దరూ బుజ్జిపిల్లలు.వాళ్ళేమీ చేయలేరు.శారద నాకంటే ధైర్యస్తురాలే కాని రౌడీ నీ ఎదుర్కొనే ధైర్యం ఉందా అని.ఇంకో పనమ్మాయి సరస్వతి వచ్చిపోతూ ఉంటుంది.ఇద్దరినీ ఎందుకైనా మంచిదని మీకెవరైనా రౌడీలు తెలుసా అని అడిగాను.సరస్వతి నేను పని చేసే ఇంకో ఇల్లు పెద్ద రౌడీ దమ్మా, రోజూ పొద్దున్నే ఆయన దగ్గరకు చాలా మంది రౌడీలు వస్తుంటారూ , అయ్యకు చెప్పనా అంది.వద్దు అని,అయ్యబాబోయ్ ఇక సరస్వతి ని చూసినా భయమే!మా పక్క ఇల్లు విలన్ల డెన్. అదే లెండి సినిమాలోది.అక్కడ విల్లన్ల మీద షూటింగ్ అవుతూ ఉండేది అప్పట్లో.అంతా పెద్ద పెద్ద విలన్ల్ లాగా ఉండే వాళ్ళు.వాళ్ళల్లో ఎవరు రోడ్ మీద కనపడ్డా మా మనవరాలు , బామ్మా నీ రౌడీ వచ్చాడు అని అరిచేది. నా గుండె ఢాం.అసలు బాల్కనీ లోకి వెళ్ళటమే మానేసి,తలుపులు కూడా మూసేసాను.రెండు రోజుల తరువాత ఇక టెన్షన్ ఆపుకోవటం నా వల్ల కాలేదు.చిన్నగా మా అబ్బాయి తో "బాబా మీ ఫ్రెండ్ ప్రశాంత్ ఇంటిపక్కన ఒకతను సినిమాల్లో రౌడీ గా వేసేవాడు కదా ( క్షణం క్షణం సినిమాలో విలన్ పక్కన , విలన్ నర్సింగ్ అని పిలవ గానే వచ్చేవాడు అతను) అతను నిజంగా రౌడీనా"? అని అడిగాను.ఎందుకు మాతే అన్నాడు. పక్కనే ఉన్న మా కోడలు , అప్పటికే శారద, మా మనవరాలు తనకి చెప్పినట్లున్నారు, "ఏం కాదాంటీ. రౌడీ కూడా రౌడీ అని పేరు పెట్టుకోడు .భయపడకండి. మీ ఫ్రెండ్ జ్యోతి ని అడగండి.ఆవిడ చాలా ఏళ్ళ నుంచి బ్లాగ్ ల్లో ఉన్నారు కదా తెలిసి ఉంటుంది." అంది.ఇక తప్పక మా వాడికి సంగతి వివరించి ,నాలుగు చివాట్లు తిని, జ్యోతి ని అడిగాను అతనెవరు? అని.హోరినీ మీరది సీరియస్ గా తీసుకున్నారా? అతను సాఫ్ట్ వేర్ ఇంజనీర్.సరదాగా రౌడీ అని పేరు పెట్టుకున్నాడు.అసలు అతను ఇండియాలో ఉండడు.యు.యస్ లో ఉన్నాడు అంది.అమ్మయ్య అసలు దేశం లోనే ఉండడుకదా అని ఊపిరిపీల్చుకున్నాను. ఇదీ రౌడీ గారి తో భేటీ కథ.అప్పుడు ఎందుకు అంత భయపడ్డానా అని ఇప్పుడు నవ్వుకుంటాను.

ఆ తరువాత ఆ రౌడీ కూడా మంచి ఫ్రెండ్ అయ్యాడు.నా పుట్టినరోజున పోన్ చేస్తే ఒక్క క్షణం పోల్చుకోలేకపోయాను.ఆ తరువాత చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాము.అప్పుడే వాళ్ళ అమ్మగారి తో పాట వ్రాయించి , పాడించి నాకు బహుమతి గా ఇచ్చాడు.ఆ పాట ఎక్కదో దాచాను కూడా.ఆ తరువాత జ్యోతి పుట్టిన రోజు ప్లాన్ చేసి అందరి బ్లాగ్ లల్లో, జ్యోతి మీద పోస్ట్ వ్రాయించాము.ఆ రోజు కూడలి లో ఓపెన్ చేయగానే అన్నీ జ్యోతి మీద పోస్ట్ లే.ఎవరో కామెంట్ చేస్తే నాకు తెలీకుండా మా ఫ్రెంద్స్ ఇలా కూడలిని కబ్జా చేసారు అని సంజాయిషీ ఇచ్చుకుంది పాపం.ఆ తరువాత జ్ఞాప్రసూనగారింట్లో రౌడీగారి అమ్మగారిని కలిసాను.ఆవిడతో చెపితే, వాడంతేనండీ అందరినీ ఏడిపిస్తూ ఉంటాడు.ఏమైనా అంటే గాంధారి కి ధుర్యోధనుడు పుట్ట్లేదు అలా అనుకో అంటాడు అన్నారు సీతాదేవిగారు, రౌడీ గారి అమ్మగారు.ఇద్దరమూ నవ్వుకున్నాము.ఇంతా చేస్తే ఆ రౌడీగారు మా అమ్మాయి వయసే :)

గెట్ టుగేదర్ తరువాత బ్లాగ్ ల్లో అబ్బాయిలు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సుజాత గారు యు.యస్ వెళుతూ ఇచ్చిన పార్టీ లో చాలా మందిని కలిసాను.అప్పుడప్పుడు జరిగి మా గెట్ టుగేదర్ ఫొటోలు ఇవి.

Wednesday, March 8, 2017

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం .
అది 2009 మార్చ్ 8.పొద్దున మా చెల్లెలు ఫోన్ చేసి"అక్కా రొజు ఆంధ్రజ్యోతి పేపర్ లో బ్లాగ్ గురించి ఇచ్చారు చూసావా ?" అంది.ఎక్కడా ఇంకా పని కాలేదు చూస్తాను అని వెంటనే చూసాను.అరుణాపప్పు అందులో బ్లాగ్ గురించి, అందులో మహిళా బ్లాగుల గురించి రాసింది.దానిలోనే "కూడలి" అనే చోట అన్ని తెలుగు బ్లాగ్ పోస్ట్ లు రోజు వి రోజు వస్తాయని చదివి కూడలి లో నా బ్లాగ్ కూడా చేర్చాను.అలా అలా  కూడలి లో అన్ని బ్లాగ్ లల్లో విహరిస్తూ ఉండగా "థాంక్ యు" అని పోస్ట్ కనిపించింది.థాంక్ యు మీద పోస్ట్ నా అని చదివి అందులో నా అభిప్రాయం కూడా వ్రాసాను.దానికి బ్లాగర్ సమాధానం ఇచ్చింది.ఇద్దరమూ దాని గురించి కాసేపు చర్చించుకున్నాము.అదో అలా పరిచయం అయ్యింది, బ్లాగర్, మా గురూజీ జ్యోతి వలబోజు. రోజు మాలా గారు ప్రమదావనం లో చేరుతారా అని అడిగింది.నాకు అలా చేరటం ఇష్టమేనండి కాని నేను బయటకు మీటింగ్ కు రాలేను.అన్నాను.మీరు బయటకు రానవసరం లేదు మేయిల్ లోనే అన్నరు.మేయిల్ లో ఏమిటీ అని తెగ హాచర్యపోయి సరే అన్నాను.ప్రమదావనం ఎవరిని చూసినా తెగ ఆశ్చర్యం వేసేది.అందరూ బ్లాగ్ లు చాలా బాగా వ్రాసేవారు. జ్ఞాన ప్రసూన గారి చూసి చాలా ఆశ్చర్యంగా ఉండేది.రచనలు, పేంటింగ్ లు, బొమ్మలు చేయటము ఒకటారెండా ఆవిడ కు రాని విధ్యలేదు.లక్ష్మీ రాఘవ గారు, జి.యస్ లక్ష్మి గారు, సి.ఉమాదేవి గారు, సుభద్రావేదుల ఇలా అందరూ మంచి రచయిత్రులే! వాలు కొబ్బరిచెట్టు సుభద్ర కోనసీమ కబుర్లు చక్కగా చెప్పేది  కృష్ణవేణి ఒక్కతే హిమాలయాలల్లో ట్రెక్కింగ్ కు వెళుతుంది అంటే అమ్మో అనుకునేదానిని.! ఇక మమత పొటోషాప్ లో ఎక్స్పర్ట్.తన దగ్గర ఫొటో షాప్ నేర్చుకున్నాను.బయట 50000 వేలు ఫీజు అడిగారు.పాపం ఒక్క పైసా తీసుకోకుండా చక్కగా నేర్పింది మమత :) ఇలా మా ప్రమదావనం లో అందరూ ఒక్కొక్కదానిలో ప్రావీణ్యులే సరే రోజూ బోలెడు కబుర్లూ జోక్ లూ , పుట్టిన రోజు వేడుకలూ ఎన్ని సంబరాలో! ఇలా మేమందరమూ కాస్త ఆదమరిస్తే చాలు మా గురూజీ కొరడాతో వచ్చేసేది.పిల్లలూ వారం ఎవరెవరు ఎన్ని పోస్ట్ లు వేసారు? ఇదో వారం అందరూ సబ్జెక్ట్ మీద వ్రాయండి అనేది.దేవుడా అనుకుంటూ రాసేసేవాళ్ళము.అలా గొలుసు కథ కూడా రాసాము.గొలుసు కథ ఎవరు మొదలు పెట్టాలి , ఎవరి తరువాత ఎవరు రాయాలో షెడ్యూల్ ఇస్తూ నా పేరు కూడా చేరుస్తే షరా మామూలే గజ గజా! అబ్బే వింటేనా మహా మొండిది వ్రాయించింది.అంతేనా ? రాతలూ , కబుర్లూ,  ప్రోగ్రాం లే కాదు, వరూధిని సమాజ సేవ ప్రోగ్రాంలు ఫిక్స్ చేసేది.అందరమూ ఎవరికి తోచింది వాళ్ళు ఇస్తే డబ్బులు అవసరము ఉన్నవాళ్ళకు పంపేది.అలా చాలా మందికే ఇచ్చాము.ఓసారి ఓల్డేజ్ హోం లో కూడా ఇచ్చాము. సారి చలికాలం ఫుట్ పాత్ మీద పడుకున్న బిచ్చగాళ్ళకు దుప్పట్లు కూడా పంచాము.చెప్పాలంటే మా ప్రమదావనం ముచ్చట్లు చాలా ఉన్నాయి.

నా బ్లాగ్ ప్రస్థానం లో జ్యోతి సహాయము చాలా ఉంది.సింపుల్ గా ఉండాలని టెంప్లెట్ తెల్ల పేపరే పెట్టుకున్నాను. కాని అలా బాగుండదు, మీ పోస్ట్ లు చదవాలంటే కొంచం అట్రాక్టివ్గా ఉండాలి అని మార్చింది.సరే తరువాత మా కోడలు నాకు కావలసినట్లుగా డిజైన్ చేసింది అది వేరే విషయము :) నేను పోస్ట్ చేయటం ఆలశ్యం, మాలాగారు ఎన్ని తప్పులు వ్రాసారో చూసుకోండి అని మైల్ వచ్చేసేది! అబ్బ నన్ను చీల్చిచెండాడేస్తున్నావు తల్లీ అని విసుకున్నా ఊరుకునేదికాదు.కొన్ని బ్లాగ్స్ లింక్స్ ఇచ్చి వాళ్ళు ఎలా వ్రాసారో చదవండి అనేది.మీరు బాగా రాస్తున్నారు కాని ఇంకా బాగా రాయాలి అని నా రచనలకు పదును పెట్టింది జ్యొతినే! పోస్ట్ లో లింక్స్ ఇవ్వటమూ, పిక్చర్స్ ఇన్సర్ట్ చేయటమూ , పాటల లింక్స్ ఇవ్వటమూ ఇలా ఒకటేమిటీ ప్రతిదీ జ్యోతి నే నాకు నేర్పించింది. యూ ట్యూబ్ గురించీ తనే చెప్పింది.అందుకే జ్యోతి ని గురూజీ అని పిలుచుకుంటాను.అబ్బ ఎన్ని పనులు చేస్తుందో ఎంత ఓపికో అనుకునే దానిని. మొదటి సారి జ్యోతి ని ఓల్డేజ్ హోం కు వెళ్ళేటప్పుడు కలిసాను.మీరు అమీర్పేట్ చందనా బ్రదర్స్ దగ్గర ఉండండి , పికప్ చేసుకుంటాను అన్నది. నా ముందు జీప్ ఆగి , అందులో నుంచి జ్యోతి దిగినప్పుడు ఆమె ఫొటో చూసి ఉండటంవల్ల గుర్తుపట్టి అలా చూస్తూ ఉండిపోయాను.మీరు మాలాగారే కదా రండి అంది.నేను కదలకుండా అలానే చూస్తూ ఉంటే ఏమీటీ అలా చూస్తున్నారు రండి అంది.మీకు రెండు చేతులు , ఒక్క తలే ఉందే అని అప్రయత్నం గా అనేసాను.తను ఆశ్చర్య పోయి , ఏమిటీ నన్ను రాక్షసిని అనుకుంటున్నారా అని అడిగింది.అప్పటికి సద్దుకొని కాదు కాదు అన్నాను.అలా మేము మొదటిసారి, అమీర్ పేట్ చందనా బ్రదర్స్ ముందు కలుసుకున్నాము.
అప్పటి వరకూ ఓల్డేజ్ హోం కు వెళ్ళినప్పుడూ, సుజాతాగారింట్లో గెట్ టుగేదర్ లో నూ ప్రమదావనం సభ్యులం కొద్దిమందిమే కలిసాము.అలా కాదు అందరమూ మంచి ఫ్రెండ్స్ మి అయ్యాము ఓసారి కలుద్దాం అనుకున్నాము.జ్ఞానప్రసూనగారు బూరెలు పెడతాను మా ఇంటి కి రండ ర్రా పిల్లలూ అన్నారు.అంతే అందరమూ పొలో మంటూ వాళ్ళింట్లో వాలిపోయాము.psm.లక్ష్మి గారిని,g.s,లక్ష్మి గారు, ఉమాదేవి గారు అందరూ అప్పుడే పర్సనల్ గా పరిచయం అయ్యారు. పరిచయం మంచి స్నేహంగా మారి , నన్ను రచయిత్రిగా మార్చింది :) కలిసినప్పుడల్లా, ఒక్కోసారి ఫోన్ చేసి మరీ psm లక్ష్మి మీరు కథలు వ్రాయండి అని పోరేవారు.ఓసారి మేము నలుగురమూ మా ఇంట్లో కలుసుకున్నప్పుడు ముగ్గురూ నన్ను వేధించేసారు రాయాల్సిందే అని.మేము సహాయం చేస్తాము అన్నారు g.S,లక్ష్మి, ఉమాదేవి.అన్న మాట నిలబెట్టుకున్నారు.అమ్మో G.S లక్ష్మైతే జ్యోతి ని మించి స్ట్రిక్ట్.రోజూ ఎంతో కొంత రాసి పంపాల్సిందే.వక్క రోజు బద్దకించినా , రోజు మీరేమీ రాసి పంపలేదు అనేవారు.రోజూ ఏమి రాయండీ అంటే ఏదో ఒకటి.అన్నం తిన్నాను.పడుకున్నాను అనైనా రాయండి అనేవారు.ఏమండీ తో పొట్లాట వచ్చింది అని కూడా రాయనా అంటే రాయండి అన్నారు.ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ లో హోం వర్క్ చేసాను.మళ్ళీ ఇన్నేళ్ళ కి మమత, లక్ష్మిగారు నాతో హోం వర్క్ లు చేయించారు.అలా రచన ఒక వ్యసనం ఐపోయింది.రోజూ కొంచమైనా ఏదో ఒకటి రాయాల్సిన పరిస్థితి వచ్చింది :) రోజు సి.ఉమాదేవి గారు లేఖిని కి తీసుకెళ్ళి, బళ్ళో పిల్లలను చేర్చినట్లు ఫీజ్ కట్టి చేర్చి రచయిత్రి ని అనిపించారు!

మహిళాదినోత్సవం రోజున వీరందరినీ తలుచుకోవటం సముచితం గా భావిస్తున్నాను. సాహితీ వనం లో చిరు మొక్కగా నన్ను తీర్చిన,జ్యోతి,పి.యస్.యం. లక్ష్మి,జి.యస్.లక్ష్మి,సి.ఉమాదేవి గారు, మమత కు , అభివృద్ధికి కారణమైన ప్రమదావనం కు, ప్రమదావనం స్నేహితులకు ధన్యవాదాలు.

అందరికీ అంతర్జాతీయ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.