Sunday, August 21, 2011

మీరజాలగలడా నా ఆనతి

నారదమహర్షి , సువాసనభరితమైన , అందమైన పూవు నొక దానిని చేతబట్టుకొని వస్తున్నాడని సత్యభామాదేవి కి కబురందించింది చెలికత్తె . ఆ పూవునెలాగూ కృష్ణునికే సమర్పిస్తాడని , శ్రీక్రృష్ణుడు ఆపూవును తనకే ఇస్తాడని మురిసిపోతూ ఎదురుచూస్తూ కూర్చుంది సత్య . ఏదీ ఆ నారదు డూ ఎంత సేపటికీ రాడు . ఏమైనాడు చెప్మా అని ఆలోచనలో పడ్డది సత్య . పోనీ శ్రీకృష్ణుడూ ఇగో రాడు , అగో రాడు . ఏమైపోయారిద్దరూ ! అనితర్జన బర్జన్లు పడుతుండగా నారదుడు ఆ పుష్పాన్ని కృష్ణునికి ఇచ్చాడనీనూ , ఆ కిట్టయ్య దానిని రుక్మిణికి బహుకరించాడనీనూ తెలిసిపోయింది . భగ్గుమంది భామ హృదయం . అనదు మరీ ! ఇదేమైనా కాస్తో కూస్తో అవమానమా ! హన్నా . . . ఐనా ఆ వాసుదేవుని కి హెంత ధైర్యం ! భామను కాదని రుక్మిణికి ఇవ్వటమే ! ఈ అవమానాన్ని భరించేదిలేదుగాక లేదు ! పూవే కాదు ఆ పూల చెట్టునే తెచ్చేసి ఇమ్మంటాను . . . హమ్మా . . . హమ్మా . . . మీరజాలగలడా నా యానతి అని ప్రతిన బూనింది సత్యాదేవి .



అంతే అలకపానుపు ఎక్కేసింది . శ్రీకృష్ణ పరమాత్మ పడరాని తిప్పలూ పడ్డాడు . కాలు పట్టుకొని తన్నించుకున్నాడు కూడాను పాపం . ఏమిటీ పాపమా ? పాపం అట పాపం . ప్రియ సతి . . . ముద్దుల సతి అనగానే సరా . . . ముద్దూ ముచ్చటా తీర్చొద్దూ ! తప్పుచేస్తే తన్నరేమిటి ! అందుకేగా పద సఖీ అంటూ దేవలోకానికి ప్రయాణం కట్టాడు . అబ్బ ఎంత అందంగా వుందీ పారిజాత వృక్షం . పూవే కాదు వృక్షాన్నే తీసుకుపోదామంది సత్యభామాదేవి . మీరజాలగలడా ఆనతి * * * * *
దేవలోకాధిపతి తో యుద్దం చేసి , ఓడించి మరీ సంపాదించాడు పారిజాతవృక్షాన్ని . ఆ పారిజాత వృక్షాన్ని , వాసుదేవుని వెంటపెట్టుకొని , ఆనందముగా భూలోకానికి పయనమైంది సత్య .
ఇక్కడ భూలోకము లో బాల్కనీ లో కూర్చొని ఆకాశంలోకి దిక్కులు చూస్తూ , ఏమి పోస్ట్ రాద్దామా అని ఆలోచించుకుంటున్న మాల , సన్న సన్న గా తేలివస్తున్న సువాసనలను పసిగట్టింది . ఎక్కడి నుంచా ఈ సువాసనలు అని మాల ఆకాశం లోకి ఇంకా పరీక్షగా చూడగా , సత్యాభామా దేవి తీసుకొని వెళుతున్న చెట్టు నుంచే ఈ సువాసనలు అని గ్రహించేసింది . అంతే భామా . . . భామా ప్లీజ్ . . . ప్లీజ్ ఆ చెట్టు కొంచం నాకూ ఇవవ్వవా అని సత్యభాను బతిమిలాడింది . పాపం ఏదో అడుగుతోంది కదా కాస్త ఇద్దాములే అనుకుంది భామ . కాని కిట్టయ్య ఠాట్ నేను ఇంత కష్టపడి సంపాదించి నీకిస్తే నువ్వు మాలకు భాగమిస్తానంటావా వీల్లేదు అన్నాడు . మాల వదలకుండా ప్లీజ్ * * * ప్లీజ్* * * అని బతిమిలాడగా కరిగిపోయిన సత్య పోనిద్దూ కొంచం ఇస్తాను . ఐనా మాలా వాళ్ళ ఆయన ను ఇంట్లో నీపేరు తోనేగా ముద్దుగా పిలుస్తారు . అంటే ఆయన నీ తమ్ముడన్నట్లే గా . . . అన్నదమ్ముల మధ్య ఆ మాత్రం సఖ్యత వుండాలి అని శ్రీకృష్ణుని కి నచ్చ చెప్పి కొంచం చెట్టును తుంపి మాల కు ఇచ్చింది సత్యభామాదేవి . అది చూసి మూతి ముడుచుకున్న కన్నయ్య ను " కన్నయ్యా నీ ప్రతి పుట్టినరోజుకు ఈ పారిజాత పుష్పాలతో నిన్ను అలంకరిస్తా లే " అని మాల బుజ్జగించింది . ఇంకేమంటాడు వొప్పుకున్నాడు :)))))
ఇలా సత్యభామ దగ్గర నుంచి నేను సంపాదించిన పారిజాతవృక్షం ఇదే!



" పారిజాతం " పేరు ఎంత సున్నితం గా వుందో పూవూ అంత సుకుమారం .సన్నని ఆరెంజ్ కలర్ కాడ తో , తెల్లనని పలచని రేకుల తో బుజ్జి బుజ్జి గా ఎంత ముద్దుగా వుందో ఈ పారిజాతం ! సాయంకాలం కాగానే విచ్చుకుంటున్న పూల సువాసనలు అల్లనల్లన గాలి లో తేలిపోతూ ఇల్లంతా పరుచుకుంటాయి . చిరు చీకట్లల్లో చల్లని గాలి వీస్తూ వుండగా పారిజాతాలు విచ్చుకుంటూ వెదజల్లే పరిమళాలు వాహ్ * * * మా ఇంటి కి వచ్చే అథిదుల కు , మెట్ల పక్కనే నిలబడి తన పరిమళాలతో స్వాగతం చెపుతుంది మా పారిజాతం . ఆ పరిమళాన్ని గుండె నిండుగా ఆస్వాదించకుండా ఎవరూ ఇంట్లోకి రారు . ఆ ముద్దుగుమ్మలను చూస్తూ కాసేపు అలాగే ఆగిపోతారు . నాకైతే బాల్కనీ లో నుంచి కదలాలనే అనిపించదు . ఉదయం లేవగానే కింద నేల మీద పట్టుపానుపులా పరుచుకొని వుంటాయి . చెట్టును కొద్దిగా వూపగానే మిగిలిన పూలు కూడా జలజలా రాలుతూ ఎంత సందడి చేస్తాయో ! మంచు బిందువులలో తడిసిన పారిజాతాల అందం చూడాల్సిందే కాని వర్ణింపనా తరమా . . . నేను కన్నయ్యకు ఇచ్చిన మాట తప్పకూడదని ప్రతి కృష్ణాష్టమికి కొంచం ముందుగానే పూయటం మొదలు పెడుతాయి . దాదాపు నవంబర్ చివరిదాకా పూస్తాయి .
నీ అలకతో ఇంత మంచి పూలను దివినుండి భువి కి దింపిన ఓ సత్యభామా నీకు వేల వేల థాంకూలు :)

కృష్ణాష్టమి శుభాకాంక్షలు .