Sunday, August 21, 2011

మీరజాలగలడా నా ఆనతి

నారదమహర్షి , సువాసనభరితమైన , అందమైన పూవు నొక దానిని చేతబట్టుకొని వస్తున్నాడని సత్యభామాదేవి కి కబురందించింది చెలికత్తె . ఆ పూవునెలాగూ కృష్ణునికే సమర్పిస్తాడని , శ్రీక్రృష్ణుడు ఆపూవును తనకే ఇస్తాడని మురిసిపోతూ ఎదురుచూస్తూ కూర్చుంది సత్య . ఏదీ ఆ నారదు డూ ఎంత సేపటికీ రాడు . ఏమైనాడు చెప్మా అని ఆలోచనలో పడ్డది సత్య . పోనీ శ్రీకృష్ణుడూ ఇగో రాడు , అగో రాడు . ఏమైపోయారిద్దరూ ! అనితర్జన బర్జన్లు పడుతుండగా నారదుడు ఆ పుష్పాన్ని కృష్ణునికి ఇచ్చాడనీనూ , ఆ కిట్టయ్య దానిని రుక్మిణికి బహుకరించాడనీనూ తెలిసిపోయింది . భగ్గుమంది భామ హృదయం . అనదు మరీ ! ఇదేమైనా కాస్తో కూస్తో అవమానమా ! హన్నా . . . ఐనా ఆ వాసుదేవుని కి హెంత ధైర్యం ! భామను కాదని రుక్మిణికి ఇవ్వటమే ! ఈ అవమానాన్ని భరించేదిలేదుగాక లేదు ! పూవే కాదు ఆ పూల చెట్టునే తెచ్చేసి ఇమ్మంటాను . . . హమ్మా . . . హమ్మా . . . మీరజాలగలడా నా యానతి అని ప్రతిన బూనింది సత్యాదేవి .అంతే అలకపానుపు ఎక్కేసింది . శ్రీకృష్ణ పరమాత్మ పడరాని తిప్పలూ పడ్డాడు . కాలు పట్టుకొని తన్నించుకున్నాడు కూడాను పాపం . ఏమిటీ పాపమా ? పాపం అట పాపం . ప్రియ సతి . . . ముద్దుల సతి అనగానే సరా . . . ముద్దూ ముచ్చటా తీర్చొద్దూ ! తప్పుచేస్తే తన్నరేమిటి ! అందుకేగా పద సఖీ అంటూ దేవలోకానికి ప్రయాణం కట్టాడు . అబ్బ ఎంత అందంగా వుందీ పారిజాత వృక్షం . పూవే కాదు వృక్షాన్నే తీసుకుపోదామంది సత్యభామాదేవి . మీరజాలగలడా ఆనతి * * * * *
దేవలోకాధిపతి తో యుద్దం చేసి , ఓడించి మరీ సంపాదించాడు పారిజాతవృక్షాన్ని . ఆ పారిజాత వృక్షాన్ని , వాసుదేవుని వెంటపెట్టుకొని , ఆనందముగా భూలోకానికి పయనమైంది సత్య .
ఇక్కడ భూలోకము లో బాల్కనీ లో కూర్చొని ఆకాశంలోకి దిక్కులు చూస్తూ , ఏమి పోస్ట్ రాద్దామా అని ఆలోచించుకుంటున్న మాల , సన్న సన్న గా తేలివస్తున్న సువాసనలను పసిగట్టింది . ఎక్కడి నుంచా ఈ సువాసనలు అని మాల ఆకాశం లోకి ఇంకా పరీక్షగా చూడగా , సత్యాభామా దేవి తీసుకొని వెళుతున్న చెట్టు నుంచే ఈ సువాసనలు అని గ్రహించేసింది . అంతే భామా . . . భామా ప్లీజ్ . . . ప్లీజ్ ఆ చెట్టు కొంచం నాకూ ఇవవ్వవా అని సత్యభాను బతిమిలాడింది . పాపం ఏదో అడుగుతోంది కదా కాస్త ఇద్దాములే అనుకుంది భామ . కాని కిట్టయ్య ఠాట్ నేను ఇంత కష్టపడి సంపాదించి నీకిస్తే నువ్వు మాలకు భాగమిస్తానంటావా వీల్లేదు అన్నాడు . మాల వదలకుండా ప్లీజ్ * * * ప్లీజ్* * * అని బతిమిలాడగా కరిగిపోయిన సత్య పోనిద్దూ కొంచం ఇస్తాను . ఐనా మాలా వాళ్ళ ఆయన ను ఇంట్లో నీపేరు తోనేగా ముద్దుగా పిలుస్తారు . అంటే ఆయన నీ తమ్ముడన్నట్లే గా . . . అన్నదమ్ముల మధ్య ఆ మాత్రం సఖ్యత వుండాలి అని శ్రీకృష్ణుని కి నచ్చ చెప్పి కొంచం చెట్టును తుంపి మాల కు ఇచ్చింది సత్యభామాదేవి . అది చూసి మూతి ముడుచుకున్న కన్నయ్య ను " కన్నయ్యా నీ ప్రతి పుట్టినరోజుకు ఈ పారిజాత పుష్పాలతో నిన్ను అలంకరిస్తా లే " అని మాల బుజ్జగించింది . ఇంకేమంటాడు వొప్పుకున్నాడు :)))))
ఇలా సత్యభామ దగ్గర నుంచి నేను సంపాదించిన పారిజాతవృక్షం ఇదే!" పారిజాతం " పేరు ఎంత సున్నితం గా వుందో పూవూ అంత సుకుమారం .సన్నని ఆరెంజ్ కలర్ కాడ తో , తెల్లనని పలచని రేకుల తో బుజ్జి బుజ్జి గా ఎంత ముద్దుగా వుందో ఈ పారిజాతం ! సాయంకాలం కాగానే విచ్చుకుంటున్న పూల సువాసనలు అల్లనల్లన గాలి లో తేలిపోతూ ఇల్లంతా పరుచుకుంటాయి . చిరు చీకట్లల్లో చల్లని గాలి వీస్తూ వుండగా పారిజాతాలు విచ్చుకుంటూ వెదజల్లే పరిమళాలు వాహ్ * * * మా ఇంటి కి వచ్చే అథిదుల కు , మెట్ల పక్కనే నిలబడి తన పరిమళాలతో స్వాగతం చెపుతుంది మా పారిజాతం . ఆ పరిమళాన్ని గుండె నిండుగా ఆస్వాదించకుండా ఎవరూ ఇంట్లోకి రారు . ఆ ముద్దుగుమ్మలను చూస్తూ కాసేపు అలాగే ఆగిపోతారు . నాకైతే బాల్కనీ లో నుంచి కదలాలనే అనిపించదు . ఉదయం లేవగానే కింద నేల మీద పట్టుపానుపులా పరుచుకొని వుంటాయి . చెట్టును కొద్దిగా వూపగానే మిగిలిన పూలు కూడా జలజలా రాలుతూ ఎంత సందడి చేస్తాయో ! మంచు బిందువులలో తడిసిన పారిజాతాల అందం చూడాల్సిందే కాని వర్ణింపనా తరమా . . . నేను కన్నయ్యకు ఇచ్చిన మాట తప్పకూడదని ప్రతి కృష్ణాష్టమికి కొంచం ముందుగానే పూయటం మొదలు పెడుతాయి . దాదాపు నవంబర్ చివరిదాకా పూస్తాయి .
నీ అలకతో ఇంత మంచి పూలను దివినుండి భువి కి దింపిన ఓ సత్యభామా నీకు వేల వేల థాంకూలు :)

కృష్ణాష్టమి శుభాకాంక్షలు .


19 comments:

కొత్త పాళీ said...

ఓ, ఇవా పారిజాతాలంటే! ఇంకా ఒక హైబ్రిడ్ గులాబిపువ్వంత ఉంటుందనుకున్నా. మీరజాలగలడా నాయానతి పాటని రచించి స్వరపరిచింది తెలుగు రంగస్థలం మీద సత్యభామకి పట్టంకట్టిన మహానటులు కీశే స్థానం నరసింహారావుగారు. బాగుంది మీ పారిజాత ప్రహసనం.

ఇందు said...

వావ్! బాగుంది మీ పారిజాతం చెట్టు :) నేను చిన్నప్పుడు ట్యుషన్ కి వెళ్ళేదారిలో ఉండేది పెద్ద పారిజాతం చెట్టు. పొద్దున్నే పూలన్నీ రాలిపడేవి. నేను ఆ ఇంటివాళ్ళు చూడకుండా కొన్ని ఏరి తెచ్చుకునేదాన్ని. ఆ పూలు దేవుడికి పెట్తమనేదాన్ని! మా అమ్మ నా చెవ్వి మెలేసేది అలా పూలు తెచ్చినందుకు :)) ఎంతైనా పారిజతం పరిమళం అద్భుతం :) మీ టపా అదుర్స్! ఆ పాట నాకు భలే ఇష్టం :)

Ennela said...

అమ్మో అమ్మో అలా తెచ్చుకున్నారా యీ మొక్కని!!!మరి మాకూ కావాలంటే యీ సారి మాలా గారిని బతిమాలుకుంటే చాలా..లేక సత్య భామా గారినే కాంటక్టు చెయ్యాలా...!!??
టపా చాలా బాగుందండీ..యీ పాట నాకూ చాలా ఇష్టం..కానీ ఇంట్లో పాడడం కష్టం..ఎందుకంటే ఇక్కడ కృష్ణుల వారు రివర్సులో మీరజాలగలదా నా యానతి అని మిడిసి పడుతుంటారు ..ఏం చేస్తాం..ఐ జెలస్ యూ భామా..అనుకోడం తప్ప!!

కృష్ణప్రియ said...

మాల గారు,

ఎంత బాగున్నాయో పారిజాతాలు ఆకుల్లో.. మా కాంప్లెక్స్ లో ఒకరింట్లో రోజూ..పారిజాతాల వాన. రోజూ పని గట్టుకుని చూసి వస్తూ ఉంటాను. ఎర్రటి నేల మీద తెల్ల గా సుగంధం విరజిమ్ముతూ.. ఆరంజ్ కాడలు పైకి..

మీ వ్యాఖ్యానం చాలా బాగుంది. సూపర్!

లత said...

ఎంత బావున్నాయో మాలగారూ పారిజాత పూలు. మీ పోస్ట్ కూడా అంత బావుంది

మురళి said...

నాకు పారిజాతం అనగానే ధనుర్మాసమే గుర్తొస్తుందండీ.. బాగుంది మీ టపా.. జన్మాష్టమి శుభాకాంక్షలు..

లత said...

మాలగారూ,పారిజాతాలు ఎంత బావున్నాయో
మావారిని కూడా పిలిచి చూపించాను.
మీ పోస్ట్ కూడా అంత బాగుంది

హరే కృష్ణ said...

జన్మాష్టమి శుభాకాంక్షలు :)

శ్రీధర్. దు said...

మాలకుమార్ గారు, మా ఇంట్లో కూడా ఈ పారిజాతం చెట్టు ఉందోచ్..ఖాళీగా ఉంటే గోళ్ళు గిల్లికోకుండా, పారిజాతం గింజలు ఒలవడం కూడా మంచి కాలక్షేపం నాకు :)

మాలా కుమార్ said...

కొత్తపాళి గారు ,
చాలా రోజులకువచ్చారు . మంచి విషయం చెప్పారు . థాంక్స్ అండి .
పారిజాతం అలా వుంటుందనుకున్నారా ? ఐతే మీ మీద కూడా సినిమాల ప్రభావం పడుతుందన్నమాట :)

* ఇందు గారు ,
పారిజాతాలని పున్నాగపూలను చూస్తే ఏరుకోకుండా వుండలేమండి :) మా చెట్టు పూలు కూడా పిల్లలు ఏరుకుంటూ వుంటారు .

* అవును ఎన్నెల అలానే తెచ్చుకున్నాను . మీ ఇష్టం ఎవరిని కాంటాక్ట్ చేసినా పరవాలేదు .
హుమ్మ్ . . . నా పరిస్తితీ అంతే !సత్యభామను చూసి కుళ్ళుకోవలిసిందే :)

మాలా కుమార్ said...

కృష్ణప్రియ గారు ,
మా పూలు మీకు నచ్చినందుకు థాంక్స్ అండి .

*లత గారు,
థాంక్స్ అండి .

* మురళిగారు ,
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

హరేకృష్ణ ,
థాంక్ యు .
* శ్రీగారు ,
ఐతే మీ ఇంట్లోనూ పారిజాత చెట్టు వునందన్నమాట . అవునండి , గింజలు వలిచి ఏమి చేస్తారు ?

* లతగారు ,
మీవారి కి కూడా చూపించేంత నచ్చాయన్న మాట మాపూలు :) థాంక్ యు .

సుజాత said...

అవునండీ, ఇవి మా ఇంట్లో మూడు చెట్లకు కుప్పలు తెప్పలుగా పూస్తున్నాయి. రోజూ ఉదయాన్నే గేటు ముందు అంతా తెల్లగా నక్షత్రాలు పరిచినట్టు ఎంత బాగుంటుందో! ఎత్తి పోయలేక తిట్టుకుంటోంది మా వాచ్ మన్ భార్య

శిశిర said...

చాలా బాగుందండీ టపా. నా బాల్యంలోకీ, మా ఇంటికీ తీసుకెళ్ళిపోయారు ఆ పారిజాతాలు చూపించి. ఇంటి ముందు వాకిట్లో పెద్ద పారిజాతం చెట్టు.. ఆ పూలు రాలిపడ్డాక ఉదయాన్నే పూల సజ్జల్లోకి వాటిని ఏరడం.. కొన్నాళ్ళు నిత్యకృత్యం.
మనది అని చిన్న మొక్క పెంచుకోవడానికి కూడా వీల్లేని ఈ ఇరుకు గదుల్లోని బ్రతుకు కన్నా ఆ పెద్ద పెంకుటిళ్ళూ, వాకిట్లో విరబూసిన పూల మొక్కలూ.. కొన్నిటి కోసం ఎన్నో మిస్సవుతున్నామేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. :)

శ్రీధర్. దు said...

>> గింజలు వలిచి ఏమి చేస్తారు ?
ఏమి చెయ్యనండి, అదో తుత్తి అంతే :)

మాలా కుమార్ said...

శిశిర ,
మరి అలాగే మా ఇంటికీ వచ్చేయండి .
థాంక్ యు .

* శ్రీ గారు ,
తుత్తేనా ! నేనింకా ఏమైనా చేస్తారేమో ఆ గింజల తో అనుకున్నాను :)

జ్యోతిర్మయి said...

పారిజాతాలే, ఏమిటీ నిఝాంగా పారిజాతాలే ఎన్నాళ్ళయి౦దండీ చూసి...

రసజ్ఞ said...

మా ఇంట్లో ఉంది ఈ పారిజాత చెట్టు! ఇవి రేక పారిజాతాలు కదూ! వీటిని రాలినప్పుడు ఏరుకోవడమే! ముద్ద పారిజాతాలు మాత్రమే కొమ్మ నించి కోసుకోవచ్చు! ఈ ఫోటోలోనుంచే మాంఛి సువాసనలు వెదజల్లుతున్నాయి!

మాలా కుమార్ said...

జ్యోతిర్మయి గారు ,
మీ సంతోషమే మా అనందమండి :)

&రసజ్ఞ గారు ,
ముద్ద పారిజాతాలు కూడా వుంటాయా ? అవి నేనెప్పుడూ చూడలేదండి .
మీ కామెంట్ కు థాంక యు అండి .