Saturday, December 27, 2014

హాపీ హాపీ బర్త్ డే సాహితి
హలో హలో,
అందరూ ఎలా వున్నారు ? సాహితి వైపు రాక చాలారోజులైంది .ఏమీ లేదు కొంచం బద్దకం , కొంచమేమో కథలు వ్రాయమని మా మితృలు మొహమాట పెట్టేస్తుంటే , బద్దకం లేనప్పుడు కథలు ఆలోచిస్తున్నానన్నమాట.అంతే ఇంకేమీలేదు! మరి ఈ రోజేమో  సాహితి పుట్టినరోజు.హాపీ బర్త్ డే సాహితీ!

అసలు సాహితి పుట్టినరోజు తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా వుంటుంది.అవి బ్లాగ్ అంటే  అమితాబచన్ మాత్రమే వ్రాస్తాడని , అదో పేద్ద ఘనకార్యం అనుకుంటున్న రోజులు . అకస్మాత్తుగా మనము కూడా బ్లాగ్ వ్రాయవచ్చు , అదేమీ పెద్ద ఘనకార్యం కాదు అని జ్ఞానోదయం ఐయింది. అంతే  నా " సాహితి " జన్మించేసింది . నా మదిలోని మధురానుభూతులు అలా . . . అలా . . . వచ్చేసాయి. నాకు వినిపిస్తూనే వున్నాయి మీ కిచ కిచ కిచలు . ఎవరైనా మొదట్లో బాగావ్రాయగలరేమిటి :) ఏదో డైరీ లా వ్రాసానే అనుకొండి , అంత మాత్రాన అలా నవ్వేయాలా :( ఏదీ ఇప్పుడు నవ్వండి చూద్దాం :) ఊరికే సరదాకి అన్నాను.మీరెవరూ నవ్వటం లేదు , పైగా నా వ్రాతల్ని ప్రోత్సహిస్తున్నారు నాకు తెలుసు. మీ అందరి ప్రోత్సాహంతోనేగా రోజు చిరు రచయిత్రిగా ఎదిగాను :)
2008 డిసెంబర్ 27 మొదలైన నా నూతనాద్యాయం ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ ఇలా సాగింది.

జూన్ 2013 లో మొదటగా నా కథ " మట్టిలో మాణిక్యం " ప్రచురించి విహంగ పత్రిక బుక్కైపోయింది . అప్పటి నుంచి ప్రతినెల నా పుస్తక సమీక్ష లు వేసుకోక తప్పటం లేదు పాపం .అంతేకాదండోయ్ ఆంధ్రభూమి వాళ్ళు కూడా నా కథలు ప్రచురించారు. నిజం!ఇహపోతే స్వప్న మాసపత్రిక వాళ్ళు కూడా నా కథలు వేసుకున్నారండోయ్!మధ్య మాలిక వెబ్ మాగ్జిన్ వారు నా కథ " చాందిని" పబ్లిష్ చేసారు. దీనికో ప్రత్యేకత వుంది. అది , తండ్రి- కూతురు అనుబంధం అనే విషయం మీద ఇరవైఐదు మంది రచయిత్రి లు కథలుగా వ్రాశారు. కథ లన్నీ కలిపి " ఈండ్రి-తనయ" అనే పేరు తో ప్రమదాక్షరి గ్రూప్ ( ఫేస్ బుక్ లోని రచయిత్రుల గ్రూప్) జే.వి పబ్లిషర్స్ ద్వారా పుస్తకం గా ముద్రించారు.పేరు పొందిన ప్రముఖ రచయిత్రుల కథల సరసన నా కథ కూడా చోటుచేసుకుంది. అదీ సంవత్సరం నా సాహితి  నాకు ఇచ్చిన గొప్ప కానుక!


ఇంకా జాగృతి మాసపత్రిక వారు నిర్వహించిన కథలపోటీలో నా కథ " ఆత్మీయబంధం" సాధారణ ప్రచురణకు ఎన్నికైంది.

రచన మాసపత్రిక లో " నీ జతగా నేనుంటాను" అనే కథ ప్రచురణకు తీసుకున్నారు. రెండూ ఇంకా పబ్లిష్ కాలేదు . ఐనప్పుడు తప్పక చెబుతాను కదా !

ఇంకో మూడు కథలు వివిధపత్రికలలో పరిశీలనలో వున్నాయి.
సో ఇదన్నమాట సంగతి. ఇదంతా మీ తప్పే! మీరంతా నన్ను ఇంతలా ప్రోత్సహించకపోతే నేను వ్రాసేదాన్నా చెప్పండి!

మరోసారి సాహితి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ , మీ అభిప్రాయాలతో  ప్రోత్సహిస్తూ , తప్పొప్పులు దిద్దుతూ నన్ను ముందుకు నడిపిస్తున్న  మితృలకు , కుటుంబసభ్యులకు , ఆత్మీయులైన మీకందరి కీ , కొత్త రచయిత్రిని ఐనా నా కథలను ప్రచురించి ప్రోత్సహించిన  పత్రికాధిపతులకు ,నా హృదయపూర్వక ధన్యవాదాలు.నా "సాహితీ" ప్రయాణం కు  మీ ప్రోత్సహాన్ని , ఆశీస్సులను ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ,
మీ మాల.