Monday, February 20, 2012

బ్లాగు పుస్తకం




"బ్లాగు పుస్తకం" అవిష్కరణ గురించి బ్లాగులల్లో చదువుతూనే వున్నాను .ఇంటికి దగ్గరే కదా వెళుదామా అని మనసుపీకుతోంది .దానికంత ఆలోచనెందుకు వెళితేపోలే అనుకున్నా , వెళ్ళటం కాదుకదా ప్రాబ్లం . అసలు ప్రాబ్లం ఆ హాల్ ఐదో అంతస్తులో . ఒకటో రెండో అంతస్తులైతే మెట్లెక్కచ్చు కాని ఐదు ఎట్లా ఎక్కుతాను .నాకు తెలుసు లిఫ్ట్ వుంటుందని . అసలు ప్రాబ్లం అదే కదా :) హుం . . . ఇక ఆశ వదిలేసి తీరిగ్గా పనులు చేసుకుంటూ వుంటే సి. ఉమాదేవి గారు ఫోన్ చేసారు . ఉభయకుశలోపరి , ఆపైన తోట లో చెట్ల గురించి అయ్యాక , రెండునెలలనుచి రాకుండా మొహం చాటేస్తున్న తోటమాలి గురించీ మాట్లాడుకోవటం అయ్యాక , మీరు బ్లాగు పుస్తకావిష్కరణ కు వెళుతున్నారా అని అడిగారు . లేదండి అన్నాక , బుర్ర లో బల్బ్ వెలిగి మీరు వెళుతున్నారా అని అడిగాను . వెళుదామనుకున్నానండి కాని ఎవరూ తోడు దొరకటం లేదు అన్నారు . మీరు వెళుతుంటే నేనూ వస్తాను అని చటుక్కున అనేసాను . ఐతే 1 కల్లా రెడిగా వుండండి , నేను మిమ్మలిని పికప్ చేసుకుంటాను అన్నారు .అలా మాచ్ ఫిక్సైంది . కాని గుండెలు పీచు పీచు మంటూనే వున్నాయి . . . లిఫ్ట్ ఎలా ఎక్కటమా ????? ఉమాదేవి గారు ఏమనుకుంటారో అని ఓ వైపు ఆలోచిస్తూనే వున్నాను . ఎక్కడా జాగా లేనట్లు వీళ్ళు ఐదో అంతస్తులో సెటిల్ కావటమేమిటి అని మనసులో విసుక్కుంటూ మధనపడుతున్నాను . . . ఇంతలో లక్ష్మి గారు కాల్ చేసి నేను మిమ్మలిని మీ ఇంటి దగ్గరే పికప్ చేసుకుంటానండి , మీరు రెడీఏనా అన్నారు . హమ్మయ్య లక్ష్మి గారు వస్తున్నారు . లిఫ్ట్ సంగతి ఆవిడే చూసుకుంటారు . మనం హాపీసూ :))))))

లక్ష్మిగారి శ్రీవారు శ్రీ.వెంకటేశ్వర్లు గారి పుణ్యమా అని సభాస్తలికి చేరుకున్నాము . ఆయన దగ్గరుండి మరీ లిఫ్ట్ ఎక్కించి వెళ్ళారు . ఆ బిల్డింగ్ వాళ్ళ పుణ్యమా అని ఆ లిఫ్ట్ కూడా కటకటాల లిఫ్ట్ . హమ్మయ్య గండం గడిచింది . హాల్ లో సుజాత గారు ,వరూధిని గారు కనిపించారు . తెలిసిన వాళ్ళున్నారు అమ్మయ్య అనుకున్నాను .

అందరినీ అక్కడ వున్న బోర్డ్ మీద పేరు రాయమన్నారు . టీ బిస్కెట్స్ ఇచ్చారు . వక్తలందరూ బ్లాగు పుస్తకం గురించి , బ్లాగుల గురించి చక్కగా మాట్లాడుతున్నారు . చాలా ఇంట్రెస్టింగా వుండింది . ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెపుతుంటే చాలా సరదాగా వుంది .అంతా బాగానే వుంది కాని నన్నూ మాట్లాడమన్నారు :) అంతే గుండెల్లో ఢాం * * * బాబోయ్ * * * నేనా మాట్లాడటమా ??? చిన్నగా తప్పించుకున్నాను . చావా కిరణ్ వచ్చి లక్ష్మిగారి కి , ఉమాదేవి గారికి బ్లాగు పుస్తకాలిచ్చారు . నా వైపు చూసి మాట్లాడిన వాళ్ళకే పుస్తకాలు అన్నాడు . హి హి హి అని నవ్వి వూరుకున్నాను :) అందరూ మట్లాడారు . మీరొక్కరే మాట్లాడలేదు మాట్లాడండి అని లక్ష్మిగారు , ఉమాదేవి గారు అన్నారు . వాళ్ళన్నారనే కాదు , ఈ సంగతి తెలుస్తే , మావారు ఇచ్చే క్లాస్ ను భరించటం చాలా కష్టం అని , మొత్తాని కి ఏదో మమ అనిపించాను . ఏమి మాట్లాడాను అంటే ఏమో , విన్నవాళ్ళ అదృష్టం హి హి హి . మొత్తానికి నాకూ ఓ పుస్తకం దొరికింది :)))))

సరే పుస్తకం దొరికింది . దానితో పాటు చావా కిరణ్ ,నాగార్జునాచారి , బంతి , చాణక్య , అపర్ణ ,కశ్యప్ , కట్టావిజయ్, జీవితం లో కొత్తకోణం శ్రీనివాస్ గార్ల ల పరిచయం కలిగింది . అందరూ చాలా అభిమానం గా మాట్లాడారు . అందరినీ పరిచయం చేసుకోవటం చాలా సంతోషం అనిపించింది .

"బ్లాగు పుస్తకం " ముఖచిత్రం ముచ్చటగా వుంది . చూడగానే చదవాలి అనిపించింది ."ఈ పుస్తకం కేవలం మీకు దారి చూపించి , ఆ దారి గురించి చెబుతుంది . మీ ప్రయాణం మీరే చేయాలి సుమా !" అని మన బాధ్యతను గుర్తు చేస్తూ మొదలవటం నాకు చాలా నచ్చింది .మన మన్సులో వున్న భావాలను బ్లాగుల్లో ఎలా పంచుకోవాలో ఒక పద్దతిగా వివరించారు .ఏ విషయాలను పంచుకోవచ్చో ,ఏవి తెలియజేయకూడదో చక్కగా వివరించారు .కొత్తగా బ్లాగు మొదలు పెట్టేవారి కి ఈ పుస్తకం సరైన మార్గదర్శి . బ్లాగు రాస్తున్నవారికి కూడా ఎన్నో సాంకేతికా విషయాలను , చిత్రాల తో సహా వివరించారు . అంతే కాకుండా వేరే వాళ్ళ బ్లాగులను ఎలా చదవాలో కూడా తెలియజేసారు .మన వాఖ్యలను ఎలా రాయాలి , వాఖ్యలకు ఎలా స్పందించాలో కూడా తెలియజేసారు .ముఖ్యం గా ఈ బ్లాగుల వల్ల ఏర్పడే పరిచయాలను , ఎన్నో అనుభవాలను తెలియజేసారు .

ఇంతెందుకు అదీ , ఇదీ అని కాదు బ్లాగుల గురించి సమస్తమూ తెలుసుకోవచ్చు . నిజంగా ఇది బ్లాగర్లకు చాలా వుపయోగపడే పుస్తకం . దీని రూపకర్తలు , చావా కిరణ్ గారు , సుజాత గారు , రెహ్మాన్ గారు చాలా కష్టపడ్డారు .వారికి అభినందనలు .

అన్నట్లు ఇందులో నా పేరు కూడా వుందండోయ్ చూడటం మర్చిపోకండి . థాంక్ యు , చావాకిరణ్ గారు , సుజాత గారు , రెహ్మాన్ గారు . నాకు బ్లాగులో ఏదైనా డౌట్ వస్తే తనను అడగమని రెహ్మాన్ గారు వారి ఐ డి ఇచ్చారు . థాంక్స్ అండి .

Tuesday, February 14, 2012

ఇట్లు , మీ విధేయురాలు - మీ భార్య



"చరణదాసి " రవీంద్రుని నవల "పడవ మునక " ఆధారం గా తీసినది అని తెలిసి సి.డి తెచ్చుకొని చూసాను . ఆ సినిమాలో చివర లో మూడు జంటల లో ని ముగ్గురు భార్యలూ వాళ్ళ వాళ్ళ భర్తల కాళ్ళకు దండం పెడుతుండగా శుభం కార్డ్ పడుతుంది . ఇహ శాంతినివాసం సినిమా లో సరేసరి దేవిక కు పతిపద సేవయే భాగ్యం . ఇంక అలాంటి పాత సినిమాలు చూడవద్దు అని నిర్ణయించుకున్నాను . అవును మరి మా ఆయన పొరపాటున ఆ సీనులు చూసారంటే చెడిపోరూ ! ఈ మద్య పెళ్ళిల్లలో ఓ కొత్త సాంప్రదాయం చూసాను . అదేమిటంటే , పెళ్ళి కొడుకు తాళి కట్టగానే , పెళ్ళికూతురుతో పెళ్ళి కొడుకు మెళ్ళో దండ వేయించి , కాళ్ళకు దండం పెట్టిస్తున్నాడు పురోహితుడు . అదేమిటో మా కాలం లో మేమెరుగమమ్మా ఈ పద్దతి :) ఏం మీరు మొగుడి కాళ్ళకు దండం పెట్టరా అంటే ఎందుకుపెట్టం ? పండగలప్పుడు , పూజలప్పుడూ కొత్త బట్టలు కట్టుకొని , ఇంట్లో పెద్దవాళ్ళందరికీ పెడుతూ ఆయనకూ పెట్టేదానిని . అంతే కాని పతిపద సేవయే భాగ్యముగా అన్నట్లు కాదు :) కార్యేసు దాసీ . . . . . వగైరా , , , వగైరా లతో భర్త తో భార్య ఎలావుండలో చెపుతూ మన పూర్వీకులు ఓ శ్లోకం చెప్పారట . అది చదవటమే కాని , దాని గురించి కాని , అలా వుండాలని కాని మా అమ్ముమ్మ కాని , అమ్మ కాని చివరకు మా అత్తగారు కాని నాకైతే చెప్పలేదు :) అసలు ఈ కాలం లో భార్యలను అలా చూడాలని ఎవరూ అనుకుంటునట్లుగా కూడా కనిపించటం లేదు .

కాలం తో వచ్చిన మార్పులు అంగీకరించినట్లే భార్యా భర్తలు కూడా స్నేహితులలాగానే వుంటున్నారు . ఒకరి మీద ఇంకొకరు ఆధిపత్యం చూపించాలని ఎవరూ కోరుకోవటం లేదు . ఒకరికొకరు చేదోడు వాదోడు గా వుంటున్నరు . మామటుకు మేము పోట్లాడుకుంటూ , మాట్లాడుకుంటూ హాపీగానే వున్నాము :) మనమేమో ఇలా వున్నామా ? మలేసియా ముస్లింలేమో ఇంత మంచి శ్లోకాన్ని మీరెలా వదులుకున్నారు అంటున్నారట .

డాక్టర్ రుహాయా అనే ఆవిడ " ఒబీడియంట్ వైఫ్స్ క్లబ్ ", అంటే విధేయ భార్యల క్లబ్ అన్నమాట స్తాపించిందిట . ఆడవారి జన్మ భర్త విధేయతలోనే తరించాలన్నది ఆ క్లబ్ లోని మహిళల మాట అట . ఈ క్లబ్ లో మహిళల సమస్యలను చర్చిస్తారనుకుంటే పొరబాటే ! ఇక్కడ భర్తల పట్ల ఎలా విధేయతల తో తరించాలో చెపుతారన్నమాట . కొత్తగా వివాహం చేసుకున్న మహిళలకు భర్త తో ప్రవర్తించాల్సిన విషయాలను , భర్త పట్ల విధేయతతో రాటు తేలిన వృద్ధమహిళలు భోదిస్తారట.మంచి మహిళగా మారుస్తారన్నమాట .ఈ క్లబ్ వివరాలు వెల్లడించగానే అక్కడి మహిళలు తమ ఆమోదాన్ని తెలిపారట ! పైగా ఇందులోని మెంబర్స్ అంతా విద్యావంతులేనట!

మరో తమాషా విషయమేమిటంటే ఆమె మామగారే పురుషుల కోసం బహుభారాయత్వం క్లబ్ స్తాపించినవాడవటం . మొత్తం ఆ కుటుంబం ఆలోచనలోనే ఏదైనా తేడా వుందనుకోవాలా అనేది చాలా మంది అభిప్రాయం అట :)

ఈ క్లబ్ ల వివరాలు , పుట్టుపూరొత్వాలూ తెలుసుకోవాలి అని ఎవరికైనా కుతూహులం వుంటే 6-1-2012 స్వాతి వారపత్రిక చదవండి . అందులో చదివే నేనూ ఈ క్లబ్ గురించి తెలుసుకున్నాను సుమండీ ! ఐనా మన ఇండియన్ అబ్బాయిలు చాలా మంచి వాళ్ళు . ఈ క్లబులూ గట్రా మనకెందుకు లెద్దురూ :))))))

భార్యావిధేయులకు , భర్తావిధేయులకు , విధేయులు కాని వారికి , హోల్ మొత్తం ప్రేమికులకు , ప్రేమికుల రోజు శుభాకాంక్షలు .

Thursday, February 2, 2012

గారెలు తాగరు తింటారు



అనగనగా ఒకానొక వూరిలో ఒక అమ్మ , ఒక నాన్న . వారికో గారాల కూతురు సుందరి . కందిపప్పుకు శెనగపప్పు కు తేడా తెలీకుండా మురిపెంగా , ముచ్చటగా పెరిగింది సుందరి . దానితో పాపం చదువూ అంతగా అబ్బలేదు . పోనీలే చదువుకొని , వూళ్ళేలా ????? వుద్యోగాలు చేయాలా ????? మనకేమీ లేదా పోదా అనుకొని సుందరి నాన్న , సుందరికి పెళ్ళిచేద్దామని ఆంధ్రదేశమంతా జల్లెడ పట్టి , అందగాడు . . . బాగా చదువుకున్నవాడు . . . వుద్యోగస్తుడు . . . నెమ్మదస్తుడు . . . బరువు బాద్యతలు లేనివాడు . . . ఇంకా బోలెడు డు లు వున్నవాడైన , అచ్చతెలుగు అబ్బాయి సుబ్బారావు కు ఇచ్చి అంగరంగ వైభోగం గా పెళ్ళి చేసి , అమ్మాయి, అల్లుడితో కొత్తకాపురం పెట్టించి . . . ఊహ్ . . . ఊపిరి పీల్చుకున్నాడు .

కొత్తకాపురం * * * మొదటిరోజు * * * పెళ్ళిలో అమ్మలక్కలందరూ , మగవాడి హృదయానికి దారి కడుపునుంచేనే అమ్మాయి . చక్కగా వంటచేసి పెట్టి మొగుడిని కొంగున ముడేసుకో అని సుందరి చెవులు కోరికేసారు . అది గుర్తొచ్చి సుందరి , ఆ ప్రయత్నమేదో మొదటి రోజు నుంచే చేద్దామని నిశ్చయించుకొని , " సుబ్బూ . . . సుబ్బూ నీకోసం తినటానికి ఏమిచేసిపెట్టను ?" అని గారంగా అడిగింది . ముద్దుల భార్య , గారాల మోము చూసి ముద్దైపోయి , " సుందూ , నాకు గారెలంటే ఇష్టం . చేసిపెట్టరా " అని అని ముద్దు ముద్దుగా అడిగి ఆఫీసుకెళ్ళిపోయాడు . గారెలా అవేమిటి ఎలా వుంటాయో , ఎలా చేయాలో తెలీదే అని కాసేపు సోచాయింపులో పడి , పోనీ పక్కింటి పిన్నిగారిని అడుగుదాము అనుకొని ,గోడ దగ్గరికి వెళ్ళి పిన్నిగారు , పిన్నిగారూ అని పిలిచింది సుందరి .

ఏమిటమ్మాయ్ అంటూ వచ్చారు పిన్నిగారు .

" పిన్నిగారు , మావారు గారెలు తినాలని వుంది అన్నారు . గారెలా చేస్తారో చెప్పరూ ప్లీజ్ " అని అడిగింది సుందరి .

" ఓస్ గారెలే కదమ్మా . చేయటం చాలా సులభం . ముందుగా మినపప్పు తీసుకోవాలి ."

" మినపప్పు తీసుకోవాలా ? నాక్తెలుసు , నాక్తెలుసు " అంటూ ఇంట్లోకి పరిగెత్తింది సుందరి .
వంటింట్లోకి వెళ్ళి చూస్తే మినపప్పు ఏదో తెలీలేదు . మళ్ళీ గోడ దగ్గరకు వచ్చి " పిన్నిగారూ . . . పిన్నిగారూ " అని కేకేసింది .ఏమిటమ్మాయ్ అంటూ పిన్నిగారు వచ్చారు .

" మినపప్పు ఎలా వుంటుంది పిన్నిగారు ."

ఇదో అమ్మా ఇలా వుంటుంది అని మినపప్పు తెచ్చి చూపించి , ఈ పప్పు గిన్నెలోకి తీసుకొని అని చెప్పబోతుండగా " నాక్తెలుసు . . . నాక్తెలుసు " అని ఇంట్లోకి పరిగెత్తింది సుందరి .

ఓ గ్లాసెడు మినపప్పు గిన్నెలోకి తీసుకుంది . ఆ తరువాత ఏం చేయాలి చెప్మా ! అనుకొని మళ్ళీ గోడ దగ్గరికి వచ్చి , పిన్నిగారి ని పిలిచి , ఆ పప్పును ఏమిచేయాలండి ? అనీడిగింది . కడిగి నాన బోసి , , , అని చెపుతుండగానే "నాక్తెలుసు . . . నాక్తెలుసు " అని ఇంట్లోకి పరిగెత్తింది .

సరె పప్పు నానబోసింది . ఆ తరువాత ????? మళ్ళీ పిన్నిగారూ . . . పిన్నిగారూ అని కేకేసింది . ఏమిటమ్మాయ్ అంటూ మళ్ళీ వచ్చారు పిన్నిగారు . నానబోసిన పప్పును ఏమిచేయాలండి అని అడిగింది . దానిని రుబ్బుకోవాలి . ఆ పైన , అబ్బే వినే దాకా ఎక్కడ " నాక్తెలుసు . . . నాక్తెలుసు " అని ఇంట్లోకి వెళ్ళిపోయింది . " బాగానే వుంది సంబడం " అనుకుంటూ పిన్నిగారూ లోపలికి వెళ్ళిపోయారు .

మినపప్పు రుబ్బటం ఐపోయింది . ఆ తరువాత ఏమి చేయాలి ? పిన్నిగారినే అడగాలి . . .

" పిన్నిగారూ . . . పిన్నిగారూ . . . "

" ఏమిటమ్మాయ్ ?"

" పప్పు రుబ్బేసానండి . ఇప్పుడేమి చేయాలి? "

" గ్లాస్ లో వేసుకొని నీళ్ళు కలుపుకొని , సుబ్బరంగా తాగెయ్యాలి ." విసిగిపోయిన పిన్నిగారి జవాబు .

" ఓస్ ఇంతేనా ! నాక్తెలుసు . . . నాక్తెలుసు."

సుబ్బారావు గారెలు తిందామని లొట్టలేసుకుంటూ వచ్చాడు . సుందరి అంతకన్నా ప్రేమగా గ్లాసెడు గారెలు ఇచ్చి , " సుబ్బూ . . . ఎంచక్కా గారెలు తాగేసేయ్ . నీకోసం పక్కింటి పిన్నిగారిని అడిగి చేసాను తెలుసా " అని వూరిస్తూ ఇచ్చింది .

" గారెలు తాగటమేమిటే సుందూ " అంటూ బిత్తరపోయాడు సుబ్బు .

" పక్కింటి పిన్నిగారు ఇలాగే చెప్పారు . నీకేమీ తెలీదు .తొందరగా తాగేయ్ సినిమా టైం ఐపోతోంది " అని తొందర చేసింది సుందు .

" గారెలు తాగరే * * * తింటారు " .ఏడుపు మొహం పెట్టాడు సుబ్బు :(((((
నీతి ; అతితెలివి అనర్ధదాయకం .

సామెత ; తోచీ తోచనమ్మ ఇలాంటి తొక్క కథలే చెప్పును :)