Wednesday, February 17, 2016

సన్నజాజిమొగ్గలా కావాలా!సంవత్సరం క్రితం మావారికి బైపాస్ అయ్యింది.దాని తరువాత ఆయన బరువు , తగ్గి, సుగర్ లెవెల్ తగ్గించాల్సిన అవసరం వచ్చింది.దాని తో అపోలో హాస్పెటల్ లో ఉన్న ఫిథియోథెరొఫీ సెంటర్ లో డాక్టర్ సలహాతో చేరారు.అక్కడి డైటీషియన్ మావారికి డైట్ చార్ట్ ఇచ్చింది.సో దానిని తూచా తప్పకుండా పాటించాను.కాకపోతే డైట్ పాటించాక మావారి బరువు పెరిగి సెంచరీకి చేరువైంది.సరే ప్రతివతాధర్మం తప్పకుండా నా బరువూ మూడు కిలోలు పెరిగింది.మా పనిమనిషీ ఇతోదికంగా లావైంది.కాకపోతే నేను చేసిన వంటల బొమ్మలు చూసి చాలామంది మితృలు  రసిపీలు పెట్టొచ్చుగా అంటున్నారు.అందుకని పాపం వాళ్ళ మాటెందుకు కాదనాలి అని రోజు రాగి ఇడ్లీ, సజ్జ ఇడ్లీ రసపీలు ఇస్తున్నాను.ఇవే కాకుండా ఓట్స్ ఉప్మా, మల్టీగ్రేన్ బ్రెడ్ ఉప్మా, పెసరట్టు,ఎగ్గ్ వైట్ తో ఆంలెట్, మల్టీగ్రేన్ బ్రెడ్ టోస్ట్,మల్టీగ్రేన్ ఆటా తో చపాతీ లు , అందులోకి కమ్మగా పెసర, రాజ్మా, చెన్నా, అలచందలు లాంటి వాటితో కూరలూ కూడా చేసి బ్రేక్ ఫాస్ట్ చేయవచ్చు.ఇవైతే అందరికీ తెలిసినవేకదా!
ముందుగా రాగి ఇడ్లీ;
1/2
కప్ మినప పప్పు,
1 1/2
కప్ రాగిపిండి,
2
స్పూన్లు అటుకులు
మినపపప్పు గంట నానబోసి రుబ్బుకొని ,అవి రుబ్బెటప్పుడే అటుకులూ నానబోసి చివరలో మినపపప్పు లో వేసి రుబ్బాలి.తరువాత అందులో రాగిపిండి కలపాలి.ఉప్పు కూడా కావలసినంత అంటే మీకు సరిపడేటంత కలుపుకోవాలి.మరునాడు పొద్దున , ఇడ్లీ స్టాండ్ లో వేసుకొని మామూలు ఇడ్లీలల్లా చేసుకోవటమే!
సజ్జ ఇడ్లీ;
1
కప్ మినపపప్పు,
2
కప్పులు సజ్జ రవ్వ ( ఇది సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది)
2
స్పూన్లు అటుకులు
మినపపప్పూ ,అటుకులూ రుబ్బుకొని , సజ్జ రవ్వ కలుపుకొని , మరునాడు ఇడ్లీ వేసుకోవటమే!ఉప్పు మర్చిపోకండీ.
వీటిల్లోకి టమాటో , పుదీనా, అల్లం చట్నీలు బాగుంటాయి.
(
డైటింగ్ లో పుట్నాలు, వేరుశెనగపప్పు, కొబ్బరి, బియ్యం తినకూడదు.)
బ్రేక్ ఫాస్ట్ అయ్యింది కదా!ఇక లంచ్ లోకి , డిన్నర్ లోకి సలాడ్స్.సరే సలాడ్ అనగానే ఖీరా , టమాటో ఎలాగూ గుర్తొస్తాయి.అలా రొటీన్ కాకుండా కొంచం కలర్ఫుల్ గా అన్నమాట.అమ్మో ఏదో చెప్పేస్తున్నానకుకోకండిచాలా సింపుల్. మధ్య సూపర్ మార్కెట్ లల్లో పర్పుల్ కలర్ క్యాబేజీ, కలర్ ఫుల్ కాప్సికం లు, బ్రాకలీ దొరుకుతున్నాయి.వాటితో నన్నమాట.
1.
త్రిరంగా సలాడ్;
పర్పుల్ కలర్ క్యాబేజీ కొద్దిగా, ముల్లంగి సగం, క్యారెట్ ఒకటి, శుభ్రంగా కడుక్కొని తురుముకోవాలి.ముల్లంగి తప్ప, మిగితా రెండూ కలిపేసు కొని పెట్టుకోవాలి.తినే ముందు ముల్లంగి ని కూడా కలిపేసి పైపైన ఉప్పు, పెప్పర్ కొద్దిగా చల్లుకోవాలి.చాలా టేస్టీగా ఉంటుంది.
2.
కాప్సికం సలాడ్;
రంగు రంగుల కాప్సికం లను సన్నగా చక్రాల్లా తరుక్కోవాలి.వాటిని , మూకుడులో అర చెంచా ఆలివ్ ఆయిల్ వేసి , చక్రాలు విరక్కుండా, సన్నని మంట మీద పైపైన వేపుకోవాలి. కొద్దిగా పచ్చి వాసనపోతే చాలు. కొద్దిగా ఉప్పు కలిపి దించేసేయాలి.ఉంటే ఆలివ్స్ కొన్ని పైన డెకొరేట్ చేసినా బాగుంటాయి.
బ్రొకలీ , మటర్ సలాడ్;
బ్రోకలీని చిన్న చిన్న పువ్వుల్లా తరుక్కోవాలి. గిన్నెడు నీళ్ళు బాయిల్ చేసి దింపి , వేడి నీళ్ళు సగం చేసుకొని, దానిలో బ్రాకొలీ పువ్వులు , దానిలో భఠాణీ లు వేసి మూతబెట్టాలి.అవి నీళ్ళల్లో మునగాలి.పది నిమిషాల తరువాత నీళ్ళన్నీ వంపేసి రెంటినీ కలిపేయాలి.
4.పాలకూర స్మూతీ;
ఇది కూడా సలాడ్ లా చేసేదానిని.
1
కట్ట పాలకూర,
1
ఆపిల్,
1
ఖీరా,
కొద్దిగా నిమ్మరసం.
అన్నీ మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవటమే! ఆపిల్ ప్లేస్ లో ఏదైనా పండు,ఖీరా ప్లేస్ లో గుమ్మడికాయ ముక్కో, బీట్రూట్ నో , క్యారెట్ నో,కొద్దిగా క్యాబేజీ నో కూడా వేసుకోవచ్చు. అన్నట్లు స్పూన్ తేనె కూడా కలుపుకుంటే రుచిగా ఉంటుంది.
ఇలా ఎప్పుడు కూర కలిపితే బాగుంటుంది అని అనిపిస్తుందో కలిపేసి చేసేసుకోవటమే.కొద్దిగా కలాపోసన ఉండాలి అంతే !
ఒక బోజనానికి , ఇంకో భోజనానిని కి మధ్య ఎక్కువ సమయము తేడా ఉండకూడదుట.అంటే మన పిండి మర ఆడుతూనే ఉండాలన్నమాట.అందుకే మధ్యాహ్నం టిఫిన్ కు మొలకలెత్తినగింజలను ఎన్నుకున్నాను.పెసలు,నల్లశనగలు, అలచందలు ఇలా ఏదో ఒకటి పొద్దున్న నానబోయాలి. సాయంకాలము వాటిలోని నీళ్ళను వంపేసి చిల్లుల గిన్నెలో వేసి కాని , బట్టలో వేసి గట్టిగా మూట కట్టికాని ఉంచితే తెల్లారేసరికి వాటికి మొలకలు వచ్చేస్తాయి.సాయం కాలమయ్యేసరికి మొలకలు ఇంకాస్త పెరుగుతాయి.వాటిలో ఉల్లిపాయలు,టమాటా, పచ్చిమిరపకాయ,కొత్తిమీర సన్నగా తరిగి కలిపుకోవాలి, అందులో కాస్త ఉప్పు , కాస్త చాట్ మసాలా పొడి కలుపుకోవాలి.అంతే ఘుమ ఘుమలాడే గుగిళ్ళు తయార్.అవి కాసిని తిని,టీ తాగేయటమే మనం చేయాల్సిన పని.

రాత్రి సూప్ సంగతి చూద్దామా :)
నేను ముందుగా వెజిటబుల్ స్టాక్,టమాటో పూరీ చేసుకొని ఉంచుకుంటాను. పద్దతి కరెక్టో కాదో నాకు తెలీదు.
వెజిటబుల్ స్టాక్;అన్ని రకాల విజిటబుల్స్ అంటే క్యాబేజ్, బఠాణి, క్యారెట్,బీట్రూట్,లేత మొక్కజొన్న గింజలు అన్నీ ఉడకపెట్టి, చల్లారాక మిక్సీ లో వేసి తిప్పి పేస్ట్ చేసుకోవాలి.దానిని చల్లారాక ఫిర్డ్జ్ లో ఉంచుకోవాలి.
టమాటో ప్యూరీ;
కొన్ని నీళ్ళు బాయిల్ చేసుకొని వేడి నీటిలో టమాటాలు వేసి మూత పెట్టి పదినిమిషాలు ఉంచాలి.స్టవ్ మీదకాదు స్టవ్ పక్కన.పదినిమిషాల తరువాత కాసేపు చల్లటి నీళ్ళల్లో వేసి ఉంచాలి.తరువాత టమాటో మీద పొట్టు తీస్తే సులభంగా ఊడివస్తుంది.అలా పొట్టు తీసిన టమాటోలను మిక్సీ లో పేస్ట్ చేసుకొని ఫ్రిడ్ఝ్ లో ఉంచుకొవాలి.

కూర తో సూప్ చేసుకుందామనుకుంటే కూర ముక్కలూ , ఉల్లిపాయ ఉడకబెట్టుకొని , చల్లారాక కచ్చా పచ్చాగా మిక్సీలో వేసుకోవాలి.మూకుడులో పావు చెంచా ఆలివ్ ఆయిల్ వేసి , వేడి అయ్యాక రెండు దాల్చిన్ ముక్కలు , ఇస్టమైతే వెల్లుల్లిపాయ ఒకటి వేసి వేయించి , పేస్ట్ వేసి పచ్చి కొద్దిగా వేయించాలి. పైన సరిపడా నీళ్ళుపోసి బాయిల్ చేయాలి.అందులో రెండు చంచాలు వెజిటబుల్ స్టాక్, కొంచం ఖారం కావాలనుకుంటే చిల్లీ సాస్ కొంచం వేసుకొని బాగా బాయిల్ చేసుకొని , పైన పెప్పర్, సాల్ట్ చల్లుకొని , వేడి వేడి సూప్ ఊదుకుంటూ తాగెయ్యటమే!
మరి ఇంత డైటింగ్ చేసినా అందరమూ ఎందుకు లావయ్యి , బరువెక్కామో పరమాత్ముడికే ఎరుక!