Saturday, February 13, 2016

లావొక్కింతయులేదు!

 ఈవారం 18-2-2016 ఆంధ్రభూమిలో వచ్చిన నా కథ "లావొక్కింతయులేదు." చదవని వారు కాస్త ఓపిక చేసుకొని చదివి మీ అభిప్రాయం చెబుతారు కదూ :)
మీ వీలు కోసం స్కాన్ పేపర్ ఓపెన్ చేసి కష్టపడకుండా కథ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇక మీ ఇష్టం.
                             లావొక్కింతయులేదు!
మాలాకుమార్
"నువ్వసలు నా డైట్ గురించి సరిగ్గా పట్టించుకోవటము లేదు."మావారు నిష్టూరంగా అన్నారు.
"అదేమిటి ఉరుములేని పిడుగు? నూనె తక్కువగా వేస్తున్నాను. ఉప్పూకారం చాలా తగ్గించాను.ఆకుకూరలు పొడికూరలుగా చేస్తున్నాను, పుల్కాలు చేస్తున్నాను.ఇంకేమి చేయాలి? ఇంకెంత డైటింగ్ చేస్తారు?" ఆశ్చర్యంగా ప్రశ్నించాను.
"నేను బరువు చాలా తగ్గాలని డాక్టర్ అంటున్నాడు. డైటింగ్ సరిపోదు. నీ సొంత పెత్తనం కాదు, రోజు మా లైఫ్ సెంటర్ కు వచ్చి డైటీషియన్ తో మాట్లాడు." అని ఆర్డర్ వేసారు.
ఇహ తప్పేదేముంది ఈసురోమంటూ ఆయనతో పాటు లైఫ్ సెంటర్ కు వెళ్ళాను.ఆయన ట్రైనరు నూ , డైటీషీయన్ ను పిలిచి పరిచయము చేసారు. ఇద్దరూ సన్నగా , తెల్లగా, సన్నజాజి మొగ్గల్లా   వున్నారు."అమ్మాయిలూ మా ఆయన సంగతి పక్కన పెట్టండి, నన్ను మీలా తయారుచేయగలరా ?" ఆశగా అడిగాను. మీ పర్సనాలిటీ బాగుంది కదా మేడం అంటూ చిన్నగా  చిలకల్లా  నవ్వేసారు ఇద్దరూ! ట్రైనరూ, మావారు జిం లోకి వెళ్ళారు.వెళుతూ వెళుతూ "అన్నీ జాగ్రత్తగా కనుక్కో"అని నన్ను హెచ్చరించటం మర్చిపోలేదు మావారు.
డైట్ పిల్ల నా పక్కన కూర్చొని రెండు అచ్చులో వున్న పేపర్ లు తీసింది.దానిలో పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి  వరకూ   సమయములో ఏమి తినాలి వివరముగా వ్రాసి వుంది.
"మేడం బియ్యము పూర్తిగా మానేయాలి.దోశలు, ఇడ్లీ లల్లో కూడా వాడవద్దు." అంది.
“సరే .”
"బియ్యము బదులు, జొన్నలు, రాగులు,సజ్జలు లాంటివి వాడవచ్చు. మైదా కలవని గోధుమపిండి వాడవచ్చు."
పిల్ల చెప్పేవన్నీ శ్రద్దగా విన్నాను.ఖర్మ కాకపోతే , ఇన్నేళ్ళకు మా ఆయనకు తిండి  పెట్టాలో బొట్టె తో చెప్పించుకోవలసి వచ్చింది అని గొణుక్కున్నాను అది వేరే సంగతి. అరగంట నా బుర్ర తిన్నాక డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది.ఆయన మావారు బరువు తగ్గటము ఎంత అవసరమో, దానికి నేనెంత సహకరించాలో  చెప్పీ చెప్పీ వాయగొట్టేసాడు. బుద్దిగా బుర్రవూపానుఇలా రెండు గంటలు నానా హింసలపాలు చేసి వదిలేసారు లైఫ్ సెంటర్ వాళ్ళు!
ఇంటికి రాగానే డైట్ చార్ట్ ముందు పెట్టుకొని క్షుణం గా పరిశీలించాను.ముందుగా ధాన్యాలు కొనాలి. సలాడ్ కు , సూప్ లకు కూరగాయలు కొనాలి. మరీ రోజూ ఒకే రకంగా చేస్తే తినలేరుకదా పాపం అనుకొని గూగుల్ తీసి రకరకాల సలాడ్స్ , సూప్స్ రసిపీలు సర్చ్ చేసాను. పనిలో పని ఫ్రెండ్స్ అందరికీ మీకు తెలిసిన సలాడ్ , సూపుల రసిపీలు చెప్పండహో అని మేయిల్స్ ఇచ్చాను. పాపం అందరూ తిరుగు టపాలో బోలెడు రసిపీలు పంపారు. ఎంతైనా నా స్నేహితులు గుడ్ గర్ల్స్. సాయంకాలము సూపర్ మార్కెట్ కు వెళ్ళి ధాన్యాలన్నీ తెచ్చేసాను. ఎవరో చెప్పారు, సికింద్రాబాద్ లో ఇలా డైట్ పాటించేవాళ్ళ కోసమే  ప్రత్యేకమైన కూరగాయల షాప్ వుంది. అక్కడ సలాడ్స్ కు కావలసిన రకరకాల కొత్తరకం కూరగాయలు దొరుకుతాయి అని. అంతే చలో మంటూ వెళ్ళి వెయ్యిరూపాయల కూరలు తెచ్చేసాను.అదేమిటో ఫ్రిడ్జ్ లో అన్ని కూరలూ పట్టలేదు. పక్కింటి వాళ్ళను అడిగి  కాసిని వాళ్ళ ఫ్రిడ్జ్ లో పెట్టుకోమందామా అనుకొని వద్దులే మా ఆయన తిడతారు అని వూరుకున్నాను.
పొద్దున్నే యుద్దప్రాతిపదకాన  డైట్ ప్లాన్ మొదలు!
"ఏమండీ వేడి వేడి రాగి ఇడ్లీలు తయార్ వచ్చేయండీ."అని కేకేసాను.
"రాగి ఇడ్లీలు పుదీనా పచ్చడి బాగున్నాయోయ్ "మెచ్చుకున్నారు మావారు.ఇంకో రెండు వేసుకోండి అని ప్రేమగా వడ్డించాను.
" మృదువుగా బాగా వచ్చాయి.ఇంకా వున్నాయా ? బాక్స్ లో పెట్టి ఇవ్వు మా ట్రైనర్ కూ డైటీషియన్ కూ ఇస్తాను ."అన్నారు . మురిసిపోతూ మిగిలినవన్నీ బాక్స్ లో పెట్టి ఇచ్చాను.మరి వాళ్ళకూ తెలియాలిగా నేనెంత కష్టపడుతున్నానో!
పొద్దున రాగి ఇడ్లీ, మధ్యాహ్నము సలాడ్, రెండు ఫుల్కాలు , సాయంకాలము పెసల మొలకల చాట్, రాత్రి కి సూప్,సలాడ్, రెండు పుల్కాలు,చిన్న గిన్నెడు సొరకాయ కూరా చేసేసాను!
రాగి ఇడ్లీ లు, సజ్జ ఇడ్లీ లు, జొన్న రొట్టెలు, రకరకాల సలాడ్ లు, సూపులూ నా శక్తి కొద్దీ , మా ఆయన మీద భయం కొద్దీ వైన వైనాలుగా చేస్తున్నాను . ఇడ్లీలల్లోకి పుట్నాల పప్పూ, వేరుశెనగ పప్పూ, కొబ్బరీ వాడొద్దు అంది డైట్ పిల్ల.   ఐనా మేము మాత్రం కొబ్బరి, వేరుశెనగ తిని కొవ్వు పెంచుకుంటామా ఏమిటి ?  విడ్డూరం కాకపోతే. మాకూ తెలుసులేమ్మా మూతి తిప్పుకున్నాను.  పుదీనా , టమాటో,అల్లం పచ్చళ్ళు చేసుకుంటాములేమ్మా! .బియ్యం రవ్వ తో వద్దన్నావు సరే కానీయ్ ఏం చేస్తాను రాగి, సజ్జలతో ఇడ్లీలు చేస్తాలేవమ్మా! అన్నట్లు ఆవిరికుడుములు కాడా వున్నాయిగా! అవి చేస్తే పోలే!  ఇహ తరువాత ఐటెం సలాడ్. పాపం రోజూ ఖీరా దోసకాయ, టమాటా,ఉల్లిపాయ ఏంతింటారు? రంగురంగుల కాప్సికం లైతే తినటాని కీ , చూసేందుకూ బావుంటాయి, అన్నట్లు మధ్య క్యాబేజీ కూడా ఎరుపురంగులో వస్తోంది. అదీ బానే వుంటుందిగా . . . ఇంకా బ్రాకలీ, బఠానీలు కలిపి చేసే సలాడ్ కూడా బావుంటుంది.పాలకూర నిమ్మకాయ, ఆపిల్ కలిపి చేయొచ్చు.   వాకే డన్!  మరి అన్నము తినకూడదాయే! కనీసం కంటికింపుగానైనా వుండాలా అందుకే తిప్పలన్ని.  పాపం ఆకులూ అలములూ ఎంత తింటే కడుపు నిండాలీ!  కళ్ళనీళ్ళు,ముక్కూ తుడుచుకుంటూ, డైట్ పిల్లమీద గొణుక్కుంటూ  అనుకున్నాను .  చెప్పొద్దూ ఆయన కూడా చాలా రుచిగా చేస్తున్నావు అని తెగ మెచ్చేసుకుంటున్నారు. పాపం ఇంకేమి చేస్తారు?  జాలి తో మరీ మరీ వడ్డించేదాన్ని. కాకపోతే ఆకులూ అలములూ  తినలేక నా కోసం కూర పప్పూ వేరే  వండుకుంటున్నాను . మరి నేను ముప్పొద్దులా అన్నం తినేదాన్ని కదా ఇవేం తినగలను? మా ఆయన తినగా మిగిలినవి పనమ్మాయికి ఇచ్చేస్తున్నానుఅవునూ వాళ్ళుఇలాంటివన్నీ చేసుకోరాయే కాస్త తింటింటుంది పోనీలే.  పాపం పిల్లా బాగున్నాయమ్మా అంటూ లొట్టలేసుకుంటూ తింటోంది.
సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన ఉప్పు బిస్కెట్ పాకెట్లు , ఓట్ బిస్కెట్పాకెట్లు అలమారాలో సద్దుతూ, అరే నాకోసం తెచ్చుకున్న  క్రీం బిస్కెట్ పాకెట్ ఇక్కడ వుండాలే ఏమైంది అనుకుంటూ "ఏమండీ , మీరేమైనా క్రీం బిస్కెట్ పాకెట్ చూసారా?" అని కేకేసాను.
" . . . రాత్రి కాస్త లో సుగర్ అనిపిస్తే తిన్నాను."బదులిచ్చారు.
"మొత్తం పాకెట్ తిన్నట్లున్నారు."
"అబ్బ ఏదో తిన్నానులే వదిలేయ్!"
"వాకే వాకే."
చూస్తుండగా నెల రోజులు గిర్రున తిరిగి పోయాయి.ఆ . . .  ఎంతలో తిరుగుతాయి రోజులు!
పొద్దున్నే విచారం గా వచ్చిన మా పనమ్మాయిని ఏమైంది అట్లా వున్నావు అని అడిగాను.
"లావెక్కుతున్నావు. వళ్ళు కొవ్వెక్కింది . మధ్య నీకు తిండి ఎక్కువైంది.తిండి తగ్గించు, అని తిట్టాడమ్మా మా ఆయన. నేనెక్కువ ఏమి తింటున్నానమ్మా ?" బేలగా అడిగింది.
పరిశీలనగా చూసాను. నిజమే లావయ్యింది.పొద్దుటి నుంచీ నాలుగైదు ఇళ్ళళ్ళో పని చేస్తుంది.ఐనా నా దగ్గర తప్ప ఇంకెక్కడా ఏమీ తినదు ఏమైందో పాపం ఏమైనా హార్మోనల్ ప్రాబ్లం ఏమో నా నెట్ పరిజ్ఞా నం తో అనుకున్నాను.
"దిగులు పడకు ఏమి చేయాలో చూద్దాం ." అని ఊరడించాను.
సార్ గారు వచ్చే టైం అయ్యింది. రాగిజావ చేయాలి.పొద్దున బ్రేక్ ఫాస్ట్ కూడా సరిగ్గా తినలేదు. నిన్న క్లబ్ కు బ్రిడ్జ్ ఆడేందుకు వెళ్ళి రాత్రి చాలా ఆలశ్యంగా వచ్చారు.బోజనానికి రండీ అంటే పెగ్ విస్కీ, ప్లేట్ బటాకా వడా తిన్నాను ఆకలిలేదన్నారు. పెగ్గేనా రెండు మూడూ కానిచ్చేసుంటారు. బటాకావడ తో పాటు కట్ మిర్చీ, పల్లీలూ లాగించేసివుంటారు. లేకపోతే ఆకలెందుకువేయదుపోనీలే పాపం ఎంతకని నోరు కట్టేసుకుంటారు అనుకుంటూ రాగి పిండి తీసాను.
ఇంతలో "ఎక్కడున్నావ్ " జిం నుంచి వస్తూనే అరిచిన మావారి అరుపు వినిపించింది. ఆయనకోసం చేస్తున్న రాగి జావను అలాగే వదిలి ఏమైంది ఇలా అరుస్తున్నారు అని హడలిపోతూ పరిగెత్తాను .
"ఇప్పుడు నా వేయిట్ ఎంతో తెలుసా?"భీకరం గా అడిగారు.
ఆయన భీకరాన్నీ పట్టించుకోకుండా "ఎన్ని కిలో లు తగ్గారండీ? మీ డాక్టర్ ఏమన్నాడు.? సంబరపడిపోతూ  అడిగాను.
" నీ మొహం తగ్గటం కాదు నాలుగు కిలోలు పెరిగాను,"అరిచారు.
"హేమిటీ?"ఆశ్చర్యపోతూ ఆయిన్ని పై నుంచి కింది దాకా పరిశీలించాను. " నిజమేనండోయ్! బుజ్జి బొజ్జ ఎంచక్కగా ముందుకొచ్చిందో! సంబరపడిపోతూ బొజ్జను చిన్నగా తట్టాను.  బుగ్గలు నునుపు తేలాయి.మంచి రంగు తో నిగనిగలాడిపోతున్నాయి. బొద్దుగా , గుండ్రంగా ఎంత ముద్దొస్తున్నారండీ! జిం డ్రెస్ లో భలే స్మార్ట్ గా వున్నారు. నా దృష్ఠే తగిలేట్టుగా వుంది. వుండండి దృష్ఠి తీస్తాను." అంటూ మొట్టికాయలు తగలకుండా దూరం జరిగాను.
అప్పటి ఆయనగారి చూపు వర్ణించ నాతరమా!
ఐనా ఎక్కడ పొరపాటు జరిగింది?  అన్నీ డైట్ పిల్ల చెప్పినట్లే చేస్తున్నాను కదా.   ఏమి తేడా వచ్చిం దబ్బా!
ఎంత ఆలోచించినా ఎక్కడ పొరపాటయ్యిందో అర్ధం కాలేదు.నా ఫ్రెండ్ కు కాల్ చేసి, " మొగుడి క్షేమం కోసం లక్షవత్తులనోము,సావిత్రీ గౌరీ నోము నోచినంత శ్రద్ధగా డైట్ వంటలు  చేసాను.మా ఆయన కిష్టమైన వివాహభోజనం పాట, ఘటోద్గజుడి బొమ్మే కాదు మాయాబజార్ సినిమా సీ.డీ నే ఇంట్లో ఎక్కడా  లేకుండా చేసాను.గాంధారిలా ఆయన తినకూడనివన్నీ అన్నం తప్ప అన్నీ నేనూ తినటం మానేసాను.ఇంత చేసినా  ఐనా మా ఆయన ఒక్క గ్రాము తగ్గకుండా నెల నెలా పెరిగే బంగారం లా పెరిగారు..ధూం ధాం అంటున్నారు.నాతో మాట్లాడటం మానేసారు" బేరు మన్నాను.
"మొగుడి మీద ప్రేమ తగలెయ్య . జాలి తో ఎంత ఆకులూ అలములైతే మాత్రం వారానికి ఐదు కిలోలు కొసరి కొసరి తినిపిస్తే ఎట్లా? ఆయనా క్రీం బిస్కెట్లూ, పెగ్ విస్కీ, బటాకావడా అంటూ లాగించేస్తూవుంటే పెరగక తగ్గుతారా? నీ బొంద.లక్షవత్తులనోము కాదు నందికేశుని నోము చేసావు.ఇక నిరాహారవ్రతం ధీక్షగా చేయి.డైట్ పిల్ల ను తిట్టుకోక ఆపిల్ల చెప్పింది సరిగ్గా చేసి ఏడు.అంతా సద్దుకుంటుంది."అని హితబోధ చేసింది.
నిజమేకదా నాలిక్కరుచుకున్నాను ! ఇక జాలి దయ బంద్. స్ట్రిక్ట్ డైటింగ్ .ఎలా తగ్గరో నేనూ చూస్తాను శప థము చేసాను!

3 comments:

శ్రీలలిత said...

పతిదేవులకోసం ఎంత కష్టపడ్డారండీ.. కానీ..విధి వక్రించింది. మీ కష్టం ఫలించలేదు. మీవారి బుజ్జిబొజ్జ మీకు భలే ముద్దు కదా...మరింక బాధపడకండి.. ఆ దేవుణ్ణి నమ్ముకోవడం తప్ప మీ చేతిలో ఏముందని..పోన్లెండి.. ఈ వంకన పనిమనిషి బాగుపడింది.. హ..హ.. భలే రాసారండీ.. అభినందనలు...

Anonymous said...

Ha ha ,
Chala bavundi mala garu,inka manchi stories mee nunchi expect chestunnaru.

పరిమళం said...

ఆ సలాడ్ రెసిపీలు ఒక్కోటి టపాల్లో పెడితే మాలా(వు)టి వారికి ఉపయోగ పడతాయి కదా :)