Friday, January 28, 2011

బడిచావిడీ /సుల్తాన్ బజార్ ప్రేమికులారా * * * * *



నేను టెంత్ చదువుతున్నప్పుడు మొదటి సారిగా హైదరాబాద్ వచ్చాను . అప్పుడు మా నాన్నగారు టాక్సీ లో గోల్కొండ కోట , సాలార్జంగ్ మ్యూజియం , ఎక్జిబిషన్ చూపించారు . ఎక్జిబిషన్ లో చక్కటి వెండి గొలుసు , ఓ లంబాడి అమ్మాయి బొమ్మ కొనిచ్చారు . ఆ మరునాడు మా చెల్లాయిపిన్ని మమ్మలిని బడి చావిడీ , సుల్తాన్ బజార్ తీసుకెళ్ళింది . అమ్మ కృష్ణా క్లాత్ స్టోర్స్ లో చీరలు కొంటూ వుంటే నేను బయట నిలబడి బజారంతా చూసాను . అదో అప్పుడే సుల్తాన్ బజార్/ బడి చావిడీ తెగ నచ్చేసింది . ఆ తరువాత రెండేళ్ళకు పెళ్ళై హైదరాబాద్ వస్తానని కాని , సుల్తాన్ బజార్ చూస్తానని కాని అప్పుడూహించలేదు గా :) అందుకే కళ్ళు విప్పార్చుకొని మరీ చూసాను !!!!

పెళ్ళై వచ్చాక మా అత్తగారి తో మొదటి సారిగా బడి చావిడీ హనుమాన్ జీ గుడి కి వెళ్ళాను . అప్పటి నుంచి బడి చావిడీ / సుల్తాన్ బజార్ ల తో విడతీయరాని అనుబంధం ఏర్పడి పోయింది . షాపింగ్ ఇప్పటికీ సుల్తాన్ బజార్ వెళ్ళాలసిందే . కొత్తిమీర కట్టలు , పిన్నీసులు అమ్మే వాళ్ళ నుంచి తప్పించుకుంటూ షాపింగ్ చేసుకోవాలంటే ఎంత నైపుణ్యం కావాలి ? చక చకా జనాలను తప్పించుకుంటూ నడుచుకుంటూ వెళుతుంటే పెద్ద విజేత ననే ఫీలింగ్ రాదూ ! చాలా సార్లు సాయంకాలం టాప్ తీసేసిన రిక్షాలో దిక్కులు చూసుకుంటూ వెళ్ళేదానిని .కాసేపు అలా అలా రిక్షా లో , ఇంకాసేపు నడుచుకుంటూ వెళుతూ వుంటే అబ్బో అదో ఆనందం ! ఇప్పటికీ అప్పుడప్పుడు వెళ్ళి ఓచుట్టు తిరిగి వస్తాను . ఓ సారి మా అదితి ' అమ్మమ్మా బోర్ కొడు తోంది ' అంటే సుల్తాన్ బజార్ తీసుకెళ్ళాను . అబ్బ సూపర్ వుంది అన్నది , మా మనవరాలు . మా మనవళ్ళను రిక్షా ఎక్కిద్దామని , డబుల్ డక్కర్ బస్ ఎక్కించాలని నాకు చాలా వుండింది . కాని అవి కనుమరుగై పోయాయి ! స్చప్ . . .

నా పెళ్ళి పట్టు చీరలు నీలకంఠం బాలకృష్ణయ్య షాప్ప్ లో కొనటము తో అక్కడ నా షాపింగ్ మొదలైంది . ఆ రోజు నాకింకా జ్ఞాపకమే ! మావారి అక్కయ్య , అత్తయ్య , నేను , మా అమ్మమ్మగారు వెళ్ళాము . మేము బయిలుదేరే ముందు , మా అమ్మ పక్కకు తీసుకెళ్ళి , ' మీ ఆడపడుచు ఏది కొనిస్తే అది తీసుకో . ఈ చీర బాగుంది . ఇది బాగాలేదు అనకు ' అని చిలక్కు చెప్పినట్లు చెప్పినది . కాని అదేమిటో దుకాణం లో చీరలన్నీ ముందు వేయగానే , క్రీం కలర్ కు వైయ్లెట్ కలర్ బార్డర్ చీర నా మనసునును దోచేసింది . అప్పటి వరకూ మా ఆడపడుచు ఏ చీర చూపించినా మీ ఇష్టం అన్న దానిని , అది తీసి నా వళ్ళో పెట్టుకొనాన్నాను . ఇది కావాలి అనలేను , పక్కన పెట్టేయలేను ! మా అమ్మమ్మగారేమో ఆ చీర పక్కన పెట్టేయమని చిన్నగా నన్ను గిల్లుతున్నారు , అబ్బ ఎంత విపత్కర పరిస్తితి ! మా అడపడుచుకు తెలిసిపోయింది అది నాకు నచ్చేసింది అని . అది తీసుకుంటావా అని అడిగారు . ఊ అనీ అనకుండా అన్నాను . అంతే ఆ చీర నాకొచ్చేసింది . దాన్ని ఎన్ని సార్లు కట్టానో లెక్కలేదు . ఈ మద్యే దాని బార్డర్ తీసి , ఓ ప్లేన్ క్రీం కలర్ చీర కొని దానికి వేయించాను :)

ఏది కొనాలన్నా బేరం తప్పని సరి . చీటియేవాలే మౌజ్ ఆఠాణాకి డజన్ ఇస్తానంటే కాదు బారాణాకి ఇవ్వాల్సిందే నని వాడితో వాదించి , పోట్లాడి మరీ కొనుక్కున్నాను తెలుసా ! అంత బేరమాడాననేమో ఆ అరటిపళ్ళ వాడు ఇంకోసారి నాకు కనిపించకుండా దాక్కున్నాడు . అప్పటి కీ నేను పట్టేసి పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగెట్టాడు . అంత హడల్ మరి మనమంటే ! ఏమాటకామాటే చెప్పాలి మహాలక్ష్మీ బెంగాల్ చీరల అతను నేను వెళ్ళగానే కొత్త రకాల చీరలు తీసి చూపించేవాడు . ఎంత బాగుండేవో . 15 రూపాయలకు మామూలివి , 25 రూపాయలైతే ఇంకాస్త మంచివీ చూపించే వాడు . 25 రూపాయల చీర కొని , కాలేజ్ కి కట్టుకెళితే మా ఫ్రెండ్స్ , ఇంత కాస్ట్లీ చీర కాలేజీ కి కట్టుకొచ్చావా అని కోపం చేసేవారు :) కృష్ణా లోనూ అంతే 15 రూపాయలకు సెమీ వాయిల్ , 20 రూపాయలకు హాఫ్ వాయిల్ , 30 రూపాయలకు ఫుల్ వాయిల్ చీరలు చక్కటి రంగులలో , వివిధ ప్రింట్స్ తో చూడ ముచ్చటగా వుండేవి . కూరగాయల మార్కెట్ లో నైతే దొరకని కూర లేదు . అన్ని రకాలు దొరుకుతాయి . బేరం తప్పని సరి ! కోటీ విశాలంద్రా ఇప్పటికీ నేను వెళ్ళే చోటు . కోటీ లోని ఖాదీ బండార్ షాప్ నుంచే మా మామగారు , ధోతులు , మంచం నవారు కొనేవారు . చాట్ తినాలంటే కోటీ షాలిమార్ వెళ్ళాల్శిందే.

ఎన్ని ఎన్నెన్ని జ్ఞాపకాలో ! అన్నీ కను మరుగై పోతాయట . మెట్రో లైన్ వేసేందుకు , బడి చావిడీ / సుల్తాన్ బజార్ లోని షాప్ లను పడగొడుతున్నారని , రూపురేఖలే మారిపోతున్నాయని , పేపర్ లో చదవగానే చాలా బాధ కలిగింది . నీలకంఠం దుకాణం , ఆర్యసమాజ్ , జేన్ భవన్ అన్నీ తీసేస్తారట . ఇంకో పది రోజులలో కూల్చివేతలు మొదలవుతాయట . దుకాణదారులంతా తీసేయొద్దు అని పిటీషన్ లు పెడుతున్నారట . ఇదంతా చదవగానే మనసు కలిచేసింది . ఏమో ఎంత మారిపోతుందో ఏమో అని , హడావిడి గా వెళ్ళి మా హనుమాన్ జీ ని చూసుకొని , బజారంతా కలియదిరిగి వచ్చాను . పనిలో పని 5 రూపాయలకు ఓ పిన్నీసు పాకెట్ ఇస్తే బేరమాడి పది కి మూడు కొనుక్కొని వచ్చాను !

నాలాంటి సుల్తాంబజార్ / బడి చావిడీ ప్రేమికులు ఎవరైనా వుంటే ఓసారి వెళ్ళీ చుట్టేసి రండి . ఎటొచ్చి ఎటుపోతుందో ! త్వరపడండి !!!!!

Thursday, January 6, 2011

నా 16 గురు అభిమానులకు విజ్ఞప్తి * * * * *



గౌరవ్ ను ఎత్తుకొని , మేఘ చేయి పట్టుకొని , గేట్ దగ్గర బెలూన్ వాడి దగ్గర బేరమాడుతున్నాను . గౌరవ్ ఆ (( ఊ (( అంటూ వాడికే బెలూన్ కావాలో చూపిస్తున్నాడు . అవును మరి ఇది గౌరవ్ కు ఇంకా మాటలు రానప్పటి సంగతన్నమాట ! మా గేట్ ఎదురుగా వున్న కాంపౌండ్ గోడ దగ్గర వరుసగా చాలా బైక్ లు పార్క్ చేసి వున్నాయి . అందులో ఓ బైక్ మీద ఓ అమ్మాయి అటు తిరిగి కూర్చొని వుంది . ఆ అమ్మాయికి ఎదురుగా ఓ అబ్బాయి ఆ అమ్మాయి మీదకు వాలిపోతూ , ఇంచుమించు ఒకరి మీద ఒకరు పడిపోయి , చుట్టుపక్కల ద్యాస లేకుండా కువ కువ లాడుతున్నారు . ఆ అమ్మాయిని చూస్తూ మేఘ హే . . . బామ్మా లుకెట్ దట్ గర్ల్స్ హేయిర్ . సో లాంగ్ అని చూపించింది . అసలు వాళ్ళిదరినీ చూసేందుకే ఇబ్బంది పడుతూ , బెలూన్లు ఎంత తొందరగా కొనేసి , ఎంతతొందరగా ఇంట్లోకి పిల్లలను తీసుకెళిపోదామా అన్న తొందరలో నేను ఆ అమ్మాయి జుట్టు చూడలేదు . చక్కగా , బారుగా , పెద్ద పోనిటేల్ వేసుకొని వుందామ్మాయి . నేనూ ఆ జుట్టును మైమరచి చూస్తుండగానే , బెలూన్ వాడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు . ఇంతలో ఓ నలుగురు అబ్బాయిలు అక్కడి కొచ్చి ఆ అమ్మాయి జడను పట్టి గుంజుతూ గోల గోలగా అరుస్తున్నారు . ఆ అమ్మాయి ఎదురుగా అప్పటి వరకు కువ కువ లాడుతున్న అబ్బాయి వాళ్ళను నెట్టేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు . అమ్మాయేమో కీచుగా అరుస్తోంది . సినిమాలల్లో తప్ప , బయట అలాంటి దృశ్యము చూడనినేను నిశ్చేస్టనయ్యాను . ఏమి చేయాలో తోచలేదు . పక్కన ఇద్దరు చిన్న పిల్లలు . . . ఇంట్లో ఇంకెవరూ లేరు . . . పనమ్మాయి శారద బజారుకెళ్ళింది . మేఘ , గౌరవ్ కూడా వాళ్ళ బెలూన్ ల మాట మరిచి అటేచూస్తున్నారు . . . ఇంతలో ఆ అమ్మాయి గిర్రున ఇటుతిరిగింది . . .వెంటనే మా మేఘ హే . . .బామ్మా షి ఈజ్ నాటే గర్ల్ . హి హీజె గై అని గట్టిగా అరిచింది . ఆ అబ్బాయిలూ మావైపు నవ్వుకుంటూ చూసి , మా పక్కింట్లోకి వెళ్ళిపోయారు ! ఇంతలో శారద వచ్చి , మమ్మలిని అలా చూసి ఏమైందమ్మా అంది . నేను లోపలి కెళుతూ జరిగింది చెప్పాను . ఓ వాళ్ళా అమ్మా వాళ్ళు సినిమాలలో , టి . వీ సీరియలస్ ల లో విలన్ దగ్గరుండే రౌడీ గాంగ్ వేషాలు వేస్తారు . మన పక్కింట్లో సినిమా కంపెనీ వుంది . అక్కడ విలన్ ల కు ట్రైనిగ్ ఇస్తూవుంటారు అని వివరించింది . అంటే మేము విలన్ డెన్ పక్కన వున్నామన్నమాట !!!!!!!

శారద పిల్లలను ఆడిస్తూ వుంటే , నేను బాల్కనీ లో కూర్చొని పుస్తకం చదువుకుంటూ వున్నాను . ' ఆంటీ , ఇక్కడ ఇల్లు అద్దె కు వుందా ? ' అని వినిపించింది . తలపైకెత్తి చూస్తే , మా గేట్ ముందు నలుగురబ్బాయిలు , వాళ్ళ వెనుక ట్రాలీ లో సామాన్ లూ కనిపించారు . లేదు బాబూ అని నేను అనగానే అందులోని ఓ అబ్బాయి ఏదో సైగ చేసాడు . వీడి దుంపతెగ , ఈ పోరగాడేమిటి , ఇలా సైగచేస్తున్నాడు అని కోపం గా అరవబోయాను . అప్పుడే పైకి వచ్చిన శ్రీధర్ , ' మేడం అది షూటింగ్ . ఎవరో టి .వి సీరియల్ వాళ్ళు మన గేట్ బాగుందని దాని ముందు షూటింగ్ చేసుకుంటున్నారు . మిమ్మలిని అడగటములేదు అని సైగ చేస్తున్నాడు ఆ అబ్బాయి ' అన్నాడు . హోరినీ అనుకొని నేనూ చూస్తూ కూర్చున్నాను . అలా సాయంకాలం వరకూ , మా కాలినీలో వున్న ఇళ్ళ ముందు ఆ షూటింగ్ చేస్తూ కనిపించారు . ఆ సీరియల్ పేరు , ఈ భాగం ఏ రోజు వచ్చేది , అసలు ఈ సీరియల్ ఏ చానల్ లో వచ్చేదీ భోగట్టా కనుక్కొని వచ్చింది మా వంటావిడ సావిత్రి . అసలే ఆవిడకు సినిమా వాళ్ళను చూడటము తెగ పిచ్చి . గణపతి కాంప్లెక్స్ దగ్గర ఎవరైనా వున్నారంటే చాలు వుడుకుతున్న వంట కింద ఆర్పేసి అటుపరుగెత్తుతుంది . అక్కడ ఎప్పుడూ ఎవరో వకరు , ముఖ్యంగా సాయంకాలమైతే కిట కిట లాడుతూ టి. వీ ల వాళ్ళు వుంటూనే వుంటారు . వాళ్ళను మైమరచి చూస్తూ , కొండకచో కొంతమందిని పలకరిస్తూ వంట సంగతి మర్చిపోతుంది ! అక్కడ వాళ్ళున్నారు , వీళ్ళున్నారు అని చెప్పకు అని శారదను , శ్రీధర్ నూ కోపం చేస్తాను . వాళ్ళేమో చెప్పక పోతే సావిత్రీ ఆంటీ తిండి పెట్టదని భయపడి చెప్పేస్తారు . సరే మా గేట్ ను టి. వీ లో చూసుకుందామని , అప్పటి నుంచి ఆ సీరియల్ ఇదో వస్తుంది , అదో వస్తుంది అని , టి. వి ని కళ్ళు లాగేటట్టు , తల పగిలిపోయేట్టు చూసి విసుగొచ్చి ఆఫ్ చేయగానే , మొహమింత చేసుకొని సావిత్రి పైకొచ్చి , మన గేట్ , మిగితా వాళ్ళ గేట్ కంటే బాగా వచ్చిందండి . ఎంత బాగుందో అని చెప్పింది . నేను అయ్యో నేను ఇంకాసేపు చూడాలిసిందే అనుకున్నాను ((((((

ఇలా అడపా దడపా ఎవరో , నువ్వు టి . వి లో చూడలేదా ? బాగా చూపించారనటము , పలానా న్యూస్ టి. వి లో చూపించారుగా అని చెప్పటమూ విని నేను కొన్ని రోజులు టి .వి పెట్టి దాని ముందు సెటిలైపోతాను . అదేమిటో నేను చూసినన్ని రోజులూ ఏ ఎక్సైటింగ్ న్యూసూ రాదు . పైగా కింద రెండు స్క్రోలింగ్ న్యూస్లూ , వాటి మీద బ్రేకింగ్ న్యూస్ , ఆపైన ఇంకో న్యూసూ , మద్య లో కని కనిపించకుండా మనుషులూ . . . అసలు ఎటుచూడాలో , ఏ న్యూస్ చదవాలో తెలీక కళ్ళను గిర్రున తిప్పుతుంటానా . . . కళ్ళు గిర్రున తిరగటము , అసలు మామూలుగా కూడా ఎటు చూస్తున్నానో తెలీక పోవటము , చక్కరొచ్చినట్లు వుండటము , మెడ నొప్పి మొదలైనవి వస్తాయి . మొదట్లో తెలీక ఏరోగమొచ్చిందో ఏంపాడో అని భయపడి చచ్చి , మా కజిన్ డాక్టర్ .కుమారి దగ్గరి కెళ్ళి చూపించుకున్నాను . స్పాండిలైటిసేమో , ఇప్పుడే ఇట్లా వుంది అన్నావు కదా , ఓ రెండు రోజులు సూజెరాన్ వేసుకొని పడుకో తగ్గి పోతుందిలే అంది . అదేసుకున్నప్పటి నుంచీ మత్తు మత్తుగా వుంటుంది . ఐన అలానే వేసుకున్నాను . తగ్గిపోయింది . . . గాయబ్ . . . . అమ్మయ్య అనుకున్నాను . మళ్ళీ , ఎవరో దేని గురించో చెప్పటము . . . నేను టి వి ముందు . . . కళ్ళు గిర గిరా . . . సుజెరాన్ . . . మత్తు . . . హుం . ఇలా కాదు అనుకొని మా జయ కు చెప్పాను , నువ్వు ఎప్పుడైనా టి .వి చూస్తుండ గా ఏదైనా ఎక్సైటింగ్ న్యూస్ చూస్తే నాకు కాల్ చేసి చెప్పు . అప్పుడు నేను టి . వి చూసింగ్స్ అని . సరే నని తలాడించింది . తను చూడటము జరుగుతే వెంటనే పాపం కాల్ కూడా చేస్తుంది .

మరింకేమిటి ప్రాబ్లం ? అని విసుక్కోకండి 16 గురు అభిమానులు . ఆ సంగతే చెపుతున్నాను . ఆ న్యూసైపోయాకే నాకు తెలుస్తోంది అదేమిటి నువ్వు చూడలేదా ? నాకు కాల్ చేయలేదా అని మా జయ ను అడిగుతే ఎందుకు చేయలేదు సెల్ కు చేసాను , లాండ్ లైన్ కు చేసాను . తమరు బిజీ . ఫోన్ లిఫ్ట్ చేయరు అంటుంది . అరే సెల్ వున్నది ఎందుకు ? బయటకు వెళ్ళి నప్పుడు ఏదైనా అవసరముంటుందేమో నని కదా ? అందుకే దాన్ని పర్స్ లోనే పెడతాను . పర్స్ ఎక్కడుంటుంది ? అలమారాలో . అంతే కాని ఇంట్లో కూడా పర్స్ భుజానేసుకొని తిరుగుతానా ??? మరి లాండ్లైన్ మాట అంటారా ? నేను బయట బాల్కనీ లో కూర్చొని ఏ నవలో చదువుకుంటూ వుంటాను . లేదా లాప్ టాప్ లో ఏదో పని చేసుకుంటూ వుంటానా ?? అహ ((( వుంటానా లేదా ? మరి అప్పుడు అవి పక్కన పెట్టి చిన్నగా రావాలా వద్దా ? గబ గబా రావటానికి నేనేమైనా చిన్న దాన్నా చితక దాన్నా ? గబ గబ గా వస్తూ జారిపడితే ? పుటుక్కున ఎముక ఇరుగుతే ఎవరిది పూచీ ???? అహా ((((( అసలు ఎవరిదీ అంటా ?? నేనొచ్చేలోపలే కొంపలు మునిగిపోతునట్లు ఫోన్ పెట్టేస్తారు . మాకు కాలరైడి లేదు . మరి ఎవరు కాల్ చేసారో నాకెలా తెలుస్తుంది ? పోనీ అని హడావిడి గా వస్తానా అప్పుడేమో మేడం మేము ఫలనా బాంక్ నుంచి చేస్తున్నాము . మీకప్పిస్తాము అని తెగ మొహమాట పెట్టేస్తారు . లేదా ఏ చీర లో దుకాణం వాడో మా దగ్గర కొత్త స్టాక్ వచ్చింది . మా దగ్గర అరువుబేరం కలదు అంటారు . చిన్నప్పుడు ఆటల్లో మా దోస్త్ ,
తిందాం తిందాం ,
ఎక్కడ తెచ్చుకు తిందాం ,
అప్పు తెచ్చుకు తిందాం ,
అప్పెట్ల్లా తీరుద్దాం ,
ఎగ్గొట్టిపోదాం . అని ఐదు వేళ్ళూ చూపిస్తూ పాడేది . మరి అలా చేస్తే మా ఆయన నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టరూ ? ఈ ఫోన్ల కోసం అని నా ఇల్లు వదలలేనుగా ! ఎంతసేపూ ఫోన్ ఎత్తవూ , మాట్లాడవూ అంటారేగాని అర్ధం చేసుకోరూ !

అరే వస్తున్నా అసలు సంగతికి . ఉపోద్ఘాతం లేకుండా చెప్తే ఎలా అర్ధం అవుతుంది ? మొన్న పొద్దున నేను కాఫీ కలుపుతుండగా బయట నుంచి మా వారు ఘట్టిగా మాలా అని గావుకేక పెట్టారు . ఏమైందా అని హడలిపోతూ పరిగెట్టుకుంటూ వెళ్ళాను . నిన్న మద్దెల సూరిని హత్య చేసింది మన ఇంటి దగ్గరే చూడు అని పేపర్ చూపించారు . అవునా అని బోలెడు హాచర్య పోతూ పేపర్ చూస్తున్నానా , జయ ఫోన్ చేసింది . ఫోన్ ఎత్తగానే , నిన్న రాత్రి నుంచి ఎక్కడున్నావు తల్లీ ? ఫోన్ చేసి చేసి నీరసమొచ్చింది . టి. వి లో అంతా మద్దెలసూరి హత్య , యూసుఫ్ గూడా , గణపతి కాంప్లెక్స్ చూపిస్తున్నారు . మీరెలా వున్నారో , అసలు బావగారు వూళ్ళో వున్నారో లేదో , నువ్వెంత భయపడుతున్నావో నని , రాత్రి టి. వి లో న్యూస్ చూనప్పటి నుంచి నీ ఫోన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను అని గయ్ మంది . నేను ఆ టైం లో ఇంట్లోనే వున్నాను . మా ఫ్రెండ్స్ వస్తే మాజాంగ్ ఆడుతున్నాను . పనమ్మాయి శైలజ కూరలకోసమని గణపతి కాంప్లెక్స్ దాకా వెళ్ళి వచ్చింది కూడా . మాకసలు తెలీదు . నిన్న సూరి హత్య అయ్యింది అని మీ బావగారు చెప్పారు కాని ఆయన అలసిపోయివుండటము తో టి. వి పెట్టలేదు . ఇదో ఇప్పుడే పేపర్ లో చూస్తున్నాము అని చెప్పి ఫోన్ పెట్టేసాను .

ఏమండీ నిన్న మీరు వచ్చేటప్పుడు తెలీలేదా ? ఆ టైం లో వచ్చి వెళ్ళారుగా అని అడిగాను . అవును , గణపతి కాంప్లెక్స్ దగ్గర గుంపుగా మనుషులు , కెమెరాలూ , పోలీసులూ కనిపిస్తే ఏదైనా షూటింగేమో అనుకున్నాను అని జవాబిచ్చారు మావారు . శైలజ ను పిలిచి అడుగుతే అవునాండీ ?? ఇక్కడే జరిగిందాండీ ??? నేనుకూరలకెళ్ళేటప్పుడు రోడ్ మీద ఒక్కరూ లేరు . షాప్ ల లోనూ లేరు . ఎప్పుడూ కిట కిటలాడుతూవుంటుంది , ఇంత ఖాళీగా వుందేమిటా అనుకున్నానండీ అంటూ నన్ను మించి ఆశ్చర్యపోయింది !

హుం . . . మన ఇంటి పక్కనే హత్య జరుగుతే మనకు తెలీదు !

షూటింగ్ అనుకున్నారు మావారు హుం !

రాత్రంతా టి. వి లో మన చుట్టు పక్కల పరిసరాలు చూపిస్తే మనం చూడనే లేదు . హుం . . . హుం . . .

ఇప్పుడైనా చూడాల్సిందే నని రెండు రోజులుగా కళ్ళు తెరుచుకొని , కనురెప్ప మూయకుండా , గుడ్ళు పేలిపోయేట్టుగా . . . ఏఖధాఠిగా . . . టి. వి చూస్తున్నాను . ఏదో ఒక చానల్ లో చూపకపోతారా అని న ఆశ ! స్చప్ . . . ఆశా నిరాశేనా ? ఎప్పటికీ మా ఇంటి చుట్టు పక్కలను టి. వి లో చూడలేనా ????? లేదూ . . . లేదూ . . . లేదూ . . . ఇన్ని షూటింగ్స్ అవుతున్నాయి . ఇంతమంది చానళ్ళ వాళ్ళు వాన్ లలో తిరుగుతూ వుంటారు . ఏదో ఒక రోజు తప్పక చూస్తాను . . . అని కృతనిశ్చయముతో టి. వి ని చూస్తున్నాను . మళ్ళీ . . . కళ్ళు గిర గిరా . . . నో సుజెరాన్ . . . ఐనా సరే పట్టువదలని విక్రమార్కిణిలా టి. వి చూస్తూనే వున్నాను * * * చూస్తూనే వుంటాను * * * * *

కావున ఓనా 16 గురు అభిమానులారా (అవునూ , డాష్ బోర్డ్ మీద 16 గురున్నారు . బ్లాగ్ కొచ్చేసరికి 14 మందే వున్నారేమిటి ? అటునించి ఇటోచ్చేసరి ఇద్దరు ఎటుపరుగెడుతున్నట్లు ? ) . . . నా విజ్ఞప్తి ని ఆలకించండి . అదేమనగా కొన్ని రోజులు నాటపాలు రాకపోవచ్చు . అమ్మయ్య అనుకోకండి . నాకు తొందరోలోనే టి. వి లో మా ఇంటి పరిసరాలు కనిపించాలని నా తోపాటు ఆ భగవంతుని మీరూ ప్రార్ధించండి . అంతే కాని కనిపించకూడదు అని ప్రార్ధించకండి .

వాకేనా ???? ?

మరి వుంటా బై .

Sunday, January 2, 2011

1970 love story




నాజ్ సెంటర్ కెళ్ళి గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కుందాము వస్తావా అని మా ఫ్రెండ్ దేవమణి అడిగింది . గ్రీటింగ్ కార్డ్స్ నా ఎందుకు ? అన్నాను నేను . న్యూయియర్ కి మా వాళ్ళందరికీ పంపాలి . ఐనా న్యూ ఇయర్ లో గ్రీటింగ్స్ ఇచ్చుకోరా మీరు అంది మణి . ఏదేమిటో నాకు తెలీదని చాలా సిన్సియర్గా ఒప్పుకున్నాను . అవును మరి అప్పటి వరకూ స్కూల్ లో కూడా ఎప్పుడూ న్యూ ఇయర్ కు విష్ చేసుకున్న గుర్తు లేదు ! నేను గుంటూర్ వుమెన్స్ కాలేజ్ లో పి.యు .సి చదువుతూ హాస్టల్ లో వున్నప్పుడు , అలా మొదటి సారిగా న్యూయియర్ కు గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటారని , విష్ చేసుకుంటారని తెలిసింది :) అప్పుడే గుంటూర్ లో కొత్తగా నాజ్ సెంటర్ వచ్చింది . అక్కడ ఇలాంటి వెరైటీ షాప్స్ వుండేవి . అక్కడ నుంచి పది రూపాయలకు కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ కొనుకొచ్చుకొని మణి ఆధ్వర్యములో మా ఫ్రెండ్స్ అందరమూ ఒకరికొరం ఇచ్చుకొని మా మొదటి హాపీ న్యూయియర్ చేసుకున్నాము .

నా రెండో కొత్తసంవత్సరాని కల్లా నా పెళ్ళైంది . కొత్త సంవత్సరం కోసమని ఆరునెలల ముందే ఏర్పాట్లు మొదలుపెట్టారు మా వారూ , ఆయన ఫ్రెండ్స్ . అప్పుడు మేము పూనా లో దపోడీ లోని మిలటరీ ఇంజనీరింగ్ కాలేజ్ కాంపస్ లో వుండే వాళ్ళము . అందరూ స్టూడెంట్ ఆఫీసర్స్ నే . కొత్తగా పెళ్ళైన వాళ్ళే . మొదటి సారిగా భార్య తో కలిసి కొత్తసంవత్సరము డాన్స్ లో పార్టిస్పేట్ చేస్తున్నారు . ఎంత హంగామా . . . . . ఎంత హంగామ . దాని కోసమని డాన్స్ నేర్చుకోవటానికి , పూనా మేన్ స్ట్రీట్ లో వున్న డాన్స్ క్లాస్ లో చేరాము . డాన్స్ నేర్పించే అతని పేరు జేంస్ , అతని భార్య పేరు మేరీ అనుకుంటా . సరిగ్గా గుర్తులేదు . అలానే అనుకుందాం పోయిందేముంది ? జేంస్ పెద్ద గాలి వేస్తే ఎగిరిపోయేటట్టుండే వాడు , దానికి తగ్గట్టు టైట్ పాంట్ , టీషర్ట్ . చూడగానే నాకు చార్లీ చాప్లిన్ గుర్తొచ్చేవాడు . వన్ టూ త్రీ ఫౌర్ అంటూ స్టెప్స్ వేయిస్తుంటే నాకు చచ్చే నవ్వొచ్చేది . నవ్వుదామా అంటే , మావారేమో మహా సీరియస్ గా లైఫ్ అండ్ డెత్ క్వెశ్చన్ అన్నట్లు స్టెప్స్ వేస్తుండేవారు . మూతి బిగ బట్టుకొని అలానే స్టెప్స్ వేసేదానిని :) నో మేడం . అంత సీరియస్గా వుండకూడదు కాస్త లాఫింగ్ ఫేస్ వుండాలి అనేవాడు . హుం . . . నాయనా కొంచమేమిటి బోలెడంత లాఫింగూ అనుకునేదానిని , మనసులోనే సుమా ! పైకంటే ఇంకేమైనా వుందా ? అలా . . . అలా నవ్వుకుంటూ . . . నవ్వాపుకుంటూ మొత్తానికి న్యూయియర్ కల్లా డాన్స్ నేర్చుకున్నామండి .

ఓపక్క డాన్స్ క్లాస్లూ ఇంకో పక్క మేకప్ క్లాసులూ . మా ఇంట్లోనే కాప్టెన్ ఖన్నా , మిసెస్ . మౌళీ ఖన్నా వుండేవారు . క్వాటర్ లు తక్కువగా వుండటము వలన ఒకరింట్లో ఇంకొకరు , వాళ్ళకు ఇల్లు దొరికేదాకా షేర్ చేసుకొని వుడేవాళ్ళము . మాకు ముందుగా దొరకటముతో , మూడునెలలు కాప్టెన్ రామానుజం వాళ్ళు మాతో వున్నారు . వాళ్ళు వెళ్ళిపోయాక ఖన్నా వాళ్ళు వచ్చారు . మౌళి , పెళ్ళికి ముందు ఏయిర్ హోస్టెస్ గా చేసేది . అందువల్ల తనకు లేటెస్ట్ ఫాషన్స్ బాగా తెలిసేవి . నాకు ముందుగా ముడి వేయటము నేర్పింది . అప్పట్లో షర్మిళా ఠాగూర్ , ఆషాపరేక్ లాంటి హిందీ హీరోయిన్స్ బాక్ కోంబింగ్ చేసి , నడి నెత్తి మీదకు ఎత్తుగా కొప్పేసేవారు . మోకాళ్ళ దగ్గరగా చీరను టైట్ చేసి పిన్ పెట్టేవారు . అది చాలా ఫాషన్ . నాకు మామూలుగా కొప్పేయాలంటే నే , వత్తు జుట్టు మూలం గా చేతులు నొప్పులు అనేది మౌళి . పైగా మావారేమో బాక్ కోంబిన్ చేయమనేవారు . బాక్ కోంబింగ్ చేయకుండానే నారదుని మించిన కొప్పు . ఇహ బాక్ కోబ్ చేస్తే ఆ చిక్కులు తీసేటప్పటి కి , నేనూ , మౌళీ నీరసించేవాళ్ళము ! మావారి తో పోట్లాడి , గొడవపడి , ఇలా విసిగిస్తే నేను మాల కు హేయిర్ స్టైల్స్ నేర్పను అని బెదిరించి , మొత్తానికి ఏమైతేనేమి , మావారి దగ్గర నుండి వితౌట్ బాక్ కొంబింగ్ హేయిర్ స్టైల్ కు పర్మిషన్ సంపాదించింది మౌళి . హమ్మయ్య బతికిపోయాననుకున్నాను నేను ! సో మొత్తానికి , హేయిర్ స్టైల్ , సారీ స్టైల్ నేర్చుకున్నాను . న్యూయియర్ పార్టీకీ రెడీ .

రివర్ డాన్స్ అని పూనా లోని ముల్లా ముట్టా నదుల సంగమం మీద డాన్స్ పార్టీ అరేంజ్ చేసారు . రివర్ మీద చెక్కల తో స్టేజ్ లా కట్టారు . దాని మీదే బాండ్ . దాని మీదే డాన్స్ . అప్పటి ప్రముఖనటి తనూజ మా పార్టికి గెస్ట్ గా వచ్చింది . అమ్మో ఎంత మందో ! అన్ని యూనిట్ల వాళ్ళూ అక్కడే . అప్పటి వరకూ సరదాగానే వున్నా ఆ హడావిడి చూసేసరికి గుండెల్లో దడ . . . కాళ్ళల్లో వణుకు . . . పైగా టైట్ గా కట్టిన చీరతో అడుగులు తడబడు . . . తలమీద బేద్ద ముడి బరువు . . . అంతా కాసేపే . మా ఫ్రెండ్స్ అందరమూ గోల గోల గా కబురులూ డాన్సు . అంతే రాత్రి తెల్లవార్లూ డాన్సే . పొద్దునకల్లా అలసి సొలిసి మెస్ వాళ్ళు పెట్టిన బ్రేక్ ఫాస్ట్ తిని ఇంటికి చేరాము .


నలభై సంవత్సరాల తరువాత *************

రెండు నెలలక్రితం మా కొడుకు ,కోడలు , మనవడు , మనవరాలు యు. యస్ కు తిరిగి వెళ్ళారు . మా అమ్మాయి అత్తవారింట్లో వుంది . 1970 లో లా 2010 లోనూ నాకు నువ్వూ , నీకు నేను , ఒకరికొకరం నువ్వూనేనూ - - - మేమిద్దరమే :)


నిన్న రాత్రి యం . సి . యం . ఈ ఆ ఫీసర్స్ మెస్ పార్టీ లో , పూనా న్యూ యియర్ పార్టీ గురించి నా బ్లాగ్ లో రాసానని మావారికి , కల్నల్ . జాగిర్దార్ కు చెప్పాను . ప్రభా జాగిర్దార్ వెంటనే , అరే మీరు కూడా జేంస్ దగ్గరికి డాన్స్ క్లాసెస్ కు వెళ్ళారా అని , కల్నల్. జాగిర్దార్ కుమార్ తుంభీ గయేక్యా అని ఆశ్చర్యపోయారు . ఆ టైం లో వాళ్ళెళ్ళారు , ఈ టైం లో వీళ్ళేళ్ళారూ అనుకుంటూ ఇంకా ఎవరెవరు డాన్స్ నేర్చుకోవటానికి వెళ్ళారో గుర్తుతెచ్చుకున్నారు . అంటే ఫ్రెండ్స్ అంతా ఒకరికి తెలీకుండా ఇంకోరు క్లాస్ లకు వెళ్ళారన్నమాట వాళ్ళ గొప్పలు చూపించుకోవటానికి :) అందుకే మా కిచ్చిన అరగంటా కాగానే మమ్మలిని , కొంచం ఎక్కువసేపు వుంటామన్నా వుండనీయకుండా పంపేసేవాడు ! ఆ పార్టీని , జేంస్ ను తెగ తలుచుకొనారు , ఫ్రెండ్స్ ఇద్దరూ ! ' మాలా మమ్మలిని ఫార్టీ యియర్స్ వెనకకి తీసుకెళ్ళావు ' అని నన్నూ మెచ్చుకున్నారు :)

లవ్ స్టోరీ అంటూ కొత్త సంవత్సరం కథలు చెప్పానంటారా ? అంతే ఇంకేముంది చెప్పేందుకు ?

happy new year