Friday, January 28, 2011

బడిచావిడీ /సుల్తాన్ బజార్ ప్రేమికులారా * * * * *నేను టెంత్ చదువుతున్నప్పుడు మొదటి సారిగా హైదరాబాద్ వచ్చాను . అప్పుడు మా నాన్నగారు టాక్సీ లో గోల్కొండ కోట , సాలార్జంగ్ మ్యూజియం , ఎక్జిబిషన్ చూపించారు . ఎక్జిబిషన్ లో చక్కటి వెండి గొలుసు , ఓ లంబాడి అమ్మాయి బొమ్మ కొనిచ్చారు . ఆ మరునాడు మా చెల్లాయిపిన్ని మమ్మలిని బడి చావిడీ , సుల్తాన్ బజార్ తీసుకెళ్ళింది . అమ్మ కృష్ణా క్లాత్ స్టోర్స్ లో చీరలు కొంటూ వుంటే నేను బయట నిలబడి బజారంతా చూసాను . అదో అప్పుడే సుల్తాన్ బజార్/ బడి చావిడీ తెగ నచ్చేసింది . ఆ తరువాత రెండేళ్ళకు పెళ్ళై హైదరాబాద్ వస్తానని కాని , సుల్తాన్ బజార్ చూస్తానని కాని అప్పుడూహించలేదు గా :) అందుకే కళ్ళు విప్పార్చుకొని మరీ చూసాను !!!!

పెళ్ళై వచ్చాక మా అత్తగారి తో మొదటి సారిగా బడి చావిడీ హనుమాన్ జీ గుడి కి వెళ్ళాను . అప్పటి నుంచి బడి చావిడీ / సుల్తాన్ బజార్ ల తో విడతీయరాని అనుబంధం ఏర్పడి పోయింది . షాపింగ్ ఇప్పటికీ సుల్తాన్ బజార్ వెళ్ళాలసిందే . కొత్తిమీర కట్టలు , పిన్నీసులు అమ్మే వాళ్ళ నుంచి తప్పించుకుంటూ షాపింగ్ చేసుకోవాలంటే ఎంత నైపుణ్యం కావాలి ? చక చకా జనాలను తప్పించుకుంటూ నడుచుకుంటూ వెళుతుంటే పెద్ద విజేత ననే ఫీలింగ్ రాదూ ! చాలా సార్లు సాయంకాలం టాప్ తీసేసిన రిక్షాలో దిక్కులు చూసుకుంటూ వెళ్ళేదానిని .కాసేపు అలా అలా రిక్షా లో , ఇంకాసేపు నడుచుకుంటూ వెళుతూ వుంటే అబ్బో అదో ఆనందం ! ఇప్పటికీ అప్పుడప్పుడు వెళ్ళి ఓచుట్టు తిరిగి వస్తాను . ఓ సారి మా అదితి ' అమ్మమ్మా బోర్ కొడు తోంది ' అంటే సుల్తాన్ బజార్ తీసుకెళ్ళాను . అబ్బ సూపర్ వుంది అన్నది , మా మనవరాలు . మా మనవళ్ళను రిక్షా ఎక్కిద్దామని , డబుల్ డక్కర్ బస్ ఎక్కించాలని నాకు చాలా వుండింది . కాని అవి కనుమరుగై పోయాయి ! స్చప్ . . .

నా పెళ్ళి పట్టు చీరలు నీలకంఠం బాలకృష్ణయ్య షాప్ప్ లో కొనటము తో అక్కడ నా షాపింగ్ మొదలైంది . ఆ రోజు నాకింకా జ్ఞాపకమే ! మావారి అక్కయ్య , అత్తయ్య , నేను , మా అమ్మమ్మగారు వెళ్ళాము . మేము బయిలుదేరే ముందు , మా అమ్మ పక్కకు తీసుకెళ్ళి , ' మీ ఆడపడుచు ఏది కొనిస్తే అది తీసుకో . ఈ చీర బాగుంది . ఇది బాగాలేదు అనకు ' అని చిలక్కు చెప్పినట్లు చెప్పినది . కాని అదేమిటో దుకాణం లో చీరలన్నీ ముందు వేయగానే , క్రీం కలర్ కు వైయ్లెట్ కలర్ బార్డర్ చీర నా మనసునును దోచేసింది . అప్పటి వరకూ మా ఆడపడుచు ఏ చీర చూపించినా మీ ఇష్టం అన్న దానిని , అది తీసి నా వళ్ళో పెట్టుకొనాన్నాను . ఇది కావాలి అనలేను , పక్కన పెట్టేయలేను ! మా అమ్మమ్మగారేమో ఆ చీర పక్కన పెట్టేయమని చిన్నగా నన్ను గిల్లుతున్నారు , అబ్బ ఎంత విపత్కర పరిస్తితి ! మా అడపడుచుకు తెలిసిపోయింది అది నాకు నచ్చేసింది అని . అది తీసుకుంటావా అని అడిగారు . ఊ అనీ అనకుండా అన్నాను . అంతే ఆ చీర నాకొచ్చేసింది . దాన్ని ఎన్ని సార్లు కట్టానో లెక్కలేదు . ఈ మద్యే దాని బార్డర్ తీసి , ఓ ప్లేన్ క్రీం కలర్ చీర కొని దానికి వేయించాను :)

ఏది కొనాలన్నా బేరం తప్పని సరి . చీటియేవాలే మౌజ్ ఆఠాణాకి డజన్ ఇస్తానంటే కాదు బారాణాకి ఇవ్వాల్సిందే నని వాడితో వాదించి , పోట్లాడి మరీ కొనుక్కున్నాను తెలుసా ! అంత బేరమాడాననేమో ఆ అరటిపళ్ళ వాడు ఇంకోసారి నాకు కనిపించకుండా దాక్కున్నాడు . అప్పటి కీ నేను పట్టేసి పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగెట్టాడు . అంత హడల్ మరి మనమంటే ! ఏమాటకామాటే చెప్పాలి మహాలక్ష్మీ బెంగాల్ చీరల అతను నేను వెళ్ళగానే కొత్త రకాల చీరలు తీసి చూపించేవాడు . ఎంత బాగుండేవో . 15 రూపాయలకు మామూలివి , 25 రూపాయలైతే ఇంకాస్త మంచివీ చూపించే వాడు . 25 రూపాయల చీర కొని , కాలేజ్ కి కట్టుకెళితే మా ఫ్రెండ్స్ , ఇంత కాస్ట్లీ చీర కాలేజీ కి కట్టుకొచ్చావా అని కోపం చేసేవారు :) కృష్ణా లోనూ అంతే 15 రూపాయలకు సెమీ వాయిల్ , 20 రూపాయలకు హాఫ్ వాయిల్ , 30 రూపాయలకు ఫుల్ వాయిల్ చీరలు చక్కటి రంగులలో , వివిధ ప్రింట్స్ తో చూడ ముచ్చటగా వుండేవి . కూరగాయల మార్కెట్ లో నైతే దొరకని కూర లేదు . అన్ని రకాలు దొరుకుతాయి . బేరం తప్పని సరి ! కోటీ విశాలంద్రా ఇప్పటికీ నేను వెళ్ళే చోటు . కోటీ లోని ఖాదీ బండార్ షాప్ నుంచే మా మామగారు , ధోతులు , మంచం నవారు కొనేవారు . చాట్ తినాలంటే కోటీ షాలిమార్ వెళ్ళాల్శిందే.

ఎన్ని ఎన్నెన్ని జ్ఞాపకాలో ! అన్నీ కను మరుగై పోతాయట . మెట్రో లైన్ వేసేందుకు , బడి చావిడీ / సుల్తాన్ బజార్ లోని షాప్ లను పడగొడుతున్నారని , రూపురేఖలే మారిపోతున్నాయని , పేపర్ లో చదవగానే చాలా బాధ కలిగింది . నీలకంఠం దుకాణం , ఆర్యసమాజ్ , జేన్ భవన్ అన్నీ తీసేస్తారట . ఇంకో పది రోజులలో కూల్చివేతలు మొదలవుతాయట . దుకాణదారులంతా తీసేయొద్దు అని పిటీషన్ లు పెడుతున్నారట . ఇదంతా చదవగానే మనసు కలిచేసింది . ఏమో ఎంత మారిపోతుందో ఏమో అని , హడావిడి గా వెళ్ళి మా హనుమాన్ జీ ని చూసుకొని , బజారంతా కలియదిరిగి వచ్చాను . పనిలో పని 5 రూపాయలకు ఓ పిన్నీసు పాకెట్ ఇస్తే బేరమాడి పది కి మూడు కొనుక్కొని వచ్చాను !

నాలాంటి సుల్తాంబజార్ / బడి చావిడీ ప్రేమికులు ఎవరైనా వుంటే ఓసారి వెళ్ళీ చుట్టేసి రండి . ఎటొచ్చి ఎటుపోతుందో ! త్వరపడండి !!!!!

15 comments:

సుజాత said...

మాల గారూ,

చాలా బాగా రాశారండీ! ఆ జనం, ఆ రష్ ఇదంతా చిరాగ్గా ఉన్నా సరే, సుల్తాన్ బజారు,బడీ చావిడీ అంటే ఒక రకమైన ఆకర్షణ కల్గుతుంది ఎవరికైనా! ఆ కార్నర్ లో ఉండే నీలకంఠం బాలకృష్ణయ్య షాప్ అంత పాతదన్నమాట! సుల్తాన్ బజార్ అంటే అదొక టూరిస్ట్ ప్లేసే అనుకోండి!

మెట్రో రైల్ రావడం అభివృద్ధికి సూచనే అయినా ఆ పాత సంస్కృతి అంతా ఒక్కసారిగా మాయమైపోతుందేమో అని చిన్న బెంగ!

అయితే మీరు బేరాలు బాగానే చేస్తారన్నమాట! :-))

బుడుగోయ్ said...

బతికించారు. శీర్షిక చుసి నేనింకా మెట్రో వద్దంటారేమో అనుకున్నా... హైదరాబాదు వాళ్ళు భూగర్భంలో వేయడం గురించి ఎందుకు ఆలోచించలేదో పాపం...

లలిత (తెలుగు4కిడ్స్) said...

అంత సన్న రోడ్డు సెలవు రోజు ఎంత విశాలంగా అనిపించేదో.
ఆ బేర సారాల్లో ఎంత తక్కువకి కొన్నా మోసపోయినట్టనిపించేది ఒక్కో సారి.
ఆ జన సముద్రంలో ఒక సారి ఏనుగుని తీసుకు వెళ్ళడం కూడా చూశాను.
బస్సులు, ఆటోలూ, అవీ ఇవీ అమ్మే వాళ్ళను, దాటుకుని రోడ్డు ఈ వైపునించి ఆ వైపుకి వెళ్ళడం ఒక సాహస యాత్ర.
ఇక బస్సులు నడిపే వాళ్ళ పరిస్థితి, పాపం వీళ్ళందరినీ తప్పించుకుంటూ నడపడం ప్రతిరోజూ పద్మవ్యూహం ఛేదించడమే కదా.
గోకుల్ చాట్, ఖాదీ భండార్, ఇంకొకటి అక్కడే ఉండేది hand made వస్తువులు అమ్మే దుకాణం, మా స్నేహితురాళ్ళము పుట్టినరోజు పండగలకి బహుమతులు అక్కడ కొనుక్కునే వాళ్ళం.
గాజులు ఒకటి, ఒకప్పుడు బాగా కొనుక్కునే వాళ్ళం. గోకుల్ చాట్, పళ్ళ రసాలు, చెరుకు రసాలు మధ్యలో సేద దీరడానికి. చున్నీలు, మేచింగ్ లూ... అమ్మో.
పాఠ్య పుస్తకాలూ అక్కడే. కొన్ని పాత పుస్తకాలు, కొన్ని కొత్తవి, కొన్ని చదివిన తర్వాత సగం ధరకి అమ్మేసేవి, కొన్ని మొత్తం ధర ఇచ్చి కొనుక్కుని చదువు అయిపోయాక తిరిగి ఇచ్చేసి డబ్బులు వెనక్కి తీసుకునేవి... చాలా జ్ఞాపకాలు.
హనుమంతుడి గుడి లోపలికి వెళ్ళింది చాలా తక్కువ.
ఓ నాలుగైదేళ్ళ క్రితం వెళ్ళినప్పుడూ కనిపించలేదు కానీ ఓ చేదు విషయం, కాలేజీ రోజుల్లో మేము అవీ ఇవీ కొనుక్కుంటూ ఉంటే మధ్యలో కొంతమంది బిచ్చగాళ్ళు, చేతులకూ కాళ్ళకు కట్లు కట్టుకుని, కాళ్ళు లేక చక్రాలు కట్టిన పీట మీద కూర్చుని అడుక్కుంటూ ఉండే వాళ్ళు. ఏదో చేద్దామని అనిపించేది, కొద్దిగా మనసు పెడితే చెయ్యగలిగే వాళ్ళమేమో కూడా, కానీ ఏమీ చెయ్యలేదు.

Ennela said...

//చీటియేవాలే మౌజ్ ఆఠాణాకి డజన్ ఇస్తానంటే కాదు బారాణాకి ఇవ్వాల్సిందే నని వాడితో వాదించి , పోట్లాడి మరీ కొనుక్కున్నాను/// భలే బేరం సుమండీ....

అయ్యొ, అవునా....అయితే నేనింక చూడలేను....ప్చ్ ప్చ్...నేనూ కొటీ లో పీజీ చేసాను....మాట్లాడితే సుల్తాన్ బజార్ పరిగెత్తడమే...ఫ్రెండ్స్ లొ ప్రతి రోజు ఎవరికో ఒకరికి యేదో పని ఉంటుంది మరి.....ఆ ప్లేస్ తలుచుకుంటే చాలు బోల్డు తీపి జ్ఞాపకాలు.

చిన్నప్పుడు అన్నయ్య శంకరాభరణం సినిమాకి రాయల్ థియేటర్ కి తీసుకెళ్ళినట్టు గుర్తు...బాగా గుర్తుండీ అదే మొదటి సారి...ఆ మార్కెట్ అంతా తిరగటం...అక్కడ నించీ యెందుకో మొజంజాహి మార్కేట్ కి కూడా వెళ్ళాము.. ఆ రోజు..

మాలా కుమార్ said...

సుజాత గారు ,
మార్పును ఆహ్వానించేముందు చిన్న కుదుపు తప్పదు గా !
థాంక్స్ అండి .

& బుడుగోయ్ గారు ,
నా తో పోట్లాడు దామని వచ్చారా :)
అక్కడి వ్యాపారులూ భూగర్భం లో నే వేయమంటున్నారట . అలా ఐతే అందరూ చందాలేసుకొని ప్రభుత్వానికి కొంత మనీ ఇస్తామంటున్నారట . చూడాలి ఏమి చేస్తారో !
థాంక్ యు ఫర్ ద కామెంట్ .

మాలా కుమార్ said...

లలిత గారు ,
అబ్బో మీకూ చాలా జ్ఞాపకాలున్నాయే :)
మీ జ్ఞాపకాలను పంచుకున్నందుకు థాంక్ యు అండి .

& ఎన్నెల గారు ,
ఐతే నావెనుకే మీరూ , హైదరాబాద్ , సికింద్రాబాద్ అంతా తిరిగారన్నమాట :)

Ennela said...

అవునండీ..నాన్నకి నన్ను దూరం పంపడం ఇష్టం ఉండెది కాదు అన్ని బస్సులెక్కి..అందుకని స్కూల్, జునియల్ కాలెజి అన్నీ అల్వాల్, బొలారం లోనే అయిపోయాయి...డిగ్రీ మారెడ్ పల్లి- దూరం దూరం అని బెంగ పడుతూ పంపించారు....ఇంక పీజీ కి తప్పలేదు...హహహ్..సాయంత్రం బస్ స్టాప్ కి వచ్చి నించునేవారు.మా నలుగురి కోసం నాలుగు ట్రిప్పులు....ఓ స్త్రీ రేపు రా లో చెప్పిన భయాల వల్ల అనుకుంటా ...

Snkr said...

తొలగించడం మంచి వార్త. మీ జ్ఞాపకాలు మరింత గట్టిపడాలంటే వాటిని రోడ్ వైడెనింగ్లో కూల్చివేయడం అత్యవసరం. ఇప్పటికైనా ఎం.సి.హెచ్ వాళ్ళు కళ్ళు తెరిచారు, కోర్ట్ల నాన్చుడు లేకుండా ఆర్డినన్స్ చేసి హనుమాన్ మందిర్ తోసహా తీసేయాలి.

కృష్ణప్రియ said...

మాల గారు,

నేనూ సెవెంత్ లో ఉన్నప్పుడు వెళ్ళాను మొదటి సారి.. తర్వాత ఎన్ని సార్లు వెళ్ళామో లెక్క లేదు. హ్మ్మ్.. ఎప్పుడో మా తమ్ముడికి పోలీస్ డ్రెస్ కొనటం దగ్గర్నించీ, క్లిప్పులూ, కాటన్ చీరల వరకూ నాకూ బోల్డు జ్ఞాపకాలు..

శివరంజని said...

ఎప్పటిలానే మీ పోస్ట్ బాగుంది కాని ఆ ప్లేస్ గురించి మాత్రం నాకు తెలియదండీ

మాలా కుమార్ said...

ఎన్నెల గారు ,
మా అమ్మాయి కోసం టూషన్ ఐపోయే టైం కు మావారో , మా మాగారో అక్కడ రెడీగా వుండేవారు . మళ్ళీ ఇంటికి ఎంతో దూరమూ కాదు . సందులోనుంచి ఒక్కతే రావాలి అని . మా అమ్మాయి గోల పెట్టేది ఫ్రెండ్స్ నవ్వుతున్నారు అని . అబ్బే అవన్నీ మేమేమీ పట్టించుకునేవారము కాదు :)

& snkr ,
అంతేనంటారా ? సరే కానీయండి , మీ మాటెందుకు కాదనాలి :)

మాలా కుమార్ said...

కృష్ణప్రియ గారు ,
హైదరాబాద్ లో ఆ చుట్టుపక్కల వుండే అమ్మాయిల నెవరిని కదిలించినా బోలెడు జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటారు . కదండి .

&శివానీ ,
మీరు హైదరాబాద్ లోనే వున్నట్లైతే ఓ సారి అటెళ్ళి రండి . మీరు ఇంకా మంచి పోస్ట్ రాస్తారు . తొందరగా వెళ్ళి రండి .

సత్య said...

post baagundi amdam!///ఏది కొనాలన్నా బేరం తప్పని సరి . మౌజ్ ఆఠాణాకి డజన్ ఇస్తానంటే కాదు బారాణాకి ఇవ్వాల్సిందే నని వాడితో వాదించి , పోట్లాడి మరీ కొనుక్కున్నాను తెలుసా !///

ఆఠాణా (50np/8annas) kanna బారాణా (75 np /12annas)
ekkuva kadaa madam!

amduke అరటిపళ్ళ వాడు ఇంకోసారి నాకు కనిపించకుండా దాక్కున్నాడు !

మాలా కుమార్ said...

సత్య గారు ,
మరి అదేనండి అప్పటి నా బేరం :)

Durga said...

మాలాగారు,
నేను ఈ న్యూస్ విన్నప్పటినుండి అయ్యొ అక్కడ లేము కదా. నాకు వెళ్ళి తిరగాలని వుంది. మాకు ఏం కావాలన్నా సుల్తాన్‌ బజార్లోనే. మా ఫ్రెండ్స్ అంతా కాలేజ్ నుండి ఏది కావాలన్నా పోలోమంటూ సుల్తాను బజార్ కెళ్ళడం షాపింగ్ చేయడం భలే సరదాగా వుండేది. నేను ఇంత త్వరలో పని మొదలవుతుందని అనుకోలేదు. ఎవరినన్నా వెళ్ళి కొన్ని ఫోటోలు తీసుకుని రమ్మనాలి.
మీ ఇంస్పిరేషన్‌తో నా ఙ్ఞాపకాల గురించి ఒక చిన్న పోస్ట్ రాయాలనిపిస్తుంది మీ పుణ్యమా అని. థాంక్స్ అండి మాకు బడిచవడీ/ సుల్తాన్‌ బజార్ గురించి రాసి ఎన్నో మధురమైన ఙ్ఞాపకాలను గుర్తు తెచ్చినందుకు.