Thursday, January 6, 2011

నా 16 గురు అభిమానులకు విజ్ఞప్తి * * * * *గౌరవ్ ను ఎత్తుకొని , మేఘ చేయి పట్టుకొని , గేట్ దగ్గర బెలూన్ వాడి దగ్గర బేరమాడుతున్నాను . గౌరవ్ ఆ (( ఊ (( అంటూ వాడికే బెలూన్ కావాలో చూపిస్తున్నాడు . అవును మరి ఇది గౌరవ్ కు ఇంకా మాటలు రానప్పటి సంగతన్నమాట ! మా గేట్ ఎదురుగా వున్న కాంపౌండ్ గోడ దగ్గర వరుసగా చాలా బైక్ లు పార్క్ చేసి వున్నాయి . అందులో ఓ బైక్ మీద ఓ అమ్మాయి అటు తిరిగి కూర్చొని వుంది . ఆ అమ్మాయికి ఎదురుగా ఓ అబ్బాయి ఆ అమ్మాయి మీదకు వాలిపోతూ , ఇంచుమించు ఒకరి మీద ఒకరు పడిపోయి , చుట్టుపక్కల ద్యాస లేకుండా కువ కువ లాడుతున్నారు . ఆ అమ్మాయిని చూస్తూ మేఘ హే . . . బామ్మా లుకెట్ దట్ గర్ల్స్ హేయిర్ . సో లాంగ్ అని చూపించింది . అసలు వాళ్ళిదరినీ చూసేందుకే ఇబ్బంది పడుతూ , బెలూన్లు ఎంత తొందరగా కొనేసి , ఎంతతొందరగా ఇంట్లోకి పిల్లలను తీసుకెళిపోదామా అన్న తొందరలో నేను ఆ అమ్మాయి జుట్టు చూడలేదు . చక్కగా , బారుగా , పెద్ద పోనిటేల్ వేసుకొని వుందామ్మాయి . నేనూ ఆ జుట్టును మైమరచి చూస్తుండగానే , బెలూన్ వాడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు . ఇంతలో ఓ నలుగురు అబ్బాయిలు అక్కడి కొచ్చి ఆ అమ్మాయి జడను పట్టి గుంజుతూ గోల గోలగా అరుస్తున్నారు . ఆ అమ్మాయి ఎదురుగా అప్పటి వరకు కువ కువ లాడుతున్న అబ్బాయి వాళ్ళను నెట్టేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు . అమ్మాయేమో కీచుగా అరుస్తోంది . సినిమాలల్లో తప్ప , బయట అలాంటి దృశ్యము చూడనినేను నిశ్చేస్టనయ్యాను . ఏమి చేయాలో తోచలేదు . పక్కన ఇద్దరు చిన్న పిల్లలు . . . ఇంట్లో ఇంకెవరూ లేరు . . . పనమ్మాయి శారద బజారుకెళ్ళింది . మేఘ , గౌరవ్ కూడా వాళ్ళ బెలూన్ ల మాట మరిచి అటేచూస్తున్నారు . . . ఇంతలో ఆ అమ్మాయి గిర్రున ఇటుతిరిగింది . . .వెంటనే మా మేఘ హే . . .బామ్మా షి ఈజ్ నాటే గర్ల్ . హి హీజె గై అని గట్టిగా అరిచింది . ఆ అబ్బాయిలూ మావైపు నవ్వుకుంటూ చూసి , మా పక్కింట్లోకి వెళ్ళిపోయారు ! ఇంతలో శారద వచ్చి , మమ్మలిని అలా చూసి ఏమైందమ్మా అంది . నేను లోపలి కెళుతూ జరిగింది చెప్పాను . ఓ వాళ్ళా అమ్మా వాళ్ళు సినిమాలలో , టి . వీ సీరియలస్ ల లో విలన్ దగ్గరుండే రౌడీ గాంగ్ వేషాలు వేస్తారు . మన పక్కింట్లో సినిమా కంపెనీ వుంది . అక్కడ విలన్ ల కు ట్రైనిగ్ ఇస్తూవుంటారు అని వివరించింది . అంటే మేము విలన్ డెన్ పక్కన వున్నామన్నమాట !!!!!!!

శారద పిల్లలను ఆడిస్తూ వుంటే , నేను బాల్కనీ లో కూర్చొని పుస్తకం చదువుకుంటూ వున్నాను . ' ఆంటీ , ఇక్కడ ఇల్లు అద్దె కు వుందా ? ' అని వినిపించింది . తలపైకెత్తి చూస్తే , మా గేట్ ముందు నలుగురబ్బాయిలు , వాళ్ళ వెనుక ట్రాలీ లో సామాన్ లూ కనిపించారు . లేదు బాబూ అని నేను అనగానే అందులోని ఓ అబ్బాయి ఏదో సైగ చేసాడు . వీడి దుంపతెగ , ఈ పోరగాడేమిటి , ఇలా సైగచేస్తున్నాడు అని కోపం గా అరవబోయాను . అప్పుడే పైకి వచ్చిన శ్రీధర్ , ' మేడం అది షూటింగ్ . ఎవరో టి .వి సీరియల్ వాళ్ళు మన గేట్ బాగుందని దాని ముందు షూటింగ్ చేసుకుంటున్నారు . మిమ్మలిని అడగటములేదు అని సైగ చేస్తున్నాడు ఆ అబ్బాయి ' అన్నాడు . హోరినీ అనుకొని నేనూ చూస్తూ కూర్చున్నాను . అలా సాయంకాలం వరకూ , మా కాలినీలో వున్న ఇళ్ళ ముందు ఆ షూటింగ్ చేస్తూ కనిపించారు . ఆ సీరియల్ పేరు , ఈ భాగం ఏ రోజు వచ్చేది , అసలు ఈ సీరియల్ ఏ చానల్ లో వచ్చేదీ భోగట్టా కనుక్కొని వచ్చింది మా వంటావిడ సావిత్రి . అసలే ఆవిడకు సినిమా వాళ్ళను చూడటము తెగ పిచ్చి . గణపతి కాంప్లెక్స్ దగ్గర ఎవరైనా వున్నారంటే చాలు వుడుకుతున్న వంట కింద ఆర్పేసి అటుపరుగెత్తుతుంది . అక్కడ ఎప్పుడూ ఎవరో వకరు , ముఖ్యంగా సాయంకాలమైతే కిట కిట లాడుతూ టి. వీ ల వాళ్ళు వుంటూనే వుంటారు . వాళ్ళను మైమరచి చూస్తూ , కొండకచో కొంతమందిని పలకరిస్తూ వంట సంగతి మర్చిపోతుంది ! అక్కడ వాళ్ళున్నారు , వీళ్ళున్నారు అని చెప్పకు అని శారదను , శ్రీధర్ నూ కోపం చేస్తాను . వాళ్ళేమో చెప్పక పోతే సావిత్రీ ఆంటీ తిండి పెట్టదని భయపడి చెప్పేస్తారు . సరే మా గేట్ ను టి. వీ లో చూసుకుందామని , అప్పటి నుంచి ఆ సీరియల్ ఇదో వస్తుంది , అదో వస్తుంది అని , టి. వి ని కళ్ళు లాగేటట్టు , తల పగిలిపోయేట్టు చూసి విసుగొచ్చి ఆఫ్ చేయగానే , మొహమింత చేసుకొని సావిత్రి పైకొచ్చి , మన గేట్ , మిగితా వాళ్ళ గేట్ కంటే బాగా వచ్చిందండి . ఎంత బాగుందో అని చెప్పింది . నేను అయ్యో నేను ఇంకాసేపు చూడాలిసిందే అనుకున్నాను ((((((

ఇలా అడపా దడపా ఎవరో , నువ్వు టి . వి లో చూడలేదా ? బాగా చూపించారనటము , పలానా న్యూస్ టి. వి లో చూపించారుగా అని చెప్పటమూ విని నేను కొన్ని రోజులు టి .వి పెట్టి దాని ముందు సెటిలైపోతాను . అదేమిటో నేను చూసినన్ని రోజులూ ఏ ఎక్సైటింగ్ న్యూసూ రాదు . పైగా కింద రెండు స్క్రోలింగ్ న్యూస్లూ , వాటి మీద బ్రేకింగ్ న్యూస్ , ఆపైన ఇంకో న్యూసూ , మద్య లో కని కనిపించకుండా మనుషులూ . . . అసలు ఎటుచూడాలో , ఏ న్యూస్ చదవాలో తెలీక కళ్ళను గిర్రున తిప్పుతుంటానా . . . కళ్ళు గిర్రున తిరగటము , అసలు మామూలుగా కూడా ఎటు చూస్తున్నానో తెలీక పోవటము , చక్కరొచ్చినట్లు వుండటము , మెడ నొప్పి మొదలైనవి వస్తాయి . మొదట్లో తెలీక ఏరోగమొచ్చిందో ఏంపాడో అని భయపడి చచ్చి , మా కజిన్ డాక్టర్ .కుమారి దగ్గరి కెళ్ళి చూపించుకున్నాను . స్పాండిలైటిసేమో , ఇప్పుడే ఇట్లా వుంది అన్నావు కదా , ఓ రెండు రోజులు సూజెరాన్ వేసుకొని పడుకో తగ్గి పోతుందిలే అంది . అదేసుకున్నప్పటి నుంచీ మత్తు మత్తుగా వుంటుంది . ఐన అలానే వేసుకున్నాను . తగ్గిపోయింది . . . గాయబ్ . . . . అమ్మయ్య అనుకున్నాను . మళ్ళీ , ఎవరో దేని గురించో చెప్పటము . . . నేను టి వి ముందు . . . కళ్ళు గిర గిరా . . . సుజెరాన్ . . . మత్తు . . . హుం . ఇలా కాదు అనుకొని మా జయ కు చెప్పాను , నువ్వు ఎప్పుడైనా టి .వి చూస్తుండ గా ఏదైనా ఎక్సైటింగ్ న్యూస్ చూస్తే నాకు కాల్ చేసి చెప్పు . అప్పుడు నేను టి . వి చూసింగ్స్ అని . సరే నని తలాడించింది . తను చూడటము జరుగుతే వెంటనే పాపం కాల్ కూడా చేస్తుంది .

మరింకేమిటి ప్రాబ్లం ? అని విసుక్కోకండి 16 గురు అభిమానులు . ఆ సంగతే చెపుతున్నాను . ఆ న్యూసైపోయాకే నాకు తెలుస్తోంది అదేమిటి నువ్వు చూడలేదా ? నాకు కాల్ చేయలేదా అని మా జయ ను అడిగుతే ఎందుకు చేయలేదు సెల్ కు చేసాను , లాండ్ లైన్ కు చేసాను . తమరు బిజీ . ఫోన్ లిఫ్ట్ చేయరు అంటుంది . అరే సెల్ వున్నది ఎందుకు ? బయటకు వెళ్ళి నప్పుడు ఏదైనా అవసరముంటుందేమో నని కదా ? అందుకే దాన్ని పర్స్ లోనే పెడతాను . పర్స్ ఎక్కడుంటుంది ? అలమారాలో . అంతే కాని ఇంట్లో కూడా పర్స్ భుజానేసుకొని తిరుగుతానా ??? మరి లాండ్లైన్ మాట అంటారా ? నేను బయట బాల్కనీ లో కూర్చొని ఏ నవలో చదువుకుంటూ వుంటాను . లేదా లాప్ టాప్ లో ఏదో పని చేసుకుంటూ వుంటానా ?? అహ ((( వుంటానా లేదా ? మరి అప్పుడు అవి పక్కన పెట్టి చిన్నగా రావాలా వద్దా ? గబ గబా రావటానికి నేనేమైనా చిన్న దాన్నా చితక దాన్నా ? గబ గబ గా వస్తూ జారిపడితే ? పుటుక్కున ఎముక ఇరుగుతే ఎవరిది పూచీ ???? అహా ((((( అసలు ఎవరిదీ అంటా ?? నేనొచ్చేలోపలే కొంపలు మునిగిపోతునట్లు ఫోన్ పెట్టేస్తారు . మాకు కాలరైడి లేదు . మరి ఎవరు కాల్ చేసారో నాకెలా తెలుస్తుంది ? పోనీ అని హడావిడి గా వస్తానా అప్పుడేమో మేడం మేము ఫలనా బాంక్ నుంచి చేస్తున్నాము . మీకప్పిస్తాము అని తెగ మొహమాట పెట్టేస్తారు . లేదా ఏ చీర లో దుకాణం వాడో మా దగ్గర కొత్త స్టాక్ వచ్చింది . మా దగ్గర అరువుబేరం కలదు అంటారు . చిన్నప్పుడు ఆటల్లో మా దోస్త్ ,
తిందాం తిందాం ,
ఎక్కడ తెచ్చుకు తిందాం ,
అప్పు తెచ్చుకు తిందాం ,
అప్పెట్ల్లా తీరుద్దాం ,
ఎగ్గొట్టిపోదాం . అని ఐదు వేళ్ళూ చూపిస్తూ పాడేది . మరి అలా చేస్తే మా ఆయన నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టరూ ? ఈ ఫోన్ల కోసం అని నా ఇల్లు వదలలేనుగా ! ఎంతసేపూ ఫోన్ ఎత్తవూ , మాట్లాడవూ అంటారేగాని అర్ధం చేసుకోరూ !

అరే వస్తున్నా అసలు సంగతికి . ఉపోద్ఘాతం లేకుండా చెప్తే ఎలా అర్ధం అవుతుంది ? మొన్న పొద్దున నేను కాఫీ కలుపుతుండగా బయట నుంచి మా వారు ఘట్టిగా మాలా అని గావుకేక పెట్టారు . ఏమైందా అని హడలిపోతూ పరిగెట్టుకుంటూ వెళ్ళాను . నిన్న మద్దెల సూరిని హత్య చేసింది మన ఇంటి దగ్గరే చూడు అని పేపర్ చూపించారు . అవునా అని బోలెడు హాచర్య పోతూ పేపర్ చూస్తున్నానా , జయ ఫోన్ చేసింది . ఫోన్ ఎత్తగానే , నిన్న రాత్రి నుంచి ఎక్కడున్నావు తల్లీ ? ఫోన్ చేసి చేసి నీరసమొచ్చింది . టి. వి లో అంతా మద్దెలసూరి హత్య , యూసుఫ్ గూడా , గణపతి కాంప్లెక్స్ చూపిస్తున్నారు . మీరెలా వున్నారో , అసలు బావగారు వూళ్ళో వున్నారో లేదో , నువ్వెంత భయపడుతున్నావో నని , రాత్రి టి. వి లో న్యూస్ చూనప్పటి నుంచి నీ ఫోన్ కోసం ప్రయత్నం చేస్తున్నాను అని గయ్ మంది . నేను ఆ టైం లో ఇంట్లోనే వున్నాను . మా ఫ్రెండ్స్ వస్తే మాజాంగ్ ఆడుతున్నాను . పనమ్మాయి శైలజ కూరలకోసమని గణపతి కాంప్లెక్స్ దాకా వెళ్ళి వచ్చింది కూడా . మాకసలు తెలీదు . నిన్న సూరి హత్య అయ్యింది అని మీ బావగారు చెప్పారు కాని ఆయన అలసిపోయివుండటము తో టి. వి పెట్టలేదు . ఇదో ఇప్పుడే పేపర్ లో చూస్తున్నాము అని చెప్పి ఫోన్ పెట్టేసాను .

ఏమండీ నిన్న మీరు వచ్చేటప్పుడు తెలీలేదా ? ఆ టైం లో వచ్చి వెళ్ళారుగా అని అడిగాను . అవును , గణపతి కాంప్లెక్స్ దగ్గర గుంపుగా మనుషులు , కెమెరాలూ , పోలీసులూ కనిపిస్తే ఏదైనా షూటింగేమో అనుకున్నాను అని జవాబిచ్చారు మావారు . శైలజ ను పిలిచి అడుగుతే అవునాండీ ?? ఇక్కడే జరిగిందాండీ ??? నేనుకూరలకెళ్ళేటప్పుడు రోడ్ మీద ఒక్కరూ లేరు . షాప్ ల లోనూ లేరు . ఎప్పుడూ కిట కిటలాడుతూవుంటుంది , ఇంత ఖాళీగా వుందేమిటా అనుకున్నానండీ అంటూ నన్ను మించి ఆశ్చర్యపోయింది !

హుం . . . మన ఇంటి పక్కనే హత్య జరుగుతే మనకు తెలీదు !

షూటింగ్ అనుకున్నారు మావారు హుం !

రాత్రంతా టి. వి లో మన చుట్టు పక్కల పరిసరాలు చూపిస్తే మనం చూడనే లేదు . హుం . . . హుం . . .

ఇప్పుడైనా చూడాల్సిందే నని రెండు రోజులుగా కళ్ళు తెరుచుకొని , కనురెప్ప మూయకుండా , గుడ్ళు పేలిపోయేట్టుగా . . . ఏఖధాఠిగా . . . టి. వి చూస్తున్నాను . ఏదో ఒక చానల్ లో చూపకపోతారా అని న ఆశ ! స్చప్ . . . ఆశా నిరాశేనా ? ఎప్పటికీ మా ఇంటి చుట్టు పక్కలను టి. వి లో చూడలేనా ????? లేదూ . . . లేదూ . . . లేదూ . . . ఇన్ని షూటింగ్స్ అవుతున్నాయి . ఇంతమంది చానళ్ళ వాళ్ళు వాన్ లలో తిరుగుతూ వుంటారు . ఏదో ఒక రోజు తప్పక చూస్తాను . . . అని కృతనిశ్చయముతో టి. వి ని చూస్తున్నాను . మళ్ళీ . . . కళ్ళు గిర గిరా . . . నో సుజెరాన్ . . . ఐనా సరే పట్టువదలని విక్రమార్కిణిలా టి. వి చూస్తూనే వున్నాను * * * చూస్తూనే వుంటాను * * * * *

కావున ఓనా 16 గురు అభిమానులారా (అవునూ , డాష్ బోర్డ్ మీద 16 గురున్నారు . బ్లాగ్ కొచ్చేసరికి 14 మందే వున్నారేమిటి ? అటునించి ఇటోచ్చేసరి ఇద్దరు ఎటుపరుగెడుతున్నట్లు ? ) . . . నా విజ్ఞప్తి ని ఆలకించండి . అదేమనగా కొన్ని రోజులు నాటపాలు రాకపోవచ్చు . అమ్మయ్య అనుకోకండి . నాకు తొందరోలోనే టి. వి లో మా ఇంటి పరిసరాలు కనిపించాలని నా తోపాటు ఆ భగవంతుని మీరూ ప్రార్ధించండి . అంతే కాని కనిపించకూడదు అని ప్రార్ధించకండి .

వాకేనా ???? ?

మరి వుంటా బై .

18 comments:

కృష్ణప్రియ said...

:))) Too much! నేనూ చూశానండీ.. మన మాల గారి గేట్ లా ఉంది.. అనుకున్నాను .. :) అయ్యో మీరు చూడనేలేదా?

psm.lakshmi said...

మాలాగారూ
మీ గేట్ నేను చూశానుగా. టీవీలో కాదు.
డాష్ బోర్డు మీద 18 బ్లాగులో 16 నాకే అనకున్నా. మీకూ అదే ప్రాబ్లమా
psmlakshmi

Malakpet Rowdy said...

షూటింగ్ అనుకున్నారు మావారు హుం
__________________________

It was "Shooting" indeed - Suri was shot!

Anonymous said...

ఏదో సామెత చెప్పినట్టుందండీ ( ఏం సామెత అని అడక్కూడదు ) మాలగారు మీ ఆరాటం చూస్తుంటే

అయినా టి.వి. లో మీ ఇల్లేం ఖర్మ మీరే ఎంచక్కా ఓ రోజంతా కనిపించచ్చు ఏం చేస్తారంటే , టి.వి. 9 కి ఒక ఫోన్ కొట్టండి . వంటింటి కిటికీలొంచీ మీరా హత్య చూసినట్టు మీకనుమానంగా వుందని చెప్పండి అంతే ......

మీ టపా చదివాకా నాకొక డవుటు వస్తుంది. మీ కాలనీలో ఎప్పుడూ షూటింగులు జరుగుతాయని , ఒకడినొకడు పొడిచేసుకున్నా, కాల్చేసుకున్నా చూసిన జనం అదేదో షుటింగ్ అనుకొని వెంటనే రియాక్ట్ అవ్వరని తెలిసే హత్యకు ఆ ప్లేస్ ని ఎన్నుకున్నడేమో హంతకుడు .( వహ్ .....లలిత , నువ్వు C.B.I లోనో A.B.C.D. లోనో జాయిన్ అయిపోవచ్చు . నా భుజం నేనే తట్టుకుంటూ )

ఆ.సౌమ్య said...

అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది.....మీ గేట్ మీరు చూడలేదా....హవ్వ హవ్వ ఎంత అన్యాయం జరిగింది...కలికలం అని ఇందుకే అంటారు.

ఊరుకోండి మాల గారు ఊరుకోడి, బాధపదకండి...టీవీ చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు మీ గేట్ కనిపించకపోదు, ఆ బగమంతుడున్నాడు..మీ గేట్ ని మీకు తప్పక చూపిస్తాడు ఆఁ...ఏమిటో మీకొచ్చిన కష్టం తలుచుకుంటూ ఉంటే నాకు ఏడుపొచ్చేస్తున్నాది వాఁ వాఁ :(

మాలా కుమార్ said...

కృట్ష్ణప్రియ గారు ,
మీరు చూసినప్పుడు నాకో ఫోన్ కొట్టొచ్చుకదండీ ? పోనీలెండి మీరైనా చుసారు థాంక్ యు .

& లక్ష్మి గారూ ,
మీరూ చూసారా మా గేట్ను :)

& రౌడీ గారు ,
అవును సుమండీ , ఇదీ షూటింగేగా :)

మాలా కుమార్ said...

లలిత గారు ,
మా వంటింటి కిటికీ లో నుంచి హత్య చూసానంటే సినిమా పోలీసులు కూడా నమ్మరండి బాబు . పైగా మా పక్కింటోళ్ళు కొట్లాటకొస్తారు .
ఐనా నేను టి . వి లో కనిపించాలంటే అంత కష్టపడక్కరలేదండి . మా కాలినిలో ఈ టి. వి ఆ టి. వి అంటూ టి. వి ల బానర్లు పెట్టుకొని వాన్ లో యాంకరమ్మలూ / అయ్యలూ తిరుగుతుంటారు . మనం బయట కనిపించటం ఆలస్యం , ఈ రోజు ఇలా జరిగింది , దీనిమీద మీ స్పందన ఏమిటీ అని మైక్ పట్టుకొని వెంటపడతారు . మా జీవితం లో సగభాగం వీళ్ళను , సేల్స్ మెన్ లను వెళ్ళ గొడటముతోనే సరిపోతుంది :) కాలినీ వాళ్ళంతా వెళ్ళ్ గొట్టగా , వెళ్ళ గొట్టగా ఈ మద్య తగ్గిపోయారు . ఇంకో బజారెతుక్కున్నారేమో పాపం :)

మీరు చెప్పిన మాట కూడా నిజమేసుమండి . హంతకుడు అందుకే ఈ ప్లేస్ ను ఎన్నుకున్నాడేమో ! మీ బుర్రే బుర్రండి . వెంటనే A.B .C.D చేరిపోండి :)

మాలా కుమార్ said...

సౌమ్యా,
మీరైనా నా సినిమా కష్టాలను అర్ధం చేసుకున్నారండి . మీరిచ్చిన సపోర్ట్ తో టి. వి ని చూస్తూనే వుంటానండి :)

శివరంజని said...

హహహహ మాలా గారు ..మీ గేట్ మీరు చూడలేదా...

నీహారిక said...

సంక్రాంతి శుభాకాంక్షలు మాల గారు.

Anonymous said...

మాలగారూ,

మీరు కనుక మీ బ్లాగు ని అనవసర కామెంట్ల యుద్ధానికి వేదిక కాకూడదని ఇందాకటి పోస్టు కనుక తీసేసి ఉంటే క్షమించగలరు.

XXXXX గారు అనవసరం గా మధ్యలో రావడంతో అలా ప్రతిస్పందించాల్సి వచ్చింది

మాలా కుమార్ said...

అనానమస్ గారు ,
అర్ధం చేసుకున్నారు , థాంక్ యు .

మురళి said...

:-) :-)

Ennela said...

మాలా గారూ, మీరు గేటు చూసానని చెబుతారేమోనని ఆశతో ఇన్ని రోజులు ఎదురు చూసా! ఇంతకీ..గేటు చూసానని శుభవార్త ఎప్పుడు చెబుతారూ...మీరు కనబడిందని చెప్పేస్తే నేను హాప్పీ మరి...

మాలా కుమార్ said...

ఎన్నెల గారు ,
అయ్యో రామా ఎక్కడండీ కనిపించనేలేదు . ఆ సీరియల్ కూడా ఐపోయిందిట ! టి. వి సీరియలస్ ఇంత తొందరగా ఐపోవటము ఎరుగుదుమానండి ! విడ్డూరం కాకపోతే అవ్వ :)
వర్మ ఐదు రోజుల సినిమాలో ఓ రోజు మా పక్కింటి డాబా మీద తీసాడుట ! నేను ఊరికెళ్ళి వచ్చేసరికి ఈ ఘోరం జరిగిపోయింది ! ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు రిలీజవుతుందా ? అందులో మా పక్కింటి నుంచి మా డాబా కూడా కనిపిస్తుందా లేదా అని ఎదురుచూస్తున్నాను :)

మాలా కుమార్ said...

మురళి గారు ,
చాలా రోజులకు కనిపించారు . థాంక్స్ అండి :)

మాలా కుమార్ said...

శివరంజని ,
థాంక్ యు .

నిహారిక గారు ,
థాంక్స్ అండి .

Ennela said...

hahahah..i wish you good luck Mala gaaru..meeku taappaka yedo angle lo mee illu cinemaalo kanipinstundi lendi...kanipinchaaka maaku cheppadam marchipokande.