Thursday, September 30, 2010

వయసై పోతోందా ?????
చాలా సీరియస్ గా ఓ కొత్త పోస్ట్ రాద్దామని ఆలోచిస్తూ వున్నాను . ఇంతలో టింగ్ అని వినిపించింది . ఎవరా అని చూస్తే జ్యోతి గారు . మీ సెల్ నంబర్ ఎంత? అని అడిగారు . నేను నా నంబర్ ఇచ్చి మళ్ళీ అలోచనలో పడ్డాను . సడన్ గా గుర్తొచ్చింది , ఇంతకీ నా నబర్ ఎందుకడిగినట్లు ? అందుకే ????? ఇలా మార్క్ చేశాను . మీ తో ఒకావిడ మాట్లాడుతుంది అని జవాబు వచ్చింది . ఎవరు అన్నట్లు మళ్ళీ ????? పెట్టాను , మీకుతెలీదు . ఎవరావిడ ? అని క్లుప్తం గా అడిగా . నాకు తెలుసు ? అన్నారు . మరి నాకు తెలియక్కరలేదా ? నాకు తెలీకుండా ఎలా మాట్లాడుతుంది ? అని అడుగుతే నో జవాబు . ఎవరబ్బా ? నాకు పెళ్ళికావలసిన పిల్లలూ లేరు వున్నవాళ్ళు చిన్న వాళ్ళు , ఇంకేమి మాట్లాడుతుంది ఆవిడ ? ఊమ్హూ నో జవాబు . ఎన్ని క్వెషన్ మార్కులకూ నో జవాబు ? హేమిటీ నేనేమైనా సస్పెన్స్ త్రిల్లర్ సినిమా చూస్తున్నానా ? నాపాటికి నేనేదో ఆలోచనలో వుంటే గిల్లి , ఈ మౌనం ఏమిటి ? అసలు మిమ్మలిని కాదు నన్ను నేను అనుకోవాలి , మీరు అడగ్గానే వెంటనే నా నంబర్ ఇచ్చాను చూడండి అంతే అంతే అని అరిచాను . అబ్బే నో రిప్లై . ఈ జ్యోతి కంటే దుర్మార్గులు ఇంకెవరూ ఈ ప్రపంచము లో లేరు హుం అనుకొని వూరుకున్నాను . అంతకంటే ఇంకేం చేయగలను ?

మరునాడు సాయంకాలము ఓ కొత్త నంబర్ రింగ్ అయ్యింది . బహుషా జ్యొతి చెప్పినావిడే మో అనుకుంటూ తీశాను . మాలా గారాండి అని అడిగారు . అవునండి అన్నాను . నేను ఈ టి వి 2 నుండి మాట్లాడుతున్నాను , నా పేరు రమాదేవి అని వినిపించింది . ఒక్క నిమిషం నాకేమీ అర్ధం కాలేదు . నాకు ఈటివి నుండి కాల్ రావటము ఏమిటి ? ఆవిడే , అక్టోబర్ ఫస్ట్ న సీనియర్ సిటిజన్స్ డే కదండి . ఆ రోజున , బాధ్యతలు తీరిన తరువాత మీరు మీ ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతున్నారు ? అనే విషయము మీద కొంతమంది మహిళల తో మాట్లాడుదామనుకున్నాము . మీరు చాలా ఆక్టివ్ గా వుంటారని జ్యోతి గారు చెప్పారు . రేపు ఉదయము మీరు రాగలరా ? అని అడిగారు . కాని నేనింకా సీనియర్ సిటిజన్ ని కాదండి అన్నాను . ఒక్క సంవత్సరమే కదా పరవాలేదు , మీరు మీ భాద్యతలు అన్నీ తీర్చుకున్నాక , మీ ఖాళీ సమయము ను ఎలా ఉపయోగించుకుంటున్నారో చెప్పగలరా ? అబ్బే ఏడాదెందుకండీ ? 8 నెలలో సీనియర్ సిటిజన్ ను ఐపోనూ !( అబ్బా అని రమాదేవి గారు తల పట్టుకున్న దృశ్యం నా కళ్ళ ముందు కనిపించింది ) వస్తానులెండి . కాని , ఏం మాట్లాడాలో నాకు తెలీదండి . ఐనా నలుగురి లో మాట్లాడలేను అన్నాను . మీరేమీ మాట్లాడకండి , మిమ్మలిని నేను పరిచయము చేస్తానుగదా అన్నారు . కానీయండి , నేనేమీ మాట్లాడకుండా వుంటే మావారు కోపం చేస్తారండి అని నా భయం చెప్పాను . మీకెందుకండి , మా దగ్గరి కొస్తే మీరే మాట్లాడుతారు చూడండి అని ఎక్కడికి రావాలో చెప్పారు .

ఎంతైనా జ్యోతి చాలా గుడ్ గర్ల్ . జ్యోతి కంటే మంచి అమ్మాయి ఈ భూప్రపంచము లోనే లేదు . వెంటనే జ్యోతి గారి కి ఫోన్ చేసి చెప్పాను . ఆ తరువాత , మా అమ్మాయికి , అబ్బాయి కి , అమ్మ కి , అబ్బ ఫోన్ల తో ఎంత బిజీ నో ! మా వారూ వూళ్ళో లేరు . చివరకు ఎలా గో దొరికించుకొని చెప్పాను . అందరూ వాళ్ళ వాళ్ళ సలహాలిచ్చారు . పొద్దున్నే , లక్ష్మి గారి తో కలిసి వెళ్ళాను . అమ్మయ్య లక్ష్మిగారున్నారు నాకు తోడు . అక్కడ మాకు ఆతిద్యమిచ్చిన లక్ష్మిగారి ఇల్లు ఎంత బాగుందో . చాలా మంది కొత్త స్నేహితులయ్యారు . అసలు ఎంచక్కా ఫ్రెండ్స్ ఇంట్లో , ఏదో పార్టీ లో కబుర్లు చెప్పుకున్నట్లుగా వుండిందేకాని ఓ టివి ప్రోగ్రాం లా లేదు . అన్నట్లుగానే రమాదేవి గారు చక్కని , స్నేహపూరితమైన వాతావరణం ఏర్పరిచారు . ఆంకరమ్మాయి హైమ మీరీ వయసులో అనగానే , అమ్మాయ్ నాకు వయసైపోతోంది అంటే నేనొప్పుకోను . అవును , వయసైపోతోంది అనగానే ఎందుకు వొప్పుకోవాలి ? పేపర్ లో 50 ఏళ్ళ వృద్ధులు అని అప్పుడప్పుడు చూస్తుంటాను . 50 ఏళ్ళకే వృద్ధులైపోతారా ? పళ్ళ చివురులు నొప్పిగా వున్నాయని పళ్ళ డాక్టర్ దగ్గరికి వెళుతే పరీక్షించి , ముందుగా మీకీ వయసులో కూడా పళ్ళు గట్టిగా వున్నందుకు అభినందనలండి అన్నాడు . అదేమిటీ ? అప్పుడే పళ్ళూడిపోయే ముసలిదానిలా వున్నానా అని తెగ గింజుకున్నాను . అరే కంప్యూటర్ కోర్స్ లో చేరటానికి రెండేళ్ళ క్రితం ఇన్స్టిట్యూషన్ కు వెళుతే , అక్కడ ప్రిన్సిపల్ , ఇన్స్ట్రక్టర్ ని పిలిచి , మేడం ఈవయసులో శ్రద్దగా నేర్చుకోవటానికి వచ్చారు , మనమూ శ్రద్దగా నేర్పాలి అని పరిచయము చేసారు . మేడం మీరు మిగితా వాళ్ళతో కలిసి నేర్చుకుంటారా ? విడిగా నేర్పాలా అని అడిగారు . విడిగా ఎందుకు ? అందరి తో కలిసి నేర్చుకుంటే బాగుంటుంది కదా అనగానే , మీకిబ్బందేమో అన్నాను , మీ ఇష్టం అన్నారు . ఐనా నేర్చుకోవటానికి వయసు అడ్డేమిటి ? ఇప్పుడంటే సమ్మర్ క్లాస్ లలో హాబీస్ నేర్చుకోవటానికి పిల్లలని , సెలవల్లో చేర్చటము మొదలు పెట్టారు కాని , నా చిన్నప్పుడే , మా అమ్మ సెలవలు రాగానే ఏదోవక ఆక్టివిటీ లో బిజీ గా వుంచేది . ఆ రోజూలో ' ఆంధ్రప్రభ ' వీక్లీ లో మాలతీ చందూర్ బొమ్మలు చేయటము , కుట్లు , అల్లికల గురించి రాసేవారు . అవన్నీ మా అమ్మ నా తో సమ్మర్ హాలీడేస్ లో చేయించేది . 10 థ్ లోనే టేలరింగ్ నేర్చుకున్నాను . అలా చిన్నపటి నుండే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటము మీద ఆసక్తి ఏర్పడింది . దానికి తగ్గట్టుగానే పెళ్ళయ్యాక మావారు , నేను ఏది నేర్చుకుంటానన్నా ప్రోత్సహించారు . నేనెప్పుడూ ఉద్యోగం చేయాలని అనుకోలేదు . అవకాశము వచ్చినా , ముందు పిల్లలూ , ఇల్లూ అనుకున్నాను . అందుకే ఖాళీ సమయము లో ఇలా , పూణే లో బి ఏ లో చేరాను . జబల్పూర్ లో బ్యూటీషన్ కోర్స్ చేసాను . బరోడాలో ప్రీస్కూల్ మానేజ్ మెంట్ కోర్స్ చేశాను . మావారు , ప్రతి రెండేళ్ళకూ ట్రాన్స్ఫర్ లవుతుంటే , పిల్లలకు టెక్నికల్ కోర్స్ లలో చేర్చటము కష్టమవుతుందని , పేరెంట్స్ ను చూసుకోవాలని , వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొన్నారు . ఇక్కడ సెటిల్ అయ్యాక బ్యూటీపార్లర్ ఏర్పరుచుకున్నాను . అప్పుడు ప్రతి సంవత్సరమూ , బాంబే వెళ్ళి లేటెస్ట్ కోర్స్ లు చేసేదానిని . ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు . వాళ్ళ పిల్లలూ , వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలరు . ఇహ ఏదో అవసరావసరాలకు తప్ప వాళ్ళ విషయాలలో మా ప్రమేయము అనవసరము అనుకున్నాము . బాధ్యతలు తీరి ఖాళీ సమయము ఇంకా ఎక్కువ దొరికింది , ఇప్పుడు ఏ కొత్త కోర్స్ చేయాలా అనె అనుకుంటున్నానే కాని వయసైపోయింది అనుకోవటము లేదు ! మీరీ వయసు లో కూడా అని ఎవరైనా అంటే , ఏమంత వయసైపోయిందని , ఐనా 60 is the 20 . నా వయసైపోయింది అని అంటే నేనెంత మాత్రమూ ఒప్పుకోను అనేసాను .అనగానే అవునవును అని వొప్పేసుకున్నారు . వాళ్ళను నేను ఎలా ఒప్పించానో , ఐనా నేను చెప్పటమేమిటి ? మీరే చూడండి .

నన్ను , రమాదేవి గారికి పరిచయము చేసిన జ్యోతి గారికి , ఈ ప్రోగ్రాము లో అవకాశమిచ్చిన , రమాదేవి గారికి , మాట్లాడించిన హైమ గారికి చాలా చాలా ధన్యవాదాలు .

రేపు అనగా అక్టోబర్ మొదటి తారీకు , శుక్రవారం , శుభముహూర్తాన , మధ్యాహ్నము 2 గంటల నుండి , 2.30 వరకు , ఈటివి 2 లో వచ్చే సఖి లో ఓ పదినిమిషాల ప్రోగ్రాం లో కనిపించ బోతున్నాను . మీరందరూ , మీ పనులు మానేసి , ఆ సమయము లో , టి వి ని ఆన్ చేసి నేను ఎప్పుడు వస్తానా అని ఎదురుచూస్తూ రాగానే చూడగలరు . మీ పనులు ఎప్పుడూ వుంటాయి కాని నేనెప్పుడూ టివి లో కనిపించను కదా ? మరి మీ అందరి గురించి కూడా చెప్పాను కదా ! ఏమి చెప్పానో తెలుసు కోవాలని లేదూ ??? వుంటుంది లెండి నాకు తెలుసు . మరి మీరేమనుకుంటున్నారో కూడా చెప్పండి . సరేనా !


షూటింగ్ ఐయిన తరువాత , మా ఇంటికి లక్ష్మి గారిని తీసుకెళ్ళాను . లక్షిమి గారిచ్చిన ధైర్యము తో , మా అడవి లోకి ఓ అడుగేసాను . మా అడవి ని చూపించాను . ఆ తరువాత లక్ష్మి గారింటికి వెళ్ళి , లక్ష్మి గారు పెట్టిన వేడి వేడి భోజనము చేసి , మా ఇంటి కెళ్ళాను . ఇవీ ఆనాటి మా ముచ్చట్లు .

రేపు మద్యాహ్నము టివి లో ' సఖి ' కార్యక్రమము తప్పక చూడండి . టింగ్ . . . టింగ్ . . .

ఇప్పుడే జ్యోతి గారు ఈ లింక్ ఇచ్చారు . ఇంట్లో లేని వారు ,కంప్యూటర్ లో ఈ లింక్ కు వెళ్ళి నా ప్రోగ్రాం చూడవచ్చు . థాంక్ యు జ్యోతి గారు .

Wednesday, September 29, 2010

భలే భలే అందాలు

పొద్దున్నే కాఫీ గ్లాస్ తీసుకొని బయట కూర్చుందామని వెళ్ళాను . కాని అడుగు ముందుకు వేయలేక పోయాను . ఎదురుగా , నిన్న వేసిన ముగ్గు మీద ఎవరో చల్లినట్లు గుప్పెడు , వైలెట్ , పింక్ కలర్ లో వున్న పూరేకులు కనిపించాయి . ఎవరిక్కడ వేసారా అనుకుంటూ తలెత్తి చూస్తే , మా వాకిలి లో వున్న పెద్ద చెట్టుకు గుత్తులుగుత్తులు గా పూలున్నాయి . అరే ఈ చెట్టు పూలు పూస్తుందా ? పేంట్ చేసినట్లుగా ఎంత అందముగా వున్నాయి అనుకున్నాను. అసలు ఎప్పుడు పూసాయో కూడా తెలీలేదు !

రోజూ వానల మూలము గా వెళ్ళలేక పోతున్నాను . అమ్మయ్య ఈ రోజు వాన లేదు అని సాయంకాలం వాకింగ్ కు బయిలుదేరాను . వాకింగ్ చేస్తుండగా , చుట్టూ పూల చెట్లన్ని రంగు రంగుల పూలతో కనువిందుగా వున్నాయి . చెట్ల్లన్నీ ఆకుపచ్చలో వున్న షేడ్స్ అన్నిటితో పచ్చ పచ్చగా వున్నాయి . అంతే ఇంటికి తిరిగొచ్చి నా కెమేరాకు పని చెప్పాను . ఇన్ని రంగులతో వెలిగిపోతున్న మా అడవితల్లి ని చూస్తే చక్కని కవిత ఈ పచ్చదనానికి తోడుంటే ఎంత బాగుంటుంది అనుకున్నాను . కాని ఏంచేయను ? నాకా కవితలల్లటము రాదు అందుకే రాత్రంతా ఆలోచించి ఓ ప్లాన్ వేసాను . అర్ధరాత్రే శ్రీలలిత గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి ఓ కవిత రాయండి అదే మీ పుట్టినరోజున మీకు పరీక్ష అన్నాను . పుట్టిన రోజున పరీక్ష ఏమిటని అడగొద్దు . అదంతే !

పాపం వెంటనే ఇదో ఈ కవిత రాసి ఇచ్చారు . మరి ఈ కవిత ఇంకోరోజెందుకు ప్రచురించటము . శ్రీలలిత కే శుభాకాంక్షలు చెప్పుతూ కానుక గా ఇస్తే పోలే !

ఓ కదంబవనవాసినీ,
ప్రతినిత్యం ’శుభమస్తు" అంటూ
మామిడి తోరణాలను తలపించే మంగళతోరణాలను వనమంతా పరచిన ప్రకృతిశోభను వర్ణింప నాతరమా..
ప్రతి జీవికీ ప్రాణవాయువు నందించే ఈ వనాల నిస్వార్ధ సేవతో
మనసంతా మధురమై పలుకంతా తీయనై
ఉబికివచ్చే ఉత్సాహాన్ని ఆనకట్ట వేయకుండా పరుగులిడనిస్తే
అంతకన్న అదృష్టం వుందా...
ఆ పచ్చదనంలో ఎన్నెన్ని శోభలో...

పసిడికాంతులు ప్రసరించే
పురిటిసూరీడు ప్రతిఫలించే
పసుపుపచ్చని ఛాయ....
కెంజాయకు చేయందించి
అరుణాన్ని అంతదూరముంచే
సంజకెంజాయ ఛాయ....

తీయనిరాగాల కోకిలకు
సుమధుర స్వరాన్నందించే
లేతమామిడిచిగురు ఛాయ.....

మధురమైన వాక్కులతో
మానసాన్ని మీటే
చిలకపచ్చ ఛాయ....

లేలేత తమలపాకుల
కుచ్చుటోపీల కిళ్ళీలను
అయిదువేళ్ళకీ అలంకరించుకుని
మగనిని మురిపించే
లేతాకుపచ్చ ఛాయ....

వయసులో పెద్దయినా
మనసు లేతదేనని తెలియచెప్పే
అసలైన ఆకుపచ్చ ఛాయ....
మధుర మీనాక్షి కంచి కామాక్షి
నారంగే నని సగర్వంగా చాటిచెప్పే
ముదురాకుపచ్చ ఛాయ....

పచ్చగా పదికాలాలుండమని
అందరినీ దీవించే
అడవితల్లి అందాలు వర్ణించడం ఎవరితరం?
పలుఛాయలు వెదజల్లే అడవి అందాలు వర్ణించడం ఆ మహానుభావులు కృష్ణశాస్త్రిగారికే చెల్లింది.

ఇన్నిరకాల ఛాయలతో కూడిన ఆకులతో నిండిన అడవిలో తిరుగాడే ఓ వనకన్యా...
పుట్టినరోజునే పరీక్ష పెట్టడం న్యాయమా.......
ప్రేమతో,
శ్రీలలిత..

ఇంత అందమైన కవిత అడగగానే ఇచ్చినందుకు శ్రీలలితగారికి వేల వేల ధన్యవాదాలు తెలుపుకుంటూ , ఇది మీకు మీజన్మదిన కానుకగా ఇస్తున్నాను .

శ్రీలలితకు జన్మదిన శుభాకాంక్షలు .

Friday, September 24, 2010

మా ఇంట్లో కూడా బ్రహ్మకమలం విచ్చుకుంది .

ఆకాశము లో చంద్రుడు మెల్ల మెల్ల గా పూర్ణ చంద్రుడిగా మారుతున్న సమయాన , మా ఇంటిలోని బ్రహ్మ కమలం చిన్న చిన్న గా రేకులు విప్పు కుంటూ . . . విప్పుకుంటూ చంద్రుని తో పాటు పదహారు , వన్నె చిన్నెలు దిద్దుకుంటూ వుంటే అటు చంద్రుని , ఇటు బ్రహ్మకమాలాన్ని చూసేందుకు రెండు కళ్ళూ చాలటము లేదు . వాహ్ ఎంత అందమైన దృశ్యము . రాత్రంతా అలా చూస్తూ వుండి పోవాలనిపిస్తోంది .
స్చప్ . . . చంద్రుని మబ్బులు కమ్మేసాయి . హుం . . .

బ్రహ్మకమలం హిమాలయలలో పూసేపువ్వు . ఇది ఎక్కువగా కేదారేశుని దగ్గర పూస్తుంది . ఈ మద్య కాలము లో ఇలా ఆసక్తి కలవారి ఇళ్ళలో కనువిందు చేస్తోంది . సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూస్తుంది . అదీనూ రాత్రి వేళలో మాత్రమే . దాని వయసు కూడా చాలా కొద్దిసేపే . వికసించిన గంటలోపే ముడుచుకుంటుంది . కేదారేశుని కి ప్రీతికరమైన పుష్పం . ఒక్కొక్క రేకూ విప్పుకుంటూ , పరిమళాలు వెదజల్లే టప్పుడు చూసి తీరాల్సిందే కాని వర్ణింప తరముకాదు . ఆ అందానికి కళ్ళు తట్టుకోలేవు .

బ్రహ్మకమలం గురించి నాకు తెలిసింది ఇంతే . ఇంకెవరికైనా తెలుస్తే చెప్పగలరు .

ఉదయము నుండీ ఈ బ్రహ్మకమలం కొరకు ఎదురుచూస్తూ వున్నాను . ఉదయము నుండేనా ? కాదు కాదు , సత్యవతి గారి పోస్ట్ లో బ్రహ్మకమలం గురించి చదివినప్పటి నుండీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆరాటపడి పోతున్నాను . అందుకే ఈ రోజు ఉదయం సత్యవతి గారు కాల్ చేయగానే రెక్కలు కట్టుకొని వెళుదామనుకున్నాను . తీరా బయలుదేరే సమయానికి , ముంచుకు పోతున్నట్టుగా వాన !!! ఎప్పుడు వాన కురిపించాలో ఎప్పుడు కురిపించవద్దో , టైం సెన్స్ ఈ వరుణ దేవుడికి అస్సలు లేదుకదా . ఎలాగా అనుకుంటూ వుంటే సత్యవతి గారే , ఈ పువ్వు కోసం వచ్చిన ఒక అబ్బాయి తో పంపించారు . పాపం , చీకటిలో , వానలో సంతోష్ గారు , ఇక్కడి దాకా తెచ్చి ఇచ్చారు . అది చూడగానే ఎంత సంతోషం వేసిందో చెప్పేందుకు మాటలు లేవు .

సత్యవతి గారు చాలా చాలా ధన్యవాదాలు . ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను .

సంతోష్ గారు శ్రమ అనుకోకుండా తెచ్చి ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండి .

కనురెప్ప మూస్తే మళ్ళీ జన్మలో చూడగలనా అని రాత్రి రెండింటి వరకు రెప్ప వాల్చకుండా అలా చుస్తూ వుండి పోయాను . ఉదయమే లేవగానే పని చేసుకుంటూ ఓ కన్ను దానిమీదే .మావారి పుజ సమయానికే , అసలు అంతకు ముందే మూతి ముడిచేసింది ! ముడుచుకున్నా ఎంత అందమో ! పొద్దున్నే పని వుందని మావారు బయటకు వెళ్ళిపోయారు అంతే చెంగున కెమేరా తీసుకొని కెమేరా లో బంధించేసాను .

సత్యవతి గారు ,
thank you .

Tuesday, September 21, 2010

హాపీ బర్త్ డే టు గౌరవ్

ఎవరైనా నాన్న భుజాల మీద ఎక్కుతారు . లేదా వీపు నెక్కుతారు . కాని నాన్న బుగ్గ మీద ఎక్కటము చూశారా ?లేదు కాదా ? ఇదో ఇలా , నాన్న బుగ్గ ఎక్కి ముద్దులు కుడుస్తున్న , మా చిన్నారి , బంగారు తండ్రి , నా రాజాబాబు గౌరవ్ పుట్టినరోజు ఈ రోజు .

నా బంగారు కన్నా .
హపీ బర్త్ డే టు యు .


Thursday, September 16, 2010

ప్రయాణము లో స రి గ మ లు

నల్లని , సొరంగము లో నుండి రైలు వేగం గా పోతోంది . అదేమిటి ఇంత చీకటిగా వున్నా నాకు భయము వేయటము లేదు అనుకుంటూ కిటికీ లో నుండి తొంగి చూసాను . దూరం గా పసుపు రంగులో దీపం కనిపిస్తోంది . ఓహో అటు చివర లైట్ కనిపిస్తోంది , అంటే సొరంగము కు ఆచివర కనిపిస్తోందన్నమాట . అందుకే భయం వేయటము లేదన్నమాట అనుకున్నాను . రైలు వేగం గా దూసుకుపోతోంది . నేను ఆ దీపాన్ని చూస్తూ వున్నాను .

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * ** * * * * * * * * * * * * * * *

మాలా నేను రావటానికి ఇంకో వారము కావచ్చు . ఈ రోజో రేపో ఎప్పుడు దొరికుతే అప్పుడు టికెట్ కొనుక్కొని వచ్చేయి . కాని , ఇప్పుడే చెపుతున్నాను నిన్ను సైట్సీయింగ్ కు తీసు కెళ్ళేందుకు నాకు టైం వుండదు . నీ అంతట నువ్వే వెళ్ళాలి , లేదా రూంలో వుండాలి నీ ఇష్టం అని మా వారు ఔరంగాబాద్ నుండి కాల్ చేశారు . ఆయన వెళ్ళి అప్పటికే రెండు రోజులైంది . ఇంకోవారం ఇక్కడ వుండి నేను చేసేదేముంది . అనుకొని , ఏ ట్రేన్ లో , ఏ సి నో నాన్ ఏసి నో ఏది దోరుకుతే ఆ టికెట్ తెమ్మని డ్రైవర్ మహేష్ ను పంపాను . మేడం తత్కాల్ లో , ఈ రోజు దేవగిరి ఎక్స్ ప్రెస్ లో వున్నాయి . ఏ .సి లో లేవు అన్నాడు పరవాలేదు తీసుకురా అని టైం చూస్తే పదైంది . అమ్మో ఇంకో రెండు గంటలలో బయలు దేరాలి అనుకొని , ముందుగా లాప్ టాప్ ఎందులో సద్దాలా అని అలోచించాను . అవును మరి అది వుంటే ఎంత టైం ఐనా గడిచిపోతుంది .పైగా టాటా ఇండికాం వుండనే వుంది .( కాకపోతే అక్కడికి వెళ్ళాక అది పనిచేయనప్పుడు , తెలిసింది దానికి రోమింగ్ చార్జెస్ వుంటాయని అవి మేము కట్టలేదని ) దాన్ని విడిగా బాగ్ లో తీసుకెళుతే అందరికీ తెలిసి పోతుంది . పోనీ సూట్ కేస్ లో పెడుదామా , కూలీ ఎత్తేస్తే !!! ఎటూ అలోచన తెగలేదు . ఇహ లాభం లేదనుకొని సంజు కు కాల్ చేసి , ఇలా వెళుతున్నాను అని చెప్పి , నా సమస్య చెప్పాను . సూట్కేస్ లో బట్టల మద్య పెట్టమ్మా , విడిగా వద్దు అంది . సరే ఓ ప్రాబ్లం సాల్వూ . . . పది నవలలు , లాప్ టాప్ తో నా పాకింగ్ ఐయింది .

దేవగిరి ఎక్స్ ప్రెస్ ఎక్కాక చూస్తే ఎవ్వరూ లేరు . కంపార్ట్మెంట్ అంతా ఖాళీ . . . రజనీగంధా సినిమా లో విద్యా సిన్ హా ట్రేన్ లో కళ్ళు తెరవగానే ట్రేన్ అంతా ఖాళిగా ప్లాట్ ఫాం అంతా ఖాళీగా , ఎక్కడా మనుష్యులే లేకుండా నిర్మానుష్యం గా కనిపిస్తుంది . ఎప్పుడో చూసిన ఆ సినిమా లో ఆ సీన్ గుర్తొచ్చింది . ఇదేమిటి మహేష్ ఎవ్వరూ లేరు . ఇదే ట్రేనా ? సరిగ్గా చూసావా అని , మహేష్ ను అడిగాను . ఇదే మేడం మనము అరగంట ముందోచ్చాము అన్నాడు . హుం ముందొస్తే ఇలా వుంటుందన్న మాట . అమ్మయ్య మొత్తానికి ఆ అరగంటా గడిచింది . కంపార్ట్ మెంట్ నిండింది . రైలు బయలుదేరింది . అదృష్టవశాతు , సైడ్ విండో సీట్ దొరికింది . బోలెడు కాల్క్షెపం . . . .

అసలు ఇది , నిజామాబాద్ , కామారెడ్డీ ఏరియానేనా ?? ఎండి పోయి బీటలు వారి దిగులుగా వుండే నేల , ఎంత ఆకుపచ్చ గా మెరిసి పోతోంది ! కిటికీ లో నుండి పక్కకు చూస్తే పచ్చ గా పొలాలు , పైకి చూస్తే కమ్ముకు వస్తున్న మేఘాలు .
సన్నగా తుంపరలు మొదలయ్యాయి . వానకు తడుస్తున్న ఈ స్టేషన్ ను చూస్తుంటే . . .


చూస్తుండగానే ట్రేన్ కదిలింది . అయ్యో గార్డ్ ఫొటో సరిగ్గా తీసుకోనివచ్చుకదా ? హుం


అమ్మే వాళ్ళ కేక తో కిటికీ లోనుండి తల లోపలికి తిప్పి చూసాను . అక్కడ అమ్ముతున్న అమ్మాయిని చూస్తే ఎంత నవ్వు వచ్చిందో !ఆపుకోలేక పక్కున నవ్వేశాను . ఇంతకీ ఆ అమ్మాయి అమ్మేవి ఏమిటో తెలుసా ??? సొరకాయలు ! నిజం !! సత్తేపమాణికంగా చెపుతున్నాను , అవి సొరకాయలే ! నా నవ్వు చూసి నేను కొంటాననుకున్నట్లుంది నవ్వుతూ నావైపు చూసింది . వద్దన్నట్లు తల వూపాను . అంతే కోపం గా చూసుకుంటూ వెళ్ళిపోయింది . అయ్యో ఫొటో తీసుకుందామనుకున్నాను . అంత ఉరిమి చూస్తే ఎలాతీయను ? నన్ను రెండు కొట్టి , నా కెమెరా లాగేసుకునేటట్లుంటే !పచ్చటి వరి పొలాలు , అక్కడ అక్కడ ఎగురుతున్న పక్షులు , పొలాలలో పని చేసుకుంటున్న పని వాళ్ళు , అక్కడక్కడ కనిపిస్తున్న మంచెల తో వాతావరణం చాలా చాలా ఆహ్లాదం గా మనోహరంగా వుంది .అరెరే ఇది గోదావరి కదు . అవునవును కోనసీమ గోదావరి కాదు , బాసర గోదావరి . వానల మూలముగా నేమో రంగు కొద్దిగా నల్లగా వుంది . అక్కడక్కడ నీరు చిన్న చిన్న సుడి తిరుగుతూ ఎంత ఉదృతంగా వుందో ! సరస్వతమ్మ దగ్గర నుండి సీతమ్మ దగ్గరకు వడి వడిగా పోతునట్లుంది .

చూస్తుండగానే బయట రంగులు మారిపోయాయి . పచ్చని చేల పావడ కట్టిన ప్రకృతి చిన్నగా మాయమైపోతోంది . ఆకాశం నీలము నుండి , ఆరెంజ్ గా , వైలెట్ గ ఆపైన చిక్కని నలుపుగా అబ్బ ఎన్ని ఎన్నెన్ని వర్ణాలో . . . . .
సరిగమ లు పాడుతున్నాయి .

చీకట్లో చూసేందుకేమిలేక , కంపార్ట్మెంట్ లోకి తల తిప్పాను . ఫొటోలు తీసుకుంటూ , కూనిరాగాలు తీసుకుంటూ వున్న నన్ను జనాభా ఏమనుకుంటున్నారో అన్న ద్యాస అప్పుడొచ్చింది . అందరూ భోజనం చేస్తున్నారు . టైం చూస్తే తొమ్మిదైంది . పక్క సీట్లో భోజనం చేస్తున్నావిడ అడిగింది , మీరు భోజనం తెచ్చుకోలేదా అని . అవును కదూ పూరి చేసుకుందామని పిండి తడుపుకొని కూడా మర్చి పోయాను . హడావిడి లో చేసుకోలేదు , తెచ్చుకోలేదు . నేనివ్వనా అందావిడ . వెంటనే మా కోడలు వచ్చే ముందు , ఎవరేమిచ్చినా తినకండాంటీ అని చెప్పింది గుర్తొచ్చింది . వద్దండి . ఆకలిలేదు థాంక్యూ అన్నాను . ఎక్కడికెళ్ళాలి అని అడిగింది . ఔరంగాబాద్ అన్నాను . " ఎవరున్నారు ? " ప్రశ్న . " మా వారండి " నా జవాబు . అప్పటి నుండి కూర్చున్నారు . పడుకోండి . వీళ్ళూ ఔరంగాబాదే వెళుతున్నారు . ఔరంగాబాద్ వచ్చినప్పుడు లేపుతారు అని వాళ్ళను చూపించింది . భార్యా , భర్తా , ఓ చిన్న బాబూ వున్నారు . భోజనం చేస్తున్నారు . నేను చిన్నగా నవ్వాను కాని నిద్దర పోలేదు . ఇంకో రెండు గంటలలో వస్తుంది . ఇప్పుడు నిద్దరపోతే లేవటము కష్టం . అందరి భోజనాలయ్యాయి . ఒక్కొక్కళ్ళే నిద్రకొరుగుతున్నారు . నేనూ , ఎదురు సీటు భర్త అలాగే దిక్కులు చూస్తూ కూర్చున్నాము .

ప్రయాణం ఐపోవచ్చింది . అరే ఆ నల్లని సొరంగం . . . పచ్చని దీపం ఏవీ ? ఐతే అదంతా కలా ??? నిజం జరుగుతున్నట్లే అనిపించిందే ????

ఇంతలో మావారి ఫోన్ వచ్చింది జాల్నా దాటగానే ఫోన్ చేయి అని . జాల్నా ఎన్నింటికొస్తుంది అడిగాడు ఆ అబ్బాయి . నాకు తెలెదండి అన్నాను . జాల్నా నుండి అరగంటలో వెళ్ళిపోతాము అన్నాడు ఓహో అన్నాను . ఎదురు చూస్తున్న జాల్నా రానే వచ్చింది . మావారికి ఫోన్ చేసి జాల్నా వచ్చింది అన్నాను . ఐతే ఇంకో గంటపడుతుంది నువ్విక్కడికి రావటానికి అన్నారు . కాదండి అరగంటలో వస్తాముట అంటుండగానే కటైంది . ఎదురబ్బాయి ఇంకో అరగంటలో వెళుతాము అన్నాడు . నేనేమీ మాట్లాడలేదు . కాసేపయ్యాక వాళ్ళావిడని లేపి , నాతో ఎంతసేపటికెళుతాము అని అడిగాడు . బాబోయ్ నన్ను మించిన టెన్షన్ మాస్టర్ లా వున్నాడు . పదండి పదండి అని మా సామాన్లు తీయమని ఊదరపెట్టేశాడు . ఇంతలో పై బర్త్ మీద నుండి దిగినాయన , నా తో ఇంకో గంటకు కాని రాదు తొందరపడకండి నేను మీ సామాను అందిస్తాను అన్నాడు . అసలే ఆయన నా కెమేరాను అప్పుడప్పుడు చూడటము గమనించాను . పైగా సూట్ కేస్ లో లాప్ టాప్ కూడా వుందని తెలుసుకున్నాడా ఖర్మ అనుకొని ఆయన వైపు అసలు చూడలేదు . మేము తలుపు దగ్గర నిలబడ్డ ఓ ఘంటకు ఔరంగా బాద్ వచ్చింది . హమ్మయ్య నుకుంటూ దిగి చూస్తే దూరం నుండి మావారు గబ గబా వస్తూ కనిపించారు .

నన్ను చూడగానే ఒక్కదానివే రావటానికి భయపడ్డావా ? అని అడిగారు .
" లేదు " .
" నేను స్టేషన్ కు రానేమో ఎట్లాగా అని భయపడ్డావా ? "
" ఉం హూ భయపడలేదు "
" నిజం ??????"
" నిజం ."

Friday, September 10, 2010

గణపతి బాబా కు మోదం మోదకం
నా చిన్నప్పుడు మా నాన్నగారు , ఇంట్లోనే వినాయకుని , మట్టి తోచేసేవారు . ఆయన తో కలిసి వినాయకుని కబుర్లు వింటూ బొమ్మను చేయటము చాలా సరదాగా వుండేది . వినాయకుని నోరేది ? చెవులింత పెద్దగా వున్నయేమిటి ? కళ్ళు అలా చిన్నగా వున్నయేమిటి ? నాన్నగారూ , అని ప్రశ్నలు వేస్తే చాలా ఓపికగా , తక్కువగా మాట్లాడాలి , ఎదుటి వాళ్ళు చెప్పేది శ్రద్దగా వినాలి అని , ప్రతి విషయాన్ని గమనించాలి అని అని వినాయకుడు మనకు భోధిస్తున్నాడమ్మా చెప్పేవారు . స్నేహితుల తో పోటీబడి ఆకులు తెంపుకు రావటము చాలా ఉత్షాహం గా వుండేది . ఎప్పుడైనా పొరపాటున చవితి చంద్రుని చూస్తే అమ్మో అనుకునేదానిని .

రెండు సంవత్సరాలనుండి , మా మనవరాళ్ళు కూడా ఇంట్లోనే , మట్టి వినాయకుని చేస్తున్నారు .

ప్రతి సంవత్సరము , ఉండ్రాళ్ళు , కుడుములు నైవేద్యము గా పెడుతాము , ఈ సారి వెరైటీ గా మహర్రస్ట్రీయులు చేసే , " మోదక్ " చేద్దామనుకున్నాను . అందుకే ముందుగా ఒకసారి చేసి చూసుకుందామని చేసాను .

మోదక్ చేసేందుకు కావలసినవి ;

పై పూతకోసం ,
1 కప్ గోధుమ పిండి ,
1/2 కప్ మైదా ,
కొద్దిగా ఉప్పు ,
పూర్ణాని కి కావలసినవి ,
1 కప్ పచ్చి కొబ్బరి తురుము ,
1/2 కప్ పంచదార ( తీపి ఇష్టమవుతే ఎక్కువ వేసుకోవచ్చు ) ,
1 స్పూన్ ఇలాచీ పొడి ,
డ్రై ఫ్రూట్స్ ఇష్టమైనవి .

రిఫైండ్ నూనె

చేసే విధానము ,
ముందుగా గోధుమ , మైదా పిండి ల లో , కొద్దిగా ఉప్పు వేసి , ఆ పైన కొంచము కొంచము గా నూనె వేస్తూ తడపాలి . పిండి మొత్తము పొడి పొడి గా నూనెతో తడుపుకున్నాక , కొద్ది కొద్ది గా నీరు పోస్తూ గట్టి గా తడుపుకొని , ఓ బట్ట కప్పి పక్కన వుంచుకోవాలి . ఆ పిండి ని ఓ అరగంట నాననివ్వాలి .

పిండి నానే లోపు , కొబ్బరి , పంచదార కలిపి స్టవ్ మీద వుంచి బాగా కలిసేవరకు ఉడక బెట్టాలి . మరీ పొడి గా కాకుండా , నీళ్ళ గా కాకుండా చేసుకోవాలి . అందులో ఇలాచీ పొడి , వేయించి వుంచుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసి కలపాలి .

ఆ తరువాత పై పిండిని , మృదువుగా మర్ధన చేసుకొని , కొద్ది గా తీసుకొని , చిన్న పూరిలా వత్తు కోవాలి . ఆ పూరీ లో పూర్ణమును కొంచము పెట్టి పువ్వులా ముడవాలి . ఆ తరువాత , స్టవ్ మీద బాణలి పెట్టి , నూనె వేసుకొని వేడి చేసుకోవాలి . మంట తక్కువగా వుంచి , ఆ నూనెలో , తయారుగా వుంచుకున్న మోదక్ లను వేయించుకోవాలి . అంతే గణపతి బాబా కు ప్రీతికరమైన మోదక్ తయార్ .

Monday, September 6, 2010

అడవి మా లోకం
బిజీ బిజీ రోడ్ మీద నుండి కాస్త పక్క లైను లోకి వస్తే , ఇదో ఇలా బోర్డ్ లు కనిపిస్తాయి . చిన్నగా కొండ ఎక్కుతూ వస్తే మా కాలనీ వస్తుందన్నమాట . కాలనీ లోపలకి రాగానే , మద్యలో ఇంకో కొండ , కొండ చుట్టూ ఇళ్ళు . కొండ మీద ఇలా అడవి . కాలనీ కి పక్క రోడ్ వుంటే మిగితా మూడు పక్కలా అడవే ! ఈ కొండ మీద వుండే అడవినే , మా మేఘ అండ్ హర్ ఫ్రెండ్స్ , డీప్ ఫారెస్ట్ అని పిలుచుకొని , భుజాన బాగులు తగిలించుకొని , పిక్నిక్ కు వెళుతుంటారు . మొన్నటి వరకూ ఎక్కువగా చెట్లు లేవు . పైగా నా కిచెన్ లో నుంచి చూస్తే వాళ్ళు కనిపిస్తూ వుండేవారు కనుక నేనూ అభ్యంతర పెట్టలేదు . ఇప్పుడైతే దట్టంగా గడ్డి మొలిచింది . పైగా మాఇంటికొచ్చిన పాముగారి కుటుంబం , చుట్టాలూ పక్కాలూ అక్కడే వున్నరేమోనని నా అనుమానం . అందుకని పిల్లలు అటెళ్ళకుండా కాపలా కాస్తూ వుంటాను . ఇంతకీ ఈ అడవి , కాలనీ ఎక్కడో కాదు సికంద్రాబాద్ లోనే ! ఇది ఆర్మీ ఆఫీసర్స్ వెల్ఫేర్ సొసైటీ కాలనీ . ఇక్కడ ఎక్కువగా రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ వుంటారు . అంటే ఏదో సినిమాలల్లో చూపించినట్లుగా , యన్ .టి .రామారావు , శోభన్ బాబు లాగా ఎప్పుడూ యూనీఫాం వేసుకొని , గన్ పట్టుకొని , బుర్రమీసాలు దువ్వుకుంటూ , భారీ డైలాగులు కొట్టుకుంటూనో , లేకపోతే బాబూ మోహన్ , బ్రహ్మానందం లాగా యూనిఫాం వేసుకొని కామిడీ చేస్తూనో వుండరు . అన్ని కాలనీ లలో వున్నట్లే , అందరూ వున్నట్లే మామూలుగానే వుంటారు .

అసలు ఇక్కడ ఫాన్ అవసరమే లేదు . ఎంతగాలంటే ధడాల్ మని తలుపులు తెరుచుకునేంత . వున్న చెట్లు సరిపోనట్లు , మద్య ఒక వృక్షప్రేమికుడు , మామిడి , నిమ్మ , జామ చెట్లను తెచ్చి పిల్లల తో పాతించాడు . ఉదయాన్నే పక్షుల కిల కిలా రావాలు , సాయంకాలం శీతాకోకచిలుకల్లా పిల్లల ఆటలు , చుట్టూ చెట్టూ చేమా చాలా ఆహ్లాదంగా వుంటుంది . కాలనీ లో లోపల చుట్టూ తిరుగుతే 1.2 కిలోమీటర్స్ వుంటుంది . రోజూ సాయంకాలము , అన్ని చెట్లూ చూసుకుంటూ , చెట్ల గాలి పీలుస్తూ , సువాసనలను ఆస్వాదిస్తూ కనీసం నాలుగు సార్లైనా తిరుగుతాను . అదే మామూలుగా నాలుగు కిలోమీటర్ లు వాకింగ్ చేయాలంటే అమ్మో అనుకుంటాను . ముఖ్యం గా ఇక్కడ మా స్నేహితులు వున్నారు . పొద్దున్నే తొమ్మిదిన్నరకల్లా , మావారికి బ్రేక్ ఫాస్ట్ పెట్టి , లంచ్ బాక్స్ ఇచ్చి పంపేసి , ఎంచక్కా , మాజాంగ్ ఆడుకుంటూ , లేడీస్ మీటింగ్ కు వెళుతూ , ఫ్రెండ్స్ తో షాపింగ్ లు చేస్తూ , ఇలా వాకింగ్ చేస్తూ సుఖంగా కాలం గడుపుతూ . . . గడుపుతూ వుండగా . . . . మరీ ఇంత సోంబేరిగా వున్నావా అని కాలం జలక్ ఇచ్చింది .

మొన్న పాముగారు విజిట్ చేసేవరకూ , వంటరి భయం లేకుండా బాగానే వున్నాను . కాని ఇప్పుడో , ముందు హాల్ లోనే సెటిల్ అయ్యాను . నా లాప్ టాప్ , బుక్స్ , మందులు , మంచి నీళ్ళు అన్నీ హాల్ లో వున్న దివాన్ మీదే ! కాకపోతే నిన్ననే కాస్త , ఇదేమిటీ మరీ రోగిష్టిమారి ముసలమ్మో పరుచుకునట్లు అన్ని ఇలా పెట్టుకున్నాను అని కాస్త జ్ఞానోదయం అయి అన్ని తీసేసాను . కాకపోతే ఇంకా , అసలు లోపలి బెడ్ రూంవైపైతే చూడటము కూడా లేదు . కాని అదేమిటో పుస్తకమో చదువుతుంటే నా భుజాన్ని పాము గారు తట్టి , వుండు పేజీ తిప్పకు నేను చదవటము కాలేదు అని వెనకనుంచి అంటునట్లుగా అని పించి వుల్లిక్కి పడతాను . లేదా నాముందు కూర్చొని నీ బ్లాగ్ లో నా గురించే రాస్తున్నావా , మంచి గారాయి లేదా నిన్ను కాటేస్తాను అంటున్నట్లుగా అనిపిస్తుంది . లేదా లల్లాదేవి నవల లో లాగా అమ్మాయిగానో , అబ్బాయిగానో మారిపోయినట్లనిపిస్తుంది . అయ్య బాబోయ్ ఎన్ని ఊహించేసుకుంటున్నానో !!! ప్రతి పూట జహీరా తో మూల మూలలా ఊడిపించి , తనువున్నప్పుడే అలమారాలు చెక్ చేసుకొని , అర్జంట్ గా నా స్నానం పూర్తిచేసుకొని హాల్ లోకొచ్చేస్తున్నాను . కాస్త చలిగా వుంది కదా అందుకని షాల్ కప్పుకొని లాప్టాప్ నో , పుస్తక మో పట్టుకొని మా వారు వచ్చేదాకా ఎదురుచూసుకుంటూ కూర్చొని వుంటున్నాను . అలా ఎందుకు వున్నానో కాస్తైనా అర్ధం చేసుకోకుండా , పాము , నీకు నా మీద ప్రేమ పెంచినట్లుందే అని జోక్ లేస్తారు . ఇహ జహీరా ఏమో , అమ్మా నీభయం చూస్తుంటే నాకూ భయం వేస్తోంది . ఇట్లా ఐతే నేను పని మానేస్తాను అని వార్నింగ్ ఇచ్చింది . అమ్మో పనిమనిషి మానేస్తే ఇంకేమైనా వుందా ? హుం * * * ఒక్కళ్ళూ అర్ధంచేసుకోరూ * * * * * *

మీరేమో హైదరాబాద్ లో వుంటున్నానన్నారు . ఇక్కడ మనుషులకే స్తలం లేదు పాములెక్కడ్నుండి వచ్చాయండి ? వుంటే గింటే దొంగల భయం వుండాలి కాని , పాము భయం ఏమిటి అని అందరూ అడుగుతున్నారు . మాకు దొంగల భయం లేదు . ఇక్కడ అందరూ గన్నులు పెట్టుకొని వుంటారు , కాల్చేస్తారు అని భయపడుతారట . అనుకని రారట . పిచ్చి మొహాలు వాళ్ళకేమితెలుసు ఎవరిదగ్గరా గన్నులుండవని .మా ఇంట్లో ఐతే బోలెడు పెన్నులుంటాయి . మావారు తెగ ఉత్తరాలు రాసేస్త్తూవుంటారు . అందుకే ఎన్నో రకాల పెన్నులుంటాయి . వున్నవి సరిపోక పిల్లల స్కెచ్ పెన్నులు కూడా తెచ్చేసుకుంటూవుంటారు . వాళ్ళేమో అవితీసుకుపోవటానికోచ్చి తాత పెన్నులు కుడా తీసుకెళుతారు . తాత మళ్ళీ పెన్నులు కొనుక్కొచ్చుకుంటారు . అలా మా ఇంటి నిండా , అవసరానికి అగుపడకుండా బోలెడు పెన్నులుంటాయి . దొంగ గారూ . . . ఇది చదివి హమ్మయ్య గన్నులు లేవు రావచ్చు అనుకుంటారేమో ! వచ్చినా మెడల్స్ మొమెంటోలూ తప్ప ఇంకేమీ దొరకవు . కాకపోతే ఓ పది పట్టు చీరలు , ఓ పది పాత సూట్లూ దొరుకుతాయేమో ! పాపం అవి మీరేం చేసుకుంటారు లెండి ! మీ కష్టం వృధానే !

ఇదండీ నా అడివింటి కథ . కాదు . . . కాదు మా మేఘా ఇంటి కథ . నా ఇల్లంటే మా మేఘా అండ్ హర్ ఫ్రెండ్స్ కోపం చేస్తారు . అది మాత్రం నిజం , ఏ ట్రాఫిక్ భయమూ , ఇంకే భయమూ లేకుండా పిల్లలు ఇక్కడ ఎంత హాయిగా ఆడుకుంటున్నారో . వాళ్ళను చూస్తుంటే చాలా హాపీగా వుంటుంది . ఇప్పుడు ఈ ఇల్లు మారుతానంటే వాళ్ళు ఒప్పుకోరు . స్చప్ కాని చూద్దాం . . . . .

Friday, September 3, 2010

థాంక్ యు
మా మనవడు విక్కీ చెప్పిన కథ తో పాత జ్ణాపకాలు వచ్చి , ఆ తరువాత , మా వారు , మా అబ్బాయి నా బ్లాక్ మనీ ని తీసేసుకోవటము వలన కలిగిన ఉక్రోషము తోనూ ఈ డబ్బులోయ్ డబ్బులు వ్రాశాను . అప్పుడే పేపర్ లో చిన్న మొత్తం పధకాల గురించి , రూపాయి గుర్తు కోసము జరిగిన పోటీ గురించి చదివి ఆ ఆర్టికల్ ను పొడిగించాను . అప్పుడే సృజన చదివి చాలా బాగుంది , మన బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ బ్లాగ్ లో దీని గురించి రెవ్యూ రాయనా అంది . దీనిమీద రెవ్యూ ఏముంటుందా అనుకున్నా , పరిచయం చేస్తానన్నప్పుడు ఎందుకు కాదనాలిలే అనుకొని , చాలా హాపీగా వాకే అనేశాను . అలా నా కాసులపేరు ఇక్కడికి చేరుకోవటము చాలా సంతోషముగా వుంది .

ఆ సంతోషాన్ని కలిగించిన , సృజన , గీతాచార్య , జ్యోతి , చైతన్య కల్యాణి గార్లు బోలెడు బాంకులలో ఎకౌంట్స్ తెరవాలని కోరుకుంటూ , చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .